‘పంచశీలలో ఊడిపోయిన సీల పేరు చైనా’ అని దేవరకొండ బాలగంగాధర తిలక్ అనే తెలుగు కవి రాశారని ఒక మిత్రుడు చెప్పారు. ఇప్పుడు తిలక్ శత జయంత్యుత్సవాలు మొదలయినాయని కూడా ఆ మిత్రుడే చెప్పారు. తెలుగు కవిత్వంతో నాకు పెద్ద పరిచయం లేదు. అయినా, ఈ నవంబర్ మాసం, ఇదే సమయంలో విన్న ఆ కవితా పాదం నన్ను కొన్ని జ్ఞాపకాల దగ్గరకి మళ్లీ తీసుకువెళ్లాయి. దేవ సరిహద్దులలో పరిస్థితులు కూడా ఇందుకు నేపథ్యాన్ని కూర్చాయి. నిజానికి అవి నా వంటి చాలామంది తెంచుకోవాలనుకుంటున్న జ్ఞాపకాలు.
1962 సంవత్సరం నా జీవితంలో ఒక మైలురాయి. హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల నుంచి పట్టా అందుకున్నది ఆ సంవత్సరమే. అలా నా భావి జీవితానికి ఆ ఏడాదే దిశా నిర్దేశం జరిగింది. భారత్‌కు ఏనాటికీ మరపునకు రాని సంవత్సరం కూడా అదే అయింది. హిందీ-చీనీ భాయి భాయి నినాదం మాటున, పంచశీల ఒప్పందం చాటున చైనా మన దేశాన్ని వెన్నుపోటు పొడిచిన సంవత్సరం అదేనని ప్రత్యేకంగా గుర్తు చేయనక్కరలేదు. పంచశీల ఒప్పందంతో ఆఫ్రో- ఆసియా దేశాల ముందు చైనాను ఘనమైనదిగా నిలబెట్టాలని ప్రథమ ప్రధాని నెహ్రూ శక్తివంచన లేకుండా యత్నించారు. చైనా వెన్నుపోటుతోనే నెహ్రూ కుంగిపోయారనీ, అదే అంతిమంగా ఆయనను మరణం వైపు నడిపిందని చాలామంది నమ్ముతారు.
ఆ యుద్ధం పేరుతో చైనా ఎంతో భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఎందరినో యుద్ధ ఖైదీలుగా బంధించింది. సైన్యంలో పనిచేసిన ఉస్మానియా వైద్య విద్యార్థి కూడా చైనాకు పట్టుబడిన వారిలో ఉన్నారు. ఆ పరిణామాలను ప్రత్యక్షంగా గమనించిన నాటి తరం ఆ చేదు జ్ఞాపకాలను తలుచుకోవడానికి ఇష్టపడదు. కానీ కొన్ని దశాబ్దాల తరువాత మళ్లీ ఆ తరం ఆ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోక తప్పని పరిస్థితిని తన కుట్రలూ కూహకాలతో చైనా కల్పించింది.
చైనా అంటే నాకు ఒకరకమైన యావగింపు ఏర్పడింది. ఆ దేశం వెళ్లకూడదనే అనుకునేవాడిని. అయినా వెళ్లవలసి వచ్చింది. వృత్తిని బట్టి ఇరవైకి పైగా దేశాలలో నేను పర్యటించాను. అందులో చైనా కూడా ఒకటి. చైనా గోడ దాటి లోపలికి వెళ్లడం నా ఎజెండాలో లేదు. అయినా రెండు పర్యాయాలు వెళ్లవలసి వచ్చింది. సరిగ్గా నవంబర్ మాసంలోనే, 2010లో వెళ్లాను. మళ్లీ జూన్, జూలై , 2012లో మరొకసారి పర్యటించాను. ఫ్లోరోసిస్ (న్యూరాలజీ ఆఫ్ ఎండెమిక్ స్కెలిటల్ ఫ్లోరోసిస్ అన్న అంశం) మీద లాంఝువా అనేచోట వైద్యుల అంతర్జాతీయ గోష్టిని ఏర్పాటు చేశారు. దీనికి చైనా ప్రభుత్వమే నన్ను ఆహ్వానించింది. అది నా మొదటియాత్ర. అదెలా జరిగిందంటే- మన దేశంలో ప్రచురించే ‘న్యూరాలజీ ఇండియా’ వైద్య విషయాల పత్రికలో ఇదే అంశం మీద ఒక సమీక్షా వ్యాసం రాయవలసిందిగా 2009లో సంపాదకుడు కోరారు. ఈ వ్యాసం చైనా వాళ్ల దృష్టికి వెళ్లింది. చైనా కూడా ఎముకల వరకు వెళ్లే ఫ్లోరోసిస్ సమస్యను ఎదుర్కొంటున్నది. రెండోసారి, భారత్ -చైనా మూడో వైద్యబృందం సభ్యునిగా వెళ్లాను. ఈ రెండు యాత్రలతో ఆ దేశానికి చెందిన కొన్ని అంశాలు, అక్కడి ప్రజలు, వైద్య పరిస్థితులు అవగాహనకు వచ్చాయి.
తొలి పర్యటనే కొంచెం ఎక్కువ తిరిగే అవకాశం కల్పించింది. చైనాలో నా మొదటి మజిలీ చెంగ్దూ. ఇది సిచుయున్ ప్రోవిన్స్ రాజధాని. ఇంతకీ బెంగళూరు నుంచి నాలుగున్నర గంటల విమానయానంతో చెంగ్దూకు చేరుకోవచ్చు. రంగులద్దిన బొమ్మకి ఏమాత్రం తీసిపోని పాండాల పుట్టిల్లు ఇదే. అప్పుడు అక్కడి జంతు ప్రదర్శనశాలలో ఎనిమిది పాండాలు ఉన్నాయి. అక్కడే ఉంది, చరిత్రాత్మక డాకిసి బౌద్ధారామం. క్రీస్తుశకం ఏడో శతాబ్దం వాడైన హుయాన్‌త్సాంగ్ ఈ ఆరామంలోనే కొద్దికాలం ఉన్నాడు. క్రీ.శ. 631లో ఇతడు భారతదేశం వచ్చాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘకాలం మనదేశంలోనే ఉండిపోయాడు. క్రీ.శ. 642లో కనౌజ్‌లో జరిగిన బౌద్ధ గోష్టిలో కూడా ఆయన పాల్గొన్నాడు. ఎంతో అధ్యయనం చేశాడు. తిరిగి తన దేశం వెళుతూ వెళుతూ 657 సంస్కృత, పాళీ భాషల గ్రంథాలు వెంట తీసుకువెళ్లాడు. వాటి ఆధారంగా చైనీస్‌లో బౌద్ధసూత్రాలు రాశాడు. చైనాలో లభించే బౌద్ధ వాగ్మయంలో నాలుగో వంతు పదమూడు శతాబ్దాల క్రితం భారత్‌ను చూసి వెళ్లిన ఆ యాత్రికుడు రాసినవే కావడం విశేషం.
భారత్, చైనా -రెండు దేశాలు కూడా ఆసియాలోనే ఘనమైనవి. ఇరుగు పొరుగు దేశాలు కూడా. రెండు దేశాలు పురాతన నాగరికతకు ఆవాలాలే. గొప్ప చారిత్రక వారసత్వం కలిగినవే. కనీసం ఐదువేల ఏళ్ల చరిత్ర, సంస్కృతులకు ఆ రెండు దేశాల వారు వారసులు. ప్రస్తుతం చైనా 20 శాతం, భారత్ 17 శాతం జనాభా (ప్రపంచ జనాభాలో) కలిగి ఉన్నాయి. ప్రపంచానికి అనేక రంగాలలో ఈ రెండు దేశాల నుంచి అందిన సేవలు నిరుపమాన మైనవి. పట్టు, కాగితం, తుపాకీ మందు వంటివి చైనా కనుగొన్నది. వేదాలు, పురాణాలు, సున్న భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది. భారతీయ ఖగోళ విజ్ఞానం అద్భుతమైనది. ఎలాగంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నదన్న మహోన్నత సత్యాన్ని అందించిన వాడు మన దేశంలో పుట్టిన ఆర్యభట్టు. లిడియాతో కలసి ఈ రెండు దేశాలే నాణేలను చెలామణిలోకి తెచ్చాయి. బౌద్ధం సిల్క్‌రూట్‌లోనే చైనా వెళ్లి, అక్కడ ప్రధాన మతంగా అవతరించింది. ఇప్పటికీ 130 మిలియన్ బౌద్ధులు అక్కడ ఉన్నారు. వీరిలో వంద మిలియన్‌లు హన్ బౌద్ధం పాటిస్తారు. 17 మిలియన్‌లు టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధులు. మిగిలిన వారు శ్రీలంక కేంద్రంగా ఉన్న హీనయాన బౌద్ధాన్ని అవలంబిస్తున్నారు. హుయాన్‌త్సాంగ్ మాత్రమే కాక, అనంతర కాలాలలో చాలామంది చైనా యాత్రికులు భారత్ వచ్చారు. అలాగే వలస పాలనలో రెండు దేశాలు ఎంతో కోల్పోయాయి. తరువాత భూస్వామిక ఆధిపత్యం నుంచి బయటపడి చాలా సాధించాయి కూడా.
కానీ ఈ పర్యటనల తరువాత నాకు ఇప్పుడు అనిపిస్తున్నదేమిటి అంటే- ఈ తరంలో, ఈ తరం నేతలలో పరస్పరం లోతయిన విషయాలు తెలిసినవారు లేరేమో! తెలిసినా చాలా తక్కువే తెలుసును. మన దేశంలోని ఏ వైద్య కళాశాల గ్రంథాలయంలోను నేను ఏనాడూ చైనా నుంచి వచ్చే వైద్య విషయాల పత్రికను చూడలేదు. అంటే వైద్యరంగంలో వాళ్లు సాధించినది మన దృష్టికి రావడం లేదు. భారత్‌లో చాలా తక్కువ మంది చైనీస్ నేర్చుకుంటున్నారు. అక్కడ కూడా అంతే. అతి తక్కువ మంది హిందీ నేర్చుకుంటున్నారు. మిగిలిన భారతీయ భాషలేమీ వారికి తెలియదు.
నేను రెండు పర్యాయాలు బీజింగ్ వెళ్లాను. అలాగే చెంగ్దూతో పాటు షిజియాజంగ్, గౌంగ్‌జాంగ్, లాన్‌జౌన్సి ప్రాంతాలను కూడా చూశాను. నెలలూ ఏళ్లూ అక్కడ తిరగకపోయినా ఆ రెండు చిన్న యాత్రలు నాకు చాలా విషయాలు చెప్పాయి. వందలాది సంవత్సరాల నుంచి ఇరుగు పొరుగుగా ఉన్న మన రెండు జాతులు ఒకరి ఒకరి గురించి తెలుసుకున్నది తక్కువేనని నేను తెలుసుకున్న వాస్తవం. ఇందుకు కారణం భాష. చైనీస్ లిపి నేర్చుకోవడం చాలా కష్టం. మరొక వాస్తవం కూడా ఉంది. ఈ రెండు దేశాల మధ్య చాలా అంశాలలో సామ్యం ఉంది. అధిక జనసాంద్రత, భిన్న సంస్కృతుల వారు ఒకే చోట నివాసం ఉండడంతో వచ్చే వైరుధ్యం వంటి సమస్యలు ఇద్దరికి సమానమే. చిరకాలం సాగిన వలస పాలన ప్రభావం ఇరు దేశాల వారిని ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉంది కూడా. అలాగే దేశాల మధ్య వైరుధ్యాలు కూడా అనివార్యంగా కనిపిస్తాయి.మనది ప్రజాస్వామ్యం. అక్కడ ఉన్నది కమ్యూనిజం.
కమ్యూనిజం, ఆ పార్టీతో నాకున్న పరిచయం కూడా తక్కువే. కానీ మరచిపోలేని ఒక ఘటన మాత్రం భూప్రపంచ మీద ఉండే కమ్యూనిస్టుల ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో అవగాహనకు తెచ్చింది. నా ఈ స్వీయానుభవం వల్లనే కమ్యూనిస్టుల వ్యవహార శైలి తరువాత ఎప్పుడూ నన్ను ఆశ్చర్యపరచలేదు. 1967లో ఇది జరిగింది. ఆ సంవత్సరమే సర్జరీలో నా ఫైనల్ ఫెలోషిప్ పరీక్ష కోసం యూకేలోని ఎడిన్‌బరో వెళ్లాను. కొందరు భారతీయ విద్యార్థులతో పాటే నేను కూడా సటీ వసతిగృహంలో బస చేశాను. అందులో బెంగాల్ నుంచి ఒక విద్యార్థి కూడా ఉన్నట్టు గమనించాను. ఒకరోజు చైనా దురాక్రమణ గురించి చర్చ వచ్చింది. దీని గురించి బెంగాల్ విద్యార్థి మినహా అందరూ ఆవేశంతో ఊగిపోయారు. బెంగాల్ విద్యార్థికి ఆవేశం, ఆగ్రహం రాలేదని అనుకోవద్దు. అతడికి చైనా మీద చాలా ఆగ్రహం వచ్చింది. ఎందుకు? యావత్ భారతదేశం మీద దండయాత్ర జరిపి, కాంగ్రెస్ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయనందుకట! చైనా ఆధిపత్యంలో భారత్‌ను ఉంచనందుకట. అతడు ఎలాంటి మొహమాటం లేకుండా భారత్‌లో కమ్యూనిస్టు పాలన ఏర్పాటు చేసి, చైనా అధీనంలో ఉంచాలని బల్లగుద్ది మరీ వాదించాడు.
నేను ఆ మాటలకీ, అలాంటి వాదనలకీ విస్తుపోయాను. అతడి ఆలోచనలకి దిగ్భ్రమ చెందాను. మరి జాతీయత, జాతీయ భావాలు ఇవేమీ అక్కరలేదా అని అడిగాను. జాతీయ గౌరవం మాటేమిటని వాదించాను. ఇలాంటి భావాల గురించి చాలా చులకనగా మాట్లాడాడు, కొట్టిపారేశాడు. కమ్యూనిజం తప్ప అన్యధా శరణం నాస్తి అన్నట్టు ఉంది అతడి ధోరణి. ఆ పార్టీ మొత్తం విదేశీ సిద్ధాంతాల మీదే, ఇతర దేశీయుల పేర్లు పెట్టడం మీదే ఆధారపడి ఉంటుంది. ఇదేమి సంస్కృతో అర్థం కాదు. ఎందుకో తెలియదు. మిగిలిన ఆసియా దేశాలతో చైనా నాయకుల ధోరణి కూడా ఇలాగే అర్థం కాకుండా ఉంటుంది.