– దేశరాజు
శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది
భార్యలందరిలోకీ పతివ్రతా శిరోమణి ఎవరూ అంటే కమ్యూనిస్ట్ భార్యేనని కొడవటిగంటి కుటుంబరావు ఎందుకు చెప్పలేదో ఆమెకు అర్థంకావడం లేదు. పురాణాల్లోని ధర్మపత్నులకు కమ్యూనిస్ట్ భార్యలు ఏమాత్రం తీసిపోరన్నది ఆమె అనుభవం మీద తెలుసుకున్న సత్యం. సత్యం గురించి ఎంతోమంది ఏదేదో చెప్పొచ్చు. కానీ, అనుభవ పూర్వకమైన సత్యం నిలువునా దహించేస్తుంది. అదిగో అలాంటి మంటల తీవ్రతలోనే ఉందామె.
అలా జ్వలించిపోతూ.. ఆలోచనలతో రగిలిపోతూ.. సోఫాలో కూలబడిన భార్యను చూసి..
‘‘కాఫీ తాగుదామా’’ అని అడిగాడు భర్త.
‘‘అంటే, నేను కలపాలా?’’
‘‘కాదు..’’
‘‘ఏంటి కాదు? కాఫీ ఏమైనా విషమా? తాగితే సచ్చిపోతామా? పోనీ ఇప్పుడే తాగామా? మళ్లీ తాగుతానా? అని సందేహపడటానికి’’ అంది రుసరుసగా.
ఆ రుసరుసలన్నీ మామూలే కాబట్టి అతను నిశ్శబ్దంగా వంటింట్లోకి వెళ్లిపోయాడు.
ఆమెకు ఇందాకటి సంఘటనే గుర్తుకు వస్తోంది. వెళ్లక, వెళ్లక ఎన్నో రోజుల తర్వాత.. రోజులేమిటిలే ఏళ్లే గడిచిపోయాయి. స్నేహితురాలింటికి వెళ్లింది. గతంలో ఆమె పార్టీ మహిళా విభాగంలో పనిచేసేప్పుడు పరిచయం. ప్రదర్శనల్లో పాల్గొనడంలో, నినాదాలు ఇవ్వడంలో.. ఆమె దూకుడుగా ఉండేది. దానికి ఆకర్షితులై అప్పుడప్పుడే కవిత్వం, అదీ రాస్తున్న కొంతమంది ఆమె వెంటబడేవారు. వీళ్ల బృందంలో కథలు, కవితలు రాసేవాళ్లు చాలామందే ఉండేవారు. కానీ, బాగా రాస్తుందని తనతో చాలా చనువుగా ఉండేది. ఆమె హైదరాబాద్‌లోనే ఉంటోందని తెలిసినా, ఒకట్రెండుసార్లు ఏవో మీటింగుల దగ్గర కలుసుకున్నారేగానీ.. ఇంటికి వెళ్లడం పడలేదు. ఇవాళ అనుకోనివిధంగా కలుసుకున్నారు. స్నేహితురాలి బలవంతం మీద ఇంటికి వెళ్లింది.
ఇల్లంటే ఏదో మామూలుగా ఉంటుందని అనుకుంది. ఆమె ఊహకు అందని రీతిలో ఉంది. అవ్వడానికి మూడు బెడ్రూమ్‌లే అయినా చాలా రిచ్‌గా డెకరేట్ చేశారు. గోడల మీద పెయింటింగ్స్, హాలులో చెక్క, రాతి శిల్పాలు.. ఇవే ఆమెను ఆశ్చర్యపోయేలా చేస్తే, ఇక టీవీని చూసి దిమ్మతిరిగిపోయింది. సోనీ టీవీ.. బహుశా ఏ ఫిఫ్టీ ఇంచెస్సో అయ్యుంటుంది-అంత పెద్దగా ఉంది మరి. అన్ని గదులకీ అందమైన ఫాల్స్ సీలింగ్. ఓ మూలన అందమైన తీగలతో అల్లి, కలరింగ్ చేసిన గణపతి బొమ్మ. అది ఈశాన్య మూల అని ఆమె గ్రహించింది. బాల్కనీలో అందమైన మొక్కలు. అన్నీ దగ్గరుండి చూపించింది.
‘దానికి నోరు జాస్తీ’ అని ఆమె గురించి దగ్గర వాళ్లు కామెంట్ చేయడం తెలుసు. అటువంటి ఆమె ఇంత ఆర్భాటంగా ఇంటిని అలంకరించుకుని ఉత్తమ ఇల్లాలు అవార్డు కొట్టేస్తుందని అస్సలు అనుకోలేదు.
ఇంతలో ఆమె ‘‘అయ్యో.. అప్పుడే ఆరు దాటేస్తోంది’’ అనడంతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చి, ‘‘ఏం? ఎవరైనా వచ్చేదుందా?’’ అని అడిగింది.
‘‘ఎవరొస్తారు? దూరం కదా, బంజారాహిల్స్ అంటే. ముందు అసలు అడ్రస్ పట్టుకోవడమే చాలా కష్టం. సాధారణంగా ఎవరైనా ఫోన్‌లోనే..’’ అందామె.
ఆమె వెనకే నడుస్తూ వంటింట్లోకి వెళ్లింది. స్నేహితురాలు నాలుగు బన్నర్ల స్టౌ వెలిగించి, గిన్నెలో నీళ్లు పెట్టి.. పైన చిమ్మీ ఆన్ చేసింది. స్టౌ వెలుగు తున్నా మంట కనబడకపోవడం గురించి వింది, కానీ ఇప్పుడే చూడటం.. అయినా ఆ ఆశ్చర్యాన్ని బయటకు కనబడనీయలేదు.
‘‘మామూలుగా పనమ్మాయి ఉంటుంది, మన ఊరేలే. దానికేదో పనుందని రెండ్రోజుల్నించి రావడం లేదు. ఆయనకి గంటకోసారి కాఫీయో, టీయో పడకపోతే బుర్ర పని చేయదు’’ అంది.
ఆమె ఆశ్చర్యంగా ‘‘ఉన్నడా? సారీ.. ఉన్నారా? ఎక్కడా కనిపించనేలేదు?’’ అంది ఆశ్చర్యంగా.
‘‘నువ్వు మరీనూ. ఉన్నారా ఏంటి?’’ అని నవ్వి ‘‘చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీలో ఉన్నాడు. ఏదో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాడు. బిజినెస్ వ్యవహారాల్లో తను చాలా సీరియస్‌గా ఉంటాడు. లేకపోతే మనల్ని బతకనివ్వరంటాడు’’ అంది. మరో గిన్నె తీసుకుని పక్క బాస్కెట్‌లోంచి చేమగడ్డలు తీసి అందులో వేస్తూ ‘‘ఆర్గానిక్‌వి, మరీ అంత ఖరీదేం ఉండవు. వీటితో ఫ్రై అంటే తనకెంతిష్టమో’’ అంది.
‘‘అవును, వ్యాపారం అన్నాక జాగ్రత్తగానే ఉండాలి’’ అంది తను, ఏమనాలో తెలీక.
కాఫీ కలిపి హాల్లోకి వచ్చేసరికి అతను కూడా వచ్చాడు. వస్తూనే చాలా ఆప్యాయంగా పలకరించాడు. దగ్గరగా వచ్చి, ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి, తల ఆన్చి ఆలింగనం చేసుకున్నాడు. ముగ్గురూ అనేక విషయాలపై గడగడ మాట్లాడేసు కున్నారు. అమెరికా సామ్రాజ్యవాదం, చైనా దూకుడు, భారత్‌లో మత ఛాందసత్వం, వారి ఉద్యోగాలు, పిల్లలు, వారి అల్లరి, చదువులు ఒకటేమిటి అన్నీ బడబడా దొర్లిపోయాయి.
వద్దంటున్నా వినకుండా అతను ఆమెను పంజాగుట్ట వరకు కారులో డ్రాప్ చేసి, బస్ ఎక్కించాడు. ‘అబ్బ ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత మంచి వాళ్లు, ఎప్పుడూ అంత సంతోషంగా ఎలా ఉంటారో’ అనుకుంటూ వాళ్ల గురించి బస్‌లో ప్రయాణిస్తున్నంతసేపూ మెచ్చుకుంటూనే ఉంది.
ఇంటి దగ్గరకు వచ్చాక ఫోన్ చేసింది-‘జాగ్రత్తగా చేరా’నని. కానీ, స్నేహితురాలు ‘‘ఏ కారులో తీసుకెళ్లాడు?’’అని అడిగేసరికి అవాక్కయ్యింది.
‘‘అదేంటి? రెండు కార్లున్నాయా?’’ అని. ‘‘ఏమో, ఏ కారో చూడలేదు. బ్లాక్ కలర్‌లో ఉంది’’ అంది.
‘‘ఓహ్.. అనుకున్నా. మన అనుకున్నవాళ్లందరినీ అతను రేంజ్ రోవర్‌లోనే డ్రాప్ చేస్తాడు’’ అని గలగల నవ్వి, ‘‘సరే, తీరుబడిగా ఉన్నప్పుడు ఫోన్ చెయ్, ఇటు వచ్చినప్పుడు కలుస్తూండు’’ అంది.
ఫోన్ కట్ చేస్తూ, అపార్ట్‌మెంట్ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ‘ఒకప్పటి రెబల్ స్టార్ అంత అణకువగా ఎలా మారిపోయింది? ప్రతిదానికీ స్త్రీల హక్కులూ, అధికారాలు, ఆత్మవిశ్వాసం అనే ఆమె అంత మామూలు ఇల్లాలిలా ఎలా మారిపోయింది?’ అని ఆమెకు సందేహం వచ్చింది.
ఇంట్లోకి వచ్చి భర్త ఇచ్చిన కాఫీ తాగుతూ స్నేహితురాలింటికి వెళ్లిన విషయం చెప్పింది. అతను స్పందనగా ఓసారి ఆమె ముఖంలోకి చూసి ఊరుకున్నాడు.
‘‘అబ్బ.. వాళ్ల ఇల్లు ఎంత బావుందో తెలుసా. బానే సంపాయిస్తున్నారు. బంజారాహిల్స్‌లో సొంత ఇల్లు, రెండు పెద్ద కార్లు, ఆ ఇంటి మెయింటైనెన్స్.. వాళ్లబ్బాయి కూడా గచ్చీబౌలిలోని ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడుట’’
‘‘ఊహూ..’’ అన్నాడతను ఏదో ఆలోచిస్తూ.
‘‘ఊహూ.. కాదు. ఆమె ఎంత మారిపోయిందో తెలుసా? అసలు అప్పట్లో ఫెమినిజమనీ, రాడికల్ ఫెమినిజమనీ ఎన్ని చర్చలు జరిపేది? ఆ ఆవేశంతోనే కదా లోపలికి పోయింది. ఇప్పుడేంటో ‘ఇలా అయితే అతనికి నచ్చదు, అలా అయితేనే అతనికి ఇష్టం’ అంటోంది’’ అని తన మనసులోని మాటను బయట పెట్టింది. మళ్లీ తనే ‘‘పోనీ అభిప్రాయాలు ఏమైనా మారాయా అంటే.. అదీ లేదు. అప్పటిలాగే మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. అలా ఎలా సాధ్యం అన్నదే నాకు అర్థం కావడం లేదు’’ అంది.
అతను సీరియస్‌గా ఓసారి చూసి ఊరుకున్నాడు. అతడు తొందరపడి ఏదీ మాట్లాడడు. అందుకనే ఏవైనా సైద్ధాంతికమైన సందేహాలు, సమస్యలు వచ్చినప్పుడు పాత మిత్రులు ఆయనను సంప్రదించి సలహాలు తీసుకుంటూ ఉంటారు.
ఆమె కూడా మౌనంగా ఉండి పోయింది. ఆ మౌనంలోనే కొడుకు గుర్తుకు వచ్చాడు. ‘ఇంట్లో మీరిద్దరూ ఎప్పుడూ కీచులాడుకుంటూ వుంటే.. నాకు చదువుకోవడానికి కాదు. నేను హాస్టల్లో ఉంటా’నని ఎంత బతిమాలినా వినకుండా వెళ్లిపోయాడు. తెలివైనవాడు, మార్కులు బాగానే వచ్చాయి. కానీ తగినన్ని రాలేదు. అందుకు ఇంట్లోని ఘర్షణ వాతావరణం, ఇరుకుదనం కూడా కారణమా? నేనేమైనా కావాలని గొడవ పడతానా? అనుకుంది ఓ క్షణం. ‘మరి వాళ్లెందుకు గొడవ పడరు. తమ సొంత హక్కుల కోసం పోట్లాడరు. అణిగిమణిగి.. అన్నిటికీ తలూపుతూ ఎలా ఉంటారు?’ అనుకుంది మరుక్షణం.
కొంతమంది స్నేహితులను కలిసి వచ్చినప్పుడల్లా ఆమెలో ఈ ఘర్షణ మామూలే.
అతను తన మాటకు తలూపడం ఎలా వున్నా, చుట్టుపక్కలవారి దృష్టిలో తాము కొంత చులకన అవుతున్నామేమోనని కూడా ఆమెకు అనుమానంగా ఉంది. వాళ్లుండేది ఓ ఐదంతస్తుల మిడిల్ క్లాస్ అపార్ట్‌మెంట్. మెయిన్ డోర్ తెరుచుకున్నప్పుడే కాదు, కిటికీల్లోంచి కూడా ఒకరి ఇళ్లు ఒకరికి కనిపిస్తూనే ఉంటాయి. ఆయన వంట చేస్తుండగా చూసి, ఏదో అడగడానికో, మాట్లాడటానికో వచ్చిన చుట్టుపక్కల ఆడవాళ్లు గబగబా వెనక్కు వెళ్లిపోవడం తెలుసు. ఒకసారి అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ భార్యతో మాట్లాడుతుంటే, తను కాఫీ తెచ్చిచ్చాడని ఆమె ఎంతో ఫీలైపోయింది. ‘సరే వీళ్లంటే తరతరాలుగా అలవాటు పడిపోయారు. వాళ్లకేమైంది?’ అనుకుంటూ మళ్లీ మొదటికి వచ్చింది.
డైలీ సీరియల్ రీకాప్‌లా, స్నేహితురాళ్లంతా ఒక్కసారిగా కళ్లముందు నిలిచారు. చాలామంది భర్తల అడుగులకు మడుగులు వత్తుతూనే ఉన్నారు. కాకపోతే అదేదో అణిగిమణిగి చేస్తున్నట్టు కాక; చాలా మామూలుగా, స్నేహంగా, బాధ్యతగా చేస్తున్నట్టు చేస్తారు. అది ధర్మమనీ, ఆచారమనీ, సంస్కృతనీ అనరు. కాపురం అన్నాక సర్దుకుపోవాలి అనరు గానీ, సాహచర్యంలో కలిసిమెలిసి ఉండకపోతే ఎలా అంటారో, ఏమో? డైలీ సీరియల్స్‌లో ఒకే మగాడిని మొగుడిని చేసుకోవడానికి ఇద్దరో, ముగ్గురో పోటీ పడ్డట్టు తమ మొగుడిని-అదే సహచరుడిని- ఎవరైనా ఎగేసుకుపోతారనేమోనన్నట్టు మొగుళ్ల పేర్లు తమ పేర్లకు తగిలించుకుని గర్వంతో మురిసిపోతుంటారు. చర్చకు వస్తే తమ మేధావితనాన్నంతా చాటుకుని దాటేస్తారు.
డైలీ సీరియల్ అంటే గుర్తుకు వచ్చింది. క్షణం తీరికలేదనే స్నేహితుల్లో కొంతమంది ఈ డైలీ సీరియల్స్ కూడా చూస్తారని తెలిసి ఆమె తెగ ఆశ్చర్యపడిపోయింది. ‘ఏదో కాలక్షేపం కోసం’ అని కొందరూ, ‘మా అత్తగారికి చాలా ఇష్టం ఆ సీరియల్, అందుకని అదొక్కటి..’ అని ఇంకొందరూ, ‘సమాజంలో ఏం జరుగుతోందో, అందరూ ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే చూడొద్దా’ అని అతి తెలివితో మరికొందరు ప్రశ్నించడం ఆమెను పూర్తిగా అయోమయంలో పడేసింది.
ఆమె ఇలా అయోమయంలో కొట్టుమిట్టాడు తుండగా భర్త వచ్చి‘‘డిన్నర్ రెడీ చేయనా?’’ అన్నాడు.
‘‘చెయ్యి. నన్నడగడమెందుకు?’’ అంది అలవాటుగా. కానీ, అందులో ఇంతకుముందటి విసురు లేదు. రెగ్యులర్‌గా వంటావార్పూ అతనే చేయడు. మూడ్‌ని బట్టీ, ఆఫీసుల నుంచి రావడాన్ని బట్టీ ఎవరో ఒకరు చేస్తారు. కాకపోతే, ఆమె తను చేద్దామనుకున్నదే చేస్తుంది. అతడు మాత్రం ఆమెను అడిగి చేస్తాడు. అతను కిచెన్‌లోకి వెళ్లిన కాసేపటికి, తను కూడా వెళ్లింది. ఎందుకో అతడు అంత హుషారుగా ఉన్నట్టు కనిపించలేదు. ‘‘ఏం చేస్తున్నావ్? బాగా ఆకలిగా ఉందా?’’ అని అడిగింది. అతడు సమాధానం చెప్పేలోగానే ‘‘నాక్కొంచెం పనుంది. మా ఫ్రెండ్‌ని కలిసి వస్తా. వచ్చేప్పుడు బయటి నుంచి తెచ్చెయ్యనా?’’ అంది. అతను అంగీకారంగా తలూపాడు.
ఆమె చున్నీ తీసుకుని బయల్దేరింది. వాళ్లు ఉండే ఏరియా నుంచి మెయిన్ రోడ్ మీదకు వెళితే అక్కడే పక్క సందులో ఆమెకొక స్నేహితురాలుంది. ఇద్దరూ ఒకే వయసువారు కావడం, ఆర్థిక పరిస్థితి కూడా దాదాపుగా ఒకటే కావడంతో సాన్నిహిత్యం ఎక్కువ. ఆ స్నేహితురాలు కూడా ఒకప్పుడు బాగా విస్తృతంగా రాసేది. తరువాత మానేసింది. కానీ, ఇప్పటికీ బాగా చదువుతూనే ఉంటుంది.
ఆమె ఉండే అపార్ట్‌మెంట్ అంత దూరంలో ఉండగానే స్నేహితురాలు బయటకు వస్తూ కనిపించింది.
‘‘ఏంటిలా?’’ అంది తనను చూడగానే.
‘‘ఊరికే.. ఆయనకు వండే ఓపిక లేదన్నాడు, నాకెలాగూ ముందే లేదు. అందుకే పార్సిల్ తీసుకుపోదామని వచ్చా. మధ్యలో నిన్నోసారి పలకరిద్దామని ఇటు తిరిగా’’ అంది నవ్వుతూ.
ఇద్దరూ పక్క వీధిలో ఉన్న పార్క్ దగ్గరకు వెళ్లి, మిక్చర్ కొనుక్కుని లోపలికి వెళ్లి ఓ పక్కన కూర్చున్నారు. ఆ మాటా, ఈ మాటా పూర్తయ్యాక ఆమె తనలోని ఘర్షణను బయటపెట్టింది.
‘‘నిజమే. వీళ్ల సొంత జీవితాల్లో ఇలా సర్దుకుపోతూ ఎదుటివాళ్లకు మాత్రం నీతులు ఎలా చెబుతారో నాకూ అర్థం కాదు. మామూలుగా ఏవీ తెలియని మా వదినలుగానీ, అక్కలుగానీ అప్పుడప్పుడైనా మొగుడిని విసుక్కుంటూ, సణుక్కుంటూ ఉంటారు. కానీ, వీళ్లు అస్సలు నోరే మెదపరు. అది నాకు చాలా పెద్ద ఆశ్చర్యం అబ్బా..’’ అంది స్నేహితురాలు. మళ్లీ తనే ‘‘అందరూ అలా ఏం లేరులే. తక్కువగానే అయినా కొందరు విలువలకు కట్టుబడి పోరాడుతూ జీవితాలను ఈడ్చుకొస్తూనే ఉన్నారు. విషాదం ఏమిటంటే, వారికి పెద్దగా గుర్తింపు ఉండదు. మళ్లీ వాళ్లు చేసే రచనలను మాత్రం గౌరవిస్తారు. విలువలను ఏమాత్రం ఆచరించరు. అయినా, ఇదంతా ఓ పెద్ద చర్చబ్బా.. ఒకరకంగా చెప్పాలంటే పనికిమాలిన చర్చని కూడా అనిపిస్తుంది’’ మిక్చర్ తినేసిన కాగితానికి చేతులు తుడుచుకుంటూ.
‘‘ఇంత అణిగిమణిగి మసలుకొనేవారు వరలక్ష్మీ వ్రతాలు, శ్రావణ శుక్రవారం నోములూ కూడా పడితే ఇంకా బావుంటుందిగా?’’ అంది కాస్త వెటకారంగా.
‘‘అంటే, ఏం? వ్రతాలే చేయాలా? అత్త పేరు చెప్పో, ఆడపడచు వచ్చి చూపించమందనో, అమ్మకు ఇష్టమనో గుళ్లు గోపురాలు తిరిగేవాళ్లు లేరా, మన వాళ్లలో? అయినా, ఇప్పుడు చాలామంది లక్షణంగా బొట్లు పెట్టుకోవడంలే. కొందరు మెడలో నల్లపూసలు కూడా వేసుకుంటున్నారు. అటువంటి వాళ్లదే డామినేషన్ అంతా’’ అంది స్నేహితురాలు యథాలాపంగా.
‘‘పోనీ అని వీళ్లను పూర్తిగా ఈసడించుకోవడానికీ లేదు. వీళ్లలో కొంతమందైనా బాధితులకు అండగా నిలుస్తూనే ఉన్నారు. వారిని ఆర్థికంగా ఆదుకోవడమో, పోలీసులు, లాయర్ల సహాయం అందేలా చూడటం వంటివి చేస్తూనే ఉన్నారుగా’’ అందామె. ఆమె కన్ఫ్యూజన్ ఒక పట్టాన తొలగేలా లేదు.
‘‘అదే నాకూ అర్థంకానిది. ఈ ద్వంద్వ వైఖరి ఎలా సాధ్యం అని? ఒకోసారైతే, మనమే వాళ్లను సరిగా అర్థం చేసుకోవడం లేదేమోనని కూడా అనిపిస్తుంది. మనం మాత్రం వాళ్లకంటే ఏమంత భిన్నంగా ఉన్నామని? వాళ్లు గతంలో చేసిన త్యాగాలు, ఇప్పుడు చూపుతున్న ఔదార్యంతో పోల్చుకుంటే మనం ఎంత? దానికితోడు ‘వ్యక్తుల ప్రైవేట్ జీవితాలు వారివారి సొంతం’ అని ఎప్పుడో నిర్ణయించేశారుగా’’
‘‘అంటే వారి ద్వైతాన్ని ప్రశ్నించే అద్వైతం తగదంటావ్?’’ అంది కాస్త నిర్లిప్తంగా.
‘‘అలా అననుగానీ, మన పని మనం చేద్దాం. చేతనైన సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, తోచింది రాద్దాం. అయినా ఒక మాట చెప్పనా.. పట్టాలు దూరంగా ఉన్నా సమాంతరంగా సాగితేనే ప్రయాణం సాఫీగా సాగేది. లేకపోతే బండి పట్టాలు తప్పుతుంది. అయినా, అర్థం చేసుకునే భర్త ఉన్నప్పుడు ఘర్షణ పడాల్సిన అవసరం ఏముంది? ఓసారి శాంతంగా ఆలోచించు. ఇల్లు ప్రశాంతంగా ఉండా లంటే మనవంతుగా మనం కాస్త అవగాహనతో సాగాలి. పైగా మన మొగుళ్లుకూడా పాపం దుర్మార్గు లేం కాదు కదా’’ అంది స్నేహితురాలు అనునయంగా.
‘‘అంటే పతివ్రతలయందు కమ్యూనిస్ట్ పతివ్రతలు మేలయా అంటావ్’’ అందామె.
‘‘పోనీలే.. నువ్వు ఎలా అనుకుంటే అలా. అలా అనుకునైనా, ఆచరించావనుకో నువ్వు అటు ఆదర్శ అభ్యుదయవాదిగా, ఇటు అభ్యుదయ ఆదర్శ గృహిణిగా ఇంటా బయటా అవార్డులు, రివార్డులు కొట్టేయడం ఖాయం’’ అంది స్నేహితురాలు లేచి నవ్వుతూ.
‘‘నాకేం అవార్డులు, రివార్డులు అక్కర్లేదు. నా కొడుకు ఇంటికి వచ్చెస్తే అంతే చాలు’’ అందామె.
‘‘చూశావా మనం ఏ మాత్రం మారలేదు. మనకిప్పుడు కూడా ఈ కమ్యూనిస్టులే ఆదర్శ మయ్యారు’’ అంటూ పగలబడి నవ్వింది స్నేహితు రాలు. ఉత్తమ గృహిణిగా మారబోయే ముందు ఆమె కూడా ఓసారి స్నేహితురాలి నవ్వుతో మనస్ఫూర్తిగా శ్రుతి కలిపింది.