సంపాదకీయం
శాలివాహన 1941 శ్రీ శార్వరి కార్తీక పూర్ణిమ – 30 నవంబర్ 2020, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
వరదలూ, వానలాగే జీహెచ్‌యంసీ ఎన్నికలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఇరకాటంలో పెట్టాయనిపిస్తున్నది. రాష్ట్రంలో, రద్దు కాబోతున్న జీహెచ్‌యంసీలోను అధికారం తెరాసదే అయినా ఆ పార్టీ అడుగులలో భయం, మాటలలో తడబాటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని విశ్లేషకుల అంచనా. అసెబ్లీ ఎన్నికలను ముందుకు జరిపి సునాయాసంగా గెలుచుకున్న అనుభవం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులో ధీమా పెచింది. జీహెచ్‌యంసీ ఎన్నికలను కూడా ముందుకు (దాదాపు రెండు మాసాలు) జరిపి మేయరు పీఠాన్ని అవలీలగా దక్కించుకోవచ్చని ఆయన భావించి ఉండవచ్చు. కానీ మహానగర్ ఎన్నికలకు తెరాస శ్రేణులను సమాయత్తం చేయాల్సిన సభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆయనలో ధీమా సన్నగిల్లి, కలవరం మొదలైన సంగతిని సూచిస్తోందని కూడా పరిశీలకుల భావన. ఇందుకు కారణం దుబ్బాకలో, బిహార్‌లో బీజేపీ సాధించిన ఫలితాలే.
మహానగర్ ఎన్నికలకు తెరాస శ్రేణులను సమాయత్తం చేయాల్సిన సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయి పోరాటాన్ని ప్రారంభిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇలాంటి ప్రకటన ఆయన నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి కాదు. అసందర్భమైన ఈ ప్రకటన ఆయనలోని కలవరాన్నే సంకేతిస్తున్నది. ప్రచారానికి తాను వెళ్లకుడానే దుబ్బాకను గెలుచుకోగలమనే ధీమా నెలరోజుల క్రితం ఆయనలో వ్యక్తమైంది. జాతీయ పౌరచట్ట సవరణ, యన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా కుహనా లౌకికవాదులు, మతవాదులు కలసి నిర్వహించిన ఆదోళనల నేపథ్యలో మోదీ గ్రాఫ్ పడిపోతోదనీ, బీజేపీ బలహీనపడుతోందని కేసీఆర్ అంచనా వేశారు. బిహార్ ఎన్నికల సభలకు వెళ్లి వచ్చిన తన మిత్రుడు ఒవైసీ వ్యాఖ్యలు కేసీఆర్ అంచనాకు దగ్గరగా ఉండి, దానికి బలం చేకూర్చాయి. కాగ్రెస్ తదితర విపక్షాలు, మీడియా బిహార్‌లో బీజేపీ ఓటమి తప్పదని కోడై కూశాయి. ఈ తరుణంలో మజ్లిస్‌తో కలిసి మహానగర్ ఎన్నికలను గెలుచుకోవడం మంచినీళ్లప్రాయమని కేసీఆర్ తలపోశారు. జరిగింది వేరు. మజ్లిస్ బలపడి ఉండవచ్చు. దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ బీజేపీ దేశంలో బలపడిన సంగతి వెల్లడైంది.
తెలంగాణలో మూడో వంతు జనాభా కలిగిన భాగ్యనగరాన్ని గెల్చుకుంటే ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నల్లేరుపై బండి నడకే అని కేసీఆర్ ఊహ. తాజా పరిణామాలు ఆయన ఊహలకు రెక్కలు కత్తిరించాయి. నిధులు, నీళ్లు, నియామకాలు, అంటూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పోరాట ఫలితం కేసీఆర్ కుటుబానికే దక్కిందన్న ఆక్రోశం, అసంతృప్తి ప్రస్తుతం తెలంగాణ గడ్డ మీద కనిపిస్తున్నమాట వాస్తవం. అది దుబ్బాకలో బయటపడగా, మిగిలిన చోట్ల చాపక్రింద నీరులా ఉంది. తమ స్థానమైన దుబ్బాకలో పోటీ కాంగ్రెస్, తెరాసల మధ్యేనని, గతంలో మూడోస్థానంలో ఉన్న బీజేపీ లెక్కలోకే రాదన్న అంచనా తలకిందులైంది. కాగ్రెస్ మూడో స్థానానికి పడి పోగా తెరాసను ఓడించి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించారు. అన్ని సర్వేలను తలకిందులు చేస్తూ బిహార్‌లో బీజేపీ రెండో (ఒక్కస్థానం తేడాతో) పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్‌డీఏ కూటమి మళ్లీ అధికారాన్ని చేపట్టింది. గుజరాత్, యూపీ, ఎంపీ, కర్ణాటక ఉప ఎన్నికలు అన్నింటా బీజేపీ హవా వీచింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మోదీ కీర్తి కాస్త కూడా మసకబారలేదు. రాజకీయాలలో ఆరితేరిన వారు తమ నమ్మకానికి ఇచ్చే విలువ వాస్తవాలకూ ఇవ్వవలసి ఉంటుంది.
వరద ముంపును అవకాశంగా మలచుకుని ప్రజలకు తాయిలాలు పంచి ఎన్నికలలో గట్టెక్కాలని చూసిన కేసీఆర్‌కు స్వజనుల అవినీతే అవరోధంగా మారుతోంది. గడచిన ఆరేళ్లలో తెరాస అవినీతి పాలనను ఎండగట్టడానికి, ఎన్నికల వాగ్దానభంగాలను ఏకరుపు పెట్టడానికి విపక్షాలు సిద్ధపడుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ వైఫల్యం, గ్రాఫిక్ ప్రకటనలు, ప్రచారానికి పరిమితమైన విశ్వనగరం వంటివి విపక్షాల అస్త్రాల్లో ముఖ్యమైనవిగా మారాయి. గుంతలు, గతుకులతో డొంకలను తలపిస్తున్న ప్రమాదకర భాగ్యనగర్ రహదారులు కారు ప్రయాణానికి కూడా బ్రేకులు వేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ విమర్శలు తెరాసను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికార పక్షంగా గడచిన ఆరేండ్లలో సాధించిన అభివృద్ధిని, ప్రజలకు కల్పించిన సదుపాయాలను వివరించి ఓటిమ్మని అడగాల్సిన తెరాస బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం దాని ఫలితమే. పెట్టుబడులను ఆకర్షిచే ప్రశాత నగరం కావాలా, అట్టుడికిపోయే నగరం కావాలా తేల్చుకోండి అని బీజేపీ బూచిని చూపుతూ ఓటర్లను బెదిరిస్తోంది.
తమకు ఓటు వెయ్యకపోతే నగరంలో ప్రశాంతత ఉండదని తెరాస అంత కచ్చితంగా తేల్చి చెప్పడం వింతే! తెరాసకు వేసే ఓటు మజ్లిస్‌కు వేసినట్లే అని బీజేపీ చేస్తున్న వాదన ఈ హెచ్చరికతో బలబడిపోవట్లేదూ! సరే, ఎన్నికల ప్రచారంలో తెరాస తిట్ల దండకం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. వరదసాయం నిలిపివేయాలంటూ బండి సంజయ్ లేఖ రాశారంటూ తెరాస ప్రచారానికి దిగడం కూడా ఓటమి భయంతోనేనా అనిపిస్తున్నది. మజ్లిస్ తమ సహజ మిత్రపక్షమని పలుమార్లు చెప్పిన తెరాస ఇప్పుడు అమాంతం ముఖాలు చూసుకోబోమని చెప్పడం అంతర్నాటకమే తప్ప ఇంకేమీ కాదు. దుబ్బాక ఫలితం విడుదలైనాక గెలుపునకు పొంగిపోం, ఓటమికి కుంగిపోం అని కె. తారక రామారావు హుందాగా ప్రకటించారు. ఆ హుందాతనం ఎప్పుడూ అవసరమే మరి.