అయోధ్య రామమందిర నిర్మాణం నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ మరొకసారి దేశంలోని హిందువులందరినీ ఆత్మీయంగా పలకరించబోతున్నదని, దేశంలోని హిందూ బంధువులందరి ఇళ్లను సంస్థ కార్యకర్తలు సందర్శిస్తారని విశ్వహిందూపరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కప్పగంతు కోటేశ్వరశర్మ చెప్పారు. హిందువుల మతహక్కును అడ్డుకోవడానికి కోర్టులను, పర్యావరణాన్ని అడ్డుపెట్టుకునే ధోరణి సరికాదని అన్నారు. లవ్‌జీహాద్ అంతర్జాతీయ కుట్రలో భాగమని, దానిని నిరోధించడానికి జరుగుతున్న ప్రయత్నాలు శ్లాఘనీయమని ఆయన వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి హిందువుల పట్ల వివక్షాపూరితంగానే ఉందని చెప్పారు. షాహిన్‌బాగ్ నుంచి దేశ ప్రజలు పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. వారు 1968 నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారక్‌గా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు ప్రాంతఘోష్ ప్రముఖ్‌గా, హిందూవాహిని ప్రాంత ప్రముఖ్‌గా, ప్రాంతసేవాప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా కోటేశ్వరశర్మ విశ్వహిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయోధ్యకు కరసేవకుల సమీకరణలో కీలక భూమికను పోషించారు. ఆ సందర్భంలో బరేలీ సెంట్రల్‌జైలులో నెలరోజులున్నారు. అయోధ్యలో టార్పాలిన్ దేవాలయం నుంచి నూతన దేవాలయ నిర్మాణం కార్యక్రమం వరకు సాగిన ప్రస్థానంలో వారి పాత్ర గణనీయం. విశ్వహిందూపరిషత్ సమావేశాలలో పాల్గొనడానికి ఆయన విజయవాడ వచ్చిన సందర్భంగా జాగృతి జరిపిన ముఖాముఖీలోని అంశాలు పాఠకుల కోసం:
అయోధ్య సాధన కోసం సాగిన ఉద్యమం దేశ సామాజిక స్వరూపాన్ని మార్చింది. హిందువుల ఐక్యతకు ఊపునిచ్చింది. ఇక రామజన్మభూమిలో శంకుస్థాపన శతాబ్దాల నాటి హిందూ ఆత్మగౌరవ నినాదానికి కొత్త శక్తిని అందించింది. మందిర నిర్మాణానికి సంబంధించి తరువాత కార్యక్రమం ఏమిటి?
నాలుగున్నర శతాబ్దాల అయోధ్య పోరాటంలో ఇది తుది అధ్యాయం. అదే- మందిర నిర్మాణ పుణ్యకార్యం. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తాజాగా ఒక పిలుపునిచ్చింది. ప్రతి హిందూ బంధువును మరొక్కసారి అయోధ్య రామయ్య పేరుతో కలుసుకోవడం, పలకరించి రావడం ఆ పిలుపు వెనుక ఉద్దేశం. ఆ మేరకు త్వరలో దేశం నలుమూలలా ఈ కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి గ్రామంలో, పట్టణంలో, నగరంలో ధనిక, పేద తారతమ్యం లేకుండా అన్ని హిందూ కుటుంబాలను కార్యకర్తలు కలుసుకుంటారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణంలో తమ వంతు సాయం, ఉడతా భక్తిగా కావచ్చు, శక్తిని బట్టి కావచ్చు- ఉండాలని హిందూ బంధువులలో చాలామంది భావిస్తున్నారు కూడా. అందుకే వారి శక్తి మేరకు, ఔదార్యం మేరకు విరాళాలు సేకరించడం కూడా ఈ పనిలో భాగం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
హిందువుల పండుగల సమయంలో కొందరు కావాలని వివాదాలు లేవదీయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. తాజాగా దీపావళి పండుగకి ఇదే జరిగింది. బాణసంచా కాలిస్తే కాలుష్యం పెరిగిపోతుందంటూ కొందరు న్యాయస్థానాలకు వెళ్లి వాటి మీద నిషేధాన్ని తెచ్చారు. దీనిని పర్యావరణ సమస్యతో ముడిపెడుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో బాణసంచా నిషేధం అమలయింది. ఈ ధోరణిని ఏమనాలి?
పర్యావరణ పరిరక్షణకు హిందువులు వ్యతిరేకం కానేకాదు. పర్యావరణ పరిరక్షణ హిందూ జీవన విధానంలో అంతర్భాగం కూడా. ఇదే కాకుండా, కోర్టు నిర్ణయాన్ని గౌరవించవలసిన బాధ్యత ఒకటి ఉంది. కనుక ఆ నిబంధనలను పాటించాలి. కానీ మెజారిటీ ప్రజల మనోభావాలను పట్టించుకోనవసరం లేదన్నట్టు ఉన్న ఇలాంటి నిషేధం భావ్యంగా అనిపించదు. దీపావళికి బాణసంచా కాల్చడం ఈ దేశంలో సంప్రదాయం. అది హిందువులకే పరిమితం కాదు కూడా. దక్షిణాయనంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. బాణసంచా రాత్రివేళ కాలుస్తారు. ఇందువల్ల రోగకారక క్రిములు నశిస్తాయి. కొద్దికాలంగా ఈ మాట మాయమై, పర్యావరణ పరిరక్షణ నినాదం రంగం మీదకొచ్చింది. అయినా స్వదేశీని దృష్టిలో ఉంచుకొని, వాయుకాలుష్యాన్ని పరిగణలోకి తీసుకొని, పరిమితులను పాటిస్తూ దీపావళి పండుగను సంతోషంగా గడిపే హక్కు హిందువులకు ఉండాలి.
లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఆవుపేడ, విత్తనాలతో ప్రమిదలను తయారు చేయించింది. ఇలాంటి ప్రయత్నం దేశంలో ఎక్కడైనా చేస్తున్నారా?
గోమయంతో ప్రమిదలను చేయడం, పంచడం ఇంకొన్ని చోట్ల కూడా జరిగింది. అది ఆహ్వానించ దగినదే కూడా. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నమ్ముతున్న, ప్రచారం చేస్తున్న అంశాలలో ఇది కూడా ఉంది.
ఈ మధ్య భారతీయ సమాజాన్ని బాగా కలవరపరుస్తున్న అంశం లవ్ జీహాద్. కొన్ని రాష్ట్రాలలో ఆ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు సమాచారం కూడా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
లవ్ జీహాద్ అంతర్జాతీయ కుట్ర. చిత్రం ఏమిటంటే అసలు ఇలాంటి కార్యక్రమమే ఇస్లాంలో లేదని ఆ మతంలో కొందరు బొంకుతున్నారు. వాస్తవాలు కళ్లెదుటే ఉన్నా హిందూ సమాజాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. యథాప్రకారం దీనికి కుహనా మేధావులు వంత పాడుతున్నారు. కానీ ఆ వాస్తవాలు వేరుగా, భయానకంగా ఉన్నాయి. అమానుషంగా ఉన్నాయి. ఎన్ని మార్గాలలో వీలైతే అన్ని మార్గాలలో హిందూ జనాభాను తగ్గించాలన్న పథకంలో భాగంగా జరుగుతున్నదే లవ్ జీహాద్. కొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కేరళ, కర్ణాటకలలో కూడా ఈ కుట్ర విచ్చలవిడిగా సాగిపోతోంది. ఇప్పుడు హిందూ సమాజం మేలు కొంటున్నది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు పటిష్ట చట్టాలు తెచ్చే యోచనలో ఉన్నాయి. వాళ్ల కుట్రలతో పాటు, మరొక వాస్తవం కూడా గ్రహించాలి. విచ్ఛిన్నకర శక్తుల వలలో మన యువతులు, యువకులు కూడా చిక్కుకోకూడదు. అంటే హిందూ కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలి. ఆ చట్టాలు రావడం ఇవాళ్టి అవసరమే. లవ్‌జిహాద్‌కు పాల్పడుతున్న వాళ్లని కఠినంగా శిక్షించాల్సిందే.
సామాజిక సమరసత, ఘర్‌వాపసీ కార్యక్రమాల ప్రగతి ఎలా ఉంది?
సామాజిక సమరసతకు 1969లో ఉడిపిలో జరిగిన సాధుసంతుల సమ్మేళనంలోనే పునాది పడింది. పరమపూజనీయ గురూజీ నేతృత్వంలో, పెజావర్ స్వామిజీ సామాజిక సమరసతకు నాంది పలికారు. ‘హిందవా సోదరా సర్వే న హిందూ పతితో భవేత్, మమదీక్షా హిందురక్ష, మమ మంత్రః సమనతా’ భావనతో అంటరానితనం నిర్మూలనకు పిలుపునిచ్చారు. ఇంకా కొన్నిచోట్ల కొన్ని వర్గాలకు దేవాలయ ప్రవేశం సమస్యగా ఉంది. దీనిని పరిష్క రించాలి. ఘర్‌వాపసీ కార్యక్రమాలు ఊపందు కుంటున్నాయి. హిందువులు అధిక సంఖ్యలో సంఘటితంగా ఉంటే ఈ కార్యక్రమం మరింత వేగవంతమవుతుంది.
హిందూ ఓట్‌బ్యాంక్ గురించి ఒక ప్రశ్న. ఈ ఓట్‌బ్యాంక్ కొందరు చెబుతున్నట్టు చెల్లని నాణెమా? సంఘటితం చేయడానికి వీలు కాని స్థితిలోనే ఉందా?
హిందూ ఓట్‌బ్యాంక్‌ను సమీకరిస్తున్నదని ఎవరైనా బీజేపీని మాత్రమే అనగలరు. ఇప్పటికే ఆ పార్టీ మీద హిందువుల పార్టీ అన్న ముద్ర బలంగానే ఉంది. ఇక బీజేపీని మతతత్వ పార్టీ అంటూ విమర్శలు గుప్పించని విపక్షం దాదాపు లేదు. ఈ ఆరోపణల వల్ల బీజేపీ నష్టపోయిందా? ప్రజలలోకి ఇంకా చొచ్చుకుపోయిందా అన్న విషయం మనకంటే ఆ విమర్శలు చేసినవాళ్లకే బాగా తెలుసు. ఇది హిందువుల పార్టీ అయితే, అందులోను అగ్రకులాల పార్టీ అయితే దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలలో అధికారంలోకి ఎలా వస్తుంది? కాబట్టి చెల్లని నాణెం ఎలా అవుతుంది? ఇంకొక సంగతి కూడా చెప్పుకోవాలి! ఇంతకాలం మైనారిటీ ఓట్ల కోసం హిందువులను ద్వితీయశ్రేణి పౌరులుగానే చూసిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు ఏమైంది? రాహుల్‌గాంధీ తాను జనేవు (జంధ్యం) వేసుకున్న హిందువునని ప్రకటించాడు. సరే, ఎన్నికలు వచ్చినప్పుడే ఆయన గుళ్లకి తిరుగుతున్నాడనుకోండి!
తెలంగాణ ముఖ్యమంత్రి తనను మించిన హిందువు ఈ భూమ్మీద లేడని చెబుతారు. అదే నోటితో హిందూగాళ్లూ బొందుగాళ్లూ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తే మజ్లిస్‌తో తమకు పొత్తు లేదంటారు. మిగిలిన సమయంలో మజ్లిస్‌తో కలసి పనిచేస్తున్నామని బాహాటంగా చెబుతారు. ఇదంతా ఏం సూచిస్తుంది?
ఇదంతా బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ట. సెక్యులరిజం పేరుతో సాగుతున్న వికృత రాజకీయ క్రీడ. ప్రజలను మోసం చేయడం. ధర్మాన్ని దగా చేయడం కూడా అనాలి. ఓవైపు యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నానని చెప్పడం, మరోవైపు హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం- ఇది విజ్ఞుల లక్షణం కాదు. రాజకీయవేత్తల లక్షణం అసలే కాదు. కాకూడదు కూడా. ఇలాంటి పదవీ రాజకీయాలను, ధోరణులను ఖండించాలి. తిరస్కరించాలి.
ఆంధప్రాంతంలో హిందూ దేవతామూర్తులకు అపచారం చేయడం, రథాలను అగ్నికి ఆహుతి చేయడం వంటి దుర్ఘటనలు వరసగా జరిగిపోయాయి. దీని మీద హిందూ సమాజం తనకు తానే చాలాచోట్ల తీవ్రంగానే స్పందించింది కూడా. వీటి మీద విశ్వహిందూపరిషత్ వైఖరి ఏమిటి?
ఇది అత్యంత హేయమైన చర్య. ఆ వరుస దాడులు, బాధ్యుల మీద సరైన చర్యలు లేకపోవడం వంటి పరిణామాలను గమనిస్తే, ఆ ఘటనల నేపథ్యంలో రాజకీయ నాయకులు, మంత్రులు ఇచ్చిన ప్రకటనలను గమనిస్తే కుట్రదారులకు ఎంత మద్దతు ఉన్నదో తొందరగానే అవగాహనకు వస్తుంది. సమాజంలో త్వరితగతిన తీవ్ర పరిణామాలకు అవకాశం ఉన్న ఆ దుశ్చర్యలకు పాల్పడినవారు మతిస్థిమితం లేనివాళ్లంటూ నమ్మించాలని ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించడం చూస్తే జుగుప్సాకరంగా ఉంది. ఈ కేసులకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోక పోవడం ప్రభుత్వ అసమర్థత ఎంతో తెలుస్తుంది. కుట్రదారుల మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటే ఏమనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటికైనా ఆ నిందితులను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలి.
మతపరమైన వివక్ష రెండు తెలుగు రాష్ట్రాలలోను యథేచ్ఛగా సాగుతోందని బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి. వీటి పట్ల వీహెచ్‌పీ వైఖరి ఏమిటి?
హిందువుల పట్ల వివక్ష వాస్తవం. గుణదలలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. తెలంగాణలో మొహర్రం సందర్భంగా కొవిడ్ ఆంక్షలు సడలించారు. కానీ వినాయక చవితికీ, నిమజ్జనాలకీ, బతుకమ్మ సంబరాలకీ, దీపావళికీ ఎక్కడలేని షరతులు రాత్రికి రాత్రికి విధిస్తారు. హిందువుల పండుగల సమయంలో ప్రభుత్వ రవాణాలో కూడా బస్ టికెట్లను గణనీయంగా పెంచుతుంటారు. ఈ వివక్ష సరికాదు.
దేవాలయ భూములను ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. అయినా ప్రభుత్వాలు ఆలయ భూములను ఏదో పేరుతో హస్తగతం చేసు కుంటున్నాయి. దీనికి వీహెచ్‌పీ ఏం చెబుతుంది.
ఆలయ భూములను, ఆదాయాలను కచ్చితంగా దేవస్థానాలలో కైంకర్య సేవలకే ఉపయోగించాలి. ఇది ధర్మం. లేకపోతే దాతల ఆశయానికి భంగం కలిగించినట్టవుతుంది. ఆ హక్కు ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అందుకు వాటి అధీనంలోని భూములు ఇవ్వాలి. ఈ అంశంలో కోర్టు తీర్పులను ఖాతరు చేయకపోవడం శోచనీయం. నిజానికి ఈ ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి? బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాల పేరుతో ఓట్‌బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఇవి సెక్యులర్ ప్రభుత్వాలు కదా! హిందూ ఆలయాలు, ధార్మిక సంస్థల భూములు తప్ప, అన్యమతస్తుల ప్రార్థనా స్థలాలకు చెందిన భూముల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? ఇది ముమ్మాటికీ హిందూధర్మం పట్ల వివక్షే కదా! అన్యాయమే కదా! దీనిని విశ్వహిందూ పరిషత్ సహించదు.
ఆలయ భూముల మీద, ఆస్తుల మీద దేవాదాయ శాఖ ఆధిపత్యం అవసరమా? ప్రభుత్వ అజమాయిషీ లేకుండా వాటిని నిర్వహించలేరా?
దేవాదాయశాఖ మత స్వేచ్ఛకే కాదు, హిందూ ధార్మిక సంస్థల పురోగతికి కూడా ఆటంకమే. అశ్వనీకుమార్ ఉపాధ్యాయ వర్సెసస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదర్స్ వ్యాజ్యంలో కోర్టు ఈ అంశాన్ని ప్రస్తావించింది కూడా. దేవాదాయ శాఖ ప్రమేయం గురించి చర్చ ఇప్పటిదికాదు కూడా.
ఢిల్లీలో షాహిన్‌బాగ్ ఘటన ద్వారా భారతదేశం ఏం నేర్చుకోవాలి?
షాహిన్‌బాగ్ నిరసన కూడా మతోన్మాదంతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ కుట్ర. కేంద్రంలో ఉన్న హిందూ అనుకూల, అయోధ్య అనుకూల ప్రభుత్వం మీద అక్కసుతో సీఏఏను అడ్డం పెట్టుకుని సాగిన కార్యక్రమమది. అక్కడ వినిపించిన వాదనలు ఎలాంటివి? ఉపన్యాసాలు ఎలాంటివి? అవన్నీ ఈ దేశ ప్రజలు విన్నారు. చివరికి అత్యున్నత న్యాయస్థానం ఆ నిరసన ఎంత అసంబద్ధమో కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. పోలీసులు మౌనంగా ఉండిపోయినందుకు అసహనం కూడా వ్యక్తం చేసింది. ఈ నిరసన కార్యక్ర మానికి నాయకత్వం వహించినవారే, తరువాత ఢిల్లీ అల్లర్లకు కారకులుగా అభియోగాలను ఎదుర్కొంటు న్నారు. షాహిన్‌బాగ్ కారణంగా ఇబ్బందులు పడిన హిందువులకు వీహెచ్‌పీ అండగా నిలిచింది. వారిలో మనోస్థైర్యాన్ని పెంచింది. సీఏఏను వ్యతిరేకిస్తూ, మైనార్టీలను రెచ్చగొడుతూ పబ్బం గడపదలుచుకున్న సంస్థలకు, పార్టీలకే కాదు, దేశ ప్రజలకు కూడా షాహిన్‌బాగ్ ఉదంతం పెద్ద గుణపాఠమే. ఇందులో కేంద్రం ఆచితూచి వ్యవహరించింది. ఆ వైఖరి సమర్థనీయమే.
ఇంటర్వూ : దండు కృష్ణవర్మ, సీనియర్ జర్నలిస్ట్