డిసెంబర్‌ 11 ‌గోవత్స ద్వాదశి

‘నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ

జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమ:!’

హిందూధర్మం ప్రకారం, గృహప్రవేశం సహా ప్రతి శుభ కార్యక్రమంలో గోవుకు విశిష్ట స్థానం ఉంది. మానవ జాతికి ఆవు కన్నా మేలు చేసే జంతువు లేదు. అష్ట మంగళకర ద్రవ్యాలలో గోవు ఒకటి. అది ప్రసాదించే పంచగవ్యం పవిత్రతను, పరిశుద్ధిని కలిగిస్తుంది. అన్ని దానాలలో గోదానాన్ని ప్రథమంగా చెబుతారు. గోదానం వల్ల పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. గోవు పాలు, పెరుగు, నెయ్యి మున్నగు వాటిని యజ్ఞయాగాదులలో హవిస్సుగా వినియోగిస్తారు. వీటిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. నవజాత శిశువుకు పాలు నుంచి మానవ మనుగడకు అవసరమైన పాడిపంటలను గోవు సమకూరుస్తోంది.


‘గావ: విశ్వస్య మాతర:

గవా మాంగేష

తిష్ఠంతి భువనాని చతుర్దశ’…

గోవు విశ్వజనులందరికి తల్లి అని, గోవులో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయని వేదవచనం.

గోవును పూజిస్తే కన్నతల్లిని పూజించినట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి. గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి. కనుకే ‘శ్రీ సురభ్యై నమః’ అని గోసమక్షంలో జపిస్తే అభీష్టాలు నెరవేరుతాయని నమ్మకం.

కామధేను శక్తియైన లక్ష్మీ స్వరూపం

క్షీరసాగర మథనం సందర్భంగా లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన గోవు (కామధేనువు) అమృతసిద్ధిని ప్రసాదిస్తుంది. గోవును శ్రీమహాలక్ష్మిగా చెబుతారు. గోవులో సర్వదేవతలు, సర్వలోకాలు ఉన్నాయని ధేనుమహాత్మ్యం తదితర స్తుతులను బట్టి తెలుస్తోంది. త్రిమూర్తులు తమతమ దేవేరులతో గోవులో నిలిచిపోయారని, దేవతలు, వసువులు, రుద్రులు, సనకసనందాది విశిష్టజ్ఞానులు గోస్వరూపంలో ఇమిడి ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గోవు నిత్య పూజార్హమే. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అని, దానికి ముందు శుద్ధ అష్టమి తిథిని గోపాష్టమి అంటారు. గోవును ప్రత్యక్ష దైవంగా, సర్వదేవతా స్వరూపంగా అభివర్ణిస్తారు. గోవు(ల)కు ప్రదక్షిణం అతిక్లిష్టమైన భూప్రదక్షిణతో సమానమని పెద్దలు చెబుతారు.

ప్రాచీన భారతీయ సంస్క•ృతి, సంపదలకు మూలం గోమాత. గోవు ధర్మానికి ప్రతీక. ఈ భూమిని మోస్తున్న సప్తశక్తులలో గోవు ఒకటని పెద్దల మాట. గోవులు, వేదాలు, బ్రహ్మజ్ఞానులు (బ్రాహ్మణులు), పతివ్రతలు, సత్యవాదులు, లోభరహితులు, దాతలు భూమిని భరిస్తున్నారట. దేశం సుభిక్షంగా ఉండడానికి గోసంపద కూడ ఒక ప్రధాన కారణం. గోసంపదతో సమానమైన సంపద లేదని చ్యవన మహర్షి ‘నహుషం’లో ప్రవచించారు. గోమాతను సంరక్షించుకోవలసిన ఆవశ్యకతను స్కాందపురాణం చెబుతుంది. శ్రీమత్‌ ‌మహాభారతం విరాటపర్వంలో గోవుల గురించిన ప్రస్తావన ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. భారతంలోని అనుశాసనిక పర్వంలో గోవ్రతం, గోదానం గురించి ధర్మరాజుకు భీష్ముడు వివరించారు. దశరథుడు, అంబరీషుడు మున్నగు చక్రవర్తులు, రాజులు లెక్కకుమిక్కిలిగా గోవులను దానం చేశారని పురాణ కథనాలు.

గోపూజకు సంబంధించి ప్రత్యేక పర్వదినాలలో ముఖ్యమైనవి గోవత్స ద్వాదశి, గోపాష్టమి. అభీష్టసిద్ధికి ఆ రోజున గోపూజ చేయడం ఆచారంగా వస్తోంది. ఈ రెండు తిథునాడు గోవును షోడశోపచారాలతో పూజిస్తారు. ధాన్యం, పండ్లు తినిపిస్తారు. గోమాతకు ప్రదక్షిణం చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మాంతర పాపాలు నశిస్తాయని విశ్వాసం.

ఆవు శ్రమశక్తికి జీవం పోస్తుంది. ఆరోగ్యకరమైన పాలు ఇస్తుంది. ప్రకృతి నుంచి స్వీకరించే ప్రాణ వాయువును తిరిగి ప్రకృతికే అందించే అపూర్వజీవి. అందుకే గోమాత ఇచ్చే పాలు, పెరుగు, వెన్న, గోమయం, గోపంచకం విశిష్టం, పూజార్హమయ్యాయి. గోక్షీరానికి ఎంగిలి లేదని, లేగదూడ తల్లి వద్ద తాగిన పాలకు ఎంగిలి ఉండదంటారు. పురాణగాథ ప్రకారం, హిమాలయ ప్రాంతంలో గోవులు స్వేచ్ఛగా తిరుగుతుండేవి. అందులో ఒక గోవు వద్ద ఒక లేగ దూడ పాలు తాగగా, దాని నోటి నుంచి వచ్చిన నురగ గాలికి కొట్టుకు వెళ్లి తపస్సు చేసుకుంటున్న శివుడిపై పడింది. ధ్యానభంగం కలిగిన ఆయన ఆగ్రహంతో కళ్లు తెరవడంతో అక్కడి గోవులన్నీ నల్లగా మారాయి. అవన్నీ అక్కడి నుంచి పరుగులు తీయసాగాయి. అది గమనించిన బ్రహ్మ శివుడికి నమస్కరించి, గోవులకు ఎంగిలి లేదని, లేగ తాగిన తరువాత పితికిన పాలు పవిత్రమైనవేనని చెప్పి ఆయనకు వృషభాన్ని బహూకరించాడు. శాంతించిన శివుడు, తన దృష్టి కారణంగా కపిలవర్ణంలోకి మారిన గోవులను ఉత్తమమైనవిగా అనుగ్రహించాడు. వృషభాన్ని వాహనంగా స్వీకరించాడు. అప్పుడు పరమేశ్వరుడిని ‘గోపతి’ అని బ్రహ్మ సంబోధించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు గోపాలకుడయ్యాడు. ‘ధేనునా మస్మి కామధుక్‌’ (‌నేనే గోవును)అని ఆయనే భగవద్గీతలో చెప్పుకున్నాడు. భూమిపై అమృతప్రాయమైన పాలను అందించే గోవును గోలోకానికి చెందిన ప్రాణిగా చెబుతారు. ‘గోలోకం సత్యలోకంపైన ఉంటుంది. దానికి రాధాకృష్ణులు అధిదేవతలు. వారిని దివ్యగోవులు సేవిస్తూ ఉంటాయి. ఆ దివ్య గోవుల అంశతోనే భూలోకంలో గోవులు జన్మించాయి’ అని చెబుతారు. శ్రీకృష్ణుడు స్వయంగా గోవును పూజించి, సేవించి గోపాలుడైనాడు. వైకుంఠం వీడి భూలోకం చేరి అడవిలో వల్మీకం (పుట్ట)లో ఉన్న శ్రీనివాసుడికి గోవు పాలిచ్చి పాలించింది. లోకేశ్వరుడి•కే ఆకలి తీర్చింది గోమాత.

ఆవు సాధుజంతువు. శాకా(ఖా)హారి. దానికి సమకూర్చే ఆహారాన్ని బట్టి రకరకాల సత్ఫలితాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక ప్రముఖులు చెప్పారు. శనగలు (సంతానప్రాప్తి, ఆరోగ్యసిద్ధి), పెసలు (విద్యా, ఐశ్వర్యాభివృద్ధి), ఉలవలు (వృత్తిలో నిలకడ, వ్యాపారాభివృద్ధి), బొబ్బర్లు (నరఘోష నివారణ, ధనాభివృద్ధి), గోధుమలు (ఉద్యోగాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి), బియ్యం-పిండి (వివాహ ప్రాప్తి, ప్రశాంత జీవనం) గోవుకు హితమైన గ్రాసంగా చెబుతారు. వాటిని గోవుతో సరితూగేంత వితరణను విశేష దానంగా పరిగణిస్తారు.

 ‘పాలిచ్చే గోవులకు పసుపు కుంకుమ’ అని అలతి పదాలతో గోవిశిష్టతను అనల్పంగా చెప్పారు భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక సినీగీతంలో. అలాగే మానవ జీవితానికి గోమాత ఎంతగా తోడ్పడుతుందో ‘గోమాతను నేనేరా/నాతో సరిపోలవురా’అని మరో కవి కొసరాజు వర్ణించారు.

‘ధర్మోరక్షతి రక్షితః’ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనలను కాపాడుతుంది. అలాగే మనం గోవులను రక్షించుకుంటే అవి మనలను కాపాడతాయి.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE