కుటుంబానికి, జాతికి, భాషకు, ప్రాంతానికి, దేశానికి ద్రోహం చేయడానికి ఎవరూ సాహసించరు. ద్రోహచింతనను వ్యతిరేకిచడం మానవ నైజం. స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ద్రోహానికి పాల్పడేవారు చాటుమాటుగానో, రహస్యంగానో అట్టి చర్యలకు పాల్పడుతుంటారు. స్వాతంత్య్ర సమరం జరిగే రోజుల్లో బ్రిటిష్‌ వారికి వత్తాసు పలకడానికి భారతీయులు, తెలంగాణ ఉద్యమం సాగే రోజుల్లో సమైక్యవాదం వినిపించడానికి తెలుగువారు భయపడడం చరిత్ర. దేశభక్తికి, జాతీయతకు గీటురాయిగా ఉన్న ‘వందేమాతరం’ నినాదాన్ని కాంగ్రెస్‌లోని కొందరు ముస్లిములే వ్యతిరేకించడంతో ఆగ్లేయులకు ఆహ్లాదం, గాంధీ, నెహ్రూలకు కలవరం కలిగాయి. దాంతో ‘హిందూ ముస్లిం భాయ్‌ ‌భాయ్‌’ ‌నినాదాన్ని ప్రచారంలో పెట్టి, సంతుష్టీకరణ రాజకీయాలకు కాంగ్రెస్‌ శ్రీ‌కారం చుట్టింది. జాతి సమైక్యతా మంత్రంగా కాంగ్రెస్‌ ‌భావించిన నినాదాన్ని హిందువులు ఎలాంటి శషభిషలు లేకుండా అందుకోగా జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్‌ ‌తిరస్కరించింది. జిన్నాను, లీగ్‌ను తప్పు పట్టలేని గాంధీ, నెహ్రూ అనుయాయులు ‘వందేమాతరం’ అని నినదించే హిందువులను మతోన్మాదులుగా చిత్రించడం రాజకీయ వైచిత్రి. దేశ విభజనకు దారితీసిన ఈ సంతుష్టీకరణ రాజకీయం దేశ విభజన తరువాత స్వతంత్ర భారతావనిలో కూడా కొనసాగడమే విషాదం. నెహ్రూ కొనసాగించిన ఈ జాడ్యానికి రాజ్యాంగబద్ధంగా సెక్యులరిజం ముసుగేసి ఇదింర మరింత బలోపేతం చేశారు.

కాంగ్రెస్‌ అడుగుజాడల్లో ఊపిరి పోసుకున్న ప్రాంతీయ పార్టీలు రాజకీయ అధికారాన్ని సత్వరం అందుకోవాలనే ఆత్రుతలో సంతుష్టీకరణకు పాల్పడడం నేర్చాయి. హిందువులు వేర్వేరు రాజకీయ పార్టీల పంచన చేరి, రాజకీయంగా చీలిపోతున్నారు. కనుక మైనారిటీల మద్దతు పొందిన వారికి గెలుపు తథ్యం అనే విశ్లేషణల సారాంశం ప్రాంతీయ పార్టీలను సంతుష్టీకరణకు పురికొల్పుతోంది. జాతీయదృష్టి కొరవడిన పార్టీల రాజకీయ స్వార్ధం వల్లనే పశ్చిమబంగలో అక్రమ చొరబాటుదారులైన బంగ్లా ముస్లిములకు, రోహింగ్యాలకు ఆశ్రయం, రాజకీయ మద్దతు లభిస్తోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో కూడా వీసా గడువు ముగిసిపోయిన పాకిస్తానీయులకు, అక్రమ చొరబాటుదారులైన రోహింగ్యాలకు, బంగ్లా దేశీయలకు ఆశ్రయం లభించడం వెనుక గల కారణాలు ఇవే. నిన్నటి జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాల్లో అక్రమ చొరబాట్లు, విజాతీయత, వంటి అశాలు ప్రధాన పాత్ర వహించడం శుభ పరిణామం.

నాలుగేళ్ల క్రితం మహానగర్‌ ఎన్నికలు గెలిచి మేయర్‌ ‌పీఠాన్ని, రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలు గెలిచి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న తెరాసకు ఈసారీ మేయర్‌ ‌ఖాయమని చాలామంది భావించారు. 150 డివిజన్‌లు ఉన్న మహానగర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లో తెరాస (35.81శాతం ఓట్లతో) 55 స్థానాలను, బీజేపీ (35.56శాతం ఓట్లతో) 48 స్థానాలను దక్కించుకోగా కాంగ్రెస్‌ 2 ‌స్థానాలకు పరిమితమైంది. నువ్వా నేనా అన్నట్లు పోటీ పడిన తెరాస, బీజేపీల మధ్య ఓట్ల తేడా 0.28 శాతమే. గతంలో 99 స్థానాలను గెలుచుకున్న తెరాస 44 స్థానాలను కోల్పోగా నాలుగు స్థానాలున్న బీజేపీ 44 స్థానాలను అదనంగా గెలుచుకుని 48కి చేరింది. మజ్లిస్‌ ‌గతంలో తనకున్న 44 స్థానాలను ఈసారి కూడా నిలుపుకున్నది. ఈ వివరాలను విశ్లేషిస్తే నిన్నటి దుబ్బాక ఫలితం భాగ్యనగర్‌లో ప్రతిఫలించినట్టే, జీహెచ్‌ఎం‌సీ ఫలితం రేపు తెలంగాణ అంతటా ప్రతిఫలించబోతోంది అన్న బీజేపీ జోస్యం నిజమవుతున్నట్లే కనిపిస్తోంది. గతంలో గెలిచి, 2020లో వెనుకపడిన తెరాస ఇప్పుడు ఎన్ని ఓట్లు కోల్పోయిందో, అవన్ని గతంలో ఓడి ఈసారి గెలిచిన బీజేపీకి దక్కాయి.  తెరాస కోల్పోయిన 44 స్థానాలు ఈసారి బీజేపీ ఖాతాలో చేరాయి. ఓట్లలో తేడా శాతం మరీ స్వల్పం. తెరాస పాలిట చావు తప్పి కన్ను లొట్టపోయినట్లున్న ఈ ఫలితాలను ఆ పార్టీ లోతుగా విశ్లేషించుకోవాలి.

తప్పొప్పులు ఎన్నున్నా కేసీఆర్‌ ‌పట్ల తెలంగాణ ప్రజల్లో అభిమానం సన్నగిల్లిందే కాని పూర్తిగా తొలగలేదు. ఎన్నికల ఫలితాల్లో ఓటరు మనోగతం స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌ ‌నగరంలో ఉంటుంన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధకునిగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ‌పట్ల ఎంత అభిమానం ఉందో, రజాకార్ల అవశేషం మజ్లిస్‌ ‌పట్ల అంతే వ్యతిరేకత ఉంది. భారతీయ ముస్లింలకు మద్దతుగా వ్యవహరిస్తే లౌకికవాదం అవుతుందని అనుకోవచ్చునేమో కానీ, ముస్లింలే అయినా విదేశీయులు, విభజనవాదులను సమర్థిస్తే అది దేశద్రోహం అవుతుంది! బీజేపీ అభిమానులే కాక జాతీయవాదాన్ని సమర్థించేవారు, దేశభక్తులైన పౌరులు దేశద్రోహ చింతనను వ్యతిరేకించడం సహజం. ఇనుముతో స్నేహం చేసినందుకు అగ్ని కూడా సుత్తిదెబ్బలు తినడం లోకరీతి. మజ్లిస్‌తో దోస్తీ మత్తులో కేసీఆర్‌ ఇ‌ంత చిన్న లాజిక్‌ను ఎలా మిస్సయ్యారో!

About Author

By editor

Twitter
YOUTUBE