భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో మైలురాయి పడింది. భారత వాస్తు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా నూతన పార్లమెంట్‌ ‌భవన నిర్మాణానికి పునాది పడింది. ‘ఆత్మనిర్భర భారత్‌’ ‌దార్శనికతను ప్రతిబింబించేలా ఇది రూపుదిద్దుకోనుంది. బ్రిటిష్‌ ‌పాలనా కాలంలో నిర్మించిన ప్రస్తుత పార్లమెంట్‌ ‌భవనం నేటి అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ‘సెంట్రల్‌ ‌విస్టా’ పేరుతో అద్భుతమైన అత్యాధునిక పార్లమెంట్‌ ‌భవన నిర్మాణానికి ప్రధాని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భగా 2022 ఆగస్టు 15 నాటికి సిద్ధమయ్యే నూతన పార్లమెంట్‌ ‌భవనం నవభారత అవసరాలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ తెలిపారు.


డిసెంబర్‌ 10‌వ తేదీన మధ్యాహ్నం 12.50 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్‌ ‌భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కొవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నూతన పార్లమెంట్‌ ‌భవన నిర్మాణం మన ప్రజాస్వామ్య సంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటని ఈ సందర్భంగా మోదీ అభివర్ణించారు. దీనిని మనమందరం కలిసికట్టుగా నిర్మిద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది స్వాతంత్య్రం తరువాత మొట్టమొదటి సారిగా ఓ ప్రజా పార్లమెంటును నిర్మించేందుకు మనకు లభించిన చరిత్రాత్మక అవకాశమని అన్నారు.

2014లో లోక్‌సభ సభ్యునిగా తాను మొట్ట మొదటిసారిగా పార్లమెంట్‌ ‌భవనంలోకి అడుగుపెట్టిన క్షణాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రజాస్వామ్యానికి ఆలయం అయిన ఈ భవనానికి శిరస్సు వంచి ప్రణామం చేశానని తెలిపారు. నూతన పార్లమెంట్‌ ‌భవనంలో ఎన్నో కొత్త సంగతులు చోటుచేసుకోనున్నాయని, అవి ఎంపీల సామర్థ్యాన్ని పెంచుతాయని, వారి పని సంస్కృతిని ఆధునీక రిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్‌ ‌భవనం స్వాతంత్య్రం అనంతర కాలంలో భారతదేశానికి ఒక దిశను అందిస్తే, కొత్త పార్లమెంట్‌ ‌భవనం ఆత్మనిర్భర భారత్‌ ఆవిష్కారానికి సాక్షిగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు. దేశం అవసరాలను తీర్చడానికి సంబంధించిన కృషి పాత పార్లమెంట్‌ ‌భవనంలో జరగగా, 21వ శతాబ్దపు భారతదేశం ఆకాంక్షలను నెరవేర్చే పని నూతన భవనంలో జరుగుతుందని అన్నారు.

ఇతర దేశాల్లో ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, పరిపాలనకు సంబంధించింది కావచ్చని.. భారత దేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం, దేశప్రజల ఆత్మ అని అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్యం శతాబ్దాల తరబడి పోగుపడిన అనుభవం ద్వారా రూపుదిద్దుకొన్న ఒక వ్యవస్థ అని పేర్కొన్నారు. అందులో ఒక జీవన మంత్రం, ఒక జీవనశక్తితో పాటు క్రమానుగత వ్యవస్థ కూడా ఉందన్నారు. దేశాభివృద్ధికి ఒక కొత్త శక్తిని ఇస్తున్నది కూడా భారతదేశ ప్రజాస్వామ్య బలమేనని, అది దేశవాసులలో ఒక కొత్త నమ్మకాన్ని కూడా రేకెత్తిస్తోందని తెలిపారు.

ప్రజాస్వామ్యం అంటే పాలనతో పాటు, అభిప్రాయ భేదాలను పరిష్కరించే ఒక సాధనం కూడా అని మోదీ అన్నారు. భిన్నాభిప్రాయాలు, దృష్టి కోణాలు ఉత్తమ ప్రజాస్వామ్యానికి సాధికారితను ప్రసాదిస్తాయని తెలిపారు. మన విధానాలు, రాజకీయాలు వేరుగా ఉండవచ్చు. కానీ మనం ప్రజలకు సేవ చేయడం కోసమే ఉన్నాం. ఈ అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండకూడదని మోదీ స్పష్టంచేశారు. పార్లమెంట్‌ ‌లోపల, బయట జరిగే చర్చల్లో నిరంతరం ప్రజాసేవ, దేశ హితమే లక్ష్యంగా సమర్పణ భావం ఉట్టిపడుతూ ఉండాలని ఆయన సూచించారు.

పార్లమెంట్‌ ‌భవన ఉనికికి మూలాధారమైన ప్రజాస్వామ్య దిశలో ఆశావాదాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత ప్రజలదేనని మోదీ గుర్తుచేశారు. పార్లమెంట్‌లోకి అడుగుపెట్టే ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు ప్రజలతో పాటు రాజ్యాంగానికి కూడా జవాబుదారుగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్య ఆలయాన్ని పరిశుభ్ర పర్చడానికంటూ ఎలాంటి క్రతువులు లేవని, దీన్ని ప్రక్షాళన చేసేది ఈ ఆలయంలోకి వచ్చే ప్రజాప్రతినిధులే అని ప్రధాని వ్యాఖ్యానించారు. వారి అంకితభావం, సేవ, నడవడిక, ఆలోచనలు, ప్రవర్తనే ఈ ఆలయానికి ప్రాణం అని చెప్పారు. దేశ ఏకత్వం, అఖండత్వ దిశగా వారు చేసే ప్రయత్నాలు ఈ ఆలయానికి జీవశక్తిని ప్రసాదిస్తాయన్నారు. ప్రజాప్రతినిధులందరూ తమ జ్ఞానాన్ని, తెలివితేటలను, విద్యను, అనుభవాలను ఇక్కడ పూర్తిగా వినియోగిస్తే కొత్త పార్లమెంట్‌ ‌భవనం మరింత పవిత్రతను సంతరించుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు.

దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని, దేశ ప్రగతిని మాత్రమే ఆరాధిస్తామని ప్రతిజ్ఞను స్వీకరించ వలసిందిగా ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రతి నిర్ణయం దేశశక్తిని పెంపొందించాలని, దేశ హితం అన్నింటికంటే మిన్నగా ఉండాలని అన్నారు. దేశ ప్రజల హితం కంటే గొప్పది ఏదీ ఉండదంటూ శపథం చేయాలని ప్రతిఒక్కరిని కోరారు. వారి స్వీయ ఆందోళనల కన్నా దేశం గురించిన ఆందోళనే పెద్దదని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చడం మనందరి ప్రధాన కర్తవ్యం అని మోదీ అన్నారు.

‘సెంట్రల్‌ ‌విస్టా’ విశిష్టతలు

దాదాపు శతాబ్దం నాటి ప్రస్తుత పార్లమెంట్‌ ‌భవనం చాలా ఇరుకుగా మారింది. నేటి అవసరాలకు సరిపోవడం లేదు. ఈ కారణంగానే నూతన పార్లమెంట్‌ ‌భవన నిర్మాణానికి ప్రధాని మోదీ ప్రభుత్వం పూనుకుంది. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భారీ సౌధం ప్రస్తుతం ఉన్న భవనం కంటే 17 వేల చదరపు మీటర్లు అదనంగా ఉంటుంది. పూర్తి అధునాతన వ్యవస్థలతో భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మిస్తున్నారు.

పార్లమెంట్‌ ఉభయ సభల్లో భవిష్యత్తులో పెరగనున్న సభ్యులను దృష్టిలో పెట్టుకొని నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. రాజ్యసభలో 348 ఎంపీలకు, లోక్‌సభలో 888 ఎంపీలకు సరిపడే సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశాలప్పుడు 1224 మందివరకు సామర్ధ్యం పెంచుకునే వీలుంది. ఉభయ సభల పబ్లిక్‌ ‌గ్యాలరీల్లో 530 సీట్లు ఉంటాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మించే శ్రమ్‌ ‌శక్తి భవన్‌లో ఒక్కో ఎంపీకి 40 చదరపు మీటర్ల ఆఫీసు ఇస్తారు.

‘సెంట్రల్‌ ‌విస్టా’గా పిలిచే నూతన పార్లమెంట్‌ ‌భవనం కోసం రూ.971 కోట్లు ఖర్చు చేస్తున్నారు. హెచ్‌సీపీ డిజైన్‌, ‌ప్లానింగ్‌ అం‌డ్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌సంస్థ దీని ఆకృతులు రూపొందిస్తుండగా, టాటా సంస్థ నిర్మాణ పనులు చేపడుతోంది. ఈ భారీ భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగా, 9 వేల మంది పరోక్షంగా పాల్గొంటున్నారు. కొత్త పార్లమెంట్‌ ‌భవన నిర్మాణంపై కొందరు సుప్రీంకోర్టులో దావా వేశారు. అందుకే కోర్టు పేపర్‌ ‌వర్క్ ‌పూర్తి చేసేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. తీర్పు వచ్చేవరకు కొత్త కట్టడాలు నిర్మించడం, కూల్చడం, చెట్లు నరకడం చేయవద్దని ఆదేశించింది.

వందేళ్ల నాటి భవనం

ప్రస్తుత సంసద్‌ ‌భవన్‌ (‌పార్లమెంట్‌ ‌భవనం) వందేళ్ల నాటిది. న్యూఢిల్లీ ప్రణాళికల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బ్రిటిష్‌ ఆర్కిటెక్టస్ ‌సర్‌ ఎడ్విన్‌ ‌లుటియెన్స్, ‌హెర్బర్ట్ ‌బేకర్‌ ‌బ్రిటిష్‌ ఇం‌డియా కోసం ఈ భవన రూపకల్పన చేశారు. 1912-13లో పార్లమెంట్‌ ‌భవనం డిజైన్‌ ‌రూపొందించగా నిర్మాణ పనులను 1921లో ప్రారంభించారు. ఆరేళ్ల తర్వాత.. 1927లో ఆ భవన నిర్మాణం పూర్తి అయ్యింది. దీని పైకప్పుకు 257 గ్రానైట్‌ ‌స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. వృత్తాకారంలో నిర్మించిన ఈ భవనం 170 మీటర్లు (560 అడుగులు) వ్యాసం, 2.4 హెక్టార్ల (6 ఎకరాలు) విస్తీర్ణంలో ఉంది.

18 జనవరి 1927న నాటి వైస్రాయి లార్డ్ ఇర్విన్‌ ‌దీనిని ప్రారంభించారు. జనపథ్‌ ‌రోడ్‌లో రాష్ట్రపతి భవన్‌కు దగ్గరలో ఉన్న భారత పార్లమెంట్‌ ‌భవనం ప్రపంచంలోని విశిష్ట కట్టడాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్‌ ‌భవనాన్నే కొనసాగిస్తూ వచ్చాం. ఇందులో సెంట్రల్‌ ‌హాలు, లోక్‌సభ, రాజ్యసభ, లైబ్రరీలతో పాటు పార్లమెంట్‌ ‌వ్యవహారాల కార్యాలయాలు, కమిటీలు, వివిధ పార్టీలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. పార్లమెంట్‌లో మొత్తం 788 సభ్యులు (245 రాజ్యసభ, 543 లోక్‌సభ) కూర్చునే అవకాశం ఉంది.

అర్థంలేని విమర్శలు

ప్రభుత్వం ఏ పని తలపెట్టినా రంధ్రాన్వేషణ చేయడం ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌సాంప్రదాయంగా పెట్టుకున్నట్లుంది. ప్రజాస్వామ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన అనంతరం నిర్మించే కొత్త భవనం దేన్ని ప్రతిబింబిస్తుందని ఆ పార్టీ విమర్శించింది. పార్లమెంట్‌ ‌భవనమంటే ఇసుక, ఇటుకలు కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేదని వ్యాఖ్యానించింది. అయితే యూపీఏ హయంలో కాంగ్రెస్‌ ‌పార్టీకే చెందిన లోక్‌సభ స్పీకర్‌ ‌మీరాకుమార్‌ ‌నూతన పార్లమెంట్‌ ‌భవన ఆవశ్యకతను ప్రస్థావించారు. పాత పార్లమెంట్‌ ‌భవనం సరిపోవడం లేదని ఆమె అప్పట్లోనే అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ మరచిపోయినట్లుంది. ఈ విషయంలో చివరకు కమల్‌హాసన్‌ ‌సైతం కువిమర్శలు చేసి నెటిజన్ల కామెంట్ల దాడితో భంగపడ్డారు. కరోనా, రైతుల ఆందోళనలు సాకుగా చూపి నూతన పార్లమెంట్‌ ‌నిర్మాణాన్ని వ్యతిరేకించడం హాస్యాస్పదమే. ప్రభుత్వం ఇవేవీ పట్టించుకుకోకుండా కొత్త భవన నిర్మాణానికి పూనుకుంటోందని వ్యాఖ్యానించడం కూడా అర్థంలేని విమర్శగానే చెప్పవచ్చు.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE