ఆధునిక చరిత్రలో సేవా తత్పరతకు సవాళ్లు విసిరిన సమయమిది. కోవిడ్‌, ‌దరిమిలా ప్రకటించిన లాక్‌డౌన్‌లలో నెలకొన్న వాతావరణం సేవా సంస్థలకు అగ్నిపరీక్ష పెట్టింది. అది వరద పీడిత ప్రాంతాలలోనో, భూకంపాలు వచ్చిన చోటనో సేవలు అందించడం వంటిది కాదు. వైరస్‌ ‌సుడిగాలిలా విస్తరిస్తున్న కాలంలో, లక్షల మంది ఆస్పత్రుల పాలవుతున్న క్లిష్ట పరిస్థితులలో కత్తి మీద సాము చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌-‌సేవాభారతికి చెందిన 27,000 మందికి పైగా కార్యకర్తలు రంగంలో దిగారు. అన్నింటికి తెగించి 3,000 కేంద్రాల నుంచి దాదాపు 20లక్షల మందికి సాయపడ్డారు. తమ ప్రాణానికి హాని లేకుండా, అవతలి ప్రాణాన్ని కాపాడవలసిన సమయమది. వైరస్‌ ‌బాధితులకు సేవలు అందించారు. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వారికి బియ్యం, కూరలు, మాస్కులు, మందులు, ఆహార పొట్లాలు, రవాణా సదుపాయం కల్పించారు. వలస కార్మికులను అదుకున్న తీరు మరొకటి. ఈ వివరాలు చదవడం కూడా స్ఫూర్తిదాయకమే. ఈ విషయాల గురించి సేవాభారతి తెలంగాణ ప్రాంత సేవాప్రముఖ్‌ ఉసులమర్తి వాసుతో జాగృతి జరిపిన ముఖాముఖీ పాఠకుల కోసం. భారతీయులలో సేవాధర్మం మరుగున పడి ఉండవచ్చు. ముమ్మాటికీ మరణించలేదని అంటున్నారాయన. కోట్లకు పడగలెత్తిన వారి నుంచి, రోజు కూలీల వరకు, రోళ్లకు గంట్లు కొట్టే శ్రమిజీవి వరకు పొరుగువారి ఆకలి తీర్చడానికి పడిన ఆరాటం అనిర్వచనీయమైనది అంటున్నారు వాసు.


కొవిడ్‌ 19, ‌ఫలితంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ ‌సమయాలలో సమాజానికి సేవ చేయడం నిరుపమానమైనది. ఒక సేవా సంస్థకి అలాంటి సమయంలో సేవలందించడం పెద్ద సవాలు. ప్రపంచమంతా తల్లడిల్లిపోయిన సమయంలో ఎక్కడ నుంచి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. వైరస్‌ ‌బీభత్సంగా ఉన్న ఆ కాలంలో మీ సేవలు ఎలా మొదలు పెట్టారు? సంకల్పం ఎలా జరిగింది?

మార్చి 23, 2020 నుంచి మనదేశం కొవిడ్‌ 19‌తో పోరాటం మొదలుపెట్టింది. ఆ నెలాఖరు నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సాయంతో సేవాభారతి రంగంలో దిగింది. ఆ వారం ఎందుకు ఆగవలసి వచ్చిందంటే, ప్రభుత్వం ఏం చేయబోతోంది? మనమేం చేయాలి? అన్నది నిర్ధారించుకోవడానికే! ప్రభుత్వం తెల్లకార్డు ఉన్నవారికే రేషన్‌ ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ, తెలంగాణ రాష్ట్ర ఉన్నతికి సేవలు అందిస్తున్నవారంటూ గతంలో ముఖ్యమంత్రే చెప్పిన ఇతర రాష్ట్రాల శ్రామికులకి ఈ సౌకర్యం అందుబాటు లోకి రాలేదు. వారికి ఇక్కడ తెల్లకార్డు ఉండదు. ఇటు తెలంగాణ జిల్లాల నుంచి, అటు ఆంధప్రదేశ్‌ ‌నుంచి కూడా కార్మికులు వచ్చి హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. మొదట వీళ్ల అవసరాలు గుర్తించాం. సేవాభారతి వివిధ రంగాలలో చిరకాలంగా సేవలు అందిస్తున్నది. సేవాబస్తీలలో (మురికివాడలు) బాల సంస్కార కేంద్రాలు, అభ్యాసిక కేంద్రాలు (ట్యూషన్‌ ‌కేంద్రాలు), బాలికల సంక్షేమ కోసం కిశోర కేంద్రాలు సేవాభారతి నిర్వహిస్తున్నది. సంజీవని అనే సంచార వైద్య వాహనం నిరంతరం సేవలు అందిస్తుంది. వీటి ద్వారానే మాకు క్షేత్రస్థాయి పరిస్థితి వెనువెంటనే తెలిసింది. అప్పటికే వారంతా ఆహారవసతికి దూరమైపోయారు. బియ్యం అందించా లని వెంటనే నిర్ణయం తీసుకున్నాం.

ఎలా అందించారు? ఏదైనా ప్రణాళిక ప్రకారం జరిగిందా?

భూకంపాలు వచ్చిన చోట పనిచేయడం, వరదప్రాంతాలలో సేవ చేయడం ఒక పద్ధతి. మాకు ఆ అనుభవం ఉంది కూడా. కానీ కరోనా వైరస్‌ ‌విస్తరించి ఉన్న సమయంలో భౌతికదూరం పాటిస్తూ, మన జాగ్రత్తలో మనం ఉంటూ సేవలందించాలి. ఇది నిజంగా సవాలే. ఒక మురికివాడకు ఒకే కార్యకర్తను కేటాయించాం. ఒక్కరు మాత్రమే వెళ్లాలి. ఇంటి పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్య, ఏం కోరుతున్నారు, పేరు, ఫోన్‌ ‌నెంబర్‌, ‌చిరునామా వంటివన్నీ సమగ్రంగా సేకరించాం. ఇదొక సర్వే. తరువాత వారందరికీ నిత్యావసరాలు అందాయి. మేం ఎవరి ఇంటికీ వెళ్లి అందించలేదు. ఆయా మురికివాడలకు సమీపంలో ఉన్న ఒక్కొక్క కిరాణా దుకాణంతో ఒప్పందం చేసుకున్నాం. లాక్‌డౌన్‌ ‌కాలంలో రోజూ కొద్దిసేపు సడలింపు ఉండేది. ఆ సమయంలో ఆ కుటుంబాల వారికి ఫోన్‌ ‌చేసి, భౌతికదూరం నిబంధనకు భంగం కలగకుండా దుకాణం దగ్గరే సరుకులు అందించాం. ఆఖర్న ఆ దుకాణదారుకు డబ్బు చెల్లించాం. దీనికో సాఫ్ట్‌వేర్‌ ‌చేయించాం. మురికివాడలో కార్యకర్త, కార్యాలయంలో కార్యకర్త, డబ్బులు, బ్యాంక్‌ ‌వ్యవహారాలు నిర్వహించే కార్యకర్త – ఈ ముగ్గురే మొత్తం ఏడు మాసాలు సేవలు అందించడంలో బాధ్యత తీసుకున్నారు. ఇలా తెలంగాణ అంతటా 2,38,931 కుటుంబాలకు రేషన్‌ అం‌దించింది సేవాభారతి.

ఆహారం పొట్లాల అవసరం ఎందుకు వచ్చింది?

కరోనా కనిపించని విపత్తు. దాని తీవ్రత రోజు రోజుకీ అనుభవానికి వచ్చేది. ఒక సమస్య తరువాత ఒక సమస్య. ఏదీ ఊహించగలిగేది కాదు. రేషన్‌ ఇస్తున్నా, క్రమంగా వండుకోవడం సమస్యగా మారింది. కారణం- అన్నీ మూతపడినాయి. అప్పుడే వండిన ఆహారమే అందించవలసి వచ్చింది. రకరకాల మార్గాల ద్వారా వంట చేయించి, పొట్లాలు కట్టించి ఇళ్ల వద్ద అందచేయించాం. ఈ ప్యాకింగ్‌కి కొన్ని కేంద్రాలు ఎంచుకున్నాం. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యాలయాలు, సంఘం నిర్వహించే పాఠశాలలు, కేశవ మెమోరియల్‌ ‌స్కూల్‌, ‌వైదేహి వసతిగృహం బాలికలు రేయింబవళ్లు ఆ పనిలో ఉన్నారు. పైగా దాతలు పంపే బియ్యం, పప్పులు,నూనెలు, ఇతర సంబారాలు ఈ కేంద్రాలకే చేరేవి. ఈ ఆహారం అందుకున్నవారు 4,37,774 మంది.

కూరగాయలు అందించారు కదా! లాక్‌డౌన్‌లో అదెలా సాధ్యమైంది? ఎన్ని కుటుంబాలకు అందించి ఉంటారు?

ఔను. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి కూర గాయలు పంచిపెట్టాం. కొవిడ్‌ ‌బారిన పడుతున్నవారు పడగా, విస్తరించకుండా ఆపడం పెద్ద సమస్యగా మారింది. బలవర్ధక ఆహారం, సంతులిత ఆహారం కావాలని వైద్యులు కచ్చితంగా చెబుతున్నారు. ఇందుకు కనీసం కూరగాయలు కావాలి. మరొకపక్క చేతికొచ్చిన పంట ఏం చేయాలో తెలియక, దిక్కు తోచని స్థితిలో రైతులు. రైతాంగంతో నేరుగా మేమే మాట్లాడి కొనుగోలు చేసి ఆయా కుటుంబాలకు అందించాం. ఒక కిట్‌లో వారానికి సరిపడా కూరలు ఉండేవి. ఇవి అందుకున్న కుటుంబాలు 52,737.

వంటలు చేయించడానికి సంబారాలు, కాయగూరల రవాణా భారీగానే ఉంది. అంతా కర్ఫ్యూ వాతావరణం. ఈ రవాణా ఎలా సాధ్యమైంది?

ఈ అవసరాల కోసం వాహనాలు తిరగడానికి ప్రభుత్వం నుంచి సేవాభారతి ప్రత్యేక అనుమతి తీసుకుంది. వంటకు సరుకులు తేవడం, వండినది పంపిణీ చేయడం పెద్ద పని. ఇందుకు ప్రభుత్వం సంస్థలును అనుమతించింది.

వైరస్‌ ‌మీద పోరులో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అసమాన సేవలు అందించారు.ఈ కరోనా యోధులకి ఆర్‌ఎస్‌ఎస్‌-‌సేవాభారతి ఎలా తోడ్పడింది?

మొదట తొలివరసలో ఉండి పోరాడిన వారు, అంటే వైద్యులు, నర్సులు, వారి ఇతర సిబ్బంది గురించి చెబుతాను. వారి సేవల గురించి చెప్పడానికి మాటలు చాలవు. కానీ వారి భయాలు వారికి ఉన్నాయి. కొన్నిచోట్ల డాక్టర్లను సైతం ఇళ్లలోకి అనుమతించలేదు. పని రద్దీ సరేసరి. వైరస్‌ ‌సోకిన వారికి వైద్యసేవలకు సంబంధించి, సేవాభారతి స్వయంగా అందించిన సేవ, ప్రభుత్వాసుపత్రులకు అందించిన తోడ్పాటు కూడా ఉన్నాయి. హైదరా బాద్‌లో గాంధీ ఆస్పత్రి వైద్యులు వైరస్‌ ‌ముమ్మరంగా ఉన్న కాలంలో ఇళ్లకు కూడా వెళ్లలేదు. కుటుంబాలను వదిలి ఆస్పత్రిలోనే ఉండేవారు. వారు కోరిన మీదట వారు విశ్రాంతి తీసుకోవడానికి మేం ఏర్పాట్లు చేశాం. గాంధీ ఆస్పత్రి ఎదురుగానే గుజరాతీ ముస్లిం ఒకరి హోటల్‌ ఉం‌ది. లాక్‌డౌన్‌లో మూతపడి ఉంది. అది ఇమ్మని కోరాం. ఆయన వెంటనే అంగీకరించి, సిద్ధం చేయించి ఇచ్చేశారు. డబ్బు కూడా తీసుకోలేదు. వైద్యులు, సిబ్బంది అక్కడ రెండున్నర నెలలు ఉన్నారు. అలాగే సికింద్రాబాద్‌లో ఒక హోటల్‌ ‌తీసుకున్నాం. పారిశుద్ధ్య పనివారికి గాంధీ ప్రాంగణంలోనే ఉన్న సేవాభారతి షల్‌టర్‌ ‌హోమ్‌లో వసతి ఏర్పాటు చేశాం. వారందరికి వసతితో పాటు ఉచితంగా భోజనం అందించాము. దాదాపు 240 మంది అక్కడ ఉండే సేవలు చేసేవారు.

ఆ సమయంలో వైద్యులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. వాటి పరిష్కారినికి సేవాభారతి ఎలా పాటుపడింది?

ఒక దశలో పీపీఈ కిట్లు, ఎన్‌95 ‌మాస్కులు కూడా లేవు. ఇవి ఎంతో అవసరం.వైద్యులు ఇవి కావాలని మమ్మల్ని అడిగారు. రూ. 35 లక్షలు విలువ చేసే పీపీఈ కిట్లు, ఎన్‌95 ‌మాస్కులు ఏర్పాటు చేయించాం. గాంధీ తరువాత నిజామాబాద్‌ ‌ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఇలాంటి అవసరం వచ్చింది. మరొక రూ. 25 లక్షల రూపాయల విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌95 ‌మాస్క్‌లు అందించాం.

పోలీసులకి ఎలాంటి సదుపాయాలు కల్పించారు?

కరోనా వ్యాప్తి కాకుండా నిరోధించడంలో పోలీసుల పాత్ర కీలకమైనది. పోలీసు వారు, పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం రోడ్ల మీదనే ఉండేవారు. అసలే ఎండాకాలం. వారికి నిత్యం ఉదయం, మధ్యాహ్నం అల్పాహారం, టీ, కాఫీలు అందించాం. ఇలా 1,73,340 మందికి ఇచ్చాం. ఆయుష్‌ ‌శాఖ నిబంధనల మేరకు కషాయం (కాడా) పంపిణీ చేశాం.

వైరస్‌ ‌తారస్థాయికి చేరిన దశలో ఆస్పత్రుల కొరత, వైద్యసేవల కొరత వచ్చింది. ఆ పరిస్థితిలో సేవాభారతి ఎలా పనిచేసింది?

ఆ సమయంలో కరోనా సోకినవారికి సేవాభారతే ప్రత్యేక శిబిరాలలో వైద్యం అందించాలని అనుకుంది. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. అందుకే ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాం. ఆస్పత్రులలో రద్దీ తగ్గించేందుకు హోం క్వారంటైన్‌కి వెళ్లే వారికి సేవలు మొదలుపెట్టాం. రోజులో 18 గంటల పాటు డాక్టర్‌లను ఫోన్లలో అందుబాటులో ఉంచాం. కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి, ఒక టోల్‌ ‌నెంబర్‌ ఇచ్చాం. అది కింది స్థాయి కార్యకర్త వరకు అందచేశాం. ఎనభయ్‌ ‌మంద వైద్యులు పనిచేశారు. 150 మంది కార్యకర్తలు తోడ్పడ్డారు. ఇలా 60 కేంద్రాల ద్వారా సేవలు అందించింది సేవాభారతి. శరీరంలోని ఆక్సిజన్‌ ‌స్థాయిని బట్టి వైరస్‌ను కొనుగొంటారు. అందుకే ఆక్సీమీటర్‌, ‌ధర్మామీటర్‌, ఐసీఎంఆర్‌ ‌సూచించిన మందులు, మాస్కులు ఉంచి ఒక కిట్‌ను తయారు చేయించాం. ఆ అరవై కేంద్రాల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి పంపే ఏర్పాటుచేశాం. ఇలా 10,020 మంది పద్నాలుగు రోజుల పాటు వైద్యసేవలు అందించాం.

ఒకవేళ క్వారంటైన్‌లో పరిస్థితి విషమిస్తే ఏం చేసేవారు?

ఆ పరిస్థితి ఎదురైతే, అక్కడికి వెళ్లి అన్ని పరీక్షలు నిర్వహించి రావడానికి కొన్ని లేబరేటరీలతో ఒప్పంద చేసుకున్నాం. కబురు అందగానే ఆయా లేబ్‌ల టెక్నిషియన్‌ ఇం‌టికి వెళ్లి పరీక్షలు చేసేవాడు. అవి కూడా ఆర్‌టీబీసీ టెస్టులే. మరీ విషమిస్తే మాత్రం ఆస్పత్రులకు పంపాం.

ప్రయివేటు ఆసుపత్రులు అధికంగా బిల్లులు వసూలు చేస్తున్న సమయంలో మీరు దానిని ఎలా  అధిగమించారు?

అది నిజమే అయినా, సేవాభారతి కొన్ని ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. అల్వాల్‌లో డాక్టర్‌ ‌నాగిరెడ్డి జూబ్లీ ఆస్పత్రి అందుకు ఒక ఉదాహరణ. ఆస్పత్రులకు వచ్చిన రోగులకు డెబ్బయ్‌ ‌వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తున్న కాలంలో ఈ ఆస్పత్రులలో 20 వేలు మాత్రమే వసూలు చేశారు. ఆయన ఏ రోగినీ మూడు, ఐదు రోజులకు మించి ఉంచలేదు. సూచనలు, మందులు ఇచ్చి ఇంటికి పంపేసేవారు. అలాగే టిమ్స్ ఆస్పత్రి. ఈ ఆస్పత్రులకు బాధితులను తరలించడానికి ఉచిత అంబులెన్స్ ‌సౌకర్యం ఇచ్చాం. రెమిడిసిమిర్‌ ‌మందు బయట లక్ష రూపాయలు. మేం సిప్లా కంపెనీతో మాట్లాడి రూ. 35,000కి ఇప్పించాం.

కరోనా బారిన పడినవారి మానసిక స్థితి ఒకటి. వైరస్‌ ‌సోకకున్నా చాలామందిని మానసికంగా కుంగదీసింది. అలాంటి వారికి సేవాభారతి ఎలాంటి సేవలు అందించింది?

కరోనా భయం నుంచి జనాన్ని కాపాడేందుకు మేం ఒక యూట్యూబ్‌ ‌చానల్‌ ‌ప్రారంభించాం. ప్రాణాయామం తరగతులు దీని ద్వారా నిర్వహించాం. వైరస్‌ ‌బారిన పడినవారికే కాకుండా, ఆ కుటుంబాల వారికి కూడా కౌన్సిలింగ్‌ ఇప్పించి ధైర్యంగా ఉండేటట్టు చేయడానికి మా వంతు కృషి చేశాం. జూమ్‌ ‌ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో యాభయ్‌ ‌మంది వైద్యులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌లో కరోనాకి తప్ప ఇతర రుగ్మతలకి వైద్యం కష్టమైంది. అయినా కొన్ని శస్త్రచికిత్సలను ఆపలేం. లాక్‌డౌన్‌ ‌సమయంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న కొందరికి సేవాభారతి కార్యకర్తలు వెళ్లి రక్తదానం చేసి వచ్చారు. 1,284 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. అలాగే ప్లాస్మా దానం చేసినవారు ఉన్నారు. సేవాభారతి సేవల ద్వారా ఆరోగ్యవంతులైన వారిని ప్లాస్మా అడిగాం. వారు ఇచ్చారు.

మిగిలిన బాధితుల సంగతి వేరు. ఏ దారిలో ఉన్నారో కూడా తెలియని వలసకార్మికులను సేవాభారతి ఎలా ఆదుకోగలిగింది?

చిత్రం ఏమిటంటే- వలస కార్మికులకు సంబంధించిన గణాంకాలు లేవు. ఏ రాష్ట్రం నుంచి ఎంత మంది వచ్చారు అన్న లెక్క తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేదు. ఎందురు బయటి రాష్ట్రాలకు వలసకూలీలుగా వెళ్లారు అన్న లెక్క వారి సొంత రాష్ట్రాల దగ్గరా లేదు. ఇదీ పరిస్థితి. మొదట మేడ్చెల్‌ ‌దగ్గర వీళ్లకి ఆహార పొట్లాలు అందించడం ఆరంభించాం. మొదటిరోజు మేం తీసుకువెళ్లినవి మూడు వేల పొట్లాలు. అవి ఏ మూలకూ చాలలేదు. మరునాడు 8,000 పొట్లాలు తీసుకుపోయి ఇచ్చాం. అవి కూడా చాలలేదు. ఆ మరునాడు 16,000. అలా వస్తూనే ఉన్నారు. మేడ్చెల్‌ ‌నుంచి కామారెడ్డి వరకు దారిలో ఎవరు కనిపించినా ఆహార పొట్లం చేతిలో పెట్టాం. నీళ్లు ఇచ్చాం. సొంతూళ్లకు పయనమైన వలస కార్మికుల మరొక సమస్య, చెప్పులు. వారి దగ్గర తగినంత ధనం లేదు. ఎవరి దగ్గరైనా ఉన్నా, దుకాణాలు లేవు. అందుకే చెప్పులు కూడా కొనిచ్చాం. ఈ సేవలను అందుకున్న వలసకార్మికులు 2,23,874 మంది.

లాక్‌డౌన్‌లో మిగిలిన సమస్యలన్నీ ఒక ఎత్తయితే, వలస కార్మికుల సమస్య మరొక ఎత్తు వలె పరిణమించినట్టుంది?

మామూలు సమస్య కాదు. దాని స్వరూపం కూడా వేరే అనాలి. మేం అందచేసింది దక్షిణాది భోజనం. కానీ వారిలో పలువురు ఉత్తర భారతీయులు. పెద్దలు సర్దుకున్నా పిల్లలు తినలేకపోయేవారు.మళ్లీ చపాతీలు తయారు చేయించాం. పిల్లలకు బిస్కెట్‌ ‌ప్యాకెట్లు, బ్రెడ్‌ అం‌దచేశాం. వీరి కోసం మేడ్చెల్‌ ‌నుంచి ఆదిలాబాద్‌ ‌వరకు 28 కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వచ్చింది. శ్రీకాకుళం, ఒడిశా వైపు వెళ్లే వారికోసం మిర్యాలగూడ, నల్లగొండలలో కొన్ని కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. అంటే మొత్తం 43 కేంద్రాలు.

వలస కార్మికులు సొంత రాష్ట్రాలకి వెళ్లడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అందులో సేవాభారతి పాత్ర ఎంత?

వలస కార్మికుల వెతలు చూసిన కొన్ని సంస్థలు, వ్యక్తులు రవాణా సదుపాయం కల్పించారు. మేం కొద్ది ఆలస్యంగా ఆ పని మొదలుపెట్టాం. మేడ్చెల్‌, ‌గోదావరిఖని, మిర్యాలగూడల నుంచి 171 వాహనాలు ఏర్పాటు చేశాం. ఇందులో బస్సులు, వ్యాన్‌లు వంటి వాహనాలు ఉన్నాయి. మేడ్చెల్‌ ‌నుంచి నాగ్‌పూర్‌ ‌వరకు చేర్చాం. అక్కడ నుంచి నాగ్‌పూర్‌ ‌సేవాభారతి వారు బాధ్యత తీసుకుని ఆయా ఉత్తరాది రాష్ట్రాలకు పంపించారు. ఇటు శ్రీకాకుళం వరకు పంపించాం. అక్కడ నుంచి ఆ రాష్ట్ర సేవాభారతి వారిని స్వస్థలాలకు చేర్చింది. ఆ బస్సులలో 8,651 మందిని పంపించాం. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఈ కాస్త వాహన సదుపాయంతో రవాణా సమస్య తీరలేదు. అందుకే శ్రామిక రైళ్లు ఏర్పాటు చేశారు. లింగంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌, ‌బోయిన్‌పల్లి, వరంగల్‌, ‌ఘట్‌కేసర్‌ల నుంచి 50 రైళ్లు కదిలాయి. మరునాడు వేకువన అవి బయలుదేరుతున్నాయని, మాకు ఆ ముందురోజు రాత్రే సమాచారం అందింది. సుదూర ప్రయాణం. దారిలో ఏ రైల్వే స్టేషన్‌ ‌తెరిచిలేదు. ఎక్కడా ఏం దొరకదు. ఆ రాత్రికి రాత్రి 50,000 భోజనం ప్యాకెట్లు తయారుచేసి ఉదయమే శ్రామిక రైళ్లలో వెళుతున్నవారికి అందించాం. పిల్లలకు బిస్కెట్‌ ‌ప్యాకెట్లు ఇచ్చాం. అన్ని భోజనం ప్యాకెట్లు రాత్రికి రాత్రి నగరంలోని కొన్ని ఇళ్లలోనే గృహిణులు సిద్ధం చేశారు.

వలస కార్మికుల సమస్యతో కొన్ని వికృత ధోరణులు ప్రబలినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకోవాలని అసాంఘిక శక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కాబట్టి వలస కార్మికుల సమస్య వారు ఇళ్లకు వెళ్లడంతోనే అయిపోయిందని అనుకోలేం. పరిష్కారం ఏమిటని సేవాభారతి భావిస్తున్నది?

నిజమే, ఉద్యోగాలు పోయాయి. ఉపాధి లేదు. ఈ సమస్యను కొంతయినా పరిష్కరించాలని ఉపాధి సేతు పేరుతో ఒక యాప్‌ను రూపొందించి, సమస్య మీద దృష్టి పెట్టాం. ఇందులో నమోదు చేసుకున్న వారికి ఉపాధి కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరికి తిరిగి ఉపాధి దొరికింది. వలసల తరువాత పెద్ద చిక్కు-కావలసిన చోట నిపుణులు లేరు. అందుకే స్కిల్స్ ‌నేర్పించడానికి ఎనిమిది ఎన్‌జీవోలతో ఒప్పందం చేసుకున్నాం. స్వర్ణభారతి, టాటా స్ట్రైబ్‌, ‌యశోద ఫౌండేషన్‌ ‌వంటివి ఇందులో ఉన్నాయి. ఆ సంస్థలు ఉచితంగా స్కిల్స్ అం‌దిస్తున్నాయి.

మహిళల సంగతేమిటి?

అది కూడా ముఖ్యమని సేవాభారతి ముందే భావించింది. మహిళా సాధికారత కోసం తన వంతు కృషి చేసింది కూడా. గుడ్డ కొని ఇచ్చి వారి చేత మాస్కులు కుట్టించింది. మాస్కు ఒక్కంటికి మూడు నుంచి నాలుగు రూపాయలు చెల్లించాం. 1,83,650 మాస్కులు అలా తయారయ్యాయి. వాటిని ఉచితంగా పంచిపెట్టాం. ఇంకొక విషయం కూడా. 88 బస్తీలలో రేషన్‌ ‌కిట్లతో పాటు శానిటరీ నాప్‌కిన్లు కూడా ఉచితంగా అందించింది సేవాభారతి.

సేవాబస్తీలలో సేవాభారతి ఉచిత విద్యను అందించే కార్యక్రమం నిరంతం చేస్తున్నది. కరోనా కాటు పిల్లల చదువు మీదా పడింది. ఈ సమస్య గురించి సంస్థ ఏ చర్యలు తీసుకుంటున్నది?

ఆన్‌లైన్‌ ‌చదువులని ప్రభుత్వం అంటున్నది. కానీ ఆ విధానానికి ఎన్నో పరిమితులున్నాయి. ఇవి నగరాలలోనే సరిగా అందడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో మరీ దారుణం. ఇది గమనించే, ప్రతి స్వయంసేవక్‌ ఐదుగురు పిల్లలకు బోధించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌కార్యవాహ్‌ ‌భయ్యాజీ జోషి పిలుపు నిచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ పిలుపుని సేవాభారతి అమలు చేస్తున్నది. గ్రామాలలో స్వయంసేవకులు పిల్లలకు చదువు చెబుతున్నారు.

చాలాచోట్ల రోజువారీ మందులకి జనం ఇబ్బంది పడ్డారు. వారిని సేవాభారతి ఆదుకోగలిగిందా?

కొన్ని గ్రామీణ ప్రాంతాలలో చేయగలిగాం. ప్రభుత్వ అనుమ తితో ఒక వాహనం సమకూర్చి, ఒక కార్యకర్తను పంపాం. అతడు గ్రామంలో ఇళ్లకు వెళ్లి ఎవరికి ఏఏ మందులు అవసరమో జాబితా రాసుకుని వచ్చేవాడు. కొందరు డబ్బులు చెల్లించే వారు. కొందరు చెల్లించలేక పోయేవారు. అయితే అందరికీ మందులు పట్టుకెళ్లి అందించేవాళ్లం. 13,297 మందికి ఉచితంగా మందులు అందించింది సేవాభారతి. ఒక దశలో ఏరియా ఆస్పత్రులు తెరిచారు. వాటిని పూర్తిగా శానిటైజ్‌ ‌చేయవలసి వచ్చింది. ఆ పని సేవాభారతి కార్యకర్తలు చేశారు. బ్యాంకులు, రేషన్‌ ‌షాపుల దగ్గర భౌతికదూరం పాటించే విధంగా చర్యలు తీసుకు న్నారు. ఇలా 545 కేంద్రాలలో సేవలు అందించారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు వంటివి కూరల వ్యాపారులకి ఉచితంగా ఇచ్చారు.

సేవాభారతితో పాటు లేదా సేవాభారతి ఆధ్వర్యంలో సేవలు అందించిన మిగిలిన సంస్థలు ఏవి?

అక్షయపాత్ర, ఏకం ఫౌండేషన్‌, ‌యూనిటెడ్‌వే, ఆర్‌కె మిషన్‌, ‌పవర్‌‌గ్రిడ్‌, ‌విప్రో, గ్లోబల్‌ ‌డేటా, పెగా స్టాఫ్ట్‌వేర్‌, ఇం‌టెలిజెన్‌, ‌గివ్‌ ఇం‌డియా, ఎవెన్యూ, ఇన్ఫోసిస్‌, ‌జెన్‌ప్యాక్‌, ‌జీజీకే, అయ్యప్ప సొసైటీ, అభయ ఫౌండేషన్‌… ఇం‌కా ఎన్నో సంస్థలు, వ్యక్తులు కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక్కడే మరొక సంగతి. ఒక్క క్రైస్తవ మిషనరీ సంస్థ కూడా ఇందు కోసం పనిచేయలేదు. సేవకు చిరునామాలుగా చెప్పు కునే ఎన్‌జీవోలు కూడా బయట అడుగు పెట్టలేదు.

ఎంతమంది సేవాభారతి కార్యకర్తలు పనిచేశారు? ఎంతమంది లబ్ధి పొందారు?

27,414 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేశారు. దాదాపు 20 లక్షల మందికి సేవలు అందించారు. ఇది తెలంగాణలోని అన్ని జిల్లాలలోను జరిగింది. మొత్తం 3000 కేంద్రాల నుంచి కార్యకర్తలు ఈ సేవలు అందించారు.

సేవాభారతి ప్రత్యేకంగా చెప్పుకునే సేవ ఏదనిపిస్తున్నది?

జ: అన్ని సేవలు విలువైనవే. ఏదీ తక్కువది కాదు. కానీ… లాక్‌డౌన్‌లో అమానుషం అనదగిన ఒక మూర్ఖత్వం ప్రబలింది. మృతదేహాల దగ్గరకు రావడానికి జనం భయపడిపోయారు. నడిరోడ్డు మీద శవాన్ని వదిలిపోయిన ఘటనలు కూడా జరిగాయి. అద్దెఇళ్ల వాళ్లే కాదు, సొంతిళ్లు ఉన్నా చుట్టుపక్కల వారు కరోనా మృతుల శవాలను తీసుకురానివ్వలేదు. కొన్నిచోట్ల సొంత కుటుంబాల వారే ముఖం చాటేశారు. అలాంటి దుస్థితిలో ఉన్న దాదాపు 120 భౌతికకాయాలకు అంత్యక్రియలు నిర్వహించడంలో సేవాభారతి తోడ్పడింది.

దాదాపు 20 లక్షల మందికి సేవలు అందాయి. కొన్నివేల మందికి రేషన్‌, ‌కూరలు, నీరు, మజ్జిగ, మందులు వంటివి అందాయి. కార్యకర్తల స్వచ్ఛంద సేవలు అటుంచితే, ఇందుకు అవసరమైన నిధులు ఎలా సమకూరాయి?

ఒక్కమాట చెప్పమంటారా? ఈ దేశానికి ఉన్న ఆధ్యాత్మిక, ధార్మిక నేపథ్యం వల్ల కావచ్చు. కరోనా సమయంలో దాతృత్వం సునామీని తలపింప చేసిందంటే నమ్మవలసిందే. భారతీయ సమాజ సహజ లక్షణమైన సేవ, పరోపకారం కరోనాతో మళ్లీ జీవం పోసుకున్నాయనిపించింది. మా సంస్థ తన విరాళాల ద్వారా ఖర్చు చేసినది కోటిన్నర రూపాయలు వరకు ఉంటుంది. కానీ దాతలు పంపిన బియ్యం, పప్పు, ఉప్పు, నూనెలు వంటి వాటి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలు ఉంటుంది. ప్రభుత్వం నుంచి రూపాయి సాయం కూడా తీసుకోలేదు. ఇలా ఒక వ్యక్తికి వారానికి అందించే ఆహారానికి అయ్యే ఖర్చు వేయి రూపాయలు అని సామాజిక మాధ్యమాలలో పెడితే నిధులు వెల్లువెత్తాయి. మహేశ్వరి సమాజ్‌, అగర్వాల్‌ ‌సమాజ్‌, ‌మానికేశ్వర్‌ ‌సమాజ్‌, ఇలా ఎందరో సరుకులు పంపించారు. అన్ని వర్గాలు చేయూతనిచ్చాయి. ఖాజాగూడ దగ్గర గెజెటెడ్‌ ‌కమ్యూనిటీ గ్రీన్‌రిట్జ్ అపార్ట్‌మెంట్‌ ‌వారు సేవాభారతి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాలలో చూసి మమ్మల్ని సంప్రతించారు. కొన్నిరోజుల పాటు భోజనం కిట్లు తయారుచేసి పట్టుకొచ్చారు. పంచడా నికి కూడా వచ్చేవారు. దాదాపు పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వీరైతే స్థితిమంతులు కాబట్టి చేశారు. అయితే, నాగోల్‌ ‌దగ్గర రోళ్లకు గంట్లు కొట్టే ఒకామె, తన నివాసానికి ఎదురుగా ఫుట్‌పాత్‌ ‌మీద ఉన్న వలస కార్మికులకు రెండు మాసాల పాటు గంజి కాచి పోసింది. అపురూపం కదా!

సేవాహి పరమో ధర్మః

About Author

By editor

Twitter
YOUTUBE