ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్).. ఇప్పుడు రాష్ట్రమంతటా ఇదే చర్చనీయాంశంగా మారింది. కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయి, ఉపాధి కోల్పోయి, అవకాశాలు సన్నగిల్లిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ కేసీఆర్ ప్రభుత్వం తాజాగా తెరమీదకు తెచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ పథకం మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందాన మారింది. దశాబ్దాల నాటి ఆస్తులను, నిర్మాణాలను కూడా క్రమబద్ధీక రించుకోవాలన్న నిర్ణయం అందరి పాలిట శాపంలా మారింది.
రాష్ట్రంలోని ఖాళీస్థలాల క్రమబద్ధీకరణ కోసం ఈ ఆగస్టు 31న ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని కోసం జీవో 131ని జారీచేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల పరిధుల్లోని అనధికారిక ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. అక్రమ లే అవుట్లు నివారించేందుకు, అసలైన యజమానులకే ఆస్తి దక్కేట్లు, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ పథకం తోడ్పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. వివాదాలు లేని, అక్రమ లే అవుట్లు కాని ఆస్తులను కూడా ఇప్పటికిప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును కట్టి తీరాల్సిందేనంటూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటిదాకా పట్టణ ప్రాంతాల్లో లే అవుట్లు చేసి స్థలాలు విక్రయించేవారు ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేవారు. కానీ, ఇప్పుడు దాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తింపజేయడంతో వ్యక్తిగతంగా ఆస్తులు బదలాయించుకున్న వాళ్లు కూడా ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించుకోవాల్సిందేనని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. అయితే.. ప్రతి లావాదేవీ లోనూ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆస్తులు కొన్నవాళ్లు స్టాంప్ డ్యూటీ, చలాన్ల రూపంలో ఫీజులు చెల్లిస్తున్నారు. అలాంటి స్థలాలన్నింటికీ మళ్లీ ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకోవడంతో పాటు.. క్రమబద్ధీకరణ రుసుం చెల్లించాలని మార్గదర్శకాలు రూపొందించింది. ఈ పరిణామం జనంలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఇన్నాళ్లూ రిజిస్ట్రేషన్ శాఖ చేసిన రిజిస్ట్రేషన్లన్నీ అక్రమమేనా? చలాన్లు, స్టాంపు డ్యూటీలు ప్రభుత్వానికి చేరలేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పథకంపై ముఖ్యంగా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఒకరకంగా బలవంతపు వసూళ్లే అని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పేదల నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ పథకం ద్వారా కొందరు తమ స్థలాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతోంది. ప్రతి వీధిలో 30 ఫీట్ల రోడ్డు ఉండాలి. దాని కంటే తక్కువ ఉంటే ఖాళీస్థలాల నుంచి అంతమేరకు రోడ్డు స్థలంగానే పరిగణిస్తారు. అంటే ఈ పథకం ప్రకారం ఒక లే అవుట్‌లో 20 ఫీట్ల రోడ్లు మాత్రమే ఉంటే ప్రతి స్థలం యజమాని నుంచి ఇరువైపులా 5 ఫీట్ల చొప్పున రోడ్డుకు వదిలేసి నిర్మాణాలు చేసుకోవాలి. ఆ రోడ్డులో ఒకే లైన్ ఉంటే స్థలం నుంచి 10 ఫీట్ల చొప్పున రోడ్డు కోసం వదిలేయాల్సి ఉంటుంది. మిగతా స్థలంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని లే అవుట్లలో 20 ఫీట్ల నుంచి 25 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయని, వాటికోసం లక్షల రూపాయలు చెల్లించి కొన్న స్థలాలు వదిలేయాల్సి రావడమంటే గుండె తరుక్కుపోతోందని, కష్టపడి కొనుక్కున్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోక పోవడమే పాపమైపోయిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ గల్లీలు చూస్తే కనీసం ఆటో కూడా పట్టనంతగా స్థలాలు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారని, వాటిని అడిగే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని రాజధాని వాసులు కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
నిరసనలతో జీవోకు సవరణలు
రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నైరాశ్యం, అసెంబ్లీలో విపక్షాలు నిలదీయడంతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సభలో చర్చ జరిగిన మరుసటిరోజు జీవో నెంబర్ 131ని సవరిస్తున్నట్లు ప్రకటించింది. మొదట జారీచేసిన జీవోలో పేర్కొన్న క్రమబద్ధీకరణ రుసుంను తగ్గించింది. భూముల క్రమబద్ధీకరణకు ఇప్పుడున్న మార్కెట్ విలువ కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే ఎల్‌ఆర్‌ఎస్ రుసుం వసూలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, 2015లో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారమే ఎల్‌ఆర్‌ఎస్ రుసుంను చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. ఈ పథకం ద్వారా గతంలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను కూడా మరోసారి పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సాదా బైనామాలతో సాగిన లావాదేవీలకు సంబంధించిన ఆస్తుల అంశాన్ని కూడా సమీక్షిస్తామని ఆయన అన్నారు. అయినా ఈ పథకంపై విమర్శల దాడి మాత్రం ఆగడం లేదు. పైసా పైసా కూడబెట్టి ఎంతో కష్టపడి స్థలాలు కొంటే ఈ బాధలు ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలే కొవిడ్-19 కారణంగా బతుకు భారంగా మారితే ఈ నిర్ణయం మరింత ఇబ్బందులకు గురిచేసేలా ఉందని స్థలాల యజమానులు వాపోతున్నారు. నామమాత్రపు ఫీజులే అన్నది పేరుకు మాత్రమేనని.. స్లాబుల పద్ధతి ప్రవేశపెట్టినప్పటికీ, క్రమబద్ధీకరణ కోసమే లక్షలకు లక్షలు కట్టాల్సి వస్తోందని.. ఉన్న ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డబ్బులు లేనిసమయంలో ప్రజలను బాధ పెట్టవద్దని, ఆర్థిక సంబంధ అంశాలలో పేదలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకో వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఖజానా భర్తీ కోసమేనా?
ఎల్‌ఆర్‌ఎస్ పథకం లక్ష్యం ప్రభుత్వ ఖజానాను నింపడమేనని అర్థమవుతూనే ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో ఫీజు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాలంటున్నారు. ఆ తర్వాత చార్జీలు షరామామూలుగానే చెల్లించాలి. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి ఇప్పటికే వందకోట్ల రూపాయల ఆదాయం చేకూరింది. ప్రతిరోజు భారీఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా రూపొందించింది. ఆ పోర్టల్ ద్వారా ఎవరికి వారే ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడంతో పాటు.. ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. మీసేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పథకం కావడంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల గడువును మరికొంత కాలం పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. గడువు పొడిగిస్తే దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని, ఫలితంగా ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిరంతర పక్రియగా మార్చాలన్న విజ్ఞప్తులు
ఎల్‌ఆర్‌ఎస్ పథకం నిరంతర పక్రియగా మార్చాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే దరఖాస్తులకు గడువు విధించడం, ఇప్పటికిప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి తేవడం, క్రమబద్ధీకరణ ఫీజులు కూడా గడువు లోగానే చెల్లించాలని కరాఖండీగా చెప్పడం వల్ల కొందరు ఉన్న ఆస్తులు అమ్మితే తప్ప ఆ ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉందని వేడుకుంటున్నారు. ఇప్పుడు కచ్చితంగా కట్టాలంటే స్తోమత ఉన్నవాళ్లు మాత్రమే చెల్లించగలుగుతారని, మిగతావాళ్లంతా అప్పులబారిన పడతారని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. అలా కాకుండా.. తమ స్థలాల్లో నిర్మాణాలు చేసుకునేందుకు సంసిద్ధమైన సమయంలో అయితే.. మానసికంగా, ఆర్థికంగా సిద్ధమై ఉంటారని, ఆ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజలు చెల్లించే అవకాశం కల్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కోరుతున్నారు. ఎలాగూ ఎల్‌ఆర్‌ఎస్ లేకుంటే నిర్మాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం లేనందున, ఈ వెసులుబాటు కల్పిస్తే ప్రజలకు మేలు చేసిన వాళ్లవుతారని చెబుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత
ఎల్‌ఆర్‌ఎస్ పథకం అటు వనవాసీలనూ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఏకంగా దీనికి వ్యతిరేకంగా ఉద్యమమే మొదలైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయాలనడం 1/70 చట్టానికి తూట్లు పొడవడమే అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొమ్రం భీమ్ జిల్లా జైనూర్‌లో వనవాసీలు జంగ్ సైరన్ మోగించారు. ఎల్‌ఆర్‌ఎస్, ఆస్తుల సర్వేపై మండిపడ్డారు. ఏజెన్సీ భూముల జోలికి రాబోమని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో నోటిఫైడ్ ప్రాంతంలోని భూములను గిరిజనేతరులకు రెగ్యులరైజ్ చేసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్, ఆస్తుల సర్వేలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ జైనూర్ మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. ఏజెన్సీలో ఏదైనా చేయాలంటే పెసా కమిటీ తీర్మానం చేయాలని, కానీ, ప్రభుత్వం ఆ కమిటీని లెక్కలోకి తీసుకోకుండా ఎల్‌ఆర్‌ఎస్ నిర్ణయం తీసుకోవడంపై ఏజెన్సీ ప్రాంత వాసులు నిరసనలు చేపడుతున్నారు. మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్ పథకం పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని పలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయిం చాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది.
– సుజాత గోపగోని, 6302164068 : సీనియర్ జర్నలిస్ట్