సుజాత గోపగోని, 6302164068

ఎగ్జిట్‌పోల్స్ ‌మాదిరే, తెలంగాణ రాష్ట్ర సమితి అంచనాలు కూడా ఘోరంగా భగ్నమయ్యాయి. పందొమ్మిదేళ్ల తెరాస ఉద్యమ, పాలన దశల ప్రస్థానంలో అత్యంత నిరాశకు గురి చేసిన ఫలితాలు, కుంగదీసిన పరిణామం గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. ముందస్తు ఎన్నికల వ్యూహం పరమ వికృతంగా వెక్కిరించింది. తెలంగాణ కోసమే పుట్టిందంటూ, తెలంగాణ అభివృద్ధే శ్వాస అంటూ నిత్యం ప్రకటించుకునే పార్టీ ఉక్కిరి బిక్కిరి అయింది . నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం నివ్వెరబోయింది. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌లోనే కారుకు రివర్స్ ‌గేర్‌ ‌పడింది. ఎవరిని లక్ష్యంగా చేసుకుని పోరాడారో, ఎవరిని తెలంగాణ నుంచి, ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నుంచి తరిమికొడతామని ఉద్యమకాలంలో శపథం చేశారో… వాళ్ల అండతోనే జీహెచ్‌ఎం‌సీ ఎన్నిక ఫలితాలలో తెరాస పెద్ద పార్టీ హోదాను దక్కించుకోవడమూ ఓ వైచిత్రి. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నుంచి నాయకులు రావాలా అంటూ మాటలతో అడ్డుకట్ట వేయాలనుకున్న ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు ఈ ఫలితాలు యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తుంటే నోట మాట రాక మ్రాన్పడిపోయారు. 2016లో 99 స్థానాలు గెలిచిన తెరాస 2020 ఎన్నికలలో 56కు పరిమితం కావడం స్వయంకృతమే. నాలుగు స్థానాల నుంచి 48 స్థానాలకు ఎగబాకిన బీజేపీది నిశ్చయంగా పోరాటపటిమ. ఇప్పుడు అంతా భావిస్తున్నదొకటే- జీహెచ్‌ఎం‌సీ ఫలితాలు భవిష్యత్‌ ‌తెలంగాణ రాజకీయాలకు దిక్సూచి. దుబ్బాక,  ఆ వెంటనే వచ్చిన ఈ ఫలితాల నుంచి కోలువడం అంత సులభం మాత్రం కాదు. రెండు పార్టీలకు వచ్చిన ఓట్ల తేడా కేవలం 0.28శాతమే. తెరాస ఎంతమంది ఆ పార్టీ పెద్దలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను మోహరించినా కమల వికాసం ఆగలేదు.


జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడింది. టీఆర్‌ఎస్‌ ‌బలం దాదాపు సగానికి తగ్గి 55 దగ్గర పడిపోయింది. భారతీయ జనతాపార్టీ బలం 12 రెట్లు పెరిగి 48కి ఎగబాకింది. తెరాస కోల్పోయిన 44 స్థానాలు బీజేపీ ఖాతాలో చేరాయి. ఎంఐఎం తన ఇలాకాలో 44 సీట్లతో ప్రాబల్యాన్ని నిలబెట్టు కుంది. కాంగ్రెస్‌ ‌పార్టీ కేవలం రెండు సీట్లకు పరిమితమైంది. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ధరావత్తు కూడా దక్కించుకోలేకపోయాయి. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని  ఈ ఎన్నికలతో ప్రజలు చాటారు. దుబ్బాకలో సత్తాచాటిన బీజేపీ ఒక్క ఉదుటున జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో విశ్వరూపం చూపింది. అంతేకాదు.. దాదాపు మిగతా చాలా డివిజన్‌లలో రెండవ స్థానంలో నిలిచి, కొత్త సవాలుకు సిద్ధంగా ఉంది. భారీగా ఓట్ల శాతాన్ని తన ఖాతాలో వేసుకుంది. తెరాస అభ్యర్థులు గెలిచిన చోట కూడా బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కారంటే కాషాయం హైదరాబాద్‌ను ఎంతగా ఆవరించిందో, ఓటర్లపై ఎంతగా ప్రభావం చూపించిందో అర్థమవు తోంది. గత ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను గెలుచుకొని మేయర్‌ ‌పీఠాన్ని కైవసం చేసుకున్న తెరాస, ఈసారి పెద్ద పార్టీగా అవతరించినా, పక్కన లోపాయికారి మిత్రపక్షం ఎంఐఎం 44 స్థానాలతో ఉన్నా కూడా, మేయర్‌ ‌పీఠం కేసి దింపుడు కళ్లం ఆశతోనే చూస్తోంది. అసలు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికల్లో తెరాస గ్రాఫ్‌ ‌సగానికి పడిపోవడం విశ్లేషకులను సైతం దిగ్భ్రమకు గురి చేసింది.

Sweets, crackers: BJP celebrates 'moral victory' in GHMC election - india  news - Hindustan Timesమంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్‌లుగా పనిచేసినా పలు డివిజన్‌లలో తెరాస అభ్యర్థులు ఓడిపోయారు. ఇది ప్రజాగ్రహానికి ప్రబల నిదర్శనం. అంతేకాదు, ఎమ్మెల్యేలు, మంత్రుల సమీప బంధువులు కూడా పరాజయం పాలయ్యారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి భార్య, సిట్టింగ్‌ ‌కార్పొరేటర్‌ ‌స్వప్న హబ్సిగూడ డివిజన్లో ఓడిపోయారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ ‌గౌడ్‌ ‌సోదరుడు ప్రేమ్‌దాస్‌ ‌గౌడ్‌ ‌మైలార్‌దేవ్‌ ‌పల్లిలో ఓటమి పాలయ్యారు. దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్‌ ‌డివిజన్‌లో, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు సుచరిత రెడ్డి మూసారాంబాగ్‌ ‌డివిజన్‌లో, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ ‌తమ్ముడు శ్రీనివాస్‌గౌడ్‌ ‌గాజుల రామారం డివిజన్‌లో పోటీ చేసి ఓడిపోయారు.

కొనసాగిన దుబ్బాక జోష్‌

‌దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసుకున్న భారతీయ జనతాపార్టీ అదే ఊపుతో జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలను ఉద్యమస్ఫూర్తితో ఎదుర్కొంది. ఇంకాస్త సమయం ఉంటే బీజేపీ మరింత బలపడే ప్రమాదాన్ని పసిగట్టిన తెరాస వెనువెంటనే జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలను ముందుకు తెచ్చింది. ఇది గులాబీ దళ నేత ఆత్మవిశ్వాసమా? లేక తడబాటా తేలవలసి ఉంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించారు. అయినా బీజేపీ నిరుత్సాహ పడలేదు. నాయకులు పక్కా ప్రణాళికతో జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించారు. కేంద్ర మంత్రులు, జాతీయస్థాయి నేతలను ప్రచారానికి రప్పించారు. స్థానిక నాయకత్వం సమర్థ•ంగా తనపాత్ర పోషించింది. ముప్పయ్‌కి పైగా ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నా కూడా, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌గద్దెను ఎక్కేందుకు అవసరమైన మెజార్టీకి తెరాసను దూరంగా నిలబెట్టింది. గతంలో ఉన్న 99 సీట్లే కాదు, ఇంకో ఐదారు ఎక్కువే గెలుస్తామని ప్రగల్భాలు పలికినా తెరాస దారుణంగా చతికిలపడింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శించిన దూకుడు వ్యూహం అద్భుతంగా విజయవంతమయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రయోగించిన పాతబస్తీ మీద ‘సర్జికల్‌ ‌స్ట్రయిక్‌’ ‌పెను సంచలనమే రేపింది. కానీ ఈ అంశాన్ని వివాదాస్పదం చేయ దలచిన తెరాస నాయకత్వానికి అదే ఎదురుదెబ్బగా మారింది. చెరువుల ఆక్రమణలు కాదు, పీవీ, ఎన్‌టీఆర్‌ల సమాధులు తొలగించండి చూద్దాం అంటూ ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్‌ ‌ప్రదర్శించిన వాచాలత తెరాస పీకకే చుట్టుకుంది. అక్బరుద్దీన్‌ను దీటుగా ఖండించే దమ్ము వారికి లేదని తేలిపోయింది. ఎందుకంటే సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ‌వ్యాఖ్యను ఖండించడానికి చూపించిన వీరత్వం, పీవీ, ఎన్‌టీఆర్‌ ‌సమాధుల కూల్చివేత మాటను ఖండించడం దగ్గర కాస్త కూడా కనిపించలేదు. ఇంకా, రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం కావడం, వాటిని సమర్థంగా బీజేపీ లేవనెత్తడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ నేతలు అనుస రించిన విధానం కూడా విజయవంతం అయింది. దీనికి అంతిమంగా వరద బాధితులకు పదివేల రూపాయల సాయంలో ప్రభుత్వ అవకతవకలు తోడయ్యాయి. ఈ సాయంలో స్థానిక నాయకుల చేతివాటం ఆరోపణ కూడా తెరాసకు మొండిచేయి చూపించింది.

తెరాస, ఎంఐఎం లక్ష్యంగా బీజేపీ ముఖ్యనేతలు చేసిన విమర్శలు ఓటర్లలోకి బలంగా చొచ్చుకు పోయాయి. ఇక, బీజేపీ దూకుడుతో తత్తరపాటుకు గురైన అధికార తెరాస పలు పాచికలు వేసింది. అవేవీ పనిచేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతల ముప్పు ఉందంటూ ప్రచారం లేవనెత్తారు. మత కల్లోలాలు చెలరేగే అవకాశం ఉందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి, పోలీసులు అనుమానాలు వ్యక్తంచేసి, ఒక బూచిని సృష్టించేందుకు శతథాయత్నించారు. తెరాస ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు, కరోనా కాలంలోనూ ప్రజల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా కొత్త విధానాలు రూపొందించడం, ప్రజలందరి మీద భారం మోపడం వంటి అంశాలు మౌనంగానే ప్రభావం చూపాయి. తెరాసలో మితిమీరిన ఆత్మవిశ్వాసం, అత్యుత్సాహం, అహంకారం, విరగబాటు నరనరానా కనిపించింద న్నది ఓటర్ల వాదన. కానీ, బీజేపీ సమయం ఏమాత్రం వృథా చేయకుండా తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోయింది.

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌నుంచే బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. పోస్టల్‌ ‌బ్యాలెట్‌లో బీజేపీకి అధిక సంఖ్యలో ఓట్లు నమోదు కావడం తెరాస నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయ్యింది. అత్యధిక డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగడం ఆదిలోనే ఆ పార్టీ నేతల్లో జోష్‌ను నింపింది. పెట్టెలలోని బ్యాలెట్‌ ‌పేపర్ల లెక్కింపు మొదలైన తర్వాత కూడా అదే ట్రెండ్‌ ‌కొనసాగింది. ఒకదశలో బీజేపీ 50కి పైగా డివిజన్లు గెలుస్తుందని అనుకున్నారు. కానీ, కొన్ని సీట్లను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయింది. పాతబస్తీలో ఏకంగా పది సీట్లు గెలుచుకొని ఎంఐఎం కోటాకూ బీజేపీ బీటలు వేసింది. ఎల్‌బీ నగర్‌, ‌మహేశ్వరం, గోషా మహల్‌, ‌ముషీరాబాద్‌ ‌నియోజకవర్గాల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. ఇక సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి, శేరి లింగంపల్లి ప్రాంతాల్లో తెరాస ఆధిక్యం చాటింది. ఫలితంగా బీజేపీ కంటే ఏడు సీట్లు అదనంగా గెలుచుకుంది. లేదంటే ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది.

ఇన్‌చార్జ్‌లకు మొట్టికాయ – ప్రముఖులకూ పరాభవం

మొత్తంగా జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో తెరాస బోల్తా కొట్టడం ఒక ఎత్తయితే.. ముఖ్యనేతలు, మంత్రులు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన, హోరాహోరీగా ప్రచారం చేసిన డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం అధికార పార్టీకి శరాఘాతమనే చెప్పవచ్చు. సీఎం కేసీఆర్‌ ‌కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆమె ఇన్‌చార్జ్‌గా ఉన్న గాంధీనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కల్వకుంట్ల కవిత తానే అభ్యర్థి అన్న స్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రజలు మాత్రం తెరాస పట్ల ఆసక్తి చూపించలేదు. నామినేషన్‌ ‌దాఖలైనది మొదలు, ప్రచారం ముగిసేవరకు కూడా గాంధీనగర్‌ ‌డివిజన్‌ ‌కోసమే కవిత ప్రచారం చేసినా, అక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి పావని విజయం సాధించారు. పైగా అది కవిత ఇన్‌చార్జ్‌గా ఉన్న డివిజన్‌ ‌మాత్రమేనా? స్వయంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ‌సోదరుడి భార్య పద్మ అక్కడ అభ్యర్థి. దీనితో విజయం తప్పదనుకున్నారు. అయితే, ఫలితాలు దిమ్మతిరిగిపోయేటట్టు వచ్చాయి.

ఈటల రాజేందర్‌, ‌జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, శ్రీ‌నివాస్‌గౌడ్‌ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహ రించిన డివిజన్లలో తెరాస అభ్యర్థులు గెలుపు సాధించలేకపోయారు. ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత, పసునూరు దయాకర్‌ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న డివిజన్లలోనూ తెరాస అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యులుగా ఉన్న డివిజన్లలోనూ అధికారపక్ష అభ్యర్థులు ఎక్కువగా ఓటమి చెందారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ‌నియోజకవర్గం సనత్‌నగర్‌లో ఐదు డివిజన్లు ఉండగా, రెండింట్లోనే టీఆర్‌ఎస్‌ ‌గెలిచింది. మిగతా మూడు సిట్టింగ్‌ ‌స్థానాలైన అమీర్‌పేట, రాంగోపాల్‌పేట, మోండా మార్కెట్‌లో అధికార పార్టీ ఓడిపోయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం మహేశ్వరం పరిధిలోని సరూర్‌నగర్‌, ఆర్కేపురం డివిజన్లూ తెరాస చేజారాయి.

కొన్ని డివిజన్లలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలిసి బాధ్యత తీసుకున్నా గెలుపును అందుకోలేకపోయారు. మంగళ్‌హాట్‌ ‌డివిజన్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే టి. రాజయ్యను బాధ్యులుగా నియమించినప్పటికీ.. అక్కడ తెరాసకు ఓటమి తప్పలేదు. ఎమ్మెల్సీ ఎంఎస్‌ ‌ప్రభాకర్‌, ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇన్‌చార్జ్‌లుగా పనిచేసిన విజయనగర్‌ ‌కాలనీలోనూ తెరాస చతికిలపడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 10మంది ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న అన్ని డివిజన్లలో తెరాస అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ ‌చెట్టాపట్టాల్‌?

‌జీహెచ్‌ఎం‌సీ ఫలితాల్లో సెంచరీ కొట్టడం ఖాయమని చెప్పిన తెరాస, అందులో దాదాపు సగానికే పరిమితమైంది. పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ గత ఎన్నికలతో పోల్చితే గ్రాఫ్‌ ‌గణనీయంగా పడిపోయింది. ఎంఐఎంతో తమకు ఎలాంటి పొత్తు, సంబంధం లేదని ఎంత బొంకినా, మేయర్‌ ‌పీఠం దక్కించుకోవాలంటే ఇప్పుడు ఆ పార్టీతోనే జత కట్టక తప్పని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు గట్టిగా భావిస్తున్నారు. అయితే, ‘మేం తలచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని కూలగొట్టగలం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారితో పొత్తు ఉంటుందా? అనే సందేహం సహజమే. పైగా గతంలో కలిసి పోటీ చేసిన తెరాస, ఎంఐఎం ఈసారి ఎవరికివారే పోటీ చేశామని, ఎలాంటి పొత్తు లేదని ప్రకటించు కున్నాయి. కానీ, పదవికోసం తెరాస వాటన్నిటిని ‘ప్రజా ప్రయోజనాల కోసం’ పక్కనబెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.

మరోవైపు, తెరాస ఎక్స్ అఫీషియో మెంబర్లను నమ్ముకుంటోంది. అయినా మేయర్‌ ‌పీఠం దక్కే పరిస్థితి లేదు. అందుకే ఎంఐఎం మద్దతు అనివార్యంగా మారుతోంది. ఒకవేళ అదే జరిగితే బీజేపీకి మరో అస్త్రం దొరికినట్టే అంటున్నారు పరిశీలకులు. దమ్ముంటే చీకటి పొత్తులు కాదు.. నేరుగా పొత్తు పెట్టుకోవాలంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్‌ ‌షా సవాల్‌ ‌కూడా చేశారు. కానీ తమకు ఎంఐఎంతో ఎలాంటి పొత్తూ లేదని టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బల్దియా పీఠాన్ని కైవసం చేసుకోవ డానికి ఎంఐఎం మద్దతు తీసుకుంటే బీజేపీ ఈ విషయాన్ని బాగా హైలైట్‌ ‌చేయడం ఖాయం. ఆ రెండు పార్టీలూ ఒకటేనని.. ఎన్నికల్లో డ్రామాలాడు తున్నాయనే సంగతిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసు కుంటున్న టీఆర్‌ఎస్‌ ‌పార్టీ.. బల్దియా పీఠాన్ని ఎలా కైవసం చేసుకోవాలా అనే అంశంపై సమాలోచనలు చేస్తోంది. నేరుగా ఎంఐఎం మద్దతు తీసుకోవడం కంటే ఓటింగ్‌ ‌రోజున ఆ పార్టీని గైర్హాజరు అయ్యేలా చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. ఒకవేళ అలా చేసినా ఇద్దరూ అవగాహనకు వచ్చారని బీజేపీ ఫోకస్‌ ‌చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేయర్‌ ‌పీఠం దక్కినా, అది తెరాస పాలిట శాపమే అవుతుంది.

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎం కూడా మేయర్‌ అభ్యర్థిని బరిలో నిలిపేలా చేయడం ద్వారా పీఠం దక్కించుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌కు 55 మంది కార్పొరేటర్లతో పాటు 32 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. అంటే.. ఆ పార్టీకి 87 మంది సభ్యులు ఉన్నారు. ఇక బల్దియాలో 150 మంది కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 195 ఓట్లు ఉన్నాయి. మేయర్‌ ‌కుర్చీ దక్కాలంటే మ్యాజిక్‌ ‌ఫిగర్‌ 98.

కేటీఆర్‌ ‌నిర్వేదం

గ్రేటర్‌ ఎన్నికలను తానొక్కడినే ఒంటిచేత్తో ఎదుర్కొంటానంటూ మొదట్లో అంతర్గతంగా చెప్పుకున్న కేటీఆర్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వేదం కనిపించింది. బీజేపీ జోష్‌ ‌ముందు కేసీఆర్‌ ‌బయటకు రాని పరిస్థితి తలెత్తింది. గెలుపోటములు రాజకీయాలలో సహజమంటూ ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, పార్టీ కార్యాలయం ముందు బాణసంచా కాల్చినా,ఫలితాలతో పార్టీ తీవ్ర నిరాశకు గురయిందన్నదే నిజం. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని కేసీఆర్‌ ‌కుమారుడు, తెరాస వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చెప్పేశారు. తమ పార్టీకి మరో 25 స్థానాలు అదనంగా వస్తాయని భావించామన్నారు. మేయర్‌ అభ్యర్థి ఎంపిక గురించి ఇంకా రెండు నెలల సమయం ఉందంటూ దాట వేయడం పార్టీలో ఉన్న గుబులుకు అద్దం పట్టింది.

తెలంగాణ ప్రజలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా అవతరించిందని, 2023లో రాష్ట్రంలో అధికారం లోకి రావడానికి ఈ ఎన్నికలు తమకు వేదికగా నిలుస్తాయని బీజేపీ ప్రకటించుకుంది. అడుగడుగునా బీజేపీ అభ్యర్థులను, నాయకులను తెరాస ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని, తప్పుడు కేసులతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని, అయినా తమ పోరాట పటిమ ఎక్కడా చెక్కుచెదరలేదని, ప్రభుత్వానికి దీటైన సమాధానం ఇవ్వగలిగామని, కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మీడియాకు చెప్పారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ప్రజల ఆదరణను ఆ పార్టీ వేగంగా కోల్పోతోందని అన్నారు. తమ పార్టీని ఆదరించిన హైదారాబాద్‌ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ‘గడీల పాలన’ను బద్దలుకొట్టే దమ్ము తమ పార్టీకే ఉందని సంజయ్‌ ‌ధీమా వ్యక్తం చేశారు.

అమిత్‌షా అభినందనలు

జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన మద్దతు కూడా అద్భుతమైనది. ఇది ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. కాంగ్రెస్‌ను చూస్తే అది ఎంత అవసరమో తెలుస్తుంది. తమకు ఢిల్లీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు అంటూ ఉండవని, ఏ ఎన్నికైనా గట్టిగా శ్రమించడమే బీజేపీ కార్యకర్తల లక్షణమని సంజయ్‌ ‌స్పష్టం చేయడం విశేషం. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత అమిత్‌షా, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, జావడేకర్‌, ‌యూపీ ముఖ్యమంత్రి యోగి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ఇలా ఎందరో వచ్చి ప్రచారం చేశారు. ఫలితాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా వెంటనే స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ సాగిస్తున్న రాజకీయాలపై జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల వేదికగా తెలంగాణ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారన్నారు. సంజయ్‌కు, కార్యకర్తలకు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ పది నిమిషాలు సంజయ్‌తో సంభాషించారు. నిజానికి ఇలాంటి పార్టీ వ్యవస్థ మేధావులను కూడా ఆకర్షిస్తున్నది.

తరువాతి లక్ష్యం నాగార్జున సాగర్‌

‌దుబ్బాక ఉపఎన్నికలో విజయ బావుటా, గ్రేటర్‌లో అనూహ్య విజయాలతో బీజేపీలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతున్నది. అదే ఊపుతో రాబోయే ఎన్నికలనూ ఎదుర్కొనేందుకు సిద్ధమవు తోంది. వెనువెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. హైదరాబాద్‌, ‌నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎలక్షన్లపైనా గ్రేటర్‌ ‌ప్రభావం కచ్చితంగా ఉంటుందని బీజేపీ ధీమాగా ఉంది. అలాగే, త్వరలో ఖమ్మం, వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. కొద్దిరోజుల వ్యవధి తేడాతోనే ఈ ఎన్నికలన్నీ జరిగే అవకాశాలు ఉండటంతో గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల ప్రభావం వీటిపై పడుతుందని విశ్లేషకులు అంచనా. ఇదే ఊపు ఇలాగే కొనసాగితే, తెరాస, ఆ పార్టీ నేతల వ్యవహారశైలిలో మార్పు రాకపోతే ‘ఉద్యమ పార్టీ’కి కౌంట్‌డౌన్‌ ‌మొదలైనట్లే అని చెబుతున్నారు. బీజేపీ కూడా ఇదే ఉత్సాహంతో వెంట వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. మొదట ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. అలాగే, నాగార్జున సాగర్‌లో విజయం కోసం జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజు నుంచే వ్యూహాలు మొదలుపెట్టింది. తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగుర వేసేం దుకు అవసరమైన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టద్దన్న ఉత్సాహం, కసి, పట్టుదల బీజేపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

కూతురు.. కొడుకు.. అల్లుడు..

జీహెచ్‌ఎం‌సీ ఫలితాలతో జోష్‌ ‌మీదున్న బీజేపీ శ్రేణులు, ఆ పార్టీ అభిమానులు సోషల్‌ ‌మీడియా వేదికగా దూసుకెళ్తున్నారు. ఇదే ఊపులో కేసీఆర్‌పై సోషల్‌ ‌మీడియాలో సెటైర్లు వైరల్‌ అవుతున్నాయి.

‘మొన్న నిజామాబాద్‌లో కూతురు కవిత ఓటమి

నిన్న దుబ్బాకలో మేనల్లుడు హరీష్‌రావు ఓటమి

ఇప్పుడు జీహెచ్‌ఎం‌సీలో కొడుకు కేటీఆర్‌ ఓటమి

ఇకముందు తండ్రి కేసీఆర్‌ ఓటమి’ అంటూ తమదైన శైలిలో పోస్టులు వైరల్‌ ‌చేస్తున్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE