అధికరణ 370 రద్దు పాకిస్తాన్‌ను ఆందోళనకి గురిచేసింది. దానితో అంతర్జాతీయంగా ఏమాత్రం పరువుప్రతిష్టలు లేకపోయినా ప్రపంచ వేదికలపై భారత్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. చైనా మద్దతుతో కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వివాదంగా మార్చడానికి విఫలయత్నం చేస్తోంది. భారత్ తీసుకున్న చర్యను ఖండిస్తూ తీర్మానం చేయాలన్న పాకిస్తాన్ మంకుపట్టును ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ OIC (Organisation of Islamic Cooperation) కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కశ్మీర్ ప్రజల తరఫున ప్రతినిధిగా తనను తాను భావించుకుంటున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇతర ప్రపంచ దేశాల మద్దతు కోసం పాకులాడటం ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌లో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేయడానికి పెద్ద ఎత్తున చొరబాట్లకు ప్రయత్నించిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని లెక్కలేనన్నిసార్లు ఉల్లంఘించింది. పుల్వామా వంటి దాడులకు తెగబడింది.
కశ్మీర్ వివాదం ద్వారా పోయిన పరువు, విలువలను కొద్దిగానైనా ఉద్ధరించుకోవాలనుకున్న ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కోసం ఆగస్ట్ 5న ‘బ్లాక్ డే’ నిరసనలు తలపెట్టారు. చైనా కుతంత్రాలను అనుసరిస్తూ జమ్ముకశ్మీర్, జునాగడ్, సర్ క్రీక్, సియాచిన్‌లను పాక్‌లో చూపించే కొత్త మ్యాప్‌లను విడుదల చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన చైనా వివాదాన్ని మరింత పెంచే విధంగా నేపాల్ ద్వారా వివాదాస్పద మ్యాప్‌లను విడుదల చేయించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రదర్శించిన ఈ ‘రాజకీయ మూర్ఖత్వం’ వల్ల భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలకు దారులు పూర్తిగా మూసుకుపోయాయి.
జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం ద్వారా ఆ ప్రాంతాన్ని సంపూర్ణంగా విలీనం చేయడమేకాక ఆ ప్రాంతంపై ఉన్న సార్వభౌమాధి కారాన్ని భారత్ ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసింది. ఇప్పుడు గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని తమ దేశంలో భాగంగా చూపడం ద్వారా చైనా, పాకిస్తాన్‌లు సంయుక్తంగా చేపట్టిన 62 బిలియన్ డాలర్ల ప్రతిష్టాత్మక ఆర్ధిక నడవా ప్రాజెక్ట్‌కు చట్టబద్దత తేవాలని ఇమ్రాన్ తంటాలు పడ్డారు. కానీ కొత్తగా తయారుచేసిన మ్యాప్‌కు ఎలాంటి చట్టబద్దత లేదు. అయినా పెద్దగా వ్యతిరేకత రాకపోవడంతో సెప్టెంబర్ 15న జరిగిన షాంఘై సహకార సంస్థ (•) సమావేశంలో పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు తాము సృష్టించిన కొత్త మ్యాప్‌ను ఎవరి అనుమతి లేకుండా ప్రదర్శించారు. ఈ విషయం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపిన భారత్, సంస్థకు సంబంధించిన నియమావళిలో పరిచ్ఛేదం 2ను పాకిస్తాన్ ఉల్లంఘించిందంటూ ఫిర్యాదు చేసింది. పాక్ చర్యకు నిరసనగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. షాంఘై సంస్థ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న రష్యా నియమాలను ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ చర్యను తప్పుపట్టింది.
భారత్‌ను అన్ని వైపుల నుంచి కమ్ముకువచ్చే కుట్రను వేగవంతం చేసేందుకు చైనా, పాకిస్తాన్‌లు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే గిల్గిత్ బాల్టిస్తాన్‌ను తమ ఐదవ రాష్ట్రంగా చేసుకోవాలన్న చిరకాల వ్యూహానికి పాకిస్తాన్ మరోసారి తెర తీసింది. తమ వ్యూహాన్ని ఏమాత్రం దాచుకోకుండా ‘గిల్గిత్ బాల్టిస్తాన్‌కు పూర్తిస్థాయి రాజ్యాంగ, ప్రాదేశిక హోదాను కల్పిస్తూ సెనేట్, జాతీయ అసెంబ్లీలో ప్రతినిధ్యం కల్పిస్తున్నామని’ సెప్టెంబర్ 16న కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ వ్యవహారాల మంత్రి అలీ అమీన్ ప్రకటించారు. ఆ విధంగా గిల్గిత్ బాల్టిస్తాన్ హోదాను పాకిస్తాన్ ప్రభుత్వం మార్చడానికి వీలులేదని, అది వివాదాస్పద ప్రాంతమంటూ 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాకిస్తాన్ ఉల్లంఘించింది.
ఆర్ధిక నడవాలో భాగంగా గిల్గిత్ బాల్టిస్తాన్‌లో కొత్త డ్యామ్‌లు, ప్రాజెక్ట్ లు చేపట్టడం కోసం భూమి సేకరించడానికి అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ అడ్డంకులను తొలగించి చైనా మార్గాన్ని సుగమం చేసేందుకు తన ‘ఉక్కు సహోదరుడు’ (×తీశీఅ తీశీ•ష్ట్రవతీ) ఆదేశం మేరకు ఆ ప్రాంతపు హోదాను మార్చడం కోసం ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఎన్నికలను ప్రకటించారు. ఆగస్ట్ 18న జరగవలసిన గిల్గిత్ బాల్టిస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు కొవిడ్ మహమ్మారి మూలంగా నవంబర్ 15కు వాయిదా పడ్డాయి. ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం ‘370 అధికరణం, పరిచ్ఛేదం 35ఏ లను రద్దు చేసిన భారత్ చర్యకు చాలా ఆలస్యంగా తీసుకున్న ప్రతిచర్య’ అని యూరోప్ ఫౌండేషన్‌కు చెందిన దక్షిణాసియా అధ్యయన సంస్థ అభిప్రాయపడింది. ‘అయితే చైనా నిరంతర ఒత్తిడి, ఆర్ధిక నడవా నిర్మాణం మూలంగా పాకిస్తాన్ ఇలాంటి చర్య తీసుకోకతప్పదు’ అని కూడా పేర్కొంది. అందరూ ఊహించినట్లుగానే పాకిస్తాన్‌లో ఇప్పుడు ఎన్నికలు త్వరగా జరిపించాలంటూ సైన్యం ఒత్తిడి తేవడం ప్రారంభించింది. అంతేకాదు కశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదంగా మార్చడానికి కూడా దీనిని అవకాశంగా వాడుకోవాలనుకుంటోంది.
భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసినప్పటికీ చైనా ఒత్తిడికి లొంగి, చైనాతో మైత్రి కోసం పాకిస్తాన్ తన విదేశాంగ విధానాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. తూర్పున జింజియాంగ్, ఆఫ్ఘనిస్తాన్ వాఖాన్ నడవా, ఖైబర్ పక్తున్ ఖ్వా (ఖ)లు కలిగిన గిల్గిత్ బాల్టిస్తాన్ అనేక విలువైన ఖనిజాలకు నెలవు. ఈ ప్రాంతంలోనే బైఫో, బాల్తోరో, బతుర వంటి అతిపెద్ద గ్లేసియర్‌లు, ఎవరెస్ట్, కంచన్ గంగా వంటి ఎత్తైన పర్వత శిఖరాలు ఉన్నాయి. ఈ ప్రాంతం గుండానే చైనా కారకొరమ్ హైవేను నిర్మించింది. జింజియాంగ్‌లోని కాష్ఘర్ ప్రాంతాన్ని, గ్వాదర్ నౌకాశ్రయాన్ని కలిపే ఈ రహదారి వల్ల ఆర్ధిక నడవా క్రింద చైనాకు అరేబియా సముద్రం వరకు నేరుగా చేరుకునే వీలు కలుగుతుంది. ఈ ప్రాంతంలో చైనాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లు, ప్రత్యేక ఆర్థిక మండళ•్ల నిర్మిస్తోంది. అలాగే తమ పెట్టుబడులను, ప్రాజెక్ట్‌లను కాపాడుకునేందుకు సైనిక బలగాలను ఇక్కడ మోహరిస్తోంది. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడని పాకిస్తాన్ సైన్యంపై ఒత్తిడి తెస్తోంది చైనా.
నాలుగు నెలలుగా సాగిన భారత, చైనా సరిహద్దు ఉద్రిక్తతల్లో తన సార్వభౌమాధికారం నిలుపుకునే సామర్ధ్యం భారత్‌కు ఉన్నదా అంటూ అనేకమంది సందేహాలు వ్యక్తంచేశారు. ఈ వివాదం మరింత నష్టానికి దారితీస్తుందంటూ ఆందోళన చెందిన వారందరికి సమాధానంగా భారత దళాలు పాంగాంగ్‌కు దక్షిణంగా ప్రధాన శిఖరాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు గిల్గిత్ బాల్టిస్తాన్‌ను తమ భూభాగంగా పాకిస్తాన్ ప్రకటించినప్పటినుంచి చరిత్రను తిరగరాసి ఆ విషయాన్ని నిజం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ‘గిల్గిత్ బాల్టిస్తాన్ హోదాను మార్చడానికి పాకిస్తాన్‌కు ఎలాంటి చట్టపరమైన అధికారం, అర్హత లేవు’ అన్న భారత్ వాదనకు సమాధానం చెపుతూ ‘గిల్గిత్ బాల్టిస్తాన్‌ను తమ భూభాగంలో కలుపుకునేందుకు భారత్‌కు ఎలాంటి అధికారం లేదు’ అంటూ ప్రచారం ప్రారంభించింది. కాబట్టి ఇలాంటి పరిస్థితిల్లో అసలు ఆ ప్రాంతపు చరిత్ర ఏమిటన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గిల్గిత్‌ను దర్డిస్తాన్ అని కూడా పిలుస్తారు. దర్డ్ భాష మాట్లాడే వారి నివాస స్థలమైన ఈ ప్రాంతం ఒకప్పుడు మౌర్య సామ్రాజ్యంలో ఉండేది. కారకొరమ్ హైవే వెంబడి బయటపడిన అశోకుని 14 శిలాశాసనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 8వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని కుషాణులు, లలితాదిత్యుడు పాలించారు. కశ్మీర్ రాజులతోపాటు టిబెటన్లు కూడా కొంతకాలం ఈ ప్రాంతాన్ని ఏలారు. గిల్గిత్ పాలకులు బౌద్ధాన్ని అభిమానించి, అనుసరించారు. 1160లో తారాఖాన్ వంశానికి చెందిన షంషేర్ దురాక్రమణతో ఇస్లాం ఈ ప్రాంతంలో ప్రవేశించింది. ఆ తరువాత 1335లో ఈ ప్రాంతంపై దండెత్తిన బదాఖాశాన్‌కు చెందిన తాజ్ మొఘల్ ఇక్కడ ఇస్లాం మతాచారాలను ప్రవేశపెట్టాడు. మధ్యయుగంలో ఈ ప్రాంతాన్ని హుంజా, నగర్, పంజాల్, యాసీన్, ఘిజర్, చిత్రాల్ పాలకులు పరిపాలించారు. ఆ తరువాత స్కర్డు, ఖపలు, షిగర్, తోల్తి మొదలైన వంశాలు పాలించాయి. 1841లో షాహ్ సికందర్‌ను చంపి గౌర్ రెహమాన్ రాజయ్యాడు. ఈ గౌర్ రెహమాన్‌ను తిరిగి ఓడించడానికి సికందర్ తమ్ముడు కరీం ఖాన్ కశ్మీర్‌కు గవర్నర్‌గా ఉన్న సిక్కు సహాయం తీసుకున్నాడు. కరీంఖాన్ ఈ ప్రాంతానికి నామమాత్రపు పాలకుడు అయ్యాడు. శ్రీనగర్‌కు తిరిగివచ్చిన నాథూ షా అధికారాన్ని మహారాజ గులాబ్ సింగ్‌కు అప్పచెప్పాడు.
వచ్చేవారం రెండో భాగం..
– డా. రామహరిత