ఎన్నికలలో గెలుపోటములు సర్వ సాధారణం.  ఈ సత్యాన్ని తెలుసుకునేందుకు పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. ఇది ఏన్నోసార్లు రుజువైన వాస్తవం. అన్ని రాజకీయ పార్టీలకు అనుభవంలో ఉన్న సత్యం. నిజానికి, ఈ గెలుపోటములే ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చే అందాలు. గెలుపోటములు లేని ఏక పార్టీ ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్యమే కాదు. అది చైనా మార్కు నియంతృత్వం.

నిజమైన ప్రజాస్వామ్య ప్రియులు ఎవరూ అలాంటి అలంకార ప్రాయమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకోరు. అందుకే, ‘ఇందిరే ఇండియా… ఇండియానే ఇందిర’ అని తమవారి చేత కీర్తినందుకున్న ఇందిరాగాంధీ అంతటి నాయకురాలికి కూడా పరాజయం తప్పలేదు. అత్యవసర పరిస్థితి విధించి ప్రజాస్వామ్యాన్ని పరాభవించిన ఇందిరాగాంధీని ప్రజలు తిరస్కరించారు. నిశ్శబ్దంగా సాగనంపారు. అలాగే, నేనే రాజు, నేనే మంత్రి తరహాలో తలెగరేసిన చాలా మంది మహా నాయకులు చరిత్రగా మిగిలిపోయారు. అందుకే, మనదేశానికి ప్రజాస్వామ్య ప్రపంచంలో ప్రత్యేక స్థానం, గౌరవం దక్కింది.

ఇటీవల బిహార్‌ ‌శాసనసభ ఎన్నికలతో పాటు, తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. ఇదొక అనూహ్య పరిణామం. అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో ఖాళీ అయిన స్థానం నుంచి, అది కూడా ఆయన సతీమణి పోటీ చేసినప్పటికీ, టీఆర్‌ఎస్‌లో ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరొందిన, ‘నాకు ఓటమి తెలియదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుపును ఎగరేసుకు పోవడమే తెలుసు’ అని సగర్వంగా ప్రకటించుకున్న పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, ఆర్థికమంత్రి హరీశ్‌రావు సర్వం తానై ప్రచారం సాగించినా పార్టీ ఓటమి చవిచూడడం నిజంగా ఒక అనూహ్య పరిణామం.

ఇక్కడ బీజేపీ గెలుపుకు ఇతరత్రా ఎన్ని కారణాలున్నా.. వరుస ఓటములను సోపానాలుగా చేసుకుని గెలుపుపైన దృష్టిని కేంద్రీకరించిన అభ్యర్థి రఘునందన్‌రావు ప్రజలలో మమేకమైన తీరు, పట్టువదలని విక్రమార్కుని వలె ఆయన సాగించిన పోరాటం ఈ విజయానికి ప్రధాన కారణం. అధికార పార్టీ తన అధికారాన్ని, పోలీసు యంత్రంగాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టే పిచ్చి చేష్టలకు పాల్పడడం మరొక కారణంగా చెప్పవచ్చు. అన్నిటినీ మించి దుబ్బాక నియోజకవర్గానికి మూడు దిక్కులా, ముగ్గురు తెరాస కుటుంబ పెద్దలు (కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరేశ్‌రావు) ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో జరుగుతున్న అభివృద్ధితో పోల్చుకుంటే, మధ్యలో దుబ్బాక అభివృద్ధి రహితంగా మిగిలి పోవడం ప్రజలను ఆలోచింపచేసింది. అలా చివరికి దుబ్బాక ఉపఎన్నిక చిత్రానికి శుభం కార్డు పడింది.

అయితే, ఇప్పుడు చర్చ దుబ్బాక కాదు, తిరుపతి. దుబ్బాక గెలుపు నేపథ్యంగా తిరుపతి ఉపఎన్నికపై చర్చ తెరపైకి వచ్చింది. నిజమే, దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికకు, త్వరలో తిరుపతి లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు మధ్య పోలిక అంతగా కుదరదు. అక్కడా, ఇక్కడా అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌ ‌సభ్యుల ఆకస్మిక మృతి వలన ఎన్నిక అనివార్యం కావడం, అక్కడా ఇక్కడా కొద్దిపాటి తేడాతో ఏదో రకమైన ప్రభుత్వ వ్యతిరేకత అంతో ఇంతో ఉండడం వంటి కొన్ని సారూప్యాలు ఉన్నప్పటికీ దుబ్బాక దుబ్బాకే. తిరుపతి తిరుపతే. అక్కడ అలా జరిగింది కాబట్టి, ఇక్కడ కూడా అలాగే జరుగు తుందని అనుకోలేం. అనుకోరాదు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అందుకే చాలా సందర్భాలలో రాజకీయ పండితులు, మహా విశ్లేషకులు అనుకునే వారి లెక్కలు కూడా తప్పుతుంటాయి. దుబ్బాకలో కూడా తెరాసదే గెలుపని చాలా మంది లెక్కలు కట్టారు. అలాగే, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని పేరు గొప్ప టీవీ చానళ్లు, కొందరు జర్నలిస్టు ‘మేధావులు’ బీజేపీ/ఎన్డీయే ఓటమి ఖాయమని నిర్ధారించారు. సంతోషం పట్టలేక చిందులేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభంజనానికి బ్రేకులు పడినట్లేనని విశ్లేషించారు. లాలూ లాంతరు కాంతులలో, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ ‌సారథ్యంలో బిహార్‌లో లాంతరు మహోదయం తథ్యమని, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో, బిహార్‌లో తేజస్వి లాంతరోదయం కూడా అంతే సత్యమని భావించి సంబరాలు చేసుకున్నారు. కానీ, చివరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కాబట్టి తిరుపతి ఉపఎన్నిక ఫలితాలు ఇలాగే ఉంటాయని గానీ, ఉండవని గానీ చెప్పడం సరి కాదు.

అయితే.. గత లోక్‌సభ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ, ఇంతలోనే ఏడుకొండలపై కాషాయ జెండా ఎగరేయడం పక్కన పెడితే.. అసలు అలాంటి ఆలోచన చేయడమే హాస్యాస్పదమని ముక్కున వేలేసుకుని మురిసిపోతున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ అనుకూల మీడియా గమనించవలసిన వాస్తవం ఒకటుంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యింది. ఈ కాలంలో కృష్ణా, గోదావరి నదుల్లో చాలా నీరు ప్రవహించింది. వరదలే వచ్చాయి. అలాగే, ఈ కాలంలో పాత్రలు, పాత్రధారులు మారి పోవడమే కాదు, రాజకీయ, సామాజిక ముఖచిత్రంలో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.

నిజమే, గత ఎన్నికల్లో బీజేపీకి తక్కువ ఓట్లే వచ్చాయి. వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్‌.. ‌టీడీపీ అభ్యర్థి పెనబాక లక్ష్మిపై రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు ఏడు లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పెనబాక లక్ష్మికి 4 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి శ్రీహరిరావుకి పోటీలో ఉన్న అందరికంటే తక్కవగా 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ పోలిక తీసుకొచ్చే వైసీపీ నేతలు, పార్టీ అనుకూల మీడియా ఉట్టికెక్కలేనమ్మ.. సామెతను గుర్తు చేస్తున్నారు. అయితే, 2019 ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితులలో జరిగాయి. చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చాలావరకు వైసీపీకి అనుకూలంగా పడ్డాయన్న వాస్తవాన్ని గుర్తిస్తే బహుశా వారు ఇలాంటి పోలిక తీసుకురాకపోయేవారేమో. అయితే, ఈ నిజం వారికి కూడా తెలియనిది కాదు. లేకపోతే బీజేపీ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించాగానే ఇంతలా ఉలిక్కి పడవలసిన అవసరం లేదు. అలాగే, దుబ్బాక విషయంలో తెరాస నాయకులు కూడా బీజేపీని మొదట్లో ఆటలో అరటిపండు అంటూ చులకన చేశారు. బీజేపీ అసలు పోటీలో లేదని తమ పోటీ కాంగ్రెస్‌తోనే అని బహిరంగంగా ప్రకటించారు. కానీ, చివరకు వచ్చేసరికి బీజేపీని ప్రధాన ప్రత్యర్ధిగా గుర్తించక తప్పలేదు. ఇప్పుడు తిరుపతి విషయంలో అధికార వైసీపీ ఆదిలోనే ఉలిక్కి పడుతోంది. ఈ ఉలికిపాటు తోనే బీజేపీ అంటే అధికార పార్టీ భయపడుతోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అలాంటి సంకేతాలే జనంలోకి వెళ్తున్నాయి.

సరే, ఆ విషయాన్ని పక్కనపెడితే.. తిరుపతి గెలుపుపై బీజేపీ ఆశలు పెంచుకోవడానికి దుబ్బాక గెలుపు ఇచ్చిన ఉత్సాహం ఒక కారణమయితే కావచ్చు గానీ, అంతకంటే ఇంకా ముఖ్యమైన కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల మొదలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతన్న, హిందూధర్మ వ్యతిరేక కార్యకలాపాల ప్రభావం తప్పకుండా తిరుపతి ఎన్నికపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే, చాలావరకు హిందువులు వైసీపీ ప్రభుత్వాన్ని హిందూవ్యతిరేక ప్రభుత్వంగా చూస్తున్నారు. అందుకు సహేతుక కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. తిరుమల సహా రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ దేవాలయాలలో అన్య మతస్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలాంటి వారిని తప్పించేందుకు ప్రయత్నించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను రాత్రికి రాత్రి బదిలీ చేయడం మొదలు, టీటీడీ ఆస్తుల అమ్మకం విషయంలో తలెత్తిన వివాదం, టీటీడీ అధికార వెబ్‌సైట్‌లో క్రైస్తవ భక్తీ గీతాలు ప్రసారం కావడం, టీటీడీ అధికార పత్రికలో హిందూధర్మ విరుద్ధ కథలు, కథనాలు ప్రచురించడం, సప్తగిరి పత్రికకు అనుబంధంగా క్రైస్తవ పత్రికను జత చేయడం, తాజాగా శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌ ‌సిబ్బంది అధికార వెబ్‌సైట్‌ ‌ద్వారా సోషల్‌ ‌మీడియాలో బూతు ప్రచారం సాగించడం.. ఇవిగాక అంతర్వేది రథ దహనం వంటి సంఘటనలు.. ఇలా చెప్పు కుంటూ పోతే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణకు రావడం తప్పు కాదు.

ఇవే కాదు.. ఇసుక పాలసీ, మూడు రాజధానుల వివాదం మొదలు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం పేరున సాగుతున్న ప్రభుత్వ సారా వ్యాపారం, పంచాయతీ కార్యాలయాల రంగుల విషయం మొదలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో వివాదం వరకు సాగుతున్న అనేక కోర్టు వివాదాలు, మొట్టికాయలు, రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక పరిస్థితులు, పార్టీలో మొదలై చాలా వేగంగా తీవ్రరూపం దాలుస్తున్న అంతర్గత విబేధాలు, కులాల కుమ్ములాటలు, ఈ అన్నిటినీ మించి ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత, ఫలితంగా మారుతున్న రాజకీయ సమీకరణలు.. ఇలా వైసీపీ ఓటమిని, బీజీపీ గెలుపును ఉహించడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అయినా, బీజేపీ తిరుపతి ప్రజలకు తెలియని పార్టీ కాదు, గతంలో తెలుగుదేశం పార్టీతో ఒకసారి ఈ స్థానం నుంచి బీజేపీ గెలిచింది. అప్పుడున్న పరిస్థితులలో ప్రజలు అలా తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన సమయం, సందర్భాలను బట్టి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కూడా అంతే.

‌- రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE