కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, జీడీపీ దారుణంగా పడి పోవడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమనీ హార్వర్డ్ ఎం‌బీయే, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. ఒక ప్రతిపక్ష ప్రముఖునిగా ఆయనకు ఆ హక్కు ఉందన్న వాస్తవాన్ని అంగీకరిస్తూనే, విమర్శలు గుప్పించేటప్పుడు చూపించవలసిన సయ్యనం, వాస్తవిక దృష్టిని వదిలిపెట్టి కేవలం రాజకీయ పరిధి నుంచే విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి? సమస్య మానవ జనితం కానపుడు దానితో వచ్చే నష్టం భరించడం అనివార్యం అవుతుందనీ, ఇది ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాదని హార్వర్డ్ ఎం‌బీయే పట్టా ఉన్న చిదంబరానికి తోచక పోవడం విచారకరం. ఒడ్డున ఉన్న వారి మాదిరిగా ప్రమాదం గురించి ఉచిత సలహాలు సంధించడం ఎవరైనా చేయగలరు. అందుకు హార్వర్డ్ ‌పట్టాతో పనేలేదు. ఇటీవల ఒక విదేశీ మీడియాకి చెందిన ప్రాంతీయ భాష మాధ్యమంలో చిదంబరం మోదీ సర్కారు పైన ఆర్ధికవృద్ధి, వైఫల్యాల గురించి చేసిన ఆరోపణలు, వేసిన నిందలు గమనిస్తే ఇదే అనిపిస్తుంది.

కరోనా, ఆర్థిక వ్యవస్థ మందగమనం విషయంలో ప్రతిపక్షాలూ, ఒక వర్గం ఆర్ధిక వేత్తలూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపడానికే పరిమితం అయ్యారు తప్ప బాధ్యతాయుతంగా వ్యవహ రించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. వృద్ధి రేటు క్షీణించిందంటూ ధ్వజం ఎత్తే ముందు కరోనా బారిన పడిన ఏ దేశంలో అయినా వృద్ధిరేటు సాధ్యమైనట్టు చెప్పే ఉదాహరణ చూపలేకపోయారు. కరోనా బారిన పడిన ప్రతి దేశంలోనూ వృద్ధి రేటు మందగించిందని సాధారణ ప్రజలకు సైతం తెలుసు. హార్వర్డ్ ‌పండితుడికి ఇంత చిన్న వాస్తవం ఎందుకు తట్టలే దన్నదే ప్రశ్న. మూడు రోజుల కిందట వెలువడిన ఆర్బీఐ నివేదిక ఏమి చెబుతుందో తెలుసు. దానిని తనే ముందుగా కనుగొన్నట్టు ఆయన చెప్పడం హాస్యాస్పదం. మోదీ ప్రభుత్వానికి సిగ్గులేదనీ, తప్పు ఒప్పుకోవడం లేదనీ వాపోయారు. నిజంగా సిగ్గు ఉన్న ఏ ఆర్ధిక మంత్రయినా మన దేశ కరెన్సీ ముద్రణ బాధ్యతను పాకిస్తాన్‌ ‌ప్రెస్‌కి ఇస్తారా? ఆయన చేసిన మరో కామెడీ, దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందన్న విషయం బహుశా ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ తెలుసని ఎద్దేవా చేయడం.

ప్రపంచ బ్యాంకు మాజీ అధిపతి రాబర్ట్ ‌జోలిక్‌. అమెరికాలోనే అత్యంత ప్రతిభాశాలి అయిన ఆర్థిక సలహాదారుగా పేరుపొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తే కరోనా అనేది ప్రపంచ ఆర్థిక సంక్షోభమే అని నిర్ధారించినపుడు, ఇండియాలో సంభవించిన ఆర్థిక సంక్షోభమే అసలు సంక్షోభం అని పాలకులని చిదబరం విమర్శించడం రాజకీయ ప్రయోజనమే తప్ప మరొకటి కాదని ప్రజలు గ్రహించారు.

మోదీ ‘నిర్లక్ష్యాని’కి ప్రజలు చెల్లించుకున్నది ఆర్ధిక పరమైన మూల్యమే కానీ , ప్రాణహాని తక్కువ అన్నది వాస్తవం. ఇక ఆర్థిక నష్టం అన్నీ దేశాలలోనూ జరిగింది. ట్రంప్‌, ‌బోరిస్‌ ‌కూడా ఈ స్థితిని ఎదుర్కొన్నారు. మోదీ సర్కారు చర్యల వల్ల ప్రజలు ధనం కన్నా విలువైన ప్రాణాలను నిలబెట్టుకో గలిగారన్నది హార్వర్డ్ ‌మేధావికి ఎందుకు తట్టలేదో? చిదంబరానికి లాభాలూ, వృద్ధి, డబ్బే ప్రధానం కావడం వింతకాదు. చిదంబరం నేడు ఆర్ధిక మంత్రి హోదాలో ఉండి ఉంటే సోనియా ఆజ్ఞల మేరకు ఏం చేసేవారో! ప్రాణం, ధనం- ఏది కావాలంటే ప్రతివాడు కోరుకునేది ప్రాణాలనే. ఇందులో ఒకవేళ చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నా, నేడు ప్రధానిగా ఉన్న మోదీకీ మరొక అవకాశం లేదు. ప్రాణం ఎవరికైనా ప్రాణమే, ప్రియమైనదే. మోదీ సర్కారు ప్రాధాన్యం ప్రజల ప్రాణాకే. తరువాతనే ఆర్ధిక వృద్ధి గురించి ఆలోచించారు. దీనిని మోదీ సర్కారు చేతకానితనమని నిర్ధారిస్తున్నారు మాజీ ఆర్ధికమంత్రి.

ఇన్ని విమర్శలూ చేసి చివరికి చిదంబరం తేల్చినదేమిటి? ప్రజలు తన మొహాన దుమ్ము చల్లుతారనుకున్నారో ఏమో చివరికి, ‘కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్థిక వ్యవస్థల మీదా ప్రభావం చూపింది. ఇండియాకూ మినహా యింపు లేదు. ఈ విపత్తు నుంచి బయటపడటం ఎలా అన్నదే ఇప్పటి ప్రశ్న అంటూ ముక్తాయించారు. ఇంకా, ఇందుకు రెండు మార్గాలున్నాయి- ఒకటి, కొన్ని విషయాలు ప్రభుత్వం చేతిలో కూడా ఉండవు. కానీ ప్రభుత్వం ఈ మహమ్మారి మీద త్వరగా పోరాడాల్సి ఉంటుంది. రెండోది, మహమ్మారి ప్రభావం నుంచి బయట పడటానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రత్యామ్నాయాల మీదా దృష్టి పెట్టాలి. కానీ మోదీ సర్కారు అలాంటి పని ఏదీ చేయలేదు అన్నారు చిదంబరం. ఆయన పైన చేసిన వాఖ్యల్లో రెండు నాల్కల ధోరణి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. కొన్ని విషయాలు ప్రభుత్వం చేతిలో ఉండవని చెబుతూనే మాజీ మంత్రివర్యులు ఇంత కంఠశోష ఎందుకు పడినట్లు? ఇంతగా విమర్శలు గుప్పించిన ఆయన ఈ విషయంలో మోదీ పరువు పోయిందంటూ ముగించడం చూస్తుంటే దివాంధుల చందంగానే ఉంది. అందుకే తెలివైనవాడు ఆకాశం మీద ఉమ్మి వేయడానికి సాహసించడన్నారు పెద్దలు. ఇక్కడ ఈ విదేశీ మీడియా ఇంటర్వ్యూలో పోయిన పరువు మోదీదా? లేక హార్వర్డ్ ‌మేధావిదా? కాకపోతే ఇలాంటి పురమాయింపు ఇంటర్వ్యూలు చేసిన ఆ చానల్‌దా? ఈ విషయాన్ని ప్రజల విజ్ఞతకి వదిలివేయడం మంచిది.

1947-1980ల మధ్య మనం ఐదుసార్లు ఆర్ధికమాంద్యాన్ని చవిచూశాం. 79-80లలో వచ్చిన ఆర్ధికమాంద్యం దేశం మీద పెద్ద మచ్చనే మిగిల్చిందని చిదంబరం మరిచి ఉంటారు. ఇప్పటి చిదంబరం-కాంగ్రెస్‌ ‌పార్టీలకు మల్లేనే ఆనాడు ఇందిర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో సతమతమయ్యి, చివరి అస్త్రం గా దీనికి కారణం జనతా ప్రభుత్వమేనని దుమ్మెత్తి పోసిన విషయం అయన గుర్తించలేదా? ఇందిర హయాంలో వచ్చిన ఆర్ధిక మాంద్యానికీ, ప్రస్తుతపు ఆర్ధిక మాంద్యానికీ పెద్ద తేడా ఉందని చిదంబరం గుర్తించడం లేదు. ఆమె పదవిలో ఉండగా చమురు ధరలు పెరిగిపోవడం, కరవు, వర్షలేమి వలన మాంద్యం వచ్చింది. అప్పుడు ఇటువంటి లాక్‌డౌన్లు మాత్రం లేవు. అయినా సరే ఇందిర దానిని సరిదిద్దడంలో విఫలమయ్యారని చిదంబరం గుర్తించాలి. ఇంతకు పూర్వం పనిచేసిన ఆర్ధిక మంత్రులు, నిపుణులు ఇచ్చిన సలహాలనే చిదంబరం కూడా ఇవ్వడం వలన పైసా ప్రయోజనం ఉండదని గుర్తెరగాలి.

 ప్రభుత్వం ఇప్పుడు ఏంచేయాలి?

జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ 3.1 శాతం వృద్ధి ని సాధించింది. గడిచిన ఎనిమిదేళ్లలో ఇదే కనిష్ఠం. ఆ త్రైమాసికంలో వినియోగదారుల వ్యయం తోపాటు ప్రైవేట్‌ ‌పెట్టుబడులు, ఎగుమతులు తగ్గాయని జీడీపీ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే ఏప్రిల్‌-‌జూన్‌ ‌త్రైమాసికంలో వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంది. తాజాగా విడుదలైన జీడీపీ గణాంకాలు 1996 తర్వాత అతి పెద్ద జీడీపీ పతనంగా చెప్పవచ్చు. మన ఆర్థికవేత్తలు చాలామంది పుస్తక జ్జానాన్ని అనుసరిస్తారు కానీ వాస్తవికంగా ఆలోచించరు. వాళ్ల పుస్తక జ్ఞానం ప్రకారం పండగ లొస్తే వస్తువులకు డిమాండ్‌ ‌పెరుగుతుంది. కానీ అది అన్నిసార్లు జరగదు. సాధారణ ప్రజలు దీనికి చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయాలని భావిస్తున్నారు. మన సమాజం కోసం రక్షణాత్మక విధానాలను రూపొందించాలి. ప్రజలు ఎక్కువకాలం డబ్బును బ్యాంకుల్లో ఉంచేలా చూడాలి. పరిశ్రమలకు ఇవ్వ జూపుతున్న లక్షన్నర కోట్ల రూపాయల పన్ను రాయితీలకు బదులుగా, ప్రభుత్వమే వీలైనన్ని నిధులను పరిశ్రమలకు అందిస్తే ఫలితం వేగంగా ఉంటుంది. అదే సమయంలో ఈ సొమ్మును వ్యవసాయరంగంలో పెట్టుబడిగా వినియోగిస్తే ఇంకా త్వరగా ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలి. ఎపిఎంసి పరిధిని విస్తరించి, గ్రామీణ ఆర్ధికవ్యవస్థను బలోపేతం చేయడం ప్రస్తుత అవసరం. రైతులను ఆదుకునే జీవన రేఖను ప్రభుత్వం మరింత స్పష్టంగా గీయాల్సి ఉంది. డిమాండ్‌ను సృస్ట్టించే కొత్త ప్రయోగాలకు ప్రభుత్వం శ్రీకారం చుడితే, ఊహించిన 18 శాతానికి మించి 23. 9 శాతానికి పడిపోయిన జిడిపి వృద్ధి రేటును తద్వారా పతనమైన అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎక్కువ సమయం పట్టదని గ్రహించాలి.

– చల్లా జయదేవ్‌, ‌సీనియర్‌ ‌పాత్రికేయులు, చెన్నై

About Author

By editor

Twitter
YOUTUBE