నవంబర్‌ 16 ‌న కార్తీక మాస ప్రారంభం

శరదృతువులోని జంట మాసాలలో ఆశ్వీయుజం వెళుతూ దీపాల పండుగను ఇస్తుంది. ఆ మరునాడు ఆరంభమయ్యే కార్తీకం మానవ జీవితంలో వెలుగులు నింపుతుంది. వాతావరణాన్ని తేటపరుస్తుంది. ఆరోగ్య సూత్రాలను తెలియచెబుతుంది. వైశాఖంలోని వేడిబాధ, ఆషాఢంలోని ముసురు బెడద, పుష్యమాసంలోని చలిపులి భయం ఉండదు. భక్తి, ముక్తి, రక్తి ముప్పేటల అల్లుకున్నదే కార్తీకం. ఈ మాసంలో ప్రతిక్షణం అందమైనదే. నిజానికి ఈ మాసంలోని తిథులన్నీ ప్రత్యేకమైనవే. ప్రతి తిథీ పండుగే. కార్తీక పున్నమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశిని వాటిలో మరింత విశిష్టమైనవిగా చెబుతారు.

కార్తీకమంటేనే దీపాల పండుగ. ఈ మాసం కృత్తికా నక్షత్రం వల్ల ఏర్పడింది. ఈ నక్షత్రానికి అగ్ని అధిపతి. కృత్తిక అంటే అగ్ని. దానిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మ రూపం దీపం. తాను వెలిగించిన దీపపు కాంతిని కీటకాలు, పక్షులు, వృక్షాలు, జలచరాలపై ప్రసరింపచేయాలని, వాటికి ముక్తిని ప్రసాదించాలని కోరడం మానవత్వం. అంటే తాను వెలిగించే కార్తీకదీపం ద్వారా వాటిని వెలిగించలేని కీటక, జంతు, వృక్ష జాతులకు వెలుగులు పంచి, సమస్త ప్రాణకోటికి ప్రయోజనం చేకూర్చాలన్న ప్రార్థనే దీని పరమార్థంగా చెబుతారు.

అసలు.. నిత్యదీపారాధన తప్పనిసరి అని పెద్దలు చెబుతారు. అలా కుదరని వారు ఈ మాసం మొత్తమైనా దానిని పాటించాలని, అదీ కుదరకపోతే ఆ నెలలోని సోమవారాలు, శుద్ధ ద్వాదశీ, చతుర్దశీ, పౌర్ణమి తిథులనాడైనా దీపాలు వెలిగించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకూ అవకాశం లేని వారు పున్నమినాడు 365 వత్తులు గల గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడువునా దీపాలు పెట్టినంత పుణ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. దీపాన్ని పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీకగా చెబుతారు. మానవుడు పంచభూత సమాహారమే కనుక దీపాన్ని వెలిగించడం అంటే తనను తాను చైతన్య పరచుకోవడమేనని జ్ఞానులు వ్యాఖ్యానిస్తారు. దీపానికి వాడే ప్రమిద భూతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, తైలం జలతత్వానికి, వెలిగేందుకు సహకరించే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలుగా చెబుతారు.

దైవారాధన పక్రియకు సంబంధించి షోడశోప చారాలలో దీపారాధన ప్రధానమైంది. వాటిలో అన్నిటిని చేయలేకపోయినా ధూపదీపనైవేద్యాలు తప్పక నిర్వహించాలని చెప్పడంలోనే దాని విశిష్టత అవగత మవుతోంది. దీపం జ్ఞానానికి, శాంతికి, సంపదకు ప్రతీక అని, సృష్టి స్థితి లయకారకులు, వారి దేవేరులు దీపంలోనే నిక్షిప్తమై ఉంటారని ప్రతీతి.

‘దీపాగ్రే వర్తతే విష్ణుః దీప మధ్యే మహేశ్వరః

దీపాంతేచ తదా బ్రహ్మ దీపం త్రైమూర్తికం విదుః

దీపాగ్రే వర్తతే లక్ష్మీ దీప మధ్యే చ పార్వతీ

దీపాంతే శారదా ప్రోక్త దీపం శక్తి మయం విదుః’…

దీపం కుంది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో శివుడు, అగ్రభాగాన శ్రీ మహావిష్ణువు నెలవై ఉంటారు. వారి పత్నులూ ఆ క్రమంలోనే ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. త్రిమూర్తులు సకల దేవతల ప్రతినిధులు కనుక సమస్త దేవతాగణం దీపాన్ని ఆశ్రయించి ఉంటారని చెబుతారు.

 ‘దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం

 దీపేన హరతే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే’!!

దీపం పరబ్రహ్మ స్వరూపం. అంధకారాన్ని పోగొడుతుంది. అందులో వెలిగే వత్తి ప్రకాశాన్ని ఇస్తూ పాప ప్రక్షాళన చేస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి, పాపాలను నశింపచేసే దీపాన్ని లక్ష్మీదేవితో పోల్చి చెప్పారు. అలా పోల్చడానికి కారణమైన గాథ ప్రచారంలో ఉంది. దుర్వాస మహర్షి కోపం బారిన పడిన ఇంద్రుడు సకల సంపదలూ కోల్పోయి దిక్కు తోచక విష్ణుమూర్తిని శరణువేడాడట. జ్యోతిరూపంలోని లక్ష్మీదేవిని అర్చించాలని శ్రీహరి ఇచ్చిన సలహాను ఇంద్రుడు పాటించి గత వైభవాన్ని పొందాడట. నాటి నుంచి శ్రీమహాలక్ష్మి ‘దీపలక్ష్మీ దేవి’గా ప్రసిద్ధమైందని చెబుతారు. ప్రమిద, అందులోని తైలం శ్రీమహావిష్ణువు కాగా, వత్తి చివర వెలుగుతున్న జ్యోతి పరమశివుడు అని, ఇలా ఈ జగత్తు హరిహరాత్మక తత్త్వంతో ప్రకాశిస్తోందనే వ్యాఖ్యానం కూడా ఉంది. ఇలా ఆ ఇద్దరిని ఆరాధించే దివ్య మాసం కార్తీక•మే.

అజ్ఞానాన్ని హరించి జ్ఞానదీప్తిని, సంపదలను కలిగించే ఈ దీపాన్ని ఈ మాసంలో వెలిగించడం వల్ల విశేష ఫలితాలు సిద్ధిస్తాయని అంటారు. అందుకే ఈ మాసంలో దీపాలు బారులు తీరతాయి.

ఈ మాసంలో రెండు సంధ్యలలో దీపారాధన చేస్తారు. వాటిలో సాయం సంధ్యాదీపం మరింత విశిష్టమైనదట. ఆ సమయంలో హరిహర ఆలయాల్లో కానీ, ఆ అవకాశం లేకపోతే పూజమందిరంలోనో, తులసికోట దగ్గర కానీ దీపప్రజ్వలన చేస్తారు. దేవతావృక్షాలు రావి, ఉసిరి కింద లేదా నదీతీరంలో దీపారాధన చేసినా విశేష ఫలితం ఉంటుందని పెద్దల మాట.

హరిహర అభేదం

‘శివాయ విష్ణు రూపాయ…’ అన్నట్లు కార్తీక మాసం హరిహరులకు ప్రీతిపాత్రమైనదని చెబుతారు. శివకేశవులు అద్వైతంగా పూజలు అందుకుంటూ భక్తులను కటాక్షించే మాసం ఇదొక్కటే. విష్ణువు మారేడు దళాలను, శివుడు తెల్లజిల్లేడు పూలు స్వీకరిస్తాడు. అలాగే సాలిగ్రామ, మృల్లింగాభిషేకాలు (మట్టితో చేసిన)జరుగుతాయి. వీరిద్దరికే కాదు. శాక్తేయులకు, సూర్యోపాసకులకు, కార్తీకేయ ఆరాధకు లకు కూడా ఇది పవిత్రమైన మాసంగా చెబుతారు.

శ్రీమహావిష్ణువు తులసీదళ ప్రియుడు. విశేషించి ఈ నెలలో వాటితో అర్చించడం విశేష ఫలదాయకం. అదే సమయంలో మారేడు దళాలతోనూ, అవిసె పూలతోనూ అర్చిస్తారు. ‘కార్తీకే బిల్వపత్రేణ/విష్ణువ్యాపక మీశ్వరం/యం: పూజయేత్‌ ‌నరశ్రేష్ఠ/నతు భూయోబిజాయతే’… కార్తీక మాసంలో విష్ణువును మారేడు దళాలతో అర్చిస్తే పునర్జన్మ ఉండదంటారు. శ్రీహరి ఈ మాసానికి ‘దామోదర’ నామంతో అధినాయకుడిగా ఉంటాడు. అందుకే ‘నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమస్తుతే’ అని ప్రార్థిస్తారు. సర్వలోకాలను గుప్తగతిని బొజ్జలో దాచుకున్నవాడు దామోదరుడు. ‘దామములు’ అంటే లోకాలు. ‘ఉదరం’ అంటే పొట్ట. అలాగే ‘దామము’ అంటే తాడు అనీ అర్థం ఉంది. చిన్నకృష్ణుడి అల్లరి భరించలేని తల్లి యశోద, ఆయనను తాడుతో రోలుకు కట్టిన కథ తెలిసిందే. ‘దామము’తో బంధించింది కనుక దామోదరుడు అయ్యాడు.

శ్రీమహావిష్ణువు ఈ మాసంలోనే యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ మాసంలో విష్ణుసహస్రనామ పారాయణ సర్వశ్రేష్ఠమని చెబుతారు. తనను అర్చించే వారిని ఎన్నడూ వదలబోనని శ్రీహరే నారదుడితో అన్నాడని పద్మపురాణం చెబుతోంది.

‘నాహం వసామి వైకుంఠే-యోగినాం హృదయేచ

మద్భక్తా యత్ర గాయంతి-తత్ర తిష్ఠామి నారద’

‘నేను వైకుంఠంలోనే కాకుండా యోగుల హృదయాలలో ఉంటాను. నా భక్తులు గానం చేసే చోట ఉంటాను’అని విష్ణువు ప్రకటించాడు.

దీప ప్రజ్వలనం

దీపం జ్ఞానానికి సంకేతం. నిర్లక్ష్యం,అజ్ఞానం అనే చీకటిని పారదోలుతుంది. పరిసరాలను శక్తిమంతం చేస్తుంది. దీపంలోని విద్యుద•యస్కాంత శక్తి ఆ ప్రాంత ఉష్ణ్గోగ్రత, గాలులపై ప్రభావం చూపుతుందని శాస్త్రజ్ఞులు చెబుతారు. మంగళప్రదం, సౌభాగ్యకరమైన దీపారాధనతో దేవతలు త్వరగా ప్రసన్నులవుతారట. దీపారాధనకు ఆధ్మాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో విశిష్టత ఉంది. పూజా మందిరం నుంచి గర్భాలయాల వరకు దీపారాధనలు; సదస్సులు గోష్ఠులు జ్యోతిప్రజ్వ లనంతో ప్రారంభం కావడం తెలిసిందే. అందులోనూ కార్తీక•ంలో వెలిగించే దీపం సర్వశ్రేయోదాయకమని పురాణాలు చెబుతున్నాయి.

‘దీపదో లభతే విద్యాం/దీపదో లభతే శ్రుతం/దీపదో లభతే చాయుః/దీపదో లభతే దివమ్‌’ ..‌దీపం వెలిగించినవారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులవుతారు. మోక్షం పొందుతారని పెద్దల మాట. దీపాలు పితృదేవతలకు మోక్ష ద్వారాలు లాంటివి. దీపం మానవ జాతికి శాంతిని, కాంతిని ప్రసాదిస్తుంది. భ్రాంతిని తొలగిస్తుంది.

కార్తీకదీపం విశిష్టత గురించి శ్రీమద్భాగవతంలో ఉంది. బలి చక్రవర్తి యజ్ఞం చేసి త్రివిక్రముడి మూడవ అడుగుతో రసాతాళానికి చేరినది ఈ మాసం లోనే. ‘నా యజ్ఞం పరిసమాప్తి కాకుండానే యజ్ఞఫలం అనే నీ దర్శనం కలిగించావు. కానీ నిన్ను ఆరాధించలేకపోయాను. ఆ దోషం తొలగేలా వరం అనుగ్రహించు. నా అహాన్ని హరించి రసా తలానికి పంపి, చక్రవర్తిని చేసి అడగకుండానే ద్వారక పాలకుడవు అయ్యావు. అది నీ ఔదార్యం. దానిని అందరూ తెలుసుకోవాలి. నీ దయతో నాకు దక్కిన సంపదల లాంటివే అందరికీ దక్కాలి. అందుకు కార్తీకమాసం ఆరంభం నుంచి (దీపావళి మరునాటి నుంచి) ప్రతి ఇంటా దీపకాంతులు వెద జల్లాలి. అలా చేసిన వారందరికి సంపదలు అనుగ్రహించు. శుక్ల పాడ్యమి నుంచి పున్నమి దాకా ఇళ్లలో, బహుళ పాడ్యమి నుంచి ఆమావాస్య వరకు దీపారాధన (ఇదే దేవ దీపావళి) కొనసాగేలా అనుగ్రహించు’ అని బలి చక్రవర్తి వేడుకున్నాడట. ఆలయాల్లో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఈ మాస మంతా దీపాలు వెలిగించినా కార్తీక పూర్ణిమనాడు తప్పనిసరిగా దీపాలు పెట్టడం మన సంప్రదాయం. ఆ రోజున మన ఊరిలో దీపారాధన చేసినా కాశీలో చేసినంత పుణ్యమని విశ్వాసం. ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా జన్మజన్మల పాపాలు నశిస్తాయని అంటారు.

కార్తీక పూర్ణిమ

కార్తీక పౌర్ణమికి అనేక విశిష్టతలు ఉన్నాయి. దీనినే దేవదీపావళిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు మత్స్యావతారం దాల్చింది, బృందాదేవి తులసి మొక్కగా అవత•రించిందీ, కార్తీకేయ జన్మదినం ఆ రోజే. పరమశివుడు త్రిపురాసురులను ఆ రోజే సంహరించాడు. అందుకే దీనిని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. త్రిపురాసురుల సంహార ఘట్టాన్ని స్మరించుకుంటూ ఆనాడు శివాలయాలలో జ్వలాతోరణోత్సవాన్ని నిర్వహిస్తారు. శివునికి దృష్టిదోషం నివారణతో పాటు ఆయన విజయానికి గౌరవ సూచకంగా పార్వతీదేవి తొలుత ఈ ఉత్సవాన్ని నిర్వహించినట్లు ఐతిహ్యం. ఇలా ఈ మాసం మొత్తానికి పౌర్ణమి తిథిని తలమానికంగా చెబుతారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాన్ని ఎప్పుడనుకుంటే అప్పుడు చేసుకోవచ్చని, అయితే కార్తీక పూర్ణిమ నాడు జరుపుకోవడంలో మరింత ప్రత్యేకత ఉందని చెబుతారు. పూర్ణచంద్రుడు వెలిగేవేళ హరిహరులకు నిర్వహించే అభిషేకాలు మంచి ఫలితాలు ఇస్తాయని విశ్వాసం. కార్తీక పున్నమి విశిష్టతను వివరిస్తూ లెక్కకుమించిన రచనలు ఉన్నాయి.

సోమవారం ప్రత్యేకత

కార్తీకమాసంలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. ఆ రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైనదే కాక, ఆ వారానికి చంద్రుడు అధిపతి. చంద్రుడు శివుడి సిగలో వెలుగుతుంటాడు. కనుక ఆరోజు ఉపవాసం విశేష ఫలితాన్నిస్తుందంటారు. అందుకే భక్తులు ఈ మాసంలో శివుడిని మరింత భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు. ఈ నెలలో ప్రతిరోజు పుణ్యప్రదమే కనుక పగలంతా ఉపవాసం ఉండి శివారాధన చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం. అలా చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు, పౌర్ణమి నాడైనా ఉపవాసం చేసి సద్బ్రాహ్మణుడికి భోజన, తాంబూలాలు సమర్పించినా సరిపోతుందంటారు. పగలంతా ఏమీ తినకుండా సూర్యాస్తమయం తరువాత దీపారాధన చేసి భుజిస్తారు. దీనిని నక్తం,నక్తదీక్ష అని అంటారు. ఉపవాస దీక్షతో శివుడిని అర్చిస్తే జ్ఞానం వృద్ధి చెందుతుందని, ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం సంప్రాప్తిస్తాయని విశ్వాసం. వైద్య పరిభాషలో లంఖణం పరమౌషధం అని అంటారు. ఉపవాసం జీర్ణకోశాలు, శ్వాసకోశాలను పరిశుద్ధం చేస్తుందని, ఇంద్రియాలను నిగ్రహింప చేస్తుందని, మనస్సును ప్రశాంతంగా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఉపవాసం అంటే ‘పస్తు అని అర్థవిపరిమాణం చెందింది కానీ అసలు భావం అదికాదు.‘ఉపవాసం’ అంటే సమీపంలో ఉండడం అని అర్థం.అంటే….నిశ్చల మనసుతో భగవత్‌ ‌ధ్యానం చేయడం, ఆరాధించడం అని అని చెబుతారు.

కార్తీక దానాలు

ఈ మాసంలో చేసే దానాలు సంచిత పాపాలను దహించి, సమస్త శుభాలకు కారణమవుతాయని, అనంత పుణ్యఫలాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ దానాలో ప్రధానమైనది ‘దీపదానం’. ఈ దానంలో వాడే ద్రవ్యాలను బట్టి ఫలితాలు ఉంటాయట. ఉపవాస నియమంతో ఈ దానం చేసేవారు విష్ణుసాయుజ్యం పొందుతారని, వారివారి పితృదేవతలు సంతుష్టులవుతారని కార్తీక పురాణం చెబుతోంది. అన్న, విద్యా, వస్త్ర, సాలగ్రామ దానాలు చేయాలి. కన్యాదానం వీటికి మించినది అంటారు. యోగ్యుడైన వ్యక్తి కన్యాదానం ద్వారా కన్యాదాత తరించడమే కాక తమ వంశ పితరులనూ తరింపచేసినట్లవుతుందని చెబుతారు.

వనభోజనాలు

ఈ నెలలో మరో ముఖ్యాంశం వనభోజనాలు. పంచుకుతినడంలోని పరమార్థాన్ని వనసమారాధన చెబుతోంది. ఇది సామాజిక హోదాలకు అతీతమైనది. పదార్థాల రుచి కంటే వాటిని ఆనందంగా కలిసి ఆరగించడమే ప్రధానం. ఇలాంటి సందర్భాలలో అంబలి కూడా అమృత తుల్యమనే అంటారు. వనభోజనాల సంప్రదాయానికి బాలకృష్ణుడినే మూలంగా చెప్పుకోవచ్చు. దానినే ‘గోవిందుడి విందు’ అంటారు. ఆయన గోపబాలురతో కలసి చల్దులు ఆరగించడం సామూహిక వనభోజనం లాంటిదే అనిపిస్తుంది. ఆయన మధ్యలో, మిత్రులు వలయా కారంలో కూర్చుని ‘కొసరి చల్దులు మ్రెక్క గొల్లపిల్లల వ్రేళ్లసందుల మాగాయ పచ్చడి పసందుల్ని’ అని కలసి పంచుకుని తినడంలోని బాలానందాన్ని అద్భుతంగా వర్ణించారు పోతనామాత్యుడు. రక్తితో పాటే భక్తి అన్నట్లు ఈ వేడుకలో కాస్త ఆధ్యాత్మికతను కూడా జోడించారు. అ కోణంలోనే వనభోజనాలను ఉసిరిక చెట్టు కింద నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది. ఉసిరి చెట్టుకు ధాత్రి నారాయణ అని పేరు. ఈ మాసంలో మునులు, తీర్థాలు ధాత్రీ (ఉసిరి) చెట్టును ఆశ్రయించి ఉంటాయట. అందువల్ల ఈ చెట్టు ఆరాధన హరిహరులకు ముఖ్యంగా హరికి ప్రీతిని కలిగిస్తుందట. ఈ చెట్టు కింద రుద్రాభిషేకం, శ్రీసూక్తం, లలిత సహస్రనామ, విష్ణు సహస్రనామ స్తోత్రాలను జపించాలి. ధాత్రీదేవిగా అభివర్ణించే ఉసిరిచెట్టు నీడలో భోజనం ప్రకృతి ఆరాధన, వన సంరక్షణ పట్ల బాధ్యతను గుర్తు చేస్తుంది. వనభోజన సంప్రదాయంలో ఆధ్మాత్మిక అంశాలతో పాటు సామాజిక ఐక్యత, సహజీవనం, ఏకత్వం లాంటి లౌకిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి.

కానీ కాలంతో పాటు వనభోజనాల స్వరూప స్వభావాలు కూడా మారాయి. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమైక్యత, సమభావం తదితర లక్ష్యాలతో నిర్దేశించిన వనభోజనాలు సరదగా, ఆటవిడుపుగా తయారయ్యాయి.  సామాజికవర్గాల వారీగా నిర్వహించే వనభోజన కార్యక్రమం ఓ ఆటవిడుపు, వేడుకలా ఉంటుందే కానీ దాని లక్ష్యం నెరవేరదు. కార్తీకం కేవలం దీపారాధన, వేడుకల మాసమే కాదు. మనిషికి శారీరకంగా పుష్టినిచ్చేది. ఉదయపు వేళల్లో చన్నీటిస్నానాలు, దీక్షలు, ఆలయ సందర్శనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆహార నియమాలు మానవుడిని మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్య వంతులను చేస్తుందని అనుభవజ్ఞులు, విజ్ఞులు చెబుతారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE