–  గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడింది. వచ్చే ఏడాది మే నెలలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తూర్పు రాష్ట్రమైన బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ పాలన సాగిస్తోంది. కేరళలో సీపీఎం, తమిళనాడులో అన్నాడీఎంకే, పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నాయి. ఈ దఫా ఎన్నికల్లో కోల్‌కతా కోటను కైవశం చేసుకుని రైటర్స్ ‌బిల్డింగ్‌ (‌సచివాలయం)లో పాగా వేయాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. 234 స్థానాలు గల ఈ రాష్ట్రంలో ప్రస్తుతం భాజపా మిత్రపక్షం అన్నాడీఎంకే అధికారంలో ఉంది. రేపటి ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలసి పోరాడనున్నాయి.

తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, సమన్వయం చేసేందుకు నవంబరు మూడోవారంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన వ్యూహకర్త, కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా చెన్నై నగరాన్ని సందర్శించారు. పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పోరాడతామని విస్పష్టంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ ‌సెల్వం, భాజపా కీలక నేతల సమక్షంలోనే అమిత్‌ ‌షా ఈ ప్రకటన చేశారు. అన్నాడీఎంకే నేతలు సైతం షా ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతల ప్రకటన చూసిన తరువాత ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించగలమన్న ధీమా కార్యకర్తల్లో కనపడింది. 2016 ఎన్నికల్లో దివంగత జయలలిత నాయకత్వంలో అన్నాడీఎంకే రెండోసారి గెలిచింది. అంతకుముందు 2011 ఎన్నిక ల్లోనూ జయలలిత విజయ కేతనాన్ని ఎగురవేసింది. ద్రవిడ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా రెండోసారి విజయం సాధించడం అరుదు. 1984 తరవాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ ఘనతను 2016లో జయలలిత సాధించింది. నాటి ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు అన్నాడీఎంకే 124, డీఎంకే 97, కాంగ్రెస్‌ ఏడు స్థానాలను సాధించాయి. తదనంతర కాలంలో జయలలిత మరణంతో పార్టీ కొంత ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కమలం పార్టీ సహకారంతో నిలదొక్కుకుంది. అయిదేళ్లూ అధికారంలో కొనసాగడంలో కమలం పార్టీ తెరవెనక కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.

 ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు అమిత్‌ ‌షా శంకుస్థాపనలు చేశారు. పూర్తయిన కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.173 కోట్లతో చెన్నై మెట్రో రెండోదశకు షా శంకుస్థాపన చేశారు. పనుల కోసం రూ.61,483 వెచ్చించనున్నారు. ఈ పనులు పూర్తయితే నగర ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రవాణా ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. కామరాజ్‌ ‌పోర్టులో రూ.900 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన జెట్టీని ప్రారంభించారు. కరూర్‌ ‌జిల్లాలో కావేరీ నదిపై రూ.406 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్‌ ‌డ్యామ్‌లను కేంద్రమంత్రి ప్రారంభించారు. దీనివల్ల ఈ ప్రాంత రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందుతుంది. మంచి పంటలు పండుతాయి. కోయంబత్తూరులో రూ.1620 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రగతికి ఈ ప్రాజెక్టులు దోహదపడ తాయనడంలో మరోమాట లేదు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ ‌సెల్వం, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి సి.టి రవి, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. ‌మురుగన్‌, ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు ఎల్‌.‌గణేశన్‌, ‌పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఎన్నికల రణరంగంలోకి దూసుకు వెళ్లేందుకు అన్నాడీఎంకే, కమలం పార్టీలకు ఈ కార్యక్రమాలు ఉపయో గపడతాయి. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు తాజా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళితే మెరుగైన ఫలితాలు రావచ్చని ఉభయ పార్టీలు అంచనా వేస్తున్నాయి.

 పార్టీని బలోపేతం చేయడంపైనా భాజపా దృష్టి పెట్టింది. మంత్రి అమిత్‌ ‌షా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వారితో ముఖాముఖీ జరిపారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీనియర్‌ ‌నేతలతో సమీక్షించారు. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న అంశంపై లోతుగా చర్చించారు. కొంతమంది డీఎంకే కార్యకర్తల నుంచి నిరసనలు ఎదురైనా అమిత్‌ ‌షా లెక్క చేయలేదు. ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ముగ్గురు అదనపు కమిషనర్లు, నలుగురు సంయుక్త కమిషనర్లు, 16 మంది డిప్యూటీ కమిషనర్లు మొత్తం మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పర్యటన సందర్భంగా డీఎంకే మాజీ పార్లమెంట్‌ ‌సభ్యుడు కేపీ రామలింగం తదితరులు కమలం తీర్థం పుచ్చుకున్నారు. రామలింగం 1996లో ఎంపీగా ఎన్నికయ్యారు. కొంతకాలం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. సినీనటి ఖుష్బూ, కర్ణాటక కేడర్‌ ఐపీఎస్‌ ‌మాజీ అధికారి కె.అన్నామలై పార్టీలో చేరారు. ఖష్బూ కాంగ్రెస్‌ ‌నుంచి కమలం పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ ‌పార్టీ విధానాలు నచ్చక, మోదీ నాయకత్వ పటిమ, దేశ ప్రగతికి చేపడుతున్న చర్యలను చూసి పార్టీలో చేరినట్లు ఆమె ప్రకటించారు. గతంలో రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జిగా పనిచేసిన కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌ఢిల్లీ నుంచే పార్టీ కార్యకలాపాలను సమన్వయ పరుస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌కూడా పార్టీ ప్రగతికి పాటు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ కనీసం 25 నుంచి 40 స్థానాల్లో పోటీచేయాలని యోచిస్తోంది. సంప్రదాయకంగా బలం ఉన్న చోట్ల బరిలోకి దిగాలన్నది పార్టీ ఆలోచనగా ఉంది. తిరునల్వేలి, కన్యాకుమారి, కోయంబత్తూరు, మదురై తదితర ప్రాంతాల్లో పార్టీకి పట్టుంది. రాష్ట్రంలోని దాదాపు 2.3 శాతం గల బ్రాహ్మణ సామాజిక వర్గం పార్టీకి అండగా ఉంది. వీరితోపాటు ఇతర సామాజిక వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నవంబరు మొదటివారంలో వెట్రివేల్‌ ‌యాత్రను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వనప్పటికీ పార్టీ అధ్యక్షుడు ఎల్‌. ‌మురుగన్‌ ఈ ‌కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. వెట్రివేల్‌ అం‌టే పార్వతీ దేవి, అమ్మవారు అని అర్థం. ఆమె కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయననే రాష్ట్రంలో మురుగన్‌ అని పిలుస్తుంటారు. తమిళనాడులో చాలామంది మురుగన్‌ అని పేర్లు పెట్టుకుంటారు. ఆరు మురుగన్‌ ‌దేవాలయాలను కలుపుతూ పర్యటించేందుకు వెట్రివేల్‌ ‌యాత్రకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ ‌శ్రీకారం చుట్టారు. మిత్రపక్షమైన అన్నాడీఎంకే ప్రభుత్వం కరోనా పేరుతో యాత్రకు అనుమతి ఇవ్వలేదు. అంతేకాక శాంతిభద్రతల సమస్య ఎదురవుతుందని పేర్కొంది. దీనిపై పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కార్యక్రమం డిసెంబరు 6న తిరుచెందూరులో ముగియనుంది. వెట్రివేల్‌ ‌కార్యక్రమం ప్రజల్లోకి బాగా వెళ్లిందని పార్టీ అంచనా వేస్తోంది.

 వాస్తవానికి అసెంబ్లీలో కమలం పార్టీకి ప్రస్తుతం ప్రాతినిథ్యం లేదు. అంతమాత్రాన పార్టీని విస్మరించే పరిస్థితి లేదు. తక్కువ అంచనా వేసే పరిస్థితి అసలు లేనేలేదు. పత్రికలు, ప్రచార మాధ్యమాలు ఈ విషయాన్ని గుర్తించాయి. భాజపా ప్రతినిధులు లేకుండా టెలివిజన్‌ ‌ఛానళ్లలో చర్చలు జరగడం లేదు. భాజపా బలమైన ఉనికికి ఇంతకు మించి మరో ఉదాహరణ అక్కరలేదు. ఇక సంస్థాగతంగానూ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు రవిశంకర ప్రసాద్‌, ‌పీయూష్‌ ‌గోయల్‌ ‌వంటి కేంద్రమంత్రులను రాష్ట్రానికి ఇన్‌ఛార్జిలుగా పనిచేశారు. కీలకమైన అధికారిక పదవుల్లో ఉండటం వల్ల పూర్తిస్థాయిలో వారు ఇక్కడ సమయాన్ని వెచ్చించలేకపోయారు. ఈ నేపథ్యంలో సి.టి.రవిని రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమించింది. ఆయన పొరుగునే ఉన్న కర్ణాటకకు చెందిన వారు. ఫైర్‌ ‌బ్రాండ్‌ ‌నాయకుడిగా పేరుంది. చిక్‌ ‌మగ్‌ళూరుకు చెందిన రవి రాష్ట్ర మాజీ మంత్రి. యువ నాయకుడు. తమిళనాడు రాజకీయాలు, అక్కడి పరిస్థితులు ఆయనకు కొట్టినపిండి. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పార్టీ పటిష్టతపైన దృష్టి సారించారు. రానున్న ఎన్నికలకు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. జాతీయస్థాయిలో తీసుకున్న 370 అధికరణ రద్దు, జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్‌ఆర్‌సి- నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజన్‌), ‌త్రిపుల్‌ ‌తలాక్‌పై భాజపా ప్రచారం చేయనుంది. కరోనాను కేంద్రం సమర్థంగా ఎదుర్కొన్న తీరు, అమృత్‌ ‌నగరాలు, జన్‌ ‌ధన్‌ ‌యోజన తదితర కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లనుంది.

 ద్రవిడ రాష్ట్రంలో జాతీయ పార్టీల ప్రభావం తక్కువేనన్నది తెలిసిన విషయమే. అయినప్పటికీ నరేంద్రమోదీ నాయకత్వంలో పార్టీ బలమైన ప్రభావాన్నే చూపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తొలిసారి ఒక లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించు కుంది. పొన్‌ ‌రాధాక్రిష్ణన్‌ ‌కన్యాకుమారి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయనను మోదీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని నౌకా రవాణా శాఖను అప్పగించారు. గత ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ కన్యాకుమారి సీటును కోల్పోయింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో 38 డీఎంకే గెలుచుకుంది. ఒక్క స్థానం మాత్రమే అన్నాడీఎంకే పరమైంది. అయినప్పటికీ అన్నాడీఎంకే, కమలం పార్టీల కూటమి అసెంబ్లీ ఎన్నికలపై ధీమాతో ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భాలు వేర్వేరు. వీటికి ప్రజల స్పందన భిన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచినప్పటికీ డీఎంకేలో అన్నదమ్ముల పోరు వల్ల ఆ పార్టీ బలహీనంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. పార్టీ అధినేత స్టాలిన్‌ అన్న ఆళగిరి మధ్య విభేదాలు బహిరంగ రహస్యం. తండ్రి కరుణానిధి ఉన్నప్పటి నుంచే వారి మధ్య పొరపొచ్చాలు ఉన్నాయి. ఇప్పుడు అవి మరింత తీవ్రమయ్యాయి.

ఆళగిరికి దక్షిణ ప్రాంతమైన మదురైలో కొంత పట్టుంది. ఈ విభేదాలు పార్టీని కొంతవరకు దెబ్బతీయవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలపై అన్నాడీఎంకే, భాజపా కూటమి ధీమాతోనే ఉంది. రాబోయే ఆరు నెలల్లో వివిధ కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. సందర్భాన్ని బట్టి కేంద్ర మంత్రులను రప్పించి తమ శాఖల పరంగా తమిళనాడుకు చేసిన మేలు, కేటాయించిన నిధులు, మంజూరు చేసిన పథకాలు, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయనుంది. మొత్తానికి అమిత్‌ ‌షా పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించింది. ఆత్మస్థైర్యాన్ని, భరోసాను నింపింది. వచ్చే ఆర్నెలల్లో అగ్రనేతల పర్యటన ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని, తద్వారా ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలని కమలం పార్టీ ఆలోచనగా ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE