అక్టోబర్ 25 విజయదశమి
దేశవిదేశాలలో దేవీనవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేక శక్తిక్షేత్రాలలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి. కరోనా మహమ్మారి బెడద నేపథ్యంలో ఆలయాల్లో తగు జాగ్రత్తల మధ్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు. నిబంధనల మేరకు భక్తులను అనుమతిస్తున్నారు. నవరాత్రులలో ప్రధాన ఘట్టాలు సరస్వతీపూజ, మహర్నవమి, విజయదశమి, శమీపూజలను ఈ వారంలో జరుపుకుంటున్నారు.
‘నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ:
నమ: ప్రకృత్యై భద్రాయై నియతా: ప్రణతా: స్మతామ్’
దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేక శక్తిక్షేత్రాలలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి. శరన్నవరాత్రులను పురస్కరించుకొని జగన్మాత ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ప్రపంచాన్ని పట్టి కుదుపుతున్న కోవిడ్ లక్షణాల నుంచి కాపాడాలన్నది ఈ ఏడాది పూజా ప్రార్థనల్లో ప్రత్యేకం. వాడవాడలా మండపాలు కట్టి అమ్మవారిని అర్చించుకునే ఆనవాయితీపై ‘కరోనా’ తీవ్ర ప్రభావం చూపింది. తగు జాగ్రత్తల నడుమ నియమ నిబంధనల మేరకు ఆలయాల్లో అమ్మవారి దర్శనానికి అనుమ తిస్తున్నారు. బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు వీధులకు, ఇళ్లకే పరిమితమయ్యాయి. ఊరూవాడా మహిళలు ఒక్కచోట చేరి జరుపుకునే ఈ పండుగలు నామమాత్రంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది అంబరాన్నంటేలా సంబరాలు చేసుకునేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ పూజాదికాలు నిర్వహిస్తున్నారు.
సరస్వతీ పూజ
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అనేక రూపాల్లో అవతరించిన శక్తి స్వరూపిణి జగన్మాత మానవజాతి సకల దోషాలను హరించడమేకాక వారికి జ్ఞానాన్ని ప్రసాదించ సంకల్పించారు. ఆ క్రమంలోనే సరస్వతీ అవతారంతో అనుగ్రహించారు. అలా శరన్నవ రాత్రులలో అతి ముఖ్యమైంది సప్తమి తిథి మూలానక్షత్రం రోజు. ‘దైవం మంత్రాధీనం’అంటారు సద్గురువులు. ఆ మంత్రాలకు బీజాలు అక్షరాలు. వాటి ఆరాధ్యదేవత సరస్వతీమాత. అనంతమైన అక్షర మహిమతోనే జ్ఞానం వెలుగులు చిమ్ముతుంది. వాక్కు అధిష్ఠాన దేవత సరస్వతీదేవి. అమ్మవారిది మూలా నక్షత్రం కనుక ఆనాడు ఆదిశక్తిని విద్యలదేవత ‘సరస్వతీదేవి’గా అలంకరిస్తారు. మాఘమాసంలో వసంత పంచమి నాడు చేసే సరస్వతీ పూజ దుర్గాదేవీ నవరాత్రుల్లోనూ ఒకరోజు చోటు చేసుకోవడం విశేషం. వ్యాసభగవానుడు మహాభారతంలో సరస్వతిని వేదమాతగా అభివర్ణించారు. ఆయన ప్రతిష్ఠించినట్లు చెప్పే బాసరలోని జ్ఞానసరస్వతీ క్షేత్రంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవరాత్రులు నిర్వహిస్తారు. శ్రద్ధాభక్తులతో అర్చిస్తే చదువుల తల్లి ప్రసన్నురాలై జ్ఞానభిక్ష ప్రసాదిస్తుందని విశ్వాసం. ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అనే నానుడికి మూలం వాగ్దేవే అనడం నిర్వివాదాంశం. అందుకు ప్రాథమిక స్థాయిలోనే పునాదిపడాలి. అందుకే బాల్యం నుంచే సరస్వతిని అర్చించాలని సూచిస్తారు. ఆ క్రమంలోనే మూలానక్షత్రం సందర్భంగా పిల్లలతో పాఠశాలల్లో సరస్వతీ పూజ నిర్వహిస్తారు. చదువుకు ప్రతిరూపాలైన పుస్తకాలను అర్చిస్తారు. బడిఈడు పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేపడతారు.
శారదాదేవిని అన్న, ధన ప్రదాయినిగా వేదం స్తుతించింది. ఆ తల్లి అనుగ్రహం లేనిదే జ్ఞానవంతులు కాలేరు. ప్రవాహరూపమైన చైతన్యమే భారతి. శుద్ధత్వం ఆమె స్వరూపం. తెల్లదనం ఉట్టిపడే స్వచ్ఛోపకరణాలన్నీ ఆ తల్లివే. అందుకే చదువులతల్లిని ‘సర్వశుక్లాం శుద్ధరూపం’ అంటారు. ‘శరదిందు వికాస మందహాసం/స్ఫురదిందీవర లోచనాభిరామం/అరవింద సమాన సుందరాస్యాం/ అరవిందాసన సుందరీ ముపాసే’ – శరత్కాల చంద్రుని వలె తెల్లని వన్నెగల చిరునవ్వు గలది, ప్రకాశించు నల్లకలువల వంటి కన్నులు కలది, పద్మములతో సాటి అయిన అందమైన మోము కలది, పద్మం పీఠంగా గల విధాతకాంతను స్మరిస్తాను అని ఈ శ్లోకం భావం. వీణాపాణి•, పుస్తకధారిణి సంగీత సాహిత్యాలకు ఆటపట్టు. ఆమె స్తుతి లేకుండా ఆయా పక్రియలలో ముందుకు పోలేరు. బ్రహ్మ ముఖం వాణీ నివాసమని శాస్త్రోక్తి. వేదపురాణేతిహాసాలు ఆమెకు నిలయాలు. వ్యాసభగవానుడి నుంచి ఆధునిక కవులు దాకా ఆమెను అర్చించారు, అర్చిస్తున్నారు. ముఖ్యంగా బాలలకు దైవభక్తి ‘సరస్వతి నమస్తుభ్యం’ అనే శ్లోకం నుంచే మొదలవుతుంది. అక్షరాభ్యాసం నుంచే ఆరాధ్యదేవత. పోతనామాత్యుడు ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ…’ పద్యంలో ‘కృపాబ్ధి ఇచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ అంటూ కృపాసముద్రురాలైన జగన్మాత విద్యాప్రదాయినిగా కవిత్వ సంపద ఇస్తుందని అభివర్ణించారు. మూకకవి తన ‘పంచశతి’లో(మూకపంచశతి) కామాక్షీ మాతను శారదాంబగా ‘విమల పటీకమలకుటీ/పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ/కామాక్షీ పద్మలాక్షీ/కవిత విపంచీ విఖాసి వైరించీ’ – శుభ్రమైన వస్త్రం ధరించి చక్కని రెప్పలు గల కన్నుతో వీణాపాణిగా రాజిల్లే ఓ కామాక్షీదేవీ! నీవు సరస్వతీదేవివి అని స్తుతించాడు. అలాంటి సరస్వతీదేవిని మూలానక్షత్రంనాడు ఆరాధించి ఆమె కరుణకు పాత్రులు కావాలని సకల మానవాళి కోరుకుంటుంది.
మహర్నవమి
దేవీ నవరాత్రులలోని నవమి తిథిని ధైర్యానికి, శత్రుసంహారానికి ప్రతీకగా చెబుతారు. చతుర్విధ పురుషార్థాలలో కామాన్ని ప్రకోపిస్తే ఎంతటి వారికైనా పతనం తప్పదని తెలియచెప్పేదే మహిషాసురవధ అని, మహిషాసురమర్ధనం సమస్త ప్రాణకోటికి గుణవర్ధన సందేశమని పెద్దల మాట. పూర్వం నవమి తిథి నాడు, మరునాడు (విజయదశమి) అపరాజితదేవిని పూజించేవారట. అమె విజయంతో పాటు మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. ‘అపరాజిత’ ప్రకృతిని ఆవహించి ఉంటుందని, అమెను పూజించడం వల్ల శత్రుభయం పోయి జీవితం సవ్యంగా సాగుతుందని నమ్మకం. అందుకు మహిషార వధను ఉదాహరణగా చెబుతారు. లోకకంటకుడైన రక్తబీజుడనే రాక్షసుడిని అమ్మవారు నవమి నాడు అంతమొందించారని కథనం. శాంతస్వరూపిణి అయిన మాత శత్రుసంహారంలో రౌద్రరూపం దాలుస్తారనేందుకు ఆ కథ ఉదాహరణ. పురాణం ప్రకారం, రక్తబీజుడు ఘోరతపస్సు చేసి మహిళ చేతిలో తప్ప అజేయుడిగా వరం పొందు తాడు (ముల్లోకాలను జయించే తనను అబల ఏమీ చేయలేదని అతని ధీమా). తన రక్తబిందువులు నేలమీద పడితే అంతే సంఖ్యలో తన లాంటి వారు పుట్టాలని కూడా వరం పొందాడు. అప్పటి నుంచి అతని ఆగడాల• మితిమీరడంతో బాధితులు త్రిమూర్తులను ఆశ్రయించగా ఆ దానవవధ బాధ్యతను అమ్మవారు స్వీకరిస్తారు. అతనిని పెళ్లాడాలను కుంటున్నట్లు కబురు ప•ంపడంతో ఆమె సౌందర్యానికి మైమరచి వెంటనే అంగీకరిస్తాడు. అయితే తనతో యుద్ధం చేసి గెలవాలని షరతు విధించారు అమ్మవారు. అలా ఆ సమరం తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. రక్తబిందువులు నుంచి రాక్షసులు పుట్టుకురావాలన్న అతను పొందిన వరానికి విరుగుడుగా, రక్తబిందువులు నేల రాలకుండా దుర్గాదేవి భూమినే నాలుకగా చేసి అతనిని సంహరిస్తుంది. శత్రుసంహార సమయంలో అమ్మవారు ఉగ్రస్వరూపిణీగా ఉంటారట. ‘క్రోధేచ కాళీ’అంటారు. ‘కాల’ అంటే మృత్యువు. శత్రు వినాశన సమయంలో అంత రోషం చూపిన అమ్మవారు, మరునాడు ప్రసన్నత, సుందర దరహాసం, శాంతస్వరూపంతో రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు.
విజయదశమి
శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వయుజ శుక్ల దశమినాడే విజయ ముహూర్తం వస్తుందని, ఆ రోజునే క్షీరసాగర మధనం జరిగి అమృతం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అసురత్వం (రాక్షసత్వం)పై దైవత్వం, చెడు మీద మంచి సాధించిన రోజు విజయదశమి. దేవాసుర సమరంలో పరాజితులైన దేవతలు శరన్నరాత్రులలో ఇష్ట దేవతలను అర్చించి దశమినాడు విజేయులయ్యారని, నాటి నుంచి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోందని పురాణగాథ. రాజుల విజయయాత్రలకు ఈ ‘దశమి’ ముహూర్తంగా ఉండేదట. దుర్గాదేవికి గల అనేక నామాలలో ‘అపరాజిత’ (పరాజయం లేనిది) ఒకటి. అన్ని జీవుల్లోనూ అపరాజితాదేవి శక్తి రూపంలో ఉంటుంది. ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా/నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:’ అని అపరాజిత స్తోత్రం చెబుతోంది. ఆమె విజయానికి అధిదేవత. విజయదశమి నాడు ఆమెను ఆరాధిస్తే జయం కలుగుతుందని విశ్వాసం. ‘దశమి’నాడు కనకదుర్గమ్మ వారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఎడమచేతిలో చెరకుగడ ధరించి, చిరు నవ్వుతో కుడిచేతితో అభయమిస్తూ దర్శన మిస్తారు. జగన్మాత కనకదుర్గమ్మను ఈ అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు, విజయాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఆ రోజు సాయం సమయానికి ‘విజయకాలం’ అని పేరు. విద్యాభ్యాసం ఆరంభం సహా సకల శుభకార్యాలకు దీనిని శుభ సమయంగా భావిస్తారు. అభీష్టాలను నెరవేరుస్తుంది కనుకే విజయదశమి అని వ్యవహరించారు. ఆనాడు ఆయుధపూజ నిర్వహిస్తారు. ఆధునిక కాలంలో వివిధ వృత్తుల పరికరాలు ఈ కోవ కిందికే వస్తాయి. నిత్యజీవితంలో వినియోగించే వస్తువులను శుభ్రపరిచి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. వేద పండితులతో వేదపారాయణం చేయించేవారు. దీనినే ‘వేదసభ’ అంటారు.
శమీపూజ
‘శమీ’ అంటే ‘శమింపచేసేది’ అని అర్థం. శమీవృక్షంలో అపరాజితదేవి కొలువై ఉంటుందని విశ్వాసం. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన వాటిలో ఇదీ ఒకటి. శమీవృక్షాన్ని అగ్ని స్వరూపంగా భావించి, యజ్ఞాల సమయంలో నిప్పు రాజేసేందుకు శమీ దారువును ఉపయోగించేవారు. సకల కార్యసిద్ధికి, సర్వత్రా విజయ, క్షేమాల కోసం జమ్మిచెట్టును పూజించడం అనాదిగా వస్తోంది. విజయదశమి నాడు ఈ వృక్షం వద్ద అపరాజితా దేవిని పూజించి ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ/అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ’ అని ప్రదక్షిణలు చేస్తే శనిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. రావణవధకు ముందు శ్రీరామచంద్రుడు అపవరాజిత దేవిని, శమీవృక్షాన్ని అర్చించాడట. అజ్ఞాతవాస కాలంలో పాండవులు ధనుర్బాణాలను శమీవృక్షంపైనే భద్రరపరిచారు. రామరావణ సమరంలో ఈ వృక్షమే రాముడికి విజయాన్ని ప్రసాదించిందని, ఉత్తర గోగ్రహణం సందర్భంగా పార్థుడు జమ్మి చెట్టును పూజించి, ఆయుధధారియై విజేతగా నిలిచాడని పురాణలు చెబుతున్నాయి. పురాణగాధ ప్రకారం… యుద్ధంలో తెగిపడిన రావణుని తలలు పునరుజ్జీవనం పొందుతుండంతో, దానిని నివారించేందుకు శ్రీరాముడు చేసిన ప్రార్థనతో ఈ వృక్షమే రాముడికి విజయాన్ని ప్రసాదించిందని కథనం. పదవనాడు విజయం సాధించిన రాముడు నిర్వహించిన శమీపూజ భావితరాలకు ఆనవాయితీగా మారింది. ఊరి చివరి జమ్మిచెట్టు వద్ద శుద్ధిచేసి అష్టదళపద్మాకారంలో ముగ్గులు వేసి గణపతి పూజచేస్తారు. జమ్మి ఆకులను పవిత్రంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు పొందడం, బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. ఈ ఆకులను ‘బంగారం’ అనీ వ్యవహరిస్తారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఈ సంప్రదాయం ఇప్పటికీ కనిపిస్తుంది.
పాలపిట్ట దర్శనం
దసరా పండుగలో మరో ప్రాధాన్యత గల అంశం. పాలపిట్టను భక్తిప్రపత్తులతో చూస్తారు. పాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు ముగించుకొని తిరిగి వస్తుండగా దాని దర్శనమైందని, అప్పటి నుంచి విజయాలు వరించాయని జానపద గాథలు ఉన్నాయి. ఈ పండుగనాడు ఆ పక్షి దర్శనం శుభసూచకంగా భావిస్తారు. తెలంగాణ సహా ఒడిశా, కర్ణాటక, బీహార్‌ల రాష్ట్రపక్షి పాలపిట్ట కావడం గమనార్హం.
దేవరగట్టు ఉత్సవం
విజయదశమి పండుగలో భాగంగా వివిధ ప్రాంతాలలో జరుపుకునే ఉత్సవాలలో విలక్షణమైనది ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ‘దేవరగట్టు కర్రల సమరం’ (దేవరగట్టు ఉత్సవం). దీనినే బన్ని ఉత్సవం అనీ అంటారు. ఆ రోజు రాత్రి కాగడాల కాంతుల్లో దీనిని జరుపుకుంటారు. ప్రచారంలో ఉన్న ఐతిహ్యం ప్రకారం, ‘త్రేతాయుగంలో మణి, మల్లాసురులనే రాక్షసులు మునుల తపస్సుకు భంగం కలిగించడంతో వారు పార్వతీపరమేశ్వరులను శరణుకోరారు. వారికి అభయమిచ్చిన ఆదిదంపతులు రాక్షస సంహారానికి మాల,మల్లేశ్వరులుగా అవతరించారు. అయితే దేవమానవుల వల్ల పొంచిఉన్న ముప్పునుంచి తమను కాపాడవలసిందిగా రాక్షసులు అప్పటికే శివుడిని ఆశ్రయించి వరం పొందారు. దీనితో శివపార్వతులు దేవమానవులుగా కాకుండా భైరవరూపంలో తొమ్మిది రోజులు పోరాడి దానవులను సంహరించారు. భైరవమూర్తులను తమ ఆరాధ్య దైవంగా గుర్తించిన రాక్షసులు, తమకు ముక్తిని ప్రసాదించాలని, విజయదశమి నాడు పిడికెడు మానవ రక్తమైనా సమర్పించేలా చూడాలని వేడుకున్నారట. అప్పటి నుంచి ఈ ‘సమరం’ సాగుతూ వస్తోందని కథనం. ఆ ప్రాంత చుట్టుపక్కల గ్రామాలు కొత్తపేట, నెరిణికి, నెరిణికి తండా తదితర గ్రామాల వారు ఇనుప వృత్తాలు తొడిగిన కర్రలు చేతబూని ‘స్వామి ఉత్సవం తమదంటే తమదం’టూ పరస్పరం అడ్డుకుంటారు. ఈ క్రమంలో తలలు పగిలినా వెనుకంజవేయరు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించిన తరువాత ఒక భక్తుడు తొడకోసి పిడికెడు రక్తాన్ని ధారపోసి, అనంతరం ఆలయానికి చేరుకుని భవిష్యవాణి చెబుతారు.ఈ కాలంలో ఇది వింతగా అనిపించినా, ‘ఇది ఆచారంగా వస్తున్న ఆరాధనే కానీ ఆటవికం కాదు’అని స్థానికులు చెబుతారు.
– ఆరవల్లి రామచంద్ర రామానుజ, సీనియర్ జర్నలిస్ట్