భారత స్వాతంత్య్ర పోరాటానికి ‘వందేమాతర’ నినాదం అందించిన భూమి అది. స్వతంత్ర భారతావని పాడుకునే జాతీయగీతం ‘జనగణమన’కు జన్మనిచ్చిన నేల అదే. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అరవిందుడు వంటి ఆధునిక రుషి పుంగవులకు నెలవైన చోటు. డబ్ల్యుసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, బిపిన్‌చంద్రపాల్, చిత్తరంజన్‌దాస్, ఖుదీరాంబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చిట్టగాంగ్ వీరులు… ఎందరో మహనీయుల సొంతగడ్డ కూడా అదే. మరి నేడు.. విశ్వకవి రవీంద్రుడు ప్రవచించిన శాంతిమంత్రం అవహేళనకు గురవుతోంది. బంకింబాబు వందేమాతరం నిషిద్ధాక్షరి అయిపోయింది. అంతటా అసహనం. మట్టివాసన పడని పార్టీల ఆధిపత్యం. పాలకుల నిరంకుశత్వం, అహంకారం. స్వరాజ్యోద్యమంలో జాతీయతా భావాలకు ఆలవాలమైన బెంగాల్ గడ్డ మీద ఇప్పుడు విజాతీయతకే పెద్దపీట. ప్రజాస్వామ్యం అన్న మాటకే చోటు లేదు. ఇదీ… స్థూలంగా తూర్పు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ వర్తమాన సామాజిక చిత్రం. దీనికి కొత్త కేంద్ర బిందువు మమతా బెనర్జీ.
బ్రిటిష్ జాతిని ఈ దేశం నుంచి వెళ్లగొట్టిన వాళ్లం (?) మేమే కాబట్టి, మా పాలన ఎలా ఉన్నా భారతీయులు భరించాలి అన్నట్టు ఉండేది జాతీయ కాంగ్రెస్ ధోరణి. ఆ కాంగ్రెస్‌ను ఓడించిన ఘనత మాదే కాబట్టి ప్రజలు మా చెప్పుచేతల్లో ఉండాలన్నట్టు సాగింది 1977 తరువాత బెంగాల్‌ను పాలించిన సీపీఎం వైఖరి. ఆ సీపీఎం రక్తచరిత్రకు ముగింపు పలికాను కాబట్టి నాది నియంతృత్వమైనా బెంగాల్ సహించకతప్పదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు మమతా బెనర్జీ. ప్రస్తుతం బెంగాల్‌లో బీజేపీ జరుపుతున్న రాజకీయ పోరాటం ఊపందుకోవడానికీ, ఇంత రక్తపాతంతో నిండిపోవడానికీ మూలాలు ఇక్కడే ఉన్నాయి. తన మీద తీవ్ర స్థాయిలో భౌతికదాడులకు పాల్పడిన సీపీఎంనీ, వాజపేయి మంత్రివర్గంలో స్థానం ఇచ్చిన బీజేపీనీ ఒకే గాటన కట్టే స్థాయికి ఆమె ఇంగితజ్ఞానం నశించిపోయింది. చిరకాలం కాంగ్రెస్‌లో, పార్లమెంట్‌లో పనిచేసిన మమత ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులను ‘బయటివారు’ అని ఓట్ల కోసం దూషించేటంత వేర్పాటువాద ధోరణిలోకి దిగజారిపోయారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా మీద దాడిని కూడా పలచన చేసి మాట్లాడి, అమిత్ షా అంతటివారు తిరిగి దిమ్మతిరిగి పోయే రీతిలో స్పందించక తప్పని పరిస్థితిని తెచ్చు కున్నారు. మూడువందల మంది బీజేపీ కార్యకర్తలను చంపిన తృణమూల్ కాంగ్రెస్‌ను ఎన్నికలలో ఎదుర్కొనడానికి బీజేపీ ఎంతదూరమైనా వెళుతుందని ఆమెకు తెలియదా? నిజానికి ఈ హత్యాకాండను ఖండించకుండా మిన్నకుండి, పరోక్షంగా తానే ప్రోత్సహిస్తున్నదన్న నెపం నుంచి ఆమె తప్పించుకోలే పోతున్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ; (ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఎమ్మెల్యేలు సహా) గంపగుత్తగా బీజేపీలో చేరిపోయే పరిస్థితి ఆమె స్వయంకృతం. మూడో కంటికి తెలియకుండా జరిగిపోయిన ఈ పరిణామం దీర్ఘానుభవం కలిగిన నాయకురాలు, ముఖ్యమంత్రి మమతను ఎన్నికలకు ముందే ప్రత్యర్థి చేతిలో ఓడినట్టు ప్రకటించింది.
నలభయ్ ఏళ్ల సంఘర్షణ
1947 విభజన నాటి గాయం సంగతి మరచి పాలించిన నేతల ఏలుబడి పశ్చిమ బెంగాల్‌కు శాపమైపోయింది. హిందువుల మనోభావాలకు పెద్దగా విలువ లేని రాష్ట్రాలలో ఇప్పుడు అది కూడా ఒకటి. 1977 నుంచి ముప్పయ్ ఏళ్లు పైగా పాలించిన మార్క్సిస్టులు ఆ అద్భుత రాష్ట్రాన్ని మరుభూమిని చేశారు. వ్యవస్థాగత అరాచకాలకు ఆలవాలం చేశారు. వారి పీడను వదిలించిన నాయకురాలిగా మమతా బెనర్జీ కనిపించారు. చిత్రం-పదేళ్లలోనే మార్క్సిస్టులకే పాఠాలు చెప్పగలిగే స్థాయిలో హింసా ప్రవృత్తికి పట్టం కట్టారామె. ప్రస్తుత బెంగాల్ దుస్థితికి మార్క్సిస్టుల దురహంకారం, టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుందుడుకుతనం కారణం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బెంగాల్ బీభత్సానల వేదికగా మారిపోయింది. సీపీఎం పార్టీ చేతిలో చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో పోరాటం చేసి, విజయం సాధించిన మమతా బెనర్జీ, ఆ మార్క్సిస్టులు తనపై చేసిన ప్రయోగాలను బీజేపీ మీద చేస్తున్నారు, లేదా చేయిస్తున్నారు. మరొక గొంతుకు అక్కడ స్థానం లేకుండా చేయాలని సీపీఎం అనుకుంది. ఇప్పుడు మమతదీ అదే వ్యూహం. ఫలితమే ఆ సంఘర్షణ. భారతీయ జనతా పార్టీ పేరు చెబితేనే దీదీ భగ్గుమంటున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డాపై భౌతిక దాడులకు పాల్పడి తృణమూల్ కార్యకర్తలు ముమ్మాటికీ దుస్సాహసమే చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుత స్థానంలో ఉన్న మమత ఈ ఘటనను ఖండించాల్సింది పోయి ఆషామాషీగా మాట్లాడటం మరింత ఆందోళన కలిగించే అంశం. నడ్డాలు, చద్దాలు, పద్దాలు వస్తుంటారు, పోతుంటారు… వారి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు, వారిపై వారే రాళ్లు వేసుకుని, దానిని దాడిగా చిత్రీకరిస్తారంటూ మమత చేసిన వ్యాఖ్యలు ఆమె బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం.
హింసనే నమ్ముకున్న నాయకురాలు
పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు హింసాకాండను ఆశ్రయించాలని అనుకుంటే ఎంతోకాలం సాగదు. అవతలి రాజకీయ పక్షానికి చెందిన వారిని అదే పనిగా చంపుకుంటూ పోతే ఎన్నికలలో విజయం తమదే అన్న ధోరణీ ఎక్కువకాలం పనిచేయదు. అసలు ఒకసారి దక్కిన అధికారం శాశ్వతంగా తనదేనని నమ్మడం కూడా పొరపాటు. మమత 1946 నాటి ముస్లిం లీగ్ ఘాతుకాలను, నౌఖాలీ హత్యలను గుర్తుచేసుకోక తప్పనిసరి పరిస్థితిని కల్పించారు. బెంగాల్‌లో ఏనాటికీ బీజేపీకి స్థానం లేదని విశ్లేషకులు చేస్తున్న వాదనను పటాపంచలు చేసి, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం అంచులకు చేరింది. ఇది మమతకు రుచించడం లేదు.
మమత ఆక్రోశానికి ఇతరత్రా కారణాలు లేకపోలేదు. రోజురోజుకూ పార్టీ బలహీనపడి పోతోంది. ఆమె ఏకపక్ష వ్యవహారశైలితో విసిగి వేసారిపోయిన శ్రేణులు క్రమంగా పార్టీకి దూరమవు తున్నాయి. సీనియర్ నాయకులు ఒక్కొక్కరు విడిచి వెళుతున్నారు. ఎన్నికల నాటికి ఎంతమంది పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి. ‘దీదీ, ఎన్నికల నాటికి మీరొక్కరే మిగులుతారు’ అన్న అమిత్ షా వ్యాఖ్య ఆమెకు తీవ్ర అశాంతిని కలిగించేదే. అలా అని మమత పాలన కూడా ప్రజారంజకంగా ఏమీ లేదు. అటు నవీన్ పట్నాయక్ వలెనో, ఇటు నితీశ్‌కుమార్ మాదిరిగానో ఆమె స్వచ్ఛమైన పాలన ఏమీ అందించడం లేదు. అన్నీ అవినీతి, అక్రమాలు, అక్రమ భూదందాలే. మమత పాలనపై పెరిగిన వ్యతిరేకతకు ఇదీ కారణమే.
2019 ఎన్నికలే చెప్పేశాయి
బీజేపీ అంటే మమత భయపడే వాతావరణం 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ విజయ దుందుభి మోగించడంతోనే మొదలయింది. మొత్తం 42 సీట్లకు కమలం పార్టీ 18 గెలుచుకుని భవిష్యత్తు సవాలును అప్పుడే విసిరింది. 2014లో రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ 2019లో దాదాపు సగం సీట్లు గెలవడంతో మమతకు ముచ్చెమటలు పోశాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు చక్రం తిప్పి, బెంగాల్ గడ్డ మీద కమలానికి చోటే లేదని అహంకరించిన సీపీఎం అప్పుడు ఖాతానే తెరవకపోవడం, వందేళ్ల చరిత్ర గల హస్తం పార్టీ రెండు సీట్లకే పరిమితమవడంతో దీదీకి దిమ్మ తిరిగింది. కొత్త వాస్తవాలు తెలిసి వచ్చాయి. అటు బీజేపీ మాత్రం ఇక కోల్‌కతా రైటర్స్ బిల్డింగ్ (రాష్ట్ర సచివాలయం)లో పాగా వేయాలని కంకణం కట్టుకుని కృషి ఆరంభించింది. బీజేపీ జాతీయ నాయకులు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ స్థానిక నేతల్లో స్ఫూర్తిని నింపడం అందులో భాగమే. కొద్దికాలం క్రితం అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్, తరువాత జేపీ నడ్డా రావడం కూడా అందుకే. అయితే ఏ బీజేపీ నేత వచ్చినా తృణమూల్ కార్యకర్తలు వీరంగం వేయడం ఒక వాస్తవం. ఒకనాటి సీపీఎం కార్యకర్తలే నేటి మమత అనుచరులు కాబట్టి వారి సంస్కారం ఇంతకు మించి ఉండదని అందరికీ తెలుసు. దీని ఫలితం ప్రజలకు దూరం కావడమే. ఈ మొత్తం వ్యవహారానికి కొసమెరుపు- అమిత్ షా ఇకపై ప్రతి నెల రాష్ట్రానికి రావాలని నిర్ణయించుకోవడం. డిసెంబర్ 20 నాటి ప్రజా ప్రదర్శనను చూసి తాను జీవితంలో ఇంతవరకు ఇంతటి జన సమూహాన్ని చూడలేదని ఆయన అన్నారు. ఆ ఊరేగింపు లేదా బలప్రదర్శన అసాధారణంగా ఉంది.
నడ్డా మీద దాడితో మలుపు
ఈ డిసెంబర్ మొదటి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా బెంగాల్ పర్యటనకు వచ్చారు. మమత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఇంటింట ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒక్కసారిగా మొత్తం నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. 2016 ఎన్నికల్లో మమత పాతికవేల మెజార్టీతోనే ఇక్కడ గెలిచారు. హస్తం రెండో స్థానంలో నిలిచింది. టీఎంసీని గద్దెదించడమే కాక మమతను ఓడించడమూ బీజేపీ లక్ష్యమే. అందుకే డిసెంబర్ 10 నాటి తన ప్రచారానికి నడ్డా మమత నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. నడ్డాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజధాని కోల్‌కతాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమండ్ హార్బర్ పార్లమెంటు స్థానంలో పర్యటించారు. ఇది మమత మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ నియోజకవర్గం. తృణమూల్ యువరాజు అభిషేక్ 2014, 2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో మూడున్నర లక్షల మెజార్టీ. తృణమూల్ భవిష్యనేతనూ నిలువరించాలన్న ఉద్దేశంతో నడ్డా డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోను పర్యటించారు. ఇక్కడా మంచి ఆదరణ లభించింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు చోట్ల కమలం గెలుపు తథ్యమని విశ్లేషకులు అంచనాకు వచ్చేశారు కూడా. ఇది చూసి ఓర్వలేని టీఎంసీ శ్రేణులు నడ్డా కాన్వాయ్ మీద ‘సిరాకుల్’లో దాడులకు తెగబడ్డాయి. సాక్షాత్తు ఒక జాతీయపార్టీ అధ్యక్షుడిపైనే దాడి జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమై పోయింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలని స్వయంగా గవర్నర్ జగదీప్ థంకర్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ముందస్తు హెచ్చరిక చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి అయి ఉండి మమత తరచూ గవర్నర్ మీద విరుచుకుపడడం మరొక విపరీత పరిణామం. అయితే నడ్డా కాన్వాయ్ మీద తృణమూల్ కార్యకర్తలు చేసిన దుస్సాహసం బీజేపీ చేత అంతిమ పోరాటానికి ముందే సిద్ధమయ్యేటట్టు చేసింది.
నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనను తీవ్రంగా పరిగణించి, దీనిపై వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ రావలసిం దిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బందోపాధ్యాయ, డీజీపీ వీరేంద్రలను ఆదేశించారు. నడ్డా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ముగ్గరు సీనియర్ ఐపీఎస్ అధికారు లను డిప్యూటేషన్ పై రావలసిందిగా ఆదేశించింది. వీరిలో 2011 బ్యాచ్ కు చెందిన డైమండ్ హార్బర్ జిల్లా ఎస్పీ బోలానాథ్ పాండే, 1996 బ్యాచ్‌కు చెందిన దక్షిణ బెంగాల్ ఏడీజీ రాజీవ్ మిశ్రా, 2000 బ్యాచ్‌కు చెందిన ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ ప్రవీణ్ త్రిపాఠీ ఉన్నారు. దీనిని మమత నిరసించి, సమస్యను మరింత జటిలం చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆమె ఆరోపణ. అఖిల భారత అధికారుల కేడర్ ఏదైనప్పటికీ, వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నప్పటికీ వారిపై నియంత్రణ అధికారం కేంద్రానిదే. వారిని డిప్యూటేషన్‌కు పిలిచే అధికారం కేంద్ర హోంశాఖదే. ప్రతి ఐఏఎస్, ఐపీఎస్ అధికారి కొంతకాలం తప్పనిసరిగా కేంద్ర సర్వీసుల్లో పని చేయాలి. ముఖ్యమంత్రిగా ఉన్న మమతకు ఈ విషయం తెలియదనుకోలేం. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని, కేంద్రం జోక్యం రాజ్యాంగ ఉల్లంఘనే అని మమత సర్కారు వాదిస్తోంది. అదే సమయంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పితే కేంద్రం కళ్లు మూసుకుని కూర్చోజాలదు. మమత ఎంత భీష్మించు కున్నా ఇవాళ కాకపోయినా రేపైనా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేంద్రానికి వెళ్లక తప్పదు.
శారదా చిట్‌ఫండ్స్ వ్యవహారంతోనే మమత పాలనలోని, నిజాయితీలోని డొల్లతనం దేశ ప్రజలకు తెలిసింది. కానీ ఆమె మచ్చ పడిన ప్రభుత్వ అధికారులను వెనకేసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి నాటి కోల్‌కతా పోలీసు కమిషనరును అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులుగా రాగా స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ అధికారులు కమిషనరును అరెస్టు చేశారు. మమతా బెనర్జీ అప్పుడూ ఇదేరీతిగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ వాదించారు.
పీడిస్తున్న అంతర్గత విభేదాలు
అన్ని ప్రాంతీయ పార్టీల్లో ఉన్నట్లే టీఎంసీలోనూ లుకలుకలు లేకపోలేదు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ లేదా కుల పార్టీలని చెప్పకతప్పదు. ఇది చేదునిజం. ఇందుకు టీఎంసీ మినహాయింపేమీ కాదు. ఆమె అవివాహితురాలు అయినప్పటికీ కుటుంబ మమకారానికి మమత దూరమేమీ కాదు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని దీదీ తెరపైకి తెచ్చారు. ఏడు పదులకు చేరువవుతున్న మమత పార్టీ పగ్గాలను అభిషేక్ కు అప్పగించాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 33 ఏళ్ల అభిషేక్ కనుసన్నల్లోనే ఇప్పుడు పార్టీ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. అభిషేక్ పేరుకే పార్టీ యువజన విభాగం అధిపతి. నిజానికి మమత అప్రకటిత రాజకీయ వారసుడు అతడే. ఇదే పార్టీని దాదాపు చీలిక అంచుకు తెచ్చింది. పార్టీయే కాదు, పాలన వ్యవహారాలు కూడా ఆయన పర్యవేక్షణలో సాగుతుండటం విశేషం. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం అభిషేక్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో నిర్ణయించేది కూడా ఆయనే. ఆయన రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను కాదని మేనల్లుడికి మమత ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ శ్రేణులకు నచ్చడం లేదు. పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తరచూ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మమతకు మొదటినుంచీ పార్టీలో కుడిభుజంగా ఉన్న ముకుల్ రాయ్ గతంలోనే పార్టీని వీడారు. ఆయన ప్రస్తుతం భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు కూడా. రేపటి ఎన్నికల్లో దీదీకి చుక్కలు చూపించాలన్న పట్టుదలతో పని చేస్తున్నారు.
అమిత్‌షా బాణం
పార్టీ జాతీయ అధ్యక్షుడి మీద జరిగిన దారుణమైన దాడిని బీజేపీ తేలికగా తీసుకుంటుందని ఎవరూ భావించలేదు. డిసెంబర్ 19, 20 తేదీలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నడ్డా మీద దాడికి మమతను గంగవెర్రులెత్తించే సమాధానమే. ఇది పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సభల్లో ఆయన నేరుగా ముఖ్యమంత్రి మమతపైనే విమర్శలు సంధించారు. టీఎంసీ గూండాయిజానికి తమ పార్టీకి చెందిన దాదాపు 300 మంది బలయ్యారని గుర్తు చేశారు. గతంలో సీపీఎంను తరిమి కొట్టడానికి మమత ప్రయోగించిన ‘పరివర్తన’ అనే పదాన్ని అమిత్ షా ప్రయోగిస్తున్నారు. బెంగాలీలు సహజంగా జాతీయవాదులు. కానీ అది మరుగున పడింది. బెంగాల్ ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూనే, మరుగున ఉన్న జాతీయభావాలను అమిత్‌షా తట్టి లేపుతున్నారు. వివేకానందుని ఇల్లు చూసినా, రవీంద్రుని జ్ఞాపకాలను చెప్పినా, ఖుదీరామ్ బోస్ స్వగ్రామంలో అడుగు పెట్టినా జాతీయతను, బెంగాల్ విశిష్టతను జమిలిగా రంగం మీదకు తేవడానికే. అది బీజేపీ విధానం కూడా. అవి మేల్కొని జూలు విదిలించడానికి సరైన పరిస్థితులు మార్క్సిస్టులు, మమత ఇప్పటికే సృష్టించి పెట్టారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి ఆగడాలు, ఓట్ల కోసం వారి పట్ల మెతకగా ఉండడం నేర్చుకున్న ప్రభుత్వాలు, తాజాగా రోహింగ్యాల సమస్య, దుర్గామాత నిమజ్జనం గొడవలు జాతీయతా స్పృహను మేల్కొలుపుతాయి. ఇదేమీ బీజేపీ రహస్యంగా చేయడం లేదు. తాను బయటి వ్యక్తినని మమత ఆరోపించడాన్ని అమిత్ ఖండించారు. అదే సమయంలో కాబోయే ముఖ్యమంత్రి బెంగాలీయే అవుతారని ప్రజా సమూహానికి చెప్పారు.
సువేందు తిరుగుబాటు బావుటా
తూర్పు మిడ్నపూర్ జిల్లాకు చెందిన టీఎంసీ సీనియర్ నేత సువేందు అధికారి పార్టీకి రాజీనామా చేయడం మమతకు శరాఘాతం. తూర్పు మిడ్నపూర్, పశ్చిమ మిడ్నపూర్, బంకూరా, పురులియా జిల్లాల్లో అధికారికి మంచి పట్టుంది. ఈ ప్రాంతాలను జంగల్ మహల్ అంటారు. ఇది టీఎంసీకి పెట్టనికోట. అధికారి టీఎంసీ వ్యవస్థాపకుల్లో ఒకరు. నందిగ్రామ్ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి నందిగ్రామ్ ఉద్యమమూ ఒక కారణం. రవాణా, నీటిపారుదల శాఖల మంత్రిగా సర్కారులోను కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి శిశిర్ అధికారి కంటై పార్లమెంట్ సభ్యుడు. సోదరుడు డిబేందు అధికారి కంటై పురపాలక సంఘ ఛైర్మన్. అధికారి కుటుంబానికి ఈ ప్రాంతంలో రాజకీయంగా మంచి పట్టుంది. దాదాపు 60 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్థారించగల స్థాయి వారిది. సువెందు నందిగ్రామ్ శాసనసభ్యుడు. పదవిని, పార్టీనీ వరసగా వదిలేస్తూ తాజాగా కేంద్ర హోంమంత్రి, భాజపా సీనియర్ నేత అమిత్ షా పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ చేరారు. వీరిలో ఒక కాంగ్రెస్, ఒక సీపీఐ, ఒక సీపీఎం, ఆరుగురు టీఎంసీ శాసనసభ్యులు ఉన్నారు. మరో శాసనసభ్యుడు జితేంద్ర తివారీ సైతం మమత పార్టీకి రాజీనామా చేశారు. బర్ధమాన్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఎంసీ ఎంపీ సునిల్ మండల్ కాషాయ కండువా కప్పుకున్నారు. సువేందు కుటుంబం, సోదరుడైన ఎంపీ దివ్యేందు అధికారి, ఇంకో దగ్గరి బంధువు టీఎంసీ ఎమ్మెల్యే. వీరంతా త్వరలో చేరబోతున్నారు.
