అక్టోబర్ 28 సోదరి నివేదిత జయంతి
మేరీ నోబెల్ తన మొదటి సంతానం కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. ఆ పుణ్యాత్మురాలు తన మొదటి బిడ్డ జన్మించటానికి ముందు ప్రసవం ఎలా అవుతుందోనని కొంత ఆందోళనపడ్డారు కూడా. సుఖప్రసవమైతే ఆ సంతానాన్ని ‘భగవంతుని సేవకు’ సమర్పిస్తానని ఆ ఇల్లాలు మొక్కుకున్నారు. మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ జన్మించింది. సిసలైన హిందువుగా, శ్రీరామకృష్ణ వివేకానందుల బోధనల వ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసింది. తల్లి మొక్కును అలా అక్షరాలా తీర్చింది. ఈమె గురువు వివేకానందుని ద్వారా నివేదిత అనే పేరును పొందింది.
వివేకానందుని ద్వారా ఏ విధంగా ప్రేరణ పొందినది 1902లో బొంబాయి ‘హిందూ లేడీస్ సోషల్ క్లబ్’లో చేసిన ప్రసంగంలో నివేదిత వెల్లడించారు. ‘‘నేను ఆంగ్ల యువతిగా పుట్టి క్రైస్తవమత భావాలతోనే నా బ్యాం గడిపాను. 18 ఏళ్ల వయసు వచ్చిన తరువాత క్రైస్తవ సిద్ధాంతాల మీద నాకు అనుమానాలు మొదలైనాయి. సత్యం తెలుసుకోవటం కోసం ఎంతో తపనపడ్డాను. ఈ సమయంలో స్వామి వివేకానందుని బోధనలతో నాకు మనశ్శాంతి కలిగింది. ఎంతో కాలంగా ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. నాకే కాదు, వివేకానందుని బోధనలు మా యూరప్‌లోని మేధావి వర్గ ఆధ్యాత్మికతృష్ణను తీర్చాయి. ఇంతవరకు చీకటిలో నడుస్తున్న బాటసారులకు జాజ్జ్యల్యమానమైన వెలుగు గోచరించింది.’’
వివేకానందునితో ఉత్తరభారత యాత్ర
వివేకానందుని పిలుపు మేరకు జనవరి 28, 1898న నివేదిత భారతదేశంలో అడుగుపెట్టారు. ఆ ఏడాది ఫిబ్రవరి 22న జరిగిన శ్రీరామకృష్ణ పరమహంస జయంతి వేడుకలలో పాల్గొన్నారు. తరువాతి మాసంలో శారదామాత దర్శనాన్ని పొందారు. 25 మార్చి వివేకానందుని ద్వారా బ్రహ్మచర్యదీక్షను స్వీకరించి ‘నివేదిత’ అన్న కొత్త పేరును పొందారు. ఆ సమయంలో వివేకానందుడు ‘‘బుద్ధుడిని అనుసరించు’’ అని ఆదేశించారు. 11మే నుండి ఆమె తన విదేశీ మిత్రురాళ్లతో కలసి వివేకానందుని నేతృత్వంలో ఉత్తరభారతదేశ యాత్ర చేశారు. నివేదితకు డైరీ రాయడం ద్వారా తన ఆలోచనలను, అనుభవాలను గ్రంథస్థం చేసే అలవాటు ఉంది. ఈ పర్యటనల వివరాలను ‘వివేకానంద స్వామితో చేసిన కొన్ని పర్యటనలు’ అనే పుస్తకంలో నిక్షిప్తం చేశారు. ఈ పర్యటనలో అల్మోరా, పాట్నా, వారణాసి, లక్నో, తేరాయ్ (బుద్ధుని జన్మప్రదేశం), నైనిటాల్, రావల్పిండి, బారాముల్లా, శ్రీనగర్, శంకరాచార్య పర్వతం, అమర్‌నాథ్ ఇలా యాత్రలు పూర్తిచేసి అక్టోబర్ 18న లాసూర నుండి కలకత్తా తిరిగి వచ్చారు. ఈ యాత్రలతో ఆయా స్థలాల చారిత్రిక విశేషాలు, ఆ స్థలాలతో ముడిపడి ఉన్న ధార్మిక కేంద్రాల ప్రాముఖ్యం సనాతనపు గొప్పతనం నివేదితకు అర్థమయ్యాయి. ఈ పర్యటన హిందూ ధర్మాన్నీ, భారతదేశాన్నీ ఆమెకు గాఢంగా ప్రేమించటం నేర్పాయి. కలకత్తా తిరిగి వస్తూనే కొన్ని నెలలపాటు శారదామాత ఇంటిలో గడిపారు. ఆ ఇంటిలో శారదామాత తోపాటు గోలాప్- మా, గోపాలేర్- మా, జ్యోగీన్- మా, లక్ష్మీ దీదీ వంటి మహిళలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రాచీన ఆధునిక భారతీయ మహిళల జీవనశైలి అర్థమైంది. పరిశీలన, లోతైన అధ్యయనం, చక్కని వక్తృత్వం, ఆమె విశిష్టగుణాలు. వివేకానందుని సోదర శిష్యుల ద్వారా హిందూధర్మం గురించి అనేక విషయాలు తెలుసుకున్నారు.
కాళీమాత పూజలో
‘కాళీమాత, కాళీపూజ’ అనే అంశాలపై నివేదిత చేసిన ప్రసంగాలు అత్యద్భుతం. తరువాత కాలంలో ‘కాళీమాత కథ’ అనే పుస్తకాన్ని చిన్నపిల్లల కోసం రాశారు. అందులో ఆమె శైలిని గమనించండి.
‘‘ప్రియమైన చిన్నారీ! నీకు జీవితంలో గుర్తున్న మొట్టమొదటి విషయం ఏమిటి? అమ్మఒడిలో పడుకుని అమ్మ కళ్లలోకి చూస్తూ నవ్వటమే కదా! నీవు ఎప్పుడైనా అమ్మతో దాగుడుమూతలాట ఆడావా? అమ్మ కళ్లు మూసుకున్నప్పుడు అక్కడ పాప ఉండదు. ఆమె కళ్లు తెరిచినపుడు అక్కడ పాప ఉంటుంది. ఆ తరువాత పాప కళ్లుమూసుకున్నప్పుడు అమ్మఏది? మళ్లీ కళ్లుమూసి తెరిచినపుడు ‘అదిగో అమ్మ’.
‘‘నా చిట్టితల్లి ! దేవుడు కూడా అలాగే ఉంటాడని కొంతమంది అనుకుంటారు. ఆ మహాతల్లి ఎంత గొప్పదంటే ఈ పెద్ద ప్రపంచం అంతా ఆమెకు సంతానమే! ఆ మహామాత ఈ ప్రపంచంతో ఆటలాడుతోంది. ఆమె కళ్లుమూసుకుని ఉన్నప్పుడు… ఆమెను మనం ఏమని అంటాం? ఆమెను మనం కాళీ అని పిలుస్తాం. అలాగే ఓ చిట్టితలీ! ఈ మహామాత కాళీ అన్నిచోట్లా ఉంటుందని గుర్తుంచుకో!’’ ఇలా సాగింది ఆ పుస్తకం. మరొక సంవత్సరానికి వివేకానందుడు ఆమెకు హిందూ బ్రహ్మచారిణి దీక్ష ఇచ్చారు. ‘‘ఏపని చేసేటప్పుడైనా కాళీమాతను స్మరించుకో. నిన్ను కాళీమాతకు సమర్పిస్తున్నాను’’ అని అన్నారు.
దేశంలో, విదేశాలలో విస్తృత ధర్మప్రచార పర్యటన
1899లో ఆరునెలలపాటు, 1907లో రెండు సంవత్సరాలపాటు సోదరి నివేదిత విదేశాలలో విస్తృతంగా పర్యటించారు. 1903 నుండి 1910 వరకు విదేశాలలో ఉన్న కాలం మినహా మిగిలిన కాలమంతా తన పాఠశాలను చూసుకుంటు దేశమంతటా పర్యటించారు. అనేక సభలలో ప్రసంగించారు. హిందూధర్మాన్ని వివరించే అనేక విషయాల మీద ‘భారతీయ స్త్రీల ఆదర్శాలు’ అనే అంశం మీద, ఇలాంటి ఎన్నో అంశాల మీద అనేక ప్రసంగాలు చేశారు. అప్పటికే పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ ప్రచారకులు హిందూధర్మంపై, హిందూ జీవన విధానంపై, దుష్ప్రచారం చేశారు. నివేదిత ఈ విమర్శలను అనేకసార్లు ఎదుర్కోవలసి వచ్చింది. నివేదిత ప్రసంగాలు శక్తిమంతంగా, ఉత్తేజకరంగా ఉండేవి. అవి క్రైస్తవమత సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొడుతూ వారికి పెను సవాళ్లుగా పరిణమించాయి. ఆమె ప్రసంగాల పట్ల అక్కసుతో ఆమె చెప్పేవన్నీ అసత్యాలని నిరూపించటం కోసం 1901లో ఒక క్రైస్తవ యువకుడ్ని నివేదితకు ఎదురు మాట్లాడమని కోరారు. కాని వారు హతాశులయ్యే విధంగా నివేదిత చెప్పిందంతా నిజమేనని, ఐరోపా చేరినప్పటి నుండి తాను క్రైస్తవుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని ఆ క్రైస్తవ వక్త చెప్పాడు. ఈ ఘటన 1901 ఫిబ్రవరిలో లండన్‌లో జరిగింది.
పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ సంస్థలు హిందూ ధర్మంపై చేస్తున్న దుష్ప్రచారానికి జవాబుగా ‘తోడేళ్ల మధ్యలో గొర్రెపిల్లలు’ (లామ్స్ ఎమాంగ్ ఉల్వస్) అనే పేరుతో వ్రాసిన వ్యాసం ‘వెస్ట్ మినిస్టర్ గెజిట్’ అనే పత్రికలో ప్రచురితమైంది.
బుద్ధగయ దర్శనం
సోదరి నివేదిత మూడుసార్లు బుద్ధగయను దర్శించారు. మొదటిసారి వివేకానందునితో దర్శించారు. తరువాత మరో రెండుసార్లు దర్శించారు. కొందరు పాశ్చాత్య బౌద్ధ భిక్షువులు కొన్ని వివాదాలను సృష్టించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘బౌద్ధమతం హిందూమతం కంటే భిన్నమైన మతంకాదు, హిందూమతానికి వ్యతిరేకం కూడా కాదు. హిందూమత సంఘం అనే ఒక విశాలమైన వక్షస్థలంలో తలదాచుకున్న అనేక మతాలలో బౌద్ధం కూడా ఒకటి. బుద్ధుడు ఒక హిందూ బోధకుడే. ఆ కాలంలోని సాధువుల కంటే ఉన్నతుడు, పవిత్రుడు. ఆయన శిష్యులు హిందూ సంఘపు పరిధిలోనే మెలిగారు. తమను తాము ఒక కొత్త తెగగా ప్రకటించుకోలేదు. హైందవులుగా ఉన్నప్పటికి వారికన్నా మరింత పవిత్రమైన విశ్వాసం గల జీవితాన్ని గడిపేవారుగా తమను తాము భావించుకున్నారు. హిందూమతం అనే సమ్మేళనానికి బుద్ధగయ ఒక ప్రతీక. ఈ పరమ పవిత్రస్థలాన్ని మతవర్గాల మధ్య కొట్లాటలో ఆటబొమ్మగా మార్చటం ఎంతమాత్రం పనికిరాదు’’ అని అన్నారు.
రచనలు – ప్రసంగాలు
సోదరి నివేదిత అనేక పుస్తకాలు రచించారు. ‘శివ – బుద్ధా’ ప్రేమ మరణాల మధ్య ఒక భారతీయ అధ్యయనం, పరాక్రమిక హిందూమతం, భారతీయ జీవజాలం, ఒక ప్రాచ్య గృహంలో చేసిన కొన్ని అధ్యయనాలు, భారత చరిత్ర అడుగుల సవ్వడి, హిందూ ఉయ్యాల కధలు, హిందువుల బౌద్ధుల పురాణ కథలు, మతము – ధర్మము, పౌర ఆదర్శాలు, జాతీయ ఆదర్శాలు, భారత జాతీయ విద్యావిధానానికి కొన్ని సూచనలు వాటిలో కొన్ని. ‘భారతీయ జీవజాలం’ అనే పుస్తకంపై 1904, 24 ఆగష్టున ‘క్వీన్’ అనే లండన్ పత్రిక పుస్తక సమీక్షలో ఇలా వ్యాఖ్యానించింది.
‘తమ భారతీయ సోదరీమణుల గురించి తెలుసుకోవాలని వివిధ పుస్తకాలు చదివే పశ్చిమ దేశ స్త్రీలందరూ నివేదిత పుస్తకాన్ని చదివిన తరువాత వారి అభిప్రాయాలన్నింటినీ మార్చుకోక తప్పదు. కేవలం క్రైస్తవ మత సంస్థల దయారహిత ఏకపక్ష ప్రచారాలను విని ఏర్పరచుకున్న ముందస్తు అభిప్రాయాల ద్వారా పాండిత్య ప్రతిభతో పరిశోధకులు రాసే దురవగాహ్యమైన గ్రంథాల ద్వారా ఆంగ్లో ఇండియన్స్ అసందర్భ ప్రలాపాల ద్వారా, మన సామ్రాజ్యపు భాగమే అయినా భరతఖండంలోని స్త్రీల గురించి మనం ఏర్పరచుకున్న పొరపాటు అభిప్రాయాలను రమ్యమైన కవిత్వంతోను, బుధజన రంజకమైన పాండిత్యంతోను నివేదిత రచించిన ఈ అద్భుతమైన పుస్తకంతో మార్చుకోకతప్పదు!’
1904లో బ్రహ్మానందస్వామి వివేకానందుని జీవిత చరిత్రను రాయమని కోరగా సోదరి నివేదిత ‘నా దృష్టిలో నా గురుదేవులు’ రాశారు. ఈ పుస్తకం రాయటానికి 5సంవత్సరాలు పట్టింది. ఈ పుస్తకాన్ని 1911 జనవరిలో హిబ్బర్ట్ జర్నల్‌లో సమీక్షించారు. అందులో, ‘ఈ పుస్తకాన్ని అన్ని మతాలకు సంబంధించిన మేటి గ్రంథాల సరసన నిలబెట్టవచ్చు. ఏ అరలో ‘కన్‌ఫెక్షన్స్ ఆఫ్ సెయింట్ అగస్టీన్’’ (సెయింట్ అగస్టీన్ ఒప్పుకోళ్లు), సబాటియర్ సెయింట్ ఫ్రాన్సిస్ జీవితకథ మొదలైన మహోన్నత గ్రంథాలను ఉంచుతామో, అదే అరలో ఈ ఉద్గ్రంథాన్ని కూడా ఉంచవచ్చును.’ అని పేర్కొన్నారు.
కలకత్తాలో ఉన్నంతకాలం సోదరి నివేదిత శారదామాతను కలుస్తుండేవారు. 80 సంవత్సరాల వయస్సు ఉన్న గోపాలేర్ మాను అంతిమ దశలో తనవద్దే ఉంచుకుని రెండుసంవత్సరాలు సేవచేశారు.
మహాశ్వేతగా
సోదరి నివేదిత నిర్వర్తించవలసిన సామాజిక కార్యక్రమాల దృష్ట్యా ఆమెకు వివేకానందుడు సన్యాస దీక్ష ఇవ్వలేదు. వివేకానందుడు 1902లో సమాధి పొందిన తరువాత వారి చితి ప్రక్కనే ఆమె నిలబడ్డారు. ఆ సమయంలో చితి మీద ఉన్న పైభాగంలో ఒక కాషాయవస్త్రం ఆమెకు కనబడింది. ఆమె వెంటనే శారదానంద స్వామితో, ‘ఆ వస్త్రం కూడా కాలిపోతుందా? ఈ అంగవస్త్రాన్నే నేను స్వామీజీ చివరిసారి ధరించగా చూశాను!’ అని అన్నది. శారదానంద స్వామి వెంటనే, ఆమెకు ఆ వస్త్రాన్ని ఇవ్వబోయారు. కానీ అలా తీసుకోవడం బాగుండదేమో అన్న ఉద్దేశంతో నివేదిత నిరాకరించారు. ఆ నిమిషంలో నివేదిత తన ప్రియ స్నేహితురాలైన జోసెఫిన్ మెక్‌లౌడ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ‘ఆమెకు ఈ వస్త్రంలో కొంత భాగాన్ని ఇవ్వగలిగితే ఎంత బాగుంటుందో కదా!’ అనుకున్నారు.
సాయంత్రం 6 గంటల వరకూ కూడా నివేదిత అక్కడే, చితి ప్రక్కనే కూర్చొని ఉండిపోయారు. ఎవరో భుజాన్ని పట్టి లాగినట్లు అనుభూతి కలిగి క్రిందికి చూశారు. అంతా నల్లని మసిగా మారిపోయినా, దానిలోనుంచి అదే అంగవస్త్రంలోని చిన్న ముక్క ఒకటి ఆమె కాళ్లవద్ద పడి ఉంది. నివేదిత ఎంతో భక్తితో, వివేకానందుని జ్ఞాపక అవశేషంగా, ఆ పవిత్ర వస్త్రాన్ని గ్రహించారు. జీవితాంతం భద్రంగా ఉంచుకున్నారు. కాషాయ వస్త్రాలు ధరించకపోయినా ‘మహాశ్వేతగా’ దేశంలో, విదేశాలలో హిందూధర్మం కోసం సోదరి నివేదిత చేసిన ప్రసంగాలు, రాసిన పుస్తకాలు, హిందువులలో నూతన ధార్మిక, సామాజిక, జాగృతిని కలిగించాయి. ‘వివేకానందుని మానస పుత్రిక’గా శారదామాత ఆమె సేవలను కొనియాడారు. తల్లి మేరీ మొక్కులను సోదరి నివేదిత అక్షరశః తీర్చుకున్నారు.
– కె.శ్యామ్‌ప్రసాద్, అఖిల భారతీయ కన్వీనర్,
సామాజిక సమరసతా వేదిక