– వి. రాజారామమోహనరావు

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి  పొందిన కథ


కన్నతల్లి, తండ్రి, తోడపుట్టిన అక్క, అన్నయ్య ఇలా ఇంట్లోవాళ్లే చెపుతున్నారు, భర్తని వదిలెయ్యమని రమణికి. ఆమె మనసు స్థిమితంగా లేదు ఇంటివాళ్ల మాటల ప్రభావం తన మీద బలంగానే ఉంది. అయినా, మనసు దానికి ఎదురు తిరుగుతోంది.

జీవితం బావుందా అంటే, బాగా లేదు. పొద్దున్న ఎనిమిది కల్లా ఆఫీసుకి వెళుతుంది. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిదవుతుంది. వచ్చాక ఇంటిపని. రోజూ ఇదే గానుగ ఎద్దు జీవితం. శరీరానికి కానీ, మనసుకి కానీ ఏ మాత్రం సంతోషం లేదు. ఇప్పట్లో అటువంటి సంతోషం లభిస్తుందన్న ఆశ కూడా లేదు. పోనీ పెద్ద వయసా అనుకుంటే రమణికి ముప్ఫై మూడు, భర్తకి ముప్ఫై అయిదు.

పెళ్లైన మొదటి రెండేళ్లు చాలా బాగా గడిచింది. బాబు పుట్టాడు. భర్త, రమణి ఎంతో అన్యోన్యంగా గడిపారు. రమణి అంటే ఎంతో ప్రేమ రఘురాంకి. జీతం అంతా రమణికే ఇచ్చేవాడు. నీ సంతోషమే నా సంతోషం అనేవాడు. ఉమ్మడి కుటుంబం. రఘురాం తండ్రే ఇంటి ఖర్చులన్నీ భరించటంవల్ల, వీళ్లకి ఏ రకమైన బాదరబందీ లేదు. సరిగ్గా ఆ టైములోనే విజయవాడలో గవర్నమెంటు స్కూల్లో ఉద్యోగం వచ్చింది రమణికి. తల్లి తండ్రి విజయవాడ లోనే ఉన్నారు. ఉద్యోగానికి వెళ్లటమా, మానటమా అన్న మీమాంసలో పడ్డారు. రఘురాంది ప్రయివేటు ఉద్యోగం. అందుకని గవర్నమెంట్‌ ఉద్యోగం వదులు కోవటానికి మనసొప్పలేదు. రమణి విజయవాడ వచ్చి ఉద్యోగంలో చేరింది. చంటి బాబుని తల్లి చూసుకోవటంవల్ల రమణికి అంత ఇబ్బంది కలగలేదు. రమణిది స్కూల్లో క్లర్క్ ఉద్యోగం ప్రిన్సిపాల్‌ ఉన్నంత సేపూ ఉండాలి. స్కూలు ఇంటికి బాగా దూరం. అందువల్ల పిల్లాడికి పోతపాలే ఆధారం అయ్యాయి. రఘురాం వీలున్నప్పుడల్లా హైదరాబాద్‌ ‌నుంచి విజయవాడ వచ్చి వెళుతున్నాడు. చూస్తూ చూస్తూ పదేళ్ల సంసారం అలాగే గడిచింది. తన ఖర్చులకి మితంగా వాడుకుని డబ్బంతా రమణికే ఇస్తున్నాడు రఘురాం. ‘‘ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మనకి ఇబ్బంది ఉండకూడదు. డబ్బు జాగ్రత్త’’ అనేవాడు. భార్యా, పిల్లాడు, తనూ…అదే ప్రపంచం రఘురాంకి.

అటువంటి రఘురాంకి మూడేళ్లక్రితం, ఓ రాత్రి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. అందరూ ఊరెళ్లారు. పన్నెండు గంటలకుపైగా రఘురాం స్పృహలో లేడు. హాస్పిటల్‌లో చేరి వైద్యం అందేటప్పటికి బాగా ఆలస్యమైంది. ఎడం చెయ్యి, ఎడంకాలు పడిపోయాయి. ఆ తర్వాత ఈ మూడేళ్లలో ఎన్నో వైద్యాలు చేయించారు. రఘురాం తల్లీతండ్రీ పడిన బాధ అంతా ఇంతా కాదు. మూడేళ్లైనా పరిస్థితి మారలేదు. రఘురాంకి అన్నీ మంచం మీదే. అతన్ని అలా కాపాడుకోటం సామాన్య విషయం కాదు. ఇక రఘురాం ఎప్పటికి కోలుకుంటాడో, ఆ గొడవంతా ఎందుకు? భర్తని వదిలేయమని ఇంటివాళ్లపోరు.

బాగున్నంత కాలం, రఘురాం అందించిన ప్రేమ రమణికి మరపురావటం లేదు. పిల్లాడిమీద, తనమీదే భర్త ప్రాణాలన్నీ అని రమణికి బాగా తెలుసు. అటువంటి మనిషిని ఎలా వదిలేయటం.

బయట ప్రభావాలు, పరిస్థితులు మనసుని బాగా పాడుచేస్తాయి. రమణి ఇంట్లో వాళ్లు ఏదో సందర్భంలో ఆ విషయం కదుపుతూనే ఉన్నారు. అందులో పెద్దగా వాళ్ల తప్పూ లేదు. తమ ఇంటి ఆడపిల్ల కష్టపడకూడదని, సుఖపడాలని ఎవరు కోరుకోరు. దీనికితోడు రమణికి ఆఫీసులో భాస్కర్‌రావు తలకాయ నెప్పి ఒకటి.

భాస్కర్‌రావు రమణితోటే పనిచేస్తున్న మరో క్లర్క్. ‌రమణి అంటే మంచి అభిమానంగా ఉంటాడు. పనిలో సాయం చేస్తాడు. అన్నింటికీ చేదోడుగా ఉంటాడు. రమణి విషయాలు, రఘురాం పరిస్థితి అతనికి తెలుసు. భాస్కర్‌రావుకి పెళ్లి కాలేదు. ‘‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎలా చెపితే అలా ఉంటా. ఏం చెయ్యమంటే అది చేస్తా. కావాలంటే పెళ్లికి కూడా నేను సిద్ధమే. కానీ నువ్వు కావాలి’’ అని అంటున్నాడు. భాస్కర్‌రావు అలా మాట్లాడినప్పుడల్లా కడుపులో దేలినట్టు ఉంటోంది రమణికి. చాలా అసహ్యం వేస్తోంది. అదే చెప్పింది. అయినా అతను వినటం లేదు.

అసలే కష్టంగా జీవితం గడుపుతున్న రమణికి, ఈ కష్టాలు మరింత చిరాగ్గా ఉన్నాయి. దేనిమీద ఉత్సాహం ఉండటం లేదు. ఓ రకం నిస్సత్తువ, బాధ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఉన్న ఒక్క పిల్లాణ్ణి కూడా తరచుగా విసుక్కుంటోంది. రెండు రోజుల క్రితం వాడేదో అల్లరి చేశాడని, కొట్టినంత పనిచేసింది. తనలో ఈ మార్పు రమణికీ తెలుస్తోంది. అలజడి నుంచి, చికాకు పెట్టే ఆలోచనల నుంచీ తప్పించుకోలేకపోతోంది. నరకంలా ఉంటోంది.

రఘురాం కనీసం రోజుకి ఒక్కసారైనా రమణికి ఫోన్‌ ‌చేస్తాడు. చేసి ‘‘నువ్వెలా ఉన్నావు. పిల్లాడెలా ఉన్నాడు. మీ ఇద్దరూ దగ్గర లేకుండా ఇలా ఉండటం దిగులుగా ఉంది. ఇంకా ఎన్నాళ్లో, ఎప్పటికి తిరిగి మనం కలిసి ఉండే రోజు వస్తుందో’’ అంటుంటాడు. ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడినా, భర్త అతని మనసులో ఉన్నదంతా చెప్పలేక పోతున్నాడని రమణికి తెలుసు. అతనికిప్పుడు సంపాదన లేదు. స్వతంత్రించి ఏదైనా చెయ్యగలిగిన శక్తి లేదు. అందుకే అన్నింటికీ సర్దుకోవటం, పూర్తిగా ఆధారపడి బతుకుతున్న జీవితం అయినా అతని ఆశలు అతనికీ ఉన్నాయి. భార్యా, పిల్లాడితో కలిసి ఉండాలని. అందుకే అస్తమానం అదే అంటుంటాడు. ఇక్కడి పరిస్థితులు, రమణి అలజడి ఏ మాత్రం తెలియని అమాయకత్వం రఘురాంది. భర్త ఆ అమాయకత్వానికి జాలి, బాధ కూడా కలుగుతున్నాయి రమణికి.

ఏ విషయం ఎటూ తోచటం లేదు. పోనీ ఎలాగోలాగ ఇలాగే జీవితం గడుపుదామంటే, అదీ స్థిమితంగా లేదు. రఘురాంని విజయవాడ తీసుకొచ్చేస్తే  అనుకుంది. దానికి ఇంట్లో వాళ్లు ఎగిరిపడ్డారు. ‘‘నిత్యం మంచంమీదుండే అతనికి సేవ ఎవరు చేస్తారు. నువ్వు స్కూలు కెళ్లాలి. అందుకని అటువంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకు’’ అన్నారు.

ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఏమీ చెయ్యలేదు. అలా అని ఉన్నట్టుగానే బతకటం కూడా కష్టంగానే ఉంది. ఇలా గజిబిజిగా ఉన్న రమణికి మెరుపులా ఓ ఆలోచన  తట్టింది.

‘‘నేనిలా నీరసపడి పోకూడదు. కొంచెం నిబ్బరం తెచ్చుకుని స్థిరంగా ఆలోచిస్తేనే కానీ, ఏ మార్గం దొరకదు’ అనుకుంది.

ఆ తర్వాత గజిబిజిగా కాకుండా, ఓ క్రమంలో ఆలోచించటం ఆరంభించింది. తనని ఇబ్బందిపెట్టే ఒక్కో విషయాన్ని విడివిడిగా ఆలోచించాలని అనుకుంది.

ముందు భాస్కర్‌రావు విషయం. అతను ఏమేమో అంటున్నా అవేవీ రమణికి ఏ మాత్రం ఇష్టం లేదు. తన స్థానంలో రఘురాం ఉంటే ఏం చేసేవాడని ఆలోచించింది. పొరపాటున కూడా అటువంటి ఆలోచనని ఒప్పుకోడు. రమణితో ఎన్నోసార్లు అన్నాడు. ‘‘నువ్వు నా భార్యవే కాదు మన బాబుకి తల్లివి’’ అని అటువంటి వ్యక్తి స్థానంలో, మరో వ్యక్తా. చాలా తప్పు, అది బాబుకి చేసే ఘోర అన్యాయం అవుతుంది. అంతే మర్నాడే భాస్కర్‌రావుకి చాలా గట్టిగా చెప్పేసింది రమణి. ‘‘తప్పో ఒప్పో మీరేదో అన్నారు. నాకు ఎంత మాత్రం ఇష్టంలేనిది. పైగా చాలా బాధ కలిగించే విషయం మీరింక ఎప్పుడూ అలా మాట్లాడకండి. మీ ధోరణి మారకపోతే నేను ట్రాన్సఫర్‌ ‌చేయించుకు వెళ్లిపోవాల్సి వస్తుంది. నాకున్న కష్టాలకి అదో అదనపు కష్టం’’ అంది. భాస్కర్‌రావు సారీ చెప్పాడు. ఇంకెప్పుడు రమణికి బాధ కలిగించనన్నాడు.

ఇక ఇంట్లో వాళ్ల పోరు. ‘నీకు ఉద్యోగం ఉంది. పిల్లాడున్నాడు. అవిటి భర్త లేకపోతేనేం’ అన్నది వాళ్ల మాటల తాత్పర్యం భర్తని వదిలేసి సుఖంగా బతకమని వాళ్ల సలహా. భర్తని వదిలేసి తను సుఖంగా ఉండగలదా? ఎంత మాత్రం ఉండలేదు. రఘురాంకే కాక, ఆ పక్షవాతం తనకే వచ్చి ఉంటే రఘురాం తనని వదిలేసే వాడా? ఎన్నటికీ వదలడు. ‘నువ్వు లేని జీవితం నాకు ఎలా… అస్సలు సాగదు’ అన్న తత్వం రఘురాంది. తను లేకుండా రఘురాంకి జీవితం లేనప్పుడు, రఘురాం లేకుండా తనకీ జీవితం లేదు. భగవంతుడు ఎప్పటికైనా  కరుణించి అనుగ్రహించవచ్చు. రఘురాం బాగుపడి, మును పటిలా ఆరోగ్య వంతుడవవచ్చు. తను, భర్త, పిల్లాడు.. దాన్ని మించిందేం లేదు’ అనుకుంది.

ఇంకా ఏ మాత్రం ఆలస్యం  చెయ్యకూడ దనుకుంది. ఇంట్లో వాళ్లని కూర్చోపెట్టి ‘‘నేను నా భర్తను వదలను. అంతేకాదు, తనని వెంటనే ఇక్కడికి తీసుకొస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేరే ఇల్లు అద్దెకు తీసుకుని, నా పిల్లాడితో సహా వెళ్లిపోతాను’’ అని ఖచ్చితంగా చెప్పేసింది. ముందు రమణిని నానా మాటలూ అన్నారు. బెదిరించారు. రమణి నిర్ణయం మారకపోవటంతో, చివరికి రాజీకి వచ్చారు.

‘‘నీకు సుఖం లేదని కానీ మాకేమన్నా పంతమా నిన్నూ, ఇన్నాళ్లు పెంచిన పిల్లాణ్ణీ వదులుకుంటామా. వేరే ఇల్లు అదీ వద్దు. ఇక్కడికే తీసుకురా’’ అన్నారు.

ళి       ళి       ళి

విజయవాడ వచ్చిన రఘురాంకి ఇంట్లో ఓ గది ప్రత్యేకంగా కేటాయించారు. మంచం దిగలేని రఘురాంకి, భార్యా పిల్లాడు కళ్లెదురుగా తిరుగుతుంటే, తానే తిరుగుతున్నంత ఆనందంగా ఉంది.

భర్తలో ఆ మాత్రం ఉత్సాహం చూస్తున్నందుకే ఎంతో తృప్తి అనిపించింది రమణికి.

మనస్సెంతో తేలిగ్గా ఉంది. సరైన పనే చేశాననుకుంది. భార్యా భర్తా ఎంతో తేలిగ్గా విడిపోతున్న ఈ రోజుల్లో, ఇన్ని ఆటుపోట్లు తట్టుకుని, తన సంసారం నిలబెట్టుకున్నందుకు గర్వంగా కూడా అనిపించింది రమణికి. ఎన్నో తరాల మంచి సంప్రదాయం నైతికతలు ఇచ్చిన గర్వం అది. ఓ సదాచారం. భార్యాభర్తల అసలైన అనుబంధం. మానవతే వెన్నెముకైన పవిత్ర జీవన ప్రవాహం ఆమె మనసుకి మరింత బలాన్నిచ్చాయి.

About Author

By editor

Twitter
YOUTUBE