ఇరుగు పొరుగు దేశాలతో పేచీలకు దిగడం చైనాకు పరిపాటే. సరిహద్దుల్లో చొరబాట్లకు పాల్పడటం, వాటాకు మించి నదీజలాలను వాడు కోవడం, ఏకంగా నదీ గమనాన్నే మార్చడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. చిన్న దేశాలకు చేయూత పేరుతో రుణాలిచ్చి, వాటిని అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలా చేయడం, చివరకు ఆయా దేశాల ఆస్తులను చేజిక్కించుకోవడం ఇటీవల కాలంలో అనుసరిస్తున్న విధానం. శ్రీలంక ఇందుకు చక్కని ఉదాహరణ. తాజాగా నేపాల్‌, ‌భూటాన్‌ ‌సరిహద్దుల్లోకి చైనా చొచ్చుకురావడం తెలిసిందే. ఇరుగు పొరుగు దేశాలతో ఇచ్చిపుచ్చుకునే సామరస్య ధోరణికి బదులు దుందుడుకుగా వ్యవహరించడం దాని నైజం. అతిపెద్ద పొరుగు దేశమైన భారత్‌తోనూ వ్యవహరించే తీరు ఇంతకు మించి భిన్నంగా ఏమీ ఉండదు. అయితే ఎప్పటికప్పుడు భారత్‌ ‌దీటుగా స్పందిస్తుండటంతో చైనా మింగలేక కక్కలేక అసహనంగా, రెచ్చగొట్టే ధోరణితో ప్రకటనలు చేస్తుంటుంది.

తాజాగా బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చైనా ఏకపక్షంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని సామర్థ్యం 60వేల మెగావాట్లని చైనా ప్రభుత్వ విద్యుత్‌ ‌సంస్థ ఛైర్మన్‌ ‌యాన్‌ ‌ఝియాంగ్‌ ‌వెల్లడించారు. బ్రహ్మపుత్రను చైనాలో యార్లుంగ్‌ ‌జాంగ్బో అని పిలుస్తారు. టిబెట్‌లోని జాంగ్‌ ‌మూ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం మన ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ‌ప్రదేశ్‌కు కూతవేటు దూరంలో ఉంది. టిబెట్‌.. ‌చైనాలోని స్వయంపాలిత ప్రాంతం. అక్టోబరులో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. త్వరలో పీపుల్స్ ‌కాంగ్రెస్‌ ఈ ‌ప్రాజెక్టుకు ఆమోదం వేయనుంది. త్రీ గోర్జెస్‌ ‌ప్రాజెక్టు కన్నా ఇది పెద్దదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బ్రహ్మపుత్రపై బీజింగ్‌ అనేక చిన్నాచితకా జల, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది. ఫలితంగా భారత్‌ ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజా ప్రాజెక్టు నిర్మాణంతో భారత్‌కు అనేక కొత్త సమస్యలు ఎదురుకానున్నాయి. సాధారణంగా ఉభయ దేశాలకు సంబంధించిన నదులపై ఎలాంటి సాగు, జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టులు నిర్మించాలన్నా ముందుగా నది దిగువ దేశాలకు సంబంధిత సమాచారాన్ని అందజేయడం ఆనవాయితీ. నదీ జలాల్లో ఎవరి వాటా ఎంత, ప్రాజెక్టు నిర్మాణం వల్ల దిగువ ప్రాంతానికి కలిగే ఇబ్బందులు, పర్యావరణ సమస్యలు, వరద ఇబ్బందులపై ఉభయ దేశాల అధికారులు చర్చించు కుని ఒక అవగాహనకు రావడం సంప్రదాయం. దీనిని బీజింగ్‌ ఏనాడూ పాటించిన దాఖలాలు లేవు. ఎప్పుడూ ఏకపక్ష వైఖరే. ఒంటెత్తు పోకడే. నిర్ణయం తీసుకుని, పనులు ప్రారంభమైన తర్వాత ఆనోటా, ఈనోటా వినడం తప్ప అధికారికంగా పొరుగు దేశానికి సమాచారం అందించాలన్న, చర్చలు జరపాలన్న ఆలోచన ఏనాడూ చేసిన పాపాన పోలేదు చైనా.

చైనా చేపడుతున్న ఈ జల విద్యుత్‌ ‌ప్రాజెక్టు వల్ల భారత్‌కు అనేక ఇబ్బందులు కలగనున్నాయి. మూడు దేశాల మీదుగా (చైనా, భారత్‌, ‌బంగ్లాదేశ్‌) ‌ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి గతంలో ఊహించిన దానికంటే అధికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని తాజగా ఓ అధ్యయనం హెచ్చరించింది. ‘నేచర్‌ ‌కమ్యూనికేషన్స్’ అనే పత్రికలో కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రచురించిన కథనం ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. మానవ చర్యలతో తలెత్తే పర్యావరణ మార్పులే కాకుండా ఇతర కారణాలూ ఇందుకు దోహదం చేస్తున్నాయని ఆయా రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. 1956- 86 మధ్యకాలంలో బంగ్లాదేశ్‌ ‌ప్రాంతంలోని బ్రహ్మపుత్ర నదిలో సగటున సెకనుకు 41వేల క్యూబిక్‌ ‌మీటర్ల నీరు ప్రవహించింది. 1987-2004 మధ్య కాలంలో అదే నీటి ప్రవాహం 43వేల క్యూబిక్‌ ‌మీటర్లకు పెరగడం గమనార్హం. 1998లో నదికి వచ్చిన వరదలు అంతకుముందు కన్నా రెండింతలుగా ఉన్నాయి. తాజాగా చైనా చేపట్టే ప్రాజెక్టు వల్ల అనూహ్య వరదలు వచ్చే అవకాశం ఉంది. జలవిద్యుత్‌ ‌కోసం పెద్దమొత్తంలో నీటిని నిల్వ చేయడం, విద్యుదుత్పత్తి అనంతరం ఆ నీటిని ఒకేసారి విడుదల చేయడం వల్ల దిగువనున్న భారత్‌కు ఇబ్బందులు ఎదురవు తాయి. అదే సమయంలో భారీగా నీటిని నిల్వ చేయడం వల్ల దిగువప్రాంత రైతులు సాగునీరందక పంటలను కోల్పోయే ప్రమాదముంది. కరవు కాటకాలు సంభవించినప్పుడు ఉన్న కొద్దిపాటి నీటిని ఎగువనున్న చైనా బిగపడుతుంది. ఈ విషయాలను విస్మరించి, దిగువనున్న భారత్‌తో చర్చించకుండా చైనా ఏకపక్షంగా వ్యవహరించింది. చైనా తీరు వల్ల భారత్‌కు మాత్రమే కాకుండా దిగువనున్న బంగ్లాదేశ్‌కు సైతం సమస్యలు తప్పవు. బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతంలో బంగ్లాదేశ్‌లో పెద్దయెత్తున పంటలు పండిస్తున్నారు. ఈ నది వరదలు తరచూ ఆ దేశాన్ని ముంచెత్తుతుంటాయి. బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్‌లోనే బంగాళాఖాతంలో కలుస్తుంది. దిగువ దేశం అదే. అందువల్ల నష్టం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ విషయాలన్నీ చైనాకు తెలియనివి కావు. అయినప్పటికీ అంతర్జాతీయ సూత్రాలను, నిబంధనలను బేఖాతరు చేయడం బీజింగ్‌కు మాములైపోయింది.

కీలకమైన టిబెట్‌ ‌చైనా ఆధీనంలో ఉండటం వల్ల దక్షిణాసియాలోని ఏడు ప్రధాన నదులను నియంత్రించే అవకాశం చైనాకు లభించింది. దీంతో బీజింగ్‌ ఏకపక్షంగా ముందుకు వెళుతోంది. ప్రపంచంలోని 9 పెద్ద నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ప్రపంచంలోని పొడవైన నదుల్లో ఇది పదిహేనోది. సాగు, తాగునీరు అందించడంతోపాటు రవాణా సౌకర్యానికి నది ఉపయోగపడుతోంది. భారీగా జల విద్యుదుత్పత్తి చేపట్టడానికి అవకాశం ఏర్పడుతోంది. టిబెట్‌లో జన్మించిన బ్రహ్మపుత్ర అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లోకి ప్రవహిస్తోంది. అక్కడి నుంచి అసోంలోకి ప్రవేశిస్తుంది. అరుణాచల్‌‌ప్రదేశ్‌లో నదీ పరివాహక ప్రాంతం తక్కువే. మొత్తం కలిపి దాదాపు 35 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. అసోంలోనే నది పరివాహక ప్రాంతం ఎక్కువ. వరదలొస్తే నష్టం కూడా ఈ రాష్ట్రానికే అధికం. బ్రహ్మపుత్ర ఆధారంగా ఇక్కడ పెద్దయెత్తున పంటలు సాగవుతాయి. రాష్ట్రంలో నది చాలా వెడల్పుగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ నదికి ఈశాన్య వరప్రదాయని అన్న పేరుంది. వరదలు లేకపోతే బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో బంగారు పంటలే పండుతాయి. అసోం మీదుగా బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్‌లోకి చేరుతుంది. అక్కడ లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. తీస్తా, వేణి, పద్మ వంటి నదులు దీనికి ఉపనదులు.

చైనా ఎత్తుగడలను గమనించిన భారత్‌ ‌కూడా అదేస్థాయిలో దీటుగా స్పందించనుంది. బీజింగ్‌కు ప్రతిగా తన భూభాగంలో భారీ జలవిద్యుత్‌ ‌కేంద్రం నిర్మించాలని ప్రతిపాదించింది. దీని సామర్థ్యం పదివేల మెగావాట్లని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి టి.ఎస్‌. ‌మెహ్రా వెల్లడించారు. బ్రహ్మపుత్ర ఉప నది అయిన సియాంగ్‌పై అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లో 9.2 శతకోటి ఘనపుటడుగుల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్‌ ‌నిర్మాణ దిశగా కేంద్రం ముందుకు సాగుతోంది. దీనివల్ల తాగునీటిని నిల్వ చేసుకోవడంతో పాటు, విద్యుదుత్పత్తిని చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. వానాకాలంలో బ్రహ్మపుత్రకు 90 శాతం నీరు దాని ఉప నదుల నుంచే వస్తుంది. అందువల్ల నీటి కొరత సమస్య ఉత్పన్నం కానేకాదని నిపుణులు చెబుతున్నారు. జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టు వల్ల ఈశాన్య భారతంలో విద్యుత్‌ ‌కొరత సమస్యను అధిగమించవచ్చు. ఈ బహుళార్థసాధక ప్రాజెక్టు వల్ల ఈశాన్య భారతం సస్యశ్యామలమవుతుంది. పర్యావరణ ముప్పును తొలగించవచ్చు. కాలుష్యాన్ని నివారించవచ్చు. ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు మెరుగవుతాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ఈనాటిది కాదు. 1980 నుంచే దీని సాధ్యాసాధ్యాలు, ప్రయోజనాలపై చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి రాలేదు. తాజాగా చైనా ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనతో భారత్‌ ‌తన వద్ద గల పాత ప్రతిపాదనకు తెరదీసింది. సమయోచితంగా వెలుగులోకి తీసుకువచ్చింది.

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద గత ఏడెనిమిది నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఉభయ దేశాల సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో డ్రాగన్‌ ‌దుందుడుకు చర్యలను భారత దళాలు సమర్థంగా అడ్డుకుంటున్న నేపథ్యంలో బీజింగ్‌ ‌నిస్సహాయంగా మిగలిపోయింది. గడ్డకట్టే చలిలో సైతం పోరాడే దళాలను సరిహద్దుల్లో భారత్‌ ‌మోహరించడంతో బీజింగ్‌ ‌కంగుతిన్నది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చింది టిబెట్‌లో చైనా జలవిద్యుత్‌ ‌కేంద్రం నిర్మాణం. చైనా యాప్‌లను నిషేధించడం, చైనా బజార్లను నియంత్రించడం, చైనా కంపెనీలపై నిషేధాల కారణంగా బీజింగ్‌ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవలే భారత్‌ ‌నుంచి బియ్యం దిగుమతికి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల నుంచి భారత్‌ ‌నుంచి బియ్యం దిగుమతులపై చైనా నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇటీవలే ఆ నిషేధాన్ని తొలగించింది. మయన్మార్‌, ‌వియత్నాం తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్‌ ‌విషయంలో మాత్రం ఇప్పటివరకూ నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇటీవలే తన మనసు మార్చుకుంది. మన్ముందు మన దేశం నుంచి చైనాకు బియ్యం ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టు అంశం తెరపైకి రావడంతో బియ్యం ఎగుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అంత ఇబ్బంది లేదని, ఒకదానితో మరొక దానిని ముడి పెట్టలేమని, రెండూ పూర్తిగా వేర్వేరు అంశాలని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

బౌద్ధ దేశమైన భూటాన్‌ ‌సరిహద్దుల్లో ఇటీవల ఏకంగా ఒక గ్రామాన్ని చైనా నిర్మించిన విషయం తెలిసిందే. తనకన్నా ఎంతో చిన్న దేశమైన భూటాన్‌ ‌పట్ల బీజింగ్‌ ఉదారంగా వ్యవహరించాల్సింది పోయి, ఆక్రమణకు పాల్పడటం చైనాకే చెల్లింది. హిమాలయ పర్వత రాజ్యమైన నేపాల్‌కూ ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది. నేపాల్‌ ‌సరిహద్దుల్లో కొంత ప్రాంతంలోకి బీజింగ్‌ ‌చొచ్చుకుపోయింది. అదేమని అడిగితే దబాయించి మాట్లాడుతోంది. మొన్నటిదాకా చైనా మత్తులో జోగిన నేపాల్‌ ఇప్పడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తోంది. అందుకు అనుగుణంగా అపోహలను వీడి భారత్‌తో స్నేహహస్తాన్ని కోరుకుంటోంది. టిబెట్‌ ‌ప్రాంతంలో జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టు విషయాన్ని భారత్‌… అం‌తర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వేదికలపై బీజింగ్‌ ‌కుటిల నీతిని బహిరంగ పరచడం భారత్‌ ‌ముందుగా చేయాల్సిన పని. అసలు బ్రహ్మపుత్ర నదిలో ఎవరెవరి నీటి వాటాలు ఎంతన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. కరవు, తుపాన్ల సమయంలో నీటి వాటాలపైనా సమగ్రంగా చర్చించాల్సి ఉంది. అన్ని విషయాలపైన స్పష్టత వచ్చినప్పుడే శాశ్వతంగా ఈ వివాదానికి తెరపడుతుంది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌,  ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE