రేపటి ఉషస్సును దర్శించుకునే అదృష్టం గురించి కూడా ఇవాళ చాలా మందికి సందిగ్ధమే. చరిత్రలో కనిపించే కరుడగట్టిన సైనిక నియంతృత్వాలను మించిపోయిన కరోనా వైరస్‌ ‌లక్షణం అలాంటి సందిగ్ధంలో నెట్టేసింది. మరణం వచ్చి ముంగిట్లో కాపు కాయడానికి గొప్ప కారణాలేవీ అవసరం లేదిప్పుడు. కొవిడ్‌ 19 ఒక తరం వారికి భవిష్యత్తు మీద నమ్మకం పోగొడుతోంది. ఆందోళనల మధ్య జీవించాలని శాసిస్తున్నది. కానీ ఈ క్షణం దాకా కూడా మనకో జీవితం ఉంది. అదెలాంటిది? నాకైతే గడచిన ఆ జీవితం మీద ఒక విహంగ వీక్షణమైనా చేయాలని చాలా గాఢంగా అనిపిస్తున్నది. గడిపిన జీవితం మీద, దానితో సమాజానికి జరిగిన మేలు మీద చిన్న సమీక్ష అయినా జరుపుకోవద్దా! ఆత్మకథలు రాసుకునే అవకాశం ఉన్నా లేకున్నా ఈ పని అవసరమే. ఆ పని ఆత్మకు తృప్తినిచ్చేదే కూడా. ఆ పనిని కరోనా కాస్త ముందుకు తెచ్చిందేమో! ఇంకొకటి కూడా ఉంది. వృద్ధాప్యం సమీపించాక, ముఖ్యంగా ఎనిమిది పదుల వయసుకి; ఈ భూమ్మీద ప్రయాణం ముగింపు అంచులకు వస్తున్నట్టే. ఇంత జీవితం గురించి వెనక్కి తిరిగి చూసుకుని అది ఎలా సాగిందో చూసుకుంటే అద్భుతమనిపిస్తుంది. అనుకూల పరిస్థితులు, లేదా ప్రతికూలతల మధ్య- జీవితమైతే ఇంతవరకు ఇలా సాగిపోయిందన్నది నిజం. వ్యక్తిగా నేను ఇంకొంత సాధించి ఉండరాదా అన్న భావన వదలకుండా వెంటాడుతూనే ఉంది. అలాగే చేపట్టిన వృత్తిలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి ఉంటే? అన్న ప్రశ్న కూడా.

భారతదేశంలో ఉన్న 565 సంస్థానాలలో పెద్దది, హైదరాబాద్‌ ‌సంస్థానంలో ఉన్న జంగంపల్లి మా ఊరు. ప్రస్తుత కామారెడ్డి జిల్లాలో ఉంది. మాది వ్యవసాయదారుల కుటుంబం. నాకు ఊహ తెలిసే కాలానికీ, జ్ఞానం వస్తున్న సమయానికీ నా భవిష్యత్‌ ‌జీవితం గురించి పెద్ద పెద్ద ఊహలేవీ ఏర్పరుచుకోలేదనే చెబుతాను. బాగా చదువుకోవాలన్న ఒకే ఒక్క ఆశ మాత్రం ఉండేది. అందుకే మా తాతముత్తాలు ఇంట్లో సేకరించి పెట్టిన చాలా గ్రంథాలని చదవడమే అందుకు మార్గమని అనుకున్నాను. అందులో సీపీ బ్రౌన్‌ ‌కూర్చిన తెలుగు నిఘంటువు కూడా ఉండేది. 1858లో వెలువడిన పుస్తకమది. నలభీమ పాకశాస్త్రం మీద, నకుల సహదేవ శాస్త్రం (ఇందులో ఒకరు ఆవుల వైద్యంలోను, రెండోవాడు గుర్రాల వైద్యంలోను సిద్ధహస్తులని ప్రతీతి), వీటితో పాటు రామాయణం, పురాణాలు, ఆయుర్వేద గ్రంథాలు, గణితం పుస్తకాలు, కృష్ణాపత్రిక పాత సంచికలు, అన్నింటికీ మించి పాత పంచాంగాలు.. అవీ ఇవీ అనేమిటి! ఎన్నో పుస్తకాలు. తెలుగు భాషా సంపద అది. కానీ బయటి ప్రపంచంలో తెలుగు పలుకు వినిపించేది కాదు- నిషిద్ధం.

అక్కడే మొదలవుతుంది నా బాల్యం. అంటే నా బాల్యాన్ని గుర్తు చేసుకోవడమంటే ఓ సంక్షుభిత చరిత్ర ఖండాన్ని గుర్తు చేసుకోవడమే. నిజాం సంస్థానంలో ముస్లిమేతరుల జీవితానికి అద్దం పట్టే జ్ఞాపకాలే అవన్నీ. ఆరువందల ఏళ్ల అణచివేత. దానికి పరాకాష్ట రజాకార్‌ ఆగడాలు. వీటి మధ్యనే సాగింది నా చిన్నతనం.ఈ అణచివేత, ఈ సామాజిక హింస నాకు బాల్యం వరకే. మరి, మా పూర్వికులు! ఇంటి లోపల ధర్మం గురించి ఆరాటం. బయట-తమ ధర్మాన్ని గౌరవించని ముస్లిం శాసనాన్ని ధిక్కరించాలన్నా సాధ్యం కాని ఇరకాటం. అయినా ధర్మం పట్ల వారి అనురక్తి గురించి ఇప్పుడు తలుచు కుంటే మా పూర్వికులే కాదు, ఆ కాలంలో జీవించిన ముస్లిమేతరులంతా యోధులే అనిపిస్తారు. ఆరు శతాబ్దాల కాలం ఎవరైనా తమ విశ్వాసాలను నిలబెట్టుకోవడం చిన్న విషయం కాదు. మాతృభాష పట్ల, సంస్కృతి పట్ల వారు చూపించిన నిబద్ధత చిరస్మరణీయం. కోతలు పూర్తయి, కర్షకులు కొంచెం వెసులుబాటుగా ఉండే సమయంలో దాదాపు నెల రోజుల పాటు మా ఊరి శివాలయం ప్రతి సాయంత్రం సందడిగా ఉండేది. ఒక పండితుడు ఎక్కడి నుంచో వచ్చి గీతా పారాయణం చేసేవారు. హిందూ పండుగలకు హరికథలు, పురాణ పఠనాలు, నాటకాలు ఉండేవి. అవన్నీ హిందూ పురాణాంశాలే అయినా అధికారులు పట్టించుకునేవారు కాదు. అలా అని అది అనుమతి కూడా కాదు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం నవాబు లొంగిపోయాడు. అంతకు కొద్ది ముందు ఆరంభమైన రజాకార్ల ఆగడాలు ఆగాయి. సెప్టెంబర్‌ 17, 1948‌న ఇక్కడ కూడా జాతీయ పతాకం ఎగిరింది. నిజామాబాద్‌కు తొలిసారి ఒక తెలుగు ఉపాధ్యాయుడు వచ్చి బహిరంగంగా పాఠాలు చెప్పడం మేమంతా ఆనందంగా విన్నాం. ఆ సంతోషాల వెనుకే చిన్న వేదనాభరిత ప్రశ్న. హైదరాబాద్‌ ‌ప్రాంతానికి ఆగస్ట్ 15‌తో సమానమైన సెప్టెంబర్‌ 17‌వ తేదీకి ఏదీ గుర్తింపు?

తాతగారు 60 సంవత్సరాలే జీవించారు. ఆయన ఏమిటో, ఆయన సేవలు ఎంతటివో ఇప్పుడు మన మధ్య ఉన్న కొందరు కుటుంబ సభ్యులకు మినహా మిగిలిన వారికి జ్ఞాపకం లేకపోవచ్చు. కానీ ఒక్కసారి ఆయన జీవితంలోకి చూసి ఆయన సమాజానికి అందించినదేమిటో శోధిస్తే ఓ అద్భుతం కళ్లముందు కనిపిస్తుంది. ఆయన 40 ఎకరాలలో సేద్యం చేశారు. అంతా వర్షాధార భూమే. 300 పశువులు ఉండేవి. ఆయన ప్రాపకంలో 20 కుటుంబాలు ఉండేవి. నేను చూసిన తాతగారు, నానమ్మ కాలం ఎలా ఉండేదో కొంచెం చెబుతాను. నా తొలి జ్ఞాపకాలంటే అవే కూడా.

 ఆనాడు ఉన్న విద్యావసతి ఎంత? పన్నుల భారం ప్రజలను ఎంతగా కుంగదీసేది? స్వాతంత్య్ర పోరాటంతో సంస్థానానికి బయట స్వేచ్ఛాగీతం ఆలపిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యత్వం పొందడం, ఆంధ్ర మహాసభలకు, ఇతర సమావేశాలకు హాజరుకావడం ఎంత కష్టమో అప్పుడు అవగాహనకు వస్తుంది.

మొదట హైదరాబాద్‌ ‌సంస్థానంలో విద్యా సౌకర్యం ఎలా ఉందో ఒకసారి పరికించాలి. హైదరాబాద్‌ ‌లేదా నిజాం సంస్థానం అంటే బహు భాషల సంగమం. వీళ్లలో తెలుగు మాట్లాడేవారు 48.2 శాత. మరాఠీ మాట్లాడేవారు 26.4 శాతం. కన్నడం మాట్లాడేవారు 12.7 శాతం.మొత్తం జనాభాలో ఉర్దూ భాష మాట్లాడేవారు కేవలం 10.3 శాతం. అయితే నిజాం సంస్థానంలో పెద్ద వింతేమిటీ అంటే ఫారసీ లేదా పర్షియన్‌ అధికార భాష. న్యాయస్థానాలలో, పరిపాలనలోని అన్ని స్థాయిలలో ఈ భాషే చెలామణిలో ఉండేది. అసఫ్‌జాహి, అంతకు ముందు ఉన్న కుతుబ్‌షాహీల కాలంలోనూ పర్షియన్‌, ఉర్దూ రాజభాషలుగా ఉండేవి. ఇందులో కుతుబ్‌షాహీలు పర్షియన్‌ ‌మూలాలు కలిగినవారే.

 ఇలాంటి నేపథ్యంలో మా తాతగారు, నానమ్మ మొదట ఫారసీలో, తరువాత ఉర్దూలో విద్యాభ్యాసం చేయక తప్పలేదు. వారి కాలంలో అసలు పాఠశాలే లేదు. మా నాన్నగారి కాలానికి ఏకోపాధ్యాయ పాఠశాల మాత్రం వచ్చింది. మా తాతగార్ల కాలంలో వారు ఇళ్లలోనే తెలుగు నేర్చుకోవలసిన పరిస్థితి. నేను కూడా మా నాన్నగారి లాగే మొదట ఉర్దూలోనే చదువుకున్నాను. అంతకు ముందు ఎవరూ కుటుంబంలో చదువుకున్న వారు లేకపోవడం వల్ల అప్పటి మహిళలు పెద్దగా చదవగలిగేవారు కాదు. తమ పేరు మాత్రం రాసుకునేవారు. ఉర్దూ తెలిసిన వారు పది శాతమే ఉన్నా, ప్రాథమిక స్థాయి చదువు నుంచి ఒక్క ఉర్దూ మాధ్యమమే ఉండేది. పోనీ తెలుగు, మరాఠీ, కన్నడ భాషా మాధ్యమాలతో ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించాలని ఎవరైనా అనుకుంటే నిజాం, ఆయన అధికార యంత్రాంగాల అనుమతి తప్పనిసరి. అప్పటి మా కామారెడ్డి తాలూకా అంతటికి ఒకే ఒక్క మిడిల్‌ ‌స్కూల్‌ ఉం‌డేది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దీనినే ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి నిజామా బాద్‌ ‌జిల్లా మొత్తానికి ఒకే ఒక్క ఉన్నత పాఠశాల ఉంది. హైదరాబాద్‌ ‌సంస్థానంలో అక్షరాస్యత శాతం అంత తక్కువ స్థాయిలో ఉండడానికి కారణం ఇదే. 1880 నుంచి 1930 వరకు నమోదైన అక్షరాస్యత 3 నుంచి 5 శాతమే. ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ప్రాంత అక్షరాస్యత ఎలా ఉండి ఉంటుంది? ఇక్కడ ఈ ప్రశ్న వస్తుంది. అది కూడా చూద్దాం. 1881-3.7 శాతం, 1891-4.4 శాతం, 1901 3.4 శాతం, 1911-3.2 శాతం, 1921- 3.3 శాతం, 1931-4.0 శాతం. ముందే చెప్పుకున్నట్టు ఆ రోజుల్లో హైదరాబాద్‌ ‌సంస్థానంలో అసలు ప్రైవేటు పాఠశాలలే లేవు. ఇదంతా ముస్లిం ప్రభువుల విద్యా విధానం ఫలితమే.

తెలుగువాళ్లే అయినా, తెలుగు మాట్లాడేవారే అధిక సంఖ్యాకులుగా ఉన్నా, మా తాతగారి విద్యాభ్యాసం బాలశిక్షతో ఆరంభం కాలేదు. ఆయన చదువు ‘ఫారసీ కి పెహ్లీ కితాబ్‌’, అం‌టే ‘పర్షియన్‌ ‌తొలి పుస్తకం’తో ఆరంభించారు. 1890లో అచ్చయిన పాఠ్యపుస్తకమిది.

ఆ కాలంలో అసలు సంస్థానంలో ఎన్ని పుస్తకాలు అచ్చయినాయో కూడా గుర్తు చేసుకోవాలి. 1910లో అచ్చయినవి 933. అందులో ఉర్దూ పుస్తకాలే 883. అరబిక్‌ 25, ‌తెలుగు 14, పర్షియన్‌ 6, ఇం‌గ్లిష్‌, ‌మరాఠీ రెండేసి వెలువడినాయి. ఆ సంవత్సరంలో వెలువడిన వార్తాపత్రికలు ఎన్ని? అవి ఏ భాషలలో ఉన్నాయి? ఉర్దూ, పర్షియన్‌ ‌భాషా పత్రికలు 25. తెలుగు 1, మరాఠీ 4, ఇంగ్లిష్‌ 13.

ఇక్కడ ఒక విషయం విస్పష్టంగానే ఉంది. ముస్లిం పాలకుల సుదీర్ఘ పాలనా కాలంలో తెలుగు వికసించలేదు. అధిక సంఖ్యాకులు మాట్లాడే ఈ భాష పాలకుల ఆదరణకూ నోచుకోలేదు.

అలాంటి పరిస్థితులలో కూడా మా ఇల్లు తెలుగు పుస్తకాలతో నిండి ఉంది. తెలుగు భాషాభిమానాన్నీ మమకారాన్నీ నిలిపి ఉంచడమంటే అదెంతో ఘనమైనది. 1948, సెప్టెంబర్‌లో ఆ ఆలస్యపు స్వాతంత్య్రం తరువాత తెలుగు అధికార భాష అయింది. కామారెడ్డికి తొలిసారి తెలుగు ఉపాధ్యా యులు వచ్చారు. ఆయనే- అమరేశం రాజేశ్వర శర్మగారు. అప్పటి నుంచి, కొన్ని శతాబ్దాలుగా అణచివేతలో ఉన్న మాతృభాషను జనం స్వేచ్ఛగా నేర్చుకున్నారు. తెలుగు పండితునిగా అక్కడకి వచ్చి తరువాత నిబంధనల మేరకు మెట్రిక్‌, ఇం‌టర్‌, ‌డిగ్రీ, పీజీ చేశారాయన. ఆపైన తెలుగు వ్యాకరణంలో పరిశోధన చేశారు. అక్కడికొచ్చిన మరొక తెలుగు పండితుడు వెంకటేశ్వరశర్మగారు.

మా కుటుంబానికి గానీ, అసలు మా ఊరుకు గానీ తెలిసిన ఏకైక వృత్తి వ్యవసాయం. వర్షాధార భూములలో సేద్యం చేసిన నాటి గ్రామీణ తెలంగాణలో కర్షకుల పరిస్థితులు తెలుసుకోవడం కూడా ఒక విషాదకరంగానే ఉంటుంది. మధ్య యుగాలలో దేశ ఆర్థిక వ్యవస్థలో మూడింట రెండువంతులు గ్రామీణ ప్రాంత ఉత్పత్తుల మీద ఆధారపడి ఉండేది. నిజాం సంస్థానానికి తొంభయ్‌ ‌శాతం రాబడి భూమిశిస్తుతోనే వచ్చేది. అది అపారమైన భారం. ఈ భారం ఎంత ఘోరమో ఈ లెక్క చూస్తే తెలుస్తుంది. 1854-1855 సంవత్స రంలో మొత్తం నిజాం వార్షికాదాయం రూ. 43,68,084. ఇందులో భూమిశిస్తు ద్వారా లభించినది రూ. 37,11,505. దిగుమతి సుంకాలు, అబ్కారీ, తపాలా, జరిమానాలు, న్యాయస్థానాల రుసుము వంటి వాటితో మిగిలిన ఆదాయం వచ్చేది.

ఆ రోజులో రైతుల పరిస్థితి ఏమిటి? వారికి మా పూర్వికుల నుంచి ఎలాంటి సేవలు లభించాయి? పశుపోషణ ఎలా ఉండేది? వీటి గురించి తెలియా లంటే కొన్ని ఉదంతాల ద్వారా మాత్రమే సాధ్యం. ఆ రోజులలో వ్యవసాయం అంటే పూర్తిగా జూదమే. అంత అనిశ్చితి! సేద్యమంతా రుతుపవనాల మీద ఆధారపడే ఉండేది. మా కుటుంబానికి 80 ఎకరాల భూమి ఉండేది. అందులో ‘తరి’, తడారు భూమి దాదాపు 15 ఎకరాలు. మిగిలినది మెట్టభూమి. దీనినే ఖుస్కి అంటారు. వీటిలో పండే ధాన్యం మా కుటుంబం గడవడానికి, మా కుటుంబం మీద ఆధారపడి ఉన్నవారికి చాలినంతగానే ఉండేది. అమ్ముకోవడానికి మిగిలే పంట చాలా స్వల్పం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పూర్వం ఇక్కడి కుటుంబాలు పాలు, కూరగాయలు అమ్ముకునే పద్ధతి ఉండేది కాదు. మా కుటుంబానికి ప్రధాన ఆదాయం పశువుల మీదే లభించేది. మాకు ఆవులు, ఎద్దులు కలిపి మూడు వందలు, పన్నెండు వరకు దున్నపోతులు ఉండేవి. పంటలకు కావలసిన ఎరువు ఈ పశువుల ద్వారానే వచ్చేది. పూర్వకాలంలో గాని, మా పూర్వికులు వ్యవసాయం చేసినప్పుడు గాని రసాయనిక ఎరువులు వాడే అలవాటే లేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సమస్య లేకుండా ఉండడానికి రైతులు పండించిన పంటను మూడు లేదా నాలుగేళ్లకు సరిపడే విధంగా నిల్వ ఉంచాలని మా పూర్వికులు నమ్మేవారు. ఆ నిల్వలు వారి సొంత ప్రయోజనాల కోసమే కాదు, మా గ్రామం మొత్తానికి ఉపయోగపడాలన్నదే లక్ష్యం. అలా నిల్వ చేసిన పంటే 1918-19 కాలంలో ఐదు మాసాలకు గ్రామమంతటికీ సరిపోయింది. అంటే స్పానిష్‌ ‌ఫ్లూ కాలం. ఇప్పుడు ప్రపంచాన్ని నులిమేస్తున్న కరోనా దాని కుటుంబంలోనిదే. అప్పుడే రెండేళ్లు వర్షాలు ముఖం చాటేశాయి. కరువు వచ్చింది. జంగంపల్లి చుట్టుపక్కల గ్రామాలలో చాలా మరణాలు నమోదైనాయి. అలాగే దేశంలోని చాలా ప్రాంతాలలో ఆకలి మరణాలు సంభవించాయి. కానీ, ఆ ముస్లిం పాలన కాలం మొత్తంలో మా గ్రామంలో మాత్రం ఆకలితో చనిపోయిన వారు లేరు. ఇక కరువు కాటకాల సంగతి సరేసరి. మనకు తెలిసిన అతి ఘోరమైన కరువు 1940ల నాటి నాటి బెంగాల్‌ ‌కరువు. ఆ సమయాలలో ఇక్కడ నిజాం, అక్కడ ఆంగ్లేయులు చూపించిన నిర్లక్ష్యం ఘోరమైన నేరం.

ఒక రైతు కుటుంబం నుంచి నేను వైద్యుడినయ్యాను. సైకిళ్లు అప్పుడప్పుడే వస్తున్నాయి మా ప్రాంతానికి. ఓ అద్దె సైకిల్‌తో అనుభవం నన్ను ఆ విద్య వైపు తీసుకెళ్లింది. అద్దెకు తెచ్చుకుని సైకిల్‌ ‌తొక్కడం నేర్చుకుంటూ, పడిపోయాను. కుడితొడకు బాగా తగిలింది.అది తగ్గడానికి సమయం పట్టింది. అప్పుడే ఎలాగో నా మనసులోకి వచ్చింది తెల్లకోటు.

 వైద్యవిద్య పూర్తి చేసి 1968లో హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ ‌మొదలు పెట్టేనాటికి ఒక ఐచ్ఛికాంశంగా న్యూరో సర్జరీ మరీ ప్రాథమిక దశలో ఉండేది. మరి ఇప్పుడు! నాతో సహా ఈ ఒక్క నగరంలోనే 200 మంది న్యూరోసర్జన్లు ఉన్నారు. ఇక్కడే ప్రాక్టీస్‌ ‌చేసి, ఎంతో అనుభవజ్ఞులుగా ఇవాళ పేర్గాంచిన వారికి తర్ఫీదు ఇవ్వడంలో నేను కీలక భూమికనే పోషించాను కూడా. 1969లో ఉస్మానియా ఆసుపత్రిలో, 1976లో గాంధీ, 1986లో నిమ్స్ ఆసుపత్రిలో న్యూరో సర్జరీలో ట్రెయినింగ్‌ ‌కోర్సులను ప్రారంభించడంలో నేను కూడా భాగస్వామిని అయ్యాను. వేలాది శస్త్రచికిత్సలు చేశాను. న్యూరలాజికల్‌ ‌రుగ్మతలతో బాధపడుతున్న ఎన్నో వేల మందికి వైద్యం చేశాను. ఈ అంశంతో పాటు ఫ్లోరోసిస్‌ ‌సమస్య మీద వందలలో వ్యాసాలు రాశాను. నేను సాధించినది చూసుకుంటే నా మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. కానీ, మా తాతగారు చేసిన సేవతో పోలిస్తే మాత్రం ఇది చాలా తక్కువ.

– డా।। దేమె రాజారెడ్డి, న్యూరో సర్జన్‌, అపోలో

About Author

By editor

Twitter
YOUTUBE