2019 ‌నవంబర్‌ 10‌న అయోధ్య రామాలయ తీర్పు నేపథ్యంలో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ అదే ఉత్సహవంతమైన వాతావరణం దేశంలో నెలకొంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు ఈ స్థానాలకూ ఓట్ల లెక్కింపు జరిగింది. తెలంగాణలోని దుబ్బాక, మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌హర్యానా, ఝార్ఖండ్‌, ‌కర్ణాటక, ఒడిశా, మణిపూర్‌, ‌నాగాలాండ్‌ ‌రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు పోలింగ్‌ ‌నిర్వహించింది. దాదాపు అన్ని చోట్లా పక్రియ సజావుగా, ప్రశాంతంగా ముగిసింది.


అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, గుజరాత్‌లో ఎనిమిది, యూపీలో ఏడు, మణిపూర్‌లో ఐదు, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్‌, ‌నాగాలాండ్‌లో రెండు చొప్పున, తెలంగాణ, చత్తీస్‌గఢ్‌, ‌హర్యానాలో ఒక్కోస్థానానికి ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని 28 స్థానాల్లో 66.09 శాతం పోలింగ్‌ ‌నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సమయంలో 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, అంతకు ముందే ఖాళీగా ఉన్న మూడు సీట్లు కలిపి మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు పోలింగ్‌ ‌జరిగింది. వీటిలో కనీసం తొమ్మిదింటిలో బీజేపీ గెలిస్తేనే శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌ప్రభుత్వం మానగలుగుతుంది. మెజార్టీ అటు ఇటు అయితే అధికారం మళ్లీ కాంగ్రెస్‌ ‌హస్తగతం అయ్యేది. కానీ అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి మధ్యప్రదేశ్‌ ‌ప్రజలు శివరాజ్‌ ‌సింగ్‌ ‌ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చౌహాన్‌ ‌మాట్లాడుతూ ఇది ప్రజావిజయమని అభివర్ణించారు. కాంగ్రెస్‌ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల కారణంగా ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని అన్నారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థనేతలకు అధికారం అప్పగించి సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్‌ ‌ప్రయత్నించినప్పటికీ ప్రజలు అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారు. సింధియా కాంగ్రెస్‌ ‌రాజకీయాలను వదిలి బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు పాలలో చక్కెర కరిగిపోయినట్లు ఆయన బీజేపీలో లీనమైపోయారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ జ్యోతిరాదిత్య సింధియాను పూర్తిగా తమ పార్టీనేతగా అంగీకరించిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఏడు స్థానాలకు బీజేపీ ఆరింటిలో గెలుపొందింది. ఈ విజయం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమ విజయం తమనే వరించిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్టప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులే తమను గెలిపించాయని పేర్కొన్నారు.

గుజరాత్‌లో బీజేపీ తన ఆధిక్యతను మరోసారి నిరూపించుకొంది. పోటీ చేసిన ఎనిమిది స్థానాలను కైవసం చేసుకొని రాష్ట్రంలో తిరుగులేని శక్తిని ప్రదర్శించింది. 55 శాతం ఓట్లను సంపాదించి గుజరాత్‌ ‌ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందింది. మణిపూర్‌లో ఐదు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించగా బీజేపీ నాలుగు చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిక్యతను చూపింది. ఒక నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కర్ణాటకలో రెండు స్థానాల్లో గెలుపొంది 51 శాతం ఓట్లను సొంతం చేసుకొంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ ‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్‌ఎస్‌ ‌కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. బిహార్‌లో బీజేపీ విజృంభణ, 59 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో 40 సీట్లను కైవసం చేసుకోవడం వినూత్న విజయంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఈ ఎన్నికలు రాబోవు రోజుల్లో ఇతర రాష్ట్రాలపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా వచ్చే యేడాదిలో జరగబోయే పశ్చిమ బెంగాల్‌లో ఈ గెలుపు టానిక్‌ ‌ప్రభావం తప్పక పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి ఉన్న ఆదరణతో పాటు, కేందప్రభుత్వ పథకాలు కరోనా సమయంలో ఉచిత గ్యాస్‌, ఇళ్ల నిర్మాణం, బియ్యం, పప్పు తదితర నిత్యావసరాలు ఉచితంగా అందించడం లాంటివి బాగా పని చేశాయని భావిస్తున్నారు. కరోనా వేళ మిగితా దేశాలు మేలుకోక ముందే భారత ప్రభుత్వం చేపట్టిన విధానాల పట్ల అత్యధిక ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాలే ప్రజలను ప్రాణసంకటం నుంచి గట్టేక్కించాయని బలంగా విశ్వసిస్తున్నారు. ఆ ప్రభావం ఉప ఎన్నికలపై తీవ్రంగా చూపిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

About Author

By editor

Twitter
YOUTUBE