హక్కుల కోసం ఎంత బలంగా గొంతెత్తుతారో, అంతే బాధ్యతగా, నిబద్ధతతో విధులు, బాధ్యతలు నిర్వహించినప్పుడే ఆయా వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలకు గౌరవం పెరుగుతుంది. ప్రజల్లో వాటి పట్ల విశ్వసనీయత ఇనుమడిస్తుంది. పదికాలాలపాటు మనగలుగుతుంది. లేనట్లయితే వాటి విశ్వసనీయత ప్రశ్నార్థకమై మనుగడ ప్రమాదంలో పడుతుంది.ఏకపక్ష వైఖరి వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయి. క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, ఇరువైపులా వాదనలు వినకుండా ముందుగానే ఒక అభిప్రాయానికి రావడం ఏ సంస్థకూ మంచిది కాదు. దానివల్ల లక్ష్యం పక్కదారి పడుతుంది. దుష్ఫలితాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇండియా.
ప్రపంచవ్యాప్తంగా నియంతత్వానికి, అణచి వేతకు వ్యతిరేకంగా, మానవహక్కుల కోసం ఎలుగెత్తే సంస్థగా పేరొందిన ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ విశ్వసనీయత ఇటీవల కాలంలో ప్రశ్నార్థకంగా మారింది. దాని ఏకపక్ష విధానాలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా భారత్‌లో సంస్థ బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం స్తంభింపజేసింది. ఇది చేతులారా చేసుకున్నది తప్ప మరొకటి కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం తమ సంస్థ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహ రిస్తుందని, తమ బ్యాంకు ఖాతాల స్తంభనే ఇందుకు నిదర్శనమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అడ్డగోలు ప్రకటనలు చేస్తోంది. ప్రభుత్వ చర్యల వల్ల తమ కార్యకలాపాలను అనివార్యంగా ఆపేయాల్సి వచ్చిందని, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నామని చెబుతోంది. అయితే ఆమ్నెస్టీ వాదనను విశ్వసించే పరిస్థితి లేదు. ఒక్కసారి పూర్వాపరాల్లోకి వెళితే వాస్తవాలు కడతాయి.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆషామాషీ సంస్థ కాదు. దానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది సభ్యులు గల లాభాపేక్ష లేని ఈ స్వచ్ఛంద సంస్థ 1961లో లండన్‌లో జీవం పోసుకుంది. పీటర్ బెన్సెన్, ఎరిక్ బేకర్, లూయిస్ కుట్నర్ అత్యుత్తమ లక్ష్యాలతో దీనిని ప్రారంభించారు. 1977లో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఎంపికైంది. 2018లో భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన కుమినాయుడు సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు. గత ఏడాది డిసెంబరులో రాజీనామా చేశారు. 1966 నుంచి ఆమ్నెస్టీ భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దాదాపు అయిదున్నర దశాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న కార్యకలాపాలు హఠాత్తుగా ఎందుకు ఆగిపోయాయన్న ప్రశ్నకు ఆ సంస్థ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది. వాస్తవానికి ఆమ్నెస్టీ కార్యకలాపాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం దాని అనుబంధ సంస్థలైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్స్ ఫర్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్టు కార్యకలాపాలపైనే నిషేధం ఉంది. ఇందుకు నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. బ్రిటన్ నుంచి పొందిన రూ.51.76 కోట్ల విరాళాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోవడంతో బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం స్తంభింపజేసింది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీ ఆర్‌ఏ- ఫారిన్ కంట్రి బ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్టు) కింద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసింది. ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2013-19 మధ్యకాలంలో ఈ నిధులు వచ్చాయి. అసలు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద ఆమ్నెస్టీ సంస్థ నమోదు కాలేదని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఎప్పుడో 2000 డిసెంబరు 19న తొలిసారి ఆమ్నెస్టీ దరఖాస్తు చేసుకుందని, ఆ తరవాత పునరుద్ధరణ కోసం ప్రయత్నించలేదని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి 2009లో తరవాత 2013లో యూపీఏ (యునైటెడ్ పోగ్రెసీవ్ అలయన్స్) హయాంలోనే ఆమ్నెస్టీ కార్యకలాపాలపై అధికారవర్గాలు కన్నేసి ఉంచాయి. విరాళాల సేకరణకు సంబంధించిన అనుమతులు నిలిచి పోయాయి. గత కొంతకాలంగా సర్కారును విమర్శించడమే లక్ష్యంగా ఆమ్నెస్టీ పని చేస్తున్నదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది ఆమ్నెస్టీ సిబ్బందికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అంశంపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆమ్నెస్టీ ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దాని వాదనలో హేతుబద్ధత లేదని, తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అభాండాలు వేస్తోందని విస్పష్టంగా పేర్కొంది.
గత ఏడాది జమ్ము కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధించిన 370వ అధికరణ రద్దు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ- జాతీయ పౌర పట్టిక), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ- సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్టు), జాతీయ జనాభా పట్టిక (ఎన్ పీ ఆర్- నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) లకు వ్యతిరేకంగా ఆమ్నెస్టీ నివేదికలు ఇచ్చినప్పటికీ కేంద్రం ఏనాడూ తప్పు పట్టలేదు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో విదేశీయలను గుర్తించేందుకు ఉద్దేశించిన జాతీయ పౌర పట్టిక, దేశంలో స్థిరపడిన ఆరు మతాలకు చెందిన పౌరులకు భారతీయ పౌరసత్వాన్ని కల్పించే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ప్రాంతంలో ముస్లింలు సుదీర్ఘకాలం ఆందోళన చేసి రాకపోకలకు అంతరాయం కలిగించారు. అసోంలో అక్రమ వలస దారులుగా గుర్తించిన వారిని అప్పటికప్పుడు వెనక్కు పంపబోమని, వారు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని కేంద్ర ప్రకటించిన విషయం గమనార్హం. అంతేకాక ఈ పక్రియ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగలేదు. సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జరిగింది. నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ రాష్ట్రానికి చెందినవారే కూడా. అప్పట్లో ఈ అంశాలపై ఆమ్నెస్టీ అనేక వ్యాఖ్యానాలు చేసినప్పటికీ కేంద్రం మాట్లాడలేదు. కశ్మీర్లో మానవహక్కులు మంట గలుస్తున్నాయంటూ అదేపనిగా గగ్గోలు పెట్టినా కేంద్రం కొరడా ఝళిపించలేదు. భావప్రకటనా స్వేచ్ఛలో భాగమని సరిపెట్టుకుంది. ఇక మైనార్టీలు, దళితులు, మానవహక్కుల గురించి ఆమ్నెస్టీ అదేపనిగా మాట్లాడుతుంటుంది. రాజ్యం చేతిలో ప్రజల హక్కులు హననం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసేది. ఇంతకన్నా హాస్యాస్పదమైనది మరొకటి ఉండదు. లౌకిక దేశమైన భారత్ లో అన్ని మతాలు, వర్గాల ప్రజలు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏ వర్గం పట్ల అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించదు. అందరి పట్ల సమభావంతో వ్యవహరిస్తుంది. అన్ని వర్గాలతోపాటు బడుగు, బలహీనవర్గాలు, ఇతర మైనార్టీల హక్కుల పరిరక్షణకు పూర్తి భరోసా ఇస్తుంది. వారి హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలతో పాటు ప్రత్యేక కమిషన్లు ఉన్నాయి. ప్రజల హక్కుల పరిరక్షణకు జాతీయ స్థాయిలో మానవ హక్కుల సంఘాలున్నాయి. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి. మైనార్టీల హక్కుల పరిరక్షణకు ముస్లిం మైనార్టీ కమిషన్లు, బీసీ కమిషన్లు ఏర్పాటయ్యాయి. ఇక స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ మూలస్తంభంలా ఉంది. ప్రజల హక్కుల పరిరక్షణకు ఇది అన్నివేళలా గొడుగు పడుతుంది. తాజాగా ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాల నిలిపివేతపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. ఆరువారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు గల దేశంలో ప్రజల హక్కులు ఎంత భద్రంగా ఉన్నయో చెప్పడానికి ఇంతకన్నా మరో నిదర్శనం అక్కరలేదు.
ఈ పరిస్థితుల్లో అసలు భారతదేశంలో ఆమ్నెస్టీ సంస్థ ఆవశ్యకతే లేదన్నది విమర్శకుల వాదన. ఆమ్నెస్టీకి పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనాల్లో కనీస కార్యాలయాలు కూడా లేవన్న సంగతిక్కడ గమనార్హం. ఆయాదేశాల్లో మానవ హక్కుల హననం, దైవదూషణ పేరుతో వేధింపులు, మతపరమైన వేధింపులకు లెక్కేలేదు. పాకిస్తాన్‌లో నేతి బీరకాయ చందాన ప్రజాస్వామ్యం వర్థిల్లుతోంది. ఇక చైనా సంగతి సరేసరి. చైనాకు సంబంధించిన కార్యాలయం హాంకాంగ్ నుంచి పని చేస్తోంది. రష్యా, సిరియాల్లో కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మానవ హక్కులు ఎంత పదిలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం 150 దేశాల్లో ఆమ్నెస్టీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
భారత ప్రభ్వుత్వం తమను వేధిస్తోందని ఆమ్నెస్టీ ఆరోపించడం హాస్యాస్పదం. బ్యాంకు ఖాతాల స్తంభన వల్ల కార్యకలాపాలను నిలిపివేశామని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని, దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని ఎదురుదాడి చేస్తోంది. ఖాతాల స్తంభన పేరుతో సానుభూతి కోసం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. నిషేధించింది ఆమ్నెస్టీ అనుబంధ సంస్థలను తప్ప ఆమ్నెస్టీని కాదన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. అదే సమయంలో నిధులకు సంబంధించి నిర్దిష్టమైన సమాధానాలు చెప్పలేకపోవడం గమనార్హం. ఖాతాల స్తంభనపై ఆమ్నెస్టీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
2016లో బెంగళూరులో జరిగిన ఒక ప్రదర్శనలో ఆమ్నెస్టీ జాతి వ్యతిరేక నినాదాలు చేసిందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. ఆమ్నెస్టీ అనుచిత వైఖరి ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. అనేక దేశాలు దాని ఏకపక్ష వైఖరిపై అభ్యంతరాలు చెప్పాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ సంస్థలు వివిధదేశాల్లో పనిచేస్తున్నాయి. అవి ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా పనిచేయాలి. అంతేతప్ప తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే కుదరదు. స్థానిక చట్టాలను, ప్రభుత్వ నిబంధనలు, ప్రజల సంప్రదాయాలు, విశ్వాసాలను అవి గౌరవించి తీరాలి. అది వాటి కనీస ధర్మం. చట్టానికి ఎవరూ అతీతులు కారు. లేనట్లయితే కొత్త తలనొప్పులు ఎదురవుతాయి. సరిగ్గా ఆమ్నెస్టీకి ఇక్కడే ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆమ్నెస్టీ తీరుపై చైనా, వియత్నాం, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, కాంగో, చెక్ రిపబ్లిక్, సిరియా తదితర దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు వ్యతిరేకంగా దాని వైఖరి ఉంటుందన్నది బహిరంగ రహస్యం. సంస్థ నివేదికలు ఏకపక్షంగా, తరచూ ప్రభుత్వాలను అభిశంసించే విధంగా ఉంటాయని వాటి వాదన. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాధినేతలుగా వారి సంక్షేమం పట్ల తమకూ ఎంతో కొంత బాధ్యత ఉంటుందని, చిన్నపాటి పొరపాట్లను భూతద్దంలో చూపిస్తుందన్న ఆయా దేశాల ఆరోపణను పూర్తిగా తోసిపుచ్చలేం. గర్భస్రావాలపై ఆమ్నెస్టీ వాదనను పలు క్యాథలిక్ క్రిస్టియన్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఆమ్నెస్టీ తన వద్ద పనిచేసే కొందరు ఉద్యోగులకు భారీగా, మరి కొంతమందికి తక్కువగా జీతాలు చెల్లిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంకలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆమ్నెస్టీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం)కి మద్దతుగా ఆమ్నెస్టీ వ్యవహరించిందన్న అపఖ్యాతిని మూటగట్టుకుంది. లండన్‌లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది.
2011-17 మధ్యకాలంలో సిరియా జైళ్లలో ఖైదీలను అక్కడి ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని ఆరోపించింది. దీనిని ‘హ్యూమన్ స్లాటర్ హౌస్’గా అభివర్ణించడం పట్ల సిరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్‌లో నిరసనల పట్ల అక్కడి భద్రతాదళాలు కర్కశంగా వ్యవహరించాయని, ఫలితంగా 300మందికి పైగా మరణించారని పేర్కొంది. దీనిని టెహరాన్ ప్రభుత్వం ఖండించింది. 2020 నాటికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బడ్జెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని 2019లో నాటి సెక్రటరీ జనరల్ కుమి నాయుడు వెల్లడించారు. సంస్థ ఆర్థిక కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో చెప్పడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం. స్థూలంగా చూస్తే ఆశించిన లక్ష్యాలకు భిన్నంగా ఆమ్నెస్టీ ప్రయాణిస్తున్నదన్న అభిప్రాయం కలగక మానదు. కాలం గడిచే కొద్ది అనుభవాలతో మరింత ప్రభావవంతంగా పని చేయవలసిన అత్యున్నత సంస్థ ప్రమాణాలు పతనమవుతుండటం ప్రజాస్వామ్య వాదులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రజల హక్కులకు పట్టం కట్టాల్సిన స్వచ్ఛంద సంస్థ వాస్తవాలను విస్మరిస్తూ విమర్శలే ధ్యేయంగా ముందుకు సాగుతుండటం ఆవేదన కలిగించక మానదు. లౌకిక భావాలను, సర్వమత సమానత్వాన్ని, ప్రజాస్వామ్య భావాలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఫుణికిపుచ్చుకున్న భారత్ లాంటి దేశంలో పారదర్శకంగా కార్యకలాపాలు కొనసాగిస్తే దాని విశ్వసనీయత మరింత పెరుగుతుంది.
– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్