నాగ్‌పూర్‌లో అక్టోబర్‌ 25‌న జరిగిన విజయదశమి ఉత్సవంలో సర్‌ ‌సంఘచాలక్‌ ‌పరమ పూజనీయ డా. మోహన్‌ ‌జీ భాగవత్‌ ఉపన్యాసం

ఈసారి విజయదశమి ఉత్సవం పరిమిత సంఖ్యతో మాత్రమే జరుపుకుంటున్నామని మీ అందరికీ తెలుసు. దానికి కారణం కూడా తెలుసు. కరోనా వైరస్‌ ‌వ్యాపించ కుండా నివారించేందుకు సామూహిక కార్యక్రమాలను సాధ్యమైనంత తగ్గించుకుంటున్నాం.

మార్చి నుంచి ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో చిక్కుకోవడం వల్ల అభివృద్ధి గురించిన యోజన వెనుకబడింది. ఇక, గత విజయదశమి తరువాత చెప్పుకోదగిన అనేక పరిణామాలు జరిగాయి.

2019 విజయదశమికి ముందే పార్లమెంటు ఆమోదంతో 370వ అధికరణం రద్దయింది. నవంబర్‌ 9, 2019‌న దీపావళికి ముందు రామజన్మభూమి వివాదం మీద సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన, చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడినాక భారతీయ సమాజం చూపిన సహనం, సంయమనం అసాధారణమైనవి. దీని ఫలితంగా ఆగస్టు 5న అయోధ్యలో భూమిపూజ కార్యక్రమం అద్భుతంగా, స్నేహపూర్వక వాతావరణంలో, ఆనందోల్లాసాల మధ్య పూర్తయింది. త్వరలో రామమందిర నిర్మాణమూ జరుగుతుంది. రాజ్యాంగ పక్రియను అనుసరించి పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందింది. పొరుగు దేశాలలో అణచివేతకూ, వేధింపులకూ గురై వచ్చిన మన సోదర సోదరీమణులకు పౌరసత్వం ఇచ్చే పక్రియను ఈ చట్టం మరింత సులభతరం, వేగవంతం చేస్తుంది. ఈ దేశాలలో మొదటి నుంచి మతపరమైన మైనారిటీల పట్ల వివక్ష సాగుతూనే ఉంది. ఈ పౌరసత్వ సవరణ చట్టం ఏ మత వర్గానికీ వ్యతిరేకం కాదు. ఇతర దేశాల నుంచి వచ్చి పౌరసత్వం కోరుకునేవారికి ఇప్పటి రాజ్యాంగపరమైన పక్రియ యథాతథంగా అమలవుతుంది. కానీ కొత్త చట్టాన్ని వ్యతిరేకించినవారు ఇది ముస్లిం జనాభాను తగ్గించడానికి జరుగుతున్న ప్రయత్నమంటూ లేనిపోని అపోహలూ, భయాలూ సృష్టించాలని చూశారు. నిరసన పేరుతో దేశంలో హింస, అరాచకాలను వ్యాపింపచేయడానికి ఈ పరిస్థితిని వాడుకోవాలని అవకాశవాదులు చూశారు. దానితో దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగి, మత సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించే లోపునే కరోనా సంక్షోభం చుట్టుముట్టింది. అయినా అల్లరిమూకలూ, అవకాశవాదులూ దేశంలో గొడవలు లేవదీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మీడియా కరోనా వార్తాకథనాలతో తలమునకలై ఉండడంతో వీరి కార్యకలాపాలకు పెద్దగా ప్రచారం లభించలేదు.

ప్రపంచ దేశాలన్నింటిలోనూ దాదాపు ఒకే పరిస్థితి (కరోనా వ్యాప్తిలో) కనిపించింది. కానీ, చాలా దేశాలతో పోలిస్తే కరోనా సంక్షోభాన్ని తట్టుకోవటంలో భారత్‌ ‌మరింత దృఢంగా నిలిచింది. ఆయా దేశాలు ఎదుర్కొన్న దారుణ పరిస్థితుల వంటి వాటికి గురి కాకుండా భారత్‌ ‌తప్పించుకోవడానికి కారణాలున్నాయి. మన ప్రభుత్వం, పాలనా యంత్రాంగం సకాలంలో రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అత్యవసర సేవలను అందించే బృందాలను సిద్ధం చేయడం ద్వారా పరిస్థితి చేయి దాటిపోకుండా చూడగలిగాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మీడియా బాగా ప్రచారం చేసింది. దీనివల్ల సామాన్య ప్రజానీకంలో కొంతమేర భయాందోళనలు వ్యాపించినప్పటికీ, సమాజం మొత్తంలో జాగరూకత, నిబంధనలను పాటించే క్రమశిక్షణ వచ్చాయి. వైరస్‌ ‌సోకినవారికి చికిత్స అందించడంలో, దాని వ్యాప్తిని అరికట్టడంలో వైద్య సిబ్బంది, మునిసిపల్‌ ‌సిబ్బంది, పోలీసు, ప్రభుత్వ సిబ్బంది గొప్ప భావనతో అపూర్వమైన, బాధ్యతాయుతమైన స్పందన కనబరిచారు. సొంత కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రాణాలకు లెక్క చేయకుండా ఈ కరోనా యోధులు 24గంటలూ సేవలు అందించారు. పౌరులు కూడా అందు బాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సాటివారిని ఆదుకునేందుకు ప్రయత్నించారు. సమాజంలో సంవేదన, పరస్పర సహకారం; ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య విశ్వాసం వంటివి కనిపించినా, ఈ విపత్కర పరిస్థితులను ఆసరా చేసుకుని బ్ధి పొందాలన్న ధోరణి కూడా అక్కడక్కడ కనిపించింది. మహిళలు కూడా స్వయంప్రేరణతో ముందుకు వచ్చి పనిచేశారు. మహమ్మారి మూలంగా ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి కరువైన వారు, సొంత ఊళ్లకు తరలిపోయినవారు ఇబ్బందులు పడినప్పటికీ చాలా సహనంతో ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొన్నారు. తమ కష్టాలను కూడా లెక్క చేయకుండా ఇతరులకు సహాయపడిన సందర్భాలూ అనేకం. స్వస్థలాలకు తరలిపోతున్న వారికి వాహన సదుపాయం కలిగించడం, వారికి మార్గంలో ఆహారం, నీరు అందించడం, రాత్రిపూట పడుకోవడానికి ఏర్పాట్లు, రోగులకు మందులు అందించే ఏర్పాట్లు చేశారు. వలస కార్మికులకు నిత్యావసర వస్తువులను వారి ఇంటి వద్దనే అందించడం వంటి అనేక కార్యక్రమాలు మొత్తం సమాజంలో అనేకమంది చేపట్టడం కనిపించింది. కనీవినీ ఎరుగని ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కునేందుకు ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన అనేక సేవాకార్యక్రమాలు మన ప్రజలలోని ఐక్యత, సంవేదనాశీలతలకు ఉదాహరణలుగా నిలిచాయి. శుభ్రత పాటించడం, ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి మన సాంప్రదాయిక అలవాట్లతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద సూత్రాలు ఈ సమయంలో ఎంతో మేలు చేశాయి.

సమాజంలోని ఐకమత్యం, మనందరం ఒకటే అనే భావన, అపారమైన సంవేదనాశీలత, సహకారం వంటివాటిని ఆంగ్లంలో సోషల్‌ ‌కాపిటల్‌ అం‌టూ ఉంటారు. ఇది ఈ కష్టకాలంలో మనకు బాగా అనుభవానికి వచ్చింది. అలాగే శతాబ్దాల పురాతనమైన మన సాంస్కృతిక విలువలు, పద్ధతులు మనకు అక్కరకు వచ్చాయి. ఈ సమయంలో సమాజంలో కనిపించిన ఐకమత్యం, ఆత్మవిశ్వాసం, సహనం వంటివి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కొందరికి మొట్టమొదటిసారి అనుభవంలోకి వచ్చాయి. సాటివారికి సాయం చేయడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వైద్య సిబ్బంది, మునిసిపల్‌ ‌సిబ్బంది, ఇతర సేవా కార్యకర్తలతో పాటు అజ్ఞాతంగా పనిచేసిన ఎంతోమందిలో జీవించి ఉన్నవారికీ, బలిదానమైన వారికీ నేను మనఃపూర్వకంగా వందనం సమర్పిస్తున్నాను. వారందరూ అభినందనీయులు. ఈ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినవారికి మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం!

ఈ గడ్డు పరిస్థితిని దాటడానికి వివిధ రకాల సేవాకార్యక్రమాలు అవసరం. కళాశాలలు, పాఠశాలలు పునః ప్రారంభించడం, ఉపాధ్యాయులకు జీతాలు, పిల్లల ఫీజులు వంటివి కొత్త సమస్యలుగా ముందుకు రాబోతున్నాయి. సరైన ఆర్ధిక వనరులు లేని పాఠశాలలు తమవద్ద పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాలు కోల్పోయిన తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పాఠశాలలు తెరవడానికి, ఉపాధ్యాయులకు జీతాలు, పిల్లల ఫీజుల కోసం సహాయం అందించే ప్రయత్నం జరగాలి. వలసల వల్ల అనేకమంది ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఉపాధి వెతుక్కోవాలి. అయితే తమకు తెలిసిన రంగం కాకుండా కొత్త రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే ప్రత్యేక, అదనపు నైపుణ్యం అవసరం. ఈ విధంగా ఉపాధి కోల్పోయి తమ సొంత గ్రామాలకి వెళ్లిన అందరికి వెంటనే ఉపాధి లభించకపోవచ్చు. అలాగే ఈ సంక్షోభం మూలంగా ఆగిపోయిన పనులను పూర్తిచేయడానికి మళ్లీ పనివారిని అన్వేషించుకోవడం మరికొందరి సమస్య. కాబట్టి వృత్తినైపుణ్యం లేని పనివారికి తగిన శిక్షణ ఇవ్వడం, వారికి ఉపాధి చూపడం చాలా ముఖ్యమైన పని. ఉపాధి లేని కుటుంబాలలో కలతలు వస్తాయి. తీవ్రమైన నైరాశ్యం వల్ల నేరాలు, ఆత్మహత్యలు పెరుగుతాయి. వీటిని నివారించడానికి కౌన్సిలింగ్‌ ‌సేవలు చాలా అవసరం.

ఇలాంటి అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకుని మార్చి నుంచి అవసరమున్న అన్ని స్థలాలలో స్వయంసేవకులు వివిధ రకాల సేవాకార్యక్రమాలను చేపడుతున్నారు. స్వయంసేవకులు అనేక రకాల నూతన సేవా కార్యక్రమాలను చేపట్టడంలో శక్తి వంచన లేకుండా మమేకమవ్వాలి. సమాజంలోని ఇతరులు కూడా ఈ సమస్యలను గుర్తించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.

ఇప్పటికి కూడా ఈ వైరస్‌ ‌గురించి ప్రపంచానికి పూర్తిగా తెలియలేదు. ఇది రూపాన్ని మార్చుకుంటు వేగంగా విస్తరిస్తున్న విషతుల్యమైన వైరస్‌. ‌దీని తీవ్రత తగ్గిందని మనకు తెలుసు. అయినా ఇంకా చాలాకాలం పాటు దీనితో కలిసి సహజీవనం చేస్తూనే, దాని నుంచి రక్షించుకుంటూ ఉండాలి. అలాగే ఈ సంక్షోభం మూలంగా తలెత్తిన ఆర్థిక సమస్యల నుండి, సామాజిక సమస్యల నుండి, తోటివారిని కాపాడే పనికి పూనుకోవాలి. భయం, ఆందోళనలకు గురి కాకుండా అప్రమత్తంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అన్ని పనులలో చురుకుగా ఉండాలి. సామాజిక జీవనం మళ్లీ యథాస్థితికి వస్తున్న తరుణంలో వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టడం కోసం సూచించిన నిబంధనలను మనం పాటించడమే కాక, ఇతరులూ పాటించేందుకు ప్రోత్సహించడం మన నైతిక కర్తవ్యం.

ఈ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో మన సమాజానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడైనాయి. ప్రపంచం అంతర్ముఖియై ఆలోచించడం ప్రారంభించింది. ప్రపంచ ఆలోచనాధోరణే మారింది. ఇప్పుడు ‘న్యూ నార్మల్‌’ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కరోనా పరిస్థితులవలన జనజీవనం స్తంభించి పోయింది. దైనందిన జీవితానికి సంబంధించిన పనులన్నీ నిలిచిపోయాయి. మన జీవితంలో ప్రవేశించిన కృత్రిమ విషయాలూ ఆగి పోయాయి. శాశ్వతమైన, అవసరమైన విషయాలు కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన వారం లోపునే గాలి ఎంతో శుభ్రపడినట్లు మన అనుభవానికి వచ్చింది. బావులు, చెరువులు, నదులలో నీరు స్వచ్ఛంగా తయారైంది. మన ఇంటి ప్రాంగణంలో, తోటలలో పక్షుల కిలకిలారావాలు మళ్లీ వినిపించసాగాయి. ఆస్తులు కూడబెట్టడంలో, కూడబెట్టినది అనుభవించడంలోనే సమయ మంతా వెచ్చిస్తున్న మనకు కరోనా కారణంగా ఒక్కసారిగా వచ్చిన వెసులుబాటుతో జీవితంలో నిజమైన సంతోషం ఏమిటో గుర్తుకు వచ్చింది. విలువల ప్రాముఖ్యం తెలిసింది. కరోనా సంక్షోభం మూలంగా ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది సరైనది, ఏది నిరుపయోగ మైనది అనే విషయాలు ప్రపంచ మానవాళికి తెలిసివచ్చాయి. మన సాంస్కృతిక విలువలు తిరిగి మనందరిలో పునరుజ్జీవం పొందాయి. దేశకాల పరిస్థితులకనుగుణంగా ఈ జీవన విలువలను అందుకోవడంలో కుటుంబాలు నిమగ్నమయ్యాయి.

ఇప్పుడు ప్రపంచం కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యాన్నీ, ప్రకృతితో కలసిమెలసి జీవించటం లోని గొప్పతనాన్నీ అర్థం చేసుకునే దిశగా ప్రయాణిస్తున్నది. ఈ ఆలోచన కరోనా కారణంగా కలిగిన ప్రతిక్రియతో కూడిన తాత్కాలిక అంశమా? లేక శాశ్వతమైనదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఒకటి నిజం. ఈ సంక్షోభం మానవాళిని కీలకమైన జీవనవిలువల వైపు ఆయస్కాంతంలా ఆకర్షించింది. ఇప్పటివరకు మార్కెట్‌ ‌శక్తుల ఆధారంగానే ప్రపంచాన్ని ఏకం చేయాలనుకునే ధోరణి ప్రబలంగా ఉండేది. ఈ సంక్షోభం మూలంగా తమ శక్తి, వనరులకు తగినట్లుగా వ్యవహరిస్తూ పరస్పరం సహకరించుకోవాలన్న ధోరణి ప్రతి దేశానికీ వ్యాపించింది. ‘స్వదేశీ’ విధానానికి మరోసారి ప్రాధాన్యం పెరిగింది.

వైరస్‌ ‌వ్యాప్తిలో చైనా పాత్ర గురించి భిన్న కథనాలు వినిపిస్తున్నా, తన ఆర్థికశక్తి, యుద్ధోన్మాదా లతో సరిహద్దులో మన భూభాగాలను ఆక్రమించు కునేందుకు ఆ దేశం చేసిన ప్రయత్నాలు ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. భారత ప్రభుత్వం, పాలనా విభాగం, సైన్యం, ప్రజలు ఈ దాడిని ధైర్యంగా ఎదుర్కొని, తగిన విధంగా జవాబు చెప్పారు. ఈ దృఢ సంకల్పం, ఆత్మాభిమానం, పరాక్రమం చైనాను నిర్ఘాంతపరచాయి. రాబోయే రోజులలోనూ మనం ఇదే జాగరూకతనూ, దృఢత్వాన్నీ కొనసాగించాలి. చైనా విస్తరణవాద, దుందుడుకు ధోరణి ప్రపంచానికి కొత్తేమీకాదు. ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడం, అంతర్జాతీయ సంబంధాలను పటిష్టపరచుకోవడం, సైనిక సామర్థ్యం పెంచు కోవడం, అంతర్గత భద్రతను కాపాడుకోవడమే చైనా ఆర్ధిక, వ్యూహాత్మక దుష్టపన్నాగాలకు విరుగుడు. మన ప్రభుత్వ విధానాలు ఆ దిశగానే సాగుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌, ‌నేపాల్‌, ‌మయన్మార్‌ (‌బ్రహ్మ దేశం) వంటి పొరుగు దేశాలతో మనకు స్నేహ పూర్వక సంబంధాలతోపాటు నైతిక విలువలు, విధానాల విషయంలోనూ సామ్యం ఉంది. ఈ దేశాలతో సంబంధాలను మరింత పటిష్టపరచు కోవడం త్వరితగతిన జరగాలి. అందుకు అభిప్రాయ భేదాలనూ, చిరకాలంగా నలుగుతున్న వివాదాలనూ సత్వరం పరిష్కరించుకోవాలి. మనం అందరితో స్నేహాన్నే కోరుకుంటాం. అది మన స్వభావం. కానీ మన మంచితనాన్ని బలహీనతగా, చేతగానితనంగా భావించి, పశుబలంతో దాడిచేసి మనల్ని బలహీన పరచడానికీ, విచ్ఛిన్నం చేయడానికీ జరిగే ప్రయత్నాలను మాత్రం అంగీకరించం. మనను విమర్శించేవారు ఈ విషయాన్ని గమనించాలి. భారతమాత వీరపుత్రుల శౌర్యపరాక్రమాలు, స్వాభిమానంతో కూడిన నాయకుల ప్రవర్తన, ప్రజల అపారమైన సహనం వంటివి చైనాకు సరైన సందేశాన్నే పంపాయి. దీనితో చైనా తన ధోరణిని మార్చుకుంటుందనే భావిస్తున్నాం. అలా కాకుండా తన దుడుకు వైఖరినే కొనసాగిస్తే ఎదుర్కునేందుకు దేశ ప్రజానీకం సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నారనీ స్పష్టమవుతోంది.

దేశరక్షణ, సార్వభౌమత్వం విషయాలలో దేశం వెలుపలి నుంచి ఎదురవుతున్న సవాళ్లతోనే కాదు, నిరుడు దేశం లోపల జరిగిన పలు సంఘటనలు కూడా మనం కలసిమెలసి ఉండడం, జాగరూకతతో ఉండడంతో పాటు; ప్రభుత్వం, పాలనావిభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం గురించి హెచ్చరిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం కోసం పోటీ పడటం సహజం. కానీ ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. అది శత్రువుల మధ్య యుద్ధంలా ఉండకూడదు. సామాజిక వ్యవస్థను బలహీనం చేసే ద్వేషం, శత్రుత్వం, పగల మాదిరిగా పరిణమించరాదు. పోటీదారుల మధ్య తేడాలను ఆసరాగా చేసుకుని ఈ దేశంలోని వైవిధ్యాన్ని విభేదాలుగా చిత్రించి, ప్రజల మధ్య చీలిక తేవడానికి ప్రపంచంలోని కొన్ని శక్తులు యత్నిస్తున్నాయి. కానీ అవి అనుకున్న పని జరిగే అవకాశం మనం ఇవ్వకూడదు. సమాజంలో నేరాలు, హింసకు పాల్పడేవారిని వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలు ప్రజల సహకారంతో పనిచేయాలి. మన చర్యలు అరాచక శక్తులకు అవకాశంగా మారకుండా జాగ్రత్తవహించాలి. దానికోసం మనం అన్ని మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషలకు చెందినవారి పట్ల ఒకే సంవేదన కనపరచాలి. రాజ్యాంగ నిబంధనలకు లోబడి వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు ప్రజా స్వామ్యం, రాజ్యాంగం, చట్టం, సెక్యులరిజం అంటూ మన సామాజిక, సాంస్కృతిక విలువలను వ్యతిరేకించేవారే సందేశాలు ఇస్తున్నారు. ప్రజలను భ్రమలోకి నెట్టెసి గందరగోళానికి గురిచేస్తున్నారు. ఆగస్టు 29, 1949 నాటి రాజ్యాంగ సభలో డా. భీమ్‌రావ్‌ అం‌బేడ్కర్‌ ఇలాంటి శక్తులను గురించి చెప్ప డానికి ‘అరాచకత్వపు పరిభాష’ (స్త్రతీ•ఎఎ•తీ శీ• •అ•తీమీష్ట్ర•) అనే మాటను ఉపయోగిం చారు. మనం అలాంటి శక్తులనుగుర్తించి, వారి కుట్రలు, కుతంత్రాల గురించి మన సోదర సోదరీమణులను అప్రమత్తం చేయాలి.

సంఘం (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌గురించి ఎలాంటి అపోహలు కలగకుండా ఉండేందుకు సంఘం ఉపయోగించే పరిభాష, అలాగే ఆ పదాలు ఏ సందర్భంలో ప్రయోగిస్తాం, వాటి తాత్పర్యం తప్పనిసరిగా తెలియాలి. హిందుత్వం అనేది అలాంటి ఒక మాట. ఈ పదానికి పూజా పద్ధతులతో సంబంధాన్ని కలిపి సంకుచితం చేశారు. సంఘం అలాంటి సంకుచిత అర్థంలో ఈ పదాన్ని ఉపయో గించదు. ఈ పదం దేశానికి గుర్తింపును తెచ్చింది. అలాగే ఆధ్యాత్మిక• పునాదిగా ఉన్న మన పరంపరను గుర్తుచేస్తుంది.

నిరంతరమూ, సనాతనమూ అయిన, విలువైన సమస్త సంపదలతో వ్యక్తపరిచే పదంగానే హిందుత్వం అన్న పదాన్ని సంఘం ఉపయోగిస్తున్నది. కాబట్టి ఈ పదాన్ని గౌరవించేవారు, అన్నికాలాలలో ఉపయోగపడే హిందూ సాంస్కృతిక విలువలను ఆచరించేవారు, ఈ విలువలను ఫలప్రదం చేయ గలిగినవారు, ఈ హిందూ సంస్కృతికి చెందిన పూర్వికుల పరంపరను, గౌరవాన్ని హృదయ పూర్వకంగా తమదిగా భావించే 130 కోట్లమంది ప్రజానీకమంతటికీ ఆ పదం వర్తిస్తుందని సంఘం భావిస్తున్నది. ఈ పదానికి ఉన్న సరైన అర్ధాన్ని తెలుసుకోకపోతే ఈ సమాజంతో, దేశంతో మన బంధం పూర్తిగా తెగిపోతుంది. మనలో మనకు కలహాలు సృష్టించాలనుకునేవారూ, విడగొట్టాలను కునేవారూ మాత్రమే అందరినీ కలిపి ఉంచగలిగే ‘హిందూ’ అనే ఈ పదం గురించి రాద్ధాంతం చేస్తుంటారు. హిందూ చింతనలో భాగమైన ఈ వైవిధ్యాన్ని తమ వేర్పాటువాదానికి ఆధారం చేసుకుంటారు. ‘హిందూ’ అంటే ఒక మత సంప్రదాయం కాదు, ఒక ప్రాంతంలో పుట్టినది కాదు, ఏదో ఒక కులానికి జాగీరు కాదు, ఒక భాషకు చెందినవారిని గుర్తించే పదమూ కాదు. అనేక ప్రత్యేకతలు కలిగిన, ఒక అపారమైన నాగరికతకు సంబంధించినదీ, అందరికి చోటు కల్పించి, మానవ సంస్కృతి అనే విశాల భావనతో అందరిని కలిపి ఉంచే భావాత్మక ఏకత్వాన్ని సూచించేదీ ఈ ‘హిందూ’ పదం. కొందరికి ఈ పదాన్ని ఆమోదించడంలో అభ్యంతరాలు ఉండవచ్చును. కానీ, ఇదే భావాత్మక ఏకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వారు మరేదైనా పదాన్ని ఉపయోగిస్తామంటే అభ్యంతరం లేదు.

అయితే, దేశ సమైక్యత, భద్రతలను దృష్టిలో పెట్టుకుని హిందూ అనే పదాన్ని తమదిగా భావించి, స్థానికంగాను, విశ్వవ్యాప్తంగాను ఉన్న వివిధ అర్థాలను సమన్వయం చేయడానికి సంఘం ప్రయత్నిస్తున్నది. హిందూస్థాన్‌ ‘‌హిందూ రాష్ట్రం’ అని సంఘం అన్నప్పుడు అందులో రాజకీయ అధికారంతో ముడిపడిన ఆలోచన ఏదీ ఉండదు. హిందూత్వమే ఈ దేశం గుర్తింపు. ప్రతి ఒక్కరి సామాజిక, కౌటుంబిక, వృత్తి, వ్యక్తిగత జీవితాలలో ప్రతిఫలించే విలువలన్నీ హిందూ సామాజిక, సాంస్కృతిక సంప్రదాయాల నుండి వచ్చినవే కాబట్టి హిందూత్వం మన దేశపు అస్తిత్వమని, గుర్తింపు అని సంఘం భావిస్తుంది. ఈ భావాత్మక ఏకత్వాన్ని అనుభవించడానికీ, హిందూ పద్ధతిలో జీవించడానికీ• ఎవరూ తమ మత సంప్రదాయాలను, భాషను, ప్రాంతీయ గుర్తింపును వదులుకోవలసిన అవసరం లేదు. కేవలం ఆధిపత్య ధోరణిని వదులుకోవాలి. వేర్పాటువాద భావాలను కూడా స్వయంగా, మనఃపూర్వకంగా వదులుకోవాలి.

మీ చేతికి ఆధికారం, ఆధిపత్యం వస్తాయంటూ పిడివాదాన్నీ వేర్పాటు వాదాన్నీ ప్రోత్సహించే, ప్రేరేపించే ద్వేషపూరిత, స్వార్ధశక్తుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.

  *   *   *

దేశంలోని షెడ్యూల్డ్ ‌కులాలు, తెగలు; మైనారిటీలు అని వ్యవహరించేవారి ద్వారా వేర్పాటువాద బీజాలను నాటేందుకు, భిన్నత్వంలోనే అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని నాశనం చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేవారు ఆ సమూహంలో చేరి వారికి నేతృత్వం వహిస్తూ ‘భారత్‌ ‌తెరే తుక్దే హోంగే’ (భారత్‌ ‌ముక్కలవుతుంది) అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజకీయ స్వార్థం, వేర్పాటువాద, విచ్ఛిన్నకర ధోరణులను ప్రవేశపెట్టాలనే దురుద్దేశంతో, దేశం పట్ల ద్వేషాన్ని నింపుతూ భారతీయ ఏకత్మతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

దీనిని అర్థం చేసుకొని ధైర్యంతో, ఓర్పుతో ముందుకెళ్లాలి. రెచ్చగొట్టే శక్తుల బారినపడకుండా మనం రాజ్యాంగానికి, చట్టానికి లోబడి శాంతియుతమైన మార్గాల్లో అందరిని కలుపుకుని వెళ్లాలనే ఏకైక లక్ష్యంతో సమాజ కార్యంలో లీనం కావాలి. ఇలాంటి సంయమనం, సంతులన ధోరణి, సద్భావనతో కూడిన వ్యవహారం వల్ల పరస్పరం విశ్వాసం కలుగుతుంది. ఇలాంటి వాతావరణంలోనే ప్రశాంతమైన మనసుతో సమన్వయం సాధించడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇతరుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించగలుగుతాం. దీనికి భిన్నమైన ఆచరణ పరస్పర అవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల సమస్యకు సమాధానం లభించదు. సమస్య అర్థం చేసుకోలేని స్థితి కూడా ఏర్పడుతుంది. కేవలం ప్రతిక్రియ, విద్వేషం, భయం, నియంత్రణ లేని హింస ఊపందుకుంటాయి. ఫలితంగా పరస్పరం దూరంకావడం ద్వారా విరోధం పెరుగుతుంది.

ఈ వ్యవహారంలో మనందరం ఒకరిపట్ల ఒకరు సంయమనంతో సాహసోపేతంగా వ్యవహరిస్తూ, విశ్వాస, సౌహార్థాలను పెంచడానికి అందరూ సత్యాన్ని స్వీకరించాలి. రాజకీయ ప్రయోజనాల దృష్టితో ఆలోచించే ప్రవృత్తిని తొలగించుకోవాలి. భారత్‌ ‌నుండి భారతీయతను వేరుచేసి జీవించలేరు. ఇలా చేసే ప్రయత్నాలన్ని అపఖ్యాతి పాలు కావటం మన కళ్ల ముందే జరిగింది. మన అభివృద్ధి జరగాలంటే మనందరమూ ఏకం కావాలనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. భావాత్మాక ఐకమత్యం, వైవిధ్యాలను స్వీకరిస్తూ, వాటిని గౌరవించే భావన, మూలంలో హిందూ సంస్కృతి, హిందూ పరంపర, హిందూ సమాజంలోని స్వీకరించే ప్రవృత్తి, సహిష్ణుత భారతదేశంలో ఉన్నాయన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

సంఘంలో ప్రతి వ్యక్తి ‘హిందూ’ పదాన్ని తరచూ పలుకుతుంటారు. కానీ దీనికి సంబంధించి అనేక విషయాలు ప్రస్తుతం చర్చకి వస్తున్నందు వల్ల ఈ పదాన్ని గురించి వివరించాల్సివచ్చింది. అలా తరచూ చర్చకు వస్తున్న విషయాల్లో ఒకటి, ‘స్వదేశీ’. స్వదేశీ పదంలోని ‘స్వ’ అంటేనే హిందూత్వం. ఆ శాశ్వత, సనాతన తత్త్వం వల్లనే మనకు ఇంతటి సమన్వయ, సహకార, సహన ధోరణి అలవడినాయి. దాని మూలంగానే స్వామి వివేకానంద అమెరికాలో కుటుంబ భావనతో ప్రపంచాన్ని దర్శిస్తూ, సర్వధర్మ సమభావనతో కూడిన పిలుపునిచ్చారు. ప్రఖ్యాత కవి, రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌కూడా భారతీయ పునరుజ్జీవనానికి ఈ తత్త్వదృష్టే ఆధారమని తన ‘స్వదేశీ సమాజ్‌’ ‌పుస్తకంలో పేర్కొన్నారు. ఈ విషయాన్నే అరవిందులు తమ ఉత్తరపాడ ఉపన్యాసంలో ప్రస్తావించారు. 1857 తరువాత ఇక్కడి సమాజంలో జరిగిన మేధోమథనం, ఇక్కడి జాతీయ సంస్థలు ఎదుర్కొన్న అనుభవాలు మొదలైనవన్నీ మన రాజ్యాంగ పీఠికలో ప్రతిఫలిస్తున్నాయి. అదే భారతీయ తత్త్వం. ఈ ‘స్వ’ తత్త్వమే మన అన్నీ కార్యకలాపాలకు, ఆలోచనలకు మూలం కావాలి. మన ప్రయత్నాలు, వాటి పరిణామాలు ఈ సూత్రానికి అనుగుణంగానే ఉండాలి. అలా జరిగినప్పుడు మాత్రమే భారత్‌ ‌స్వావలంబన సాధించినట్లు. ఉత్పత్తి కేంద్రాలు, కార్మిక శక్తి, ఆర్ధిక లాభాలు, ఉత్పత్తి హక్కు మొదలైనవన్నీ జాతీయ నియంత్రణలో ఉండాలి. అయితే స్వదేశీ విధానానికి అది ఒక్కటే సరిపోదు. స్వావలంబనతో, అహింసా పథం కలయికే స్వదేశీ అని వినోబా భావే చెప్పారు. జాతీయ స్వావలంబన, సార్వభౌమత్వం సాధించి అంతర్జాతీయ సహకారాన్ని పొందే స్థితినే స్వదేశీ అని, దత్తోపంత్‌ ‌ఠేంగ్డే అన్నారు. అది వస్తువులు, సేవలకంటే మించిన విషయమని ఆయన చెప్పారు. కనుక ఆర్ధిక స్వాతంత్య్రాన్ని, స్వావలంబనను సాధించడానికి, అంతర్జాతీయ సహకారాన్ని పొందడానికి మనం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చే విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తాం. కానీ, అవి మనకు సమ్మతమైన పద్ధతులలో, పరిస్థితులలో పనిచేయడానికి సిద్ధపడాలి.

స్వావలంబన అంటే స్వీయ అస్తిత్వంపై ఆధారపడి కార్యకలాపాలు సాగించడం. మన ధోరణే మన లక్ష్యాన్నీ, మన మార్గాన్నీ నిర్ధారిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న పద్ధతుల ద్వారా మనం కూడా కొంత విజయాన్ని సాదించవచ్చును గాక. కానీ అందులో ‘స్వ’ అనేది ఉండదు. ఉదాహరణకు వ్యవసాయ విధానం రైతుకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుపై పూర్తి అధికారం ఇవ్వాలి. అవసరమైతే పక్కనే ఉన్న గ్రామం నుంచి తెప్పించుకోగలిగిన స్వేచ్ఛ, అవకాశం ఉండాలి. అలాగే అతనికి పంటల నిల్వ వంటి విషయాల్లో పూర్తి అవగాహన కల్పించాలి. మనకు విస్తృతమైన, వ్యవసాయ చరిత్ర ఉంది. అందువల్ల ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తూనే కాలపరీక్షకు నిలచిన సంప్రదాయ పద్ధతులను కూడా కొనసాగించే స్వేచ్ఛ రైతుకు ఇవ్వాలి. కేవలం లాభాలను దృష్టిలో పెట్టుకుని చేసే పరిశోధనలు, ప్రైవేటు కంపెనీల ఒత్తిడులు, మధ్య దళారుల బెడద లేకుండా రైతు తన పంటను తనకు తోచిన చోట అమ్ముకునే వీలు, వెసులుబాటు కల్పించగలిగితేనే అది సరైన స్వదేశీ వ్యవసాయ విధానం అవుతుంది. ఈ మార్పులన్నీ ఒకేసారి అమలు చేయడానికి వీలు కాకపోవచ్చును. అయితే ఈ మార్పులను సాధ్యమైనంత త్వరగా తీసుకువచ్చే వాతావరణాన్ని నిర్మించాలి.

‘స్వ’ను ఆధారం చేసుకుని ఆర్ధిక, వ్యవసాయ, కార్మిక, ఉత్పత్తి, విద్యా విధానాలను రూపొందించ డానికి ఇటీవల సకారాత్మక ప్రయత్నం జరిగింది. ఎన్నో చర్చలు, సలహాలు, సంప్రదింపుల తరువాత నూతన విద్యావిధానం అమలుచేశారు. విద్యారంగా నికి చెందినవారందరితోపాటు సంఘం కూడా కొత్త విధానాన్ని ఆహ్వానించింది. ‘వోకల్‌ ‌టు లోకల్‌’ అనే నినాదం కూడా స్వదేశీకి అనేక దారులు తెరచింది. అయితే ఈ పక్రియలన్నీ సజావుగా సాగి, సత్ఫలితాలు ఇవ్వాలంటే సునిశితమైన పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. కాబట్టి ‘స్వ’ తత్త్వాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని, ఆచరించగలిగితేనే మనం సరైన దిశలో వెళ్లగలుగుతాం.

అభివృద్ధిలో సంఘర్షణ అనివార్యమైనదిగా భారతీయతత్త్వం పరిగణించదు. అన్యాయాన్ని అంతం చేయడానికి సంఘర్షణ చిట్టచివరి మార్గమని చెబుతుంది. ఇక్కడ సహకారం, సమన్వయాలపై ఆధారపడి అభివృద్ధి సాగింది. కాబట్టి వివిధ రంగాలలో స్వావలంబన సాధించడానికి ఏకాత్మ భావన చాలా కీలకం. పరస్పర సహకారంతో, సమన్వయపూర్వక కృషితో దేశం మొత్తం సాధించే అభివృద్ధినే స్వావలంబన అనవచ్చును. శరీరంలోని అవయవాలన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి పనిచేసినట్లు, ఒక విధానాన్ని రూపొందించేవారు కలసి పనిచేసినప్పుడే పరస్పర విశ్వాసం, ఐక్యతా భావంతో వ్యవహరించినప్పుడే ఆ పని సాధ్యపడు తుంది. ఏదైనా విషయాన్ని అందరూ కలసి చర్చించడం, ఆ చర్చ ద్వారా ఒక నిర్ణయానికి రావడం, నిర్ణయించిన విధంగా పరస్పర సహకా రంతో కార్యాన్ని నిర్వహించడం అనే పద్ధతి కుటుంబం నుంచి సమాజం దాకా కనిపించే పక్రియే.

సమానో మంత్రః సమితిః సమానీ

సమానం మనః సహచిత్తమేషామ్‌

‌సమానం మంత్రమభిమంత్ర ఏవః

సమానీన వో హవిషా జుహోమి

(మన మాట ఒకటి అగునుగాక, మన స్వరం ఒకటి అగునుగాక, మన మనసులు వివేకవంతమైన ఆలోచనలతో ఒకటి అవునుగాక, ఒకే లక్ష్యాన్ని కలిగిన మనం, ఏకత్వాన్నే ఆరాధింతుముగాక).

అదృష్టవశాత్తూ, ప్రతి ఒక్కరి మనసులో, అన్ని విషయాలపై అలాంటి విశ్వాసాన్ని పెంపొందించే సామర్ధ్యం నేటి రాజకీయ నాయకత్వం కలిగి ఉందని ఆశించవచ్చు. ప్రజలు, ప్రభుత్వం మధ్య పరిపాలన స్థాయి తగినంత సున్నితంగా పారదర్శకంగా ఉండటం ద్వారా ఈ పని మరింత సమగ్రంగా జరుగుతుంది. అందరి సమ్మతితో తీసుకున్న నిర్ణయాలు మార్పు లేకుండా అమలు జరుగుతున్నట్లు ఎప్పుడైతే కనిపిస్తుందో అపుడు ఆ సమన్వయం, సమ్మతి వాతావరణం ఇంకా బలపడుతుంది. ప్రకటించిన విధానాల అమలు చివరి స్థాయి వరకు ఎలా జరుగుతుందనే దానిపై అవగాహన, నియంత్రణ ఎల్లప్పుడూ ఉండడం కూడా అవసరం. విధాన రూపకల్పనలో దాని అమలులో సంసిద్ధత, పారదర్శకతతో వ్యవహరించడం వల్ల మార్పుల ప్రయోజనాలను ఆశించిన రీతిలో పూర్తిగా పొందవచ్చు.

కరోనా పరిస్థితిలో మేధావులు, ప్రణాళిక సంఘ నిపుణులందరి దృష్టి ఒకటే. అది, దేశ ఆర్థిక, వ్యవసాయ ఉత్పత్తులను వికేంద్రికరించి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి, పర్యావరణ హితం చేకూర్చే అన్ని రంగాలను త్వరితగతిన స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం. ఈ రంగాల్లో పనిచేసే మన చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలు, రైతులు మొదలైన వారందరూ ముందుకు వచ్చి దేశం కోసం దీనిని విజయవంతం చేయాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. పెద్ద దేశాలు, బలమైన ఆర్థికశక్తులతో పోటీ పడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలవాలి. కరోనా పరిస్థితి కారణంగా, ఆరునెలల విరామం తర్వాత మళ్లీ నిలదొక్కుకోవటానికి వారికి ప్రభుత్వ సహకారం ఉపయోగపడుతుంది.

దేశ పురోగతికి సంబంధించి మన భావాలనూ, ఈ భూమినీ ఆధారంగా చేసుకొని, మన నేపథ్యంతోనే మార్గాన్ని ఏర్పరుచుకోవాలి. ఆ దారి, గమ్యం మన జాతీయ సాంస్కృతిక ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలి. మనం ప్రతి ఒక్కరిని సమ్మతితో, సానుకూల దృక్పథంతో ఆ పక్రియలో పాల్గొనేలా చేయాలి. సాధ్యమైనంత కచ్చితంగా, పారదర్శకంగా పథకాల అమలు జరగాలి. ఈ అభివృద్ధి ఫలితాలు చివరివ్యక్తి వరకు చేరుకుంటే, మధ్యవర్తుల దోపిడీ ఆగిపోతుంది. భగవంతుని స్వరూపమైన ప్రజలు నేరుగా అభివృద్ధి ప్రయోజనాలు పొందుతారు, మనం దానిని చూస్తాం. అప్పుడే మన కలలు సాకారమవు తాయి. లేకపోతే మన ప్రయత్నాలు అసంపూర్తిగా మిగిలే ప్రమాదం లేకపోలేదు.

పైవన్నీ ముఖ్యమైన అంశాలే. కానీ జాతీయాభి వృద్ధిలోని అన్ని పక్రియల కంటే సమాజ బాధ్యత గురుతరమైంది. అదే ప్రముఖమైంది. కరోనా కారణంగా ప్రపంచం మేల్కొంది. ‘స్వీయ’ ప్రాముఖ్యం, జాతీయత, సాంస్కృతిక విలువలు, పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచన, ఆ దిశగా పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తమైనాయి. కరోనా మంద గించడంతో సమాజంలో మళ్లీ శాశ్వతమైన, ఎంతో ప్రాముఖ్యం గల ఈ విషయాలను విస్మరిం చడం తగదు. సమాజంలోని వారందరూ నిరంతరం సాధన చేస్తూ దీన్ని ఆచరించే దిశగా సత్యమార్గం ఎంచుకొని క్రమంగా ముందుకు తీసుకెళ్లాలి.

మన ఆచరణ ద్వారా ఈ విషయాల్లో మార్పులు తీసుకురావడానికి ఒక క్రమపద్ధతిని రూపొందించు కొవాలి. ప్రతిరోజు ఒక చిన్న కార్యక్రమం నిర్వహిస్తూ మన ఆచరణను కొనసాగిస్తూ ముందుకు వెళ్లవచ్చు. ప్రతి కుటుంబం ఒక బృందంగా మారాలి. వారానికి ఒకసారి, మన కుటుంబంలోని ప్రతి ఒక్కరం కలుసుకొని శ్రద్ధతో భజన లేదా ఆనందరకర వాతావరణంలో గడిపి, ఇష్టమైన రీతిలో ఇంట్లోనే భోజనం చేసి, తర్వాత రెండుమూడు గంటలు సంభాషించుకోవాలి. అందులో ఈ విషయాలను ప్రస్తావించాలి. ఆచరించేందుకు చిన్న సంకల్పం చెప్పుకోవాలి. వచ్చేవారం కుటుంబ సభ్యు లందరూ తిరిగి కలసినపుడు వీటి అమలు గురించి చర్చించాలి. ఈ విధంగా ఈ పక్రియను నిరంతరం కొనసాగించవచ్చు. ఇలా చర్చించడం అవసరం. ఎందుకంటే విషయం కొత్తదైనా, పాతదైనా, వాటిలోని నవ్యత లేదా పురాత నత్వాలు ఆ విషయం వల్ల వచ్చే ఉపయోగాన్ని రూఢి చేయవు. ప్రతిదాన్ని పరిశీలించిన తరువాతే దాని ఉపయోగం, అవసరాల పరమార్థమేమిటో గ్రహించాలి. ఇలాంటి పద్ధతి మన పెద్దలు అందించారు.

సంతః పరీక్ష్యాన్యతరద్‌ ‌భజన్తే మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః

కుటుంబంలో ప్రత్యేక ప్రణాళిక లేకుండా జరిగే చర్చలోని అంశాల పరిజ్ఞానం, సారాంశం, వాటి నిజమైన అవసరాన్ని తెలుసుకోవడం, స్వీకరించడం లేదా వదిలివేయడం, అర్థం చేసుకోవడం, స్వచ్ఛందంగా అంగీకరించడం అనే పక్రియ ద్వారానే శాశ్వత మార్పు సాధ్యమవుతుంది. ప్రారంభంలో, మన ఇంటి నిర్వహణ, అలంకరణ, కుటుంబ సంప్రదాయం, ఆచార వ్యవహారాల గురించి చర్చించవచ్చు. పర్యావరణం గురించి బాగా తెలుసుకోవడం, ఇంటిలో నీటి వినియోగం, ఆదా చేయడం, ప్లాస్టిక్‌ని పూర్తిగా వదిలివేయడం, ఇంటి ప్రాంగణంలో పచ్చదనం, పువ్వులు, కుండీలలో పెరుగుతున్న కూరగాయలు, తోటల పెంపకం తదితర కార్యక్రమాల గురించి చర్చించడం కూడా సహజంగా ఉంటుంది. అందరికి ప్రేరణదాయక మవుతుంది. మనమంతా ప్రతీరోజు మనకోసం మన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తాం. అవసరాన్నిబట్టి ధనం ఖర్చు చేస్తూ కొన్ని పనులు చేస్తుంటాం. అయితే సమాజం కోసం రోజూ ఎంత సమయం లేదా ఎంత ధనాన్ని వ్యయం చేస్తాం? ఇలాంటి అంశాలు కలసి చర్చించుకోవడం ద్వారా ఈ విషయంలో ముందుకు వెళ్లవచ్చు.

భాష, ప్రాంతం, వర్గం ఏవైనా, సమాజంలోని వారంతా మన మిత్రులు, కుటుంబసభ్యులని అనుకుంటున్నామా, లేదా? అన్ని కులాలు, భాషలు, రాష్ట్రాలలో మన స్నేహితులు, వ్యక్తులు, కుటుంబ సభ్యులు మనకు ఉన్నారా లేదా అని యోచిస్తే, వారందరి వద్దకు మనం వెళ్లడం, రావడం సహజంగా జరుగుతుంది. మనందరికీ రాకపోకలు, ఆహార- విహారాల మధ్య ఏకత్వం ఉంది. సామాజిక సామరస్యం దృష్టికోణంతో చూస్తే ఇది ఎంతో ముఖ్యమైంది. ఈ విషయాల్లో సమాజంలో నిర్వహించే కార్యక్రమాలు, ప్రయత్నాలలో మన కుటుంబ సహకారం, ఈ అంశాల పట్ల అవగాహన అవసరమనిపిస్తుంది. ప్రత్యక్ష సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, రక్తదానం, నేత్రదానం వంటివి చేయడం; సమాజంలోని వ్యక్తులనూ ఈ విధంగా ఆలోచించేటట్లు చేయడం తదితర కార్యక్రమాలలో మన కుటుంబ సభ్యులు కూడా సహకరించవచ్చు. ఇటువంటి చిన్న పనుల ద్వారా వ్యక్తిగత జీవితంలో సామరస్యం, స్వచ్ఛత, మనో నిగ్రహం, క్రమశిక్షణ సహా హుందాగా ప్రవర్తించే వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయవచ్చు. ఫలితంగా సామూహిక జీవనంలో పౌరులందరికి సామాజిక క్రమశిక్షణ పాటించడం, పరస్పరం సహకరించు కొనే మనస్తత్వం బలంగా పెరుగుతాయి.

మేల్కొల్పడం, కర్తవ్యో న్ముఖులను చేసే క్రమంలో సమాజంలోని సాధారణ వ్యక్తుల మనసులు హిందుత్వంతో మమేకం చేయడానికి యత్నిస్తే, దేశం కోసం చేసే కార్యక్రమా లలో జాతీయ స్వభావాన్ని వారి అనుభవానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే, సమాజంలోని అన్ని వర్గాలు పరస్పరం సహకరించు కోవడంతో ఆ సామూహిక శక్తి దేనినైనా సాధించ గలదన్న దృష్టి కలిగిస్తే, ఆత్మవిశ్వాసం, మన విలువల ఆధారంగా అభివృద్ధి దిశగా పయనించాలన్న ఆకాంక్ష, గమ్యం గురించిన స్పష్టమైన దృష్టి ఉంటే సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కాలనుగుణంగా జరిగే వృద్ధిలో సుఖశాంతులు, సోదరభావంతో నిజమైన స్వేచ్ఛ, సమానత్వాన్ని అందించేందుకు భారతదేశం దీపధారిగా నిలవగలుగుతుంది. ఈ దృశ్యాన్ని మనంమందరం చూడబోతున్నాం. వ్యక్తిలో, కుటుంబంలో పరివర్తన తేవడం ద్వారా సోదరభావం, పురుషార్థం (ప్రయత్నశీలత) న్యాయం, నైతిక ప్రవర్తనకు అనువైన వాతావరణం సృష్టించాలి. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ 1925 ‌నుండి దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యకర్తల బృందాన్ని తయారు చేయడానికి మాత్రమే పనిచేస్తోంది.

ఈ రకంగా ఐక్యత సాధించిన సామాజిక జీవనమే సహజమైన ఆరోగ్యవంతమైన స్థితి అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా దురాక్రమణదారుల దాడి, ఆనాటి చీకటి పాలన నుండి విముక్తి చెందిన మన స్వాతంత్య్ర భారతావని నవయుగంలో చక్కటి ఐక్యత సాధించిన స్థితి కనిపిస్తుంది. అందుకు మనదేశ మహపురుషులూ ప్రయత్నించారు. స్వాతంత్య్రం తరువాత ఈ గమ్యాన్ని పరిగణనలోకి తీసుకొని కాలానుగుణమైన రీతిలో తగిన భాషలో నిర్వచించే రాజ్యాంగం మనకు లభించింది. దాని ప్రతిష్ట పెంచే విధంగా సమాజంలో మన దృష్టికోణం, పరస్పర సామరస్యం, ఏకాత్మభావన, దేశహితం మాత్రమే సర్వోన్నతమని భావించే వ్యవహారం సంఘకార్యం తోనే సాధ్యం. పవిత్రమైన ఈ కార్యంలో ప్రామాణికంగా, నిస్వార్ధ బుద్ధితో తను-మన-ధన అర్పణే ధ్యేయంగా స్వయంసేవకులు పనిచేస్తున్నారు. మీరందరూ వారికి సహకరించే కార్యకర్తలుగా తయారై, దేశ అభ్యున్నతిని ఆకాంక్షించే ప్రగతి రథానికి చేయూతనందించ వలసిందిగా కోరుతున్నాను.

ప్రశ్నలనేకం. సమాధానం ఒక్కటే.. అడుగులో అడుగు కలుపుతూ నడిచేవారందరూ వైభవోపేత ఉన్నత శిఖరాన్ని… అన్ని దిశలనుండి అధిరో హించాలి.   భారత్‌ ‌మాతాకీ జై!

About Author

By editor

Twitter
YOUTUBE