చివరి భాగం
ఎంకెఏ సంయుక్త కార్యదర్శి 1952లో ఈ ప్రాంతాల ప్రతినిధిగా మారాడు. 1967లో అలాంటి పదవి మరొకటి సృష్టించారు. గిల్గిత్, బాల్టిస్తాన్‌లకు వేరువేరుగా ఎంకెఏ అన్ని పరిపాలనా పరమైన అధికారాలు పొందడంతోపాటు, నియామకాలన్నీ చేశాడు. 1947 నుంచి 1960 వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించలేదు. 1970లో మొదటి సారి ఆజాద్ కశ్మీర్ శాసనసభ ప్రతినిధులు, అధ్యక్షుని ఎన్నికకు ఒక చట్టం జారీ అయ్యింది.
1974లో ఆజాద్ కశ్మీర్‌లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు 1970లోనే ముగిసిన కరాచీ ఒప్పందం ప్రకారమే పాకిస్తాన్, ఆక్రమిత ప్రాంతాల మధ్య సంబంధాలు కొనసాగాయి. ఉత్తర ప్రాంతాల పరిపాలన ఆజాద్ కశ్మీర్‌కు అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా పాకిస్తాన్ దానిని పట్టించుకోలేదు. ప్రధాని జనరల్ జియా ఉల్ హక్ ఉత్తర ప్రాంతాల చట్ట వ్యవస్థ 1974-75 క్రింద ఈ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ శిక్షా స్మృతి (పీనల్ కోడ్)ను అమలు పరచాడు. అధ్యక్షుడు యాహ్యా ఖాన్ ఉత్తర ప్రాంతాల సలహా సంఘాన్ని 14మంది సభ్యుల ఉత్తర ప్రాంతాల కౌన్సిల్‌గా మార్చాడు. ఈ ప్రాంతంలో ఎలాంటి హైకోర్టుగానీ, సుప్రీంకోర్టు బెంచ్ కానీ లేవు. ఈ ప్రాంత ప్రజలు పాకిస్తాన్ కోర్టులకుగానీ, ఆజాద్ కశ్మీర్ కోర్టులకుగానీ వెళ్లే అవకాశం లేదు.
తిరుగుబాటు, సైనిక పాలన ప్రారంభమైన తరువాత గిల్గిత్, హంజా, స్కార్డులు పాకిస్తాన్‌లో అంతర్భాగమంటూ జియా ఉల్ హక్ ప్రకటించాడు. 1982లో తీర్మానం ఆమోదించిన ఆజాద్ కశ్మీర్ శాసన సభ గిల్గిత్, బాల్టిస్తాన్ జమ్ముకశ్మీర్‌లో అంతర్భాగమని అవి ఆజాద్ కశ్మీర్‌లోనే ఉంటాయని ప్రకటించింది.
ఉత్తర ప్రాంతాలు జమ్ముకశ్మీర్‌లో చట్టపరమైన భాగమని, వాటిని వెంటనే తమకు అప్పజెప్పా లంటూ ఆజాద్ కశ్మీర్ సుప్రీంకోర్టు 1993లో తీర్పుచెప్పింది. ఈ ప్రాంతం ఒకప్పుడు బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చినా, వాళ్లు దేశాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఆ లీజు ఒప్పందం దానంతట అదే రద్దయింది. ఆ తరువాత రంగంలోకి వచ్చిన పాకిస్తాన్ మెల్లగా ఈ ప్రాంతంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. పాకిస్తాన్ పాలనలో ఈ ప్రాంత ప్రజల కష్టాలు మరింత పెరిగిపోయాయి. వారి కనీస హక్కులను కూడా పాకిస్తాన్ కాలరాసింది.
1994లో ఈ ప్రాంతంలో ఒక పాలనా వ్యవస్థను ఏర్పాటుచేసే ఉద్దేశంతో బెనజీర్ భుట్టో ప్రభుత్వం ఉత్తర ప్రాంతాల పాలనా చట్టాన్ని అమలు చేసింది. అయినా ఈ ప్రాంతంపై పాకిస్తాన్ అధికారుల పెత్తనం మాత్రం పోలేదు.
ఉత్తర ప్రాంతాల్లో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడాన్ని పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. అయినా పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
అధ్యక్షుడు ముషారఫ్ 1994 చట్టాన్ని మార్పు చేసి 2007 చట్టాన్ని తెచ్చాడు. ఆ తరువాత గిల్గిత్, బాల్టిస్తాన్ స్వయంపాలన, సాధికారత బిల్లును అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ ఆమోదించారు. జియా ఉల్ హక్ తెచ్చిన చట్టానికి పూర్తి విరుద్ధంగా ఈ కొత్త బిల్లు ఆజాద్ కశ్మీర్ మాదిరిగానే ఉత్తర ప్రాంతాలకు స్వయంపాలనాధికారాన్ని ఇచ్చింది. ‘ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉన్నప్పటికి, అది రాజ్యాంగపరంగా ఒక రాష్ట్రం కాదు’ అని అందులో పేర్కొన్నారు. ఈ పరిణామం పట్ల గిల్గిత్‌లోని పాకిస్తాన్ అనుకూల వాదులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు ప్రధాని గిలానీ ‘గిల్గిత్ బాల్టిస్తాన్ రాజ్యాంగపరంగా దేశంలో భాగం కాదు, అలాగే కశ్మీర్ విషయంతో ముడిపడి ఉన్నది కాబట్టి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఇవ్వడం కుదరదు’అని స్పష్టం చేశాడు. దీనితో ఉత్తర ప్రాంతాల స్వయంపరిపాలనాధికారం ఉత్తుత్తిదేనని తేలిపోయింది. నిజానికి ఈ ప్రాంతంపై పాకిస్తాన్ పట్టును మరింత బిగించడమే ఈ బిల్లు ఉద్దేశం.
చైనా, పాకిస్తాన్ ఆర్థిక నడవా వంటి ప్రాజెక్ట్‌లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్‌కు గిల్గిత్ ప్రాంతం చాలా కీలకమైంది. అపారమైన సహజవనరులు కలిగిన ఈ ప్రాంతం మధ్య ఆసియా మార్కెట్‌లలో ప్రవేశించడానికి మంచి అవకాశం కల్పిస్తుంది. అందుకనే గిల్గిత్‌కు నిజమైన స్వయంప్రతిపత్తి, స్వపరి పాలనాధికారం ఇవ్వడానికి పాకిస్తాన్ నిరాకరిస్తోంది.
గిల్గిత్‌ను పాకిస్తాన్‌లో ఒక రాష్ట్రంగా చేయడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయనకు గతంలో గిలానీ చేసిన ప్రకటన ఒకసారి గుర్తు చేయాలి. అయితే 2009 చట్టం ప్రకారం ఈ ప్రాంతానికి గిల్గిత్, బాల్టిస్తాన్ అనే పేరును ఖరారు చేశారు. శాసన సభ (GBLA – Gilgit Baltistan Legislative Assembly) ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి స్థానిక పరిపాలనకు నేతృత్వం వహిస్తాడు. అలాగే ఆరుగురు మంత్రులు, ఇద్దరు సలహాదారులు ఉంటారు. 24 మంది నేరుగా ఎన్నికైన సభ్యులు ఉంటారు. వారిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు శాస్త్రసాంకేతిక రంగానికి చెందిన ప్రముఖులు ఉంటారు. సమీకృత నిధి కూడా ఏర్పాటు చేస్తారు. GBLA కు ఆర్థిక స్వయంప్రతిపత్తి లభిస్తుంది. ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన అప్పీలెట్ కోర్టు కూడా ఏర్పాటైంది. ప్రత్యేక పబ్లిక్ కమిషన్, ప్రధాన ఎన్నికల సంఘం, ఆడిటర్ జనరల్ ఆఫీస్ కూడా వచ్చాయి.
ఇలా గిల్గిత్ బాల్టిస్తాన్‌పై తన పట్టును మరింత బిగించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ఆజాద్ కశ్మీర్‌కు అధ్యక్షుడు, ప్రధాని ఉన్నట్లే ఇక్కడ ముఖ్యమంత్రిని ఏర్పాటుచేసింది. అయితే అధికారాలన్నీ పాకిస్తాన్ నియమించే గవర్నర్‌కే అందజేసింది. ఈ ప్రాంతంలో శాసనసభ ఉన్నప్పటికి కౌన్సిల్ ఛైర్మన్‌గా వ్యవహరించే పాక్ ప్రధానికే సర్వాధికారాలు ఉంటాయి. కౌన్సిల్ సభ్యులను పాక్ ప్రభుత్వమే నియమిస్తుంది. అలాగే ప్రధాన నియామకాలు అన్నీ కౌన్సిల్ ఛైర్మన్ (పాక్ ప్రధాని) చేస్తారు. ఇలా శాసనసభ పూర్తిగా పాకిస్తాన్ కను సన్నల్లోనే పనిచేస్తుందన్నమాట.
అంతర్జాతీయ పరిశీలకులు, మానవహక్కుల సంస్థల మెప్పు పొందడం కోసం మాత్రమే పాకిస్తాన్ ఇలా గిల్గిత్, బాల్టిస్తాన్‌లో నామమాత్రపు వ్యవస్థను ఏర్పాటుచేసింది. రాజ్యాంగపరంగా తమదికాని ఒక ప్రాంతానికి సంబంధించి చట్టాలు చేయడానికి వీలు లేదు. అలాగే సున్నాహ్, ఖురాన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ నిబంధన చెల్లదంటూ ఆ చట్టంలో ప్రకటించింది. అయితే సున్నాహ్‌కు సంబంధించి షియా, సున్నిల మధ్య అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీనితో అక్కడ వర్గ పోరు ప్రారంభమైంది.
వర్గ విభేదాలు
1970 నుంచి షియా, సున్నిల మధ్య పోరు సాగుతూనే ఉంది. సున్నిలు అధికంగా ఉన్న ప్రదేశాలు షియాలకు ప్రమాదకారిగా మారాయి. వహాబిల ఆధిపత్యం కలిగిన కారకొరమ్ ప్రాంతంలో షియా లకు స్థానం లేదు. ఈ ప్రదేశం గుండా వెళ్లే బస్సుల్లో కూడా షియాలు ప్రయాణించడానికి లేదు. ఒకవేళ అలా ఎవరైనా షియాలు వెళ్లడానికి సాహసిస్తే వాళ్లని దోచుకుని, ఆ తరువాత నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు.
జియా ఉల్ మద్దతుతో సిపాహ్, సహాబా వంటి సున్ని, దేవబంద్ తెగలు గిల్గిత్‌లోని గిరిజన ప్రాంతాల్లోకి వ్యాపించారు. ఈ సమూహాలు షియా, ఇస్మైలీలపై దాడులకు పాల్పడతాయి. 1988లో వీళ్లు హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. పంటలు తగులబెట్టడం, ఇల్లు దోచుకోవడం, మారణకాండకు పాల్పడటం వీరికి నిత్యకృత్యం. గిల్గిత్, బాల్టిస్తాన్ ప్రజలు చట్టబద్ధమైన హక్కుల కోసం గొంతెత్తి నప్పుడల్లా పాకిస్తాన్ ఇలాంటి హింసను ప్రేరేపిస్తుంది.
ఇలా పాకిస్తాన్, సౌదీ అరేబియా మద్దతు కలిగిన సున్నిలు, ఇరాన్ సమర్థించే షియాల మధ్య ఘర్షణలు సర్వసాధారణమయ్యాయి. 1993లో జియా ఉల్ మరణం తరువాత ఈ పోరు మరింత పెరిగింది. సున్ని ఆధిపత్యం కలిగిన ప్రాంతాల్లో షియాలపై, అలాగే షియా ప్రాంతాల్లో సున్నిలపై దాడులు పెరిగాయి.
శతాబ్దాలపాటు వివిధ తెగలకు చెందిన ప్రజలు ఉత్తర ప్రాంతాల్లో శాంతియుత జీవనాన్ని సాగించారు. ఈ ప్రాంతపు ప్రత్యేకతను పరిరక్షించడం కోసం డోగ్ర పాలకులు బయటివారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునే వీలు లేకుండా నిబంధనలు విధించారు. అయితే ఈ నిబంధనలను తొలగించిన పాకిస్తాన్ ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను అక్కడికి తరలించింది. అయితే ఈ నిబంధన ఆజాద్ కశ్మీర్‌లో మాత్రం ఉంది. పాకిస్తాన్ ధోరణి మూలంగా గిల్గిత్, బాల్టిస్తాన్‌లో జనాభా నిష్పత్తి పూర్తిగా మారిపోయింది. ఈ ప్రాంతంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణలకు పాకిస్తాన్ స్వయంగా కారణమైంది. తమ భాషాపరమైన వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు బాల్టిస్తాన్ ప్రజలు టిబెట్, లద్ధాఖ్ ప్రజలతో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు.
స్థానిక అధికారుల ద్వారా పెత్తనం చెలాయించే పాకిస్తాన్ ధోరణి ఇప్పటిది కాదు. తూర్పు పాకిస్తాన్‌లో కూడా ఇలాంటి విధానాన్నే అవలంభించింది. స్థానికులకు పరిపాలనాధికారం ఇవ్వకపోవడం, ఎలాంటి హక్కులు కల్పించకపోవడం వంటి పాకిస్తాన్ ఒంటెత్తుపోకడ విధానాలవల్లనే తూర్పు పాకిస్తాన్‌లో తిరుగుబాటు జరిగి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇప్పుడు బాల్టిస్తాన్‌లో కూడా అలాగే సాగుతోంది.
గిల్గిత్, బాల్టిస్తాన్ ప్రజలను కనీసం పోలీసు వ్యవస్థలోకి కూడా తీసుకోవడం లేదు. స్థానిక షియాలంటే ఏమాత్రం నమ్మకం లేదు. స్థానికులు ఎక్కువగా కలిగిన ఉత్తర ఫిరంగి దళం (Northern Light Infantry) కార్గిల్ యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించింది. అనేకమంది శౌర్య పతకాలు కూడా పొందారు. కానీ ఆ తరువాత ఈ దళంతోపాటు భద్రతాదళాల్లో క్రమంగా స్థానికుల సంఖ్య తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో సింధ్, పంజాబ్, మొదలైన ప్రాంతాల దళాలను పాకిస్తాన్ ఉపయోగిస్తోంది.
గిల్గిత్ బాల్టిస్తాన్‌లో తీవ్రవాదం కూడా పెచ్చుమీరిపోయింది. 73 సంవత్సరాల తరువాత కూడా ఈ ప్రాంతంలో కనీసపు మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సదుపాయాలు లేవు. ఈ ప్రాంత అభివృద్ధిపై పాకిస్తాన్ ఎన్నడూ దృష్టి పెట్టలేదు. తీవ్రవాద వ్యతిరేక చట్టంలోని పరిచ్ఛేదం IV కింద అసమ్మతి, నిరసన గళాలను నిర్దాక్షిణ్యంగా నొక్కివేస్తోంది.
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ 45వ సమావేశాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఉద్యమకారుడు సాజాద్ రజా మాట్లాడుతూ ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల చట్టం 2020 మా రాజ్యాంగ, పౌర, రాజకీయ హక్కున్నింటిని హరించింది. పాకిస్తాన్‌లో మా భూభాగాన్ని విలీనం చేయడంపై వ్యక్తమయ్యే ఎలాంటి అభ్యంతరాలనైనా దేశద్రోహంగా చిత్రీకరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఉల్లంఘించడంగా పరిగణిస్తున్నారు’ అని వాపోయాడు. నిజానికి గిల్గిత్, బాల్టిస్తాన్ భారత్‌లో అభిన్న భాగం. ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవా లనుకుంటున్న చైనా, పాకిస్తాన్‌ల కుట్రను భగ్నం చేయవలసిన సమయం ఆసన్నమైంది.
– డా. రామహరిత,