‘‘నాకు ప్రాణహాని ఉంది! సుప్రీంకోర్టు కలుగచేసుకుని న్యాయం చేయాలి!’’ పోలీస్‌ ‌వాహనం ఇనుప చట్రం వెనుక నుంచి బయటకు చూస్తూ, అతి ప్రయాస మీద ఒక జర్నలిస్ట్ ‌చేసుకున్న వేడుకోలు ఇది. దావూద్‌ ఇ‌బ్రహీం మనుషులు ఉండే జైలు నుంచి, కొవిడ్‌ ‌బాధితులను ఉంచిన జైలు దగ్గరకు తీసుకుపోతుండగా ఆ జర్నలిస్ట్ ‌చేసిన ఆక్రందన ఇది. నిజంగానే సుప్రీంకోర్టు, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన హరీశ్‌ ‌సాల్వే వంటి న్యాయవాది రంగంలోకి దిగితే తప్ప ఆయనకు బెయిల్‌ ‌లభించలేదు. ఆయనే అర్ణబ్‌ ‌రంజన్‌ ‌గోస్వామి.

ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వా లకూ, పత్రికా రచయితలకూ ఒక నిరంతర ఘర్షణ అనివార్యంగా కనిపిస్తుంది. ఆంగ్లేయుల కాలంలోనే కాదు, స్వతంత్ర భారతదేశంలోను ఇది కొనసాగింది. నిజానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇరవైఏడు సంవత్సరాలకే భారతీయ పత్రికారంగం గొడ్డలివేటును ఎదుర్కొనవలసి వచ్చింది. కారణం- ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి (1975-1977). కేఆర్‌ ‌మల్కానీ, కుల్దీప్‌ ‌నయ్యర్‌ ‌వంటివారు ఎందరినో జైళ్లకు పంపింది ఇందిర ప్రభుత్వం. ఆ కాలంలోనే ‘శంకర్స్ ‌వీక్లీ’, ‘సెమినార్‌’ ‌వంటి ఎన్నెన్నో పత్రికలు ప్రచురణను నిలిపివేయవలసి వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం లేదు. అత్యవసర పరిస్థితి అసలే లేదు. కానీ మీడియా మీద వేధింపులు సాగుతున్నాయి. జర్నలిస్టుల అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు అర్ణబ్‌ ‌గోస్వామి ఎదుర్కొంటున్న పరిస్థితి, నిర్బంధం వేరు. అత్యవసర పరిస్థితి విధించ కుండానే ఆయన ఆ వాతావరణాన్ని చవిచూశారు.

నవంబర్‌ 4, 2020‌న మహారాష్ట్ర పోలీసులు రిపబ్లిక్‌ ‌టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ ‌గోస్వామిని అరెస్టు చేశారు. మళ్లీ ఎనిమిది రోజుల తరువాత  సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యల తరువాతనే ఆయనకు సెప్టెంబర్‌ 11‌న బెయిల్‌ ‌లభించింది. సాక్ష్యాలు లేక రెండేళ్ల క్రితం మూసివేసిన ఒక కేసును తిరగతోడదలచి అర్ణబ్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. కాన్‌కోర్డ్ ‌డిజైన్స్‌కు చెందిన అన్వయ నాయక్‌, ఆయన తల్లి కుముద్‌ ‌నాయక్‌ ఆత్మహత్యలకు సంబంధించిన కేసు ఇది. కాన్‌కోర్డ్ ‌డిజైన్స్ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ అన్వయ నాయక్‌. ‌కుముద్‌ ఆ ‌కంపెనీ డైరెక్టర్‌. ‌రిపబ్లిక్‌ ‌టీవీ కార్యాలయం అంతర అలంకరణ కోసం ఈ సంస్థను ఎంచుకున్నారనీ, మొత్తం ఆరున్నర కోట్ల రూపాయల ఒప్పందమని అన్వయ నాయక్‌ ‌కుమార్తె అదన్యా నాయక్‌ ‌ది కార్వాన్‌లో పని చేసే అథిరా కొనిక్కరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చివరి క్షణంలో అర్ణబ్‌కు, అన్వయ నాయక్‌కు విభేదాలు వచ్చి డబ్బు ఇవ్వలేదని, అందుకే అతడు, ఆయన తల్లి కుముద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని (మే, 2018) కూడా అదన్యా చెబుతున్నారు. తమ ఆత్మహత్యకు అర్ణబ్‌తో పాటు మరొక ఇద్దరు (ఫిరోజ్‌ ‌షేక్‌, ‌నితీశ్‌ ‌శారదా) కూడా కారణమని వారు చివరిగా రాసిన లేఖలో పేర్కొన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసును 2019లో మూసివేశారు. అయితే కేసును తిరగతోడవలసిందిగా నాయక్‌ ‌కుటుంబం మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని చెబుతున్నారు. దీనితో ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌కేసు పునర్విచారణకు ఆదేశించారు. అర్ణబ్‌ అరెస్టు వెనుక కారణం ఇదే. ఒక సందర్భంలో అనిల్‌ ‌దేశ్‌ముఖ్‌ అన్వయ నాయక్‌ ‌జీవితం ఎలా అంతమైందో అర్ణబ్‌ ‌జీవితం కూడా అలాగే అంతమయ్యే పరిస్థితి తీసుకువస్తామని ప్రతిన పూనినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. రిపబ్లిక్‌ ‌టీవీ (ఇంగ్లిష్‌), ‌రిపబ్లిక్‌ ‌భారత్‌ (‌హిందీ) ఈ రెండు చానళ్లకు అర్ణబ్‌ ‌మే, 6, 2017 నుంచి ఎండీగా, చీఫ్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్రా సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు మొదట వివిధ హోదాలలో పనిచేశారు.

పాల్ఘార్‌ ‌సాధువుల హత్య ఉదంతంలో దేశంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా, నిజానికి పక్షపాత వైఖరికి నిరసనగా అర్ణబ్‌ ఎడిటర్స్ ‌గిల్డ్ ‌సభ్యత్వానికి రాజీనామా చేశారు. గిల్డ్ అధ్యక్షుడు శేఖర్‌ ‌గుప్తా మౌనాన్ని కూడా అర్ణబ్‌ ‌తూర్పార పట్టారు. ఈ వార్తాకథనం వెల్లడించి ఇంటికి వెళుతుంటే అర్ణబ్‌ ‌వాహనం మీద ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ కథనాల ప్రసారంలో కూడా ఆయన వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చే విధంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనాయి. చిత్రంగా ఇవన్నీ దేశంలో పలు చోట్ల కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు పెట్టిన కేసుల ఫలితమే. వలస కార్మికుల వివాదంలో బాంద్రా వద్ద ఒక మసీదు ఎదుటే వారు నినాదాలు ఇవ్వడం, గుమిగూడడం కూడా బీజేపీ, హిందూత్వ వ్యతిరేకుల పనేనంటూ అర్ణబ్‌ ఆరోపించారని కేసులలో పేర్కొన్నారు. నిజానికి పాల్ఘార్‌ ‌సాధువుల హత్యలో ఆయన సోనియా గాంధీనీ, కాంగ్రెస్‌ ‌పార్టీ రెండు నాల్కల ధోరణిని చీల్చి చెండాడారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్తల అసలు కడుపు మంట అదే. అర్ణబ్‌ ‌దేశంలో మతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉద్రేక పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి నితిన్‌ ‌రౌత్‌ ‌నాగ్‌పూర్‌లో కేసు నమోదు చేయించారు. తన భార్య సునంద మరణం (2014) వెనుక తన హస్తం ఉన్నదంటూ రిపబ్లిక్‌ ‌చానల్‌ ‌మే 8-13 మధ్య ప్రసారం చేసిన వార్తా కథనాలకు ఆగ్రహించిన కాంగ్రెస్‌ ఎం‌పీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ ‌పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇక వివాదాలకు లెక్కే లేదు. రాష్ట్రానికి  వరద సాయం తిరస్కరించిన కేరళ ప్రభుత్వాధినేతల వంటి‘సిగ్గుమాలిన భారతీయులను’ తాను ఎప్పుడూ చూడలేదని అర్ణబ్‌ ‌దుమ్మెత్తిపోసినట్టు ది వీక్‌ ‌వారపత్రిక ఆగస్ట్ 8, 2018 ‌సంచికలో ప్రచురించిన వార్త దుమారం లేపింది. కేంద్ర ప్రభుత్వాన్ని (మోదీ నాయకత్వంలోనిది) విమర్శించే వారంతా దేశద్రోహులు, సిగ్గుమాలినవారు, కిరాయి మనుషులు అని విమర్శించడం కూడా పెద్ద వివాదానికే దారి తీసింది. రాయగఢ్‌ ‌జిల్లాలోని ఉద్దవ్‌ ‌ఠాక్రే ఫామ్‌ ‌హౌస్‌లో చొరబడడానికి యత్నించిన ఇద్దరు రిపబ్లిక్‌ ‌టీవీ జర్నలిస్టులు, టాక్సీ డ్రైవర్‌ను సెప్టెంబర్‌ 8, 2020‌న పోలీసులు అరెస్టు చేశారు. అర్ణబ్‌కు చెందిన టీవీ చానళ్లను బహిష్కరించవలసిందిగా శివసేన కేబుల్‌ ఆపరేటర్లకు హుకుం జారీ చేసింది కూడా.

అర్ణబ్‌ ‌వార్తా కథనాలు ప్రసారం చేసే తీరు మీద, ఆ సమయంలో ఆయన వ్యవహార శైలి మీద ఇంతకాలం తోటి జర్నలిస్టులే చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఇదే పల్లవి అందుకున్నాయి. ఆయనను అరుపుల యాంకర్‌ అన్న తీరులో చిత్రిస్తున్నారు. ఆయన వార్తా కథనాలను ప్రసారం చేసే తీరు, శైలి మీకు నచ్చకపోతే చానల్‌ను చూడడం మానేయవచ్చునని సుప్రీంకోర్టు సరిగ్గా సమాధానం ఇచ్చింది. ఆయన బిగ్గరగానే తన అభిప్రాయం చెబుతారు. కానీ, బీజేపీ వారు మాట్లాడు తున్నప్పుడు, హిందువుల హక్కుల గురించి ఎవరైనా చానళ్లలో వివరిస్తున్నప్పుడు, హిందువుల మనో భావాలు గాయపడినప్పుడు వాదనలు వినిపిస్తున్న ప్పుడు టీవీ వ్యాఖ్యాతలు లేదా యాంకర్లు విసిరే వెకిలి నవ్వుల మాటేమిటి? చానెల్‌లో వారి పట్ల బాహాటంగా ప్రదర్శించే చిన్నచూపు సంగతేమిటి? ఏ ఒక్కమాటా పూర్తి చేయకుండానే వారి చేత నోరు మూయించడం సంగతేమిటి? ఎవరైనా కావచ్చు, ఒక రాజకీయ నేతను ‘అదాలత్‌’‌లో నిలబెట్టి పళ్లు నూరుతూ, కళ్లెర్ర చేస్తూ, గొంతు పెంచి మాట్లాడే యాంకర్ల ధోరణిని ఏమనాలి? వాళ్ల గొంతు చిన్నగానే వినిపించవచ్చు. కానీ వాళ్ల అహంకార పూరిత దేహభాష, అందులో కనిపించే కుసంస్కారం బుల్లితెర మీద ఎంతో పెద్దగా కనిపిస్తుంటాయి. హిందుత్వ గురించి మాట్లాడేవారంతా జ్ఞానహీనులూ, అల్పులూ అన్నట్టు చూసే టీవీ వ్యాఖ్యాతలు ఎందరు ఉన్నారు! ఇందుకు తాజా ఉదాహరణ- రాజ్‌దీప్‌ ‌సర్దేశాయ్‌ అనే వ్యాఖ్యాత, రాహుల్‌ ‌కన్వాల్‌ అనే మరొక తోక వ్యాఖ్యాత ఒక చానల్‌లో వేసిన వీరంగం. బిహార్‌ ఎగ్జిట్‌పోల్స్ ‌సమయంలో ఆర్జేడీ గెలవబోతున్నదనీ, ఎన్‌డీఏ కూటమి ఓడిపోతున్నదనీ సర్వే సంగతులు చెబుతున్నప్పుడు పూనకం వచ్చినట్టే అయిపోలేదా? ఇంకా చెప్పాలంటే, ఐటెంసాంగ్‌ ‌నర్తకిని మించి బుల్లితెరంతా విస్తరిస్తూ నృత్యభంగిమలు పెట్టలేదా? తీరా అసలు ఫలితాలు వచ్చిన తరువాత కుక్కిన పేనుల్లా ఉండిపోలేదా? ఇదేనా జర్నలిజంలో కనపడవలసిన మర్యాద? జర్నలిస్టులలో కనిపించ వలసిన నిష్పాక్షికత? క్రీడాస్ఫూర్తి, హుందాతనం ఇవేనా? ఇంతకీ అర్ణబ్‌ అరుస్తూ ఉంటాడంటూ యాగీ చేసేది ఇలాంటి వాళ్లే. మైనారిటీలంటే ఒదిగి ఒదిగి మర్యాద ఇస్తూ మాట్లాడే చాలా మంది టీవీ యాంకర్లు హిందూ నాయకులు, పెద్దలు అంటే ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా చూడడం వాస్తవం కాదా? అదే, సుబ్రహ్మణ్యస్వామి, అమిత్‌షా, జ్యోతిరాదిత్య సింధియా, రాజ్‌ఠాక్రే వంటివారి ఎదుట తోకముడుచు కుంటారన్న సంగతి చానల్‌ ‌వీక్షకులకు అనుభవమే. ఇది చాలా జాతీయ చానళ్లతో పాటు ప్రాంతీయ భాషల చానళ్లకు ఈ జాడ్యం పుష్కలంగానే ఉంది.

వీళ్లంతా ఇప్పటికీ వాడిపోయి, ఓడిపోతూనే ఉన్న వామపక్ష భావజాలాల వాళ్లు. లేకపోతే ఉదారవాదం పేరుతో, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో హిందూ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు. అయినా వాళ్లు చెలామణి అవుతూనే ఉన్నారు. అర్ణబ్‌కీ ఒక సిద్ధాంతం మీద విశ్వాసం ఉంది. అది జాతీయత. ఆయన నమ్మే పార్టీ బహుశా బీజేపీ.

 సుప్రీంకోర్టు బెయిల్‌ ‌మంజూరు చేసిందన్న వార్త వెలువడగానే వేలాది మంది జాతీయపతాకాలతో, భారతమాతకు జై అన్న నినాదంతో జైలు బయట నిలబడి అర్ణబ్‌కు స్వాగతం చెప్పారు. ఇప్పుడు అర్ణబ్‌ ‌జాతీయవాద పత్రికా రచనకు ప్రతినిధిలా దేశానికి కనిపిస్తున్నారు. జేఎన్‌యూ, అలీఘడ్‌ ‌ముస్లిం విశ్వవిద్యాలయం ఎక్కడైనా తుక్డా తుక్డా మూకలు రెచ్చిపోతే, అదేరీతిలో సమాధానం ఇవ్వడానికి అర్ణబ్‌ ‌సంసిద్ధంగా ఉంటారని పేరు. ఢిల్లీ అల్లర్ల వెనుక పీఎఫ్‌ఐ ‌హస్తం ఉందని ఆయన చెప్పారు. తరువాత అది రుజువైంది. హథ్రాస్‌ ‌వివాదం వెనుక కూడా ఆ సంస్థ ప్రమేయం ఉందని కూడా అర్ణబ్‌ ‌వాదించారు. ఇప్పుడు పీఎఫ్‌ఐ, ‌టర్కీకి చెందిన ఒక ఉగ్రవాద సంస్థ కలసి పని చేయడానికి నిర్ణయించు కున్న సంగతిని కూడా ఆయన తాజాగా వెల్లడించారు. కానీ ఎలాంటి ఆధారం లేకుండా అర్ణబ్‌ ‌కొన్ని పార్టీలు, సంస్థల సభ్యులను దేశభక్తి పేరుతో రాక్షసులుగా చిత్రిస్తూ ఉంటారని ప్రచారం జరుగుతోంది. జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలు చెబుతారని కూడా ఆరోపిస్తూ ఉంటారు. అందుకే ఆయన బెయిల్‌ ‌మీద కొందరు సంతృప్తి వ్యక్తం చేయగా, కొందరు పెదవి విరిచారు. అయినంత మాత్రాన ఎవరైనా అరెస్టయితే బెయిల్‌ ‌రాకుండా ఉండిపోవాలా? అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం తన హద్దులు దాటిందన్న వాస్తవాన్ని అంగీకరించాలన్న ధోరణిలో కొందరైనా కనిపించారు. సుశాంత్‌ ‌హత్య/ఆత్మహత్య కేసును అర్ణబ్‌ ‌దాదాపు విశ్వవ్యాప్తం చేశారు. బాలివుడ్‌లో మత్తుమందుల ప్రభావం చాలా ఎక్కువని ఆయన వాదించారు. ఆఖరికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌ఠాక్రే  కుమారుడు ఆదిత్యకు కూడా సంబంధం ఉందని ఆరోపించేవరకు ఆయన వెళ్లారు.అంతమాత్రం చేతనే పోలీసులకు ఆయన మీద చేయిచేసుకునే  అధికారం ఉంటుందా?

అర్ణబ్‌ ఇప్పుడు దేశంలో బాగా పేరున్న రాజకీయ వ్యాఖ్యాత. అయినా చట్టం ముందు అంతా సమానమే అన్న దృష్టితోనే ఆయన వివాదం కూడా చూడవలసి ఉంది. అన్వయ నాయక్‌ ‌కేసుకు సాక్ష్యాధారాలు లేనందున మూసివేయమని కోర్టు చెప్పింది. కానీ కోర్టు అనుమతి లేకుండా మళ్లీ తిరగదోడవలసిన అవసరం ఏమిటి? తిరగతోడవలసిన అగత్యం కనిపిస్తున్నా, ఇప్పుడు అర్ణబ్‌కూ, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న ఘర్షణ వాతావరణంలో అది జరగడమే వివాదాన్ని ముదరబెట్టింది. కాబట్టే అర్ణబ్‌ అరెస్టులో చాలా మంది చట్టబద్ధతను చూడలేకపోయారు.

పాల్ఘార్‌ ‌సాధువుల హత్య ఉదంతంలో సోనియా ఎందుకు నోరు మెదపడం లేదంటూ అర్ణబ్‌ ‌సంధించిన బాణాలు చాలా పదునైనవే. కానీ అందులో తప్పు పట్టవలసిన అవసరం ఏముంది? ఒక క్రైస్తవ ప్రచారకుని చంపినప్పుడు ఆమె విమర్శలు చేశారు. ఆమె సెక్యులర్‌ అయితే హిందూ సాధువుల హత్య సమయంలో కూడా పార్టీ తరఫున స్పందించవలసి ఉంటుంది కదా అన్నదే అర్ణబ్‌ ‌వాదన. రాహుల్‌ ‌గాంధీ అపరిపక్వ రాజకీయ ధోరణులను కూడా అర్ణబ్‌ ‌తీవ్ర పదజాలంతోనే విమర్శించారు. దీనికే కాంగ్రెస్‌ ‌పార్టీ కక్ష కట్టింది. ఆ కక్ష తీర్చుకునే అవకాశం మహారాష్ట్ర సంకీర్ణంలో చేరడం ద్వారా దక్కించుకునే యత్నంలో ఆ పార్టీ, నాయకులు ఉన్నారు.

అర్ణబ్‌ ‌కేసు విషయంలో సుప్రీం కోర్టు ‘సెలక్టివ్‌’‌గానే వ్యవహరించిందన్న ఒక వాదనను కూడా ఉదారవాదులు ఇప్పుడు తెర మీదకు తీసుకువస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సుప్రీంకోర్టు కలగచేసుకోక తప్పదని తాత్కాలిక బెయిల్‌ ‌మీద జరిగిన వాదోపవాదల సమయంలో అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే భీమా- కొరెగావ్‌ ‌వివాదంలో అరెస్టయిన వారి వ్యక్తిగత స్వేచ్ఛ సంగతేమిటిని కొందరి ప్రశ్న. భీమా-కొరెగావ్‌ ‌వివాదం, అర్ణబ్‌ ‌వివాదం నిజంగానే ఒకటేనా? కొన్ని తీవ్రవాద ఉగ్రవాద సంస్థల ప్రమేయంతో ప్రధాని ని హత్య చేయడానికి కుట్ర జరిగిందనీ, అందులో వరవరరావు, గౌతమ్‌ ‌నవలఖ వంటివారు నిందితులన్న ఆరోపణ మీద వారు అరెస్టయ్యారు. మరీ చిత్రంగా కశ్మీర్‌ ‌పీడీపీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తి మెహబూబా కూడా, కశ్మీరీల వ్యక్తిగత స్వేచ్ఛ మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. పాల్ఘార్‌ ‌సాధువుల హత్య, కంగనా రనౌత్‌ ‌వంటి అంశాలతో అర్ణబ్‌ ‌వివాదాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర మధ్య ఘర్షణగా చిత్రించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఉదారవాదులు దేశద్రోహం కేసుతో పాటే అర్ణబ్‌ ‌కేసును కూడా చూడాలన్నట్టు వాదిస్తున్నారని అనిపిస్తుంది. ఉదారవాదులు, మెహబూబా వాదిస్తున్నది భారత్‌ ‌మీద, రాజ్యాంగం మీద యుద్ధం ప్రకటించిన వారికి అనుకూలంగా. అర్ణబ్‌ ‌వాదిస్తున్నది కొన్ని భారత రాజకీయ పార్టీల వైఖరికి వ్యతిరేకంగా మాత్రమే. ఒక పార్టీ ధోరణులను విమర్శించడం, ఇంకొక రాజకీయ సిద్ధాంతాన్ని అభిమానించడం దేశం ఇచ్చిన చట్టబద్ధమైన హక్కు. దేశంలో జర్నలిస్టులు కూడా రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి కూడా గమనించగలం. అర్ణబ్‌ అరెస్టు మీద సాధారణ జర్నలిస్టులు తప్ప పేరున్న జర్నలిస్టులు పెద్దగా స్పందించలేదు. లేదా మొక్కుబడిగా స్పందించారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి వేళ జర్నలిస్టులను అరెస్టు చేస్తే మిగిలిన జర్నలిస్టులు భయంతో మౌనం దాల్చారు. అత్యవసర పరిస్థితి లేని ఈ సమయంలో అవాంఛనీయంగా చాలామంది జర్నలిస్టులు మౌనం వహించారు.

నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి, అంటే 2014 నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి వాతావరణం ఉందంటూ గొంతు చించుకోని కమ్యూనిస్టులు, ఉదారవాదులు లేరు. వీళ్లకి తైనాతీలుగా ఉండే మేధావులు, రచయితలు సరేసరి. అత్యవసర పరిస్థితి వాతావరణమే ఉంటే, అసలు ఆ మాటే వారు అనలేరు. కానీ ఒకనాడు బీజేపీకి అనుకూలంగా ఉంది, పదవి కోసం ఇప్పుడు కాంగ్రెస్‌తో కలసిన ప్రభుత్వం అత్యవసర పరిస్థితే సృష్టించింది. బీజేపీకి అనుకూలంగా ఉంటారనే జర్నలిస్టును తీవ్రంగానే హింసించింది. దేశంలో ఇకపై ఏ జర్నలిస్టు ఏ కారణం చేత అరెస్టయినా కొన్ని వర్గాలే స్పందించే వాతావరణం పెద్ద జర్నలిస్టులు సృష్టించి పెట్టారు.

ఇప్పుడు అంతా వేసుకోవలసిన ప్రశ్న- ఈ దేశంలో వామపక్షవాదులకీ, ఉదారవాదులకీ, మైనారిటీల హక్కుల కార్యకర్తలకీ మాత్రమే వాక్‌స్వాతంత్య్రం ఉండాలా? టీవీలలో, వార్తాపత్రికలలో హిందువులను, హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని చెప్పే బీజేపీకి వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు వారికే పరిమితం కావాలా? పాకిస్తాన్‌ ‌కుట్రతో జరిగిన పుల్వామా దాడి వంటి వాటిలో బీజేపీ ఎన్నికల ప్రయోజనాలను చూసే హక్కు జర్నలిజం ద్వారా సహజంగా వచ్చిందని దేశం సర్దుకుపోవాలా?  వివేకానందస్వామి విగ్రహానికి అపచారం చేయడాన్ని ప్రశ్నిస్తే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టా? పార్లమెంటు మీద, ముంబైలో సాధారణ ప్రజల మీద దాడి చేసిన వారికి విశ్వవిద్యాయాల ప్రాంగణాలలో జేజేలు పలికే వారి మనోగతం జాతికి వెల్లడిస్తే దానిని అరుపులుగా కొట్టిపారేయాలా? నిజానికి అర్ణబ్‌ ‌నోటి నుంచి వచ్చేవి ఒట్టి అరుపులో, సంఘ విద్రోహుల మీద గర్జనలో ఎప్పటికప్పుడు నిర్ధారణ అవుతూనే ఉంది. వాళ్లంతా అరుపులు అని ముద్ర వేస్తున్నది వాస్తవాలకే.

About Author

By editor

Twitter
YOUTUBE