సాగు ఉత్పత్తులకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాల మీద వివాదం చెలరేగింది. ఏ వివాదాన్నయినా నిర్లక్ష్యం చేయకుండా అందులోని సద్విమర్శను పరిశీలించడం అవసరం. ఇలాంటి వాస్తవిక దృష్టి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నదనే చెప్పాలి. సెప్టెంబర్‌ 27‌వ తేదీన ప్రసారమైన  మాసాంతపు ‘మన్‌ ‌కి బాత్‌’ ‌కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం. ఈ మూడు బిల్లుల మీద ఒక వర్గం రైతాంగం గురించి ఆయన ప్రస్తావించారు. 2014లో తమ ప్రభుత్వం తెచ్చిన చట్టంతో  పండ్లు, కూరగాయల రైతులు లబ్ధి పొందారని, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాని చెప్పారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా సాగు రంగం బలోపేతమైందనీ, ఈ సమయంలో రైతులు ఎంతో కీలక పాత్ర వహించారని కూడా ప్రధాని చెప్పడం హర్షణీయం. ఈ దేశానికి అన్నదాతలే వెన్నెముకలని ఆయన ప్రకటించిన సంగతిని  కూడా చెప్పుకోవాలి. రైతాంగానికి ఇటీవలి దశాబ్దాలలో ఇంతటి గౌరవ ప్రదమైన సంబోధన దక్కలేదు.

ప్రభుత్వం ఏ రంగం గురించి ఏ చట్టం చేసినా గలాభా సృష్టించడమే పనిగా పెట్టుకున్న కొన్ని విపక్షాల మాట ఎలా ఉన్నా, ఆ మూడు కొత్త చట్టాలు రైతు సంక్షేమం కోసమే అంటూ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న మాటలను కూడా గమనించవలసి ఉంటుంది. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం పట్టించుకోదన్న విమర్శలు సత్యదూరమే అవుతాయి. ప్రతి అంశాన్ని రాజకీయ కోణం నుంచి చూడడం సరికాదు. కాబట్టి ఇంత వరకు రైతాంగం అభివృద్ధికి, వారి ఆదాయం రెట్టింపు చేయడానికి చేపట్టిన పథకాలు గురించి గుర్తు చేసుకోవాలి. తరువాత ఆ మూడు చట్టాలు, బాగోగుల గురించి తెలుసుకోవాలి. అలాగే మూడు బిల్లుల మీద విపక్షాలు, లేదా ఒక వర్గం రైతన్నలు లేవదీస్తున్న సందేహాలను కూడా ప్రస్తావించుకోవాలి.

మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కర్షకులను వదిలిపెడుతుందా? మిగతా జీవనోపాధుల మీద దాడి చేసినట్టే సేద్యం మీద కూడా ప్రభావం చూపిందని మామూలుగా చెబుతున్నారు. కానీ రైతాంగం మీద ఆ మహమ్మారి దాడిని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. మొత్తంగా చూస్తే వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మన దేశంలో ‘కరోనా’ వల్ల జనజీవనం అతలాకుతలమైంది. కార్మిక రంగంలో, పరిశ్రమలలో, వ్యవసాయ తదితర రంగాల్లో ‘లాక్‌డౌన్‌’‌తో ఎక్కడి పనులు అక్కడ స్తంభించిపోయాయి. లాక్‌డౌన్‌ ‌సడలింపుతో క్రమేపి కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. జనజీవనం స్తంభించి పోవడంతో, ఉత్పత్తులు / ఉత్పాదకతలు నిలిచిపోవడంతో పలు దేశా ఆర్థికవ్యవస్థలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. వ్యవసాయ ఆధారిత భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా తయారైనప్పటికి, వ్యవసాయరంగ కార్యక్రమాలు క్రమేపి పెరుగుతున్నందున ఆర్థిక పరిస్థితి త్వరగా పుంజుకొంటుందనటంలో సందేహం లేదు. వలస కార్మికులతో పాటు పలు రంగాల్లో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న వేళ వ్యవసాయ/ గ్రామీణ స్థాయిల్లో జరిగిన ఉపాధి కల్పనతో కొంత మేరకు జీవనానికి సానుకూలత ఏర్పడటం సంతోషించ దగినదే. మన ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఆర్థిక ప్రగతి పురోగమనానికి తక్షణ చర్యలను చేపట్టాయి. గ్రామీణ ప్రాంత కార్మికులకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో జీవనోపాధి కల్పించటం ముదావహం. ఇందుకు సుమారు రూ. లక్ష కోట్ల వరకు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీనితోపాటు వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలకు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు తదితర అనుబంధ రంగాలకు మరో రూ. 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ ‌కేటాయించి, ఆయా కార్యక్రమాలను ముమ్మరం చేసి తద్వారా ఆర్థిక పురోభివృద్ధికి దోహదం చేయటం కేంద్ర ప్రభుత్వ దక్షతకు తార్కాణం.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకే కాదు, ఎన్నో నిత్యావసరాలకు వ్యవసాయరంగమే కీలకమైనది. అదే వ్యాపకంపై ఆధారపడివున్న (65శాతం) ప్రజల ఆర్థిక స్థితిగతులను పెంపొందించేందుకు వ్యవసాయమే శ్రీరామరక్ష. దేశ ఆర్థిక పరిపుష్టికి, శాంతియుత, గ్రామీణ జన జీవనానికి వ్యవసాయరంగమే కీలకం గనుక, వ్యవసాయదారుల ఆర్థిక పరిపుష్టికి తగినంత చేయూతనిచ్చేందుకే ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలతో, తగిన కార్యాచరణలతో ముందుకు వెడుతున్నాయి. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాలనే సత్ససంకల్పంతో పథకాలను అమలు చేస్తున్నారు కూడా. సెప్టెంబర్‌ 27 ‌నాటి మన్‌ ‌కి బాత్‌ ‌మాటలను ఇక్కడ కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. 2014 నాటి వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ (ఏపీఎంసీ) చట్టంతో లబ్ధి పొందిన హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ ‌రైతుల అనుభవాలను ప్రధాని గుర్తు చేశారు. పంట ఉత్పత్తులను విక్రయించే దశలో వీరికి దళారుల బెడద తప్పిందని ఆయన చెప్పారు. ఇంతకాలంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమాలలో దళారుల పీడ వదిలించడం కూడా ఒకటి. అలాంటి స్వేచ్ఛ ఇప్పుడు వరి, గోధుమ రైతాంగానికి రానున్నదని ఆయన అంటున్నారు.

మెట్ట ప్రాంత బంజరు భూముల్లో సోలార్‌ ఉత్పత్తి కేంద్రాలను స్థాపింపచేసి, స్థానిక అవసరాల సామర్థ్యానికి మించిన విద్యుత్‌ను గ్రిడ్‌ అనుసంధానం చేసి ఆ విద్యుత్‌ను విక్రయించటం ద్వారా, వ్యవసాయ దారులకు ఆర్థిక వెసులుబాటును కల్పించే పని ప్రారంభించి వారికి చేయూతనందించారు. సాగునీటి సౌకర్యాలను పెంపొందించేందుకు 20 లక్షల సోలార్‌ ‌పంపులను ఏర్పాటుచేసారు, మరో 15 లక్షలకు సోలార్‌ ‌ద్వారానే నీటిసౌకర్యం కల్పించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. అలాగే పూర్తిగా సేంద్రీయ వ్యవసాయానికి దోహదం చేసే సహజ పద్ధతులను ప్రవేశపెట్టారు. ఇలా రైతులకు అవసరమైన పెట్టుబడులు, పంట రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచి సకాలంలో ఇన్‌పుట్స్, ‌సలహాలను అందజేస్తూ, నీటి సౌకర్యాలను వీలయినంతవరకు పెంపొందిస్తూ, అటు సాగునీరున్న ప్రాంతాల్లోగాని, మెట్ట ప్రాంతాల్లోగాని, పంట దిగుబడులను గణనీయంగా పెంచే దిశగా పలు చర్యలను ప్రభుత్వం చేపడుతున్నది. ఇలా దిగుబడు లను పెంపొందిస్తూ, తగిన ప్రతిఫలం రైతులు పొందాలంటే, వారి ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు, మార్కెట్‌ ‌వ్యవస్థల ద్వారా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలను తీసుకున్నపుడే వీలవుతుంది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను సాగు ఖర్చు కన్నా 50శాతం అధికంగా నిర్ణయించి అమలు చేస్తున్నది. ఈ సాహసోపేత నిర్ణయానికి మొదటిసారి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది. అప్పటి నుండి కేంద్రం క్రమంగా ఏటా కనీస మద్దతులను కొద్దికొద్దిగా పెంచుతున్నది. ఇక్కడే ఇంకొక అంశం కూడా కేంద్రం పరిగణనలోనికి తీసుకోవడం అవసరమని అనిపిస్తుంది. కనీస మద్దతు ధరలను సాగు వ్యయం కన్నా 50 శాతం ఎక్కువగా నిర్ణయిస్తున్నారు. కానీ, ఆ సాగు ఖర్చుకు సంబంధించి అన్ని అంశాలు సమగ్రంగా తీసుకోలేదని, ప్రభుత్వం నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధరలు గిట్టుబాటు కాదని చెప్పవలసి ఉంటుంది. అది వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంది. ప్రధానమంత్రి గతంలో హామీ ఇచ్చినట్లు ప్రతి అంశాన్ని (భూమి కౌలు + సాగు ఖర్చు actual G familylabour G interest on crop loan) పరిగణలోనికి తీసుకొని నిజ సాగుఖర్చును నిర్ణయించాలి. దానిపై 50శాతం అధికంగా కనీస మద్దతు నిర్ణయిస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు అర్థిస్తున్నారు. తమ విన్నపాలను, వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని, కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో చర్యలను చేపడుతుందని వ్యవసాయదారులు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. వ్యవసాయంలో తగిన ప్రతిఫలం లేకనే నేటి గ్రామీణ యువత (30శాతం) పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇది దేశ వ్యవసాయ ప్రగతికి మంచి పరిణామం కాదు. ప్రభుత్వం గ్రామీణ యువతను వ్యవసాయం వైపు మళ్లించాలని ‘ఆర్య’ (arya – Attracting and Retaining Youth in Agriculture) పథకాన్ని (Pilot Schem)) కొన్ని జిల్లాల్లో కృషివిజ్ఞాన్‌ ‌కేంద్రాల ద్వారా ప్రయోగాత్మకంగా చేపట్టింది. తగిన ప్రతిఫలం దక్కే విధంగా పరిస్థితులను మారిస్తే, గ్రామీణ యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతుంది. కొన్ని అంచనాల ప్రకారం 75శాతం గ్రామీణ యువత ఉపాధి ఉద్యోగాల కోసమే వెళ్తున్నారని అంచనా. రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయటంలో ప్రముఖ పాత్ర పోషించేది వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ము కోవటం, లేదా కొనుగోలు చేయటం (మార్కెట్‌ ‌వ్యవస్థ ద్వారా). దీనికి ఇంత ప్రాముఖ్యం ఉంది గనుకనే కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ ‌వ్యవస్థను ప్రక్షాళన చేసి, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభ్యమయ్యేందుకు పలు మార్కెట్‌ ‌సంస్కరణలను తీసుకొస్తున్నది.

స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ‌సంఘాలను (Agriculture Produce Market committee) ఇతర రాష్ట్రాలతో అనుసంధానించి, మార్కెట్‌ ‌ధరవరలను ఎప్పటికప్పుడు ఉత్పత్తిదారులకు తెలియజేస్తూ, ఎక్కడ డిమాండ్‌ ఉన్నదీ, ఎంత ధర పలుకుతున్నదీ వంటి వివరాలు తెలియజేస్తూ గిట్టుబాటు ధరకు పంట ఉత్పత్తులను అమ్ముకొనే విధంగా చేయడానికి e-NAM ద్వారా వెసలుబాటు కల్పిస్తున్నది. ఇప్పుడిప్పుడే రైతులు కొద్దికొద్దిగా, e-NAM (Electronic – National Agriculture Market) పరిధిలోనికి వస్తున్నారు. e-NAM వ్యవస్థను పూర్తిగా అవగాహన చేసుకుంటున్న ప్రస్తుత సమయంలో కేంద్రం నూతనంగా మూడు వ్యవసాయ మార్కెటింగ్‌ ‌బిల్లులను ఆమోదింప చేసింది.

ఈ బిల్లుల్లో మొదటి అంశం: రైతులు వారు పండించిన పంట ఉత్పత్తులను; స్థానిక మార్కెట్‌ ‌కమిటీల పరిధిలోనే గాక, దేశవ్యాప్తంగా ఎక్కడ గిట్టుబాటు (మంచి) ధర లభ్యమవుతుందో అక్కడ అమ్ముకొనే వీలు కల్పించారు. తద్వారా మంచి ధరను పొంది రైతులు లబ్ధి పొందగలరని ప్రభుత్వ అభిప్రాయం. ఈ లావాదేవీలు ఆన్‌లైన్‌ ‌పద్ధతిలో జరిపి స్థానిక మార్కెట్‌ ‌కమిటీతో సంబంధం లేకుండా కూడా చేసుకొనే స్వేచ్ఛ కూడా ఉంది. ఇలా జరిపిన లావాదేవీలకు స్థానిక కమిటీలకు చెల్లించినట్లు మార్కెట్‌ ‌ఫీజు, సెస్‌ ‌స్థానిక రుసుములు చెల్లించనవసరం లేదు. ఈ పద్ధతి ద్వారా స్థానిక APMC’s గుత్తాధిపత్యం పోయి స్వేచ్ఛతో, లాభసాటిగా రైతులు లావాదేవీలు జరుపుకునే స్వాతంత్య్రం ఉంది కాబట్టి కనీస మద్దతు ధరకు మించి మంచి ధర వస్తుందని ప్రభుత్వ నమ్మకం. అదే ఒకే దేశం ఒకే మార్కెట్‌ ‌విధానం.కానీ, దేశంలో హెచ్చు శాతం సన్నచిన్నకారు రైతులే. వారు పండించిన ఉత్పత్తులు కూడా తక్కువ పరిమాణంలోనే ఉంటాయి. కాబట్టి వారు పెద్ద రైతులు / ఇతరులతో పోటీపడి నెట్టుకురాగలరా అన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.

రెండో బిల్లు ప్రకారం- రైతులు ఉత్పత్తులు పొందడానికి ముందే, అంటే పంట సాగులో ఉన్నపుడే ఒడంబడిక మేరకు ఎంత ధరకు అమ్మాలో ముందుగానే నిర్ణయించి మార్కెట్‌ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా అదే ధరకు అమ్ముకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇరువురికి అంగీకారమైన ధరను ముందుగానే నిర్ణయించుకుని అమ్ముకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి పరస్పర అంగీకారంతో ఒక ఒప్పందం చేసుకుని, లావాదేవీలు జరుపుకోవటం. ఒక విధంగా ఇది contract farmup మాదిరిగా అన్నమాట.

ధర నిర్ణయంపై నిర్దిష్ట ప్రామాణికాలు లేవు గనుక, కార్పొరేట్‌ ‌వ్యవస్థలను సామాన్య రైతు ఎదుర్కొని నిలదొక్కగలడా? గిట్టుబాటు పొందగలడా అన్నది ఇక్కడ సందేహం.

మూడవది – నిత్యావసర వస్తువుల జాబితా నుండి ధాన్యాలను, పప్పుధాన్యాలను, వంటనూనెలను, ఉల్లిపాయలను, బంగాళాదుంపను తొలగించటం వల్ల, మార్కెట్‌లో ధరలవరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయోనని ఆందోళన పడడం అనవసరం.

ఈ బిల్లుల విషయంలో ప్రభుత్వ ధ్యేయం, చిత్తశుద్ధి, సంకల్పం ఒక్కటే – రైతులందరికి మంచి గిట్టుబాటు ధర కల్పించాలని, వారు పండించిన పంటలను సకాలంలో మార్కెట్‌ ‌చేసుకోవాలని. ఆ దిశగా కేంద్రం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి రైతు సంక్షేమానికి పథకాలను అమలుచేసి తన నిజాయితీని నిరూపించుకుంటున్నది. అదేవిధంగా ఈ బిల్లుల ప్రవేశంతో కూడా రైతులకు మేలు చేకూరాలనే సత్సంకల్పం ప్రభుత్వానికి ఉంది. అందుకు తగిన విధంగా ఆచరణయోగ్యమైన చర్యలను చట్టరీత్య చేసి ఒకే దేశం – ఒకే మార్కెట్‌ ‌విధానాన్ని అమలుచేయాలని సంకల్పిస్తున్నది. గనుక రైతులు, ఇటువంటి విధానాలను స్వాగతించాలి. ఆచరణలో ఇబ్బందులుంటే ప్రభుత్వం మళ్లీ కొత్త సంస్కరణల ద్వారా పరిష్కరించేందుకు తగిన చర్యలను తీసుకుంటుందని ఆశించవచ్చు.

ప్రస్తుత మార్కెట్‌లో పంట ఉత్పత్తుల అమ్మకంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు వరి ధాన్యం తీసుకుంటే, ప్రస్తుత కనీస మద్దతు ధర (Grade – A ) రకం (క్వింటాలు) రూ. 1888/ + Grade Common రూ. 1868/. కానీ వడ్లు కొనేటపుడు మార్కెట్‌ ‌యార్డులు కొన్ని నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధర చెల్లించవలసిన అవసరం ఉంది.

కానీ కనీస మద్దతు ధర చెల్లింపులో దళారీలు, మార్కెట్‌ ‌వ్యవస్థలోని వర్తకులు ఈ ప్రామాణికాలను సాకుగా చూపి, కనీస మద్దతు కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంటారు. ఈ ప్రామాణికాలపై రైతులకు ఇతర వ్యాపార వర్గాలకు సమస్యలు ఎదురైనపుడు జిల్లా సంయుక్త కలెక్టరు ఆధ్వర్యంలో రాజీ కుదుర్చుకుని ఇరువురు లావాదేవీలు జరుపుతుంటారు. ఒడంబడిక ప్రకారం ఒకరిద్దరివరకు పాటించి, హెచ్చుమంది రైతులు తీసుకొచ్చిన వరి ధాన్యానికి నాణ్యతా ప్రమాణాలు ఉన్నప్పటికి, కనీస మద్దతు ధర ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, మార్కెట్‌ ‌లోనికి తెచ్చిన తర్వాత రైతు వెనుకకు తీసుకుపోలేడు గనుక తక్కువ ధరకే తీసుకుని బిల్లు మాత్రం కనీస మద్దతు ధరకే రాసుకుంటుంటారు. ఈ లోపాలను సరిదిద్దుకుని రైతులు తీసుకొచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను ఆయా ప్రామాణికాలను దృష్టిలో ఉంచికొని, రైతులకు న్యాయబద్ధంగా కనీస మద్దతు ధరను చెల్లించే విధంగా అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. అలాగే ఉత్పత్తులకు వీలయినంత త్వరగా చెల్లింపులు చేస్తేనే రైతుల మనుగడకు ఆస్కారం ఉంటుంది. తద్వారా ప్రభుత్వం ఆశించినట్లు ‘రైతుకు రెట్టింపు ఆదాయం’ ఆశయం నెరవేరుతుంది.

–  ప్రొ।। పి. రాఘవరెడ్డి : వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

About Author

By editor

Twitter
YOUTUBE