హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీకం వ్రతాల మాసం. అందులోనూ రోజు వెంట రోజున వచ్చే పర్వదినాలు ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి. ఈ మాసంలో ఈ రెండు తిథులు శుక్ల పక్షానికి సంబంధించినవి. ఈ మాసానికి అధిదైవం దామోదరుడు. ఆయనకు తులసీదేవితో పరిణయం చేస్తారు. తొలిఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) నాడు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణకథనం. కనుకనే దీనికి ఉత్థాన ఏకాదశి అని పేరు. ప్రబోధ ఏకాదశి అని కూడా అంటారు. చైతన్యానికి చిహ్నంగా చెప్పే ఇది మానవులలోని అశాంతిని తొలిగించి ప్రశాంతతను ప్రసాదిస్తుందని విశ్వాసం. అనాది నుంచి మనిషి ఏదో ఒక అంశంలో అశాంతికి లోనవుతూనే ఉన్నాడని, అలాంటి వాటి నుంచి మనిషిని బయటపడవేసేదే ఈ పండుగని పెద్దలు చెబుతారు. విష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించే ముందు లోకపాలన మహాకర్తవ్యాన్ని నారాయణి అయిన తన సోదరి పార్వతికి అప్పగిస్తాడని, నాలుగు నెలల తరువాత నిద్రమేల్కొంటాడని చెబుతారు. దానిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అప్పటి నుంచి నాలుగు నెలల పాటు ఆధ్యాత్మిక పురుషులు చాతుర్మ్యాస్య దీక్షను పాటిస్తారు. యోగనిద్రకు ఉపక్రమించిన నాటి తిథికి అంత విశిష్టత ఉంది.


శ్రీహరితో ముడిపడి ఏకాదశి మహాత్యం గురించి పురాణగాథలు ఉన్నాయి. ఆయన యోగ నిద్రలోకి వెళ్లిన సమయంలో దైవీశక్తులు లేదా సురులకు భగవంతుని సహాయం దక్కదన్న ధీమాతో అసురీశక్తులు విజృంబిం•చాయి. దాంతో కకావికలురైన సురకోటి వైఖంఠధామానికి పరుగులు తీయగా, వారి దీనస్థితిని గమనించిన దేవదేవుడి దివ్యదేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైన సాత్వికశక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమికొట్టింది. యోగనిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడట. తాళజంఘుడు అనే అసుర కుమారుడు మురాసురుడితో పోరాడిన విష్ణువు అలసిపోయాడని, ఆ సమయంలో ఆయన శరీరం నుంచి జన్మించిన కన్య పేరు ఏకాదశి అని కూడా చెబుతారు. కురుక్షేత్ర యుద్దంలో అంపశయ్యను చేరిన కురుకుల పితామహుడు భీష్ముడు ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ గడిపాడు. యాజ్ఞవల్క్య మహర్షి ఈ రోజేనే జన్మించాడు.

బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లు చెబుతున్న ప్రకారం, ఉత్థాన ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సకల సంతోషాలు కలుగుతాయి. ఆరోజు ఉపవాస దీక్ష పాటించిన వారు ఏ ఒక్కరికి అన్నదానం చేసినా వెయ్యి అశ్వమేధ, వంద రాజసూయ యాగాలు చేసినంత ఫలితం ఉంటుందట. ఆ రాత్రంతా శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు చిత్రపటం ముందు అఖండ దీపారాధన చేసి స్వామి నామస్మరణతో జాగరణకు కూడా అదే ఫలితం సిద్ధిస్తుందని చెబుతారు. ఈ వ్రతం ఆచరణకు అవకాశం లేనివారు హరిని మనసున నిలిపి తులసీకోటను అర్చించి, ఏడు ప్రదక్షిణలు చేసినా సరిపోతుందని ఆధ్మాత్మికవేత్తలు చెబుతారు. ఈ తిథినాడు మేల్కొన్న స్వామి ద్వాదశి నాడు మహాలక్ష్మిని స్వీకరించి, సర్వలోకాలకు మంగళం చేకూర్చారని కథనం.

ఈ మాసంలో భక్త అంబరీష గాథను పారాయణం చేయలంటారు. భగవంతుడి కంటే భక్తుడే బలవంతుడని, భగవంతుడి కంటే, ఆయన దివ్యాయుధాల కంటే భక్తే గొప్పదని చాటే కథ. అందుకు నేపథ్యాన్ని పరిశీలిస్తే, దుర్వాసముని అంబరీషుడిపై రాక్షసుడిని ప్రయోగించగా అంబరీషుడు విష్ణువును ప్రార్థించడంతో ఆయన వదిలిన సుదర్శనం ఆ మునిని వెంటాడుతుంది. దాంతో శరణుకోరిన మునితో ‘తాను సయితం చక్రాయుధాన్ని ఉపసంహరించలేనని చెప్పడం విశేషం. దుర్వాసుని తరపున అంబరీషుడే ప్రార్థించడంతో సుదర్శనం శాంతిస్తుంది. ఈ సంఘటన ఏకాదశినాడు చోటు చేసుకోవడంతో ఆ తిథి వ్రతమహాత్మ్యాన్ని గుర్తించిన దుర్వాసుడు కార్తిక శుక్ల ద్వాదశి నాడు అంబరీష కథను పారాయణం చేయాలని, అలాంటి వారికి ఎలాంటి కష్టాలు కలగవని, విష్ణుసాయుజ్యం కలుగు తుందని వరమిస్తాడు. ఏకాదశివ్రతం ఆచరించిన వారికి పవిత్రనదులు, సముద్రస్నానం ద్వారా లభించే పవిత్రత కంటే అధికంగా పుణ్యం లభిస్తుందని,సకల శుభాలతో పాటు అంతిమంగా మోక్షం సిద్ధిస్తుందని ఫలశ్రుతి.

ద్వాదశి విశిష్టత

ఉత్థాన ఏకాదశి తరువాత తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అంటారు. దేవదానవుల క్షీరసాగర మధనం ముగిసిన రోజు అని చెబుతారు. మధించడాన్ని లోకవ్యవహారంలో ‘చిలుకు’ అంటారు కనుక దీనికి ‘చిలుక’ ద్వాదశి అనే పేరు వచ్చిందంటారు. క్షీరసాగర మధనంలో హాలహలం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు తరువాత ఉద్భవించిన శ్రీమహాక్ష్మిని హరి కార్తీక శుద్ధ ద్వాదశినాడు పరిణయమాడారు. నాటి నుంచి లక్ష్మీనారాయణుల కల్యాణం జరపడం ఆనవాయితీగా వస్తోంది. సన్యాసులు, యోగులు, మునులు చాతుర్మాస్యదీక్షను ఈ రోజు విరమిస్తారు. కనుక ‘యోగీశ్వర ద్వాదశి’ అని, అత్యంత పుణ్యప్రదమైనది కావడంతో ‘పావన ద్వాదశి’ అని, శ్రీమహావిష్ణువు లక్ష్మీసమేతంగా బృందావనం చేరిన తిథి కాబట్టి ‘బృందావన ద్వాదశి’ అని వ్యవహరిస్తారు.

దేశంలో ఈ ద్వాదశి పూజలు రకరకాలుగా నిర్వహిస్తారు. ఉదాహరణకు, తెలుగునాట ఆ రోజు సాయంవేళ తులసికోటలో కాయలతో కూడిన ఉసిరి కొమ్మను ఉంచి పూజిస్తారు. తులసీ మొక్కను లక్ష్మీ స్వరూపిణిగా, ఉసిరిని విష్ణు స్వరూపంగా భావిస్తారు (ఆ భావనతోనే వనభోజనాలు ఉసిరి చెట్టు నీడలో ఆరగిస్తారు). కనుక ఉసిరి కొమ్మను తులసి మొక్క పక్కన ఉంచి దీపారాధన చేస్తారు. మహారాష్ట్రలో శ్రీకృష్ణ విగ్రహానికి, తులసి మొక్కకు పెళ్లి చేస్తారు. విగ్రహానికి, తులసి మొక్కకు నడుమ శాలువ పట్టు కుంటారు. తులసిమాత మొదట్లో చెరకు ముక్క ఉంచి, పసుపుతో తడిపిన వస్త్రాలు, గాజులు వంటివి తులసి మొక్కకు కడతారు. అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం ఘట్టం ముగుస్తుంది. ముందురోజు ఉపవాస దీక్ష పాటించిన వారు ద్వాదశి నాడు విష్ణువును అర్చించి ప్రసాదం స్వీకరిస్తారు. ముతైదువులను, బ్రాహ్మణులను నూతన వస్త్రాలు, తాంబూలంతో సత్కరిస్తారు.

తిరుమలలో కైశిక ద్వాదశి

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని దివ్యధామంలో ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కైశిక ద్వాదశి ఉత్సవం జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీదేవిభూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరువీధులలో ఊరేగుతారు. ఏడాదిలో మూడుసార్లు మాత్రమే (క్షీరాబ్ది ద్వాదశి, ముక్కోటి ద్వాదశి, ద్వాదశి ఆరాధనకు) వేకువ జామున గర్భాలయం దాటి నాలుగు మాడవీధుల్లో ఊరేగి సూర్యోదయానికి ముందే ఆలయానికి చేరుకుంటారు. సూర్యకిరణాలు సోకితే ఉగ్రత్వం వస్తుందంటారు. ఉత్సవమూర్తి ఆలయ ప్రవేశం తరువాత ఆరగింపు, కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహిస్తారు. ‘వెంకటంతురైవారు’ అని పిలిచే ఈ విగ్రహాన్ని ప్రస్తుతం విహరించే భోగ శ్రీనివాసుడి కంటే ముందు బయట ఉత్సవాలకు వాడేవారట. ఒక అగ్నిప్రమాదంతో ఆయనకు ‘ఉగ్ర’ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఒకసారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి చాలా ఇళ్లు దగ్ధమయ్యాయట. ప్రమాదకారణం స్పష్టంగా తెలియకపోయినా, స్వామికి ఏదో లోపం జరిగి ఉంటుందని, అదే ఆ ప్రమాదానికి కారణమై ఉంటుందని అర్చకులు, ఆలయ అధికారులు భావించి క్షమాపణ కోరారట. అంతతో ఒక భక్తుడిని ఆవహించిన స్వామి ‘ఇకమీదట ఈ విగ్రహాన్ని ఊరేగింపునకు తీసుకురావద్దు. తెస్తే ఇలాంటి ప్రమాదాలు అనివార్యం’అని చెప్పారట. అంతేకాక ‘తిరుమల లోయలోనే శ్రీదేవి భూదేవి సమేతంగా మరో మూర్తిగా ఉన్నానని, వాటిని వెలికి తీసి ఉత్సవమూర్తులుగా అర్చనాదులు నిర్వహించాలని సూచించారట. అలా లభించిన విగ్రహాలే నేటికీ పూజలందుకుంటున్న మలయప్పస్వామి.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE