ఇరవయ్యవ శతాబ్దం తొలి దశకం నుంచి తెలుగులో వెలువడిన సాహిత్యం కొత్త వేకువలను దర్శింప చేసింది. యథాతథస్థితిని పూర్తిగా ద్వేషించిన అక్షరాలవి. ఆధునిక ప్రపంచం అవతరిస్తున్న కాలంలో, ఆ కాలాన్ని ప్రతిబింబించే రచనలు అప్పుడు వచ్చాయంటే సత్యదూరం కాబోదు. ఆ కాలాన్ని అర్థం చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించిన రచయితలు తెలుగునాట ఉద్భవించడమే ఇందుకు కారణం. కొత్త దృష్టి, సరికొత్త శైలి వారు అందించారు. ప్రాచీనమైనదంతా నిరర్థకమేనని తీర్మానించడం, ఆధునికమైనదంతా ఔదలదాల్చ వలసినదేనని నమ్మడం- రెండూ కూడా ఆనాటి రచయితలను ప్రభావితం చేయలేకపోయాయి. ప్రాచీనతలో అవసరమైనదానినీ స్వాగతించారు. ఆధునికతలోని అతినీ  వారు నిలువరించారు. ఇలాంటి వాస్తవిక దృక్పథం కలిగిన రచయితలలో పానుగంటి లక్ష్మీనరసింహారావు ఒకరు. దాదాపు నూట పదేళ్ల క్రితం వెలువడిన ఆయన ‘సాక్షి’ వ్యాసాలు తెలుగు నేల మీద కొత్త వాకిళ్లను ఆవిష్క రించాయి. కొత్త బాటలు పరిచాయి. సంస్కరణ, కొత్త దృష్టి ధ్యేయంగా సాగిన ఆ వ్యాసాలన్నీ ఆ కాలపు సమాజ పోకడల మీద ప్రత్యక్ష వ్యాఖ్యానాలు కూడా. సమస్యను చర్చించి, తీర్పును పాఠకులకు విడిచిపెట్టడం పానుగంటి అక్షరాలకు సాధ్యం కాలేదు. ఆయన తన అభిప్రాయాన్ని నిష్కర్షగా వెల్లడించేవారు. అది హిందూ జీవనంలోని అవలక్షణాలను ఎత్తి చూపుతూ విసిరిన వ్యంగాస్త్రం కావచ్చు. ఇంగ్లిష్‌ ‌వ్యామోహంతో భారతీయతను అవహేళన చేసే ఆత్మహత్యాసదృశమైన పోకడ మీద సంధించిన బాణం కావచ్చు. సాహిత్య లక్షణాల గురించిన తపన కావచ్చు. పానుగంటి వారి దృష్టి నభూతో నభవిష్యతి అనిపిస్తుంది. అందులో వ్యంగ్యం ఎంత బలంగా ఉంటుందో, ఆర్ద్రత కూడా అదే పాళ్లలో ఉంటుంది. అలాంటి రచయిత విశ్వరూపాన్ని దర్శింపచేస్తూ, ఆయన ఇతర రచనలను అందుబాటు లోకి తెచ్చే ప్రయత్నం స్వాగతించదగినది. ‘కథలు, స్వప్నకావ్యము, వ్యాసములు: పానుగంటి లక్ష్మీనరసింహారావు’ పేరుతో ప్రముఖ విమర్శకుడు మోదుగుల రవికృష్ణ అలాంటి ప్రయత్నం చేశారు.

పానుగంటి సాహిత్యంలో రవికృష్ణను అమితంగా ఆకర్షించిన అంశం ధారాళత అని చెప్పుకున్నారు. అదే కాదు, తను జీవించిన కాలం మీద, దాని తత్త్వం మీద పానుగంటి వారికి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. పైగా వాటికి ఎలాంటి శషభిషలు లేకుండా అక్షరరూపం ఇచ్చే సాహసం కూడా ఉంది. మనకు బొత్తిగా హాస్యచతురత లేదన్న ముద్ర కాస్తయినా తుడిచి పెట్టడానికి పుట్టిన ముగ్గురు నలుగురు రచయితలలో పానుగంటివారు అగ్రగణ్యులు. ఈ అంశాల మీద ‘మనవి మాటలు’ పేరుతో రవికృష్ణ లోతయిన అవగాహన కల్పించారు. పిఠాపురం సహా, తెలుగునాట ఉన్న వివిధ సంస్థానాలలో పానుగంటి వారి సేవలు, సాహిత్య సేవ, అందులోని విశిష్టతలను రవికృష్ణ ఘనంగానే అందించారు.

ఇందులో పదకొండు కథలు, స్వప్నకావ్యము, పద్నాలుగు వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ ఎంతమాత్రం కాలక్షేపం కోసం కాదు. ప్రతి ఇతివృత్తం గాఢమైనదే. ఆనాటి చాలామంది రచయితల మాదిరిగానే పానుగంటి వారి వ్యాసాలు కూడా సాహితీ సౌరభాలతో గుబాళించాయి. సాక్షి వ్యాసాల పరంపరలో మిగిలిపోయినవేవో ఇందులో చోటు చేసుకున్నాయని అనిపిస్తుంది. అదే శైలి. అదే వేగం, అదే నైశిత్యం.

1920లో ఆంధ్రపత్రిక సారస్వత అనుబంధంలో ప్రచురించిన కథను తొలి రచనగా ఇందులో చోటు కల్పించారు. పేరు ‘చిన్నకథ’ (పేరే ఇదా, లేకపోతే అసలు పేరు ఏమిటో తెలియదు). ఇందులో కథాంశం తమాషాగా ఉంటుంది. భర్తకు తెలియ కుండా ఒక పని చేద్దామని ఇల్లాలు అనుకోవడం, అది పని మనిషి చంద్రితో చెబుతూ ఉండగా భర్త వినడం, చివరికి వాస్తవం బయటపడడం చదువుతాం. అన్నీ ఇచ్చిన భగవంతుడు పిల్లలు ఇవ్వలేదు కాబట్టి, తన జాతకంలో తల్లి అయ్యే యోగం గురించి భర్తకు తెలియకుండా ‘నూనెగుడ్డల’ వాడిని పిలిచి (దొడ్డి తోవన) అడుగుతూ ఉంటుంది. సరే, వాస్తవం తెలుస్తుంది భర్తకి. ఈ నూనెగుడ్డల అనేది ఒక కులమట. నిజంగానే చిన్నకథ. ‘మేరీ నారాయణీయము’ మరొక కథ. ఐసీఎస్‌ ‌పరీక్ష కోసం ఇంగ్లండ్‌ ‌వెళ్లిన నారాయణరావు తిరిగి వస్తూ, ఇంగ్లిష్‌ ‌భాష, సంస్కృతులతో పాటు ఆంగ్ల ధర్మపత్నీ సమేతుడై వస్తాడు. ఇక్కడి పరిస్థితులు, నడక, మనుషులు అర్థం కాక ఆమె ఎంతగా అపోహ పడిందో ఈ కథలో చెబుతారు పానుగంటి. ‘హాస్యకథ’ శీర్షికతో ఉన్న మరొక కథ కూడా ఉంది. హాస్య రచన అన్న పేరుతో ఆ కాలంలో కనిపించిన రచనలలో ఆ లక్షణం చాలా పొదుపుగానే కనిపిస్తుంది. కానీ పానుగంటివారు ఆ స్థితిని ఆనాడే అధిగమించారు. ఒక పూటకూళ్ల ఇంటిలో ఒక వ్యక్తికి ఎదురైన అవమానానికి అతని మిత్రుడు తీసుకున్న ప్రతీకారమే ఇందులోని ఇతివృత్తం. బధిరునిలా అతడు నటిస్తాడు. చక్కని హాస్యకథ ఇది.

మన పూర్వకవుల మీద ఎన్నో అపవాదులు వేస్తుంటారు. అర్థపర్థం లేని కథలు కూడా ప్రచారంలో ఉంటాయి. ఆదికవి నన్నయ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నిజానికి ఇలాంటి అపవాదుల నుంచి ఏ మహాకవీ తప్పించుకోలేదేమో కూడా. వాటి గురించి చర్చించి, అలాంటి అపవాదులు కవుల పట్ల ఎంత అపచారమో చెబుతారు పానుగంటి, ‘స్వప్నకావ్యము’ అన్న రచనలో. దీనికే సంపాదకుని యుపోద్ఘాతము అన్న మరొక పేరు కూడా ఇచ్చారు. ఇందులో నన్నయ, తిక్కనాదుల మీద ఉన్న అపవాదుల గురించి చర్చించారు. నన్నయ భట్టారకుని కంటే ముందు అథర్వణాచార్యులు అనే ఆయన భారతం రాశాడనీ, దానిని నన్నయ గారే కుట్రతో, రాజాశ్రయం కలవాడు కాబట్టి ధ్వంసం చేయించాడని ఒక వ్యర్థ వాదన ఉంది. దానికి నన్నయ జవాబు, ‘అథర్వణాచార్యులు జైనుడు. రాజరాజే ఆ భారతాన్ని తిరస్కరించాడు. నాకు ఏ పాపం తెలియదని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు పాపం. అలాగే అంతగా ఖ్యాతి పొందని మహాకవుల కావ్యాల గురించి కూడా ప్రస్తావనలు ఉన్నాయి. కవుల గురించి, కవిత్వతత్త్వం గురించి చర్చించే వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ‘స్వప్నకావ్యము’తో పాటు, కవి, జంటకవులు, కవులకొకవిన్నపము, వచన రచన, విమర్శనా్ర గంథముల యావశ్యకత, పెద్దన తరువాతి ప్రబంధకవులు వంటి వ్యాసాలు ఇలాంటివే. ‘ప్లేటో అరిస్టాటిలులకు వాదోపవాదములు: వ్యాసుని మాధ్యస్థ్యము’ అన్న వ్యాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో సాహిత్య లక్షణాల గురించేకాక, కవి దేని పక్షం వహించాలన్న చర్చ కూడా కొద్దిగా ఉంది. కవి ఏం చెప్పాలి? కవిత్వంలో ఏం ఉండాలి? అనే అంశం మీద ప్లేటో, అరిస్టాటిల్‌లకు వివాదం వస్తే, దానిని వ్యాసభగవానుడు తీర్చడం ఇందులో ఇతివృత్తం. వ్యాసాలలో కూడా సంభాషణలు పెట్టి, విషయాన్ని మరింత గాఢంగా పాఠకులకు చేర్చే శైలి పానుగంటి వారి రచనలలో ప్రతిచోట కనిపిస్తుంది.

పాశ్చాత్య పోకడలతో మనం జారవిడుచుకున్న చక్కని వ్యాపకం పురాణ పఠనం అంటారు పానుగంటి. పురాణ పఠనం, దేశభాష అనే రెండు వ్యాసాలు చాలా దగ్గరగా ఉండి, ఇదే విషయాన్ని వివరిస్తాయి. ‘అరుంధతి మగడెవరో మన మెరుగకపోయిన తరువాత హెన్రీ ది యెయిత్‌కు ఎందరు భార్యలో తెలుసుకొననేల? చిత్రకూట పర్వతమున జాబాలి చేసిన బోధనమునకు శ్రీరామచంద్రమూర్తి ఎలా ప్రత్యుత్తరం ఇచ్చాడో మనకు తెలియకపోయినప్పుడు ప్లేటోస్‌ ‌డైలాగ్స్ ‌తలకిందులుగా అప్పచెప్పినా ఏమిటి వినియోగం? శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర సభలో రాయబారపు పలుకులు ఎంత సందర్భంగా, ఎంత సమయోచితంగా ఉంటాయో, ఎంత మధురంగా, ఎంత యుక్తియుక్తంగా ఉంటాయో ఎరగని మనకి పార్లమెంటులో (బిటిష్‌ ‌పార్లమెంట్‌లో) గ్లాడ్‌స్టన్‌ ‌గారి బడ్జెట్‌ ‌స్పీచ్‌ ‌తెలిసి ఉంటే ఏం లాభం? అని ‘పురాణపఠనము’ వ్యాసంలో ఆయన వెక్కిరించడం సబబే.

అనీబిసెంట్‌, ‌కందుకూరి వీరేశలింగం గారి జీవితాలలో ఎదురైన కీలక పరిణామాల ఆధారంగా పానుగంటి రాసిన రెండు వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. జిడ్డు కృష్ణమూర్తిని జగద్గురువును చేయాలనుకున్న అనీబిసెంట్‌కు ఎదురైన చేదు అనుభవం గురించీ, కందుకూరి జీవితంలో ఎదురైన అపవాదును గురించి వ్యాసాలివి. అనీబిసెంట్‌ను సాక్షాత్తు దేవతగా పూజించిన వాళ్లే తరువాత తూలనాడడం, బ్రిటిష్‌ ‌వ్యతిరేకుల మీద కందుకూరి కురిపించిన ఆగ్రహం గురించి కడుపు మండిన ఆయన శిష్యులే కొందరు చేసిన పనిని ఆ వ్యాసాలలో ఎంతో నిభాయింపుతో పానుగంటి నమోదు చేశారు.

పానుగంటి, ఆ కాలానికే చెందిన ఇతర రచయితలు విశేషంగా చేసిన సాహితీ కృషి ఉంది. దానిని విస్మరించడం తెలుగు వారికే నష్టం. ఒక రచయిత మొత్తం రచనలను చదివే ఓపిక లేని తరంలా మనం మిగిలి పోకూడదు.మన ఈ బద్ధకం రేపటి తరాలకు అంటుకోకూడదు. రవికృష్ణ వంటివారు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు చాలావరకు ఉపకరిస్తాయి. ఇలాంటి కృషి ఇలా కొనసాగుతూ ఉండాలని ఆశిద్దాం. అందుకు తొలి సోపానం, ఇలాంటి కొత్త ముద్రణలను కొని చదవడమే. ఇవి ఎలాగూ తప్పక చదవదగిన గ్రంథాలే కూడా.

కథలు, స్వప్నకావ్యము, వ్యాసములు:

పానుగంటి లక్ష్మీనరసింహారావు

సం: మోదుగుల రవికృష్ణ,

పుటలు: 239, వెల: రూ.200/-

ప్రచురణ: వీవీఐటి, నంబూరు,

ప్రతులకు: క్రియేటివ్‌ ‌బుక్‌లింక్స్, 98480 65658

– సమీక్ష : కల్హణ

About Author

By editor

Twitter
YOUTUBE