టమ్లుక్ సీపీఐ శాసనసభ్యుడు అశోక్ దిండా, హల్దియాకు చెందిన సీపీఎం ఎమ్మెల్యే తపసి మండల్, పురులియాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు సుదీప్ ముఖర్జీ, వీరు కాక బనశ్రీ మైత్రి, బిశ్వజిత్, సైకత్ పంజా, శిల్పాద్ర దత్తు, దీనాలీ బిశ్వాస్ అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వలసలు టీఎంసీపై ప్రభావం చూపించడం తథ్యం.
రోజురోజుకూ పార్టీని వీడే శాసనసభ్యులు, ఇతర నాయకులు పెరుగుతుండటం మమతను కలవరపాటుకు గురిచేస్తోంది. పార్టీని వీడేవారంతా స్వార్థపరులని ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే నేతల వలసకు అసలు కారణం తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణమన్న విషయన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని, నిన్నకాక మొన్న వచ్చిన మేనల్లుడిని అందలం ఎక్కించడం, పరోక్షంగా పార్టీ పగ్గాలు అందించడం ఎంతవరకు సమంజసం అన్న ఆత్మ విమర్శకు అధినేత్రి చోటు ఇవ్వడం లేదు. వాస్తవానికి సువెందు అధికారి రాజీనామా విషయంలో పార్టీ సీనియర్ నాయకుడైన డమ్ డమ్ ఎంపీ సౌగత్ రాయ్, పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన రాజీనామా చేయకుండా వారిద్దరూ గట్టి ప్రయత్నం చేశారు. ప్రశాంత్ కిషోర్ తంత్రం, మంత్రాంగం రేపటి ఎన్నికల్లో ఎంతవరకు పని చేస్తుందన్నదీ అనుమానమే. ఆయన తమిళనాడులో డీఎంకేకు కూడా సలహాదారు. గతంలో ఏపీలో జగన్‌కు, పంజాబ్‌లో కాంగ్రెస్ నాయకుడైన కెప్టెన్ అమరీందర్‌సింగ్‌కు సలహాదారుగా ఉండి వారి విజయానికి తోడ్పడ్డారు. కానీ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకీ సలహాదారుగా ఉండి బొక్కబోర్లా పడ్డారు. సొంత రాష్ట్రం బిహార్‌లో ముఖ్య మంత్రి నితీశ్‌కుమార్ ఇప్పుడు ప్రశాంత్ పేరంటేనే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ను నమ్ముకుని ఉన్న మమత ఎలాంటి ఫలితాలను చూస్తారో! ఇతరత్రా అంశాలు కూడా మమతను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. బీజేపీ రోజురోజుకు విస్తరిస్తున్న తీరు, వామపక్షాలు, కాంగ్రెస్ పొత్తు, మజ్లిస్ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతుందన్న వార్తలు మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
మేల్కొంటున్న జాతీయత
జాతీయవాద భావనల వారసత్వం పుష్కలంగా గల బెంగాల్లో ఇప్పుడు బీజేపీ పట్ల మొగ్గు కనపడుతోంది. అమిత్ షా తన పర్యటనలో భాగంగా వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అక్రమ వలసదారులు మొదటినుంచీ కాంగ్రెస్, సీపీఎం, తరవాత రోజుల్లో టీఎంసీకి బాసటగా ఉన్నారు. బీజేపీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. అక్రమ వలసలు, వారికి ఓటు హక్కు గురించి ఇప్పటికే బీజేపీ ఎన్నికల సంఘాన్ని హెచ్చరించి కదిలించింది కూడా. తాము అధికారంలోకి వస్తే సరిహద్దుల నుంచి వలసలను అడ్డుకుంటామని చెప్పేసింది. ఈ హామీ స్థానిక బెంగాలీలను ఆకట్టకుంటోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మజ్లిస్ రంగ ప్రవేశం వార్తలతో 30 శాతం ముస్లిం ఓటుబ్యాంకు ఎక్కడ చీలుతుందోనని మమత ఆందోళన పడుతున్నారు. స్థానిక ముస్లిములతోపాటు, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లిములు ఈ పార్టీలకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీ, మజ్లిస్ ఈ ఓటుబ్యాంకును పంచుకోవలసి వస్తుంది. దీంతో ఇప్పటివరకు మతతత్వ రాజకీయాలు, బుజ్జగింపు విధానాలతో విసిగిపోయిన ఇతర సామాజిక వర్గాల ప్రజలు ఎక్కడ కమలం పార్టీవైపు మొగ్గు చూపుతూరేమోనన్న భయం మమతలో నెలకొంది. పొరుగునే ఉన్న అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్ (ఎన్‌ఆర్‌సీ) అమలు, కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన సీఏఏ (సిటిజెన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్టు), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్) చట్టాలు ఎక్కడ తమ ఓటు బ్యాంకున దెబ్బతీస్తాయోనన్న ఆందోళన టీఎంసీలో లేకపోలేదు.
మమత సహజంగానే పోరాటయోధురాలు. కాంగ్రెస్‌వాదిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఆ పోరాటతత్వంతోనే గుర్తింపు పొందారు. హస్తం పార్టీ వీడి బయటకు వచ్చి సొంతంగా టీఎంసీని ప్రారంభించిన తరవాత కూడా ఆమె పోరాటపంథానే ఎంచుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తొలిసారి 2011లో అధికారంలోకి వచ్చిన తరవాతా ఈ వైఖరిని విడనాడలేదు. కేంద్రంతో అయినదానికి, కానిదానికి కయ్యానికి కాలు దువ్వడం మమత మొండితనమే. ఉదాహరణకు అఖిల భారత అధికారుల డిప్యూటేషన్ విషయం. అధికారికంగా లేదా, ఎన్నికల సమయంలో వచ్చే నాయకుల స్థాయిని బట్టి వారికి భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి తన విధానాలు, సిద్ధాంతాల గురించి సభలు, సమావేశాల ద్వారా ప్రచారం చేసుకునే హక్కుంటుంది. ఢిల్లీ నుంచి వచ్చే జాతీయ పార్టీల నాయకులని బయటవారని ప్రచారం చేయడం, చులకనగా మమత మాట్లాడటం సరైనదా? పార్టీ నుంచి వలసలకు కారణాలను అన్వేషించి చక్కబెట్టు కోవాలి తప్ప దిగజారుడు విమర్శలేమిటి?
ప్రాంతీయ పార్టీల్లో పెత్తనం కుటుంబ నాయకులదే నన్న వాస్తవం అవి గుర్తిస్తే మంచిది. దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల రాజకీయాలను కాచివడపోసిన మమతకు ఈ విషయం తెలియదని అనుకోలేం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పార్టీలు వేరు కావచ్చు. అంతమాత్రాన అన్ని విషయాల్లో ఘర్షణకు దిగక్కర్లేదు.
నరేంద్రమోదీ దశాబ్దానికి పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఏనాడూ నాటి కేంద్ర సర్కారును విమర్శించిన దాఖలాలు లేవు. నాటి ప్రధాని మన్మోహన్‌పై వ్యక్తిగతంగా, విధానపరంగా విమర్శిం చిన సందర్భం లేదన్నది సత్యం. అంతటి విశాల భావనను ప్రస్తుత విపక్షాల నుంచి ముఖ్యంగా కొన్ని ప్రాంతీయ పార్టీల నుంచి ఆశించడం కష్టమే. మమతా బెనర్జీ వంటి మొండిఘ•ం నుంచి ఆశించడం మరీ అత్యాశే. ఒకటి వాస్తవం. బెంగాల్ హింస తారస్థాయికి చేరింది. అయినా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వలె గవర్నర్ చేత నివేదిక తెప్పించుకుని ఒక్క కలం పోటుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మోదీ మట్టికరిపించలేదు. ప్రజా తీర్పుతోనే మమతను ఇంటికి పంపించేందుకు వేచి ఉన్నారు.
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్ : సీనియర్ జర్నలిస్ట్