– డా. కనుపూరు శ్రీనివాసులురెడ్డి

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ


‘‘ఏమిటి ఆకాశాన్ని చూస్తున్నారు? నన్ను ఎదురుగా పెట్టుకుని.’’

‘‘నిన్నే!’’ సముద్రమంత విశాల నేత్రాలలో నన్ను నేను వెతుక్కుంటూ…

‘‘నేనా?’’

‘‘అంటే విశ్వమంతా నిండి ఉన్నది నువ్వేకదా!’’

‘‘అంటే?’’

‘‘ఆదిపరాశక్తీవి కదా!’’

‘‘మరి మీరో?’’ పొగడ్తకు తలమునకలై పోతూ మధుర మందహాసం చేసింది. వెలుగు వెన్నెల దారుల్లో వెల్లువై పారింది. చూసి తరించాల్సిందే! ఆ నవ్వులో ఉన్న సమ్మోహిత మధురత్వాన్ని వర్ణించడానికి సృష్టికర్తకే సాధ్యం కాదు. అదే స్త్రీ మహత్యం, వ్యామోహం, మాయ. చీకటిలోని అనుబంధం. విశ్వ శిల్పికే కుంచె కదలని అపూర్వ రూప కల్పన.

‘‘నీకే తెలియాలి.’’

‘‘నాలుగు వందల కోట్ల నక్షత్రాలలో వంద కోట్ల గ్రహాలలో నన్ను ఎలా గుర్తుపడతారు?’’

‘‘నీ హృదయాన్ని అడుగు చెపుతుంది.’’

‘‘నా దగ్గర లేదుగా!’’

‘‘ఎక్కడుందో?’’

‘‘మీలోనే ఉంది.’’

‘‘మరి గుర్తు పట్టలేనంటున్నావు.’’

కిసుక్కున నవ్వింది. గుండెజారి గల్లంతు అయ్యింది.

‘‘కెమికల్‌ ‌రియాక్షన్‌ … ‌స్పందన.’’

‘‘అదేమిటి మనసుంది కదా?’’

‘‘అవును. అది కల్పించిన హార్మోన్స్ ‌ప్రభావమే ఈ స్పందన! మనం మెటల్స్, ‌మినరల్స్, ఆమైనోయాసిడ్లతో తయారయిన ఒక కెమికల్‌ అణువుల యంత్రాగారం. అందుకే తగలబెడితే బూడిదయి పోతాము. ప్రాణం అణువుగా వెళ్లిపోయి విశ్వ అణువుల్లో కలిసిపోతుంది.’’

‘‘మన కలయిక కూడా జీవంలేని కెమికల్సేనా?’’

‘‘అవును. దే ఆర్‌ అల్‌ ‌కెమికల్‌ ‌రియాక్షన్స్!’’

‌విసురుగా లేచింది ఆమె. కోపంగా నన్ను చూస్తూ, ‘‘నా ప్రేమకూడా?జన్మ జన్మల బంధం కాదా? పూర్వజన్మ అనుబంధంకాదా? దైవాంశ కాదా?’’ అంటూ నిలదీసింది.

ఏక్కడో ఆలోచిస్తున్నానో ఏమో, ‘‘కాదు.’’ అనేసి తప్పు తెలుసుకున్నాను. భయంగా ఆమె వైపు చూసాను.

అప్పటికే భద్రకాళీ మాత పూనేసింది.

కాల్చుకు తినేటట్లు ఒక్క చూపు నా వైపు విసిరి, ‘‘ప్రేమ, అనుబంధం దైవ నిర్ణయాలు. చేతగాని పనికి మాలిన వాళ్లకు బాహ్యం కనిపిస్తుంది. హృదయాల చప్పుడు వినిపించదు. మిమ్మల్ని నా హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆత్మార్పణ గావించాను. నన్ను, నా ప్రేమను అవమానిస్తున్నారు. మీ మిషన్‌ ‌బాగు చేయించుకోండి’’. అంటూ విసురుగా అడుగు వేసింది.

‘‘ఆగు’’ ప్రాధేయ పడినట్లుగా చూస్తూ చెయ్యి పట్టుకున్నాను. మనసా, వాచా, కర్మణా అర్పించుకున్న ఆమె దైవత్వంతో పునీతమైన ఒక విశ్వ ప్రేమ రూపంగా నా ముందు నిలిచినట్లు అనిపించింది. దాసోహం అయిపోయాను. ఇది కూడా కెమికల్‌ ‌రియాక్షనే!

నిజంగా మనమంతా అణువులుతో ఏర్పడిన భౌతిక రూపాలేమో! పలురకాలయిన అణువుల రసాయనిక పక్రియ! ఎక్కడ నుంచో వస్తాము కొంతకాలం కలిసి ఉంటాము మళ్లీ స్మృతులన్నీ ఇక్కడే వదిలేసి అంతంలేని అనంత శూన్యంలో కలిసి పోతాము. అందుకే మరుజన్మలో గత జన్మ గుర్తుండదు. అయినా ఆ జన్మలో చేసిన పాప పుణ్యాలు ఫలితం మరుజన్మలో అనుభవించి తీరాల్సిందే అంటారు. ఎవరు దానికి అధికారి? ఎవ్వరో కాదు కాలం అని ఎక్కడో మారు మ్రోగింది. కాలాన్ని అదుపు చేసే శక్తి దేవుడనే వానికి కూడా లేదు. ఆ అణుశక్తికి జీవరాసులను, ప్రకృతిని వశపరుచుకుని నియంత్రించే శక్తీ, విద్వంసం చేసే శక్తీ ఉంది. దేవుళ్లను మొక్కుకున్నా అందరికి అనుకున్నవి జరగవు. అది వాళ్లు పుట్టుకతో తయారయిన అణువులు మీద ఆధారపడి ఉంటుంది. అణువుల సముదాయమే మన రూపం.

‘‘మరి మన ఆత్మానుబంధాలు, మమతాను రాగాలు ?’’ సమాధానం కావాలి అన్నట్లు కాల్చుకు తినే కళ్లు ప్రశ్నించాయి.

‘‘నీకు ఫెరమొన్సును గురించి తెలుసా?’’ అని అడిగాను.

‘‘ కెమికల్స్ ‌గురించి కాదు నేను మాట్లాడుతుంది, వెదర్‌ ‌థేరీజ్‌ ‌పవర్‌ ఆఫ్‌ ‌గాడ్‌ ఆర్‌ ‌నాట్‌?’’ ‌తటస్థంగా ఉండిపోయాను.

‘‘సర్వాంతర్యామి, దైవాంశ అయిన ప్రేమను రసాయన క్రియ అంటున్నారు. సృష్టి అందాలు భవబంధాలు దేవుడిచ్చినవి’’ నచ్చచెపుతున్నట్లు చూసింది.

 నాలో సానుభూతి ఆప్యాయత కమ్ముకున్నాయి. ఇది కూడా కెమికల్‌ ‌రియాక్షనే! చూపుతో స్పందించి మెదడు ఉత్పత్తి చేసే ఆక్సిటోసిన్‌, ‌సెరోటినిన్‌, ‌డోపమిన్‌ అనే స్నేహ హర్మోన్సు వలన.

దగ్గరకు తీసుకుంటూ, ‘‘నేను ఏమన్నానని. నువ్వు నిజం. నీ ప్రేమ నిజం. నువ్వు జీవశాస్త్రం చదివిన దానవు. అవి తనకు సరిపడే సమఉద్ధీని ఏ కెమికల్‌ ‌వాసనతో ఎలా ఎన్నుకుంటాయో అలాగే మనుషుల అనుబంధ బాంధవ్యాలు, మాతృత్వానికి కూడా అలాంటి ఫెర్మోన్స్ ‌కెమికల్స్… ‌వాసన…! అన్నీ తెలిసి ప్రేమ, బంధాలు, దైవకల్పితాలు అని…?’’ ఆమెను చూసాను.

‘‘తెలుసు కాబట్టే ప్రతి స్పందన మనకు తెలియని శక్తి కల్పిస్తుందని నమ్ముతున్నాను’’.

కానీ విశ్వం శక్తీగోళం అని నమ్మితే అందులో ఉన్న అనూహ్యమైన అణుసముదాయంలో అదుపు లేని శక్తీ దాగుంది. ఆ శక్తే దైవత్వం అని మనం పేర్లు పెట్టుకున్నాము. ప్రకృతి, పంచభూతాలు ఈశ్వర్‌ అని, పాలపుంతను బ్రహ్మలోకమని, ఆ పైన నీలి రంగుతో ఉన్న అనూహ్యమైన శూన్యం మహా విష్ణువని. ఇది వేదాలలో ఉంది. ఆ లోకంలోని అణుసముదాయాల శక్తిని బట్టి రక్షకుడు, సృష్టికర్త, పాలకుడు అని నిర్ణయించారేమో?

‘‘ఏమిటి నేను ఇక్కడ చస్తుంటే ఎక్కడో కూరుకుపోయారు’’.

ఉలిక్కిపడ్డాను ఆ మాటతో.

మూతిముడుచుకుని అటు తిరిగింది. చాలా బాగుంటుంది కదూ! ఛీ… ఇదేమిటి వ్యామోహం, ఆకర్షణ… నేనూ మానవ మాత్రుడవే కదా, హర్మోన్సుకు ఫెర్మోన్సుకు లొంగిపోవాల్సిందేకదా!

‘‘మళ్లీ ఆ చెమటను గురించే ఆలోచిస్తున్నారా!’’

తేలిగ్గా నిట్టూర్పు వదిలి నవ్వుతూ, ‘‘అంత తేలిగ్గా తీసి పారేయ్యకు. ఆ వాసన, వేలి ముద్రలలాగా ఏ ఒక్కరిది మరొకదానితో పోలికుండదు. అదిగాక కఠోపనిషత్తులో, ‘యదా సర్వే ప్రభినేరిత హృదయ స్నేహగ్రంధయా!’ ఆ గ్రంధుల వలనే స్నేహాలు, అనుబంధాలు ఏర్పడుతాయని, గట్టి పడుతాయని చెప్పి ఉన్నారు’’ అన్నాను.

‘‘మరి ఆ చెమట కంపుకు అంతశక్తి ఉంటే ఇప్పుడు ఈ యువతీ యువకులు పూట కొకరిని మారుస్తున్నారు దాన్నేమంటారు’’.

ఏం చెప్పాలో తెలియక, ‘‘కాలుష్యం, నైతిక విలువలను నేర్పని పెంపకం, చదువు, పాశ్చాత్య నాగరికత దుర్గంధం’’ అన్నాను.

మాటకు నన్ను నిరసనగా పైకి కిందకు చూసి, ‘‘ఆత్మ వంచన కాదా ?’’ అంటూ నిలదీసింది.

‘‘ఇందులో ఆత్మ ప్రసక్తి ఎందుకు? జీన్‌ ఇచ్చే వంశపారంపర్య గుణాల వంకరులు. ఆత్మ అన్నింటికీ అతీతమైనది అనే కదా చెప్పారు.’’

ఆత్మను గురించి భగవద్గీతలో చెప్పినట్లుగా, ‘‘అచ్చేధ్యో… సనాతనః!! – సాంఖ్య యోగ – 2

ఆత్మ చేధించుటకును, దహించుటకును, తడుపు టకును, శోషింప చేయుటకు సాధ్యం కాదు. ఇది నిత్యము. సర్వ వ్యాప్తి. చలించనిది. స్థిరమైనది. శాశ్వతము. అలాంటి గుణాలున్న డి.ఎన్‌.ఎ. (‌డైఆక్సిన్యుక్లియాక్‌ ‌యాసిడ్‌) ఇది మన శరీరపు కణాలలో ముఖ్యమైన భాగం. ఇదే మన వంశపారంపర్య గుణాలు దాచుకొని తరతరాలకు తప్పు లేకుండా తర్జుమా చేస్తూ ఉంటుంది. శరీరంలో లేకపోయినా నాశనం కానిది, ఎలాంటి మార్పు కాదు. అందుకే ఇప్పటికీ ఎన్నో వేల సంవత్సరాల పిరమిడ్స్‌లోని, పురాతన శిధిలాలలో దొరికే అవశేషాలలో మనిషిగాని, జంతువులుగాని ఎలాంటి రూపంలో, ఎలాంటి గుణాలతో జీవించి ఉంటాయో నిర్దిష్టంగా నిర్ణయించగలుగుతున్నారు. ఆలోచించాలి?

‘‘పిచ్చి పట్టిందా మీకు. భగవత్‌ అం‌శాన్ని అవమానిస్తున్నారు’’.

‘‘నేను అనడంకాదు. ఆత్మకు ఐదు కోశములుంటా యని ‘అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశాలు ఉంటాయని తైత్రేయ ఉపనిషత్తులో చెప్పి ఉన్నారు. కోశం అంటే భాగాలు. ఇవన్నీ ఉండేది జీన్‌, ‌నువ్వే దేవుడవు, నీ దేహమే దేవాలయం అని ఆధ్యాత్మిక గ్రంథాలలో, శ్రీమద్‌ ‌భగవద్గీతలో చెప్పిఉన్నారు. సనాతన ధర్మాలను పాటిస్తే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు, అరిషడ్వర్గాలు, సప్త వ్యసనాలు అదుపులో ఉంచుకోగలం. అప్పుడే స్వర్గతుల్యమైన జీవితం, జ్ఞానవంతులైన బిడ్డలు లభిస్తారు. ఇదే మహాత్ములందరూ చెప్పేది.

ఈ కాలంలో డబ్బు తప్ప మరో స్వర్గం, ధర్మం అర్ధం లేనిదని, బురద గుంటల్లో పడి ఆక్రందనలతో గుండెలు పగలగొట్టుకుంటున్నారు. వాటిని ఎదుర్కొని మనశ్శాంతిగా జీవించడానికే భగవద్గీత!!’’

‘‘భగవద్గీత చెప్పింది ఎవరు? దేవుడుకాదా!’’ నిలదీసింది.

‘‘జయించుటకుగాని, వశపరుచుకోవడానికి సాధ్యంగాని విశ్వశక్తికి, మన నిత్యజీవన పోరాటంతో అవసరం లేదు. అందుకే ఎవ్వరికి ఏం చెయ్యాలనే బాధ్యత కూడా లేదు. చేసేది మనలో ఉన్న జీన్స్ ‌వలన ప్రేరేపితమైన హార్మోన్స్. ‌మేదస్సు కల్పించే సమయానుకూల విచక్షణ, వివేకం!! అదే అదృష్టం, దురదృష్టం. దాన్నే తెలియని శక్తీ, దేవునికి ఆపాదిస్తున్నాము.నమ్మకమే దేవుడు’’.

‘‘అది ఎవరు కల్పించారు? దేవుని ప్రేరణలేనిదే జ్ఞానం ఆలోచన రాదు! మీ కెమికల్స్ ‌కాదు’’. ఆమె కళ్లల్లో కనిపించిన విముఖత నిప్పులు కురిపించింది.

‘‘నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నట్లుంది. లాజికల్‌గా ఆలోచించు. శాస్త్రీయమైన రుజువులను సనాతనులు ఒప్పుకోకపోవచ్చు. కానీ అవి హైందవ గ్రంథాలలో ఉన్నవే!’’

‘‘నాకు అనవసరం. మీకు నేను అక్కర్లేదు. దైవ సంభూతమైన ఆత్మను అవమానిస్తే పుట్టగతులుండవు’’ చంపుకు తినేటట్లు చూసింది.

దగ్గరకు తీసుకుంటూ, ‘‘తప్పుగా అర్ధం చేసుకున్నావు. నాకు మనసులేదు అని అనడం లేదు. నీ జీన్సు, ఫెరమోన్సు నావి పరస్పర ఆకర్షణ ఉంది కాబట్టి మనం దగ్గర అయినాము. బహుశా అదే నువ్వు పూర్వజన్మ అనుబంధం అంటున్నావు. ఇందులో దేవుని ప్రమేయంలేదు’’ అన్నాను.

‘‘మళ్లీ భౌతిక పదార్ధాన్ని తీసుకు వస్తున్నారు. ‘తద్‌ ఏజతి తద్‌ ‌న ఏజతి తద్‌ ‌దూరే తత్‌ అం‌తికే తద్‌ అం‌తరస్య సర్వస్యతద్‌ ‌సర్వస్యాన్య బాహ్యుతః’’ అన్నారు. కదలదు మరియు కదులును దూరంగానూ మరియు దగ్గరగా ఉండును అని ఉపనిషత్తులో చెప్పి ఉన్నారు. శ్రీభగవద్గీతలో కూడా ఉంది. ఇంతకంటే ఏం కావాలి దైవశక్తి ‘ఆత్మ’ సర్వాంతర్యామి అని చెప్పడానికి’’ అంటూ తీర్పు ఇచ్చినట్లు చూసింది.

అందులో సూక్ష్మ శరీరమే స్థూల శరీరాన్ని నడిపించునది అని కూడా రాసుంది. తలోంచుకుని చిన్నగా నవ్వుకున్నాను. ‘‘వేదవ్యాసుడు అంబికతో కలవ బోయేటప్పుడు, రూపంచూసి గట్టిగా కళ్లు మూసుకుందట, అంబాలిక భయంతో పాలి పోయిందట, అందుకే ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా, పాండురాజు ఆ పాండు రోగంతో పుట్టారు. అంటే ఆత్మకు చలించే గుణం ఉన్నట్లేకదా! అది డి.ఎన్‌.ఏలో ఉండే ప్రోటీన్సు చలించినందువలెనే! దాన్నే మీరు ప్రారబ్ధ ఖర్మ అంటారు!’’

‘‘అసలు మనం జీవిస్తున్నదే మనలో దైవాత్మ ఉండబట్టి’’ తనకు ఖచ్చితంగా తెలుసు అన్నట్లు నన్ను చూస్తూ అంది.

‘‘కాదు, ఆత్మలో, అంటే జీన్‌లో, ఆక్సిజన్‌ ఉం‌డబట్టి’’ అని చెప్పలేకపోయాను.

‘‘అసలు ఆత్మే మనల్ని నడిపిస్తుంది. మన కర్మ ఫలాల్ని నిర్దేశిస్తుంది. అందుకే ‘ఆత్మానగం.. పగ్రహ మేవచః’ ఆత్మ రథపు యజమానిగా, దేహము రథముగా బుద్ధి సారధథిగా మనసు పగ్గముగా కోరికలు గుర్రములుగా గ్రహింపుము అని కఠోపనిషత్తులో విపులంగా చెప్పారు’’.

‘‘అంటే మన నడవడికకు ఆత్మకు ఎలాంటి సంబంధం లేదు అని శ్రీకృష్ణుని చేత చెప్పించిన భగవద్గీత తప్పంటావా?’’

‘‘నేను అనను. ఆయన చెప్పింది జీవంలో చేరని ఆత్మ. జీవాంశ కాదు. అందుకే జీవులను చంపమన్నాడు. ఎందుకంటే వాళ్లు బ్రతికుంటే వంశంలో పిల్లలు తిరిగి అదే బుద్ధితో పుట్టి అధర్మాన్ని పెంచుతారు కాబట్టి’’.

‘‘అంటే అది జీన్‌ ‌కదా!’’

మాట్లాడలేదు. కోపంతో బుసలుకొడుతుంది. చేతులు తెగ నలుపుకుంటుంది.

‘‘నువ్వు చెపుతున్నదంతా జీన్స్ ‌గురించే. ఒక కణములో క్రోమోజోమ్లో ఐదువేలకు పైగా జీన్‌, ‌డి.ఎన్‌.‌యేలు ప్రోటీన్స్‌తో నిండి, న్యూక్లియస్‌ ఆక్సిజన్‌, అమైనో యాసిడ్స్‌తో కలిసి ఉంటుంది. చాలా విభాగాలు ఉంటాయి. ప్రోత్సాహకారులు నిర్దేశకారులు అని రెండు ముఖ్య విభాగాలుంటాయి. డి.ఎన్‌.ఏ ‌జీవి ఎలా ఉండాలి, పెరగాలి, ప్రవర్తించాలి అని నిర్ణయిస్తుంది. ప్రోటీన్‌ ‌జీనుకు ఆహారం. అందులో ఏ కాస్త మార్పు వచ్చినా జీవులు వికలాంగులుగా, మందమతులుగా కొన్ని బాగు చెయ్యలేని జబ్బులుతో పుడుతారు. పంచేంద్రియాలలోని చూపు, వినికిడి, స్పర్శ ద్వారా మేదస్సు గుర్తించి దానికి తగ్గట్టుగా హర్మోన్సు ఉత్పత్తిచేసి మన ప్రవర్తన నిర్ణయిస్తారు.

అందుకే గర్భవతిని మంచి ఆహారము, కాలుష్యం లేని వాతావరణం, ప్రశాంతమైన జీవితం గడపమంటారు. మానసిక సాంఘిక సంఘర్షణలను ఎదుర్కోవడానికి దీర్ఘకాల వ్యాధులు రాకుండా ఉండేందుకు ధ్యానం యోగ తపస్సు తప్పక అవసరం అంటారు. ఇప్పుడు జీన్‌ ‌డికోడింగ్‌, ‌మాపింగులు చేస్తున్నారు. రాబోయే కాలంలో నువ్వు చెప్పే ప్రారబ్ధ ఖర్మలను మార్చుకోవచ్చునేమో!. మరో ముఖ్య విషయం. క్రోమోజోమ్స్ ‌చివరిలో డి.ఎన్‌.ఎతో కలిసి టేరిమీర్‌ అనే పదార్ధం ఉంటుంది. అది మన చావు ఎప్పుడో నిర్దుష్టంగా చెప్పగలదంట,’’

నెత్తి కొట్టుకుంటూ, ‘రాసేది దేవుడు. చేసేది విధి. ఆ కెమికల్‌ ‌చెప్పెదేమిటి? ఖర్మ…ఖర్మ!! ఆత్మతత్వం తెలియాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇంటలెక్చువాలిటీ ఉండాలి. మూర్ఖత్వం కాదు. విశాలత్వం కావాలి’’ అంది.

‘‘మరి నీలో కూడా ఉండాలికదా!’’

ఒక్క ఉరుము ఉరిమింది. ‘‘పిచ్చి ముఖమా! హృదయాకాశములో ప్రతిష్టితమైన, మనోబుద్ధి చైతన్య రూపమైన సంజ్ఞానమే ఆత్మ. అర్ధమైందా!’’ అంటూ చెవులు పట్టుకుని మెలేసింది.

నొప్పిగా ఉన్నా నవ్వు వచ్చింది. ఇలాంటి ప్రణయ శిక్షలు ఎంతో మనోహరంగా మనసును ఉత్సాహ పరుస్తాయి అనిపించింది.

‘‘నవ్వకండి. నాకు మండిపోతుంది. ఇంత చెపుతున్నా…!’’ రుసరుసలాడింది.

చాలాసేపు మౌనంగా ఉండి తరువాత అంది, ‘‘ఐతిరేయ ఉపనిషత్తులో ఆత్మ!!-స్పృహ (కాన్షియస్నెస్‌) ‌నిజానికి ఈ అజ్ఞానము (పెర్సేప్షన్‌) ‌విజ్ఞానము (డిస్క్రిమినేషన్‌) ‌ప్రజ్ఞానం (ఇంటిలిజెన్స్) ‌మేధ (విజ్డమ్‌) ‌దృష్టి (ఇన్సైట్‌) ‌జాతి (ఇంపల్స్) ‌స్మృతి (మెమొరీ) సంకల్పము (సెప్షన్‌) ‌క్రతు (పరపస్‌) అనుహ్‌ (‌లైఫ్‌) ‌కామము (డిజైర్‌) ‌వాసము (కంట్రోల్‌) ఇదే సజ్ఞానం – ప్రజ్ఞానం ఆత్మ బుద్ది అని చెప్పి ఉన్నారు. ఇన్ని అపూర్వ శక్తులున్న దైవాంశను భౌతిక శరీరంలోని ఒక అణువుతో పోలుస్తారు. ఇంతకంటే అజ్ఞానముందా? నన్నుకూడా ఇనుపసామాన్ల అంగడి, కెమికల్‌ ‌ఫ్యాక్టరీ అని కించపరిచేటట్లు ఉన్నారు. దేవుడిచ్చేస్పందనలు నిజం కానప్పుడు మనిషి జీవితం ఏమిటి? అది నేను భరించలేను. మీ మీద ప్రేమను కెమికల్‌ ‌రియాక్షన్‌ అని అనుకుని జీవించలేను’’. స్థిరంగా ఎక్కడో చూస్తూ ఉబికివస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ లేచింది.

ఎందుకు కష్ట పెట్టానా అని బాధపడ్డాను.

 జీవాంశలో స్త్రీ పురుషులు ఆత్మానుగతులు, సర్వాంతర్యామి, జగద్గురువు సృష్టికర్త, విశ్వరక్షకుడు, భక్షకుడు కూడా స్త్రీ, పురుష సంగమమైన ఈశ్వరుడే!

బహుశా ఆధ్యాత్మికతలో దైవాంశ అని మహాజ్ఞానులు ఆ కాలంలో జీనుకు, ఆత్మ అనే పేరు పెట్టి ఉండవచ్చు. ఏమో ! ఆమె నమ్మకమే నిజమేమో. ఈ జీనే అంతు తెలియని మర్మాలతో నిండి ఉన్నదేకదా! విశ్వాణుశక్తికే దైవస్వరూపముంటుంది! మనుషులకే దేవుడు తెలుసు. మరి అన్ని జీవరాసులకు దేవుడు లేడా? తెలుసా?

మరుజన్మకు తీసుకెళ్లే చూపు చూసి వెళ్లిపోయింది.

ఆమె ఎదురుగా లేకపోతే పూడ్చలేని వెలితి, మనసంతా శూన్యంతో నిండిపోయింది. ఆకాశంలోకి చూసాను.

‘‘ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ మదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్నమేవావశిష్యతే!

అనూహ్యమైన అంతర్గత లోకాలలో మానవ మాత్రులకు అంతుచిక్కని విశ్వశక్తీ పరిపూర్ణంగా నిండి ఉందనిపించింది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రం వెతకగలిగితే లోకకల్యాణం తప్పక జరుగుతుంది.

About Author

By editor

Twitter
YOUTUBE