గిల్గిత్‌ ‌బాల్టిస్తాన్‌పై ‌కన్నేసిన పాక్‌

భాగం – 2

చిన్న టిబెట్‌గా గుర్తింపు పొందిన బాల్టిస్తాన్‌లో కుషాణుల పాలనలో బౌద్ధం వ్యాప్తి చెందింది. 8వ శతాబ్దంలో ఇది లలితాదిత్యుని రాజ్యంలో భాగంగా ఉండేది. 15వ శతాబ్దంలో మిర్‌ ‌షంశుద్దీన్‌ అనే ముస్లిం మిషనరీ ఈ ప్రాంతంలో ఇస్లాంను ప్రచారం చేశాడు.

1586లో అక్బర్‌ ‌పంపిన సేనలు కశ్మీర్‌ను ఆక్రమించుకున్నాయి. అప్పుడే లద్ధాఖ్‌ ‌రాజకుమారితో జరిగిన వివాహం సందర్భంగా బాల్టిస్తాన్‌, ‌లద్ధాఖ్‌ ‌లలో కొంత ప్రాంతం అక్బర్‌కు దక్కింది. ఆ తరువాత కొంతకాలానికి బాల్టి ప్రజలు స్వాతంత్య్రం పొందినా షాజహాన్‌ ‌కాలంలో మళ్లీ ఈ ప్రాంతం ముస్లిం రాజ్యంలో భాగమయింది. లద్ధాఖ్‌, ‌బాల్టిస్తాన్‌, ‌కిష్టవార్‌లను కశ్మీర్‌ ‌రాజ్యంలో భాగం చేశారు. మొఘలుల కాలంలో ఈ ప్రాంతానికి ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లతో గట్టి సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ మొఘల్‌ ‌సామ్రాజ్యం బలహీనపడినప్పుడు కశ్మీర్‌కు చెందిన ఆఫ్ఘన్‌ ‌గవర్నర్‌ ఈ ‌ప్రాంతాన్ని ఆక్రమించు కున్నాడు. ఆ తరువాత ఆరు దశాబ్దాలపాటు ఈ ప్రాంతం నిరంకుశ పాలనలో మగ్గింది. సిక్కు సామ్రాజ్యం విస్తరిస్తున్నప్పుడు తమను ఆఫ్ఘన్‌ ‌నిరంకుశ పాలన నుంచి విముక్తం చేయవలసిందంటూ కశ్మీర్‌కు చెందిన ప్రతినిధి బీర్బల్‌ ‌ధార్‌ ‌మహారాజా రంజిత్‌ ‌సింగ్‌ను వేడుకున్నాడు. కశ్మీర్‌పై సైనిక చర్య చేయడానికి అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని కూడా తెలియజేశాడు. సిక్కులు ఆఫ్ఘన్‌లను ఓడించారు కానీ కశ్మీర్‌ను మాత్రమే ఉంచుకుని, జమ్మును రాజా గులాబ్‌ ‌సింగ్‌కు 1820లో జాగీర్‌గా ఇచ్చారు. 1836లో మహారాజా రంజిత్‌ ‌సింగ్‌ అనుమతితో గులాబ్‌ ‌సింగ్‌ ‌లద్ధాఖ్‌ను ఆక్రమించుకున్నాడు. అలాగే 1840లో గులాబ్‌ ‌సింగ్‌ ‌సైనికాధికారి అయిన జొరావర్‌ ‌సింగ్‌ ‌బాల్టిస్తాన్‌ను ఆక్రమించి అక్కడ మహమ్మద్‌ ‌షా అనే నామమాత్రపు పాలకుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. 1842లో మహారాజా రంజిత్‌ ‌సింగ్‌ ‌నియమించిన కశ్మీర్‌ ‌గవర్నర్‌ ‌కల్నల్‌ ‌నాథూ షా గిల్గిత్‌ను ఆక్రమించాడు. అలా బాల్టిస్తాన్‌ ‌లద్ధాఖ్‌ ‌సామ్రాజ్యంలో కలిసింది.

అమృత్‌సర్‌ ఒప్పందం

1846లో బ్రిటిష్‌ ‌వాళ్లతో జరిగిన యుద్ధం తరువాత సిక్కులు లాహోర్‌ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం బియాస్‌, ‌సట్లెజ్‌ల మధ్య ప్రాంతాలన్నీ బ్రిటిష్‌ ‌వారి అధీనంలోకి వెళ్లాయి. అలాగే సిక్కులు కోటి రూపాయలు కప్పం కూడా కట్టారు. జమ్ముకశ్మీర్‌తో సహా అన్ని పర్వత ప్రాంతాలను బ్రిటిష్‌ ‌వారికి అప్పజెప్పడానికి సిక్కులు ఒప్పుకున్నారు. అప్పుడు 75లక్షలు చెల్లిస్తే జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర రాజును చేస్తామని బ్రిటిష్‌ ‌వాళ్లు డోగ్రా రాజుతో బేరసారాలు చేశారు. కంగ్రాతో పాటు రావి, బియాస్‌ల మధ్య ప్రాంతాలు బ్రిటిష్‌ ‌వారి స్వాధీనమయ్యాయి.

అమృత్‌సర్‌ ఒప్పందం ప్రకారం 75 లక్షల రూపాయలు బ్రిటిష్‌ ‌వాళ్లకి చెల్లించి మహారాజా గులాబ్‌ ‌సింగ్‌ ‌జమ్ముకశ్మీర్‌ ‌స్వతంత్ర రాజుగా గుర్తింపు పొందాడు. జమ్ము కశ్మీర్‌ ‌పూర్తి స్థాయి సార్వభౌమ రాజ్యంగా అవతరించింది. ఇందులో జమ్ము, కశ్మీర్‌, ‌లద్ధాఖ్‌, ‌గిల్గిత్‌, ‌చిలాస్‌, ‌బాల్టిస్తాన్‌లు ఉన్నాయి. అయితే చివరి మూడు ప్రాంతాలను కలిపి ఉత్తర ప్రాంతాలు అనేవారు. కానీ 1857 ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత ఈ ప్రాంతంలో రష్యా ప్రాబల్యం పెరుగుతుండడం చూసి చిత్రాల్‌, ‌యాసీన్‌లను తన అధికారంలోకి తీసుకోవలసిందిగా బ్రిటిష్‌ ‌వాళ్లు మహారాజా గులాబ్‌ ‌సింగ్‌ను కోరారు. డోగ్రా అధికారాన్ని అంగీకరించిన చిత్రాల్‌ ‌పాలకులు ప్రతి మూడేళ్లకు ఒకసారి కప్పం కట్టడానికి ఒప్పుకున్నారు. 1877లో మేజర్‌ ‌జాన్‌ ‌బిద్దుల్ఫ్ ‌రాజకీయ ప్రతినిధిగా గిల్గిత్‌ ఏజెన్సీని ఏర్పాటుచేశారు. 1881లో ఏజెంట్‌ను ఉపసంహరించినా, ఈ ప్రాంతంలో ఆఫ్ఘన్‌ల కార్యకలాపాలు పెరగడంతో 1889లో మళ్లీ ఏజెంట్‌ను నియమించారు.

గిల్గిత్‌ ‌ప్రాధాన్యతను బ్రిటిష్‌ ‌పాలకులు బాగా గుర్తించారనడానికి ఈ.ఎఫ్‌. ‌నైట్‌ ‌మాటలే గుర్తు. ‘‘హంజా నది ముఖంలో ఉన్న ఈ ప్రాంతం రెండు వైపులా నుంచి వచ్చే గిరిజన మూకలను అడ్డుకునేందుకు చాలా కీలకమైంది. ఆ విధంగా గిల్గిత్‌ ‌కశ్మీర్‌ ‌రాష్ట్రానికి ఎంతో విలువైనది’’అని నైట్‌ అన్నాడు. అలాగే కర్జన్‌ ‌కూడా ‘‘దురాక్రమణ దారులు ముందుకు రావాలంటే ఈ ఉత్తర ద్వారం నుంచే రావాలి’’అని అన్నాడు. ఈ ప్రాంతాల వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తించారు కాబట్టే బ్రిటిష్‌ ‌వాళ్లు ఇక్కడి పాలకులకు ప్రత్యేక హోదా కల్పించారు. గిల్గిత్‌ ‌ప్రాంతపు అంతర్గత, బాహ్య భద్రతను చూసేందుకు 1913లో గిల్గిత్‌ ‌స్కౌట్స్ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటుచేశారు.

గిల్గిత్‌ ‌లీజు

1917 విప్లవం తరువాత ఈ ప్రాంతంలో రష్యా కార్యకలాపాలు పెరగడంతో ఆందోళన చెందిన మహారాజా హరిసింగ్‌ ‌గిల్గిత్‌ ‌బాల్టిస్తాన్‌ను 60 ఏళ్లకు బ్రిటిష్‌ ‌వారికి లీజుకు ఇచ్చాడు. 1935 మార్చి 26న ఒప్పందం జరిగింది. దీని వల్ల సింధు నది కుడివైపున దాటి ఇతర ప్రాంతాలపైన కూడా బ్రిటిష్‌ ‌వైస్రాయ్‌కు పౌర, సైనిక అధికారాలు లభించాయి. మహారాజా నియంత్రణలో ఉన్నప్పటికి 1935 నుండి 1947 వరకు ఈ ప్రాంతపు పరిపాలన పూర్తిగా బ్రిటిష్‌ ‌వారి చేతిలోనే ఉంది. గిల్గిత్‌కు ఎడమవైపున ఉన్న ప్రాంతం, దర్దిస్తాన్‌, ‌బాల్టిస్తాన్‌లు మహారాజా ప్రత్యక్ష నియంత్రణలో ఉండేవి.

బ్రిటిష్‌ ‌వాళ్ల కళ్లు ఎప్పుడు కశ్మీర్‌ ‌పైనే ఉండేవి. అందుకనే మహారాజా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ పదేపదే కశ్మీర్‌ ‌విషయాల్లో జోక్యం చేసుకునేవారు. అమృత్‌సర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కశ్మీర్‌లో రాజకీయ ప్రతినిధిని నియమించడమేకాక మహారాజా ప్రతాప్‌ ‌సింగ్‌ను తొలగించారు. ఈ ప్రాంతపు వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తించిన బ్రిటిష్‌ ‌పాలకులు క్రమంగా మహారాజా అధికారాలను తగ్గిస్తూ వచ్చారు. మహారాజా ప్రతాప్‌ ‌సింగ్‌ అభ్యంతరం తెలిపినప్పటికి రాజ అమర్‌ ‌కుమారుడైన హరిసింగ్‌ను తరువాతి రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటిష్‌ ‌పాలకులను ధిక్కరించి గిల్గిత్‌ ‌వరకు ఉన్న ప్రాంతాన్ని తన అధికారంలోకి తెచ్చుకున్నారు మహారాజా హరిసింగ్‌. ‌గిల్గిత్‌ ‌వజారత్‌ అయిన గిల్గిత్‌ ‌తహసిల్‌, ఆస్టర్‌, ‌బుంజీకి చెందిన నియాబత్‌లు కశ్మీర్‌ ‌దర్బార్‌ ‌ప్రత్యక్ష నియంత్రణలో ఉండేవి. ఇక్కడి అధికారిని వజీర్‌-ఈ -‌వజారత్‌ అనేవారు.

గిల్గిత్‌ ‌పతనం

బ్రిటిష్‌ ‌వాళ్లు 60ఏళ్ల గిల్గిత్‌ ‌లీజు ఒప్పందాన్ని రద్దు చేశారు. దానితో గిల్గిత్‌ ‌వజారత్‌, ‌గిల్గిత్‌ ఏజెన్సీ ప్రాంతాలు మహారాజా ప్రత్యక్ష అధికారంలోకి వచ్చాయి. 1947 ఆగస్ట్, 1 ‌నాటికి గిల్గిత్‌ ఏజెన్సీ అధికారాలు మహారాజాకు బదలాయించాలని బ్రిటిషర్లు అనుకున్నారు. అందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ఘనసార సింగ్‌ను గవర్నర్‌గా నియమించారు. కానీ మిగిలిన బ్రిటిష్‌ అధికారులు పాకిస్తాన్‌ ‌వైపుకు చేరిపోవడంతో పరిపాలన పూర్తిగా స్తంభించింది. సహాయం అందించాలన్న మహారాజా అభ్యర్థనలు ఎవరు పట్టించుకోలేదు. ఇంతలోనే గిల్గిత్‌కు 34 మైళ్ల దూరంలో బుంజీ దగ్గర ఉన్న కశ్మీర్‌ ‌ఫిరంగి దళాన్ని తొలగించిన బ్రిటిష్‌ ‌వాళ్లు అక్కడ సిక్కులు, ముస్లింలతో కూడిన 6వ ఫిరంగి దళాన్ని నియమించారు. ఆ దళంలో ఉన్న ముస్లింలు గిల్గిత్‌ ‌స్కౌట్‌ ‌దళాలను క్రమంగా పాకిస్తాన్‌ ‌పక్షానికి తిప్పారు.

పాకిస్తాన్‌ ‌మద్దతుతో గిరిజన మూకలు దాడి చేయడంతో సైనిక సహాయాన్ని ఆర్ధిస్తూ మహారాజా హరిసింగ్‌ ‌జమ్ముకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే అంతలోనే శ్రీనగర్‌ ‌పాకిస్తాన్‌ ‌వశమయిందని పుకార్లు వ్యాపించాయి. ముస్లిం మూకలు చుట్టుముట్టడంతో ముస్లిమేతరుల ప్రాణాలు కాపాడటం కోసం గవర్నర్‌ ‌ఘనసార సింగ్‌ ‌లొంగిపోయాడు. దానితో రైస్‌ ‌ఖాన్‌ ‌నేతృత్వంలో ‘పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌గిల్గిత్‌, ‌బాల్టిస్తాన్‌’ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 6వ ఫిరంగి దళంలోని ముస్లిం సైనికులు తోటి సిక్కు సైనికులను హతమార్చారు. గిల్గిత్‌ ‌స్కౌట్స్‌కు చెందిన మేజర్‌ ‌బ్రౌన్‌ 1947 ‌నవంబర్‌, 4‌న పాకిస్తాన్‌ ‌జెండా ఎగురవేశాడు. ఆ తరువాత హంజా, నగర్‌ ‌పాలకులు పాకిస్తాన్‌ ‌తో కలిశారు. విలీనం తరువాత పాకిస్తాన్‌ ‌ప్రతినిధిగా షా మహమ్మద్‌ ఆలం 1947 నవంబర్‌, 16‌న గిల్గిత్‌ ‌చేరుకున్నాడు.

తిరుగుబాటు తీరుతెన్నులు

బ్రిటిష్‌ ‌వాళ్లు ప్రదర్శించిన నిర్లక్ష్య, అనుకూల ధోరణి మూలంగా పాకిస్తాన్‌ అనుకున్నది చేయ గలిగింది. అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్‌ అధికారులంతా పాకిస్తాన్‌కు అనుకూలంగానే వ్యవహరించారు. ముఖ్యంగా మేజర్‌ ‌బ్రౌన్‌, ‌హైదర్‌ ‌ఖాన్‌, ‌బాబర్‌ ‌ఖాన్‌లు పూర్తిగా పాకిస్తాన్‌ ‌కోసం పనిచేశారు. అందుకనే ఆ తరువాత పాకిస్తాన్‌ ‌మేజర్‌ ‌బ్రౌన్‌కు మరణానంతరం ‘స్టార్‌ ఆఫ్‌ ‌పాకిస్థాన్‌’ ‌పురస్కారంతో గౌరవించింది.

మొదటినుంచి ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తామంటూనే బ్రిటిష్‌ ‌వాళ్లు ఇక్కడ వేర్పాటు బీజాలను నాటారు. మహారాజా హరిసింగ్‌ను స్థానికులు, అలాగే సామంతులు వ్యతిరేకించారన్నది కేవలం బ్రిటిష్‌ ‌వాళ్లు పుట్టించిన కట్టుకధ. నిజానికి హంజా, నాగర్‌ ‌పాలకులు తప్పించి పూనియల్‌, ‌కొహ్‌ ‌గీజర్‌, ‌యాసీన్‌, అస్కోమన్‌ ‌మొదలైన ప్రాంతాల పాలకులు పూర్తిగా హరిసింగ్‌కు మద్దతు తెలిపారు. కానీ గిల్గిత్‌ ‌స్కౌట్‌లో హమ్జా, నాగర్‌ ‌సేనలే ఎక్కువగా ఉండడంతో గిల్గిత్‌ ‌గవర్నర్‌ ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. పైగా అక్కడ బ్రిటిష్‌ ‌వాళ్లు కొత్తగా నియమించిన 6వ ఫిరంగి దళంలో ఉన్న సిక్కులకు ఆ ప్రాంతం పూర్తిగా కొత్త.

గిల్గిత్‌ను ఆక్రమించుకున్న తరువాత ఐసాన్‌ ఆలీ నేతృత్వంలోని పాక్‌ ‌సేనలు 6వ ఫిరంగి దళంతో కలిసి బాల్టిస్తాన్‌ ‌పై దాడి చేశాయి. జోజీల కనుమ, కార్గిల్‌, ‌డ్రస్‌ల గుండా పాకిస్తాన్‌ ‌దళాలు చొచ్చుకు వచ్చాయి. మహారాజా సేనలకు సహాయంగా వచ్చిన థాపా నేతృత్వంలోని భారత సేనలు అనేక ప్రతికూల పరిస్థితుల మూలంగా పాక్‌ ‌సేనలను నిలువరించ లేకపోయాయి. కానీ కార్గిల్‌ ‌ప్రాంతాన్ని మాత్రం నిలబెట్టుకోగలిగాయి. అయితే బాల్టిస్తాన్‌ ‌సహా చుట్టుపక్కల ప్రాంతాలను పాకిస్తాన్‌ ఆ‌క్రమించుకుంది. జమ్ము కశ్మీర్‌లో అంతర్భాగమైన గిల్గిత్‌, ‌బాల్టిస్తాన్‌ను ఆక్రమించినా దానికి పాకిస్తాన్‌ ‌రాజ్యాంగ గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఆక్రమిత జమ్ముకశ్మీర్‌ ‌ప్రాంతం నుంచి తన దళాలను ఉపసంహరించుకోవాలని ఐక్య రాజ్య సమితి కమిషన్‌ 1948‌లో పాకిస్తాన్‌ను కోరింది. కానీ మార్చి 1949లో పాకిస్తాన్‌ ‌కశ్మీర్‌ ‌వ్యవహారాల మంత్రిత్వ శాఖను కొత్తగా ఏర్పాటుచేసింది.

కరాచీ ఒప్పందం

1949 ఏప్రిల్‌ 28‌న పాకిస్తాన్‌ ‌ప్రభుత్వంలో ఏ శాఖ లేని మంత్రి గుర్మానీ ఆజాద్‌ ‌కశ్మీర్‌ అధ్యక్షుడుగా, ముస్లిం లీగ్‌కు చెందిన సర్దార్‌ ‌మహమ్మద్‌ ఇ‌బ్రాహిం ఖాన్‌ ‌కరాచీ ఒప్పందంపై సంతకాలు చేశారు. రక్షణ, విదేశీవ్యవహారాలు, ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు పాకిస్తాన్‌ ‌చూసుకుంటుంది, గిల్గిత్‌ ‌బాల్టిస్తాన్‌కు పాకిస్తాన్‌ ‌పార్లమెంట్‌లో ఎలాంటి ప్రతినిధ్యం ఉండదన్నవి ఆ ఒప్పందంలోని ముఖ్య అంశాలు. ఈ ఒప్పందంతో ఉత్తర ప్రాంతాలుగా పేర్కొనే గిల్గిత్‌ ఏజెన్సీ ప్రాంతాలు పాకిస్తాన్‌ ‌నియంత్రణలోకి వెళ్లాయి. 1950లో కశ్మీర్‌ ‌వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర ప్రాంతాల పాలనను చేపట్టింది. ఆ తరువాత ఈ మంత్రిత్వ శాఖ పేరును ఉత్తర ప్రాంతాల మంత్రిత్వ శాఖగా మార్చారు.

చైనా, పాకిస్తాన్‌ ‌సరిహద్దు ఒప్పందం

గిల్గిత్‌ ‌పరిసర ప్రాంతాలను పాకిస్తాన్‌ ఆ‌క్రమించిన తరువాత 1953లో చైనా మొదటి సైనిక దురాక్రమణకు పాల్పడింది. అంతకు పూర్వం హంజాలో తనకు పరిపాలనా పరమైన నియంత్రణ ఉందని చైనా ఎప్పుడు వాదించలేదు. కానీ 1959 నాటికి హంజా, గిల్గిత్‌లకు చెందిన 6వేల చదరపు మైళ్లు తమ భూభాగమంటూ చైనా మ్యాప్‌లు విడుదల చేసింది. ఇది చాలక 1963లో చైనా, పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హంజా, నాగర్‌లలో మరో 5,700చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్‌ ‌చైనాకు ధారదత్తం చేసింది. ఈ ఒప్పందంపై భారత్‌ ‌తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఉత్తర ప్రాంతాల గురించి పాకిస్తాన్‌ ‌మొదటి నుంచీ రెండునాల్కల ధోరణినే అవలంబించింది. ఒకసారి అవి జమ్ముకశ్మీర్‌లో భాగమంటుంది. కానీ మరోసారి ఆ ప్రాంతాలు మహారాజాపై తిరుగుబాటు చేసి పాకిస్తాన్‌లో కలిసాయని, కనుక అవి తమవని అంటుంది. గిల్గిత్‌ ‌బాల్టిస్తాన్‌ను తమ దేశంలో ఐదవ రాష్ట్రంగా ప్రకటించుకోవాలని పాకిస్తాన్‌ 1970 ‌నుంచి ప్రయత్నిస్తోంది. కానీ వివిధ కారణాలవల్ల ఆ ప్రయత్నం ఇప్పటివరకు నెరవేరలేదు. అయినా ఆశ మాత్రం వదులుకోలేదు.

 – డా. రామహరిత

About Author

By editor

Twitter
YOUTUBE