– కొండపల్లి నీహారిణి
శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలోతృతీయ బహుమతి పొందిన కథ
‘‘హల్లో నీరజా! ఏం చేస్తున్నావే!’’ గట్టిగా ఒక్క దెబ్బ వీపు మీద వేస్తు అడుగుతున్న నళినిని చూసి,
‘‘అబ్బా! ఏంటే అంత గట్టిగా కొట్టావ్? అవును ఏంటీ అమ్మగారు ఇవ్వాళ జోష్‌లో ఉన్నారు! చెప్పినదానికంటే ముందు వచ్చేశారు. ఈ లేట్‌లాంచర్‌గారు? ఏం సంగతీ?’ అని నవ్వుతూ అన్నది నీరజ.
‘‘ఏమోనే చాలా లీజర్‌గా ఉన్నా, ఇవ్వాళ మొత్తం నీ దగ్గరే ఉంటాను. రాత్రికిగానీ వెళ్లను ఇంటికి. అమ్మా నాన్న గుడికెళ్లారు. అటు నుండి అటు ఎవరింట్లోనో పూజ ఉందట, భోజనాలు అక్కడేనట! కాబట్టి.. ఇక మనం ఫ్రీ! ఆఫీస్ పనులు కూడా ఏమీ లేవు, సండేను స్నేహం డేగా చేసుకుందామని..’ అంటుంటేనే-
‘అబ్బో! ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు..!’ అంటూ ఇద్దరూ గొల్లును నవ్వుకున్నారు.
నళిని, నీరజ చిన్ననాటి స్నేహితులు. నీరజ వాళ్ల నాన్నగారిది ట్రాన్సఫరబుల్ ఉద్యోగం. కాబట్టి ఎక్కడెక్కడ ఆయన ఉద్యోగం కోసం వెళ్లాల్సి వస్తే అక్కడికి కుటుంబమంతా తిరిగేవాళ్లు. అట్లా కాగా కాగా నీరజ డిగ్రీలోకి వచ్చేసరికి ఒక్కచోటే ఉన్నారు. ఈ స్నేహితురాళ్లిద్దరూ ఎప్పుడూ దూరం కాలేదు. నళిని వాళ్ల అమ్మానాన్నలు ఇద్దరూ ఉద్యోగస్తులు. ఒక్కతే కూతురు. ఇంట్లో ఏ చికాకులూ, ఏ మార్పులు లేకుండా గడిచిపోయింది. ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. ఇంకో ఏడాది వరకు ఇంట్లో పెళ్లి మాట ఎత్తొద్దు అని చెప్పుకున్నారు. పెళ్లి కొడుకుల వేట కూడా ఇప్పుడే మొదలు పెట్టొద్దనీ చెప్పారు. వీలు చిక్కినప్పుడల్లా ఇట్లా కలుసుకుంటున్నారు.
‘అవును, నువ్వెందుకెళ్లలేదే అమ్మ వాళ్లతో? ఆ చుట్టాలవాళ్లెవ్వరో నీకు తెలియదా? లేకుంటే వాళ్ల ఇంట్లో ఎవరైనా హీరో ఉన్నాడా?’ కన్నుగీటుతూ అన్నది నీరజ. ‘ఏయ్ ఏంటే..’ అని నళిని అంటుంటేనే నీరజ ఫోన్ మోగింది. ‘వన్ మినెట్..’ అంటూ నీరజ ఫోన్ మాట్లాడుతూ ‘రా.. రా.. ఓకే బై..’ అని పెట్టేసింది.
‘హూ, చెప్పు చెప్పు ఏంటి కారణం.’ అన్నది నళినిని ఉడికిస్తూ.
‘ఏ పోవే, హీరో లేడూ, గీరో లేడు, వాళ్లు నాకు బాగా తెలిసినవాళ్లే..’ అంటుంటేనే…
‘మరెందుకెళ్లలేదే?’ అంటున్న నీరజతో..
‘అబ్బ నీకు తెలుసు కదా! మా ఇంట్లోని పద్ధతులు. ఈ మూడు రోజులు.. మేం దూరంగా ఉంటాం కదానే!’ అన్నది.
‘హా! ఇంకా పాటిస్తున్నారానే ఆ పద్ధతి! ఓ మైగాడ్!’ అన్నది నీరజ. ‘అవునే ఇప్పటికీ పాటిస్తున్నాం, ఎప్పటికీ పాటిస్తాం, అదంతే!’ నళిని చాలా క్యాజువల్‌గా అన్నది. ఇంతలో,
‘మా నైబర్.. కిరణ్, కిరణ్మయి షి ఈజ్ వర్కింగ్ ఆజ్ టీచర్’ అని, ఇటు తిరిగి నా ఫ్రెండ్, ఆక్చుయల్లీ బెస్ట్ ఫ్రెండ్ నళిని’ అని పరిచయం చేసింది. ఇద్దరి పరిచయాలు కాగానే కాసేపట్లో ముగ్గురూ కబుర్లలో పడ్డారు. నీరజ తమ్ముడు నవీన్ ఒక ప్లేట్‌లో సున్నుండలు, ఒక ప్లేట్‌లో కారా చుడువా పట్టుకొచ్చి ‘అక్కా, అమ్మ మీకు ఇవ్వమన్నది’ అంటూ అక్కడే ఉన్న బల్లమీద పెట్టి మధ్యలోకి జరిపి వెళ్తూ, ఇద్దరినీ చూసి ‘హలో బావున్నారా’ అని అడిగాడు, ఓ నిమిషం నిలబడి, పలకరింపులు కాగానే వెళ్లిపోయాడు. స్నేహితురాళ్లు ముగ్గురూ మా•ల్లో పడ్డారు.
———————
ఆకాశం మేఘావృత్తమై ఉన్నది. గత నాలుగురోజుల నుండి కురిసిన వాన తగ్గుముఖం పట్టి, ముసురుతోనూ రెండు రోజులు చుట్టి ఈ రోజే తెరిపి ఇచ్చింది. వాన తడి ఆరని నేల, అక్కడక్కడ గుంతల్లో నీళ్లు, దారి వెంటున్న పచ్చికపై తళతళ మెరిసే నీటి బిందువులతో శ్రావణమాసపు అందాల్ని పూలు పూచినట్టు నవ్వులు పలకరిస్తున్నాయి.
పొలాలో, చెల్కలలో రైతులు క్షణాలను లెక్కించకుండా పనులు చేసుకుంటున్నారు. అంతకు క్రితం వేసిన గింజలు మొలకెత్తి పచ్చగా మెరుస్తూ సాళ్లు దీరాయి. వరదలొచ్చి కొట్టుకు పోవడమెరుగని ఆ కొద్ది ప్రాంతంలో పట్నం అనే భూకబ్జాదారి ఇంకా ప్రవేశించని కొన్ని ఎకరాలు ఆ చుట్టుప్రక్కల అందరినీ ఆకర్షిస్తుంటాయి. తనకున్న భూములు అమ్ముకున్నా ఈ పది ఎకరాలు అట్టే పెట్టుకున్న రైతు మల్లారెడ్డి. ఇంతలో ఆయన స్నేహితుడు రాజేశం మోటర్ సైకిల్ కంచె పక్కన పార్క్ చేసి దగ్గరగా వచ్చిండు.
‘ఏంది రాజా ఇయ్యాల పొద్దున్నే వచ్చినవ్ ఏం సంగతి, ఏంది?’ అంటుంటే, ‘ఏం లేదు రెడ్డీ, ఇవ్వాళ నిన్ను వదిలిపెట్టొద్దన్నది మీ చెల్లె. నిన్ను ఎట్లనన్న తీసుకరమ్మన్నది, పా పోదాం’ అన్నాడు రాజేశం.
‘వామ్మో, గిప్పుడా! గిప్పుడేడ ఒస్త? మల్లెప్పుడన్న ఒస్తతీయ్..’ అంటుంటునే,
‘ఏ, నువ్వెన్నన్న జెప్పు ఇవ్వాళ నిన్ను తీసుకోనే పోత! అరె, మేం ఒచ్చి, ఇల్లు గట్టుకోని గిన్ని నెలలైంది రానంటవేంది. నేనే తీస్కపోతా అన్నా గూడ రావా ఏంది? గదంత ఏమీ లేదు నువ్వు రావాల్సిందే, నడు’’ అన్నాడు రాజేశం.
‘‘యే.. గంత తొందరేంది? జరాగు, ఒస్తలేగాని…’ అంటూ తన వెంట దెచ్చిన సామాన్లను గోనె సంచిలో కట్టిపెట్టి, షెడ్డులో పెట్టి తాళం వేసి వచ్చాడు. ఇద్దరూ నడుచుకుంటూ మోటర్ సైకిల్ దగ్గరికి వెళ్లారు. మరో నిమిషంలో ఎక్కి కూచుని రాజేశ్ స్టార్ట్ చేసాడు. మల్లారెడ్డి వెనక సీటుపై కూర్చోని, రెండు చేతులూ రాజేశం భుజాలపై వేసాడు. పదినిమిషాల్లో సందులు దాటుకుంటూ, ఇండ్లు దాటుకుంటూ వెళ్లి ఓ రెండస్తుల ఇంటి ముందు ఆగింది. గేటు ముందు పూలచెట్లు పలకరిస్తే, గేటు లోపల పళ్లన్నీ బయటపెట్టి నవ్వుకుంటూ ఇంటి ఇల్లాలు జయమ్మ పలకరించింది. ‘నమస్తే అన్నయ్య, బాగున్నారా? రండి.. రండి..’ అన్నది. ఆప్యాయతలు కరువైనాయని అంటారుగాని ఇట్లా అక్కడక్కడ చక్కని ప్రేమైక పిలుపులతో తళుక్కుమంటునే ఉన్నాయి. మల్లారెడ్డిపైన ఉన్న గౌరవం ఆ ఇంటిల్లిపాది మాటల్లో తెలిసిపోతుంది. ముసలి తల్లి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ, తను, తన భార్య అంతా కష్టసుఖాల్నీ అనురాగాల్నీ కలసిమెలసి పంచుకుంటున్న రాజేశం కుటుంబం అంటే మల్లారెడ్డికీ ఎక్కడ లేని ఇష్టం. అంతా కూర్చొని మాట్లాడు కుంటుంటే ‘అవునూ కిరణ్మయి కనబడతలేదు. ఏడబోయింది? టీచర్‌గా చేస్తున్నది కదా’ అనడిగాడు మల్లారెడ్డి.
‘ఏందో పరీక్షలటరా కిరణమ్మకు! మరీ మిక్కుటమైనవట. కోచింగ్ తీసుకోవాలని పోయింది. మా చిన్న తమ్ముడు వర్ధన్ వాళ్ల ఇంట్లో ఉండి చదువుకుంటు న్నది. ఈణ్ణుండి సిటీకీ రోజూ పొయ్యెచ్చేది మొదట్ల. ఇగ పరీక్షలు దగ్గరబడ్తున్నయని ఆడ వాళ్లింట్లనే ఉండి చదువు తాంది. అయి పోంగానే వస్తది’ అని వివరాలన్నీ చెప్పిండు రాజేశం.
‘ఎప్పుడో గృహప్రవేశానికి ఒచ్చినవ్ అన్నా.. మళ్లా రాలేదు. అరే మనోజూ పో, మామను దీస్కపోయి ఇళ్లు జూపియ్’ అన్నది జయమ్మ.
ఇంట్లోకి ప్రవేశించాక వాళ్లు ఏమేమి పనులు చేయించిందీ, వుడ్‌వర్క్ ఎలా చేయించిందీ, ఫాల్స్ సీలింగ్ చేయించిందీ అన్ని చూపించి కిందికి వచ్చేసరికి గుమ గుమ వాసనలు వస్తుంటే ‘ఊఁ! ఏంది జయమ్మా! ఏం వండినవ్ ఏంది? మస్తుగా చేసినట్లున్నవ్ గదా? ఔనో కొడుకు పెండ్లి ముందా? బిడ్డ పెండ్లి ముందా? ఎవరిది చేస్తున్నవ్ ఏంది ఆఁ…?’ అన్నాడు మల్లారెడ్డి. ‘రా అన్నా భోజనాలు తిందాం, తినుకుంటు మాట్లాడుకుందాం’ అంటూ వడ్డించింది.
‘ఏమో రెడ్డీ! ఇంత కొత్త ఇల్లు అప్పుడే చిన్న చిన్న రిపేర్లు వస్తున్నయ్, ఏందో ఏమో’ అన్నాడు రాజేశం.
‘యే! అదేంది రాజా! రావా మరి? ఇల్లు సెటిల్ అవుతది గదా! ఇంతకూ ఏమైంది’ అన్నాడు. ‘అగో మొన్నటి వానలకు ఆ గోడలల్ల ఎట్ల నిమ్ము వచ్చిందో చూడు. మాకు పరేషాన్ అవుతున్నది’ అంటున్న రాజేశంతో మల్లారెడ్డి ‘మరి ఎన్కటి నుండి మన పెద్దోళ్లు ఎందుకన్నరు? ఒక సంవత్సరమన్నా కట్టుకున్నోళ్లు వాళ్ల ఇంట్లో ఉండాలి అని? ఇందుకే. కొత్తింట్లో అన్ని పండుగలు చేసుకోవాలి అంటారు.. అది పద్ధతి, మన సంప్రదాయం, ఆనవాయితీ అన్నట్లు.. అదెందుకు తెల్సా? అంటే..
అంటే.. అన్నీ బయటపడ్తాయి. కట్టుకున్నోళ్లు ఉంటే అవన్నీ తెలుస్తయ్ రిపేర్లు చేయించుకోవచ్చు. దసరా, దీపావళి పండుగలంతే కదా! ఇప్పుడు శ్రావణంలో ఏమైన రిపేర్లు చేయించుకుంటే మళ్లీ ఆ పండుగలప్పుడు సరిగ్గానే చేసిండ్రా లేదా తెలుస్తది గదా! సంక్రాంతి అనుకో – జనవరి.. అప్పటికి చలి మొదలైతది. చలికాలం చెదలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటది. అదీ ఏమైనా వచ్చేనా తెలుస్తది. ఉగాది అనుకో ఇక ఎండలు ఎక్కువైపోతుంటవి, శ్రీరామనవి.. ఇట్లా కార్తెలు మారుతుంటవి. ఎందుకు.. గోడలల్ల ఏమైన పగుళ్లు ఉంటే సరిగ్గా క్యూరింగ్ అదీ చెయ్యకుంటే బయటపడ్తవి కదా. అట్లా ఇప్పుడు కాంపౌండ్ వాల్ గానీ, ఆ సందుల మనోళ్లు బండలుగానీ ఏమైనా సరిగ్గా చేసిండ్రా లేదా అనేది తెలువాలంటే ఇంటి ఓనర్స్‌కు తెలువాలి. అందుకే మనోళ్లు ఏడాది పండుగలు కొత్తింట్ల చేసుకోవాలె అన్నరు. ఇదీ మన సంప్రదాయం. అట్లంటేనే తప్పక భయంతోని పాటిస్తారని. అన్నీ గమనించుకోండి, చేయించుకోండి అంతేగాని పరేషాన్ అయితే ఎట్లా. ఇళ్లు గట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఎందుకన్నరు మన పెద్దోళ్లు? ఇందుకే.
పెండ్లి జేసినమనుకో ఆడపిల్లదైనా, మగపిల్లోనిదైనా, ఎవరిదైనా గీ పెండ్లితోనే బాధ్యత దీరిపోతదా చెప్పు? పండుగలకు దీసుకొచ్చుడు, కట్నాలు పెట్టుడు, సీమంతాలు, చంటోళ్ల ఫంక్షన్‌లు ఇట్లాంటివి, వాళ్ల తల్లిదండ్రులు.. మంచి చెడ్డలు ఇవ్వన్నీ మాటలా? ఒదిలేసుకోని ఉండరా? ఇద్దరు స్త్రీపురుషుల పెండ్లి చేసుడే కాదు గదా, రెండు కుటుంబాలు కలుసుకునడు కదా’ అంటుంటే,
‘అవునన్నా! మీరు చెప్పేది నిజం, పెండ్లి చేసుడుతో బాధ్యత ఎట్లా పెరుగుతదో ఇళ్లు గట్టుకున్నాక పని అట్ట ఎక్కువైతది’ అన్నది జయమ్మ.
‘నిజమే మామయ్య, అదే కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి ఓనర్ చూసుకుంటడనే ధీమా ఉండేది. ఇప్పుడు సొంతిళ్లు గనుక మనవే అన్ని పనులు’ అని వాళ్ల కొడుకు అంటుంటే,
‘మన పూర్వీకులు చెప్పినవన్నీ కరెక్ట్, పెడర్థాలు తీసుడు తప్ప మనమేమీ కొత్తవి నీతులు బోధించ గలిగామా ఏమన్న?’ అని రాజేశం అంటూంటే,
‘అబ్బో మనోడికి పాత ఆచారాలమీద బాగానే గురి ఉన్నట్టున్నదే..’ అని మాల్లారెడ్డి అనగానే అంతా గొల్లుమన్నారు.
———————-
వయసులో ఉన్నవాళ్ల ఆలోచనలు ఎప్పుడూ పట్టాలమీద పరుగెడుతున్న రైలులా వేగంగానే ఉంటాయి. స్టేషన్ వచ్చినప్పుడు ఆగినట్టు సమస్యలు వస్తేగాని ఆగరు. కానీ ఏదో దృఢసంకల్పంతో రైలులానే గమ్యాన్ని చేరుకుంటారు. బుద్ధి, జ్ఞానమూ అనుభవాలతో నేర్చుకునేప్పుడు తార్కిక చింతనతో ఉంటారు. ఇది ఈ కాలపు తీరు. ఏదో అమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది కాబట్టి చేస్తున్నా అనే అబ్బాయిలూ లేరూ, అమ్మాయిలూ లేరు.
‘నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నదే నళినీ. నీకింత ఓపిక ఏంటి? పెద్దవాళ్ల మాటలు జవదాటవు కదా!’ అన్నది. అక్కడ ఒక కొత్తగా పరిచయమైన అమ్మాయి ముందు ఇదేదో ముచ్చట తీస్తున్నది అనుకొని వద్దన్నట్లు ‘ఆఁ! ఆఁ! సరేలే గాని నీ కబుర్లేంటి?’ అన్నది నీరజను వారిస్తూ నళిని. ‘అరే ఏం గాదే, కిరణ్మయికి అన్నీ తెలుసు. మేం చాలా క్లోజ్ అయ్యాం. నువ్వు మొహమాట పడకు. కిరణ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ టీచర్, షీ ఈజ్ స్టూడెంట్ ఆల్‌సో – తను కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నదే. మన లాంటి ఆలోచనలే. మేం అన్నీ షేర్ చేసుకుంటాం’’ అన్నది నీరజ.
‘పాపం నళిని ఎందుకో మొహమాట పడుతున్నది. డోంట్ ఫోర్స్ హర్ నీరజా’’ అని కిరణ్మయి అంటుంటే,
‘‘నో, నో! అదేం లేదు. ఈ టాపిక్ అందరికీ నచ్చదు. విశ్వాసం ఉండదు, అందుకని..’ నళిని అంటుంటే..
‘కాని, తను కూడా తన అభిప్రాయం చెప్తుంది, నళినీ. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్?’ అంటున్న నీరజతో.
‘సో, మనం డిస్కషన్ పెట్టుకుందాం. బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఎ హెల్దీ అట్మాస్ఫియ్యర్. అయితేనే – సరేనా?’ అన్నది నళిని. వెంటనే కిరణ్మయి-
‘‘ఏంటి ఇంతకు? ఏ విషయంపైన?’’ ఆత్రుతతోనూ, తెలియదు కాబట్టీను..
‘కిరణ్ మా ఇంట్లో ఆడవాళ్లు పిరియడ్ టైమ్‌లో ఇంటి పనులు ఏవీ చేయకుండా ఉంటారు. దేవుడి గూడు, కొన్ని పదార్థాలూ, కొన్ని వస్తువులూ ముట్టుకోరు. నాలుగో రోజు తల స్నానం చేశాకే ఇంట్లో కొస్తారు. అంటే ఇంట్లోని అన్ని విషయాల్లో పాల్గొంటారు. ఇది దీనికి ఆశ్చర్యం, నన్ను తిడుతుంది’’ అంటున్న నళినితో.
‘కాదానే మరీనూ, ఛాదస్తుం కాకపోతే ఏంటి? మైల ఏంటి, మడి ఏంటి అంతా ట్రాష్ అనిపిస్తుంది. ఇంత సైన్స్ డెవలప్ అయ్యింది. ఈ రోజుల్లోనూ ఇదేంటి? నువ్వు ఇంత చదువుకున్నావు. ఎంతోమందిని చూస్తున్నావు, అన్ని చోట్ల ఈ ఆచారం ఉన్నదా? లేదు కదా! మరి అలాంటప్పుడు నువ్వు మీ అమ్మకు చెప్పవచ్చు కదా! మీ నాన్నగారు కూడా ఏమీ అనరా? వారివన్నీ ఆదర్శభావాలు, పైగా కవి కూడా’’ అని నీరజ అంటుంటే,
‘అవునా? మీ నాన్నగారు కవా? ఏం రాస్తారు? నేను బాగా చదువుతాను. సాహిత్యం అంటే ఇష్టం! కవయిత్రి భగవతిగారంటే చాలా ఇష్టం. ఆమె రాసేవి అన్నీ చదువుతాను’ అన్నది కిరణ్.
‘అవును, మా నాన్న కవే, బాగా రాస్తారు. కానీ మా అభిప్రాయాలనూ గౌరవించాలి కదా! మా అమ్మ చెప్పిందనే కాదు, నాకు మా పద్ధతులంటే ఇష్టం. నేను పాటిస్తాను. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది లేదు కదా!’ అన్నది నళిని.
‘అంటే, నువ్వే ఈ మూఢాచారాలను పాటిస్తున్నావా? నీ మీద ఎవరి ఫోర్స్ లేదా? ఆత్మవంచన ఎందుకే?’ తీవ్ర స్వరంతో అంటున్న నీరజను చూసి కిరణ్ ఆశ్చర్యపోయింది, చెప్పాలంటే భయపడింది కూడా! స్నేహితుల మధ్య అంత తీవ్రమైన అభిప్రాయభేదాలూ, అంత ఘాటు మాటలా అని కొద్దిగా తమాయించుకొని కూర్చున్నది.
‘‘మూఢాచారాలు అని వీటిని అనరు. నేను దేవుణ్ణి నమ్ముతాను. భక్తితో పూజిస్తాను. నిజం చెప్తే వినరు, నమ్మరు. ఇది లోకం తీరు. జనాభా ఎక్కువ లేనప్పుడు, ఆరోగ్య విజ్ఞానశాస్త్రంగా దీన్ని భావించారేమో అప్పుడు. ఇప్పుడు కాల పరిస్థితులు వేరు కదా! అందుకే ఆచారం అన్నారేమో! ఆచారం అంటే తప్పక పాటిస్తారని మొదట్లో పెట్టి ఉంటారు. క్రమంగా దాన్ని ఏదో అం•రాని వారిగా చేసారనిపిస్తుంది.
అందుకోసం దేవుని గదినిగాని, గూడునుగాని, పూజ సామాగ్రినిగాని పవిత్రంగా భావిస్తాను. ఇది తప్పా? ఇన్ ఆల్ ద థింగ్స్ సమ్‌థింగ్ స్పెషల్ అనుకుంటాను. నువ్వు గులాబీలను చూస్తావు, నచ్చుతావు. నీ ప్రియుడో, నీ కాబోయే భర్తనో గులాబీ ఇవ్వగానే నిర్లక్ష్యంగా పడేస్తావా? లేదు. అన్ని పువ్వుల్లానూ అది! కానీ, వాడిపోయేంతవరకూ భద్రపరుచుకుంటావు. అటువంటిది న్యితం కొలిచే దేవుడి వస్తువుల్ని, పటాలనూ భక్తిగా చూడొద్దా! అందుకే నేను ఆ నాలుగురోజులు ముట్టుకోను’ అన్నది నళిని.
‘అదిగో! అదే నేను అనేది. అది మనసుకు సంబంధించింది కాబట్టి ఎప్పుడూ భక్తిగానూ చూడు. శుభ్రతకు సంబంధించింది అంటే, ప్రతిరోజూ స్నానం చేసాకా తాకు, ఆ నాలుగురోజులు నువ్వు శుభ్రంగా ఉండవా ఏంది? నాకర్థం కానిది అదే. దాన్ని మలినం అని అనడం ఎందుకు? ముట్టుకోవద్దనడం ఎందుకు?’ కొంత ఆవేశంగా వాదిస్తున్న నీరజతో నళిని, ‘నేను ఆ రక్తస్రావాన్ని మలినంగా భావిస్తాను కాబట్టి, నాకే నచ్చదు. టీచింగ్ ప్రొఫెషన్ ఓ పవిత్రమైన ఉద్యోగం, మెన్సెస్ టైంలో స్కూల్ మానేసి ఇంట్లో ఉండాలి టీచర్ అని నేను అనడం లేదు. డాక్టర్ ప్రొఫెషన్ కూడా అంతే! ఇప్పుడు పోలీస్ జాబ్‌గానీ, కండక్టర్‌జాబ్, ఆఫీస్ జాబ్ ఏదైనా దేని పరిమితులకు అవి గొప్పవే, అంతెందుకు స్టూడెంట్స్‌గా మనం లేమా? ఇప్పుడు జాబ్‌కు వెళ్లడం లేదా? ఆ నాలుగురోజులు డుమ్మా కొడ్తున్నామా? లేదే! అన్నీ చెయ్యచ్చు వద్దనలేదే! ఓన్లీ గుడి, దేవుడు, పూజ అని వద్దనన్నాను.’
‘ఇది మరీ బావుంది. ఇంట్లో పనులు చేయకుండా, వంట చేయకుండా కూర్చోరూ మీ ఇంట్లో! దాన్నెట్లా సమర్థిస్తావ్?’ అన్నది నీరజ.
‘నీరజా నేను ఎవరితోనూ ఎందుకు వాదించనంటే నేను చెప్పేవి అందరూ నమ్మరు. నమ్మించాల్సిన అవసరమూ నాకు లేదు. ఇది నా అభిప్రాయం అంతే. మా ఇంట్లో అమ్మకు రెస్ట్ దొరికిన టైం ఏది అంటే ఆ నాలుగురోజులే. మాది కొంతకాలం ఉమ్మడి కుటుంబంగా ఉండేది. ఎప్పుడు చూడు చాలామంది చుట్టాలే వచ్చేవాళ్లు. నాన్నమ్మ, అత్తలు, పిన్నివాళ్లు, అమ్మ అందరూ కలిసి వంట పనులు, క్లీనింగ్ పనులూ చేసేవాళ్లు. ఇవన్నీ చూస్తూ పెరిగాను. అఫ్‌కోర్స్ కూలి నాలి చేసుకునేవాళ్లకు లేని రెస్ట్ మీకెందుకు? అంటావేమో? ఒకటి మాత్రం నిజం. ఇలాంటి సందర్భాల్లో వాళ్లతో పోలుస్తారేగాని, డబ్బు, హోదాల విషయంలో అనరెందుకు? ఎవరి బ్రతుకు వాళ్లది. కొంతమందికి రిచ్‌గా బ్రతికే, సుఖంగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఏం నువ్వు ఎందుకు ఇంత పెద్ద ఇంట్లో ఉండాలి? మీ పనమ్మాయి పూరిగుడిసెలో ఉన్నది కదా! మీ ఇంట్లో ఉంచుకోవచ్చు కదా! లేదు.. అక్కడికొచ్చేసరికి మాట మారుతుంది.’
‘అసలు దీనికి, దానికి పొత్తేందే’ గదమాయించింది నళినిని నీరజ.
‘చెప్తా! భయమో, భక్తో ఉన్నది కాబట్టే మా ఇంట్లో ఒక అండర్‌స్టాండింగ్‌తో మగవాళ్లు ఉంటారు. ఆ సమయంలో వాళ్లను తాకరు. పనులు అడగరు, ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు. ఇట్లా రోజు చెయ్యొచ్చు కదా అనీ నువ్వనవచ్చు. కానీ, ఏం.. మీ ఇంట్లో వంట పనంతా పాపం మీ అమ్మ ఒక్కతే చేస్తుంది. మీ నాన్నగారు చెయ్యరెందుకు?’
‘అరె! మా నాన్న ఆఫీస్‌కెళ్తడు కాబట్టి’ ఉక్రోషంగా అన్నది నీరజ.
‘అదే మరి! పాపం ఆంటీకి ఆ నాలుగురోజులైనా మీరెవ్వరూ రెస్ట్ ఇవ్వలేదు. కావాలంటే తెలుసుకో, కడుపులో నొప్పిగా ఉన్నా, ఒంట్లో నలతగా ఉన్నా, బ్లీడింగ్‌తో ఇబ్బందిగా ఉన్నా ఆంటీ ఎవరికీ చెప్పుకోలేదు. మీకెవ్వరికీ ఆమె శారీరక బాధలు తెలియవు. దానితో ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా? ఏం మీకు తెలియదా? మీ నాన్నకూ, మీ తమ్ముడికీ తెలియదా? తెలుసు అయినా పట్టించుకోరు. ఇదే మా ఇంట్లో పట్టించుకుంటారు. కంప్లీట్‌గా రెస్ట్‌గా ఉంచుతారు. ఆ రోజుల్లో స్త్రీలు మనసులో దేవుడిని తలుచుకుంటారు. మొక్కుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా మా నాన్న తన షెడ్యూల్‌ను మార్చుకొని వంట చేస్తారు, పూజ సామాగ్రి, పనులూ అన్నీ చూస్తారు. మా అన్నయ్యలు, తమ్ముళ్లు, అదే మా చిన్నాన్న కొడుకులు ఎవరైనా వచ్చినా అర్థం చేసుకుంటారు. నేనూ చేస్తాను. అమ్మ ఆఫీస్‌కు వెళ్లి వస్తుంది, అంతే ఇంకేం చేయదు’ అంటుంటే.
‘మంచంలో పడుకోరు, బీరువా ముట్టుకోరు, ఇట్లాంటి ఛాదస్తాలనేమంటావు?’ పట్టు సడలనివ్వని నీరజతో,
‘చూడు ఇవ్వి ఛాదస్తాలంటే ఛాదస్తాలు, కాదంటే కాదు! బీరువాలో పట్టు బట్టలుంటాయి. ఇవి మళ్లీ శుభకార్యాలకు, పూజలకు కట్టుకుంటారు. కాబట్టి ముట్టుకోవడం ఇష్టం ఉండదు. ఇక వంటింట్లో అన్ని పదార్థాలు ఉంటాయి. మేం దేవునికి నైవేద్యంగా పెట్టి తింటాము కాబట్టి అవ్వీ ముట్టరు. దీన్ని ఛాదస్తమంటే ఇక నేనేం వాదించను, వదిలేసెయ్’ అన్నది నళిని.
‘ఊహు.. మేము కూడా దేవునింట్లకు అస్సలు బోము’ అన్నది మెల్లెగా కిరణ్మయి. అంటే ‘మేము కూడా పోమనుకో..’ అన్నది నీరజ.
‘అదే మరీ! అందుకే మరి! ఒకదానికొకటి లింక్ ఉంటాయి కాబట్టి ఏవీ తగలకుండా ఉంటే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ అనుకో! ఇక రెస్ట్ దొరకాలంటే స్ట్రిక్ట్‌గా ఉండాలి. తప్పించుకోలేని ఆఫీస్ పనినీ, కాలేజీని ఏం చెయ్యలేం గదా! పైగా మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుంది, అది తగ్గాలంటే హాయిగా పడుకొని ఏ పుస్తకాలో చదువుకోవచ్చు’ అని నళిని అంటుంటే, కిరణ్-
‘కాని, కొందరు కవయిత్రులు దీన్ని అమానుషంగా భావిస్తూ ఎన్నో కవితలు రాశారు. తన ఒంట్లోంచి నెలకో మూడురోజులు అమృతం పోతుంది అనీ రాశారు తెలుసా?’ అన్నది.
‘ఏమో! దీన్ని అమృతం అని ఎందుకన్నారో నాకైతే అర్థంకాలేదు గాని, ఇది చెడు రక్తం, చెడు రక్తమేనా అంటే కాదు, అసలు ఈ రక్తమే గర్భం దాల్చడానికి ముఖ్యమైనది. కానీ ఎప్పుడైతే గర్భ సంచీ నుండి గర్భం కాకుండా సర్వెక్స్‌లోకి వస్తుందో అప్పుడు అది వృధా రక్తం. ఏ ఉపయోగం లేనిదిగా అవుతుంది. అది వెళ్లిపోవడమే కరెక్ట్. అప్పుడది శుభ్రమైందని ఎట్లా అంటారు? ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చేది. కాబట్టి చెడుది కాదు. ఆడజాతి పశువుల్లోనూ అంతే. ఇది నీకు తెలుసా? ఇవి హార్మోనియల్ ఛేంజెస్ ఇన్నర్ లేయర్ ఆఫ్ యుట్రస్, గర్భసంచిలోని పొర ఎండో మెట్రియమ్. ప్రతినెల హార్మోనియల్ ఇన్‌ప్లూఎన్స్‌తో ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రోజెన్‌ల్లో తేడాలు వస్తాయి. పదకొండేళ్ల నుండి యాభైల వయస్సువరకు ఈ మార్పు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో టైములో నెల వస్తుందిగానీ, తీరు మాత్రం ఒక్కటే. ఏవో కొన్ని చిన్న చిన్న తేడాలుంటాయి. డిపెండ్స్ ఆన్ ద హర్మోనల్ ఛేంజెస్‌ల్లోని, లెవెల్స్‌లోని బ్లీడింగ్ అనేది ఆధారపడుతుంది. మెనుస్ట్రుల్ సైకిల్ బ్లడ్ అనేది ఫిజియాలాజికల్ ప్రాసెస్. చెయ్యి కోసుకుంటే మామూలు అప్పుడు ఎక్కువ బ్లడ్ రాదు. కాని పిరియడ్స్ అప్పుడు ఎక్కువ అవుతుంది. రెస్ట్ తీసుకుంటే బెటర్. వివిధ దశల్లో స్త్రీ శరీరం రూపం ఎట్లా మారుతుందో హార్మోనల్ ఇన్‌బాలెన్స్‌లూ అంతే. ఓవర్ బ్లీడింగ్ అయినా, లెస్ బ్లీడింగ్ అయినా దిస్ ఈజ్ నాట్ ప్యూర్ బ్లడ్. దీన్ని అమృతంతో పోల్చడం తప్పు’ అంటుంటే, నీరజ – ‘ఇదేందో ఈ అమృతం అనే మాటేందో అసలు.’
‘అదే కదా నాకూ ఆశ్చర్యమేసింది. ఇంతవరకు అమృతాన్ని ఎవరైనా చూశారా? త్రాగారా? దానితో ఎందుకు పోల్చారో అని నాకూ అనిపించింది’’ అన్నది కిరణ్మయి.
‘కాబట్టి.. నాకైతే ఇట్లా నిబంధనలు పెడితేనేగానీ, ఇళ్లళ్లల్లో మగవాళ్లు, అత్త, ఆడబిడ్డ అందరూ సదరు ఆడవాళ్ల కోసం కాస్త ఆలోచిస్తారు అనిపిస్తుంది. పాటించనివారు పాటించకపోనీ, నమ్మనివాళ్లు నమ్మకపోనీ, మన పెద్దలు చెప్పింది కాదని కొత్త కష్టాలెందుకు తెచ్చుకోవాలి. సమానత్వం గురించి, సాధికారత గురించి పోట్లాడుతున్న వాళ్లం. మా ఇంట్లో ఇస్తున్న ఈ గౌరవాన్ని ఎందుకు కాదనాలి అని ఇంత మాడ్రన్‌గా కనిపిస్తున్న నేనూ అవే పాత పద్ధతుల్ని పాటిస్తున్నాను. ఇదీ మన మంచికేనని’ అని తాను చెప్పదల్చుకున్నది చెప్పింది నళిని.
‘అంతేగాని మగవాళ్ల ఆలోచన మారాలి. కలిసి పనులు చేసుకోవాలి అనవా?’ అన్నది నీరజ.
‘ఎందుకనను? కలిసి చేసుకోవాలి. ఇద్దరివీ చదువు, ఉద్యోగాలు సమానంగా ఉన్నప్పుడు రోజువారి పనులు చెరిసగం పంచుకోని చేసుకోవాలనే అంటాను. అదీకాక ఇది ఎక్ట్స్రా. ఇది ఓన్లీ లేడిస్ ప్రాబ్లమ్ కాబట్టి’ అన్నది నవ్వుతూ నళిని.
‘భలే చెప్పారు నళినీ, అయితే ఈ నాలుగురోజుల రెస్ట్ బోనస్ అంటారు ఆడవాళ్లకు’ అన్నది కిరణ్.
‘యస్! ఎందుకంటే పునరుత్పత్తి అనే గొప్ప క్రియ కేవలం ఆడజాతిలోనే ఉన్నది. అందుకే! ఒక భయం ఉంటేగాని వినరు. భక్తికోసం భయం ఉండాలి. భక్తి, భయం ఒకటిగాదు. వీటినే సంప్రదాయాలు అన్నారు. ఇవి పాటించడం సిగ్గుగాదు. గర్వంగా భావించాలి అంటాను’ స్థిరంగా అన్నది నళిని.
వెంటన్ కిరణ్ ‘మన పండుగలూ, పబ్బాలూ అంతేకదా! ఏదో మూలకారణాలతో ఏర్పరచారు. సగటు జీవులం గదా.. తప్పు, కూడదు అంటే వింటారు. పాపం అంటే భీతిల్లుతారు. ‘ఔను, మా ఇల్లు కొత్తది. ఏడాదిపాటు పండుగలన్నీ చేసుకో వాలని నాన్నమ్మ చెప్పినందుకు మా అన్నయ్యకు వేరే ఊరికి ట్రాన్సఫర్ అయినా, మా నాన్న రిటైర్ అయి ఖాళీగా ఉన్నా ఈ ఇల్లు ఖాళీ చేసి పోవద్దని, ఏడాదన్నా ఉండాలి అని అక్కడే ఉంటున్నాము. పండుగలు జీవన వికాస సాధనాలు అని అనిపిస్తుంది నాకు’ అన్నది కిరణ్మయి. అన్నీ ఏమోగానీ, ఈ మనుస్ట్రుల్ టైమ్‌లో రెస్ట్ ఇచ్చేలా, ఆడవాళ్లకు అందరికీ రెస్ట్ అందేలా ఒక ఉద్యమమే తేవాలేమో అనిపిస్తున్నది నాకు’ అన్నది స్థిరంగా నళిని.
‘యా! నువ్వన్నది నిజమే! ఈ మూడు రోజులలో కనీసం ఒకటి, రెండు రోజులైనా విశ్రాంతి ఉండాలి’ అని ఒప్పుకున్నది నీరజ.
వీళ్ల మాటలలో కొంత అర్థమయ్యి, కొంత అర్థంకాని యాదమ్మ చేతిల చీపురు కట్ట కష్టపు కన్నీరు కారుస్తుంటే, బాత్రూం కడగడం కాగానే ‘‘నీరజమ్మ, నువ్వెనన్న జెప్పు ఆడోళ్ల కష్టాలు, వారి గోసలు ఎవ్వరు బట్టించుకోరమ్మ’’ అంటుంటే వాళ్లను మరో ప్రపంచమేదో గమనిస్తున్నదని చూసి ముగ్గురు గతుక్కుమన్నరు.