అమృతానికే అమరత్వాన్నిచ్చిన స్వరం.తియ్యదనానికి తలమానికమైన తూకం. సాహిత్యపు ఒయ్యారాలకు సుస్వరాల స్వర్ణతాపడం. ప్రతి పాటా స్వర గంగావతరణం. ఇది నదులకు తెలియని గలగలల గమనం. సరిగమలు కలగనని మాధుర్యం. పాట కోసమే పుట్టిందా గొంతు. పాటని అంతెత్తు శిఖరాలకు చేర్చడానికి అహర్నిశలు శ్రమించిందా గొంతు. పాటని చిరంజీవిని చేయడానికి వింతవింత ప్రయోగాలతో కొత్తదారులు అన్వేషించిందా గొంతు. పాటతో ఒదిగి, పాటతో ఎదిగి, పాటగా మిగిలిన బాలు స్వరమాధుర్యం మహాసముద్రం. ఆ వైవిధ్యం అనంతమైన ఆకాశం. అందుకే ఆ పాట శాశ్వతం. అది జరామరణాలకు అతీతం!! రెండు తేదీల మధ్య ఇమడని, ఇమడ్చలేని, కుదించలేని, కుదురుకోని మహా వ్యక్తిత్వం !!

విచ్చుకున్న ఏ ఒకటీ గాయపడకుండా, రేకలు కందిపోకుండా, ఒకదాన్తో ఒకటి రాసుకుని రాలిపోకుండా  మెత్తగా జాగ్రత్తగా పూలదండ అల్లుతున్నట్టు…

డ్రైవాష్‌ ‌చేసిన పట్టుచీరలు పక్కకి కదలకండా,ఇస్త్రీ మడతలు చెక్కు చెదరకుండా, దేనికదే ఒబ్బిడిగా ఒర్జుగా బీరువాలో సర్దుతున్నట్టు…

యాపిల్‌, ‌జామ, బత్తాయి, జొన్నపొత్తు, మారేడు, వెలగ,  ఉమ్మెత్త, సీతాఫలం పరస్పరం కొట్టుకుని నొచ్చుకోకుండా సాధ్యమైనంత ఎడంగా పాలవెల్లి కడుతున్నట్టు…

అచ్చమైన తెలుగువాకిట్లో ముచ్చటైన చుక్కల ముగ్గేస్తున్నట్టు …

బాలు పాట! అది పాట కాదు. స్వరంలో స్పష్టత, పదాల మధ్యన వీలైనంత ఆర్ద్రతలతో జరిగే సరిగమల సంభాషణ.

ఆయన మనతో మాట్లాడతాడు. పాట తాలూకు కథని పూసగుచ్చుతాడు. మన ముందు కుర్చీలో కూర్చుని, విడమరచి చెప్తాడు. మనతో కప్పు కాఫీ తాగుతాడు. బండిమీద మన వెనకాలే ఉంటాడు. ఏ సాయంకాలమో మనతో కలిసి జాగింగ్‌ ‌చేస్తాడు. కార్లో దార్లో లిఫ్ట్ అడుగుతాడు. గుడికెళ్తే అక్కడికీ వస్తాడు. మనం అలసిపోతే ఓ పాటకి మన చెవుల్లో ప్లే బటన్‌ ‌నొక్కి ఎటో వెళ్లిపోతాడు. మనం ఆనందంగా ఉంటే మన ప్లే లిస్ట్ అం‌తా కిరీటం లేని కింగ్‌లా ఆక్రమించేసుంటాడు. పాటతో ఏ మాత్రం టచ్‌  ఉన్నా, వాళ్లకెప్పుడూ తన వెరీ వెరీ స్పెషల్‌ ‘‌మిడాస్‌ ‌టచ్‌’ ఇస్తూనే ఉంటాడు. మొదట్లో కాస్త స్పేస్‌ ‌తీసుకుంటాడు. తరవాత స్పేస్‌ అం‌తా విశ్వరూపమై కనిపిస్తాడు. మన జీవితంలో ఆయన జాయినవ్వని సందర్భం లేదు. ఉండదు. ఉండబోదు. అసాధ్యం.

ఈ నమ్మకం ఆగిపోయిన ఓ కారు దగ్గర స్టార్ట్ అయింది.

తల్లి శకుంతలమ్మతో

లేతగా రివటలా చువ్వలా ఉన్న బాలుడు మొట్టమొదటి పాట పాడడానికి సిద్ధంగా ఉన్నాడు- మంచి బట్టలువేసుకుని, గొంతు సరిచేసుకుని. రెండింటికి కారు రావాలి. ఎదురుచూపులు. గడియారంలో ముళ్లు రెండు మీదకొచ్చాయి గానీ ఇంటి ముందుకి కారు రాలేదు. ఏవేవో అనుమానాలు. బాలుడు చూశాడు చూశాడు -విజయా గార్డెన్స్‌కే వెళ్లి తేల్చుకుందామని మిత్రుడు మురళిని వెంటేసుకుని అక్కడికి వెళ్లారు. అక్కడ తెల్సింది – కారు రిపేరుకొచ్చి ఎక్కడో ఆగిందని. గడియారం వేగంతో పోటీపడలేక పోయిందని.

తీరా అక్కడికి వెళ్లి చూస్తే, సంగీత దర్శకులు కోదండపాణి రికార్డింగ్‌లో ఉన్నారు. ఓ పక్కన పాటకి ఇచ్చిన సమయం మించిపోయింది. బాలుడు, మిత్రుడు బయటే చాల్సేపు కూర్చున్నారు. కోదండపాణి గారే బయటకి వచ్చి, బాలుడిచేత పాట పాడించారు. ఓ గొప్ప గాయకుణ్ణి మన చేతుల్లో పెట్టారు. జాతి మరచిపోలేని జాతైన వజ్రాన్ని రికార్డింగ్‌ ‌థియేటర్‌ ‌నాలుగ్గోడల మధ్య సానపట్టారు. ఆత్మ మూల స్వరూపాన్ని దైవాంశతో కలబోసి, అలౌకికమైన స్థితిలోకి తీసుకెళ్లేలా చేసేందుకు రెండు బుజ్జి కాళ్లకు మెట్టెక్కడం నేర్పించారు.

బాలు లేని తెలుగుపాట ఉండదనడం ఎంత నిజమో.. కోదండపాణి లేని బాలు లేరంటే అంతకన్నా ఓ వందరెట్ల నిజం. కోదండపాణే బాలుని వేలు పట్టుకుని నడిపించారు. ఇంకా చెప్పాలంటే-చంకన వేసుకుని తిప్పారు. తొలి మొలకలు శాఖోపశాఖలై విస్తరించాయి. బాలు స్థానానికి మంచి స్థిరత్వాన్నీ బిగింపునీ ఇస్తూ దశదిశలా వేర్లు తన్నాయి. బాలు పాటల ఉద్ధృతి జోరందుకుంది. జోరు నుంచి హోరు, దాన్ని దాటి తుఫాను, అనంతరం ప్రభంజనం లాంటి పదాలు వాడాల్సిన స్థాయికి బాలు చేరుకున్నారు.

అసలు  సవరించుకున్న వాణికీ, కోదండపాణికీ మధ్య పరిచయం ఓ ప్రశ్నతో ప్రారంభమైంది.

మద్రాసులో పాటల పోటీలు.. ఘంటసాలగారు, పెండ్యాల గారు, సుసర్ల వారూ న్యాయనిర్ణేతలు. బాలు ఆ పోటీలో పాట పాడి, వేదిక దిగి వెళ్లిపోతుంటే, ఓ పెద్దాయన వచ్చి ‘బాగా పాడావు. నువ్వు పాడే పద్ధతి నాకు నచ్చింది. సినిమాల్లో పాడిస్తాను. వస్తావా?’ అని అడిగారు. బాలుడికి అర్థం కాక ‘మీరు ఎవరు సర్‌’ అని అడిగాడు. ఆ పెద్దాయన చెప్పిన సమాధానం – ‘‘కోదండపాణి’’.

బాలు గాయకుడిగా బాగా ముమ్మరంగా పాడుతున్న రోజులొచ్చాక, ఓ రోజు ఆయనకి ఫోన్‌ ‌కాల్‌. అవతల ఎవరో. ‘‘పాట పాడాలి. కాల్‌షీట్‌ ‌సర్దుబాటు చేయగలవా?’’ అని. బాలుకేమో తీరిక లేదు. ఇబ్బంది పడుతూ ఆ మాటే వారితో చెప్పాడు.

‘‘ఈరోజు కోసమే ఇన్నాళ్లూ ఎదురుచూశాను.’’ అని ఫోన్‌ ‌పెట్టేశారు అవతల. ఆయన కోదండపాణి. బాలు కళ్లల్లో కృతజ్ఞతా పూర్వకమైన ఆనంద బాష్పాలు!! వారు లేకపోతే ఎక్కడివి ఇన్ని పాటలు? తండ్రిలాంటి  కోదండపాణి…

