భారతీయ నాగరికతా పరిణామంలో వృత్తి కులాల పాత్ర గణనీమైనది. స్వాతంత్య్రానికి పూర్వం గ్రామీణ ప్రాంతాలలో ప్రతి వారు ఏదో ఒక వృత్తిని చేపట్టి దేశాన్ని సుసంపన్నం చేయడంలో భాగస్వాములయ్యారు. కానీ 800 సంవత్సరాల విదేశీ పాలనలో, అంతకు ముందు వారి దురాక్రమణలలో అపార సంపదను దోచుకున్నారు. అయినా స్వతంత్రం సిద్ధించిన తరువాత దాదాపు రెండు దశాబ్దాల వరకు కులవృత్తుల వైభవం కనిపిస్తుంది. అటు పెట్టుబడిదారీ విధానం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా కులవృత్తులు కుదేలై గ్రామ ఆర్థిక పరిపుష్టికీ, సామరస్యానికీ కూడా విఘాతం కలిగింది. గ్రామ రాజ్యమే రామరాజ్యమన్న నినాదాన్ని నిజం చేసినప్పుడే భారతదేశం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుంది.
భారత సమాజంలో చేతివృత్తులవారికి చేతినిండా పని ఉండేది. కరెన్సీ (రూపాయి) విలువ కూడా అధికమే. వేరే వృత్తిపైన, భూమిపైన, అధికారంపైన ఆశపడకుండా, వచ్చినదానితో జీవిస్తూ, మిగిలిన వర్గాల వారితో కలసిమెలసి ఉండేవారు. కుమ్మరి / కమ్మరి / పద్మశాలి / వడ్డెర /చాకలి/ మంగలి / మాదిగ / వడ్రంగి వంటి కులాలవారిదే నాడు కీలక పాత్ర. ఒక కులం చేసిన ఉత్పత్తి మిగతా వారికీ ఉపయోగపడేది. ఉదా।। పద్మశాలి. వారు ఉత్పత్తి చేసే బట్టలు అందరికీ అవసరమే. ఇంటికప్పుకు కావలసిన పెంకులు, మట్టిపాత్రలు, ధాన్యాల నిలవకు గాదులు వంటివన్నీ కుంభాకారులు ఇచ్చేవారు. సాగుకు అవసరమైన కర్రు, నాగళ్లు, ఎడ్లబండ్లు ఇతర పనిముట్లతో పాటు, ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రి కుమ్మరి, వడ్రంగి చేసేవారు. బంగారం పని కంసాలిది. వడ్డెరవారు వ్యవసాయదారులకు బావులు, చెరువులు నిర్మించి, ఊరి మొత్తానికి నీటిపారుదల వ్యవస్థను నిర్మించేవారు. మాదిగలు చెప్పులు, డప్పులు అందించేవారు. కొన్ని సంచార జాతులు రామాయణ/ మహాభారత గాథలను జానపద కళల (యక్ష గానం, చిందు భాగోతం, తోలు బొమ్మలు, శారద కథల పఠం కథలు) ద్వారా ప్రజలకు వినోదంతో పాటు, భారతీయ విలువలను, మానవతా విలువలను ప్రచారం చేసేవారు.ఇలా పరస్పరం ఆధారపడి ఉన్నందున సామరస్యంతో జీవించేవారు. కులమేదైనా అక్కా, అన్నా, బావ, చెల్లి వంటి వరుసలతో పిలుచుకునేవారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకుంటూ ఆ వృత్తి సంబంధమైన సేవలను అందించుకోవడం వల్ల కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది.పితృదేవతల, కులదేవతల పేరిట సమైక్యంగా ఉండేవారు. ఇక్కడా ఆదానప్రదానాలు ఉండేవి. అన్ని కులాలు కలసి గ్రామ దేవతల పండుగలు, క్రీడలు, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపేవారు. ఊరికి ఆపదలు, అంటే చెరువు, కుంటలు తెగితే కలసి పరిష్కరించుకునేవారు. ఇదే బాంధవ్యం ఇరుగుపొరుగు గ్రామాలతోనూ ఉండేది. తామంతా ఒకే సమాజంలో భాగమని ఏకాత్మతను ప్రదర్శిస్తూ జీవించేవారు.
అయినా, సమాజ విఘటనకు యత్నించిన శక్తులు నాడూ ఉన్నాయి. దేశంలో బ్రిటిష్‌పాలిత ప్రాంతాలలో అయినా, నైజాంలాంటి నియంతల సంస్థానాలలో అయినా భూస్వామ్య విధానంలో ఆధిపత్యం కోసం క్రింది సమాజంలో వైషమ్యాలు సృష్టించేవారు. అయినా ఈ పన్నాగాలు ప్రజల సామరస్యాన్ని పెద్దగా భగ్నం చేయలేదని చరిత్ర చెబుతోంది. ఆ పన్నాగాలు నెరవేరి ఉంటే కులవృత్తులవారి మధ్య సౌభాత్రం కనుమరుగై ఉండేది. కానీ, ఆ విషబీజాల ప్రభావం నేడు ప్రబలంగానే కనిపిస్తున్నది. ఆనాటి భూస్వామిక వ్యవస్థలో భూములన్నీ జమీందారుల, జాగీరుదారుల చేతులలో ఉన్నా, సాధారణ ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నేటి సమాజంలో మాదిరిగా లేవు.
స్వాతంత్య్రం వచ్చిన వెంటనే కులవృత్తుల ఆధునీకరణ, వాటికి ప్రోత్సాహం, వృత్తి ఆధారిత కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పకపోవడమే కాక, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించారు. తర్వాత పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా మార్చి కులవృత్తులను బజారున పడేసారు. పెట్టుబడిదారులు, భూస్వామ్య కులాల నుండి వచ్చినవారు పాలకులై ఆర్థిక వ్యవస్థను వారి స్వంత ఎజెండాగా మార్చుకున్నారు. కులవృత్తులను నిస్సారం చేసారు. పూర్వం నుండి వృత్తి కులాలవారికి రాజకీయాధికారంలో ప్రాతినిధ్యం లేదు. వీరి వాణి వినిపించలేదు. భారతదేశంలో 80% కులవృత్తుల వారు రాజకీయంగా స్వతంత్రహీనులై జీవిస్తుండగా, 20శాతం వారి చేతిలో 90శాతం సంపద సమకూడింది. పద్మశాలీలు కులవృత్తిని కోల్పోయి బొంబాయి, భీవాండీ, సూరత్‌లాంటి నగరాలకు వలసపోయారు. ఈ వలస నేటికీ సాగుతున్నది. స్వర్ణకారుల పని ఖాన్ జవెల్లర్స్, జాన్ జవెల్లర్స్ చేతుల్లోకి పోయింది. క్షురకుల పని సౌందర్య పోషణ పేరిట ఒక విష కౌగిలిలో చిక్కుకుంది. వడ్డెర వృత్తి గనుల శాఖ, పెట్టుబడిదారుల చేతిలోకి వెళ్లింది. ధనికులు ప్రొక్లేన్లు తెచ్చి వడ్డెర కులం చేతులు విరగ్గొట్టి అర్ధ కూలీలుగా మార్చినారు. ఈ పరిణామం వలన ప్రజలలో ఆర్థిక అసమానతలు, రాగద్వేషాలు ప్రజ్వరిల్లి సమాజ విఘటనకు తోడ్పడే ప్రమాదం పెరిగింది. కాబట్టి రాజరిక రాజకీయ పార్టీల పాలనను నిరోధించి, ప్రజాస్వామ్యాన్ని ఆచరించే పార్టీలు అధికారంలోకి వచ్చి కులవృత్తులవారికి ఆర్థిక పరిపుష్టిని కల్పించాలి. వారిని ఆర్థికవ్యవస్థలో భాగస్వాములను చేయాలి. దీనికోసం వారి జనగణన చేపట్టాలి.
ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా కలలను నిజం చేయడానికీ, దీనదయాళ్‌జీ, శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి వారి కలలైన కుటీర పరిశ్రమల చేతివృత్తుల, చిన్నతరహా పరిశ్రమల స్వావలంబన భారత సమాజానికి నేటి అవసరం. వస్త్ర పరిశ్రమ లాభాలలో పద్మశాలీ సంఘాలకు శ్రామికుల వాటా ఇవ్వాలి. ఈ సంఘాలకు సబ్సిడీ,రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహించాలి. వృత్తిని కోల్పోతున్న వడ్డెర కులస్థులకు జెసీబీ, ప్రొక్లేన్ల యంత్రాలు సమకూర్చుకో వడానికి రుణాలు ఇవ్వాలి. సివిల్ కాంట్రాక్ట్ పనులలో వీరికి రిజర్వేషన్ కల్పిస్తూ పనులు అప్పచెప్పాలి. బండలు, కొండలు వీరికి లీజ్‌కు ఇవ్వాలి. ప్రతి వృత్తి కులంవారికి వారి వారి వృత్తుల ఆధునీకరణలో తోడ్పడుతూ, ఆధునిక పరిజ్ఞానం అందిస్తూ, వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి సహకారం ఇవ్వాలి. వృత్తి కులాల సమగ్రాభివృద్ధే నిజమైన మానవ వనరుల వినియోగమన్న వాస్తవిక నినాదంతో ముందడుగు వేయాలి. నేటి వైజ్ఞానిక సమాజంలో మానవ వనరుల వినియోగమే దేశాలకు సంపద. దేశమంటే మట్టి మాత్రమే కాదు, మానవ వనరుల అభివృద్ధి కూడా.
బిద్రీ
ఈ కళ బహమనీల కాలం నాటిది. నలుపు, తెలుపు రంగు లలో మెరుస్తూ ఎంతో ఆకర్షణీ యంగా ఉండే ఆకృతులతో పళ్లేలు, పెట్టెలు, కత్తులు, డాళ, గాజులు వంటి అలంకార వస్తువులు వీరు తయారు చేస్తారు. రాగి, తుత్తునాగం కలిపిన మిశ్రమంతో ఏర్పడే లోహంతోనే ఇవి తయారవుతాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు ఈ కళకు ప్రసిద్ధి.
ఫిలిగ్రీ
వెండి నగిషీ కళనే ఫిలిగ్రీ అని పిలుస్తారు. కరీంనగర్ ఈ కళకు ఖ్యాతి చెందింది. ఇక్కడ సన్నని వెండిదారాలతో సున్నితమైన, వస్తువులు రూపొందిస్తారు. గంధపు గిన్నెలు, పళ్లేలు, పెట్టెలు, చెవిపోగులు, గొలుసులు, ట్రేలు, అగరొత్తుల స్టాండు వంటివే కాకుండా, పక్షులు, జంతువుల బొమ్మలు కూడా ఇక్కడ తయారు చేస్తారు. ఈ కళాకారుల సృజన అనన్య సామాన్యమైనది.
తివాచీలు
మొగలుల కాలంలోనే తెలుగు ప్రాంతాలలో తివాచీల నేత పని మొదలయింది. ఏలూరు, వరంగల్ పట్టణాలు ఇందుకు పేర్గాంచాయి. వీటిని దక్కను రగ్గులు అని కూడా అంటారు. నూలు, జనుముతోనే కాకుండా, ఉన్నితో కూడా తివాచీలు నేస్తారు. వీటికి విశ్వఖ్యాతి ఉంది. ఎలాంటి ఆకృతి ఇచ్చినా దానిని తివాచీ మీదకు తెచ్చే ప్రతిభ ఈ కళాకారులకు ఉంది.
తోళ్ల పరిశమ్ర
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా తోళ్ల పరిశ్రమ విస్తరణకు విశేష అవకాశాలు ఉన్నట్టు ఏనాడో నిర్ధారించారు. తెలుగు ప్రాంతంలో ఈ పరిశ్రమ ప్రధానంగా పాదరక్షల తయారీలో ఖ్యాతి పొందింది. ఇది 25 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉన్న రంగంగా గుర్తించారు. ఇక్కడి పాదరక్షలు అమెరికా, ఇటలీ, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇంకా సంచులు, వాలెట్లు, బెల్ట్‌లు కూడా తయారు చేస్తారు. భారతదేశం 2.4 బిలియన్ డాలర్ల విలువైన తోలు ఆధారిత ఉత్పత్తులను చేస్తున్నది.ఈ పరిశ్రమకు ఎగుమతులలోను, దిగుమతులలోను కూడా రాయితీలు ఉన్నాయి.
భాగ్యనగర్ గాజులు
లక్కతో గాజును తయారు చేసి, దాని మీద చిన్న చిన్న అద్దం ముక్కలు, పూసలు, రంగురంగు రాళ్లు అతికించి చేసే గాజులకు హైదరాబాద్ ఎంతో ఖ్యాతి. బుట్టబొమ్మలకు(చిత్తూరు జిల్లా) మదనపల్లి, కొయ్యవస్తువులకు (గుంటూరు జిల్లా) తాళ్లపాలెం, రంపపు పొట్టు బొమ్మలకు (నెల్లూరు జిల్లా) వరిగొండ, భువనగిరి, మాధవమాల కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి.
పెంబర్తి కళాఖండాలు
వరంగల్ జిల్లాలోని పెంబర్తి గ్రామం ఈ బొమ్మల కళాకారులకు ప్రసిద్ధి. గోడలకు పెట్టే చిత్రాలు, మొక్కల కుండీలు, విగ్రహాలు, పుస్తకాలు- కలాలు పెట్టుకునే స్టాండ్‌లు, ఇక్కడ తయారవు తాయి. రాగి, ఇత్తడి, వెండి, కంచు లోహాలతో వీరు రమణీయంగా ఆకృతులు తయారుచేస్తారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ ప్రభుత్వ కాలంలో సినిమా వారికి నంది పేరిట ఇచ్చిన జ్ఞాపికలు వీరే తయారు చేసేవారు. కొంచెం తేడాతో శ్రీకాళహస్తి, తిరుపతి, సిద్ధిపేటలలో కూడా ఇలాంటి ఇత్తడి కళారూపాలు చేసే కళాకారులు ఉన్నారు.