సంపాదకీయం
శాలివాహన 1941 శ్రీ శార్వరి కార్తీక బహుళ సప్తమి – 07 డిసెంబర్ 2020, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలతో ఈ దేశంలో కొందరికి ఎంతటి మమేకత్వం ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం కావాలా? స్త్రీలు, బాలలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా రక్తం తాగే ముస్లిం ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో తమకు మద్దతుగా రావాలని కొందరు విద్రోహులు తపించిపోతున్న ఘోర వాస్తవం కూడా దీనితో రుజువు కావడం లేదా? భారత్‌లో అత్యధికులు ఆరాధించే ఒక సంస్థను లొంగదీసుకోవడానికి కిరాయి రక్తపిపాసుల అవసరం చాలా ఉందని మనసారా కోరుతున్న నక్కజాతి ఇక్కడ పెరిగిపోతోందనడానికి కూడా అది నిదర్శనంగా నిలవడం లేదా? తానేమీ చేయలేనని నిర్ధారించుకున్న తరువాత, తన నీచ ఎత్తులు సాగవని తెలిసిన తరువాత నక్క క్రూర జంతువుకు దారి చూపిస్తూ, వృషభం మీద కక్ష తీర్చుకుంటుంది. క్రూర జంతువు తినగా మిగిలిన దానిని ఆబగా తింటుంది. ఇక్కడ మనుష రూపంలో ఉన్న నక్కజాతి వైఖరి కూడా ఇంతే.
‘మనువాదులు, సంఘీల (ఆర్‌ఎస్‌ఎస్ వారు)తో పోరాడేందుకు లష్కర్ ఏ తాయిబాను పిలిపించే అవసరం మాకు కల్పించవద్దు’- ఇది ఈ మధ్య కర్ణాటకలోని మంగళూరులో కనిపించిన గోడరాత. కాద్రి అనే ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్ ప్రహారీ మీద ఈ రాత కనిపించి, నిర్ఘాంతపరిచింది. సహజంగా అలజడికి కారణమైంది. ఆ విద్రోహ నినాదం కింద ‘లష్కరే జిందాబాద్’ అని కూడా రాసి, దుండగులు తమ ఆరాధనను ప్రకటించు కున్నారు. ఆదరాబాదరా పోలీసులు వచ్చారు. నల్లరంగుతో రాసిన ఆ నినాదాన్ని చెరిపేశారు. ఈ రాతలు రాసిన వాళ్లని పట్టుకోవడానికి సీసీ కెమేరాల రుజువులు తీసుకుని పనిచేస్తున్నారు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి చర్యలు తీవ్రంగా ఉండడమే కాకుండా, వేగంగానే ఇది జరుగుతుందని కూడా అంతా భావిస్తున్నారు.
కానీ, ఆ మొదటి రాత నవంబర్ 27న కనిపించగా, రెండు రోజులకే, అంటే నవంబర్ 29న మళ్లీ మరొక నల్లరాత కనిపించింది. కోర్టు రోడ్డులో ఉన్న, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న పోలీసు కార్యాలయం గోడల మీద అది కనిపించింది. అది- ‘మహమ్మద్‌ను అవమానించిన ఎవరికైనా తల నరకడమే సరైన శిక్ష’. ఈ రాత ఎందుకు రాయవలసి వచ్చింది? ప్రవక్తను కార్టూన్లతో హేళన చేసినది ఈ దేశంలో కాదు కదా! ఎక్కడో ఉన్న ఫ్రాన్స్‌లో జరిగిందది! మరి ఇక్కడ ఎందుకు రాసినట్టు? బెదిరించడానికి తప్ప మరొక ఉద్దేశం లేదు.
కొద్దికాలం క్రితమే బెంగళూరులో హింసాకాండ చెలరేగినప్పుడే పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పాత్ర గురించి అనుమానాలు వచ్చాయి. విద్రోహమే ఎజెండాగా ఉన్న ఈ సంస్థ ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నది. ఢిల్లీ అల్లర్లకు, హథ్రాస్ రగడకు ఈ సంస్థ బాసటగా నిలిచిందన్న ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు అదే రాష్ట్రంలో మంగళూరులో ఈ ఉదంతం జరిగింది. మనువాదులు ఎవరు? సంఘీయులు ఎవరు? మనువాదులు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. కానీ మనువాదులైనా, సంఘీయులైనా వారి దృష్టిలో హిందువులు అనే. ఇందుకు సందేహం లేదు. ప్రపంచాన్ని ఇస్లాం జెండా కిందకు తీసుకురావాలన్న పిచ్చిలో కూరుకుపోయి సర్వం మరచిపోతున్న ముస్లిం ఉగ్రవాదులు కళ్లు తెరిస్తే మంచిది. ఇక్కడ తాము విఫలమయ్యామని తేలిపోయింది కాబట్టే, లష్కర్ వంటి రక్త పంకిల చరిత్ర కలిగిన సంస్థ వైపు చూస్తున్నారు. మతోన్మాదం తప్ప మరొక ఆశయమే లేని ఈ మూకలు భారతదేశంలోకి చొరబడే ప్రయత్నం చేస్తే మన వీరజవాన్ల తుపాకీ గుళ్లకు బలికావడం తప్ప మరొకటేమీ జరగదు. ఈ కుట్ర సాగదు.
ఇలాంటి ఎజెండా కలిగిన భారతీయ ముస్లింలు, అంతర్జాతీయ ముస్లిం ఉగ్రవాదులు కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం అవసరం. ప్యాటీ అనే ఉపాధ్యాయుని తల నరకడం, తరువాత చర్చిలో చొరబడి వృద్ధ మహిళను నరకడం వంటి అనాగరిక చర్యలకు పాల్పడిన తరువాత ఫ్రాన్స్‌లో ముస్లింలు ఇప్పుడు అక్కడి ప్రభుత్వం ఏది చెప్పినా నోరు మూసుకుని ఆచరించే పరిస్థితికి వచ్చారు. అంగోలా అనే చిన్న దేశంలో ముస్లిం అన్న వాడికి నీళ్లు కూడా పుట్టకుండా చేస్తున్నారు. ప్రపంచంలో చాలా దేశాలలో మసీదు నిర్మాణానికీ, ఇతర దేశాల నుంచి మౌల్వీలు రావడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు చాలా పాశ్చాత్య దేశాలలో ఇప్పుడు ముస్లిం అంటే చాలు ప్రజలు ద్వేషం పెంచుకుంటున్నారు. చైనాలో ఉయ్‌గర్ అనే ముస్లిం తెగను కాన్‌సెంట్రేషన్ క్యాంపులలో ఉంచుతున్నారంటే అతిశయోక్తి కాదు. మరొక విశ్వాసం, మరొక జీవన విధానం ఈ భూమ్మీద ఉండకూడదని గుడ్డిగా నమ్మేవాళ్లనీ, దానినే దైవవాక్యంగా పాటించమని చెప్పే మౌల్వీలనీ ఏ దేశం భరిస్తుంది? ఎందుకు భరించాలి?
ఫ్రాన్స్ పరిణామాలను ఇక్కడే జరిగినట్టుగా నినాదం రాయడం మెజార్టి ప్రజలతో వైరం పెంచుకోవడానికే అనుకోవాలి. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న కర్ణాటక వంటి రాష్ట్రంలో వేగంగా నిప్పు రాజేయడానికే. ఇలా రాస్తే ఎవరో ఒకరు ఉద్రేకపడి వాళ్ల ఉచ్చులో పడితే పిచ్చికుక్కల్లా రెచ్చి పోవచ్చుననే ఉద్దేశమే అందులో కనిపిస్తున్నది. నిస్సందేహంగా ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి దైవం వారికి పవిత్రం. ఎవరి జీవనవిధానమైనా వారి పూర్వికుల నుంచి వచ్చినదే. వారికి ఆరాధనీయమైనదే. కానీ, అవతలి మతం నమ్మే దైవాలను దూషిస్తూ, జీవన విధానాన్ని అవహేళన చేస్తూ తమ దైవాన్ని మాత్రం గౌరవించమని చెబితే అది ఆచరణ సాధ్యమేనా? లేకుంటే కుత్తుకు మీద కత్తి పెడితే సాగేదేనా? మొగుడిని కొట్టి మొగసాలకెక్కే వ్యూహాలు ఎల్లకాలం సాగవు. బెదిరింపులతో సహిష్ణుత సాధ్యం కాదు. ఈ ధోరణికి తక్షణ పరిష్కారం అవసరం.