సాంకేతికతకీ ఆధ్యాత్మికతకీ మధ్య…

బాలుని సాంకేతికత వైపు పంపాలనుకునే బాలుగారి తండ్రి సాంబమూర్తిగారికీ, పితృవాక్య పరిపాలనకు  సిద్ధంగా ఉన్న బుజ్జి బాలుడికి దైవం ఆధ్యాత్మికత వైపు దారి చూపించింది. ఇల్లంతా త్యాగరాయ కీర్తనలతో కృతుల ఆరాధనతో పులకించి పోతుంటే – ఆ పిల్లాడికి కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగబ్రహ్మ సంప్రదాయగీతికి వారసత్వ పరంపర ఆశీర్వాదమైంది. నాదోపాసన ద్వారా భగవంతుణ్ని తెలుసుకోవచ్చని నిరూపించిన ఆ త్యాగరాజులవారే బాలుగారిని గురువుల చెంతకి పంపించారేమో! సాంబమూర్తిగారి హరికథల సాధనతో, మహాపురుషుల మహనీయ గాధలతో పునీతమైన సరస్వతీ నిలయమది. అనునిత్యం ధూపదీపాలతో భక్తిప్రపత్తుల వైభవం అఖండమై వెలిగిన ఆ ఇంట ఇప్పుడు వేదం నాదమై వినిపించడం, విద్యార్థుల కంఠాల్లో ఆ గరళకంఠుడు ఆనందతాండవం చేయడం బాలుగారి దాతృత్వానికి రుజువు. జన్మనిచ్చిన అమ్మనాన్నలు శకుంతలమ్మ, సాంబమూర్తిగార్లకు అదే బాలు అసలుసిసలైన అంజలి. నిఖార్సయిన నివాళి.

తండ్రి సాంబమూర్తి శిలా విగ్రహం

ప్రయాణం మొదలైంది…

దారి నిర్ణయమైంది. దానికి సంబంధించిన బీజవాపనం కూడా మనసులో జరిగిపోయింది. సంగీతమంటే అపారమైన ప్రేమ పుట్టింది. ఎక్కడ పాట వినిపిస్తే అక్కడికి పరుగులెత్తేవాడు బుజ్జిబాలు. రేడియో  వింటూ-ఎవరో గంధర్వుడు సూక్ష్మ శరీరంతో బుల్లిపెట్టెలోకి దూరిపోయి పాడుతున్నా డేమోనని రేడియోలోకి తొంగి తొంగి చూసేవాడు బుల్లి బాలు. సంగీతమంటే ఇష్టపడే ఆ పసివాడికి రేడియోలో వచ్చే ప్రతి పాటా పాఠమే. వినడం, ప్రతి పాటా కంఠస్థం చేయడం, బళ్లో స్నేహితుల ముందు పాడడం..ఇదే అప్పటి బాలు సాధన. శిక్షణ. తర్ఫీదు. తల్లిగారు తులసికోట శుభ్రం చేస్తూ పాడే పాటలు, పూజ చేసుకుంటూ పాడే పాటల్ని బాలుడు ఒంటపట్టించుకున్నాడు. అవే బాలు ఘనమైన పునాదులు.

ఆ పునాదుల దృఢత్వానికి మొదటి నిదర్శనం – జానకమ్మగారి సలహా. గూడూరులో కాళిదాసు కళానికేతన్‌లో పోటీలు పెడితే, అందులో ఎవరికో బహుమతి వచ్చింది. బహుమతి నిర్ణాయక బృందంలో ఉన్న గాయని జానకమ్మ, ‘ ఈ బహుమతి బాలసుబ్రహ్మణ్యానికే రావాలి’ అని వేదికపైన ప్రకటించడమే కాదు, బాలుకి  ‘మీ గాత్రంలో ఏదో ప్రత్యేకత ఉంది.. సినిమాలో ప్రయత్నించండి’  అని సలహా ఇచ్చారు. ప్రపంచాన్ని జయించిన ఆనందమేసింది మన బాలుడికి. అప్పుడే నిర్ణయం జరిగింది- అయితే గియితే నేపథ్య గాయకుణ్ని కావాలని. తథాస్తు అన్నారు దేవతలు.

సరిగమల ప్రయాణం మొదలైంది. బాలు మొదట తెలుసుకున్నది – ఎక్కడా రెడీమేడ్‌గా రెడ్‌ ‌కార్పెట్‌ ‌పరుచుకుని ఉండదు. ఒక్కో అడుగు మనమే పెంచుకుంటూ వెళ్లాలి అని. తరవాత ఉదయించిన ప్రశ్న- మహా మహా నేపథ్య గాయకులు ఏలుతుండగా నన్ను వీళ్లు వేలు పట్టుకుని ఎందుకు నడిపించాలీ అని. ఆ లేత  వయసులోనే ఇలా ప్రశ్నించుకున్నారంటే అది ఆ వయసుకి పరిణతి మాత్రమే. తరవాత తరవాత తనని తాను నిరూపించుకునేందుకూ నిలదొక్కుకునేందుకూ అసాధారణంగా ఉపయో గించిన ముందుచూపు. ఏ భాషకి వెళ్లినా జెండా ఎగరేయడానికి మనసు చేసుకున్న సంకల్పం. తన స్వరానికి ఎల్లలుండకూడదనే ఆత్మవిశ్వాసానికి పురిటిగది. ఉత్తరం దక్షిణం అని ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా వాటిని పెకలించేందుకు సకల అస్త్రాల నిధి.

తను నడిచిన దారిలో అడుగుజాడలు ఉంటే చాలదు..బలమైన ముద్ర ఉండాలి అని బలంగా నిర్దేశించుకున్నారు బాలు. సహజంగా ఉన్న ఏకాగ్రత, పారంపరికమైన గ్రాహ్యత, వయసుని మించిన పరిపక్వత,  ఎంత కష్టాన్నయినా ఎదుర్కునే సంసిద్ధత, పాటకి తనదైన శైలిని చేర్చే స్పష్టత, స్వరాన్ని ఎలా ఉపయోగించినా ఎక్కడా చెదరని నిబద్ధత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వినయశీలత – అన్నీ కలిసి బాలుని శిఖరాగ్రానికి చేర్చాయి. తరవాత అంతా చరిత. దేశం యావత్తు రుణపడిపోయేంత ఘనత.

బహుముఖం

జగతికి వరదానం చేసే సాక్షాత్తూ ఆ ఏడుకొండలవాడికి స్వరదానం చేసిన కారణజన్ముడు బాలు. గాయకుడిగా ఉన్నత శిఖరాలకెక్కిన బాలు తన స్వరంలో ప్రేమికుడు, భావుకుడు, శ్రామికుడు, భక్తుడు, చిత్రకారుడు, సామాన్యుడు, భగవంతుడు… ఇలా అందర్నీ పలికించారు. ప్రేమ ఒలికించారు. విద్వత్తుకీ వినయానికీ ఉన్న అవినాభావ బంధుత్వానికి నిలువెత్తు నీరాజనం లాంటి బాలు గాయకుడి దగ్గరే ఆగిపోలేదు. సంగీత దర్శకుడు, డబ్బింగ్‌ ‌కళాకారుడు, రచయిత, నిర్మాత, నటుడు కూడా. ఆయనందుకున్న అవార్డులు, గౌరవాలు, పురస్కారాలు.. లెక్కలేనన్ని.

ఆయనో అద్భుతం

బాలు ఎప్పుడో ఓసారిగానీ జరగని అద్భుతం. మాధుర్యం, దానికి సమానంగా తూగేలా సంగీతమంత  స్వచ్ఛమైన మనస్తత్వం ఒకే మనిషిలో ఉండడం ఇంకా విడ్డూరం. నాటి గాయకుల నుంచి నేటి గాయకుల వరకు ఎప్పుడూ ఎక్కడా వెనుకబడకుండా రేసులో ఎప్పుడూ ముందే ఉండడం, సాంకేతికంగా తనని తాను అప్‌డేట్‌ ‌చేసుకోవడం మరీ ఆశ్చర్యం. కొత్తదనాన్ని ఆహ్వానించడానికి బొకే పట్టుకుని ముందు నిలబడగలగడం, వారితోపాటు వేదికను పంచుకోవడం అద్భుతం. ఆయనెంత సనాతనమో అంత ఆధునికం. కాలం సైతం నిత్యం స్మరించుకునే ఓ ప్రమాణం. భగవంతుడి భాషలో ఎప్పుడూ మాట్లాడుతూ ఎన్నో ఎన్నెన్నో  అద్భుతాల్ని ప్రసాదించిన పూజారి.

ఎవరు ?

తెలుగు భాష చేసుకున్న పుణ్యం బాల సుబ్రహ్మణ్యం. భారతీయ భాషల్లో..ఆ మాటకొస్తే ఏ ఇతర భాషల్లో  జరగని ఓ మహత్తర, బృహత్తర కార్యక్రమం వారి వల్లే

కె. విశ్వనాథ్‌తో…

సాధ్యమైంది. కొత్త గాయనీ గాయకులకు తన అనుభవంతో అక్షింతలేసి, తను నేర్చుకున్న పాఠాలే వాళ్లకి కూడా చెప్పే అనితరసాధ్యమైన బాధ్యతని భుజానికెత్తుకుని, నిరాటంకంగా నిర్వహించారు. కొన్ని తరాలు ఆయన పేరు చెప్పుకుని, తప్పులు తెలుసుకుని వేదికలెక్కుతున్నారు. బాలు మాటలు పెద్దబాలశిక్షగా వాళ్లని నడిపిస్తున్నాయి. చిక్కంతా ఇక్కడే !

బాలుగారి మరణం తీవ్రంగా కలచివేసిన క్షణాల్లో..గుండెల్లో ఉప్పొంగే అభిమానం గొంతుకి అడ్డుపడుతున్న క్షణాల్లో కన్నీళ్ల పర్యంతమైన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆవేదనతో వేసిన ఒక ప్రశ్న ‘బాలు తరవాతి కాలం’లో ప్రతి ఒక్కరూ ఆలోచించదగ్గది. పాటల్లో మెలకువలు చెప్పడంలో, తప్పొప్పులు తూకం వేయడంలో, రేపటి తరానికి సంస్కృతీ సంప్రదాయాల్ని అలవాటు చేయడంలో చేయిపట్టి నడిపించే సాంస్కృతిక ఆచార్యుడెవరు? సిరివెన్నెల ప్రశ్నకి జవాబు లేదు. రాదు. ఉండదేమో బహుశా!

గాయకుడిగా తను సాధించిన అనుభవం ఎందరికో మార్గదర్శి కావాలని కొన్ని వందలమంది పిల్లల్లో గాయనీ గాయకుల్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యతకి ప్రబలమైన నిదర్శనాలుగా ఇప్పుడు ఎందర్నో చూస్తున్నాం.చిన్నచిన్న విషయాల్లో చిత్రిక పట్టి, తెలుగుదనం నుంచి తెలుగు నుడికారం వరకు సందర్భం చిక్కినప్పుడల్లా నూరిపోసిన బాధ్యత ఇప్పటి నుంచి ఎవరిది? ఎవరు తీసుకుంటారు? ఎవరికా అర్హత ఉంది? తెలుగువాళ్లకి మాత్రమే పరిమితమైన పద్యాన్ని ఆయన ప్రేమించి వివరించినంత బాగా ఇంకెవరు ప్రేమిస్తారు? అంత ధాటిగా ఎవరు అందుకుంటారు? ఈ ప్రశ్నలు వెర్రిమొహం వేసుకుని చూస్తున్నాయి.

దానితోపాటు సమాజానికి బాలుగారిచ్చిన గొప్ప గొప్ప సందేశాలు, ఆలోచింపచేసిన ఎన్నో సంఘటనలు  చెప్పగలిగే స్థాయి గానీ స్థానం గానీ ఎవరికుంది? ఈ ప్రశ్నకీ జవాబు దొరకదు. సాంస్కృతికంగా పతనమైపోతున్న జాతిని మేల్కొల్పడానికి, జారిపోతున్న విలువల్ని కాపాడ్డానికి, అవసరమైతే మెత్తమెత్తగా చీవాట్లు  అంటించడానికి -శతాబ్దానికో, కాలమే లెక్కకట్టలేనంత విరామం తరవాతో మాత్రమే పుట్టే విలువైన ఆ మహనీయుడు వెళ్లిపోయాడు –  కొన్ని ప్రశ్నల్ని మనకి వదిలేసి.

ఓ ముగింపు… కొనసాగింపు ! 

అంత్యక్రియలతో అనంతవాయువుల్లో కలిసిపోయేది కాదు బాలుగారి వైభవం. మనతో ఆయనది మరణం విడదీయలేని అను‘రాగ’బంధం. అందుకే బాలుగారి నిధనం ఆయన చెప్పాలనుకున్న ఎన్నో మంచి విషయాలకు ముగింపు కాదు. కాకూడదు. ప్రతి ఒక్కరూ ఆలోచించుకునేలా, మనదైన తెలుగుదనాన్ని జెండాలా ఎగరేసేలా బాలుగారి స్ఫూర్తికి, సంకల్పానికి కొనసాగింపు. ప్రతి మంచి విషయాన్నీ బాలుగారే ఎక్కడి నుంచో చెప్పారనుకుని ఆచరించడం ఇప్పుడు ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎక్కడ మంచి మాట విన్నా బాలు పేరు చెప్పుకుని నలుగురితో పంచుకోవడం ఇప్పటి నుంచి అందరి బాధ్యత. ఆయన పాటలు ఆస్వాదించాం.     ఆయన గొప్పతనాన్ని వింటూ పెరిగాం. మంచి ఎవరు చెప్పాలనుకున్నా ఒకటే కనుక, మన స్థాయి ప్రయత్నం మనం చేస్తే బాలుగారి పాట విన్న రుణాన్ని కాస్తయినా తీర్చుకున్నట్టు అవుతుంది. వారి ఆత్మకు మన వంతు నివాళి అర్పించినట్టు ఉంటుంది. నివాళి అంటే కేవలం ఒక పదం కాదు. ఒక ఆచరణ. ఒక నిర్వ హణ. ఒక ప్రేరణ. బాలులాంటి కారణజన్ములకు మాత్రమే ఇలాంటి కొనసాగింపులు సాధ్యమవుతాయి.

‌ప్రతిభా పాటిల్‌ ‌నుంచి పద్మభూషణ్‌ ‌స్వీకరిస్తూ…

బాలుగారూ…

మీ పాట లేనిదే మా ఒంటరితనం కూడా పూర్తవ్వనివ్వలేదు మీరు! ఎన్ని సాయంత్రాలు పాట సాయం చేశారు? ఎన్ని రాత్రులు అమృతాన్ని కాస్త ఒంపి శోకాల్ని సాగనంపారు?

మీ తొలి పాట మొదటి పాదం ‘ఏమి ఈ వింత మోహము’ లాగే ‘ఏమి ఈ వింతశోకము’? మా అందర్లో ! మీ కొత్త పాట వినలేమనే ఆవేదనా? నలభైవేల పై చిలుకు అమృతభాండాలు మా కోసం అయ్యారుగా నిలవపెట్టి వెళ్లారని ఆనందమా? ఈ ప్రశ్నకీ జావాబు లేదు.

బ్రిలియంట్‌, ఇం‌టెలిజెంట్‌, ఎక్స్‌లెంట్‌, ఎఫిషియెంట్‌, ‌కమిట్‌మెంట్‌, ఎక్స్‌పెరిమెంట్‌, ఎ‌న్రిచ్‌మెంట్‌, ‌ప్రామినెంట్‌, ‌పర్మనెంట్‌, ఒబిడియంట్‌, ఎమినెంట్‌, ‌టాలెంట్‌…ఇలా ఎంతలా ఎన్ని పదాలతో ప్రయత్నించినా ఇంకా అనంత విశ్వరూపమై ధగద్ధగాయమానంగా వెలిగే మీ అద్వితీయ ప్రతిభ ‘ఇంకా పెద్ద పెద్ద పదాలు కావాలేమో ఆలోచించు కోండి’ అని నిరాడంబరంగా చిర్నవ్వుతోంది. ఏ నిఘంటువులో దొరుకుతుంది సరైన పదం? మళ్లీ ఇదో ప్రశ్న.

శబరిమలలో మిమ్మల్ని కొండపైకి డోలీలో మోసిన కూలీలకు పాద నమస్కారం చేసిన నిగర్వి మీరు. మీ అంతిమయాత్రలో మీ వాహకుల గురించి మీరే లేచి ‘ఏం నాయనా.. మీకేమైనా ఇబ్బందిగా వుందా.. బరువుగా అనిపిస్తున్నానా’ అని అడుగుతారేమోనని పిచ్చి ఆలోచన. సాటి మనిషి పట్ల అంతటి వాత్స్యం చూపిస్తారు మీరు. ఎదుటివారిని అంతగా పట్టించుకుంటారు మీరు. అంతలా ప్రేమిస్తారు మీరు.

అందుకే మీరెప్పుడూ మాకు ప్రజెంట్‌ ‌టెన్సే. ఎప్పటికీ పాస్ట్ ‌టెన్స్ అవ్వరు. అటు మిమ్మల్ని వెళ్లనివ్వం.

మీకు ‘జాగృతి’ ఘన నివాళి.


‌ప్రధానితో బాలు

ప్రధాని నరేంద్రమోదీ దక్షిణ భారతదేశం నుంచి బాలుగారిని ‘స్వచ్ఛభారత్‌’ అం‌బాసిడర్‌గా నియమించారు.ఒక గాయకుడిగా తన బాధ్యతగా బాలుగారు స్వచ్ఛభారత్‌ ‌కోసం ప్రత్యేకంగా గీతాన్ని పాడారు. ఏటా సంక్రాంతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ రాజధానిలో నిర్వహించే పండగ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ ‌గీతాన్ని ఆ కార్యక్రమంలో ఆవిష్కరించాలని బాలుగారి ఆలోచన. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ  వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తయ్యాక, మోదీ, బాలు వేదికపై నిలబడి ఉన్నారు. అక్కడ ఒకటే  కుర్చీ ఉంది. ప్రధాని మోదీ బాలుగారిని కూర్చోమన్నారు. బాలు గారు మోదీ గారిపైన గౌరవంతో వారిని కూర్చోమంటే, మోదీగారు బాలుని కూర్చోమన్నారు. కారణాన్ని తన ప్రసంగంలో ఇలా చెప్పారు ప్రధాని.

‘‘యాభై సంవత్సరాలుగా బాలు పాటలు పాడుతున్నారని వెంకయ్యనాయుడుగారు చెప్పారు. ఇన్నేళ్లుగా పాటలు పాడుతున్నారంటే దాని వెనుక ఎంత త్యాగం ఉంటుందో, ఎంత కృషి ఉంటుందో అర్థం చేసుకోగలను. ఒక కళాకారుడిగా వారిని ముందు కూర్చోమనడమే న్యాయం. అదే గౌరవం. వయసులో వారు   నాకంటే పెద్దవారు. అందుకే వారిని కూర్చోమన్నాను’’ అన్నారు మోదీ. ఒక కళాకారుడిగా ప్రధాని నుంచి బాలు అందుకున్న ప్రశంస ఇది.


నేను గీతమైతే తాను గానమైనవాడు…

నాకు ప్రాణసమానమైనవాడు..నావాడు బాలసుబ్రహ్మణ్యం. సాధనతో ఒక వ్యక్తి ఎంతటి శక్తిగా మారగలడో నిరూపిస్తుంది అతని జీవితం. గాత్రధారులకు కొత్తకోణాలు ఆవిష్కరించిన ‘దశకంఠుడు’ అనిపించుకున్న బాలు ‘రవైతీతి రావణ్ణ’ అన్నట్లు మరో నాదమూర్తి. ‘బాలోచ్చిష్టం స్వరం సర్వం’ అంటే అతన్ని కొంతైనా  అర్థం చేసుకున్నట్టే. స్ఫుటమైన తెలుగు సంస్కృత తమిళ కన్నడ పదాలను ఉచ్చారణా సౌలభ్యంతో పాడడానికి మానవశక్తి కన్న దేవదత్తమైన గళం ఉండాలి. అతని కంఠం నిజంగా దేవదత్తమే. ఎప్పుడో ఒక మహాయతిని గూర్చి ఆయన అతీత శక్తులకు ప్రణమిల్లి,

మనిషికిన్ని మహిమలా

ఘనసిద్ధుల గరిమలా

ఎదలో దైవమున్న హనుమలా

ఎదిగితే నీ దేహం తిరిగే తిరుమల

అని పాడుకున్నది బాలు విషయంలోనూ నిజమైంది.

బాలరసాలసాల అభినవ ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం ఒక పుంస్కోకిల. ఏ కొమ్మ నుంచి పాడినా ఈ కోకిల గానం మధురమే. స్వరాయురస్తు అని దీవించవలసింది రసజ్ఞలోకమే.

 – వేటూరి సుందరరామమూర్తి (‘కొమ్మకొమ్మకో సన్నాయి’ నుంచి…)


బాలుమురళి

‘‘బాలు కాస్త కష్టపడితే నాలా పాడగలడు. నేను కష్టపడ్డా మా అబ్బాయిలా పాడలేను’’ అని ప్రముఖ వాగ్గేయకారుడు, పుంభావ సరస్వతి మంగళంపల్లి బాల మురళీకృష్ణ అభినందిస్తే, దానికి బాలుగారు పొంగిపోలేదు. ఇంకా ఇంకా వినయంగా ‘‘ఒక అవతార పురుషుడు ఇతడిని ఇలా ఆశీర్వదించారు అని నా సమాధి శిలా ఫలకం మీద రాయాలి’’ అని కోరుకున్న వినయశీలి బాలు.


‘ఆత్మావై పుత్రనామాసి’

‘‘సాంబమూర్తిగారి భార్య చనిపోతే, పిల్లల్ని చూసేవాళ్లు కూడా లేకపోతే, ఎవరింట్లోనో పిల్లల్ని పెట్టేవారు. ‘‘అమ్మా.. హరికథ చెప్పి వస్తాను. పిల్లల్ని చూడండమ్మా’’ అని వాళ్లకి పిల్లల్ని అప్పగించి, హరికథ అయ్యాక పరుగుపరుగున వచ్చి పిల్లల్ని సంబాళించేవారు. హరికథ చెప్పిన డబ్బుతో కుటుంబాన్ని పోషించారు. ఆయన పరవశించి ఏ కీర్తన పాడినప్పుడు పరదేవత అనుగ్రహించిందో ‘ఆత్మావై పుత్రనామాసి’..మళ్లీ నీ కొడుకుగా నీ తేజస్సే వచ్చి ప్రపంచమంతా ఎవరి కంఠం వినపడినంత మాత్రం చేత కరతాళధ్వనులు చేస్తుందో… ఎవరు నడిచివస్తూంటే ఆబాలగోపాలం లేచి నిలబడి చూడాలని మురిసిపోతారో అటువంటి గొప్ప గాయకుణ్ణి నీ కడుపున పుట్టిస్తాను అని బాలసుబ్రహ్మణ్యం గారిని పుట్టించింది. నా దృష్టిలో అయితే బాలసుబ్రహ్మణ్యంగారి కీర్తి, ఖ్యాతి, ఆయన శక్తి అన్నీ వాళ్ల నాన్నగారు చేసిన తపస్సు ఫలితం.

 – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు


ఆ ఔన్నత్యం అద్భుతం

డైనమిక్‌గా ఉండడం ఎలాగో బాలుగారిని చూసి ఈ తరం తెలుసుకోవాలి. పెద్దల పట్ల, సంస్కృతి పట్ల ఎలాంటి సంస్కారం, వినయం కలిగి ఉండాలో గ్రహించాలి. ఉత్తమ వ్యక్తిత్వం వారి దగ్గరున్న గొప్ప  అంశం. వారి పాట గాలి తరంగాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అన్ని తరాల్లో నిలిచిపోతుంది.

 – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ


మెటల్‌ ఏమీ చేయని మెటాలిక్‌ ‌వాయిస్‌

‌గీతాంజలి సినిమాకి మలయాళంలో, తమిళంలో పాటల రికార్డింగ్‌ ‌సందర్భంలో బాలుగారికి గొంతులో  నాడ్యూల్‌ ‌వల్ల ఇబ్బంది వచ్చింది.‘సింగర్స్ ఎవరూ ఈ సర్జరీ చేయించుకోడానికి ఇష్టపడరు. ఎందుకంటే  చిన్న టిష్యూ పోయినా మీ గాత్రమే మారిపోతుంది’ అని డాక్టర్‌ ‌సలహా చెప్పారు బాలుగారికి. కానీ సర్జరీ చేయించు కోవాలని బాలు నిర్ణయించుకున్నారు. విషయం తెలిసిన మహా గాయని లతా మంగేష్కర్‌ ‌బాలుగారికి ఫోన్‌ ‌చేశారు. ‘ఏమిటి..ఏదో సాహసం చేయాలనుకుంటున్నా రట?’ అని అడిగారు. ‘‘దేవుడు మనల్ని చాలా ప్రత్యేకంగా సృష్టించాడు. మన ఓకల్‌ ‌కార్డస్ ‌చాలా ప్రత్యేకమైనవి. వాటి మీద మెటల్‌ ‌మాత్రం పడకుండా చూసుకో’ అని లతాజీ సలహా. అదృష్టవశాత్తూ ఏం జరగలేదు. ఆ మాధుర్యం మళ్లీ మొదలైంది. డాక్టర్‌ ‌వారం రోజులు రెస్ట్ ‌తీసుకోమంటే, బాలుగారు నాలుగో రోజే రికార్డింగ్‌కి కారెక్కారు.ఆ స్వరాన్ని ఖనిజమే ఏమీ చెయ్యలేక పోయిందనేది నిజం. పాట మీద మక్కువతో.. తన స్వరాన్ని మరిన్ని పాటలకు పంచాలన్న తాపత్రయంతో బాలుగారు తీసుకున్న ఆ నిర్ణయం మరెన్నో పాటల్ని మనకి అందించింది. అది ఆయనకీ మనకీ దేవుడి ఆశీర్వచనం.


బాలు రూమ్‌ ‌సర్వీస్‌

‌జేసుదాస్‌తో ఓ కచేరీ చేయడానికి ప్యారిస్‌ ‌వెళ్లినప్పటి సంఘటన. శ్రీమతి జేసుదాస్‌ ఆ ‌ట్రిప్‌కి లేరు. ఓ రోజు బాలుగారికి సందేహం వచ్చింది – జేసుదాస్‌ ‌గారికి ఎవరూ భోజనం ఇచ్చినట్టు లేదే అని. తను తెచ్చుకున్న కందిపొడి అన్నం, ఆవకాయ అన్నం, పెరుగు అన్నం ముద్దలు కలిపి ఒక ప్లేట్లో తీసుకెళ్లి ఫాల్స్ ‌వాయిస్‌లో ‘రూమ్‌ ‌సర్వీస్‌’ అని తలుపు తట్టారు బాలు. జేసుదాస్‌ ‌తలుపు తీశారు. ఎవరూ రాకపోవడం వల్ల నీళ్లు తాగి పడుకున్నానని చెప్పారు జేసుదాస్‌. ‌బాలు వారి ముందు భోజనం పెడితే, తిని కన్నీళ్లు పెట్టుకున్నారు జేసుదాస్‌. ‘ఇది ప్రసాదం తెలుసా.. మనకి ఆకలి వేసినప్పుడు ఎవరితో మనకి అన్నం పెట్టిస్తాడో తెలియదు నాన్నా’ అన్నారు జేసుదాస్‌ ‌కన్నీళ్లతో. ఈ సంఘ టనని జేసుదాస్‌ ‌చాలా వేదికలపైన చెప్పారు బాలు గురించి మాట్లాడుతూ. తిన్న మెతుకు అలాంటిది. పెట్టిన మనసు మెత్తనిది.


స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ..మధ్యలో స్నేహితుడికి కూడా స్థానం ఉండాలని అభిప్రాయపడే బాలుగారికి ఎందరో స్నేహితులు. ఎన్నో సంవత్సరాలు బాలుగారితోనే వున్న ఇద్దరి పేర్లు – మురళి,  విఠల్‌. ఆయనకు  కన్యాదానం చేసింది కూడా మిత్రుడే, ఆర్‌. ‌సుబ్రహ్మణ్యం. సింహాచలంలో పెళ్లి చేసుకుని మిత్రులు డబ్బు పోగేసి ఇస్తే తిరిగి మద్రాస్‌ ‌వెళ్లారు ఆ కొత్తదంపతులు.

ఇదంతా ఒక కథైతే ఆయన ఐదు దశాబ్దాల స్నేహానికి మణిమకుటాలైన మరో రెండు ఉదాహరణలు- భారతీరాజా, ఇళయరాజా. పెట్రోలు బంకులో పనిచేస్తూ సినిమా ప్రయత్నాలు చేస్తున్న భారతీరాజా ప్రతిభని నలుగురికీ పరిచయం చేసి, వారితో స్నేహం చేశారు బాలు. ఇప్పుడు మేస్ట్రోగా వెలుగుతున్న ఇసైజ్ఞాని  ఇళయరాజాకి కష్టకాలంలో తన మ్యూజిక్‌ ‌ట్రూపులో అవకాశం కల్పించి, ఎంతో స్నేహమాధుర్యాన్ని పంచారు బాలు. బాలు కారణంగానే డ్రమ్మర్‌ ‌శివమణికి ఝుమ్మందినాదం పాటలో అవకాశం దక్కింది.

– ‌గోపరాజు రాధాకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE