ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే నోబెల్‌ది ఓ ప్రత్యేక స్థానం, ప్రథమస్థానం. రామన్ మెగసెసె, పులిట్జర్, బుకర్ వంటి అనేక అంతర్జాతీయ బహుమతులు ఉన్నప్పటికీ నోబెల్ తరువాతే వాటి స్థానం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది శిఖరస్థాయి బహుమతి. దీనిని అందుకోవాలని నిపుణులు, నిష్ణాతులు, శాస్త్రవేత్తలు అహరహం శ్రమిస్తుంటారు. అకుంఠిత దీక్షతో పని చేస్తుంటారు. యావత్ జీవితకాలాన్ని పణంగా పెట్టి శాస్త్రవేత్తలు పని చేస్తుంటారు. నోబెల్ బహుమతి అందుకుంటే తమ జీవితం చరితార్థమవుతుందని వారు భావిస్తుంటారు. అందువల్లే ఏటా అక్టోబరు మాసం వచ్చేనాటికి బహుమతుల ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది వైద్యం, భౌతిక, రసాయనశాస్త్రాలు, సాహిత్యం, శాంతి బహుమతులను ప్రకటించారు. ఆర్థికశాస్త్రంలో విశిష్ట సేవలు అందించిన వారికి కూడా ఈ బహుమతులను అందజేస్తుంటారు.
1901లో శ్రీకారం
నోబెల్ కమిటీ 1901 నుంచి బహుమతులు ఇవ్వడం ప్రారంభించింది. ఏటా అక్టోబరులో బహుమతుల ప్రకటన వెలువడుతుంది. డిసెంబరు 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన విలియమ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ తన పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో, ఇతర బహుమతులను స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో అందజేస్తారు. ఇది ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తుంది. ఇప్పటివరకు పది మంది భారతీయ ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకుని దేశ కీర్తి పతాకను విశ్వ వినువీధుల్లో రెపరెపలాడించారు.
కృష్ణబిలాల గుట్టు ఛేదించినందుకు..
ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ఈ ప్రతిష్టాత్మక బహుమతి బ్రిటన్‌కు చెందిన రోజర్ పెన్‌రోజ్, జర్మనీ శాస్త్రవేత్త రెయిన్ హార్ట్‌గెంజెల్, అమెరికాకు చెందిన ఆండ్రియా గెజ్‌లను వరించింది. విశ్వంలో అత్యంత నిఘూడ ఆకృతులుగా గుర్తింపు పొందిన కృష్ణబిలాల (బ్లాక్ హోల్స్) గుట్టు ఛేదించినందుకు గానూ వీరిని నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు అవార్డు కింద లభించే 11 లక్షల డాలర్లలో సగం మొత్తాన్ని ఒక్క పెన్‌రోజ్‌కు ఇవ్వనున్నారు. పాలపుంత గెలాక్సీ మధ్యభాగంలో ఉన్న భారీ కృష్ణబిలాన్ని గెంజెల్, గెజ్‌లు కనుగొన్నారు. అవార్డులో మిగిలిన సగం మొత్తాన్ని వీరు ఇద్దరూ పంచుకోనున్నారు. విశ్వంలో ప్రతి గెలాక్సీలోనూ అత్యంత భారీ కృష్ణ బిలాలు ఉన్నాయి. చిన్నపాటి బ్లాక్ హోల్స్ విశ్వమంతా అక్కడక్కడా వ్యాపించి ఉన్నాయి. వీటికి అపారమైన గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. వాటి నుంచి కాంతి సైతం తప్పించుకో లేదు. వీటలో సూర్యడికన్నా అనేక రెట్లు ఎక్కువగా ఉండే పదార్థం ఒక నగరం అంత ప్రాంతంలో కుక్కేసి ఉంటుంది. అందువల్ల వీటి సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి సమీపంలోని భారీ నక్షత్రాలనూ తమ వైపునకు ఆకర్షించి మింగేస్తాయి.
కృష్ణబిలాల ఆవిర్భావం సాధ్యమేనని గణితం సాయంతో పెన్‌రోజ్ రుజువు చేశారు. ఇందులో భాగంగా విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టెయిన్ సూత్రీకరించిన సాపేక్ష సిద్ధాంతంపై ఆధారపడ్డారు. అంతుచిక్కని ఈ ఆకృతుల ఉనికిపై ఐన్‌స్టెయిన్‌కు అంతగా నమ్మకం లేదు. అయితే కృష్ణబిలాలు ఏర్పడటాన్ని 1965లోనే పెన్‌రోజ్ రుజువు చేశారు. వాటిని సమగ్రంగా వివరించారు. 1990 నుంచి గెంజెల్, గెజ్‌ల సారథ్యంలోని రెండు బృందాలు పాలపుంత గెలాక్సీ మధ్యభాగంలో ధూళితో కూడిన ‘సాజిటేరియస్ ఏ’ భాగాన్ని పరిశోధించాయి. అక్కడి ప్రకాశవంతమైన నక్షత్రాల గమనాన్ని పటాలతో గుర్తించాయి. వీరి పరిశీలన ప్రకారం… ఆ ప్రాంతంలో అత్యంత భారీ అదృశ్య ఖగోళ వస్తువు ఒకటి చుట్టుపక్కల గల నక్షత్రాల కక్ష్యలకు మార్గనిర్దేశనం చేస్తోంది. సూర్యుడితో పోలిస్తే దీని కక్ష్య రాశి 40 లక్షల రెట్లు ఎక్కువ. కానీ ఆ పదార్థం మన సౌర కుటుంబమంత ప్రాంతంలో కుక్కేసి ఉంది. దానిని అత్యంత భారీ కృష్ణబిలంగా గుర్తించారు. ఈ పరిశోధన కోసం గెంజెల్, గెజ్‌లు అత్యంత శక్తిమంతమైన టెలిస్కోపులను ఉపయోగించారు. దట్టంగా ఉండే వాయు, ధూళి మేఘాలను చీల్చుకుంటూ పరిశోధనలు సాగించే వినూత్న విధానాలను వారు కనుగొన్నారు. ‘ఈ క్రమంలో వారు సరికొత్త పరికరాలను అభివృద్ధి చేశారు. దీర్ఘకాల పరిశోధనకు అంకితమయ్యారు. వారి కృషి కారణంగా అత్యంత భారీ కృష్ణబిలాల ఉనికిపై తిరుగులేని ఆధారాలు లభించాయ’ని నోబెల్ కమిటీ పేర్కొంది.
తొలిసారి ఇద్దరు మహిళలకు..
రసాయనశాస్త్రంలో ఫ్రాన్స్‌కు చెందిన ఎమాన్యు యెల్లై చార్పెంటియర్, అమెరికా శాస్త్రవేత్త జెన్నీఫర్ ఎ డౌడ్నాలను ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళలు పురస్కారాన్ని పంచుకోవడం ఇదే ప్రథమం. బహుమతి కింద లభించే 11 లక్షల డాలర్లను విజేతలు ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించే దిశగా ఆశలు రేకెత్తిస్తున్న అద్భుత జన్యు సాధనాన్ని వీరు ఆవిష్కరించారు. జంతువులు, మొక్కలు ఇతర సూక్ష్మజీవుల డీఎన్‌ఏలో అవసరమైన మార్పులను అత్యంత కచ్చితత్వంతో చేయగల ‘క్రిస్పర్ కాస్9’ సాంకేతికతను వీరు అభివద్ధి చేశారు. అణుకత్తెర వంటి ఈ సాంకేతికత మనుషుల్లో జన్యు లోపాల కారణంగా వచ్చే వ్యాధులు, మహమ్మారి క్యాన్సర్లను నయం చేసేందుకు భవిష్యత్తులో దోహదపడే అవకాశముంది. ఈ జన్యు సాధనలో అపరిమితమైన శక్తి ఉంది. అది మనందరిపై ప్రభావం చూపుతుంది. ఈ సాంకేతికత ప్రాథమిక విజానశాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా వినూత్నమైన పంటల ఆవిష్కరణకు కారణమైంది. అత్యంత కీలకమైన వైద్య చికిత్సల అభివృద్ధికి సైతం బాటలు పరిచిందని రసాయన శాస్త్ర నోబెల్ కమిటీ అధినేత క్లాయస్ గుస్టాఫసన్ వ్యాఖ్యానించారు. ఈ సాంకేతికత మానవాళికి గొప్ప అవకాశాలను కల్పిస్తుంది. దానిని అత్యంత జాగ్రత్తగా వినియోగించు కోవాలని ఆయన అన్నారు.
బ్యాక్టీరియాపై పరిశోధన చేస్తున్నప్పుడు ‘ట్రేసర్ ఆర్‌ఎన్‌ఎ’ అనే అణువును చార్పెంటియర్ కనుగొన్నారు. బ్యాక్టీరియాల్లోకి ప్రవేశించే వైరస్‌ల డీఎన్‌ఏను గుర్తించడడం ద్వారా రోగనిరోధక వ్యవస్థలో ఈ అణువు కీలకంగా పని చేస్తున్నట్లు గుర్తించారు. తరవాత మరో శాస్త్రవేత్త డౌడ్నాతో కలిసి 2011లో పరిశోధనలు మొదలు పెట్టారు. ఇద్దరు కలసి ట్రేసర్ ఆర్‌ఎన్‌ఏను ప్రయోగశాలలో సృష్టించారు. మొక్కలు, జంతువులు, సూక్ష్మక్రిముల డీఎన్‌ఏలపై తేలిగ్గా వినియోగించేందుకు వీలుగా దానిని తీర్చిదిద్దిన ఘనత చార్పెంటియన్, డౌడ్నాలదే. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని వేధిస్తున్న సికిల్ సెల్ అమీనియా సహా పలు వ్యాధులకు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయడంలో ఈ సాంకేతికతను వినియోగించుకోవడంపై శాస్త్రవేత్తలు ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. అత్యున్నతమైన పురస్కారానికి ఎంపికైన విషయం తెలియగానే ఉద్వేగానికి లోనయినట్లు 51 సంవత్సరాల చార్పెంటియన్ వెల్లడించారు. ఇద్దరు మహిళలు పురస్కారానికి ఎంపికవడం వల్ల మున్ముందు మరికొందరు మహిళలు ఈ రంగం వైపు అడుగులు వేసేందుకు అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను శాస్త్రవేత్తలు మానవాళి ప్రయోజనాలకు, అంతుచిక్కని గుట్టు విప్పేందుకు ఉపయోగిస్తారని ఆశిస్తున్నట్లు 56 సంవత్సరాల డౌడ్నా తెలిపారు.
మరింత ప్రోత్సాహం అవసరం!
నోబెల్ బహుమతులు పొందడంలో భారత శాస్త్రవేత్తలు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు పది మంది భారతీయ ప్రముఖులు ఈ బహుమతులు అందుకుని అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. ఆయా రంగాల ప్రముఖులు అకుంఠిత దీక్ష, కృషి ఫలితంగా నోబెల్‌ను దక్కించుకున్నారు. తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి ప్రారంభమైన 12 ఏళ్ల తరవాత, అంటే 1913లో బెంగాల్‌కు చెందిన రవీంద్రుడు దీనికి ఎంపికయ్యారు. చంద్రశేఖర వెంకట్రామన్ 1930లో నోబెల్‌ను దక్కించుకున్నారు. తమిళనాడులోని తిరుచురాపల్లిలో 1888లో జన్మించిన ఆయన సీవీ రామన్‌గా అందరికీ సుపరిచితడు. భౌతిక శాస్త్రంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. నోబెల్‌కు ఎంపికైన మూడో భారతీయుడు హరగోవింద్ ఖొరానా. వైద్యరంగంలో చేసిన ఆవిష్కరణలను గుర్తించిన కమిటీ 1968లో ఆయనను ఎంపిక చేసింది. 1979లో మదర్ ధెరెసా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. పుట్టుక రీత్యా ఆమె భారతీయరాలు కానప్పటికీ కోల్‌కతా కేంద్రంగా అనాథలకు, కుష్టు రోగులకు, నిరాశ్రయులకు ఆమె అందించిన విశేషమైన సేవలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆమె అల్బేనియా వాసి. 1983లో సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ నోబెల్‌కు ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన ఆయన భౌతికశాస్త్రంలో చేసిన విశేష కృషిని కమిటీ గుర్తించింది. ఆర్థిక రంగంలో అందించిన సేవలను గుర్తించిన నోబెల్ కమిటీ ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ను 1998లో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన ఆర్థిక రంగంలో దిట్ట. పశ్చిమబెంగాల్‌లోని శాంతినికేతన్‌లో 1933లో జన్మించారు. తరవాత సర్ విద్యాధర్‌సూరజ్ ప్రసాద్ నైపాల్ 2001లో సాహిత్య రంగంలో చేసిన విశేష సేవలకు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 1932లో ట్రినిటాడ్‌లో జన్మించారు. ఆయన భారత సంతతికి చెందినవారు. భారత్ నుంచి నైపాల్ కుటుంబం వలసవెళ్లింది. తమిళనాడుకు చెందిన వెంకట్రామన్ రామకృష్ణన్ 2009లో రసాయన శాస్త్రంలో ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. తరవాత కైలాస్ సత్యార్థి, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ 2014లో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. సత్యార్థి మధ్యప్రదేశ్‌లోని విదీష నగరానికి చెందినవారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అభిజిత్ బెనర్జీ ఆర్థిక రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా నోబెల్‌ను అందుకున్నారు. బెనర్జీ బెంగాల్‌కు చెందినవారు. బెంగాల్, తమిళనాడుకు చెందినవారే ఎక్కువమంది ఎంపిక కావడం విశేషం. ప్రతిష్టాత్మక బహుమతుల కోసం భారత శాస్త్రవేత్తల ప్రయత్నానికి ప్రభుత్వపరంగా మరింత ప్రోత్సాహం అవసరం.
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్