మాజీ రాష్ట్రపతి డా।। ప్రణబ్‌ ‌ముఖర్జీ మరణంతో భారత రాజకీయ రంగంలో ఒక జాజ్వల్యమాన తార అస్తమించినట్టయింది. ఆ రంగానికి తీరని నష్టం జరిగింది. తాము నమ్మిన రాజకీయ సిద్ధాంతాల పట్ల నిబద్ధతను నిలబెట్టుకుంటూనే, విశాల హృదయంతో,  రాజకీయ ప్రత్యర్థులతో కూడా కలిసే సంప్రదాయం, పరంపర ఆయన మరణంతో ముగిసిపోతున్నదని అనిపిస్తున్నది  కూడా. రకరకాల ఆలోచనా ధోరణులు గల వారు ఒకచోట కూడి, చర్చించుకునే  పరంపర ప్రాచీన భారతదేశంలో ఉంది. స్వాతంత్య్రం సాధించాలన్న లక్ష్యంతో  రకరకాల ఆలోచనా పరులతో కలిసే కాంగ్రెస్‌ ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయ అసహనం, సిద్ధాంతపరమైన అస్పృశ్యత వంటివి ఏవె•తే ఉన్నాయో అవన్నీ వామ పక్ష పంథా చలవే. వామపక్ష ధోరణికి భిన్నంగా ఆలోచించే వారికి వారి ఆలోచనలను, అభిప్రా యాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ అటుంచి, అసలు  జీవించే అధికారం కూడా లేదన్నట్టే ఉంటారు. ప్రపంచమంతటా వామపక్షవాదుల నడవడి, చరిత్ర ఇలాగే ఉంది.


ప్రణబ్‌ ‌ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యక్రమానికి హాజరు కావడానికి అంగీకారం  తెలపగానే ఆయన నిర్ణయాన్ని ఎందరో వ్యతిరేకించారు. సంఘ కార్యక్రమంలో పాల్గొనరాదని రకరకాల అడ్డంకులు కలిగించారు. చివరికి ప్రణబ్‌  ‌కుమార్తె కూడా ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా రంగంలో దిగారు. నిజానికి ప్రణబ్‌ ‌ముఖర్జీ గంభీరమైన వ్యక్తి. అనుభవశాలి, పరిపక్వత ఉన్న రాజకీయవేత్త.ఆయన వచ్చారంటే సంఘంలో చేరిపోతారని కాదు. తన ఆలోచనా సరళిని, అభిప్రాయాలను స్వయంసేవకుల•, ప్రజల ఎదుట ఉంచడమే ఆయన ఆశయం. నాగ్‌పూర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యాలయంలో నవీన శ్రోతల ఎదుట ఆయన పూర్తిగా తనదైన సొంత ఆలోచననే (అది కాంగ్రెస్‌ ‌భావజాలమే కావచ్చు) ఉంచబోతున్నారని వారి శ్రేయోభిలాషులు,  తెలిసినవారు గమనించి ఉండవలసింది. కానీ కాంగ్రెస్‌ ‌పార్టీ వారికి ఆయన మీద అలాంటి నమ్మకం లేకపోయింది.

నాలుగవ సర్‌సంఘచాలక్‌ ‌రజ్జు భయ్యా ప్రయాగరాజ్‌(ఉత్తర్‌‌ప్రదేశ్‌)‌కు చెందినవారు. వారికి లాల్‌బహదూర్‌ ‌శాస్త్రితో సన్నిహిత సంబంధం ఉండేది. శాస్త్రీజీ ఉత్తరప్రదేశ్‌ ‌రాజకీయాలలో క్రియాశీలురుగా ఉన్నప్పుడు ఒకసారి అప్పటి సర్‌సంఘచాలక్‌ ‌గురూజీ సమక్షంలో కొందరు ప్రముఖ వ్యక్తులతో తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. రజ్జు భయ్యా శాస్త్రిజీకి కూడా ఆహ్వానం పంపారు. అప్పుడు శాస్త్రిజీ, ‘నాకు రావాలని ఉంది కాని, రాలేను. ఎందుకంటే నేను రావడం వల్ల కాంగ్రెస్‌లో నా గురించి రకరకాల వ్యాఖ్యానాలు మొదలవుతాయి’ అన్నారు. ‘శాస్త్రీజీ! మీలాంటి వ్యక్తి గురించి కూడా వాళ్లు ఇలా మాట్లాడతారా?’ అని అడిగారు రజ్జు భయ్యా. అందుకు శాస్త్రీజీ, ‘రాజకీయాలు ఎలా ఉంటాయో  మీకు తెలియదు’ అని సమాధానం ఇచ్చారు. అందుకు రజ్జు భయ్యాజీ, ‘మా దగ్గర ఇలా ఉండదు. ఎవరైనా స్వయంసేవక్‌ ‌నన్ను మీతోపాటు చూస్తే ‘రజ్జు భయ్యా శాస్త్రిగారికి సంఘం గురించి వివరిస్తున్నారు అనే అనుకుంటారు’  అన్నారు.

ఇలాంటి విశ్వాసం తమ నాయకుని పట్ల  వారికీ ఉండాలి. తమ సిద్ధాంతం పట్ల దృఢంగా ఉంటూ, విశాల దృక్పథంతో ఇతరుల దృష్టికోణం, అభిప్రాయాలను అర్థం చేసుకోగల భావాత్మక వాతావరణమే ప్రజాస్వామ్యానికి ఆధారం.

భారత జాతీయ రాజకీయాలలో నిర్మాణాత్మక పాత్రను వహిస్తున్నవారు ఇప్పుడు కొద్దిగానే కనబడతారు. కేవల రాజకీయ నాయకులయితే చాలామందే ఉన్నారు. కానీ దేశహితమే సర్వోన్నతం అనుకునే నాయకుల స్థానంలో చాలావరకు ముఠా రాజకీయాలు, సాంప్రదాయిక, కుల, ప్రాంతీయ రాజకీయాలు లేదా కుటుంబ రాజకీయాల నుంచి వచ్చినవారే క్రియాశీలురుగా కనబడతారు. అసలు నాయకత్వ లక్షణాలన్నీ ఒకే కుటుంబంలో, వంశపారంపర్యంగా ఎలా సంక్రమిస్తాయా అనేది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా వీరంతా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెబుతు నమ్మించాలని చూస్తుంటారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీలకు చెందినవారమని చెప్పుకునే వ్యక్తులలోను, కర్తవ్య హీనులలోను, అనుభవ శూన్యులలోను నాయకత్వానికి సంబంధించిన సకల లక్షణాలు ఎలా చూడగలుగు తారు, ఎలా ఆశిస్తారు అనేది చాలా ఆశ్చర్యకరం.

అందుకే పార్టీతో, లాభనష్టాలతో సంబంధం లేకుండా ముందుకు వచ్చి దేశహితం కోసం రాజకీయ రంగంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రణబ్‌ ‌ముఖర్జీ కనుమూయడం బాధకరమైన విషయం. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు పొరుగు దేశాల గురించి తెలుసుకొని, అవగాహన పెంచుకోవడానికి భిన్నాభిప్రాయాలు ఉన్న నిష్ణాతులతో నిస్సంకోచంగా మాట్లాడేవారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికీ, సుదృఢ రాజనీతికీ ఇది ఎంతో ప్రయోజనం. అందుకని, ప్రణబ్‌ ‌ముఖర్జీ సంఘ కార్యక్రమానికి రావడానికి అంగీకరించడం, దేశహితానికి సంబంధించి సానుకూల దృష్టితో నిరంతర ప్రగతిగామి, విస్తృతమైన, విశాలత్వం కలిగిన సంస్థను చూడడం, అర్థం చేసుకోవడం, అలాంటి సంస్థకున్న ప్రాధాన్యం గ్రహించడానికి కూడా అలాంటి దృష్టి, సహనం కావాలి.కానీ ఇంతటి దృష్టిని కలిగి ఉండడం కొందరి మేధాశక్తికి మించినది.

 నెహ్రూ మంత్రిమండలిలో కె.యం. మున్షీ పనిచేశారు. సంఘం గురించి ఆయనకు ఉన్న దృష్టి ఎలాంటిది అనే వాస్తవం తెలుసుకోవడం కేవల రాజకీయవేత్తల బుద్ధికి అతీతమైనది. అది అర్థం కావాలంటే జాతీయతతో కూడిన రాజనీతి దృష్టికోణం అవసరం. సంఘం రాజకీయాల నుంచి దూరంగా ఉండాలంటూ తీసుకున్ని నిర్ణయాన్ని రాజకీయాలలో క్రియాశీలురుగా ఉంటూ కూడా సకారాత్మకంగా స్వీకరించడానికీ, అర్థం చేసుకోవడానికీ, ప్రశంసించ డానికీ కూడా అలాంటి దృష్టికోణమే అవసరమవు తుంది. మున్షీ తమ పుస్తకం ‘పిలిగ్రిమేజ్‌ ఆఫ్‌ ‌ఫ్రీడం’లో సంఘం గురించి ఇలా రాశారు.

‘‘రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అంటేనే అంటరానిదిగా భావించే కాంగ్రెస్‌ ‌వాదినయినా కూడా, నేను వారి ఊరేగింపులో పాల్గొన్నాను. వారి క్రమశిక్షణ, అంకితభావం, దృఢ నిశ్చయం, వారి నిస్వార్థ చింతన నన్ను కట్టిపడేశాయి. ఆర్థిక వెన్నుదన్ను లేకున్నా,పేరెన్నికగన్న నాయకులు లేకున్నా, వారి మధ్య నున్న భావోద్వేగం సంస్థను సమర్థంగా నడిపింది. గురూజీ ఎమ్‌ఎస్‌ ‌గోల్వాల్కర్‌ని కలుసుకున్నాను. సిద్ధాంతపరంగా, రాజకీయపరంగా ఎన్ని భేదాభిప్రా యాలున్నా, వారి అంకిత భావనను, సంఘ నిర్వహణ సామర్థ్యాన్ని, సంఘ నిర్మాణంలో వారి ప్రతిభను శ్లాఘించకుండా ఉండలేను. నా ఈ అభిప్రాయాన్ని చెప్పనీయకుండా నన్ను వెనుకకు లాగే ప్రలోభాలని పక్కన పెట్టి నేను చెప్తున్నాను.’’

‘కాంగ్రెస్‌కు ప్రణబ్‌ ‌ముఖర్జీ లాంటి వ్యక్తి అవసరం ఎప్పుడైతే అనివార్యమని అనిపించిందో, సరిగ్గా అప్పుడే ఆయన కాంగ్రెస్‌కు దూరంగా జరిగి, సంఘానికి దగ్గరయ్యారు. ప్రణబ్‌ ‌ముఖర్జీ సంఘ కార్యక్రమానికి వెళ్లడమే దీనికి సంకేతం’ అని ప్రణబ్‌ ‌ముఖర్జీ మరణానంతరం ఒక మరాఠీ రచయిత రాశారు. నాకు ఆ రచయిత మేధోశక్తి మీద జాలి కలిగింది. ప్రణబ్‌ ‌ముఖర్జీ ఎక్కడ దూరమయ్యారు?  ఆయన ఉన్నచోటనే ఉన్నారు. జాతీయ భావనలకు సంబంధించి దేశానికి ప్రథమ స్థానం ఇవ్వడమనే రాజనీతి నుండి, ప్రణబ్‌ ‌ముఖర్జీ లాంటి దార్శనికుల నుండి స్వయంగా కాంగ్రెస్‌ ‌పార్టీయే దూరమయింది. ఇది కాంగ్రెస్‌ ‌తప్పటడుగు. కాంగ్రెస్‌ ఇలానే బలహీనమైపోతున్నది. ఈ ప్రవర్తన ఇలాగే కొనసాగితే ఇంకా శక్తిహీనమైపోతుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ అం‌దరిని కలుపుకొనిపోయి డా.మున్షీ, ప్రణబ్‌ ‌ముఖర్జీల దృష్టికోణంతో ముందుకు వెళ్లాలా? లేక వామపక్షవాదులు నుండి అరువు తెచ్చుకున్న అసహిష్ణుతతో కూడిన ఆలోచనలనే ఆచరించాలా? తేల్చుకోవాలి.

ప్రణబ్‌ ‌ముఖర్జీ సంస్థలో ఉండడం వల్ల సంప్రాప్తించే విలువ ఎంతటిదో గ్రహించడానికి అలాంటి యోగ్యతే కావాలి. ముఠాతత్వాల నుంచి, స్వార్థం నుండి ఎదిగి, నీచ రాజకీయాలకు పాల్పడే వారు జాతీయతతో కూడిన రాజనీతిజ్ఞతను  ప్రదర్శించే వారి గొప్పదనాన్ని అర్థం చేసుకోలేరు. ఏనుగును వేటాడడం సింహం పని. దానిని నక్క కలలో కూడా ఊహించలేదు.

ప్రణబ్‌ ‌ముఖర్జీ సంఘ కార్యక్రమంలో పాల్గొనడంతో వచ్చిన ప్రాధాన్యాన్ని  గ్రహించలేని వారిని, కేవలం స్వార్థ రాజకీయం అనే కూపస్థ మండూక దృష్టితో చూసే వారిని ‘గజస్తత్ర న హన్యతే’ అన్న సామెతకు సరిపోయేవారిగా చెప్పవచ్చు. ఈ సందర్భాన్ని తెలిపే ఒక కథ ఉంది.

ఒక సింహం అడవిలో అనాథగా మిగిలిన ఒక నక్క పిల్లను ప్రేమతో తన వెంట తీసుకువచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ సింహానికి రెండు పిల్లలు పుట్టాయి. సింహం ఈ మూడు పిల్లలను పెంచు తున్నది. అవి అన్నదమ్ముల వలె క్రమంగా పెద్దవవుతున్నాయి. ఒకసారి పిల్లలు అడవిలో ఓ ఏనుగును చూశాయి. నక్కపిల్ల భయపడి ‘అరే! పదండి, పరుగెత్తండి! ఏనుగు వచ్చింది’ అని భయపడుతూ పలికింది. సింహం పిల్లలు మాత్రం ఏనుగు మీద దాడి చేయాలని అనుకుంటాయి. అయితే, ఏనుగు మీద దాడి చేయవచ్చుననే ఆలోచన కూడా నక్క చేయలేదు. పైగా, అది ఇంటికి వచ్చి తల్లి (సింహం)కి సోదరుల దుస్సాహసం గురించి ఆరోపణ చేసింది. ‘ఇలాంటి పిచ్చిపని గురించి, ఎవరైనా ఆలోచించ గలరా?’ అంది. దానికి సమాధానంగా సింహం నక్కపిల్లతో ‘ఓ బిడ్డా! నీవు శ•రుడవు. విద్యాబుద్ధులు గలవాడివి. చూడముచ్చటైన వాడివి. ఇందులో నీ తప్పేమీ లేదు. అయితే నీవు ఏ జాతిలో పుట్టావో ఆ జాతిలో ఏనుగును వేటాడడమనేది ఎన్నడూ జరుగలేదు. అందుకని ఏనుగును వేటాడం గురించి నీవు జీవితాంతం కూడా తెలుసుకోలేవు.’ అని చెప్పింది.

‘‘శూరో-సి కృత విద్యో-సి, దర్శని యో-సి పుత్రకః।

యస్మిన్‌ ‌కులే త్వముత్పన్నే, గజస్తత్ర న హన్యతే ।।’’

కె.యం.మున్షీ, డా।। రాజేందప్రసాద్‌, ‌డా।। రాధాకృష్ణన్‌, ‌పురుషోత్తమ దాస్‌ ‌టండన్‌, ‌డా।। ప్రణబ్‌ ‌ముఖర్జీ వంటి వారు సాగించిన జాతీయ రాజనీతి (రాజకీయ) కార్యకలాపాలను, వాటి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి అలాంటి దక్షత కావాలి. ముఠా, సాంప్రదాయిక, కుల, ప్రాంతీయ, కుటుంబ రాజకీయాలు నడిపేవారు దీనిని అర్థం చేసుకోలేరు. జాతీయతావాదాన్ని అర్థం చేసుకొని ఆచరించేవారు అధిక సంఖ్యలో తయారుకావాలి. ఇదే ప్రణబ్‌ ‌ముఖర్జీ లాంటి జాతీయనేతలకు మనమిచ్చే నిజమైన శ్రద్ధాంజలి. ప్రణబ్‌ ‌ముఖర్జీ ఇప్పుడు మన మధ్య లేరు. కాని వారి స్మృతి చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఇలాంటి వారు మళ్లీ మళ్లీ రావాలి. వృద్ధి చెందుతూ ఉండాలి.

(Pranab Mukherjee is no more. Long live pranab da. May his tribe increase and flourish.)

– డా।। మన్మోహన్‌ ‌వైద్య,

సహసర్‌ ‌కార్యవాహ,

ఆర్‌.ఎస్‌.ఎస్‌.

About Author

By editor

Twitter
YOUTUBE