భారతీయతలో నది అంటే ఒక జల ప్రవాహం కాదు. అదొక సాంస్కృతిక ధార. ధార్మికతకు ఆలవాలం. కాబట్టే మనకు నది అంటే శరీరాన్నే కాదు, మనసునీ క్షాళన చేసే పవిత్ర గంగ. పుట్టి భూమ్మీద పడినవారికి కన్నతల్లి క్షీరమిచ్చి ప్రాణం పోస్తే, నదీమతల్లి నీరమిచ్చి మళ్లీ మట్టిలో కలిసేదాకా పోషిస్తుంది. సమస్తజీవులకీ, నదికీ ఉన్న బంధం ఎంతో మార్మికమైనది. భారతీయుల బంధం ఆధ్యాత్మికమైనది కూడా. నది లేకుంటే మానవ మనుగడే లేదు. నాగరికత లేదు. కానీ నదుల పట్ల భారతీయత అందించిన సందేశాన్ని ఇప్పుడు మనం సరిగా అర్థం చేసుకో గలుగు తున్నామా? నదులను పవిత్రమైన విగా భావించగలుగు తున్నామా? వాటికి ఆపాదించిన పవిత్రత వెనుక ఉన్న ఆంతర్యాన్ని గ్రహించగలుగు తున్నామా? అసలు రేపటి తరాల కోసం ఈ నదులను క్షేమంగా ఉంచగలమా? గంగ, యమున, గోదావరి, కృష్ణ… ఏ జీవనదిని చూసినా ఇదే భావం కలుగుతోంది. కారణం- ఏదో ఒక్క నది అని కాదు, ఏ ప్రాంతంలోని నదిని చూసినా కాలుష్యం కోరలలో విలవిలలాడుతూ కనిపించేదే.


ఈ అక్టోబర్‌ ‌మొదటివారంలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక గోదావరి నదిలో తేలిన తెట్టును గురించి ప్రచురించిన వార్త పర్యావరణవేత్తలనే కాదు, సమస్త భారతీయ సమాజాన్ని కలవరపరిచేదే. అక్టోబర్‌ 5‌న గోదావరి నదిలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వద్ద నదికి అడ్డంగా ఆ తెట్టు కనిపించింది. ఇటీవలి భారీ వర్షాల తరువాత కూడా ఈ తెట్టు అలా నది మీద ఇసుకమేటలా స్పష్టంగా కనిపించిందంటే దాని సాంద్రత అర్థమవుతుంది. ఖని వంతెనకు సమీపంలోని కర్మాగారాల నుంచి వచ్చిన వ్యర్థాల కారణంగానే ఇలా తెట్టు కట్టిందని తెలుస్తున్నది. ఆ కాలుష్యపు నురుగ కిలోమీటరు మేర విస్తరించి ఉండడం మరీ కలవరం కలిగించే విషయమే. ఈ ఘాతుకం మీద తెలంగాణ ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్రంగానే స్పందించి నట్టు అదే పత్రికలో రెండురోజుల తరువాత వచ్చిన వార్తను బట్టి తెలుస్తున్నది. సంతోషం. ఈ ఘోరం మీద విచారణ జరిపించాలంటూ పర్యావరణ శాఖ అధికారులకే కాకుండా, సింగరేణి ఎండీకి కూడా వెంటనే ఆదేశాలు జారీ చేశారని ఆ పత్రిక వెల్లడించింది. దీనితో జాయింట్‌ ‌చీఫ్‌ ‌పొల్యుషన్‌ ‌కంట్రోల్‌ ఇం‌జనీర్‌ ‌కూడా వెళ్లి ఆ నురుగను పరిశీలిం చారట. గోదావరి వంతెన దగ్గర నుంచి ఓసీపీ వరకు నదిలో కలిసే వ్యర్థాల గురించి ఆరా కూడా తీశారట.

నదులు కలుషితం కావడం ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్య. భారతదేశానికి సంబంధించి ఇది మరింత ప్రమాదకర సమస్య. ఈ దేశంలో దాదాపు 400 నదులు ఉన్నాయి. అందులో ఎనిమిది మహానదులు. 20 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. అయినా నీతి ఆయోగ్‌ 2019, ‌జూన్‌ ‌నివేదిక ప్రకారం 600 మిలియన్ల భారతీయులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నాలుగింట మూడొంతుల ఆవాసాలకు తాగునీరు అందడం లేదు. కారణం-నదుల పట్ల మనకు రోజురోజుకీ పెరిగి పోతున్న నిర్లక్ష్యం. మన నదులలో అత్యధికం కాలుష్యం బారిన పడినవే. కొద్దికాలం క్రితం ప్రపంచ వ్యాప్తంగా నీటి ప్రమాణాల సూచీ తయారు చేసినప్పుడు అందులో భారత్‌ ‌స్థానం 120. అంత దిగజారి పోయాంది మన నీటి పరిస్థితి. సూచీలో ఉన్న మొత్తం దేశాలు 122 అని గమనించి నప్పుడయినా మనం మేల్కొనగలగాలి. దేశ నీటి వనరులలో 70 శాతం కలుషితమైపోయాయి. 2015లో తేల్చిన లెక్కల ప్రకారం కలుషితమైన నదుల జాబితా 121 నుంచి 275కి పెరిగింది. ఈ పతనం 2010 -2015 మధ్య జరిగినదే కూడా. ఈ లెక్క సాక్షాత్తు కేంద్ర కాలుష్య నివారణ బోర్డు ఇచ్చినదే.

దేశంలోని ఎనిమిది గొప్ప నదులలో ఒకటి గోదావరి కలుషితం కావడం ప్రారంభమై చాలా కాలమైంది. క్షాళన పని మాత్రం మూడు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. కానీ ఫలితాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నదులను కాపాడుకోవలసిన అవసరం ప్రభుత్వాల ప్రాధాన్యంగా భావించడం లేదు. గోదావరి ఖని వద్ద కనిపించిన నురుగతో కూడిన తెట్టు ఇందుకు తాజా ఉదాహరణ. మూడు దశాబ్దాలు గడిచినా నదిని ప్రధానంగా కాలుష్యానికి గురిచేస్తున్న పారిశ్రామిక వ్యర్థాలను ప్రభుత్వాలు ఆపలేకపోయాయి. ఇది పెద్ద వైఫల్యం. గంగానది క్షాళనకు పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగు తున్నది. గంగా పరీవాహక ప్రాంతం అంటే భారత సేద్యంలో దాదాపు ఇరవై ఆరు శాతం. ఐదు రాష్ట్రాలు ఈ నది మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈ నది క్షాళనకు ఇంతవరకు వందలాది కోట్లు ఖర్చు చేశారు. ఇంకా చేస్తున్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ విషయం మీద శ్రద్ధ తీసుకుంటు న్నారు. అయినా ఆ ప్రయత్నం చాలడం లేదని తేలిపోయింది. గంగానది మాత్రమే కాదు, దేశంలోని చాలా నదులు కూడా అదే స్థాయిలో కలుషితమై ఉన్నాయి. వాటిని కూడా రక్షించుకోవాలన్న తపన అదే స్థాయిలో ఉండాలి. ఇలాంటి దశలోనే బాబా రాందేవ్‌ ‌వంటివారు తమకు చేతనైన రీతిలో గంగ రక్షణకు చర్యలు తీసుకున్నారు. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఆయన కాశీ వచ్చి ఘాట్లకు సమీపంలో ఉన్న పెద్ద పెద్ద ఇనప తూములను తన పరివారంతో, గంగామాత భక్తులతో వచ్చి నిర్మొహ మాటంగా ధ్వంసం చేయించారు. అవన్నీ పరిసరాల లోని కర్మాగారాలు విడుదల చేసిన ప్రాణాంతక వ్యర్థాలను తీసుకొచ్చి ఆ పవిత్ర నదిలో కలిపేవే. దాదాపు 1100 పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు ఈ మహోన్నత నదిలో చేరిపోతున్నాయి. అంతకు పూర్వమే అక్కడి హరిశ్చంద్ర ఘాట్‌లో సగం కాలిన మనుషుల శవాలను నదిలోకి నెట్టే పద్ధతిని మానిపిం చారు. మంచిదే. కానీ కర్మాగారాల వ్యర్థాలను ఆపడం దగ్గర ఎందుకు శ్రద్ధ ఉండదు?

భారతదేశంలో గంగానది తరువాత రెండో అతి పొడవైన నది గోదావరి. అందుకే ఈ మహోన్నత జీవనదిని దక్షిణ గంగగా భావిస్తారు. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో పుట్టిన ఈ నదీమతల్లి తూర్పుగా 1,465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్ర (48.6 శాతం), తెలంగాణ (18.8 శాతం), ఆంధప్రదేశ్‌ (4.5 ‌శాతం), చత్తీస్‌గఢ్‌ (10.9‌శాతం), ఒడిశా (5.7 శాతం) రాష్ట్రాలను తడుపుతున్నది. అంటే ఇది కూడా గంగానది వలెనే ఇప్పుడు ఐదు రాష్ట్రాలను తడుపుతూ వెళుతున్నది. చాలా ఉపనదులను కలుపుకుని ఆంధప్రదేశ్‌లోని అంతర్వేది వద్ద సాగరంలో సంగమిస్తుంది. గోదావరి నీటితో తడిసే భూభాగం 3,12,812 కిలోమీటర్లు. అంటే దేశ భూభాగంలో పదింట ఒక వంతు. ఇందులో వార్షిక నీటి వెల్లువ 110 బిలియన్‌ ‌క్యూబిక్‌ ‌మీటర్లు. ఈ నీటిలో దాదాపు 50 శాతం వినియోగంలో ఉంది.

తన జన్మస్థానమైన మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌ ‌జిల్లాలోని కందకుర్తి గ్రామం ద్వారా గోదావరి తెలంగాణలో ప్రవేశిస్తుంది.అక్కడ హరిద్ర, మంజీర గోదావరితో కలుస్తుంటాయి. భద్రాచలం మీదుగా పాపికొండలలో నుంచి ఆంధప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ కిన్నెరసాని, శబరి కలుస్తాయి. అక్కడ నుంచి రాజమహేంద్రవరం చేరి, అపారంగా విస్తరిస్తుంది. ధవళేశ్వరం వద్ద వృద్ధ గౌతమి, వసిష్ట పాయలుగా విడవడుతుంది. అవి మళ్లీ రెండేసి పాయలుగా విడవడి అన్నీ కలసి బంగాళాఖాతంలోని వివిధ చోట్ల కలుస్తాయి.

నదీజలాలను కాలుష్యం కాకుండా చూడాలన్న ప్రభుత్వాలు, పర్యావరణ ఉద్యమ సంఘాల ప్రయత్నాలు కొన్ని దశాబ్దాలుగా ఫలించడం లేదు. కొన్ని దశాబ్దాలుగా సాధ్యం కాని ఆ కార్యాన్ని కరోనా కొన్ని వారాలలో నెరవేర్చింది. కొవిడ్‌ 19 ‌కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రకృతి వనరులు క్షాళనకు నోచుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగినవి నదులే. గోదావరి కూడా లాక్‌డౌన్‌ ‌కాలంలో కొంత సాంత్వన పొందింది. ఎందుకంటే, పర్యావరణంతో పాటు నదులను కలుషితం చేయడంలో కీలక పాత్ర పోషించే పరిశ్రమలు అప్పుడు తాత్కాలికంగా మూత పడ్డాయి. అలాగే పుణ్యక్షేత్రాలకు, నదీస్నానాలకు (రవాణా సదుపాయం లేక) వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అయితే లాక్‌డౌన్‌ ‌దశలవారీగా ఎత్తివేస్తున్న క్రమంలో నది శరవేగంగా కలుషితం కావడం తిరిగి మొదలయింది.

వ్యర్థాలను శుద్ధి చేసే యంత్రాల (సీఈటీపీ)ల ఏర్పాటుతోనే నదికి కాలుష్యం బెడద కొంత తగ్గుతుంది. ఇది మహారాష్ట్రలో ఇప్పటికే ప్రారంభ మైంది. ‘నదులు కాలుష్య రహితంగా, శుభ్రంగా ఉండగా నేను చూడడం ఇదే (లాక్‌డౌన్‌లో) మొదటి సారి. అదైనా ఏప్రిల్‌ ‌నెలలోను, మే నెల తొలి పక్షంలోనే కనిపించింది. కానీ ఇప్పుడు కాలుష్యం స్థాయి మళ్లీ ఒక దశకు చేరుకుంది. ఎందుకంటే పరిశ్రమలు మళ్లీ వాటి వ్యర్థాలను నదిలోకి వదిలి పెట్టడం ఆరంభించాయి. నాలాల ద్వారా చాలా మురికి నదిలోకి చేరుతోంది’ అని పర్యావరణవేత్త, గోదావరి కాలుష్య నివారణ వ్యాజ్యంలో భాగస్వామి రాజేశ్‌ ‌పండిత్‌ అన్నారు.ఒక నదిని కాపాడుకోవడం ఎంత కష్టమో లాక్‌డౌన్‌ ‌మనకు తెలియ చెప్పింది. కొన్ని కోట్ల మంది గృహ నిర్బంధంలో ఉండాలి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని లెక్క చేయకుండా పరిశ్రమలను స్తంభింప చేయాలి. ఒక నదిని కాపాడుకోవడానికీ ఇంతటి త్యాగం అవసరమే. ఒక పరిశ్రమ భావి తరాలకు దక్కుతుందనీ, వారి అవసరాలకు కూడా ఉపయోగపడుతుందనీ చెప్పలేం. నది ఎన్ని తరాల వారికైనా ఆవశ్యకమే. పారిశ్రామికీకరణ అవసరమే.

కానీ నదులనూ, పర్యావరణాన్ని పణంగా పెట్టి దానిని సాధించుకోవడం విజ్ఞత కాబోదు. నదుల రక్షణను గాలికి వదిలిపెట్టడం నేరం. చరిత్ర క్షమించదు.

ఉత్తర భారతంలో గంగ క్షాళనకు జరిగిన, జరుగుతున్న స్థాయిలో కాకున్నా, గోదావరి పరిరక్షణకు కూడా కొంత ప్రయత్నం జరగకపోలేదు. గంగతో అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ముడిపడి ఉన్న విధంగా ఇక్కడ గోదావరితో అలాంటి అనుబంధం కానరాదు. గంగ పరిరక్షణ కోసం అక్కడ కొందరు సాధువులు ప్రాణత్యాగం చేశారు. నిజానికి ఇలాంటి పరిస్థితి ఏ నది విషయంలోను జరగరాదు. నదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం తమ గురుతర బాధ్యత అని ప్రతి తరంలో ప్రతి భారతీయుడు భావించు కోవలసి ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక, మత, మనో భావాలకు అతీతంగా ఆలోచించినా అభ్యంతరం లేదు. ఒక పెద్ద పరిశ్రమ వల్ల పదివేల కుటుంబాలు బతుకుతాయి. అంతే సంఖ్యలో పరోక్షంగా ఆధారపడి బతుకుతాయి. కానీ కొన్ని వేల గ్రామాలు, కొన్ని లక్షల ఎకరాల సాగు ఒక్క నది మీద ఆధారపడి ఉంటాయి. ఇందులోని వాస్తవికతను గుర్తించకుండా పరిశ్రమలకు పెద్ద పీట వేయడం, వాటికి నదులను కలుషితం చేసే హక్కు ఇవ్వవచ్చునన్న ధోరణి ప్రభుత్వాలలో కనిపించడం బొత్తిగా అవాంఛనీయం.


మురికి… మన నదులను సర్వ నాశనం చేసినది మురికే. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న వివరాలు విస్తుపోయేటట్టు చేస్తాయి. 2015 ప్రకారం ఒక్క రోజులో 61,948 మిలియన్‌ ‌లీటర్ల మురికి ఉత్పత్తి అవుతున్నది. ఇందులో ప్రాథమిక దశ శుద్ధి కేవలం 38 శాతం మురికికే జరుగుతున్నది. అంటే ప్రాథమిక దశ శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ సామర్థ్యం అంతే. కానీ ఇంతకంటే ఎంతో ఎక్కువగా మురికి మన నదులలోకి వెళుతోంది. అంటే రోజుకి 38,000 వేల మిలియన్‌ ‌లీటర్ల మురికి నదులలోకి పంపుతున్నాం.

నదుల శుద్ధి కోసం అసలు ఏమీ జరగడం లేదని చెప్పడం తొందరపాటు. ఆ కార్యక్రమం కోసం సెంటర్స్ ‌నేషనల్‌ ‌రివర్‌ ‌కన్జర్వేషన్‌ ‌ప్లాన్‌, అ•ల్‌ ‌మిషన్‌ ‌ఫర్‌ ‌రిజునవేషన్‌, ‌స్మార్ట్ ‌సిటీస్‌ ‌మిషన్‌ ‌పోగ్రామ్స్, ‌నమామి గంగ, రివర్‌ ‌డెవలప్‌మెంట్‌ అం‌డ్‌ ‌గంగా రిజునవేషన్‌ ‌వంటి పథకాలు గంగా పరీవాహక ప్రాంతంలో చేపడుతున్నారు. గంగ క్షాళనకు ఇంతవరకు రూ. 7,000 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ కృషి చాలడం లేదనే ఫలితాలు చెబుతున్నాయి. ఇంత ఖర్చు చేసినా దేశంలో నదుల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 275 నదులకు సంబంధించిన 302 పరీవాహక ప్రాంతాలు కలుషితమైనట్టు వెల్లడైంది. ఈ మధ్య వెలువడిన లెక్కల ప్రకారం కాలుష్యం బారిన పడిన పరీవాహక ప్రాంతాలు 302 నుంచి 351కి పెరిగాయి. ఇలా ఎక్కువ కలుషితమైన నదీ పరీవాహక ప్రాంతాలు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అవి: మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ‌పశ్చిమ బెంగాల్‌.


ఆంధప్రదేశ్‌లో నదుల కాలుష్యం గురించి 2019, జూలై చివరన లోక్‌సభలో చిన్నపాటి చర్చ జరిగింది. గడచిన కొన్నేళ్లుగా నదులు కాలుష్యం బారిన పడడం అనే పక్రియ అప్రతిహ తంగా సాగిపోతూనే ఉందని పర్యావరణ, అటవీశాఖల మంత్రి బాబుల్‌ ‌సుప్రీయో చెప్పారు. ఆంధప్రదేశ్‌కు సంబంధించి పెద్ద ఎత్తున కలుషితమైపోతున్న ఐదు నదీ పరీవాహక ప్రాంతాలను కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ (సీపీసీబీ) గుర్తించిన సంగతిని కూడా మంత్రి చెప్పారు. అందులో గోదావరి కూడా (రాయన్‌పేట నుంచి రాజమండ్రి వరకు ఉన్న పరీవాహక ప్రాంతంలో జరిగిపోతున్న కాలుష్యం గురించి) ఉంది (మిగిలినవి కృష్ణ-అమరావతి నుంచి హంసలదీవి, కుందు- నంద్యాల నుంచి మద్దూరు, తుంగభద్ర- మంత్రాలయం నుంచి భావాపురం, నాగావళి- తోటపల్లితో కలిపి). వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు లేవనెత్తిన అంశం మీద ఈ వివరాలు కేంద్రమంత్రి తెలియచేశారు. నదుల క్షాళన కార్యక్రమం కోసం ఆ సంవత్సరం వివిధ రాష్ట్రాలకుగాను రూ.196 కోట్లు కేటాయించిన (ఆ ఆర్థిక సంవత్సరం వరకు) సంగతిని కూడా మంత్రి సభ్యుల దృష్టికి తెచ్చారు.

గోదావరిలో కాలుష్యం భయపెట్టే రీతిలో ఉన్నమాట ఎప్పుడో రుజువైంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర నది కలుషితం కావడానికి ఎంత కారణమో ఒకసారి చూద్దాం. తెలంగాణలో పట్టణ ప్రాంత మురికి ఉత్పత్తి రోజుకు 1,671 మిలియన్‌ ‌లీటర్లు. ఇందులో శుద్ధి అవుతున్నది రోజుకు 685.8 మిలియన్‌ ‌లీటర్లు. కలుషిత పరీవాహక ప్రాంతాలు 7. ఆంధప్రదేశ్‌లో అయితే రోజుకు పట్టణ ప్రాంతాలలో ఉత్పత్తి అవుతున్న మురికి 2,871 మిలియన్‌ ‌లీటర్లు. శుద్ధి అవుతున్నది 247.27 మిలియన్‌ ‌లీటర్లు. కలుషిత పరీవాహక ప్రాంతాలు 6. ఇక మహారాష్ట్ర- రోజుకు విడుదలయ్యే పట్టణ ప్రాంత మురికి 8,143 మిలియన్‌ ‌లీటర్లు. శుద్ధి అయేది 5,160.36 మిలియన్‌ ‌లీటర్లు. కలుషిత పరీవాహక ప్రాంతాలు 49. ఇన్ని కలుషిత పరీవాహక ప్రాంతాలు దేశంలో మరే రాష్ట్రంలోను, ఏ నది పరీవాహక ప్రాంతంలోను కూడా లేవు.


‌కాలుష్యం వెనుక…

ప్రపంచ బ్యాంక్‌ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 195 మిలియన్‌ ‌హెక్టార్ల సాగు నేల ఉంది. ఆ నివేదిక పేరు ‘ఇస్యూస్‌ అం‌డ్‌ ‌ప్రైయారిటీస్‌ ‌ఫర్‌ అ‌గ్రికల్చర్‌’. ఆ ‌సాగు భూమిలో దాదాపు 63 శాతం అంటే 125 మిలియన్‌ ‌హెక్టార్లు వర్షాధార భూమి. మిగిలిన 37 శాతం, అంటే 70 మిలియన్‌ ‌హెక్టార్లు నీటి పారుదల సౌకర్యంతోనే సాగు అవుతున్నాయి. ఈ నీటి వనరులన్నీ నదుల నుంచే అని వేరే చెప్పక్కరలేదు. రైతులతో పాటు, మత్స్యకారులకే కాకుండా అనేక రకాలుగా నదులు మనుషులకు ఉపాధిని సమకూరుస్తున్నాయి. ప్రాణికోటి నదుల ఆసరాతో జీవన సాగిస్తున్నది. అసలు నదులు లేని మానవ జీవితాన్ని ఊహించలేం. మన దేశంలో అలాంటి నదులు కూడా కలుషితమవుతున్నాయి. దీనికి అనేక కారణాలు చెబుతున్నారు. ఇందులో ప్రధాన కారణం గృహాల నుంచి వెలువడే వ్యర్థాలు, మురికి. ఎరువులు, రసాయనాలు మితిమీరి వాడడం. కొన్ని మూఢ నమ్మకాలు కూడా ఇందులో తోడవుతున్నాయి.

వనరుల వినియోగం పేరుతో చమురు సహజవాయువు తవ్వకాలు జరుపుతున్నారు. ఇవి సాధారణంగా నదీ పరీవాహక ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి. కానీ నదుల రక్షణకు అవసరమైన చర్యలను చమురు, వాయువు తవ్వకం జరిపేవారు తీసుకోవడం లేదు. తీసుకున్నవి కూడా చాలడం లేదు. అలాగే కర్మాగారాల నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాలు నదులకు అపారమైన హాని చేస్తున్నాయి. పెరిగిన జనాభా, పరిశుభ్రత పట్ల స్పృహలేని జనం నదులను కలుషితం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలతో మనుషులు నదులను దారుణంగా పాడు చేస్తున్నారు. బట్టలు ఉతకడం, మురికినీరును నదిలోకి పంపడం కూడా ప్రమాదకరంగా పరిణమించాయి. గ్రామీణ ప్రాంతాలలో నదుల గట్లను పాయఖానాలుగా ఉపయోగించడం కూడా కనిపిస్తుంది. అక్రమంగా సాగిపోతున్న ఇసుక తవ్వకాలు కూడా నదుల పరిశుభ్రతను, నిజానికి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.


 పారిశ్రామిక వ్యర్థాలు ఈ జీవనది ఉనికికే ప్రమాదకరంగా పరిణమించాయని పర్యావరణవేత్తలు ఏనాటి నుంచో ఘోషిస్తున్నారు. చాలా నదులతో పాటు గోదావరి శుద్ధి కార్యక్రమం కూడా 1991లోనే రూ. 34.19 కోట్లతో ఆరంభమైంది. కానీ ఫలితాల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ నదితీరంలో ఉన్న అదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌ఖమ్మం జిల్లాలలోని కర్మాగారాల నుంచి ఈ నదిలోకి చేరుతున్న వ్యర్థాలే దీనికి పెద్ద బెడదగా తయారయ్యాయి. నది రక్షణ ప్రణాళికలను అమలు చేయవలసిన స్థానిక సంస్థల మధ్య సయోధ్య లేదు. ఒక అధ్యయనం ప్రకారం భద్రాచలం జిల్లా నుంచి వెళుతున్న వ్యర్థాల వల్లనే నదికి పెద్ద గండం పొంచి ఉంది. ఈ కాలుష్యం ఇలాగే కొనసాగితే పుణ్యక్షేత్రమైన భద్రాచలం, ఈ పట్టణానికి చుట్టు పక్కల ఉన్న యాభయ్‌ ‌వరకు గ్రామాలు తాగునీటి విషయంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని నిపుణులు ఏనాడో హెచ్చరించారు కూడా. పారిశ్రామిక వ్యర్థాలు, మురికి శుద్ధి చేయకుండా నిరంతరాయంగా నదిలోకి వదిలిపెడుతున్న ఫలితం ఇప్పటికే కనిపిస్తున్నది. ఇందుకు నిపుణులు ఐటీసీఎస్‌పీడీ ప్లాంట్‌ను ఉదాహరణగా చూపు తున్నారు. ఇది బూర్గంపహాడ్‌ ‌మండలం సారపాకలో ఉంది. దీని నుంచి వ్యర్థాలు గోదావరిలోనే నాగినేని ప్రోలు రెడ్డిపాలెం వద్ద కలుస్తాయి. భద్రాచలం పట్టణంలోని గృహ వ్యర్థాలు కూడా నదిలోకే పంపిస్తున్నారు. వీటికి ప్రాథమిక దశ ఫిల్టరింగ్‌ ‌లేదా, శుద్ధి చేసే పని చేపట్టడం లేదు.

యాభయ్‌ ఏళ్ల క్రితం గోదావరి నీరు తాగడానికి ఉపయోగించుకొనేవారు. కానీ ఇవాళ ఆ నీరే తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికి రాకుండా పోయిందని నిపుణులు చెబుతున్నారు. సాగు సరే, తాగు అవసరాలకు ఈ నదీజలాలను ఉపయో గించుకుంటున్నవారు ఇప్పటికీ ఉన్నారు. తీరంలో ఉన్న ప్రజలకు ఇది తప్పేది కాదు. అయితే వారు కొన్ని రుగ్మతల బారినపడక తప్పడం లేదు. కొన్ని రకాల చేపలు, జలచరాలు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. నదిలో చేరిపోతున్న రసాయనిక వ్యర్థాలు ఇందుకు కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మొదట ఈ నదిని పారిశ్రామిక వ్యర్థాల నుంచి కాపాడవలసి ఉంది. భద్రాచలం ప్రాంత వాసులు కూడా నదిలో చేరుతున్న పారిశ్రామిక వ్యర్థాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదిలో కాలుష్యం స్థాయి తీవ్రంగా పెరిగిపోయింది. దీనిని అదుపు చేయాలని కూడా వారంతా ఏనాటి నుంచో చెబుతున్నారు.

పరిశ్రమలు నదీజలాలను అవసరాల మేరకు ఉపయోగించుకుంటున్నాయి. కానీ వ్యర్థాలను మాత్రం శుద్ధి చేయకుండా నదిలోకి విడిచిపెట్టి ఆ నదినే ధ్వంసం చేస్తున్నాయి. అంటే వ్యర్థాలను విసర్జించవలసి వచ్చినప్పుడు పాటించవలసిన కనీస నియమాలకు అవి నీళ్లొదిలిపెట్టాయి. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ ప్రమాదకర విధానాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నాయి. అయినప్పటికీ వాటి మీద చర్యలు లేవు. శుద్ధి చేయని వ్యర్థాలను విసర్జించేటప్పుడు పాటించాలంటూ న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను కూడా అవి గౌరవించడం లేదు. ఇక ప్రైవేటు కర్మాగారాల సంగతి చెప్పేదేముంది? వ్యర్థాలను నదిలోకి పంపదలుచుకుంటే మొదట వాటిని శుద్ధి చేయవలసి ఉంటుంది. ఈ సంవత్సరం జనవరిలో బొంబాయి హైకోర్టు ఒక కీలక నిర్ణయమే తీసుకుంది. నాలాల ద్వారా నదిలోకి వ్యర్థాలను శుద్ధి చేయకుండా పంపే మహారాష్ట్ర ఇండస్ట్రీయల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని పరిశ్రమల మీద చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించింది. మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. పవిత్రస్నానాల కోసం దిగిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చర్మరోగాలు వస్తున్నట్టు వారి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక ఈ నీరు తాగితే వ్యాధుల బారిన పడక తప్పించుకోవడం సాధ్యమే కాదు. రసాయనిక వ్యర్థాల శాతం నదిలో రోజు రోజుకీ పెరిగిపోతోందని భద్రాచలవాసులు చెబుతారు. ఆంధప్రదేశ్‌లో రాజమహేంద్రవరం వద్ద కూడా నదిని కలుషితం చేసే పని విస్తృతంగానే సాగుతున్నది. మరపడవలు మరొక తీవ్రమైన బెడద. అంతర్వేదిలో సాగరంలో సంగమించే ముందు ఉండే సఖినేటిపల్లి-నరసాపురం రేవు వరకు అనేక రేవులలో మరపడవలు ప్రవేశపెట్టారు. అవి విడిచిపెట్టే చమురు ఆయా ప్రాంతాలలో తెట్టు కట్టి ఉంటుంది.


ఒక మృతనది
ఒక నగరం వరకే, ప్రాంతం వరకే ప్రవహించే నదులు కూడా మనకు ఉన్నాయి. అందులో మూసీ ఒకటి. హైదరాబాద్‌, ‌పరిసరాలలోనే ప్రవహించే నది ఇది. నిజాం కాలంలో థేమ్స్ ‌నది వలె ఇది వైభవం చాటుకుంది. కానీ ఇప్పుడు ఇదొక మురికిగుంట. చెత్తబుట్ట. 1999 నాటి జెనోమ్‌ ‌వ్యాలీ ప్రాజెక్టు పుణ్యమా అని దీని కాలుష్యం ఎన్నో రెట్లు పెరిగింది. రకరకాల పరిశ్రమలు ఇందుకు కారణం. ఇవే ఈ నదిని అత్యంత కలుషిత నదులలో ఒకటిగా మార్చి మృత నదిగా మార్చాయి. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ సంస్థ అంచనా ప్రకారం ఇందులో కోలిఫారమ్‌ ‌బాక్టీరియా 2007 నుంచి పెరిగిపోతూనే ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ నది క్షాళనకు కృషి ఆరంభించింది.


నదుల కాలుష్యం సమస్యను రాజకీయం చేసే ప్రబుద్ధులు కూడా దేశంలో చాలామంది ఉన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు హిందూ వ్యతిరేక ప్రచారానికి కూడా ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. 2015 నాటి గోదావరి పుష్కరాల వల్ల గోదావరి కలుషితమైపోయిందంటూ మహారాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్‌ ‌దాఖలైంది. దీని మీద కోర్టు కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవలసిందని నాడు ఉన్న ఫడ్నవీస్‌ ‌ప్రభుత్వాన్ని ఆదేశించి కూడా. 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల వల్ల గోదావరి కలుషితమైందని ఆరోపించడం కచ్చితంగా తెంపరితనమే. రోజువారీ నదిలోకి వచ్చి పడుతున్న గృహ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాల సంగతి ఏమిటి? 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాతో నది కలుషితమైపోతోందన్న వారు ఇలాంటి వ్యర్థాల విషయంలో మౌనం దాల్చడం సిగ్గుచేటు. కుంభమేళాలు, పుష్కరాలు వందల ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. పారిశ్రామికీకరణ కొన్ని దశాబ్దాల నాటిది. దేశంలో చాలా నదులకు పుష్కరాలు నామమాత్రంగా జరుగుతాయి. కానీ ఆ నదులు  కూడా కలుషితమవుతూనే ఉన్నాయి.

పారిశ్రామికీకరణ, దీని ఆధారంగా జరిగే పట్టణీకరణ నదులను కలుషితం చేస్తూ మానవాళికే ఒక సవాలును విసురుతున్న మాటను కాదనలేం. ఆ రెండింటి వల్ల ప్రజలకు, ముఖ్యంగా భారతీయులకు పరిశుభ్రమైన తాగునీరు ప్రశ్నార్థకమైపోయింది. ఆర్థిక ప్రగతి ఫలితంగా చాలా నదులు మురికిగుంటలుగా మారుస్తున్నారు. ఇవాళ దేశంలోని ఎక్కువ శాతం మునిసిపాలిటీలు నదీజలాలను తమ ప్రజలకు తాగునీటిగా సరఫరా చేయడానికి సిద్ధంగా లేవు. గడచిన ఆరు దశాబ్దాలలో ప్రభుత్వాలే నదులను కలుషితం చేయడానికి అనుమతించాయంటే అతిశయోక్తి కాదు. కానీ నదుల పరిరక్షణ ఒక జాతి అవసరం. మానవాళి అవసరం. అందుకే నదుల పరిరక్షణ అనేది ప్రజా ఉద్యమం కావాలి. ప్రజలు కూడా నదులంటే పండుగలు, పర్వదినాలలో వెళ్లి స్నానం చేసి పూజించడమే కాదు, జీవితకాలం, ప్రతిక్షణం వాటిని పవిత్ర జలాలుగానే పరిగణించాలి. రాష్ట్రాలు జలాల మీద హక్కు కోసమే కాకుండా నది పరిశుభ్రత గురించి కూడా దృష్టి పెట్టాలి.

నిన్నటి నాగరికతా వైభవానికీ, రేపటి ఆర్థిక పురోగతికీ మూలం నది. దీనిని నిర్లక్ష్యం చేయడం ఘోర వైఫల్యమే. చరిత్రలో భారతీయ సమాజం తప్పిదాలు, వైఫల్యాలు చాలా కనిపిస్తాయి. ప్రజల మధ్య ఐక్యత లేకపోవడం, దేశీయమైన పరిజ్ఞానం మీద చిన్నచూపు, బానిసబుద్ధి… ఇలాంటివి. ఇవే ఒక జాతిని, దాని గొప్పతనాన్ని ధ్వంసం చేశాయి. ఇప్పుడు నదుల పట్ల ప్రజలు చూపుతున్న నిర్లక్ష్యం కూడా అలాంటి తప్పిదమే. అలాంటి వైఫల్యమే.

–  జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE