మరుగున పడిన కొన్ని అద్భుతాల గురించి ప్రపంచం పునరాలోచించు కోవలసిన అవసరాన్ని కరోనా ముందుకు తెచ్చింది. ఇది భారతదేశం బాగా గుర్తించింది. అందుకు దేశ నాయకత్వం, స్వావలంబన మీద ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత కారణం. యోగా వలెనే ఇప్పుడు ఆయుర్వేదానికి కూడా కొత్త వెలుగు రాబోతున్నది. ధన్వంతరి జయంతి (డిసెంబర్ 13)నే ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగానే ఒక శుభవార్త భారతదేశానికి అందింది. ప్రపంచ స్థాయి ఆయుర్వేద కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో జరిగిన పరిణామమిది. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ జామ్‌నగర్ (గుజరాత్)లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేద, రాజస్తాన్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరంభించారు. ఈ సందర్భంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రిసియస్ ప్రధానికి ఆ వర్తమానం పంపారు. ఆయుర్వేదం మీద పరిశోధనకీ, ఈ విధానం మీద ప్రపంచంలో అవగాహన కల్పించడానికీ ఈ సంస్థను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు టెడ్రోస్ వెల్లడించారు. సంప్రదాయక వైద్య విధానాలకు ప్రాచుర్యం కల్పించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి చెప్పారు.ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఖ్యాతి గాంచిన, తొమ్మిదిన్నర దశాబ్దాల చరిత్ర కలిగిన చింతలూరు వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం గురించి ప్రత్యేక వ్యాసం.
ఆయుర్వేదం అంటే భారతదేశం గుర్తుకు వస్తుంది. మూడువేల ఏళ్ల భారతీయమైన వైద్య చరిత్ర కళ్ల ముందు కదులుతుంది. క్షీరసాగర మథనంతో ఉద్భవించిన ధన్వంతరి దీనికి ఆద్యుడని మన విశ్వాసం. చరిత్రలో కనిపించే చరకుడు, సుశ్రుతుడు వంటి పేర్లూ, వారి గ్రంథాలు చరక సంహిత, సుశ్రుత సంహిత కూడా గుర్తుకు వస్తాయి. వాటితో పాటే గుర్తుకు వచ్చే పేరు- వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం (వాన్). చ్యవనప్రాశ, వేదాశ్వ వంటి వందలాది ఔషధాలతో ఆ నిలయం విశ్వవిఖ్యాతి గాంచింది. ఆయుర్వేద ఔషధాలు తయారుచేసే సంస్థలు దేశంలో వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో వాన్ స్థానాన్ని బట్టే ఎన్నో పురస్కారాలు వచ్చాయి. ఒక చిన్న పరిశ్రమగా ఆరంభమై ఎంతో ఎత్తుకు ఎదిగింది. ప్రస్తుత అవసరాలను బట్టి వాన్ యంత్రాలను ఉపయోగిస్తున్నది. ఆయుర్వేదం ప్రధానంగా చేతివృత్తి. ఈ వాస్తవం మరిచిపోలేదు కనుకనే, వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం మందుల తయారీకి కల్వాలు, పొత్రాలు ఇప్పటకీ ఉపయోగిస్తున్నది. సంప్రదాయ పంథాను వీడకుండా, అవసరం మేర యంత్రాలను ప్రవేశపెట్టింది. ఇది ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి కాదు, మామూలుగా జరిగే ఉత్పత్తిలో వేగం పెంచడానికే. అతి త్వరలో వాన్ శత వార్షికోత్సవం జరుపుకోబోతున్నది కూడా.
తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలం లోని గ్రామం చింతలూరు. ఇక్కడే 1925వ సంవత్సరంలో వైద్యరాజ ద్విభాష్యం వేంకటేశ్వర్లు వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం ప్రారంభించారు. ధన్వంతరి గుడి వీధిలో ఈ నిలయం ఉంది. ఆరోజులలోనే చింతలూరుతో పాటు తుని, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లిలలో ఏకకాలంలో వాన్ ఆరంభం కావడం విశేషం. ప్రస్తుతం దక్షిణ భారతమంతటా దీనికి 200 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. 1969లో బంగారం దిగుమతి మీద ఆంక్షలు విధించినప్పుడు వాన్‌కు మినహాయింపు ఇచ్చారు. దీనిని బట్టి నాటికే వాన్ ఖ్యాతి ఎంతటిదో అర్థమవుతుంది. వేంకటేశ్వర్లు గారి తరువాత ఆయన ఏకైక కుమారుడు వెంకటసూర్యనారాయణమూర్తి (ఆయుర్వేద విద్యావేత్త) నిలయాన్ని ఎంతో సమర్ధంగా నిర్వహించారు. ఈయన ‘అపర ధన్వంతరి’ అనే వారు. ఇప్పుడు వారి కుమారుడు వేంకట శ్రీరామ మూర్తి నిర్వహిస్తున్నారు. వాన్ ప్రస్తుతం అశ్వగంధి లేహ్యం, త్రివిత్రి లేహ్యం, బృహదాత చింతమణి, బ్రాహ్మీ సరస్వతి లేహ్యం వంటి సుప్రసిద్ధ ఔషధాలతో పాటు దాదాపు 170 ఔషధాలను తయారుచేస్తున్నదని ఒక సందర్భంలో వేంకట శ్రీరామమూర్తి చెప్పారు.
చింతలూరు, ద్విభాష్యం-ఈ రెండు మాటలు ఎవరి దగ్గరయినా ప్రస్తావిస్తే, మీరు ఆయుర్వేద కుటుంబం వారా అని వెంటనే వారు స్పందించగానే చాలా ఆనందం కలుగుతుందని ఆ కుటుంబాల వారు చెబుతారు. దాదాపు 250 సంవత్సరాల నుండి వారి తాతముత్తాతల దగ్గర్నుంచి ఈ తరం వరకూ అందరూ ఆయుర్వేద వైద్యులే. వీరి పెద్దలు సంస్కృత గ్రంథాలను ఔపోసన పట్టటంవల్ల మా ఇంటిపేరు ద్విభాష్యం అయి ఉంటుందని చెబుతారు. వీరి పూర్వికులు నాడీ పరీక్షచేసి రోగ నిర్ధారణ చేసేవారు. గర్భస్థశిశువు ఆడా, మగా అనేదీ చెప్పగలిగేవారు. ‘ఆయుర్వేదో అమృతానాం’ అన్న మాట నిజం చేస్తూ చిట్కా వైద్యంతో కూడా వ్యాధులను నయం చేసేవారు.
సంప్రదాయబద్ధంగా బంగారం, వెండి, పాదరసం వంటి లోహాలను పిడకల (ఆవు) మంటలో పుఠం పెట్టి ఉపయోగిస్తారు. ముడిసరుకు కశ్మీరు, పంజాబ్, ఢిల్లీల నుంచి వస్తుంది. స్వర్గీయ అశోక్ సింఘాల్ విశాఖపట్నం వచ్చిన సందర్భంలో వారికి సిద్ధ మకర ధ్వజం ఇచ్చారు. ఈ మందు కల్వం లోనే నూరి తయారుచేశారా అని ప్రశ్నించారు. సంప్రదాయ పద్ధతిలోనే తయారుచేస్తున్నామని చెప్పగానే ఆనందంగా స్వీకరించారు. ఇక్కడ ఉపయోగించే ప్రతి మూలిక స్వచ్ఛమైనదే. కల్తీలేని ఆవునెయ్యి, తేనె వాడతారు.
వాన్ తయారు చేసే చ్యవనప్రాశ్ ఐసీపీఎంఎస్ (ఇండ్యూస్డ్ కపుల్ ప్లాస్మాస్పెక్ట్రో మీటర్) పరీక్షకు నిలిచి దేశంలో అత్యుత్తమ ఔషధాలలో ఒకటిగా స్థానం సంపాదించింది.నాణ్యతా ప్రమాణాలను బట్టి అంతర్జాతీయ స్థాయిలో ఐఎస్‌ఓ 9002 పత్రం కూడా ఈ సంస్థకు లభించింది.
కరోనా సమయంలో అశ్వగంధ విశేషంగా ఉపకరిస్తుందని చాలామంది అనుభవం. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ ఆయుర్వేద ఔషధం ఉపకరిం చిందని వారు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొవిడ్ 19 నిరోధానికి ఆయుర్వేదం ఉపయోగించుకోవాలని సూచించారు. నిజానికి అశ్వగంధ సాధారణ ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారు. ఈ మందుకు వాన్ ప్రసిద్ధి. అశ్వగంధ లేహ్యం, అశ్వగంధారిస్ట, ద్రాక్షారిస్ట, మాదీఫల రసాయనం, మహాలక్ష్మీవిలాస రసం, నారాయణ తైలం, రత్నపురుష లేహ్యం, సిద్ధమకర ధ్వజం, యోగేంద్ర రసం వంటివి ఎన్నో వాన్ తయారు చేస్తోంది. మధుమేహ వ్యాధికి కైసోర గుగ్గిళ్లు, వసంత కుసుమాకర, వీకే 4 డైకాన్, వీకే 4 ఇన్సుయాక్ట్ కూడా ప్రసిద్ధిగాంచాయి. కీళ్ల ఆరోగ్యం కోసం బృహద్వతా చింతామణి, మహాయోగ రాజ గుగ్గిళ్లు, పిండతైల, ప్రవల పంచామృత భస్మం; జీర్ణాశయ సమస్యలకు భాస్కర లవణ చూర్ణం, ఎల్-మిత్ర, శూలకుఠారం, త్రిఫల చూర్ణం అనే ఔషధాలు తయారవుతాయి.
2001 సంవత్సరంలో వాన్ ప్రయాణంలో మైలురాయి వంటి ఘటన జరిగింది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో దాదాపు 1,700 ఆయుర్వేద మందుల తయారీ సంస్థలు ఉన్నాయి. కానీ ఔషధాల ఉత్పత్తిలో నాణ్యతా ప్రమాణాలు, పరిశ్రుభత పాటించినందుకు ఇచ్చే ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జీఎంపీ) సర్టిఫికేషన్ వాన్‌కు దక్కింది. దేశంలో అప్పటికి ఉన్న 7,000 ఆయుర్వేద మందుల సంస్థలలో వాన్‌తో పాటు మరొక మూడు సంస్థలకు కూడా ఈ సర్టిఫికేషన్ రావడం విశేషం. దీనితో వాన్ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత ఖ్యాతి లభించింది. ప్రపంచంతో పాటు భారత్‌ను కూడా ఎయిడ్స్ వ్యాధి తీవ్రంగా భయపెడుతున్న సమయంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఆచార్యునితో కలసి వాన్ పరిశోధనలు నిర్వహించింది.
భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు వివిధ సమాజాల వారు ఆయుర్వేదం మీద ఆసక్తి చూపిస్తున్నారని ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి అంటున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే- ‘ప్రకృతితో మమేకమవుతూ, అందులోని స్వచ్ఛతకు దగ్గర కావాలి’ అన్న ఈ వైద్య విధానంలోని సూత్రమేనని కూడా చెప్పారు. మార్కెట్ ఆధారిత మూలికా ఔషధాల వ్యాపారం మొత్తం ఇప్పుడు ప్రపంచంలో రూ. 60,000 కోట్లని కూడా ఆయన గుర్తు చేశారు. పైగా ఏటా 20 శాతం వంతున పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఆల్మా ఆటా ప్రకటన ద్వారా(1974) ఇది సాధ్యమైంది. అయితే రంగంలోను చైనా ఒక అడుగు ముందంజ లోనే ఉంది. అక్కడ నుంచి ఎగుమతయ్యే ఆయుర్వేద ఔషధాలు విలువ రూ. 18,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్లు. భారత్ ఆయుర్వేద ఎగుమతుల విలువ రూ. 3,000 కోట్లు.
మందుల ధరల విపరీతంగా పెరిగిపోవడంతో ఆధునిక వైద్యం అందుబాటులో ఉండడం లేదు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్టస్ ఉండని ఆయుర్వేదం అంటే వారికి నమ్మకం ఏర్పడుతున్నది.
కొవిడ్ 19 సమయంలో ఆయుర్వేదం మీద ఆధారపడడం అవసరమని చాలామంది భావించ డానికి తగిన కారణమే ఉంది. ప్రధానంగా వేదాశ్వ వంటి మందులు ఇందుకు కారణం. వేదాశ్వ ప్రధాన లక్షణం ఒత్తిడి తగ్గించడం. వాన్‌కు వేదాశ్వ మీద పేటెంట్ హక్కు ఉంది. మానసిక ఒత్తిడులు, రక్తపోటు వంటివి తగ్గించేందుకు ఆయుర్వేదం అందించిన ఔషధమే వేదాశ్వ. గుండె, మెదడులకు ఇది ప్రాణవాయువు సరిగా సరఫరా కావడంలో దోహదం చేస్తుంది. భారత ప్రభుత్వం వేదాశ్వకు పేటెంట్‌తో పాటు ట్రేడ్‌మార్క్ అనుమతిని కూడా ఇచ్చింది. కాబట్టి ఈ ఔషధాన్ని ఆయుర్వేద మందుల దుకాణాలలోనే కాదు, అన్ని రకాల మందుల దుకాణాలలోను, ఫ్యాన్సీ దుకాణాలలో కూడా విక్రయించే ందుకు వీలు ఉంది.
2002 సంవత్సరంలో వాన్‌కు ఫ్యాప్సీ అవార్డు దక్కింది. ఆ సందర్భంలో శ్రీరామమూర్తి ప్రభుత్వానికి చాలా చక్కని సలహా ఇచ్చారు. ‘వివిధ రంగాల పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారరంలో ప్రభుత్వం కొద్దిపాటి సహాయ సహకారాలు అందించినా అది ఎంతగానో తోడ్పడగలదు. చిన్న పారిశ్రామికవేత్తలకు ఉత్సాహాన్ని ఇచ్చి సాహసంతో నూతన రంగాలలోకి చొచ్చుకు వెళ్లడానికి తోడ్పడగలదు’ అన్నారాయన. ప్రస్తుతం ఈ సంస్థను ద్విభాష్యం వెంకటదీక్షితులు, ద్విభాష్యం శేష సత్యన్నారాయణ, (విజ్ఞానభారతి నిర్వహిస్తున్న వరల్డ్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్‌లో నేషనల్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు. ఆంధప్రదేశ్ కో ఆర్డినేటర్), ద్విభాష్యం రామలింగేశ్వరశర్మ, వెంకట ధన్వంతరి నిర్వహిస్తు న్నారు. వ్యాపారపరంగానే కాక ప్రభుత్వ సహకారంతో మా ‘చింతలూరు ఆయుర్వేద ఫార్మశీ’ని వృద్ధిచేసి ప్రజలకి మరింత అందుబాటులోకి తెచ్చి, వారిని సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేయాలన్నదే మా కోరిక. ప్రపంచం అంతా ఆయుర్వేదాన్ని గుర్తిస్తున్న సందర్భంలో విజ్ఞానభారతి అధ్యక్షులు డా।। విజయ భట్కర్ ఆయుర్వేదం, ప్రత్యామ్నాయ వైద్యం కాదు. అసలైన వైద్యం అని చెప్పటం హర్షణీయం. ఆత్మ నిర్భరభారత్ సందర్భంలో ఈ మాట, నిజానికి వాన్ ఉత్పత్తులు కూడా ఈ దేశానికి ఎంతో అవసరం.
శ్రీధన్వంతరయే నమః
– ద్విభాష్యం శేషసత్యనారాయణ, ఆయుర్వేద నిపుణులు, చింతలూరు
ఆరోగ్యదైవానికి ఆలయం
శ్లో।। నమామి ధన్వంతరి మాదిదైవం, సురాసురైర్వందిత పాదపద్మం
లోకేజరారుగ్భయ మృత్యునాశం, దాతారమీశం వివిదౌషధానాం।।
దీపావళి ముందు వచ్చే త్రయోదశికి మహోన్నతమైన ప్రాముఖ్యం ఉంది. అది ధన్వంతరి జయంతి. అందుకే దీనిని ధన్వంతరి త్రయోదశి (ఆశ్వీయుజ బహుళ త్రయోదశి) అని కూడా అంటారు. ధన్వంతరి అనే ఆ పురాణపురుషుడి పేరుతో ఆర్యావర్తంలో ఆవిర్భవించి, నేటికీ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న వైద్య విధానం ఆయర్వేదం. ధన్వంతరి మహావిష్ణువు అవతారమని విష్ణుపురాణం చెబుతుంది. ధన్వంతరి క్షీరసాగర మథనంతో లభించిన మహావరం. ఆ పురాణ పురుషుని వైద్యశాస్త్రానికి ప్రతీకగా చిత్రించిన తీరే మనలను వివశులను చేస్తుంది. శ్రీమహావిష్ణువు వలెనే ధన్వంతరి చతుర్భుజుడు. ఆ చేతులలో శంఖం, చక్రం, మూలికలు-నల్ల జలగ, అమృతం నింపిన పాత్ర ఉంటాయి. ఎంత అద్భుతమైన ప్రతీకలు! అమృతం సంగతి సరేసరి! మూలికల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మరి నల్లజలగ! ఇవి చెడు రక్తాన్ని పీల్చి, మనిషి దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయని ఆధునిక వైద్యం కూడా చెబుతుంది. దీనికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఒక చేత వైద్య ఉపకరణాలు, మరొక చేత అమృతం అంటే వైద్యంతో, దీర్ఘా యుషును ఇవ్వడానికి దేవతలు ఆయనను ఇక్కడకు పంపారని ప్రతీకాత్మకంగా పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆరోగ్యానికి అధిదేవత. అలాంటి ధన్వంతరికి ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ ఆయుర్వేద ఔషధాలకు ఖ్యాతి గాంచిన మన చింతలూరులో మాత్రం దేవాలయం ఉంది. వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం (వాన్) వ్యవస్థాపకులు, వైద్యరాజ ద్విభాష్యం వేంకటేశ్వర్లు 1942లో ఈ ఆలయం నిర్మించారు. ఇందులోనే పృథీశ్వర, నూకాంబిక ఆలయాలు కూడా ఉన్నాయి.
ఎంతో ఆహ్లాదంగా ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో బ్రహ్మ, దక్ష ప్రజాపతి, అశ్వనీదేవతలు ఒకవైపు, ఇంద్రుడు, భరద్వాజుడు, ఆత్రేయ, చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటాచార్యుల బొమ్మలు మరొకవైపు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి. విశ్వక్సేనుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి. అలాగే శివకేశవులు కూడా ఉన్నారు. ఇందులో చరకుడు ఆయుర్వేదానికి రూపును ఇచ్చినవానిగా చరిత్ర ప్రసిద్ధుడు. ఇక సుశ్రుతుడు పురాతన కాలంలోనే శస్త్రచికిత్సలు చేసినవానిగా ఖ్యాతి గాంచాడు. ఇక్కడ మరొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. భాగవత పురాణం, ఆయుర్వేద వైద్య చరిత్ర చూస్తే మరొక ఇద్దరు ధన్వంతరులు కూడా కనిపిస్తారు. వీరు వివిధ కాలాలకు చెందిన వారే. ధన్వంతరి లేదా ఆది ధన్వంతరి పురూరవ వంశానికి చెందిన ధృగాత్మ కుమారుడు. ధన్వంతరి తన విద్యను వారణాసి రాజు దేవదాసతో పంచుకున్నాడని ప్రతీతి. ఆది ధన్వంతరే ఆయుర్వేదాన్ని ఎనిమిది భాగాలుగా విభజించాడంటారు. ఆది ధన్వంతరికి ముని మనుమడి పేరు కూడా ధన్వంతరి. ఇతడు క్రీస్తుపూర్వం 3000 ప్రాంతంలో జీవించాడు. దివోదాస్ ధన్వంతరిగా పిలిచే ఈయనే సుశ్రుతుని గురువు.
విష్ణు ధర్మోత్తర పురాణంలో ఐదు ఆరోగ్య సూత్రాలు కనిపిస్తాయి. ఆరోగ్యం గురించే కాదు, విశ్వం పుట్టుక, ఖగోళశాస్త్రం, యుద్ధతంత్రాలు, శిక్షలు, వ్యాధులు, చికిత్స గురించి కూడా ఆ పురాణం ప్రస్తావించింది. ఉడకబెట్టిన గుడ్లతో మూత్రపిండాలలో రాళ్లు, గుండె బలహీనత, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఆ పురాణం హెచ్చరిస్తున్నది. భోజనానంతర స్నానాన్ని, నోటితో శ్వాస తీసుకోవడాన్ని నిషేధిస్తున్నది. నోటితో శ్వాస తీసుకుంటే ఆయుక్షీణం అని కూడా చెబుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు పచ్చికూరల రసం తీసుకోవాలని, భోజనం తరువాత కొద్దిగా బెల్లం తింటే ఉదరానికి మేలు చేస్తుందని సూచిస్తున్నది.