ప్రపంచంలో ఏ దేశమైనా మిత్రులను పెంచుకోవడానికే ప్రయత్నిస్తుంది. మధ్య మధ్య నాయకులు మారినప్పుడు, ప్రపంచ పరిస్థితులలో మార్పులు వచ్చినప్పుడు ఈ విధానంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా దేశాలు ప్రధానంగా సత్సంబంధాల కోసమే ప్రయత్నిస్తాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం- చైనా- మాత్రం శరవేగంగా శత్రువులను పెంచుకుంటున్నది. కమ్యూనిస్టు చైనా తన దురాక్రమణ వ్యూహాలకు పదును పెడుతున్న కొద్దీ ప్రపంచ దేశాలు ప్రతిఘటన వ్యూహాలకు మెరుగు పెడుతూనే ఉన్నాయి. మలబార్ విన్యాసాల పేరుతో సముద్ర జలాలలో సాగిస్తున్న నౌకా, వైమానిక, జలాంతర్గాముల విన్యాసాల• ఇందుకు ప్రబల నిదర్శనం. నెమ్మది నెమ్మదిగా ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ విన్యాసాలకు 28 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ నేపథ్యంలో, ఈ నవంబర్ నెలలో రెండుదశలలో జరిగిన 24వ మలబార్ విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒకప్పుడు భారత్, అమెరికా దేశాలకు పరిమితమైన మలబార్ విన్యాసాలలో తరువాత జపాన్ వచ్చి చేరింది. గతంలో తాత్కాలిక భాగస్వామిగా పాల్గొన్న ఆస్ట్రేలియా ఈసారి శాశ్వత భాగస్వామి పాత్రలో రంగ ప్రవేశం చేయడం పెద్ద మలుపు. ఈ విన్యాసాలలోకి ఆస్ట్రేలియాను భారత్ ఆహ్వానించింది. ఇప్పుడు మలబార్ విన్యాసాలు చైనాకు మంట పుట్టించేవిగానే ఉన్నాయి.
దేశ సరిహద్దుల్లోనే కాక, సముద్ర జలాల్లోనూ స్వైరవిహారం చేయాలనుకుంటున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించక తప్పడం లేదు. మలబార్ విన్యాసాల విస్తరణకూ, చైనా విస్తరణ కాంక్షకూ నడుమ గట్టి సంబంధమే ఉందని కూడా చెప్పవచ్చు. గత ఆరునెలలుగా తూర్పు లద్దాఖ్‌లో బీజింగ్ కవ్వింపు చర్యలకు దీటుగా బదులిస్తూ, డ్రాగన్ సైన్యాన్ని సమర్థంగా నిలువరిస్తున్న భారత్, అంతర్జాతీయ సముద్ర జలాల్లోనూ చైనా దూకుడును అడ్డుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల ముగిసిన మలబార్ విన్యాసా ఫలశ్రుతి ఇదే. ఈ నెలలో రెండు దఫాలుగా జరిగిన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల నౌకాదళాల సంయుక్త విన్యాసాలు ఇటీవల ముగిశాయి. ఇందులో కేవలం నౌకా బల ప్రదర్శనే కాదు, యుద్ధ విమానాలు, జలాంతర్గాముల ప్రదర్శనలు కూడా ఉంటాయి. క్వాడ్ ఏర్పాటు ఎప్పుడో జరిగినా ఆ నాలుగు దేశాలు కలసి సైనిక, రక్షణ విన్యాసాలలో సంయుక్తంగా పాలు పంచుకోవడం ఇదే మొదటిసారి. నిజానికి సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తాత్కాలిక సభ్యుల హోదాలో గతంలోను ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి. కానీ క్వాడ్ పేరుతో పిలిచే చతుర్భుజి కూటమి దేశాలన్నీ కలసి విన్యాసాలలో పాల్గొనడం 13 ఏళ్ల తరువాత మళ్లీ ఇదే. తద్వారా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)కి బలమైన సందేశాన్ని పంపినట్టయింది. తాను బలహీనంగా లేనన్న విషయంతో పాటు, నేడున్నది 60ల నాటి భారత్ ఎంతమాత్రం కాదన్న విషయాన్ని గుర్తించాలనీ, అందుకు అనుగుణంగా వ్యవహరించాలనీ పొరుగు దేశానికి విస్పష్టంగా తెలియజేసింది. తొందరపడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంపై పట్టు సాధించడం, విస్తరణ కాంక్షతో రగిలిపోతూ, దాదాపు 28 దేశాలకు శత్రువుగా కనపడుతున్న చైనా దూకుడును అడ్డుకోవడం, దానికి చెక్ పెట్టడం మలబార్ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఇండో – పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నావిగేషన్ వ్యవస్థలను పరిరక్షించడం, ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా కుటిల యత్నాలను నిరోధించడమే ప్రధాన లక్ష్యంగా నౌకాదళ విన్యాసాలు సాగాయి.
తొలిదఫా విన్యాసాలు నవంబరు 3 నుంచి 6 వరకు బంగాళాఖాతంలోని విశాఖపట్నం సమీపంలో నిర్వహించారు. రెండోదశ విన్యాసాలు ఉత్తర అరేబియా సముద్రంలో నవంబరు 17 నుంచి 20 వరకు నిర్వహించి ఆ నాలుగు దేశాలు సత్తాను ప్రదర్శించాయి. ఇందులో భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్ ఎఫ్)తో పాటు తొలిసారి రాయల్ ఆస్ట్రేలియా నౌకాదళం (ఆర్ ఏఎన్) పాల్గొన్నాయి. కరోనా నేపథ్యంలో నాన్ కాంటాక్ట్ ఎట్ సీ విధానంలో విన్యాసాలు నిర్వహించారు. ఐఎన్ ఎస్ రణ విజయ్, ఐఎన్ ఎస్ శివాలిక్, ఐఎన్ ఎస్ శక్తి, ఐఎన్ ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ మెరైన్లు భారత్ తరఫున విన్యాసాల్లో పాల్గొని తమ పాటవాన్ని ప్రదర్శించాయి. ఏ విషయం లోనూ తాము ఎవరికీ తీసిపోమని అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా చైనాకు స్పష్టమైన సందేశాన్ని భారత్ పంపింది. అమెరికాకు చెందిన జాన్ మైక్ కైన్, హెచ్‌ఎంఏఎస్ బలారత్, జపాన్‌కు చెందిన జేఎస్ ఒనామీతో పాటు రాయల్ ఆస్ట్రేలియాకు చెందిన యుద్ధనౌకలు తొలిరోజు ప్రదర్శనలో సందడి చేశాయి. యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ఫరేషన్స్, క్రాస్ డెక్ ల్యాండింగ్స్ సీమ్యాన్ షిప్ వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శించాయి. నాలుగు దేశాల యుద్ధనౌకలు సముద్రజలాల్లో వేగంగా కలియదిరిగాయి. శత్రువులను ఎదుర్కోవడంలో తమ సన్నద్ధతను, ఐక్యతను చాటాయి. వివిధ రకాల ఆయుధాలను ప్రదర్శించాయి. యుద్ధవిమానాల విన్యాసాలు భీకరంగా సాగాయి. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, వేగంగా స్పందించడంలో వాటికి అవే సాటి. విమాన వాహక నౌకల నుంచి బయలుదేరిన నాలుగు దేశాల హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు ఒకదానికి మించి మరొకటి పోటీపడ్డాయి. మున్ముందు తమ బలాన్ని పెంచుకునేదిశగా అడుగులు వేస్తున్నాయి.
అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా దేశాలను కలిపి క్వ్యాడ్ కూటమిగా వ్యవహరిస్తారు. దీనినే క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్ (చతుర్భుజ కూటమి)గా వ్యవహరిస్తారు. ఇది అనధికార కూటమి. ముఖ్యంగా దేశ రక్షణ విషయాల్లో ఇవి కలసి పనిచేస్తాయి. పరస్పరం సహాయం తీసుకుంటాయి. ఉమ్మడి శత్రువైన చైనాకు దీటుగా పావులు కదుపుతుంటాయి. దాని ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు అన్నివిధాలా పనిచేస్తాయి. సంయుక్త నౌకాదళ విన్యాసాలకు ముందు నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు అక్టోబరు నెలాఖరులో జపాన్ రాజధాని టోక్యో నగరంలో సమావేశమయ్యారు. ఇందులో విదేశాంగ మంత్రులు ఎస్.జయశంకర్ (భారత్), మైక్ పాంపియో (అమెరికా), తోషి మిట్స మోటెగి (జపాన్), మారిస్ పేస్ (ఆస్ట్రేలియా) పాల్గొన్నారు. నౌకాదళ విన్యాసాలను పకడ్బందీగా, భారీయెత్తున నిర్వహించాలని నాటి సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకే నవంబరు మొదటి వారంలో విన్యాసాలు ప్రారంభమయ్యాయి.
1992లో భారత్ – అమెరికా నౌకాదళ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. 2015లో శాశ్వత సభ్యురాలి హోదాలో జపాన్ చేరడంతో వీటి ప్రాధాన్యం అప్పుడే పెరిగింది. మరో ఐదేళ్లకే అంటే, ఈ సంవత్సరమే ఆస్ట్రేలియా కూడా తోడై వీటి ప్రాధాన్యం ఎంతటిదో ప్రపంచం గుర్తించక తప్పని స్థితిని కల్పించింది. నేటి క్వాడ్ లేదా చతుర్భుజి దేశాలలో అమెరికా, భారత్‌ల మధ్య కొద్దికాలం విభేదాలు వచ్చాయి. 1992లో కేవలం అమెరికా, భారత్‌ల మధ్య ఆరంభమైన మలబార్ విన్యాసాలు 1998 ముందు వరకు బాగానే సాగాయి. కానీ భారత్ అణ్వాయుధ పాటవ పరీక్ష నిర్వహించిన తరువాత, అమెరికా ఆంక్షల నేపథ్యంలో కొద్దికాలం ఈ విన్యాసాలకు విరామం వచ్చింది. అయితే సెప్టెంబర్ 11 నాటి అమెరికా మీది దాడులు, జార్జ్ డబ్ల్యు బుష్ ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదం మీద పోరు నేపథ్యంలో మళ్లీ మొదలయినాయి. భారత పశ్చిమ, తూర్పు తీరాలలోను, ఇంకా పర్షియన్ గల్ఫ్, ఫిలిప్పైన్స్ సముద్రంలో, జపాన్ తీరంలో ఈ విన్యాసాలు ఇంతవరకు జరిగాయి.
ఈ నాలుగూ ప్రజాస్వామ్య దేశాలు. అధునాతన సైనిక సంపత్తి గలవి. ప్రపంచంలో పెద్దవి. సాంకేతి కంగానూ శక్తిమంతమైనవి కావడం గమనార్హం. నవంబరు 17 నుంచి 20వరకు ఉత్తర అరేబియా సముద్రంలో రెండో దశ విన్యాసాలు విజయ వంతంగా జరిగాయి. ఈ సందర్భంగా నాలుగు దేశాల నౌకాదళాలు అధునాతన సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తూ సత్తా చాటాయి. చైనా విస్తరణ కాంక్ష ఆసియా ఖండంలో ప్రమాదకరంగా పరిణమించింది. అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును కాలదన్ని యావత్ దక్షిణ చైనా సముద్రం తనదేనని మొండిగా వాదించడం బీజింగ్‌కే చెల్లింది. వాస్తవానికి దక్షిణ చైనా సముద్రం అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఓ భాగం. చైనాకు దక్షిణ భాగంలో ఉండటంతో దీనికి దక్షిణ చైనా సముద్రం అన్న పేరొచ్చింది. ఈ సముద్రంలో తమకూ హక్కులున్నాయని తీరప్రాంత దేశాలైన వియత్నాం, బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, ఇండోనేసియా తదితర దేశాలు పేర్కొంటున్నాయి. వీటి వాదనను బీజింగ్ అడ్డంగా కొట్టిపడేస్తోంది. తీరప్రాంత దేశాల వాదనకు అమెరికా దన్నుగా నిలుస్తోంది. అవసరమైతే రంగంలోకి దిగుతామంటోంది అగ్రరాజ్యం. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తరణ వాదాన్ని భారత్ కూడా తప్పుపడుతోంది. తీరప్రాంత దేశాలకే మద్దతుగా నిలుస్తోంది. ఇది డ్రాగన్‌కు కంటగింపుగా మారింది.
క్వాడ్‌లో చేరడానికి అమెరికాకు కూడా బలమైన కారణాలే ఉన్నాయి. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో చైనా పోటీదారుగా అవతరించడాన్ని వాషింగ్టన్ జీర్ణించుకోలేకపోతోంది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ (నేటి రష్యా) ప్రపంచ వ్యవహారాల్లో అమెరికాకు పోటీగా నిలిచేది. ఇప్పుడు ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని చైనా తహతహ లాడుతోంది. ఈ క్రమంలోనే ఆసియా దిగ్గజం చైనాను ఎదుర్కోవడానికి ముఖ్యంగా దాని పొరుగు దిగ్గజం భారత్ అవసరాన్ని అమెరికా సరిగ్గా గుర్తించింది. భారత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. మరో ఆసియా పారిశ్రామిక దేశమైన జపాన్‌కు చైనాతో ఉన్న వైరం చరిత్రాత్మకమైనది. తూర్పు చైనా సముద్రంలో హక్కులకు సంబంధించి విభేదాలు ఉన్నాయి. అందుకే చతుర్భుజి కూటమిలో జపాన్ ఎప్పుడో భాగస్వామిగా చేరింది. ఆస్ట్రేలియాకు నేరుగా చైనాతో ఎలాంటి శత్రుత్వం లేనప్పటికీ భారత్, అమెరికా, జపాన్‌లతో గల అనుబంధం కారణంగా చతుర్భుజి కూటమిలో భాగస్వామిగా మారింది. కానీ, ప్రపంచానికి కొవిడ్ 19ను వెదజల్లిన దేశంగా చైనాను చాలా ప్రపంచ దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా భావించింది.
అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్- అమెరికా కలసి పనిచేయడం కొత్తేమీ కాదు. తొమ్మిదో దశకంలోనే ఇందుకు పునాదులు పడ్డాయి. మారుతున్న పరిస్థితుల్లో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన ఈ రెండూ కలిసి పని చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాయి. ఇందులో భాగంగా తొలుత నౌకాదళ విన్యాసాలు మొదలయ్యాయి. తరువాత ఉభయ దేశాల మధ్య టూ ప్లస్ టూ చర్చలు ప్రారంభమయ్యాయి. టూ ప్లస్ టూ అంటే ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు సమావేశమై చర్చించకోవడం. 2018లో ప్రారంభమైన ఈ టూ ప్లస్ టూ చర్చలు విజయవంతంగా కొనసాగు తున్నాయి. తరవాత రోజుల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజనాథ్ సింగ్, సుబ్రమణ్యన్ జయశంకర్ అమెరికా వెళ్లి ఆ దేశ రక్షణ, విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. ఇవి ఫలప్రదమయ్యాయి. తాజాగా అక్టోబరు నెలాఖరులో ఢిల్లీలో టూ ప్లస్ టూ చర్చలు జరిగాయి. భారత్ మంత్రులు రాజనాథ్ సింగ్, జయశంకర్‌లతో అమెరికాకు చెందిన విదేశాంగ, రక్షణ మంత్రలు మైక్ పాంపియో, మార్క్ పేస్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కీలకమైన ‘బెకా’ ఒప్పందం సాకారమైంది. ఇదే బేసిక్ ఎక్స్చేంజ్ కో ఆపరేషన్ ఒప్పందం. దీనివల్ల అత్యాధునిక సైనిక సాంకేతిక, ఉపగ్రహ రహస్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాక ఉభయదేశాలూ రక్షణపరంగా మరింత చేరువ కావడానికి మార్గం సుగమమైంది. అధ్యక్ష ఎన్నికలకు వారం ముందు ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. అమెరికా ఎన్నికల్లో గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఉభయ దేశాల సంబంధాలు బలపడ్డాయని చెప్పడానికి ఇది నిదర్శనం.
చైనా – చతుర్భుజి దేశాలు
తూర్పు ఆసియాలో విస్తరిస్తున్న చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే అమెరికా ఆశయం. క్వాడ్‌లోని మిగిలిన దేశాల అండతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి అమెరికా ఈ అవకాశాన్ని వినియోగించుకోదలిచింది. కొంతకాలం చైనాతో సత్సంబంధాలను నెరపినప్పటికీ అమెరికా (సోవియెట్) రష్యాను, చైనాను కూడా తన జాతీయ భద్రతా వ్యూహంలో శత్రువులుగా పరిగణిస్తోంది. ఇండో పసిఫిక్ వ్యూహానికి సంబంధించి అమెరికా రక్షణ వ్యవహారాల కేంద్రం పెంటగాన్ కూడా ఇదే రకమైన స్థానం చైనాకు ఇచ్చింది.
తన దేశంలో నానాటికి చైనా పెంచుకుంటున్న ప్రయోజనాల పట్ల ఆస్ట్రేలియాకు కన్నెర్రగా ఉంది. అంటే ఒక విధంగా చైనా పరోక్ష చొరబాటుకు అడ్డుకట్ట వేయడానికి యత్నించడమే. మౌలికవసతుల కల్పన వ్యవస్థలో, విశ్వవిద్యాలయాలలోనే కాదు, రాజకీయాలలో కూడా చైనా జోక్యం చేసుకోవడం ఆస్ట్రేలియా సహించలేకపోతున్నది. అయితే దేశ ఆర్థికాభివృద్ధిలో చైనా పాత్ర ఉన్నప్పటికీ కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికే పరిమితమవుతున్నది.
జపాన్‌కు చైనా వైఖరి ఎప్పుడూ కంటగింపుగానే ఉంది. ఆసియా ప్రాంతంలో చైనా దురాక్రమణ గురించి దశాబ్దం క్రితమే జపాన్ నిరసన వ్యక్తం చేసింది. అయితే జపాన్‌కు కూడా చైనా ఉత్పత్తులతో కీలక అవసరమే ఉంది. చైనాతో వాణిజ్యం జపాన్ ఆర్థిక పురోగతికి దోహదపడుతున్నది కూడా. ప్రాంతీయంగా చైనా వైఖరిని బట్టి జపాన్ తన ఆర్థిక అవసరాల విషయంలో సమతుల్యం పాటిస్తున్నది.
చైనా వ్యవహారాలతో భారత్ అనుభవాలు చెబితే చర్విత చర్వణమవుతుంది. దక్షిణ చైనా సాగరంలో అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా దీవుల మీద ఆధిపత్యం ప్రకటించుకోవడం చైనాకు అలవాటుగా మారింది. అలాగే పెరుగుతున్న చైనా సైనిక, ఆర్థిక పాటవం భారత్‌కు బెడదగా మారింది. ఒక పక్క చైనా అవసరాన్ని గుర్తిస్తూనే అమెరికాతో సంబంధాలు నెరుపుతున్నది.
మలబార్ విన్యాసాలను జీర్ణించుకోలేని డ్రాగన్ అసహనంగా వ్యవహరిస్తోంది. 2007 నుంచే చైనా వీటి పట్ల గుర్రుగా ఉన్నమాట నిజం. బంగాళా ఖాతంలో ఈ విన్యాసాలు ఆ సంవత్సరంలోనే తొలిసారి జరిగాయి. కానీ అప్పటికి అమెరికాతో ఉన్న బంధాన్ని బట్టి కక్కాలేక మింగాలేక మిన్నకుండి పోయింది. చిత్రంగా అమెరికా-భారత్ పౌర అణు ఒప్పందం కుదిరినప్పుడు ఆ ఒప్పందంతో పాటు మలబార్ విన్యాసాలను కూడా భారత కమ్యూనిస్టులు తూర్పార పట్టారు. భారత్ అమెరికా వలలో చిక్కుకుపోతున్నదని వామపక్షవాదులు ఆనాడు మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు.
ఇప్పుడు చైనా కూడా అమెరికా వలలో భారత్ పడుతోందని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. నాలుగు దేశాల చతుర్భుజ కూటమికి ‘ఆసియా నాటో’గా పేరు కూడా పెట్టింది. అంటే క్వాడ్‌కు సైనిక కూటమి రంగు పులమాలని కుట్ర చేస్తున్నది. అమెరికా ఆధ్వర్యంలో గతంలో ప్రారంభమయిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కాలక్రమంలో నిర్వీర్యమైందని గుర్తు చేసింది. నాటో నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నందున కూటమి నుంచి వైదొలగుతామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. మన్ముందు క్వాడ్ (చతుర్భుజి కూటమి)కు కూడా ఇదే దుస్థితి పడుతుందని శాపనార్థాలు పెట్టడం చైనా అక్కసుకు నిదర్శనం. చతుర్భుజి కూటమి కార్యకలాపాలకు దీటుగా బదులిస్తామని ప్రకటించింది. అంతేకాక సైనికంగా గట్టిగా ఒత్తిడి తెస్తేగానీ సరిహద్దు సమస్యపై భారత్ దారికి రాదని అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ద్వారా అనుచితంగా మాట్లాడింది.
ఇలాంటి దుందుడుకు, అహంకార పూరిత వ్యాఖ్యలు బీజింగ్ నోట రావడం కొత్తేమీ కాదు. సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్ తమదేశంలో భాగమని చెప్పడం దాని ఒంటెత్తు పోకడలకు నిలువెత్తు నిదర్శనం. దీనిని దక్షిణ టిబెట్‌గా పేర్కొంటోంది. దలైలామా టిబెట్లనకు ప్రతినిధి కానేకాదని బల్లగుద్ది చెబుతోంది. ఈప్రాంతంలో భారత అధినేతల పర్యటనను తప్పు పట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం బీజింగ్‌కు అలవాటుగా మారింది. గతంలో మాదిరిగా పంచశీల ఒప్పందం పేరుతో మరోసారి భారత్‌ను మోసం చేద్దామంటే అయ్యే పనికాదు. అందుకే చేసేదేమీ లేక, ఉక్రోషం పట్టలేక సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు ఊపిరి పోస్తోంది. తాజాగా జరిగిన ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్), బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, ఛైనా, దక్షిణాఫ్రికా) కూటముల శిఖరాగ్ర సమావేశాల్లో ఈ విషయమై చర్చకు వచ్చింది. మొత్తం మీద భారత్ వ్యూహాలను, అడుగులను బీజింగ్ ఒక కంట జాగ్రత్తగానే గమనిస్తోంది. ఇది సహజమే. తూర్పు లద్దాఖ్‌లో తనను ముందుకు రానీయకుండా భారతీయ సైన్యాలు అడ్డగించిన రోజే బీజింగ్‌కు పరిస్థితి అర్థమైంది. తాజాగా చతుర్భుజ కూటమి దేశాల మలబార్ నౌకాదళ విన్యాసాలతో చైనా ఒకింత ఆలోచనలో పడిందన్నది ముమ్మాటికీ వాస్తవం. అందుకే ఉద్రిక్తతలకు పాల్పడటం, రెచ్చగొట్టే ప్రకటనలకే బీజింగ్ పరిమితమవుతుంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద చతుర్భుజి కూటమి దేశాలు చైనాకు గట్టి హెచ్చరికలనే పంపాయి.
– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్