తిలక్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా
దేవరకొండ బాలగంగాధర తిలక్ మహాకవి (1921-1966) ఆధునికాంధ్ర సాహిత్యాకాశంలో అద్వితీయమైన తార.
‘కవిత్వపు ఆల్కెమీ రహస్యం’- తెలిసిన తిలక్- ‘అమృతం కురిసిన రాత్రి’- అమరుడైన కవితిలకుడు.
ఆయన అక్షరాలు-
‘వెన్నెట్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’!
ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు!
కన్నీటిజడులలో తడిసిన దయాపారావతాలు!’
అక్షరాక్షరంలోఆయన మానవతా దృష్టి పదేపదే సాక్షాత్కరిస్తుంది.
తిలక్ సాహిత్యాన్ని విశ్లేషిస్తే ఆయన పద్యకవిగా- వచనకవిగా- నాటికా రచయితగా- కథా రచయితగా- మానవతావాదిగా-అనుభూతి కవిగా- అభ్యుదయ కవిగా-వ్యాసకర్తగా-లేఖా రచయితగా- చమత్కారవంతమైన సాహిత్య స్రష్టగా మనకి స్పష్టమవుతుంది.
‘గోరువంకలు’ పేరుతో ఆయన వ్రాసిన ఛందోబద్ధ రచనలు ప్రచురితమయ్యాయి.
ఆయన పద్యరచనకి ఉదాహరణ:
‘దేవుడెచట? మనసు తేటతేరిన చోట!/దేవుడెచట? యిరులు తెగిన చోట!/ దేవుడెచట? సకల దీనుల కన్నీట!/దేవుడెచట?-‘స్వామి!’ నీవునచట!’
ఇక్కడ స్వామి- అంటే వివేకానందులు!- అదీ చమత్కారం.
సీతాస్వయంవర ఘట్టం ఖండికలో-
‘అదిగో సాగెను స్వామి విల్లుకయి ఆ యందము ప్రాతస్సర / స్సదనోద్దీపిత రాజహంస వలె ఆశాంతమ్ము శోభించు కన్ / తుదలన్జూడవె, లౌకికావధుల నాందోళించు క్రొవ్వెల్గు సం /పదలోమున్చెలియాతడే యతడు నాప్రాణేశుడాజన్మమున్’-
రామునికి సాటి రాముడే!- అన్నట్లు ‘ఆతడే యతడు!’
‘ప్రాతస్సరస్సదనోద్దీపిత రాజహంస’- ఎంత అందమైన ఉపమానం!
పద్యరచనలో వీరి పరిణతి మనకు స్పష్టమే.
వచనకవిగా-
‘అమృతం కురిసిన రాత్రి’ సంకలనం తెలుగులో ఒక అద్భుత వచన కవితా రసవదిక్షుఖండం! ప్రతి ఖండిక ఒక రసభావాద్భుతమే! ‘ప్రతి పర్వ రసోదయమ్’- అన్నట్లుగా! మానవతావాద భరితమే! అభ్యుదయ భావ మహోదయమే! ఈ ఖండికలెరుగని తెలుగు సాహిత్యాభిమానులు ఉన్నారంటే నమ్మలేం. ఆ మహానుభూతి రసార్ణవంలో తలమున్కలు కావలసినదే.
కొన్ని ఖండికలపేర్లు అనుకుంటే చాలు.
‘ఆర్తగీతం’ –
‘నా దేశాన్ని గూర్చి పాడలేను
నీ ఆదేశాన్ని మన్నించలేను.
ఈరోజు నాకు విషాదస్మృతి
విధి తమస్సులు మూసిన దివాంధరుతి.
నాయెడద మ్రోడయిన దుస్థితి!’
‘నేను చూశాను నిజంగా..’- అని తన సామాజిక స్పృహని మానవతా
దృక్పథాన్ని గొప్పగా వ్యక్తీకరిస్తారు.
‘ఈ ఆర్తి ఏ సౌధాంతాలకి పయనింపగలదు?
ఏ రాజకీయవేత్త గుండెల్ని స్పృశింపగలదు?
ఏ భోగవంతుని విచలింపజేయగలదు?
ఏ భగవంతునికి నివేదించుకొనగలదు?!’
అని ఆవేశంగా ముగిస్తారు. నిజమే, పేదవాని ప్రార్థనలు!
‘సి.ఐ.డి. రిపోర్ట్’-
‘అయినాపురం కోటీశ్వరరావు మేనేజర్ గారి హోటల్ గదిలో మరణించాడు. ఇతని గురించి వివరాలేమీ ప్రమాదకరంగా లేవు.
‘ఇతడు గుమాస్తా, ఇతని తండ్రి గుమాస్తా, తాత గుమాస్తా, ముత్తాత గుమాస్తా. గౌరవకరమైన దరిద్రానికి వీళ్లవంశం- ఒక రాస్తా!’
చనిపోయే ముందురోజునే- కనకయ్య అనే మిత్రుని కల్సికొని – ‘సుఖమంటే ఏవిటీ? ఎలా ఉంటుంది?ఎక్కడ దొరుకుతుంది?’- అని అడిగాట్ట!
‘ఈ సందేహం అతని జీవితానికే మచ్చ. ఇంకా పెరిగి పెద్దకాకుండా అతను మరణించడం- దేశానికే రక్ష!’
సగటు గుమాస్తా- బ్రతికితే యెంత? చనిపోతే ఏమిటి వింత?
‘సైనికుడిఉత్తరం’-
‘సైనికుడికి-చంపడం, చావడం
మీసం దువ్వటం లాంటి అలవాటయ్యింది.
కీ ఇస్తే తిరిగే అట్టముక్క సైనికులం!
కనిపించే యూనిఫామ్ క్రింద
ఒక పెద్ద నిరాశ,
ఒక అనాగరకత
బ్రిడ్జీ క్రింద నది లాగ రహస్యంగాఉంది.’ – అంటారు. దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా భావించిన వారి జీవితం యాంత్రికం. అతని మనస్సులో తిరుగాడే అనుభూతి విలువ యెవరు చెప్పగలరు?
‘గొంగళి పురుగులు’-
‘బల్లపరుపుగా పరచుకొన్న
జీవితం మీద నుంచి భార్యామణి
తాపీగా నడచివచ్చి- అందికదా:
పంచదార లేదు
పాలడబ్బా లేదు
బొగ్గుల్లేవు- రాత్రికి రగ్గుల్లేవు!’ –
సగటుమనిషి జీవయాత్రకి గీసిన వచనకవితా చిత్రపటం అనిపిస్తుంది- ఈ కవిత.
‘శిఖరారోహణ’
ఉగాది కవిత-
‘గుమ్మం తగిలి తల మీద గొప్పి కట్టినా గొప్పకి నవ్విన కొత్త కోడలు లాగ వచ్చి నిల్చుంది- కొత్త సంవత్సరం!’ – అని చమత్కరిస్తారు.
చమత్కారం వినా కవిత్వం నాస్తి!
ఆయన కవిత్వంలో శక్తిమంతములైన వాడుక భాషాపదాలు పొందికగా వాడారు.
ఎంత చక్కని తెలుగు వ్రాస్తారో అంత చక్కని సరళ సంస్కృత సమాసాలు అలవోకగా వ్రాస్తారు.
ఆధునిక వచనకవిత్వంలో ఇంత సరళసుందర సంస్కృత సమాసాలు వాడినవారు లేరనే చెప్పాలి.
‘అభ్యంగనావిష్కృత త్వదీయ వినీల శిరోజతమస్సముద్రాలు..’
‘ఉదాత్త సురభిళాత్త శయ్యా సజ్జితము’-
‘ఏకాంత కుంత నిహతమ్ము రసైక మద్భావనా శకుంతమ్ము’
‘ఏ దేశ సంస్కృతైనా ఏనాడూ కాదొక స్థిరబిందువు-
నైకనదీనదాలూ అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు!’’
అసలు కొన్ని లైన్లు quotable quotesగా మిలమిలలాడుతూంటాయి.
నెహ్రూజీ మీద వ్రాసిన ఎలిజీలో
‘Prince charming darling of the millions!’- అంటారు నెహ్రూజీని.
తిలక్ తనయింటి కిటికీలన్నీ తెరచి అన్ని వైపులనుంచి అన్ని గాలుల్ని ఆహ్వానించారు. జ్ఞాన మధూళిని ఆరగ్రోలారు. ఇది ఆధునిక కవులలో అరుదైన లక్షణం.
‘నవత- కవిత’- ఖండిక
కవిత్వం ఎలా ఉండాలో నిర్దిష్టంగా నిర్వచించారు. కవిత్వంలో అబ్‌స్క్యూరిటీ కొన్ని సందర్భాల్లో ఉండవచ్చు అన్నది ఆయన భావన.
కవిత్వానుభూతి-ట్రాన్స్పరెంట్ చీకటి- అది క్రొత్త అనుభవాల కాంతిపేటికని తెరవాలి- అన్నారు.
కవిత్వం ‘కదిలించా’లంటారు. ‘కదిలేది కదిలించేది’ అన్నారు గదా శ్రీశ్రీ.‘కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేయాలి. అగ్నిజల్లినా-అమృతం కురిసినా అందం-ఆనందం దాని పరమావధి!’
ఇదీ కవిత్వంపై తిలక్‌కి గల స్థిరాభిప్రాయం.
‘ఉత్త పోస్టుమాన్ మీద ఊహలు రానేరావు సుబ్బారావు!’అంటూనే ఉత్తమమైన కవితనందించారు.
ప్రియుని వద్ద నుండి లేఖ
నాశిస్తూన్న అమ్మాయికి
ఎంతో రసవత్తరంగా
జాబు లేదని చెప్పడానికి బదులు
చిరునవ్వు-
‘వెళ్లిపోతున్న తపాలాబంట్రోతు వెనుక- విచ్చిన రెండు కల్హార సరస్సులు!’
‘ఇన్ని కళ్లు పిలిచినా
ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకి చూడదు.
ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ
వెళ్లిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతూన్న
ఏకాకి నౌక చప్పుడు!’
‘కల్హార సరస్సులు’, ‘ఏకాకి నౌక చప్పుడు’-
ఈ పంక్తుల్లో కృష్ణశాస్త్రిగారి భావ కవితాచ్ఛాయలు గోచరించి తీరుతాయి.
సరదా మాటలతో సామాజికావస్థలు సరసంగా చెప్తారు.
రాజమండ్రి రోడ్లు-
‘ఎగుడూ దిగుడూ
పెళ్ళాం మొగుడూ
వీరికి ప్రణయం
మనకే ప్రళయం!’
‘న్యూ సిలబస్’ కవిత అంతా ఇటువంటి చమత్కారాలే!
‘ఇజంలో ఇంప్రిజన్ అయితే
ఇంగిత జ్ఞానం నశిస్తుంది.
ప్రిజమ్ లాంటిది జీవితం
వేర్వేరు కోణాల్ని ప్రదర్శిస్తుంది’!
‘మాధుర్యం కావ్యంలో ఎందుకు,
మత్కృతిపతి స్తోత్రంలో ఉంటే చాలంటాడు తెలుగులో కవి!’
‘మాలిన్యం మనసులోఉన్నా మల్లెపూవులా నవ్వగలగడం నేటి తెలివి!’
‘గజానికో గాంధారి కొడుకు గాంధిగారి దేశంలో!’
‘సువర్ణం కన్న అగ్రవర్ణం లేదని అన్ని వర్ణాలవారూ అంగీకరిస్తారు!’-
ఈ కవితలో తిలక్ సామాజిక స్పృహతో పాటు వ్యంగ్యవైభవం స్పష్టమౌతాయి.
‘సుప్తశిల’- ‘‘సుచితప్రణయం’- వంటి చిన్న నాటికలు వ్రాశారు.
‘సుప్తశిల’లో అహల్యా మహేంద్రులు ప్రేమైకమూర్తులు.
చివరకి గౌతముడు సయితం పశ్చాత్తప్తుడౌతాడు. జీవితంలో ప్రేమకి గల ఉదాత్త స్థానం నిరూపించడం ఈ నాటిక పరమ ప్రయోజనం.
‘సుచితప్రణయం’నాటికలోనూ శేఖరం పైకి మోసగాడుగ, మాటకారిగ కనబడినా అతని వలపు గాఢత, స్వభావస్వచ్ఛతలకే ప్రాధాన్యం ఇస్తుంది సుచిత్ర. ఆ గుణాలు చూచే ప్రేమిస్తుందామె.
తిలక్ నాటికలలోదృశ్యకావ్య లక్షణం కన్న శ్రవ్య కావ్య రమ్యత యెక్కువ.
‘భరతుడు’ ఏకపాత్రాభినయమెంతో రసవత్తరంగా వ్రాశారు. వారికి పౌరాణికాంశాలపై గల నిష్ఠ తెలుస్తుంది మనకి.
ఆధునికకాలపు పోకడల వర్ణనకి చిన్నకథ అనుగుణమైన పక్రియ. ఇది గమనించే చిక్కని చక్కని కథలు వ్రాశారు తిలక్.
‘నల్లజర్ల రోడ్డు’- తెలుగుకథల్లో ప్రసిద్ధమైంది. పాముకాటుకి- ఆ చీకట్లో అడవిలో ‘వేరు’ తెచ్చిన సూరీడు తండ్రినే పాము కరించినపుడు- సాయానికి నిలబడని ‘నాగభూషణాలు’-మనుషులే- మానవత్వం వినా!!
‘ఊరి చివర యిల్లు’- కథ పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన’ ప్రభావంతో వ్రాసినది. ఆ కథని తన మానవీయ కోణంలో నుండి వ్రాశారు తిలక్.
‘గాలివాన’లో కృతజ్ఞతగల రావుగారు -బిచ్చగత్తె కోసం డబ్బున్న తన పర్సు విడిచిపెడుతూ- తన విజిటింగ్ కార్డ్ మాత్రం తీసేస్తారు.
ఇక్కడ తాను ఆయననే వలచిన స్త్రీ- అభిమానంతో డబ్బున్న పర్సు ఆయన ఉన్న రైలుపెట్టెలోకి విసురుతూ- ఆయన ఫోటో మాత్రం తాను దాచుకుంటుంది!
‘కవుల రైలు’- కవులు కవిత కోసం రైలులో ప్రయాణిస్తున్నారు. అన్ని బోగీలు క్రిక్కిరిసి ఉన్నాయి. ఒక అమ్మాయి ఏ బోగీ లోనూ చోటు దొరకక ప్లాట్ ఫామ్ మీదనే నిలబడిపోయింది.
నీకు చోటులేదమ్మా!- అని అందరూ నిరాదరిస్తారు. కవుల రైలు సాగిపోయింది.
స్టేషను మాస్టర్ ఆమెనడిగాడు, ‘నీ పేరేమిటమ్మా?’- అని.
ఆమె తానెవరో చెప్పింది- ‘కవిత!’
నేటి కవుల రైలులో కవితకి మాత్రం చోటు లేదు! గొప్ప చురక!
హిందూ- ముస్లిం సంఘర్షణలకి అద్దం పట్టిన కథ- ‘అద్దంలోజిన్నా’!
ముప్పది కోట్ల జనాభా నుండి పదికోట్ల మందిని విభజించే రాజకీయం మీద గొప్ప సెటైర్! జిన్నా కోటు-పై ముసుగు అన్నట్లు దర్పం కనబరుస్తుంది కథలో!
కవిత్వం మీద, కవిత్వ నిర్మాణం మీద-ముఖ్యంగా వచన కవిత్వంలో కథాకావ్యాలు వ్రాయటం మీద ఆయన వ్రాసిన వ్యాసాలు ఆలోచన రేకెత్తించే సరుకున్న సంగతులు!
ఆధునికాంధ్ర సాహితీ పక్రియల్లో విలక్షణంగా చోటు సంపాదించుకొన్నది- ‘లేఖాసాహిత్యం’!
గొప్ప వ్యక్తులు తమ మిత్రుల ముందు తమ యెద పొరల్ని ఆవిష్కరించుకున్న – లేఖలు- పక్రియ కాని సాహితీపక్రియ!
తిలక్ లేఖలు పుస్తకంగా ప్రచురితమయ్యాయి-అంటే వాటి సాహిత్య ప్రామాణ్యపు నాణ్యతని తెలిసికొనగలం.
ఆవంత్స సోమసుందర్, వరవరరావు, మోగంటి మాణిక్యాంబగార్లతో తిలక్ రసవత్తరమైన లేఖాసంభాషణ గావించారు.ఈ ఉత్తరాలు- ఉత్తమ కవితా పరిమళంతో, చిత్తదీప్తి కల్గి గుబాళిస్తూం టాయి. లేఖల్లోనూ తిలక్ భావుకత సడలలేదు.
‘వేళ్ల సందుల్లోంచి పొడి యిసుకలాగ జారిపోయే కాలాన్నీ, వయస్సునీ తల్చుకుంటే భయమనిపిస్తుంది సోమసుందర్!’-అన్నారు. మాణిక్యాంబగారిని- ‘మధుర మనస్వినీ’- అని సంబోధించారు.
తెలుగు సాహిత్యంలో తిలక్-
‘అందమైనవాడు
ఆనందం మనిషైనవాడు!
జీవితాన్ని ప్రేమించినవాడు
జీవించడం తెల్సినవాడు!’
ఎవరెస్టుకన్న ఎత్తయినవి ఆయన ఊహా శిఖరాలు, సిందూరం కన్నా ఎర్రనయిన ఆయన హృదయం ఎవరూ చదువలేనిది!
‘‘అమృతంకురిసినరాత్రి కవితామృతాన్ని దోసిళ్లతో త్రాగివచ్చిన రససిద్ధుడు- శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ జీవితం- ఒక హసన్మందారమాల!
ఆయన కవిత్వం-
అనంత చైతన్యోత్సవాహ్వానం!!
తిలక్ మరణానంతరం-శ్రీశ్రీ గారు- తిలక్‌ని-
‘కవితాసతి నొసట
నిత్య రసగంగాధర తిలకం!
-నవభావామృతరసధుని!!’ అన్నారు.
అమృతంకురిసినరాత్రి సంకలనం ప్రచురించటంలో ప్రధానపాత్ర వహించిన వచనకవితా భగీరథుడు-
కుందుర్తి ఆంజనేయులుగారు-అన్నట్టుగా- తిలక్ మహాకవి- ‘మా వాడే… మహగట్టివాడు!’
పొన్నపల్లి శ్రీరామారావు : విశ్రాంత తెలుగు అధ్యాపకులు, ప్రిన్సిపాల్