కరోనా అనే కంటికి కనిపించని వైరస్‌ని ఎదుర్కొనడానికి  భారత్‌ ‌సహా,  చాలా ప్రపంచదేశాలలో జనావాసాలన్నీ కొన్ని నెలల పాటు స్వచ్ఛంద కారాగారాలుగా మారిపోయాయి. భయంతో, ఆందోళనతో మానవాళి సమస్తం గడగడలాడిపోయింది. నగరాలలో, పట్టణాలలో నెలల తరబడి కర్ఫ్యూ కొనసాగింది. బయటి ప్రపంచం సంగతే మరచింది. కొద్దినెలల క్రితం వరకు మాస్క్‌లేని వారిని చూస్తే సంఘ విద్రోహులను చూసినంత ఏహ్యభావం వ్యక్తమయిన సందర్భాలు ఉన్నాయి. భౌతికదూరం నిబంధన పాటించక వేలాది మంది పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న సంఘటనల• చూశాం. ఆస్పత్రులు కూడా మూతపడినాయి. ఆర్థిక వ్యవస్థలు మందగించాయి. ఇప్పటికీ పాఠశాలలు మూతపడే ఉన్నాయి. చిత్రంగా… ఇవన్నీ అప్పుడే విస్మృతికి వచ్చేశాయి.మాస్క్‌లు లేని ముఖాల సంఖ్య పెరుగుతోంది. భౌతికదూరం సంగతే మరచిపోయినట్టు ఉంది. అయినంత మాత్రాన కరోనా వైరస్‌ ‌మానవాళిని విడిచి వెళ్లిపోయిందని అనుకుంటే అంతకంటే పెద్ద తప్పిదం ఉండదు. ఆ వైరస్‌ ఇప్పటికీ తన ప్రభావం చూపుతూనే ఉంది. ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నది. మళ్లీ ప్రపంచంలో కొన్నిచోట్ల లాక్‌డౌన్‌, ‌కర్ఫ్యూ  వచ్చాయి. ఇక్కడ మహారాష్ట్ర, ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ వచ్చింది. ఇంగ్లండ్‌ ‌మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధించింది.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచాన్ని చుట్టుముట్టిన స్పానిష్‌ ‌ఫ్లూ  వైరస్‌ ‌మూడు దశలుగా తన ప్రభావాన్ని చూపించింది. అదే కుటుంబంలోని కొవిడ్‌ 19 ‌కలకలం 2020 మార్చిలో ఆరంభమైనప్పుడే  నిపుణులు ఆ విషయం ప్రపంచానికి గుర్తుచేశారు. ఇప్పుడు అదే జరుగుతున్నది. యూరప్‌ ‌దేశాలు కొవిడ్‌ 19 ‌రెండోదశతో పోరాడుతున్నాయి. భారత రాజధాని ఢిల్లీ మూడో దశతో సతమతమవుతున్నది. దేశంలో కొన్ని రాష్ట్రాలు రెండో దశకు చేరుకున్నాయని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను బట్టి నిర్ధారించుకోవచ్చు. ఈ నేపథ్యంలో  నవంబర్‌ ‌నెలాఖరున మళ్లీ ఒక్కసారిగా కరోనా గురించిన కలకలం చెలరేగింది. కొవిడ్‌ ‌నివారణ వ్యాక్సిన్‌ ‌పరిశోధన, ప్రయోగాలు తుది అంకానికి చేరుకోవడం నిజంగానే మానవాళికి ఒక సాంత్వన. మొదటిదశ తీవ్రంగా ఉన్నా, రెండోదశ కూడా దానికి తీసిపోకుండా, తనవంతు నష్టం చేసి, మానవాళిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనీ, మూడో దశలో కొంత ఉపశమనం ఉన్నా ప్రభావం తప్పదనీ నాడు వైద్యనిపుణులు చెప్పిన సంగతి గుర్తుంచుకోవాలి. మొదట్లో దేశంలో చాలా కఠిన చర్యలు తీసుకోవడంతో అదుపులో ఉన్న వైరస్‌ ‌నెమ్మదిగా విశ్వరూపం దాల్చింది. అందుకు అనేక కారణాలు. ఇప్పుడు ప్రపంచంలోనే తీవ్ర స్థాయిలో కరోనా బారిన పడిన దేశాలలో రెండవ స్థానంలోకి భారత్‌ ‌వచ్చింది. మొదటి స్థానం అమెరికాకు దక్కింది.

భారత్‌లో జమిలిగా రెండు/మూడు దశలు

భారతదేశంలో రెండోదశ కొన్నిచోట్ల, దేశ రాజధాని ఢిల్లీలో మూడోదశ కొనసాగుతున్నాయి.  రెండోదశ కొవిడ్‌ 19 ‌విజృంభణ మరింత ప్రమాద కరంగా ఉండబోతున్నదని హెచ్చరికలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహ రించాలని సుప్రీంకోర్టు నవంబర్‌ 27‌న కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ ‌వచ్చే వరకు ఆంక్షలను అమలు చేయాలని, వైరస్‌ను నిరోధించడంలో కేంద్ర ప్రభుత్వానిదే కీలక పాత్ర అని కూడా అత్యున్నత న్యాయంస్థానం అభిప్రాయ పడింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను అంతా గమనించడం అవసరం. దేశంలో అరవై శాతం ప్రజలు మాస్క్‌లు ధరించడం లేదని కోర్టు చెప్పింది. ముప్పయ్‌ ‌శాతం గెడ్డం కింద మాస్క్‌లు పెట్టుకుంటున్నారని కూడా కేంద్రం దృష్టికి తీసుకువచ్చింది. 26-27 తేదీల మధ్య 24 గంటలలో 43 వేల కేసులు నమోదయ్యాయి. 28వ తేదీ నుంచి 29 వరకు 24 గంటల సమయంలో దేశ వ్యాప్తంగా 41,810 కేసులు పెరిగాయి. 496 మంది చనిపోయారు. 29వ తేదీ నాటికి కేసుల సంఖ్య 93,92, 919కు చేరింది.మృతులు 1,36,809. కోలుకున్నవారు 8,945,243

దేశంలో పది రాష్ట్రాల నుంచే 77 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ‌కర్ణాటక, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌, ‌చత్తీస్‌గఢ్‌, ఆం‌ధప్రదేశ్‌ల నుంచే అధికంగా కేసులు ఉంటు న్నాయి. ఢిల్లీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోక పోవడం వల్లనే అక్కడ కేసులు పెరిగిపోతున్నాయని సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా కోర్టుకు తెలియచేశారు. దేశ రాజధాని నగరంలో నవంబర్‌ 29 ఒక్కరోజే 4,998 కేసులు నమోదైనాయి. నవంబర్‌ 28‌న 5,475కేసులు, 27న 5,482 కేసులు బయటపడ్డాయి. నవంబర్‌ 7‌న అతి తక్కువగా మరణాలు నమోదు అయినాయని సంతోషిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా వైరస్‌ ‌చెలరేగిపోయింది.

పెరిగిన వైద్యసదుపాయాలు, ఆరోగ్యం మీద అవగాహన ఇప్పుడు కొన్ని మరణాలను తగ్గించి ఉండవచ్చు. కానీ 1919లో ఆరంభమై, 1920-21 వరకు సాగిన స్పానిష్‌ఫ్లూ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్ల మంది చనిపోయారు. ఇది ఆనాడు భారతదేశానికి సైనికుల కారణంగా వచ్చింది. మొదట ముంబై (నాటి బొంబాయి)లో దిగిన సైనికులు దీనిని తెచ్చారు. ఇప్పటిలాగే నాడు కూడా అమెరికాయే ఎక్కువ నష్టపోయింది. ఎక్కువ ప్రాణాలు పోయింది కూడా అక్కడే. అప్పుడు 6,75,000 మంది చనిపోయారు. ప్రస్తుతం అమెరికాలో కొవిడ్‌ ‌కారణంగా 2,69,692 మంది మరణించారు. కేసుల సంఖ్య (నవంబర్‌ 28 ‌నాటికి) 1, 32,66,933.

వ్యాక్సిన్‌ ‌గురించి ప్రధాని ఆరా

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్‌ ‌పురోగతి గురించి స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో నవంబర్‌ 28 ‌శనివారం మూడు నగరాలలో పర్యటించారు. మొదట ప్రధాని నేరుగా ఢిల్లీ నుంచి అహమ్మదాబాద్‌ ‌వెళ్లారు. అక్కడే చంగోదరర్‌  ‌పారిశ్రామిక వాడలో ఉన్న జైడస్‌ ‌క్యాడిలా కర్మాగారానికి వెళ్లారు. టీకా అభివృద్ధి ఇతర అంశాలను పరిశీలించారు. ఈ సంస్థ జైకోచ్‌-‌డి పేరిట టీకాను రూపొందిస్తున్నది. ఆగస్ట్ ‌నుంచి రెండో దశ క్లినికల్‌ ‌ప్రయోగాలు కూడా జరుగు తున్నాయి. అహ్మదాబాద్‌ ‌తరువాత హైదరాబాద్‌ ‌వెళ్లారు.

మధ్యాహ్నం హైదరాబాద్‌లోని భారత్‌ ‌బయోటెక్‌ ఇం‌టర్నేషనల్‌ ‌యూనిట్‌ను సందర్శించారు. జీనోమ్‌ ‌వ్యాలీలోని ఈ సంస్థ ప్రాంగణంలో మోదీ గంట వరకు ఉన్నారు.

సాయంత్రం పుణే చేరుకుని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకాలతో కలసి టీకాను రూపొందిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యా లయం, ఔషధ తయారీ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి సంబంధించిన లైసెన్స్ ‌కోసం రెండు వారాలలో దరఖాస్తు చేస్తామని ప్రధాని పర్యటన పూర్తయిన వెంటనే సీరంకు చెందిన అడర్‌ ‌పూనావాలా వెల్లడించారు కూడా. అయితే ఎన్ని డోసుల వ్యాక్సిన్‌ ‌భారత ప్రభుత్వం తీసుకోబోతున్నది అన్న అంశం మీద ఇప్పటి వరకు ఏదీ లిఖితపూర్వక ఒప్పందం జరగలేదు. కానీ వచ్చే సంవత్సరం జూలై నాటికి 300 నుంచి 400 మిలియన్‌ ‌డోసులు తీసుకుంటారని అనుకుంటున్నారు.

రష్యాకు చెందిన సుత్నిక్‌ ‌వి కరోనా వ్యాక్సిన్‌ను ఇక భారత్‌లో తయారు చేయడానికి ఒప్పందం కుదిరింది. రష్యా డెరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌ఫండ్‌, ‌భారత్‌కు చెందిన హెటిరోతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చు కుంది. ఈ ప్రకారం సంవత్సరానికి పది కోట్ల డోసులకు పైగా తయారుచేస్తారు. వచ్చే ఏడాదే భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి ఆరంభం కానుంది.

రక్షణ, పర్యావరణం వంటి కీలక అంశాలతో పాటు కొవిడ్‌ ‌నివారణ విషయంలో కలసి పనిచేయాలన్న భారత్‌-ఇం‌గ్లండ్‌ ఒప్పందం గురించి కూడా నవంబర్‌ 28‌న ఒక సమీక్ష జరిగింది. ఈ విషయం మీద బ్రిటన్‌ ‌ప్రధాని బోరిస్‌ ‌జాన్సన్‌, ‌మోదీ చర్చించారు. వేగవంతం చేయాలని కూడా అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో మూడోదశ

సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వ నిస్సహాయత గురించి చెప్పడంలో ఆశ్చర్యం కనిపించదు. మరొకసారి ఢిల్లీలో కరోనా స్వైర విహారం ఆరంభించింది. యూరోపియన్‌ ‌దేశాలలో కొవిడ్‌ 19 ‌రెండో దశ నడుస్తున్నది. కానీ ఢిల్లీలో మూడో దశ నడుస్తున్నది. చలిగాలులు, వాతావరణ కాలుష్యం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. మార్చి, మే నెలల్లో కరోనా మరణాలు బాగా పెరిగినా జూన్‌ ‌నాటికి తగ్గాయి. మళ్లీ ఇప్పుడు పెరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలు హరియాణా, పంజాబ్‌, ‌రాజస్తాన్‌లలో పంట వ్యర్థాలు తగుల బెట్టడం వల్ల దేశ రాజధాని నగరం వాయు కాలుష్యానికి గురవుతున్నది. ఈ గాలి, శీతలం కలసి రోగుల సంఖ్యను, మరణాల సంఖ్యను పెంచు తున్నాయి. మళ్లీ ఆస్పత్రుల మీద ఒత్తిడి పెరుగు తున్నది. జూన్‌-‌జూలై మాసాలలో ఒక్కరోజులో అత్యధికంగా నమోదైన మృతుల సంఖ్య 101. కానీ మూడో దశ ఆరంభమైన తరువాత ఒక్క నవంబర్‌ 18‌న 131 కేసలు నమోదై అందరినీ కలవర పెడుతున్నాయి. ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణలలో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయేమో కానీ, జాగ్రత్తల నుంచి వైదొలిగేటంతటి వెసులుబాటును ఇవ్వడం లేదు.

కరోనా బలులు

కరోనా కారణంగా ప్రపంచంలో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా కన్నుమూశారు. మన దేశంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ, ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్‌పి బాల సుబ్రహ్మణ్యం సహా ఎందరో రాజకీయ నాయకులు, కళాకారులు ఉన్నారు. ఇక వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు వందల సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారిలో ఉన్నారు.

సెప్టెంబర్‌కే విశ్వరూపం?

భారత్‌లో కరోనా పతాక స్థాయికి చేరుకోవడం అనేది సెప్టెంబర్‌, అక్టోబర్‌ ‌మాసాలలోనే జరిగిందని నిపుణుల అభిప్రాయం. మన దేశానికి సంబంధించిన ఏడుగురు శాస్త్రవేత్తల బృందం ఇలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. వచ్చే ఫిబ్రవరిలో కరోనా ఒక కొలిక్కి వస్తుందని కూడా వారు భావిస్తున్నారు. అయితే కొవిడ్‌ 19 ‌నిబంధనలు కచ్చితంగా పాటించినట్టయితేనే సాధ్యం కాగలదని కూడా చెబుతున్నారు. భారత్‌ ‌జనాభా ప్రపంచ జనాభాలో ఆరో వంతు. కానీ ప్రపంచంలో కరోనా కారణంగా మరణించిన వారిలో మనవారు పది శాతమే. సెప్టెంబర్‌లో దేశంలో కరోనా తారస్థాయిలో ఉందన్న నిర్ణయానికి వారు రావడానికి కారణం- అప్పటికి దేశంలో ఉన్న కేసులు పది లక్షలు పైనే. తరువాత  కేసులు నమోదు కావడం తగ్గింది. అక్టోబర్‌ ‌మొదటి వారానికి రోజుకు సగటున 62,000 కేసులు, 784 మరణాలు నమోదైనాయి. ఈ మరణాలు కూడా చాలా రాష్ట్రాలలో తరువాత బాగా తగ్గాయి. ఆ సమయంలోనే రోజుకు సగటున పది లక్షల మందికి వైరస్‌ ‌పరీక్షలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ శాస్త్రవేత్తల బృందంలో డాక్టర్‌ ‌గగన్‌దీప్‌ ‌కాంగ్‌ ఉన్నారు. లండన్‌లోని రాయల్‌ ‌సొసైటీకి ఎంపికైన తొలి భారతీయ శాస్త్రవేత్త ఆమె. హైదరాబాద్‌కు చెందిన ముతుకుమిల్లి విద్యాసాగర్‌ ‌కూడా ఈ బృందంలో పనిచేశారు. ఆయన కూడా రాయల్‌ ‌సొసైటీ సభ్యులే. భారత్‌లో కరోనా వైరస్‌ ‌వేగం, లక్షణాలు, మరణాల రేటు, కోలుకున్న వారి సంఖ్య, వీటి తీరుతెన్నులు వంటి అంశాల మీద గణాంకాలు తయారు చేశారు.

మార్చి ఆఖరివారం నుంచి దేశంలో అమలు చేసిన లాక్‌డౌన్‌ ‌కారణంగా ఎంత మేలు జరిగిందో కూడా ఈ బృందం వెల్లడించింది. లాక్‌డౌన్‌ ‌గురించి అంత వేగంగా నిర్ణయం తీసుకోకపోయినట్టయితే కేసులు కోటీ నలభయ్‌ ‌లక్షలకు చేరుకుని ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే మరణాలు కూడా కనీసం 26 లక్షలు ఉండేవని వారు చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్న లెక్కలకు 23 రెట్లు అధికంగా ప్రాణనష్టం వాటిల్లేది. అయితే వలస కార్మికుల గురించి ఈ బృందం చెప్పిన అంశాలు విస్తుపోయే విధంగా ఉన్నాయి. బిహార్‌, ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్రాలలో సేకరించిన గణాంకాలను బట్టి, ఎలాంటి పరీక్షలు లేకుండా వలస కార్మికులు స్వరాష్ట్రాలకు చేరుకున్నప్పటికీ కేసుల సంఖ్య అసాధారణంగా పెరగడానికి కారణం కాలేదని చెప్పారు. మార్చిలో ఆరంభమైన కరోనా కేసులు జూన్‌ ‌నాటి తారస్థాయికి చేరుకోవడం ఆరంభమైంది. దీనితో జూన్‌, ‌జూలై మాసాలలో ఆస్పత్రుల మీద ఒత్తిడి పెరగడం, ప్రజలలో భయాందోళనలు తీవ్రం కావడం వంటి పరిణామాలు సంభవించాయి. పండుగల సమయంలో కుటుంబ సభ్యులంతా కూడినప్పుడు కూడా అవి సూపర్‌ ‌స్ప్రెడర్‌లుగా మారలేదని కూడా ఆ బృందం వెల్లడించింది. అయితే ఈ బృందానికి చెందని కొందరు శాస్త్రవేత్తలు భారత్‌లో నవంబర్‌కు మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు అదే కనిపిస్తున్నది. ఇందుకు ఇక్కడి చలి కారణంగా వారు భావించారు. ఇప్పటికి కూడా భారత్‌లో వైరస్‌ ‌నిరోధం అనేది వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా జాగ్రత్తల మీదనే ఆధారపడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిత్యం వైరస్‌ ‌గురించిన స్పృహ అనివార్యమేనని అంటున్నారు.  శానిటైజర్‌, ‌మాస్క్, ‌సామాజిక దూరం నిబంధన ఇప్పుడే విడిచిపెట్టే అవకాశం ఏమాత్రం లేదు.

చైనా కొత్త కుట్ర

దేశంలో కరోనా నిరోధక వ్యాక్సిన్‌ ‌పురోగతి గురించి మోదీ మూడు ఔషధ సంస్థలను సందర్శిస్తున్న సమయంలోనే, అంటే 28వ తేదీనే చైనా కొత్త పల్లవి అందుకుంది. 2019 వేసవిలో భారత్‌లోనే కరోనా వైరస్‌ ‌జనించిందని ఆ దేశ శాస్త్రవేత్తలు కొందరు నిర్ధారించినట్టు అక్కడి మీడియాలో కథనం వెలువడిందని వియోన్‌ (‌వెబ్‌ ‌టీమ్‌) ‌చానల్‌ ‌తెలియచేసింది. కరోనా పుట్టుక గురించి ఆ దేశం ఎదుర్కొంటున్న ఆరోపణను ఏదో విధంగా, వేరే ఏదో దేశం మీదకు నెట్టి వేయాలన్న తలంపుతో ఉంది. మొదట యూరప్‌లో ఈ వైరస్‌ ‌ప్రబలిందని చైనా చెప్పింది. ఇప్పుడు ఆ దేశ పరిశోధకులు భారత్‌ ‌మీద నెపం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారత్‌లోనే ఆ వైరస్‌ ‌జంతువుల నుంచి మురికి నీళ్ల ద్వారా మనుషులకు వ్యాపించి ఉండవచ్చునని తెలివిగా చెబుతున్నారు. గుర్తు తెలియని ఎవరి ద్వారానో ఊహాన్‌కు వచ్చిందని, ఫలితంగా వైరస్‌ ఆచూకీ అక్కడ కనుగొన్నారని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌-‌చైనాల మధ్య విభేదాలు పరాకాష్టకు చేరిన సమయంలో ఈ కొత్త వార్తను చైనా మీడియా వదిలిపెట్టింది. నిజానికి ఈ శాస్త్రవేత్తల కంటే చాలా ముందే చైనా అధికారులు వైరస్‌ ఇటలీలో జనించిందని ఆరోపించిన సంగతి గుర్తు చేసుకోవాలి. ఇటలీలో పుట్టి తరువాత యూరప్‌ అం‌తటా వ్యాపించి, అక్కడ నుంచి అమెరికా చేరిందని విశ్లేషించారు.

అయితే ఆనాడు చైనా అధికారులు చేసిన ఈ సూత్రీకరణకి ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు భారత్‌ ‌ద్వారా చైనాకు చేరి ఉండవచ్చునన్న కొత్త సూత్రీకరణకు ఫైలోజెనిటిక్‌ ‌విశ్లేషణను ఉపయోగించుకున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే వైరస్‌ ఊహాన్‌లో కనిపించినా అది చైనాలో జనించింది కాదనీ, ఇతర దేశాల నుంచి వచ్చాక ఇక్కడ బయటపడిందనీ నమ్మించడానికి ఒక సరికొత్త వితండవాదం తీసుకువస్తున్నదన్నమాట. ఊహాన్‌కు వైరస్‌ ‌చేరడం అనేది బంగ్లాదేశ్‌, అమెరికా, గ్రీస్‌, ఆ‌స్ట్రేలియా, భారత్‌, ఇటలీ, చెక్‌ ‌రిప్లబిక్‌, ‌రష్యా లేదా సిరియాల నుంచి చైనాకు చేరిందని ఆ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారట. తాజాగా భారత్‌, ‌బంగ్లాలు చైనాలోకి వైరస్‌ను ఎగుమతి చేశాయని అంటున్నారు. అదెలా అంటే, ఆ రెండు దేశాలలోను వైరస్‌ ‌విస్తరణ తక్కువగా ఉందట. పైగా ఇరుగు పొరుగు దేశాలు. కాబట్టి అక్కడ నుంచే ఊహాన్‌కు వచ్చిందని చెబుతున్నారు. భారత్‌లో ఉన్న నాసిరకం వైద్య విధానం, యువతరం కొంతకాలం పాటు ఈ వైరస్‌ ఉనికిని గమనించకుండా కొన్ని మాసాల పాటు మిన్నకుండి, అది విస్తరించడానికి దోహదం చేశారని కూడా చైనా ఆరోపిస్తున్నది. నిజానికి ఇప్పటికీ ప్రపంచం నమ్ముతున్న విషయం- 2019 డిసెంబర్‌లో చైనాలోని ఊహాన్‌ ‌నగరంలోనే కొవిడ్‌ 19 ‌జనించింది. ఈ విషయాలు వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులను ఆ దేశం జైల్లో పెట్టింది. ఈ మొత్తం వ్యహారానికి కొసమెరుపు- ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేసే ఒక నిపుణుడు 28వ తేదీనే ఒక ప్రకటన చేయడం. దాని ప్రకారం చైనాలో ఈ వైరస్‌ ‌జనించలేదని చెప్పడం మరీ ఊహాజనితం అంటూ అతడు కుండబద్దలు కొట్టాడు. వెంటనే భారత్‌ను బలిపీఠం ఎక్కించే ఉద్దేశంతో చైనా ఈ కొత్త పల్లవి అందుకుంది. అసలు కొవిడ్‌ 19 ‌పుట్టిల్లు ఏది అన్న అంశం మీద మొదలైన దర్యాప్తు వేగవంతం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందుకే చైనా కొత్త వాదాన్నీ,కుట్రనీ రచించింది. ఊహాన్‌ ‌నగరంలోనే ఒక సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ ‌ద్వారా న్యూమోనియా రూపంలో ఇది విస్తరించింది. కానీ ఊహాన్‌లో ఇది ఉందని తెలియడానికి ముందే యూరప్‌లో ఉందని చైనా అంటున్నది.

About Author

By editor

Twitter
YOUTUBE