గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికల వేళ.. టీఆర్‌ఎస్ – బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రణరంగం నెలకొంది. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ సాగింది. దుబ్బాకలో ఓటమితో విలవిల్లాడిన టీఆర్‌ఎస్.. ఆ వెంటనే ముంచుకొచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం సర్వశక్తులూ ప్రయోగించింది. ఆ ఓటమి ప్రభావాన్ని కనిపించనీయకుండా జాగ్రత్తపడేందుకు ప్రయత్నించింది. రాష్ట్రవ్యాప్తంగా తమ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లను రంగంలోకి దింపింది. డివిజన్‌ల వారీగా పలువురికి బాధ్యతలు అప్పగించి.. నామినేషన్ల పర్వం మొదలైనప్పటినుంచే ప్రచారం సాగించింది.
ఇక, దుబ్బాక ఉపఎన్నికలో గెలుపుతో హుషారుగా ఉన్న బీజేపీ.. అదే జోరుతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారం సాగించింది. స్థానిక, రాష్ట్రస్థాయి నేతలకు తోడు జాతీయస్థాయి నాయకులు కూడా ప్రచారపర్వంలో భాగస్వాము లయ్యారు. కేంద్ర మంత్రులు కూడా వార్డుల్లో ప్రచారం చేయడంతో పాటు.. రోడ్‌షోలలో పాల్గొన్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కుటుంబపాలనగా మారిందన్న వాదనతో పాటు.. దుబ్బాక ఫలితంతో రాష్ట్రవ్యాప్తంగా ట్రెండ్ మారిందని, టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందని బీజేపీ ప్రచారం చేసింది.
అంతేకాదు, ఎంఐఎం మీద కూడా బీజేపీ విమర్శలు చేసింది. టీఆర్‌ఎస్ అంటేనే మజ్లిస్ పార్టీ.. ఎంఐఎం అంటేనే టీఆర్‌ఎస్ అంటూ కొత్త నినాదం ఎత్తుకుంది. టీఆర్‌ఎస్ హిందువులను విస్మరిస్తోందని, కేవలం ముస్లింల కోసమే పనిచేస్తుందన్న అంశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లింది. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఎంఐఎం అని బహిరంగంగా ప్రకటించింది. పాతబస్తీలో గంపగుత్తగా ముస్లిం నేతలకే ఓట్లు వేస్తూ గెలిపిస్తున్నారని, అలాంటిది హిందువులం మాత్రం మనవాళ్లకు ఓట్లు వేయకుండా మన ఓట్లు మనమే చీల్చుకుంటున్నామని, ఇప్పటినుంచి ఆ పోకడలకు చెక్ పెట్టాలని ఓటర్లకు బీజేపీ పదే పదే విజ్ఞప్తి చేసింది. హిందువులందరూ బీజేపీకే ఓటు వేయాలని కోరింది. భాగ్యనగరంలో ముస్లింల పెత్తనానికి అడ్డుకట్ట వేయాలని కోరింది.
హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం ఎక్కడో, బిహార్‌లో ఐదు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుందని, అసలు అక్కడ ఎంఐఎం పార్టీ అంటేనే ఎవరికీ తెలియదని, కేవలం ముస్లింలు అన్న ఒకే ఒక్క కారణంతో ఎంఐఎం అభ్యర్థులను అక్కడ ఓటర్లు గెలిపించారని బీజేపీ గుర్తుచేసింది. అలాంటిది మెజార్టీ అయిన హిందువులం మన హిందూ పార్టీకే ఓట్లు వేసుకోవడానికి సంకోచించడం ఎందుకని ఆలోచన లేవనెత్తింది. ఇకపై ఆ పద్ధతి మార్చేద్దామని, హిందువుల ఓట్లన్నీ బీజేపీకే వేస్తే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం హిందువుల వశం అవుతుందని గుర్తు చేసింది. టీఆర్‌ఎస్ గెలిచినా హైదరాబాద్‌లో ముస్లిం పెత్తనమే కొనసాగుతుందన్న విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రతి ఓటరూ దృష్టిలో పెట్టుకోవా లని కోరింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంను మట్టి కరిపించాలని ప్రజలకు సూచించింది.
ఇక బీజేపీ విమర్శలను తిప్పి కొట్టే వ్యూహమో ఏమో గానీ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధికార టీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేస్తామని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల టీఆర్‌ఎస్ పెద్దగా స్పందించలేదు. దీనిని బట్టి చూస్తే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందంలో భాగమే ఈ విమర్శలని అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు ఈ ఎన్నికల వేళ కొన్ని ప్రచారాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వరదసాయాన్ని ఆపేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని ఓ లేఖ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. కానీ తర్వాత అది అబద్ధమని తేలిపోయింది. అలాగే, బీజేపీ నుంచి గోషామహల్ శాసనసభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, గంటల్లోనే రాజాసింగ్ స్పందించడం, జర్నలిస్టులకు అది తప్పుడు వార్త అని వెల్లడించడంతో ఆ ప్రచారానికి అడ్డుకట్ట పడింది.
సోషల్ మీడియాలో లేఖ దుమారం
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌లో అంచనాకు అందని రీతిలో నష్టం వాటిల్లింది. దీంతో, ప్రభుత్వం వరద బాధితులకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇది ఎన్నికల తాయిలంగా ఉపయోగపడుతుందన్నది బహిరంగ రహస్యమే. అదే సమయంలో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. తొలుత ఈ వరద సాయం పంపిణీ కొనసాగించు కోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ, ఆ తర్వాత ఎన్నికలు పూర్తయ్యే దాకా వరదసాయం ఆపాలని ఆదేశాలు జారీచేసింది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరద సాయం ఆపాలంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారని, అందుకే ఎలక్షన్ కమిషన్ వరదసాయం పంపిణీని నిలిపివేసిందని ఆరోపణలు గుప్పిస్తున్న పోస్టులు వైరల్ అయ్యాయి. బండి సంజయ్ పేరుతో ఉన్న ఒక లేఖ కూడా వైరలైంది. వెంటనే తేరుకున్న బీజేపీ దానిని పూర్తిగా ఖండించింది. లేఖ పరిశీలనలోనే పలు లోపాలు బయటపడ్డాయి. అవి..
- జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇది పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో జరిగే పక్రియ. కానీ, బండి సంజయ్ పేరుతో ఉన్న ఆ లేఖ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు రాసినట్లుగా ఉంది. అంటే, అవగాహన లేకుండా రూపొందించిన ఫేక్ లెటర్‌గా అర్థమవుతోంది.
- ఏ లేఖలో అయినా తేదీ రాయడం పరిపాటి. అధికారిక లేఖలకు తప్పనిసరి. ఈ లేఖలో ఏ రోజు రాశారో ప్రస్తావన లేదు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన లెటర్‌హెడ్‌లో ఆ ప్రస్తావన కూడా ఉండాలి. కానీ, ఈ అబద్ధపు లేఖలో ఆ ప్రస్తావన లేదు.
ఈ మూడు అంశాలు పరిశీలనలోనే బయట పడ్డాయి. దీనికి తోడు మరో కీలక అంశంపై అందరికీ అవగాహన ఉండాలి. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటర్లను ప్రభావితం చేసే అభివృద్ధి కార్యక్రమాలు గానీ, పనులు గానీ, పథకాలు గానీ అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతించదు. అందులో భాగంగానే సహజంగానే ఎన్నికల సంఘం వరదసాయం పంపిణీని నిలిపివేసింది. దానికి ప్రత్యేకంగా ఎవరో ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు.
మరోవైపు బండి సంజయ్ ఆ లేఖ తాను రాయలేదని వివరణ ఇచ్చారు. అంతేకాదు, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ లేఖ తాను రాసింది కాదని.. తనకు, తన పార్టీకి చెడ్డపేరు తెచ్చేందుకు ఎవరో అబద్ధపు లేఖను సృష్టించారని, అందులో ఉన్న సంతకం కూడా తనది కాదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ లేఖను సృష్టించిన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఫిర్యాదు ప్రతిని తెలంగాణ డీజీపీకి, కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా పంపించారు.
అలాగే, బీజేపీ తెలంగాణ కమిటీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు కుట్రపూరితంగా ఇలాంటి లేఖను సృష్టించారంటూ ఆరోపించింది. అంతేకాదు, ఆ లేఖ తాను రాయలేదంటూ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం ముందు ప్రమాణం చేస్తానని.. కేసీఆర్ కూడా దమ్ముంటే అక్కడికి రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. నవంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నిజానిజాలు ప్రజల ముందు తేల్చుకుందామని సంజయ్ పిలుపునిచ్చారు.
బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీగా భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తానని ఆయన ప్రకటించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ, ఉద్రిక్తతలు తలెత్తుతాయనే కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అసలే ఎన్నికల సమయం, ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురైతే ఘర్షణలు జరగొచ్చని వారించారు. కానీ, బండి సంజయ్ మాత్రం అనుకున్న సమయానికి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు.. కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి సీఎం కేసీఆర్ కోసం ఎదురుచూశారు. ముఖ్యమంత్రి రాలేకపోతే తనకు ఫోన్ చేసినా ఫర్వాలేదన్నారు సంజయ్. కానీ కేసీఆర్ గానీ, అధికార పార్టీ గానీ దీనికి స్పందించలేదు. అధికార పార్టీ తన సవాల్‌ను స్వీకరించక పోవడంతోనే.. ఆ అబద్ధపు లేఖను టీఆర్‌ఎస్ నాయకులే సృష్టించారన్న విషయం అర్థమవుతోందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎత్తుగడలో భాగమే ఆ అబద్ధపు లేఖ అని, ఓటర్లను గందరగోళంలో పడేసేందుకే దానిని సోషల్ మీడియాలో వైరల్ చేశారని బీజేపీ ఆరోపించింది.
సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్