పేద దేశం భారత్‌ ‌పార్లమెంట్‌లో 795 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనభయ్‌ ‌శాతం కోటీశ్వరులే. కోటీశ్వరులు లోక్‌సభలో ఎక్కువా? రాజ్యసభలో ఎక్కువా? దీనికి సమాధానం వెంటనే చెప్పడం కష్టం. పోటాపోటీగా ఆ సభలకు ఎన్నికవుతున్నారు. వందల కోట్లవారు కాబట్టి అత్యున్నత చట్టసభకు వచ్చారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కొన్ని రాష్ట్రాలలో శాసనసభ్యులు, ముఖ్యమంత్రులు కూడా కోట్లకు పడగలెత్తడంలో ఘనతను చాటుకున్నవారే. మన ముఖ్యమంత్రులలో దాదాపు తొంభయ్‌ ‌శాతం కోటీశ్వరులు. పార్లమెంట్‌ ‌పారిశ్రామికవేత్తలతో నిండిపోతోంది. వందల కోట్ల ఆస్తులు ఉన్నవారితో వెలిగిపోతోంది. వీరిలో మూడు నాలుగు కోట్ల నుంచి వేయి  కోట్లకు బీభత్సంగా పడగలెత్తినవారు ఉన్నారు. ఇలాంటి సభకు నాయకుడు మాత్రం సొంత కారు కూడా లేని సాధారణ పౌరుడు. దాదాపు ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఆస్తి నాలుగు కోట్ల రూపాయలు లోపు. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి. ఇప్పుడు రెండవసారి భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజాభిమానమే ఆయనకు తరగని ఆస్తి అని అర్థమవుతుంది.

ఇక్కడ కోటీశ్వరులు అంటే, పాతకాలపు లెక్క కాదు.ఈ సరికొత్త కోటీశ్వరులు నాలుగు కోట్లకో, లేదా ఐదు కోట్లకో పొదుపుగా పడగలెత్తిన వారు మాత్రం కాదు. రాజకీయనేతలలో వందకోట్లకు పడగలెత్తిన ధనికుల క్లబ్‌ ‌కూడా ఉంది. దీని సభ్యుల సంఖ్య వేగంగానే పెరుగుతున్నది. అందులో చేరడానికి పోటీ పడుతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.

2013లో సవరించిన లోక్‌పాల్‌ ఆస్తుల ప్రకటన చట్టం కింద ప్రధాని మొదలు, మంత్రి మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వేతర (రూ. 10 లక్షల విదేశీ నిధులు దాటినవి) సంస్థల నిర్వాహకులు తమ ఆస్తులను ప్రకటించాలి. తరువాత ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. దీని ప్రకారం పైన ప్రస్తావించిన వారంతా తమ పై వారికి తమ ఆస్తులు, రుణాల వివరాలు అందచేయవలసి ఉంటుంది. అంటే ఒక ఎంపీ తన ఆస్తులు, అప్పుల వివరాలను స్పీకర్‌ ‌లేదా చైర్మన్‌కు అందించాలి. ప్రజా ప్రతినిధుల ఆస్తుల వివరాలు పారదర్శకంగా ఉండడం అనివార్యమే. అందులో ఆస్తుల వివరాల ప్రకటన తొలి అడుగు అవుతుంది. అయితే ఇందులో అందరూ వాస్తవమైన వివరాలు అందిస్తారని భరోసా ఉందా? లేదు. అయినా కొంతలో కొంతలో మేలు. కానీ, సాధారణ పౌరునికి తను ఓటు వేసి గెలిపించిన నాయకుడి ఆర్థిక స్థితిగతులను తెలుసుకో వాలని కోరుకునే హక్కు ఉండాలి. రాజకీయ నాయకుల, పార్టీల జవాబుదారీతనం ముమ్మాటికీ దీనితో ముడి పడి ఉంది. ప్రజాస్వామ్య సౌధం నాలుగు కాలాల పాటు పటిష్టంగా ఉండడానికి అనుకూలించే అవకాశం కూడా ఇది కల్పిస్తుంది.  నేతల ఆస్తులు ప్రకటించడమనే ఉత్తమ సంప్రదాయాన్ని గౌరవిస్తున్న పార్టీగా బీజేపీని అంతా చూస్తారు.

 రాజకీయ నాయకులంటే కోట్లకు పడగలెత్తు తారన్న అభిప్రాయం జనస్వామ్యంలో నెలకొంది. అడ్డగోలుగా ఆస్తులు సంపాదిస్తారని, రెండు చేతులా సంపాదించి వెనకేస్తారని, తరాలకు సరిపడా పోగు చేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇక అధికార పార్టీ అయితే చెప్పనవసరం లేదు. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతున్న వారి గురించి అయితే ఈ అభిప్రాయం మరింత బలంగా ఉంటుంది. ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చలేం. అలా అని  అన్ని కాలాలకు వర్తింప చేయలేం కూడా. దశాబ్దాలపాటు ఢిల్లీలో, రాష్ట్రాల్లో చక్రం తిప్పిన పార్టీల నేతలు కొందరు ఈ కోవలోకి రావచ్చు. అదే సమయంలో అందరినీ ఒకే గాటన కట్టి కూడా చూడలేం. సర్వసాధారణ వ్యక్తిగా రాజకీయాలలోకి వచ్చిన వారు పదేళ్లలోనో, మరీ అదృష్టం బాగున్నవారు ఐదేళ్లలోనే కోట్లకు అధిపతులైన వారు కూడా లేకపోలేదు. డబ్బు సంపాదించడం నేరమని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. కోటీశ్వరులంతా అక్రమ సంపాదనపరులేనని తీర్పు ఇవ్వడమూ సరికాదు. కానీ రాజకీయాలలో కేవలం కొన్నేళ్లలో కోట్లకు పడగలెత్తితే ఆ ధనం మూలాలనూ, విశ్వసనీతను శంకించక తప్పదు.

ఈ నేపథ్యంలోనే వెలువడిన నరేంద్ర మోదీ ఆస్తుల ప్రకటన ఈ దేశంలో అతిసామాన్యునికి కూడా అత్యున్నత పదవిని అప్పగించడంలో ప్రజాస్వామ్యం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించే దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. అందుకే మోదీ, చాలావరకు ఆయన మంత్రివర్గ సభ్యుల ఆస్తులు గమనించిన తరువాత కొన్ని విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా విలువలకు, సిద్ధాంతాలకు పట్టం కట్టే భారతీయ జనతా పార్టీ మిగిలిన పార్టీలతో పోల్చినప్పుడు రాజకీయాలను ధనమయం చేయడంలో భిన్నమైన పంథాలో పయనించడానికే ప్రయత్నం చేస్తున్నది.

ఆ పార్టీ ఆస్తులు పెరగవచ్చేమో గానీ నాయకుల ఆస్తులు అనూహ్యంగా పెరగడం, అందులోని నేతలు వందల, వేల కోట్లకు అధిపతులు కావడం పార్టీ చరిత్రలో లేదు. 1996లో కొన్ని రోజులు, 1998 నుంచి 2004 వరకు, 2014 నుంచి నేటివరకు కమలం పార్టీ ఢిల్లీలో చక్రం తిప్పినప్పటికీ, పలు రాష్ట్రాలలో అధికారం చేపట్టినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. గుజరాత్‌లో దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగుతున్నా ఎలాంటి అవలక్షణాలు అలవడ లేదు.

తాజాగా ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు వెల్లడించిన ఆస్తుల వివరాలు చూసి దేశం ఆశ్చర్యపోతున్నది. మోదీ ప్రధానిగా, ఆయన సహచరులు కేంద్ర మంత్రులుగా చక్రం తిప్పుతున్న ప్పటికీ వారి ఆస్తుల పెరుగుదల నామమాత్రంగానే ఉండటం గమనార్హం. అధికారాన్ని ప్రజా సేవకు వినయోగించడమే తప్ప, వ్యక్తిగతంగా ఆస్తులు పోగేసుకోవడానికి కాదన్న సిద్ధాంతాన్ని గౌరవించా లన్న కనీస విలువ ఇందుకు కారణమని చెప్పక తప్పదు. అటల్‌ ‌బిహారీ వాజపేయి హయాం నుంచి నేటివరకు భాజపా ప్రస్థానాన్ని నిశితంగా గమనించి నట్లయితే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.


పార్టీల ఆస్తులు

కొద్దికాలం క్రితం ఏడు రాజకీయ పార్టీలు తమ ఆస్తులను ప్రకటించాయి.అవి- బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, బీఎస్‌పీ, టీఎంసీ. ఏడీఆర్‌ ‌ప్రకారం బీజేపీ, సీపీఐ, బీఎస్‌పీల ఆస్తులు పెరిగాయి. అదే సమయంలో కాంగ్రెస్‌, ‌నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీల ఆస్తులు తరిగాయి. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల వివరాల ప్రకారం కాంగ్రెస్‌ ఆస్తులు శరవేగంగా తగ్గుతున్నాయి. కాంగ్రెస్‌ ఆస్తులు రూ.854.75 కోట్లు (2016-17) నుంచి రూ. 724.35 కోట్లకు (2017-18) పడిపోయాయి. అంటే 15.26 శాతం.  ఎన్‌సీపీ ఆస్తులు అదే కాలంలో రూ.11.41 కోట్ల నుంచి రూ. 9.54 కోట్లకు తగ్గాయి. అంటే 16.39 శాతం. బీఎస్‌పీ ఆస్తులు రూ.680.63 కోట్ల నుంచి 716.72 కోట్లకు పెరిగాయి. బీజేపీ ఆస్తులు రూ. 1,213.13 కోట్ల నుంచి రూ.1,485.35 కోట్లకు పెరిగాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా కొద్దిగా ఆస్తులు పెంచుకున్నాయి. సీపీఎం ఆస్తులు రూ.463.76 కోట్లు (2016-17) నుంచి రూ. 482.1 కోట్లకు పెరగగా, సీపీఐ ఆస్తులు రూ. 10.88 కోట్ల (2016-17) నుంచి రూ.11.49 (2017-18) కోట్లకు చేరాయి.


ఇంతకంటే ముందు దేశంలో బీజేపీయేతర పార్టీల నేతల ఆస్తుల గురించి ఒక్కసారి అవలోకిద్దాం. ఇవన్నీ నామినేషన్‌ ‌పత్రాలతో కలిపి ఇచ్చిన అఫిడవిట్‌లలో, లేదా అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమాక్రటిక్‌ ‌రిఫార్మస్ (ఏడీఆర్‌) ఇచ్చిన లెక్కలే. అన్నీ కూడా పలు ప్రముఖ జాతీయ, ప్రాంతీయ దినపత్రికలలో వెలువడినవే.

ప్రస్తుత 17వ లోక్‌సభలోని మహా ధనికులైన మొదటి ఐదుగురు సభ్యులలో ముగ్గురు భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందినవారే. మిగిలిన ఇద్దరూ- ఆంధప్రదేశ్‌కు చెందిన వారు కావడమే విశేషం. ఒకరు వైసీపీకి, ఇంకొకరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా జాతీయ పార్టీల నేతలతో సమంగానే కోటీశ్వరులమని అనిపించుకుంటున్నారు.

ఇంతకీ లోక్‌సభలోని కోటీశ్వరులలో మొదటి మూడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ ఎం‌పీల అధినేత్రి సోనియా గాంధీ ఆస్తుల విలువ ఎంత? 2019 ఎన్నికల సమయంలో రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చిన అఫిడవిట్‌ ‌ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ. 11.82 కోట్లు. కానీ, హాఫింగ్టన్‌ ‌పోస్ట్ ‌వరల్డ్ అనే వెబ్‌సైట్‌ ఇచ్చిన వివరాలు ఈ లెక్కకు ఆమడ దూరంలో ఉన్నాయి. ఆ వివరాలనే ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక డీఎన్‌ఏ ఆ ‌మధ్య ప్రచురించింది. ఒక అభిప్రాయం ప్రకారం ఆమె ఇంగ్లండ్‌ ‌రాణి రెండో ఎలిజిబెత్‌ ‌కంటే, మొనాకో యువరాజు కంటే ఎక్కువ ఆస్తిపరురాలు. ఇంకా సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసాద్‌ ‌కంటే కూడా సోనియా ధనవంతురాలు. ఆమె ఆస్తుల విలువ రెండు బిలియన్‌ ‌డాలర్లని ఆ వెబ్‌సైట్‌ అం‌చనా కట్టింది. అంటే దాదాపు రూ. 90,000 కోట్లు. ప్రపంచంలోనే ధనికులైన రాజకీయవేత్తలలో 12వ స్థానాన్ని ఆ వెబ్‌సైట్‌ ‌సోనియా గాంధీకి కేటాయించింది.

చాలామంది భారత రాజకీయ నాయకుల ఆస్తులు లెక్కించుకుంటూ వెళితే ఆ చిట్టా హనుమంతుని తోకతో పోటీకి వచ్చే అవకాశం ఉంది. సాధారణ ప్రజల కళ్లు చెదిరిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాంగ్రెస్‌కు ఈ విషయంలో ఇప్పటికీ అగ్రతాంబూలమే ఉన్నప్పటికీ కొందరు ఇతర పార్టీల నేతలు కూడా తాము తక్కువేమీ కాదని నిరూపించారు. ఉదాహరణకి ఒకనాటి బాలీవుడ్‌ ‌నటి, నేటి ఎంపీ జయా బచ్చన్‌. ఈమె ఒకటిన్నర దశాబ్దానికి పైగా సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో నామినేషన్‌ ‌దాఖలు చేసినప్పుడు ఆమె నమోదు చేసిన ఆస్తి విలువ రూ. 500 కోట్లు. కానీ 2018లో మరొకసారి రాజ్యసభకు వచ్చినప్పుడు రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చిన అఫిడవిట్‌లో చూపించిన ఆస్తి విలువ రూ. 1,000 కోట్లు.  కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్‌ ‌మను సింఘ్వి. కాంగ్రెస్‌ ‌తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన ఆస్తుల విలువ విషయంలో ప్రతి సర్వే ముక్తకంఠంతో ఒకే అంకె వెల్లడించింది. ఆయన ఆస్తుల విలువ రూ. 860 కోట్లు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కురుక్షేత్ర (హరియాణా) లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన నవీన్‌ ‌జిందాల్‌ ఆస్తి విలువ రూ. 308 కోట్లు. అప్పుడు ఆయననే అత్యంత ధనికుడైన ఎంపీగా భావించేవారు. కానీ ఆయన రికార్డు తొందరలోనే పటాపంచలైపోయింది. ఆయన జిందాల్‌ ‌గ్రూప్‌నకు చెందిన పారిశ్రామికవేత్త. ఓపీ జిందాల్‌ ‌విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌. ‌గతంలో తెలంగాణకు చెందిన కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా ధనిక ఎంపీగా పేరు ఉండేది. ప్రస్తుతం శివసేన తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్‌కుమార్‌ ‌ధూత్‌ ఆస్తుల విలువ రూ 289 కోట్లు. గతంలో ఎంపీ టి. సుబ్బరామిరెడ్డి ఆస్తుల విలువ రూ. 258 కోట్లు. ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆస్తుల విలువ రూ. 217 కోట్లు. ఆయన టీఆర్‌ఎస్‌ ‌సభ్యుడు. జిందాల్‌ ‌గ్రూప్‌నకే చెందిన సావిత్రి జిందాల్‌ ‌హరియాణా శాసనసభకు కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఈమె ఆస్తుల విలువ రూ 436 కోట్లు. కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ ‌సభ్యుడు అనిల్‌ ‌హెచ్‌ ‌లాద్‌ ఆస్తుల విలువ రూ. 289 కోట్లు. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌శాసనసభకు చెందిన తకం పెరియో తగార్‌ ఆస్తి విలువ రూ. 200 కోట్లు. ఈయన కూడా కాంగ్రెస్‌ ‌పార్టీయే. కర్ణాటకు చెందిన డికె శివకుమార్‌, ఆం‌ధప్రదేశ్‌కు చెందిన నందమూరి బాలకృష్ణ ఆస్తులు కూడా వందల కోట్లలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల వివరాలు చూడాలి.

 తాజాగా మోదీ, ఇతర కేంద్రమంత్రులు ఈ ఏడాది జూన్‌ 30 ‌వరకు గల తమ ఆస్తులను వెల్లడించారు. ప్రధాని మోదీకి తనకంటూ సొంత వాహనం లేదు. ఒక్క బ్యాంకు నుంచీ కనీసం రుణం తీసుకోలేదు. ఆయన చేతిలో ఉన్న నగదు కేవలం రూ. 31,450. ప్రధాని ఆస్తుల విలువ రూ.2.85 కోట్లు. ఇందులో చరాస్తుల విలువ రూ.1.75 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన ఆస్తుల విలువ రూ. 36 లక్షలు మాత్రమే. ప్రధానిగా నెలవారీ వచ్చే రూ.2 లక్షల జీతం తప్ప మరో ఆదాయం లేకపోవడం విశేషం. గాంధీనగర్‌ ‌భారతీయ స్టేట్‌ ‌బ్యాంకులో నగదు, జీవిత బీమా, జాతీయ పొదుపు పత్రాలు తప్ప చెప్పుకోదగ్గ ఆదాయం లేదు. 45 గ్రాముల విలువ గల నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. గాంధీనగర్‌ ‌సెక్టార్‌-1‌లో 3,531 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇందులో మోదీతో సహా మరో ముగ్గురికి వాటా ఉంది. ప్రధానిగా వచ్చే నెలసరి జీతమే ఇప్పటికీ ఆయన ప్రధాన ఆదాయ వనరు. సాధారణ వ్యక్తిగా ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ‌డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం వల్లనే ఆస్తుల్లో ఆ మాత్రమైనా కొద్దిపాటి పెరుగుదల కనపడింది. అంతేతప్ప మరో కారణం కాదు. ప్రధాని వ్యక్తిగత ప్రవర్తన, నడవడిక, జాగ్రత్త, సాధారణ వ్యక్తిగా పొదుపు చేయడం చూసిన తరవాత ఆయన వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది. కేవలం కష్టార్జితాన్ని నమ్ముకోవడం, దురాశకు దూరంగా ఉండటం, న్యాయమైన, చట్టబద్ధమైన పద్ధతుల్లో ముందుకు సాగడం, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి సగటు మనిషి అనుసరించే విధానం. మోదీది కూడా ఇదే పంథా. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా రెండు దశాబ్దాల పాటు నిరంతరాయంగా అధికారంలో ఉన్నప్పటికీ న్యాయబద్ధంగా జీవించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు పార్టీ సేవకు, తరవాత ప్రజాసేవకు అంకితమవడం ఆయన చిత్తశుద్ధిని చాటుతోంది.

 ప్రధానే కాదు, ఆయన మంత్రివర్గ సహచరుల ఆదాయాల్లోనూ చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవడం విశేషం. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా ఆస్తులు పెరగకపోగా తగ్గడం గమనార్హం. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ. 32.3కోట్లు కాగా, ఈ ఏడాది జూన్‌ ‌చివరి నాటికి రూ.28.63 కోట్లకు పడిపోయింది. షేర్‌ ‌మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడుల విలువ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. అమిత్‌ ‌షా పేరిట సొంత రాష్ట్రం గుజరాత్‌ ‌లో 10 స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన చేతిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నగదు రూ.15,814 మాత్రమే అంటే నమ్మడం కష్టమే. కానీ ఇది నూరు శాతం నిజం. ఒక్క అమిత్‌ ‌షాయే కాదు ఇతర కేంద్రమంత్రుల ఆస్తుల్లోనూ చెప్పకోదగ్గ పెరుగుదల నమోదు కాలేదు.

కేంద్ర ఆర్థికమంత్రిగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను రూపొందించే నిర్మలా సీతారామన్‌ ఆస్తి కూడా నామమాత్రమే. ఆమె ఆస్తి విలువ కేవలం రూ. 1.33 కోట్లు. 315 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, పాతకాలం నాటి ఓ బజాజ్‌ ‌చేతక్‌ ‌స్కూటర్‌…ఇవీ ఆమె ఆస్తులంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కాంగ్రెస్‌ ‌హయాములో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన పళనియప్పన్‌ ‌చిదంబరం వంటి వారి ఆస్తులకు నిర్మల ఆస్తులకు హస్తిమశకాంతరం ఉన్న విషయం విదితమే. ఇద్దరూ తమిళనాడు వాసులు కావడం గమనార్హం. ఆర్థిక నేరాల కేసుల్లో చిదంబరం జైలుకెళ్లి వచ్చిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆయన కుమారుడు కార్తీ చిదంబరం సైతం కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. చిదంబరంతో పాటు భార్య నళినీ, కుమారుడు కార్తీ సుప్రసిద్ధ న్యాయవాదులు. 90వ దశకంలో ఆర్థికమంత్రిగా చక్రం తిప్పిన చిదంబరం చెన్నై కేంద్ర కార్యాలయంగా గల ఇండియన్‌ ‌బ్యాంకు దివాలాకు కారకుల్లో ఒకరన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. పెద్దగా ప్రజాబలం లేనప్పటికీ శివగంగ నియోజకవర్గం నుంచి చట్టసభకు మిత్రపక్షాల మద్దతుతో గెలిచిన చిదంబరం గాంధీ కుటుంబ అండతో ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం గుజరాత్‌ ‌నుంచి ఎగువసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

 మరో కేంద్రమంత్రి నిత్యానంద రాయ్‌ ‌రూ.11.91 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. నాలుగు వాహనాలు, 12 ఆవులు, 13 గేదెలు ఉన్నాయి. సికింద్రాబాద్‌ ‌నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ ‌రెడ్డికి కూడా చెప్పుకోదగ్గ ఆస్తులు లేవు. ఆయన ఆస్తుల విలువ రూ.3.61 కోట్లు. 1995 నాటి మారుతీ వాహనం ఉంది. ఐక్యరాజ్య సమితిలో గతంలో శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన పౌరవిమానయాన మంత్రి హరదీప్‌ ‌సింగ్‌ ‌పూరీకి జెనీవాలోని యూఎస్బీ బ్యాంకులో ఖాతా ఉంది. ఐరాసలో అసిస్టెంట్‌ ‌సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన ఆయన భార్య లక్ష్మికి కూడా అక్కడే ఖాతా ఉంది. జెనీవాలో వీరికి ఒక అపార్టుమెంట్‌ ఉం‌ది. దీనిని రుణంపై కొనుగోలు చేశారు. గతంలో ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా, విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యన్‌ ‌జై శంకర్‌కు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. ఆయన ఆస్తి రూ. 2.11 కోట్లు. కేంద్రమంత్రుల్లో సంపన్నుడు ఒక్క పీయూష్‌ ‌గోయల్‌ ‌మాత్రమే. చార్టర్డ్ ఎకౌంటెంట్‌ అయిన గోయల్‌ ‌ప్రస్తుతం రైల్వే మంత్రిగా ఉన్నారు. పీయూష్‌ ఆస్తి విలువ రూ.78.27 కోట్లు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఆస్తి విలువ రూ.4.97 కోట్లు. మరో కేంద్ర మంత్రి మఖ్తార్‌ అబ్బాస్‌ ‌నక్వీకి తూర్పు ఢిల్లీలోని మయూర్‌ ‌విహర్లో ఒక షాప్‌ ఉం‌ది. జార్ఖండ్‌కు చెందిన కేంద్ర మంత్రి అర్జున్‌ ‌ముండా ఆస్తి నామమాత్రమే. మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి గడ్కరీ ఆస్తి రూ.2.97 కోట్లు. రూ.15.98 కోట్లతో ఆయన భార్య సంపన్నురాలుగా ఉన్నారు. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ఆస్తులు రూ.3.97 కోట్లు.

 పదిహేడో పార్లమెంటులో ఎంపీల పరంగా చూసినా భాజపా ఎంపీల ఆస్తులు తక్కువే. మూడువందలకు పైగా గల కమలం ఎంపీల్లో 265 మంది (88 శాతం) కోటీశ్వరులు. ఒకప్పటి భాజపా మిత్రపక్షమైన శివసేనకు చెందిన 18 మంది ఎంపీలూ కోటీశ్వరులే కావడం గమనార్హం. హస్తం పార్టీకి చెందిన 51 మంది ఎంపీల్లో 43 మంది (96 శాతం) కోట్లకు పడగలెత్తారు. 23 మంది ఎంపీలు గల తమిళనాడుకు చెందిన డీఎంకే కూడా ఈ విషయంలో వెనకబడి లేదు. ఆ పార్టీకి చెందిన 22 మంది (91 శాతం) కోటీశ్వరులే. బెంగాల్‌ ‌కు చెందిన 22 మంది టీఎంసీ ఎంపీల్లో 20 మంది ఆస్తులు కోట్లల్లోనే ఉన్నాయి. ఆంధప్రదేశ్‌కు చెందిన 22 మంది వైకాపా ఎంపీల్లో 19 మంది (86 శాతం) ఆస్తులు కోట్ల రూపాయల పైనే. అంటే 2014 నుంచి అధికారంలో ఉన్న భాజపా కంటే అధికారంలో లేని కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీల ఎంపీల ఆదాయమే అధికంగా ఉండటం గమనార్హం. భాజపాకు, ఇతర పార్టీలకు గల తేడా ఇదే. ఈ విషయాన్ని గణాంకాలు స్పష్టంగా చాటుతున్నాయి.


మానిక్‌ ‌సర్కార్‌, ‌యోగి

రాష్ట్రాలలో…

రెండేళ్ల క్రితం ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌వెల్లడించిన వివరాల ప్రకారం మన రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులు ఇలా ఉన్నాయి. వీటిని ఏడీఆర్‌తో పాటు నేషనల్‌ ఎలక్షన్‌ ‌వాచ్‌ అం‌దించింది.

ఆంధప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆస్తి విలువ రూ. 177 కోట్లు. దేశంలోనే ఆయనను అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి (నాడు)గా పేర్కొనేవారు. తరువాతి స్థానాలలో అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి పెమా ఖందు (రూ. 129 కోట్లు), పంజాబ్‌ ‌

చంద్రబాబు, జగన్‌

ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌ ( ‌రూ. 48 కోట్లు) ఉన్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ఆస్తుల విలువ  రూ. 416 కోట్లు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆస్తుల విలువ  రూ. 15 కోట్లు. ఏడీఆర్‌ ‌సర్వే ప్రకారం ఒకనాటి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్‌ ‌సర్కార్‌  అత్యంత పేద ముఖ్యమంత్రి. ఆయన ఆస్తుల విలువ రూ. 26 లక్షలు. తరువాతి స్థానాలలో మమతా బెనర్జీ (రూ.26 లక్షలు), ముఫ్తీ మెహబూబా (రూ. 55 లక్షలు) ఉన్నారు. దేశంలోని పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆస్తుల విలువ రూ. 95 లక్షలు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ‌యాదవ్‌ ఆస్తుల విలువ రూ. 8 కోట్లు. మధ్యప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ఆస్తి విలువ రూ. 6 కోట్లు.


 దేశంలో అత్యధిక ఆదాయం గల ఎంపీల్లో మొదటి అయిదుగురు బీజేపీయేతర పార్టీల వారే ఉన్నారు. అత్యధిక ఆస్తులు గల ఎంపీ నకుల్‌నాథ్‌. ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన మధ్యప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి కుమారుడే నకుల్‌ ‌నాథ్‌. ఆయన ఆస్తులు రూ.660 కోట్లు. గత ఎన్నికల్లో చింద్వారా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. అనేక సంస్థలకు నకుల్‌ ‌నాథ్‌ ‌సారథ్యం వహిస్తున్నారు. అత్యధిక ఆస్తులు గల రెండో ఎంపీ వసంతకుమార్‌. ‌తమిళనాడులోని కన్యాకుమారి నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన రూ. 417 కోట్లు తన ఆస్తులుగా అఫిడవిట్లో చూపారు. రూ.338 కోట్ల ఆస్తులతో మూడో సంపన్న ఎంపీగా నిలిచిన డీకే సురేష్‌ ‌కూడా హస్తం పార్టీ నాయకుడే కావడం గమనార్హం. ఆయన బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రూ.325 కోట్ల ఆస్తులతో ఆంధప్రదేశ్‌కు చెందిన వైకాపా ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. బ్యాంకు రుణాల దుర్వినియోగానికి సంబంధించి ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆయన సంస్థలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసింది. రూ.325 కోట్ల ఆస్తులతో గల్లా జయదేవ్‌ అయిదో సంపన్న ఎంపీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన గత ఏడాది ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎన్నికయ్యారు. ఆయన కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు.

ఎగువసభలోనూ కమలం పార్టీ ఎంపీలు చెప్పుకోదగ్గ సంపన్నులు కారు. పెద్దలసభలోని సంపన్న ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆస్తులు రూ. 2, 577కోట్లు. యావత్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యుల్లో ఆయనే అత్యధిక సంపన్నుడు. ఈ ఏడాది ప్రారంభంలో రామిరెడ్డి ఆంధప్రదేశ్‌ ‌నుంచి వైకాపా తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ప్రముఖ పారిశ్రామిక వేత్త. పెద్దల సభలోని రెండో సంపన్న ఎంపీ పరిమళ్‌ ‌నత్వానీ. ఆయన దిగ్గజ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ‌సీఈవో. నత్వానీ కూడా ఏపీ నుంచే వైకాపా మద్దతుతో ఎన్నికయ్యారు. నత్వానీకి టిక్కెట్‌ ఇప్పించేందుకు రిలయన్స్ అధినేత ముకేష్‌ అం‌బానీ స్వయంగా అమరావతి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారని అంటారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లోనూ అత్యధిక ఆస్తులు గల వారు కమలం పార్టీలో లేరు. బిహార్‌ ‌లోని పాటలీపుత్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన రమేష్‌కుమార్‌ ‌శర్మ అఫిడవిట్లో రూ.1107 కోట్లను తన ఆస్తులుగా చూపి ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన కేవలం 1556 ఓట్లే తెచ్చుకుని డిపాజిట్‌ ‌కోల్పోయారు. ఇదే రాష్రంలోని పూర్ణియా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన ఉధమ్‌ ‌సింగ్‌ ‌రూ.341 కోట్ల ఆస్తులను అఫిడవిట్లో చూపారు.

పార్టీ ఏదైనా ఎన్నికలలో, రాజకీయాలలో ధన ప్రభావం పెంచే ప్రయత్నం చేస్తే నిందార్హమైనదే. ఒక పేద దేశ అత్యున్నత చట్టసభ నిండా కోటీశ్వరులు కొలువై ఉంటే ఆ పరిణామం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ ప్రజాస్వామ్యంలో, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు సమానమే. సమాన హక్కులే అతడికి దక్కుతాయి. ఆ అవకాశం ఈ దేశంలో మిగిలి ఉండాలి. అందుకు తన వంతు కృషి చేస్తున్న పార్టీ బీజేపీ. అందుకు గొప్ప రుజువు ఆ పార్టీ తరఫున ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ. ఒక చాయ్‌వాలా ఇంట పుట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌  ‌ప్రచారక్‌గా పనిచేసిన మోదీ ఆర్థిక స్థితిని ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు. కానీ ప్రతిభకూ, ధనానికి ముడి పెట్టడం సరికాదు. దానిని ప్రజలు కూడా ఆమోదించరు. అంతమంది కోటీశ్వరులు ఉండగా మోదీనే ప్రధాని పదవి అలంకరించడం కూడా దీనికి గొప్ప సాక్ష్యంగా చెప్పవచ్చు. బీజేపీలో కూడా ధనికులు లేకపోలేదు. కానీ ఆ సంఖ్య తక్కువగా ఉండడం ఆహ్వానించతగినదే. ముఖ్యనేతలంతా దాదాపు మధ్య తరగతి నుంచి వచ్చినవారే. ధన ప్రాబల్యంతో కాదు. కోట్లతో మెట్లు నిర్మించుకుని కూడా కాదు.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE