– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‘‌వరుణ దేవుడు మా పార్టీలో చేరాడు..’ ఒకప్పుడు రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురిసిన సమయంలో వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి తనదైన శైలిలో ఈ వ్యాఖ్య చేశారు. అంతకుముందు చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న ఏడెనిమిది సంవత్సరాలు కురవని వర్షాలు.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పుష్కలంగా కురవడంతో వైఎస్‌ ‌చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో కొంత ఆసక్తికర రాజకీయ చర్చ కూడా జరిగింది.

ఇప్పుడు, అదే వరుణ దేవుడు ఎందుకు ఆగ్రహించాడో ఏమో గానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి ‘వరుణ దేవుడు.. ఆగిపో.. వెళ్లిపో..’ అంటూ హుకుం మీద హుకుం జారీ చేసినా ఆగకపోగా మరింత ఉధృతంగా విరుచుకుపడుతున్నాడు. రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు, తుపానులు, ఇతరేతర ప్రకృతి వైపరీత్యాలు వరుసగా వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదల నుంచి రాష్టం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఎంత నష్టం జరిగిందో, ఎలాంటి నష్టం జరిగిందో కూడా ఇంకా స్పష్టం కాలేదు. ఆ ముసురైనా పూర్తిగా వీడకముందే తాజాగా ‘నివర్‌’ ‌తుపాను దూసుకొచ్చింది. రాష్ట్రాన్ని ముంచెత్తింది. నివర్‌ ‌సృష్టించిన బీభత్సం ఇంకా సర్దుమణగక ముందే మరోటి, ‘బువేరీ’ తుపాను తలుపుతడుతోంది. అంతకుముందు ఆగష్టులో కురిసిన అకాల వర్షాల కారణంగానూ రైతులు నష్టపోయారు. అయినా అన్నదాతను ఆదుకునే ప్రయత్నమేదీ ప్రభుత్వం చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

నివర్‌ ‌తుపాను వలన రాష్ట్రంలో ప్రాణనష్టం పెద్దగా జరగలేదు గానీ, ఆస్తి నష్టం, ముఖ్యంగా పంట నష్టం మాత్రం చాలా ఎక్కువగా జరిగిందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోనే లక్షల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని అధికార వర్గాలు అంచనాకొచ్చాయి. అదలా ఉంటే, చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో పెట్టిన పెట్టుబడిలో పైసా కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్క పంటనష్టమే వెయ్యికోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు. పంట నష్టాలకు ఇతర నష్టాలను జత చేస్తే.. మొత్తం ఎన్ని కోట్లు అవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు డిసెంబర్‌ 15 ‌నాటికి ‘నివర్‌’ ‌నష్టాల లెక్కలు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఏరియల్‌ ‌సర్వే కూడా చేశారు. తుపాను కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. అలాగే, సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రతి ఒక్కరికీ రూ.500 ఆర్థికసాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక వర్షం తడి పూర్తిగా ఆరకముందే రాష్ట్రంలో వరద రాజకీయం ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ‘వరుస విపత్తులతో రైతాంగం తల్లిడిల్లిపోతోంది. ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పాలకుల నిష్క్రియాపరత్వం ప్రజలకు శాపంగా మారింది’ అంటూ హైదరాబాద్‌ ‌నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ‌ద్వారా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు. నిజమే, ప్రభుత్వం స్పందించవలసిన రీతిలో స్పందించలేదు. గతంలో విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ ‌గ్యాస్‌ ‌లీక్‌ ‌దుర్ఘటన సమయంలో ఆఘమేఘాల మీద పరుగులు తీసి కోట్ల రూపాయల నష్ట పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. రైతాంగాన్ని వానలు, వరదలు వరుసగా దెబ్బతీస్తున్నా, ప్రకృతి వైపరీత్యాలు పగబట్టినట్లు కాటు వేస్తున్నా అంతగా పట్టించుకోవడం లేదు. రైతుల కష్టాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇది నిజం. అయితే, గత ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుందా? చంద్రబాబునాయుడు తమ హయాంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పెద్ద మనసు చేసుకుని, రైతులను అందలం ఎక్కించారా? అంటే, అలాంటిది ఏమీ లేదు. నిజానికి చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం ప్రథమ ప్రాధాన్యాంశం కాదు.. అందుకు ఆయన రాజకీయ మూల్యం కూడా చెల్లించారు.

సరే.. ఆ విషయం పక్కనపెడితే.. నివర్‌ ‌తుపాను సరిగ్గా పంటలు చేతికి అందివచ్చే సమయంలో విరుచుకుపడడంతో అది సృష్టించిన బీభత్సం వ్యవసాయ రంగాన్ని చాలా గట్టి దెబ్బకొట్టింది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వరి, పత్తి, మిరప ఒకటనికాదు అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కౌలు రైతులు, రైతు కూలీలు కూడా తీవ్రంగా నష్టపోయారు. తక్షణమే విపత్తు సాయం అందిస్తేనే గానీ, మళ్లీ  రైతాంగం వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తే రబీకి రైతు సిద్ధమవుతాడు. అది వారి పెట్టుబడులకు అందివస్తుందని, కొంతలో కొంత ఉపసమనం దక్కుతుందని విపక్షాలు సూచిస్తున్నాయి. అయితే, ఫిబ్రవరి దాకా ఇవ్వలేమని, పరిహారం కోసం మూడు నెలలు ఆగాలని ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం రైతుల పట్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అప్పులపాలవుతున్న రైతులను మరింత కుంగదీసే విధంగా ఈ నష్టాలు ఉన్నాయి. పెట్టుబడి రాయితీతో పాటు పంటల బీమాను సకాలంలో అందించాలి. ముఖ్యంగా బీమా బకాయిలను తక్షణం చెల్లిస్తే రైతులకు కొంత వెసులుబాటు కలుగుతుంది. అయితే, గత చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన బీమా బకాయిలు తమ ప్రభుత్వం చెల్లించిందని, ప్రస్తుత బకాయిలను మరో మూడు నెలలు గడిస్తేనే గానీ చెల్లించే పరిస్థితి లేదని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు చెబుతున్నారు. అలాగే, పంట నష్టపోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందచేస్తే అన్నదాతలకు కొంత భరోసా చిక్కుతుందని అనుకుంటే ప్రభుత్వం మాత్రం వ్యవసాయం తమ ప్రాధాన్యాంశాలలో లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. చూద్దాం, చేద్దాం అన్న ధోరణి కనబరుస్తోంది. ఇలా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఏదీ రాక రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయం కొనసాగించేందుకు అవసరమైన సహాయాన్ని, అది కూడా, ఎప్పుడో కాకుండా ఇప్పుడే ఇవ్వడం అవసరం.

ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. ఇక్కడితో వర్షాల బెడత, తుపానుల బాధ తొలిగిపోయింది అనుకునేలా లేదు. నవంబర్‌ అం‌టేనే తుపానుల మాసం. చరిత్రలో పెను విషాదంగా మిగిలిపోయిన దివిసీమ తుపాను (1977) కూడా నవంబర్‌ ‌మాసంలోనే వచ్చింది. ఆ తర్వాత, అంతకుముందు కూడా చాలా వరకు తుపానులు నవంబర్‌ ‌నెలలోనే వచ్చాయి. చాలా నష్టాన్ని మిగిల్చాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం.. ఇంకా అనేక విధాల కష్టాలను మిగిల్చిపోయాయి. అయితే ఇప్పుడు నవంబర్‌ ‌వెళ్లిపోయింది కాబట్టి.. ఇక వానలు కురవవు, తుపానులు కూడా వెళ్లిపోయాయి అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే, డిసెంబర్‌ ‌నెలలోనూ మరో రెండు తుపానులు దక్షణాది రాష్ట్రాలను ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రభుత్వం తక్షణ సహాయం అందించే విషయంతో పాటుగా దీర్ఘకాలంలో తుపానులు, వరదలు, ప్రకృతి ప్రళయాల నుంచి రైతాంగాన్ని రక్షించే ప్రణాళికపై దృష్టి పెట్టడం అవసరం.

అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం లానే ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ప్రాధాన్యతల విషయంలో పెద్దగా తేడా లేదు. వృథా ఖర్చులు, రాజకీయ ప్రయోజనాలను ఆశించి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఇస్తున్న ప్రాధాన్యం సుస్థిర ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఇవ్వడంలేదు.

నిజానికి ఆంధప్రదేశ్‌కి ఇంచు మించుగా వెయ్యి కిలో మీటర్లకు మించిన తీర ప్రాంతముంది. ఇదొక రకంగా రాష్ట్రానికి వరం. అయితే, గత ప్రభుత్వం, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం సముద్ర తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన కూడా చేయడం లేదు. అయితే, ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఫలితంగా అకాల వర్షాలు, తుపానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచనలు, ప్రాధాన్యాంశాలు మారకపోతే.. ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తానికి మొత్తంగా ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, గత పదిహేడు నెలల అనుభవాలను గమనిస్తే.. ఎవరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలోచన మారుతుందని చెప్పలేం.

About Author

By editor

Twitter
YOUTUBE