రైతే దేశానికి వెన్నెముక అని అందరూ ఘనంగా చెబుతారు.. కానీ ఆ రైతు వెన్నెముక విరిగినా ఎవరికీ పట్టదు.. రాజకీయ పార్టీలు, వారి అనుబంధ రైతు సంఘాలు నిన్నటి దాకా చేసిన డిమాండ్లనే అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. విచిత్రంగా వారే తమ రాజకీయ స్వార్ధాలతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతు బాంధవులమని చాటుకునే నాయకులు తాత్కాలిక ఉపశమనం కలిగించే పథకాలను తప్ప రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నాలు చేయడం లేదు. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోదీ తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు నిజమైన స్వేచ్ఛ, స్వావలంబన ఇస్తున్నాయి. అయినా వీటిని వ్యతిరేకించడం ద్వారా తమ కపట బుద్ధిని ప్రదర్శించుకుంటున్నారు.ఈ మూడు వ్యవసాయ బిల్లులు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో, రాష్ట్రపతి సంతకంతో చట్ట రూపం దాల్చాయి.
అవి-
1) నిత్యావసర సరకుల (సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెండ్మెంట్) బిల్ 2020
2) రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్
3) రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020 (ది ఫార్మర్స్ (ఎంప వర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ -2020.
‘ఒకే దేశం-ఒకే మార్కెట్’ అనే భావనతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతకన్నా ముఖ్యంగా శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హరిసిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర క్యాబినెట్ నుంచి వైదొలగడం కలకలం రేపింది. ఈ దశలో సహజంగానే విపక్షాలకు ఒక ఆయుధం దొరికినట్లయింది. స్వయాన ఎన్డీఏ భాగస్వామ్య పక్షమే ఈ బిల్లులను వ్యతిరేకిస్తోంది కాబట్టి కచ్ఛితంగా ఇది రైతులకు వ్యతిరేకం అనే ప్రచారాన్ని కాంగ్రెస్‌తో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రారంభించాయి. దీనికి మీడియాలో ఒక వర్గం తోడైంది.
రైతు బిల్లులను అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించి నప్పటికీ లోక్‌సభలో ఈ మూడు బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, డిప్యూటీ ఛైర్మన్‌తో వారి అనుచిత ప్రవర్తన, సస్పెన్షన్లు మీడియా ప్రధాన శీర్షికలకు ఆక్రమించాయి. బిల్లులలోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, పూర్తిగా ఇవి రైతులకు నష్టం కలిగించేవే అనే రీతిలో కథనాలను ప్రచారంలోకి పెట్టాయి. అసలు వ్యవసాయ బిల్లుల్లో ఉన్న అంశాలేమిటి? అవి రైతులకు మేలు చేస్తాయా? నష్టం చేస్తాయా అన్న చర్చకన్నా రాజకీయ అవసరాలే ముఖ్యమైపోయాయి.
వాస్తవానికి చాలా కాలంగా రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ రైతు సంఘాలు ఏ సంస్కరణలు కావాలి అని కోరుకున్నాయో, కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లు లక్ష్యం దాదాపు అదే. ఇంత కాలం తాము డిమాండ్ చేస్తున్న అంశాలు ఆచరణలోకి వస్తుంటే, వ్యతిరేకించడం విడ్డూరంగానే ఉంది. అంటే ఈ పార్టీలు, సంఘాలకు రైతుల హితం కన్నా, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టమైంది.
బిల్లుల్లో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాలు ఏమిటి? అందులోని అంశాలు ఏమిటి? అవి రైతులకు లాభం చేకూరుస్తాయా? నష్టం కలిగిస్తాయా?..
- నిత్యావసర సరకుల (సవరణ) చట్టం:
దేశంలో ఇప్పటికే అమలులో ఉన్న నిత్యావసర సరకుల చట్టం 1955కి కొన్ని సవరణలు చేసి దీన్ని రూపొందించారు. నిత్యావసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణాధికారం కేంద్రానికి ఉండేలా దీన్ని రూపొందించారు. వ్యవసాయరంగంలో పోటీని ప్రోత్సహించడం, తద్వారా రైతుల ఆదాయం పెంచడానికి ఉద్దేశించిన చట్టంగా ఆర్డినెన్సులో పేర్కొన్నారు. నిత్యావసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరించడం కూడా దీని ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.
కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి నిత్యావసరాలుగా పేర్కొనడానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. అలాంటి నిత్యావసరాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాన్ని నియంత్రించడానికి, నిషేధించడానికి కేందప్రభుత్వానికి అధికారం ఉంటుంది. యుద్ధం, దుర్భిక్షం, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులలో తృణధాన్యాలు, పప్పులు, బంగాళా దుంపలు, ఉల్లి, నూనెగింజలు, నూనెలు వంటి ఆహార వస్తువుల సరఫరాను నియంత్రించే అధికారం ఈ చట్టం ద్వారా కేంద్రానికే వర్తిస్తుంది.
ఏదైనా నిత్యావసర వస్తువును ఒక వ్యక్తి ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చనే నియంత్రణ అధికారం కూడా కేంద్రానికే ఉంటుంది. దీనికి ధరల పెరుగుదలను ప్రాతిపదికగా తీసుకుంటారు. అయిదేళ్ల సగటు ధరతో కానీ, ఏడాది కిందటి అదే కాలంలో ధరతో కానీ పోల్చి పెరుగుదల స్థాయిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యాన ఉత్పత్తులైతే 100 శాతం ధర పెరిగిన పక్షంలో నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది. పాడవని వ్యవసాయ ఉత్పత్తులకైతే 50 శాతం ధర పెరిగితే నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది.
అయితే, ఆయా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి పంట పండించేవారి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాం, రవాణా, పంపిణీదారు దాకా ఎవరికీ ఇది వర్తించదు. ఈ నియంత్రణలు, నిల్వ పరిమితులు ప్రజాపంపిణీ వ్యవస్థకు వర్తించవు.
- రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం:
వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా ఇతర జిల్లాలు లేదా ఇతర రాష్ట్రాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఈ చట్టం అవకాశం ఇస్త్తుంది. దీంతో మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వేయడానికి, ఫీజులు వసూలు చేయడానికి వీలులేదు.
నిర్దేశిత వాణిజ్య ప్రాంతంలో రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నియంత్రణలోకి వచ్చే ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ వర్తకానికి (ఈ-ట్రేడింగ్) ఈ రెండో చట్టం అనుమతిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా క్రయవిక్రయాల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికను ఏర్పాటు చేయొచ్చు. పాన్ కార్డు ఉన్న కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, వ్యవసాయ సహకార సంస్థలు ఏవైనా ఇలాంటి ఆన్‌లైన్ వర్తక వేదికను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది.
- రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ,
సేవల ఒప్పంద చట్టం-2020
రైతులు పంట వేయకముందే వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకూ ఈ ఒప్పందాలు చేసుకోవచ్చు. దీనినే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని పిలుస్తున్నారు.
ఈ కాంట్రాక్ట్‌లో రైతులు, కొనుగోలుదారుల మధ్య జరిగే ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొనాలి. ధర నిర్ణయ పక్రియను రాసుకోవాలి.
ఈ చట్టం ప్రకారం కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ సయోధ్య(కన్సిలియేషన్) బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పిలేట్ అథారిటీ ఉంటుంది.
ఏదైనా వివాదం తలెత్తితే మొదట బోర్డు పరిధిలో సయోధ్యకు ప్రయత్నిస్తారు. అక్కడ పరిష్కారం కాకుంటే 30 రోజుల తరువాత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను సంప్రదించవచ్చు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పిలేట్ అథారిటీని సంప్రదించొచ్చు. అప్పిలేట్ అథారిటీగా ఐఏఎస్ స్థాయి అధికారులు ఉంటారు. ఏ స్థాయిలో నైనా రైతుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే రికవరీ కోసం వ్యవసాయ భూమిని తీసుకోవడానికి ఈ చట్టం అంగీకరించదు.
అర్థం లేని అపోహలు
ఒక ఉత్పత్తిదారుడు తాను తయారు చేసిన వస్తువును అమ్మే ముందు దానిపై పెట్టిన పెట్టుబడి ఖర్చుపోనూ లాభాలు చూసుకొని విక్రయిస్తాడు. కానీ రైతులకు ఆ స్పేచ్ఛ ఎందుకు ఉండదు? మార్కెట్లలో డిమాండ్ తగ్గినా, ప్రకృతి వైపరీత్యాలు చీడల కారణంగా తలెత్తే నష్టాలన• కూడా భరించాల్సిందే. మార్కెట్ కు తీసుకువస్తే ఆశించిన ధర దక్కకపోగా నష్టానికి అమ్ముకోక తప్పదు. కొన్ని సందర్భాల్లో రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావు. ఈ నేపథ్యంలో రైతులు తాము కోరుకున్న రేటుకు అమ్ముకునే అవకాశం ఇవ్వాలని, ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ రైతుల సంఘాలు, కొందరు మేధావులు వాదిస్తూ వచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టాలు ఈ అవకాశాన్ని స్పష్టంగా కల్పించాయి. కానీ ఇప్పుడు వారే వీటిని వ్యతిరేకిస్తూ ద్వంద్వ వైఖరిని చాటుకున్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీయేతర పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ అపోహలను ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది ఒక్కసారి పరిశీలించి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ వ్యాపారుల పెత్తనంలో పెడుతోందని ప్రధాన ఆరోపణ. వాస్తవానికి కాంగ్రెస్ పాలనలోనే కార్పొరేట్ కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకోవడం ప్రారంభించాయి. ఇప్పటి వరకూ ఈ ఒప్పందాలకు చట్టబద్ధత లేని కారణంగా రైతులు ఇబ్బంది పడేవారు. తాజాగా మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020 ఈ ఒప్పందాలకు చట్టబద్ధతనిచ్చింది. రైతులకు అన్యాయం జరగకుండా రక్షణ కల్పిస్తోంది.
ప్రభుత్వం ఆధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు నిర్వహించే మార్కెట్లలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా బయటి ప్రైవేటు మార్కెట్లలో లేదా మండీల్లో రైతులు తమ వ్యవసాయోత్పత్తులను విక్రయించుకునేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్’ చట్టం వీలు కల్పిస్తోంది. దీని వల్ల ప్రభుత్వ నియంత్రణలోని మార్కెట్ కమిటీల అధికారాలు తగ్గిపోతాయని, కనీస మద్దతు ధరకు గోధుమలు, బియ్యం సేకరించడం తగ్గిపోతుందని, రైతులు నష్టపోతారని అపోహలు న్నాయి. కానీ తమ ఉత్పత్తులు ఎక్కడ విక్రయించు కోవాలనే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వడమే సముచితం.
కనీస మద్దతు ధర వెనుక..
మరో అపోహ- కార్పొరేట్ వ్యాపారుల లాభాపేక్షకు వ్యవసాయ ఉత్పత్తులకు ప్రస్తుతం ఇస్తున్న ‘కనీస మద్దతు ధర’ (ఎంఎస్‌పీ) కనుమరగవుతుందని. ఈ అపోహకు తెర దించుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని ఉత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచింది. కార్పొరేట్ మార్కెట్ శక్తుల వల్ల వ్యవసా యోత్పత్తుల ధరలు పడిపోయే ప్రమాదం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కనీస మద్దతు ధరను తొలగిస్తామని ఈ బిల్లులలో ఎక్కడా చెప్పలేదు. పైగా కనీస మద్దతు ధరను కొనసాగిస్తా మనే మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వాస్తవానికి కనీస మద్దతు ధరపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 5.8 శాతం మంది రైతులు మాత్రమే ఎంఎస్‌పీ కింద ఉత్పత్తులను విక్రయిస్తున్నారని, ఈ విషయంలో పంజాబ్, హరియాణా రైతుల తర్వాత ఆంధప్రదేశ్, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల రైతులే ఎంఎస్‌పీ కింద లబ్ధి పొందుతున్నారని 2015లో శాంతకుమార్ కమిటీ నివేదికలో తెలియజేసింది. ప్రభుత్వ ఏజెన్సీలు ఎక్కువగా పెద్ద రైతుల నుంచే కొనుగోళ్లు చేస్తున్నాయి. కేంద్రం 23 రకాల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలను ప్రకటించగా, వాటిలో వరి, గోధుమలనే ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎంఎస్‌పీ కింద పప్పు దినుసుల కొనుగోళ్లు పెరిగాయి.
ముఖ్యంగా రైతు బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన రైతులను కాంగ్రెస్ పార్టీ రెచ్చ గొడుతోంది. ఇప్పుడు అకాలీదళ్ కూడా తోడైంది. ఆ రెండు రాష్ట్రాల నుంచే 80-90 శాతం వరకు కనీస మద్దత ధరపై ప్రభుత్వం వరి, గోధుమలను కొనుగోలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన గోధుమలు, వరిలో 52 శాతం వాటా ఈ రెండు రాష్ట్రాలకు చెందినదే. ఇందుకు కారణం 1960లో ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్రం ‘హరిత విప్లవం’ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇక్కడ ‘కనీస మద్దతు ధర’విధానాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత రైతుల డిమాండ్ కారణంగా ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించారు.
దేశంలో ఆహారధాన్యాల కొరత ఉన్న రోజుల్లో పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం ప్రాధాన్యమిచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో మార్కెట్ ధరలు తక్కువ. ఈ రాష్ట్రాలకు ఎంఎస్‌పీ కొనుగోళ్ల విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని శాంతకుమార్ కమిటీ సిఫార్సు చేసింది. ఎంఎస్‌పీ స్కీమ్‌ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పిస్తూ కేంద్రం 1997లో చట్ట సవరణ తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఎంఎస్‌పీ అమలు చేయడం వల్ల ప్రభుత్వాలపై అధిక ఆర్థిక భారం పడుతోందని, ఈ విధానాన్ని ఎత్తివేయాలంటూ చర్చ జరుగుతున్నా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.
పెరిగిన కనీస మద్దతు ధరలు
వ్యవసాయ బిల్లుల ఆమోదం తర్వాత కనీస మద్దతు ధర విషయంలో ఏర్పడిన అనుమానాలు తొలగిచేందుకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరను 6% వరకు పెంచారు. 2020-21 పంట సంవత్సరానికి (జూన్-జూలై), 2021-22 మార్కెటింగ్ సీజన్‌కు ఆరు రబీ పంటల ఎంఎస్‌పీ పెంపును ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు తెలిపారు.
గోధుమ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచారు. దాంతో క్వింటాల్ గోధుమ ఎంఎస్‌పీ రూ. 1,975కి చేరింది. కందుల ఎంఎస్‌పీ రూ.225 పెరగడంతో వాటి ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. మసూర్‌దాల్ ధర క్వింటాల్‌కు రూ.300 పెరిగింది. దాంతో వాటి ధర క్వింటాల్‌కు రూ. 5,100కి చేరింది. ఆవాల ధర క్వింటాల్‌కు రూ.225 పెరిగి, రూ.4,650కి చేరింది. కుసుమల ధర క్వింటాల్‌కు రూ.112 పెరిగి, రూ.5,327కి చేరింది. బార్లీ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.75 పెంచారు. దాంతో క్వింటాల్ బార్లీ ధర రూ.1,600కు చేరింది. కనీస మద్దతు ధర కొనసాగుతుందనేందుకు తాజా పెంపే నిదర్శనమని తోమర్ ఆ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని విపక్ష పార్టీలకు సూచించారు. గత ఆరేళ్లలో రైతులకు రూ. 7 లక్షల కోట్లను ఎంఎస్‌పీగా అందించామన్నారు.
పెత్తనానికి అడ్డుకట్ట
రైతులకు కష్టాలు పెరగడంలో దళారీ వ్యవస్థ ప్రధానం కారణం. వీరి పెత్తనం తగ్గాలని రైతు సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతు న్నాయి. కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా వారి పెత్తనానికి కత్తెర పడుతోంది. ఇంత కాలం రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛను హరిస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోని మార్కెట్ కమిటీలే. ఈ కమిటీలన్నీ రాజకీయ పెత్తనంతో నడిచేవే. చాలావరకూ మార్కెట్ కమిటీలు ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు కొంటున్నాయి. కొన్ని సొసైటీలు ఇన్స్యూరెన్స్ మొత్తాలను సదరు కంపెనీల నుంచి పొందినా రైతులకు చెల్లించకుండా మోసగిస్తున్న ఉదాహరణలున్నాయి.
కొన్ని మార్కెట్ కమిటీలు చెక్ పోస్టు ఏర్పాటు చేసుకొని రైతులు ఇతర ప్రాంతాల్లో అమ్ముకునేందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే వాణిజ్యపన్నులు, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల విధానాలు కూడా రైతులకు ఇబ్బందికరంగా మారాయి.. ఇప్పుడు రైతులకు అనుకూలమైన ఒకే దేశం-ఒకే మార్కెట్ విధానం ఈ వర్గాలకు ఇబ్బందిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించడం వెనుక ఉన్న మతలబును మనం అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణలను తెచ్చే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించం కన్నా, రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకునే హక్కును ఇస్తున్నాయని చెప్పవచ్చు.
మొత్తానికి ఏ రకంగా చూసినా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవిగానే కనిపిస్తున్నాయి. ఈ చట్టాల ద్వారా రాజకీయ పెత్తనంలోని మార్కెట్ కమిటీలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా, అంతిమంగా రైతులు లాభపడటం ముఖ్యం. అందుకే, రంగంలో కేందప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. 86శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వాలు, వారి వాగ్దానాలను గాలికి వదిలేశాయని ఆయన చెప్పడం సత్యదూరం కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి రైతులకు, కూలీలకు అబద్ధాలు చెబుతూనే ఉన్నారనీ, తాజా సంస్కరణలపై ఇప్పుడు కూడా రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. భాజపా నాయకులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల వల్ల దాదాపు 50కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు సరైన సమయంలో వేతనాలు అందుతాయన్నారు. ఇప్పటివరకు 30శాతం మంది కార్మికులు మాత్రమే కనీస వేతనాలు పొందేవారని, ప్రస్తుతం అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు. ఈ శుభఫలితాల కోసం ఎదురుచూద్దాం.
– క్రాంతిదేవ్ మిత్ర : సీనియర్ జర్నలిస్ట్