– క్రాంతిదేవ్ మిత్ర, సీనియర్ జర్నలిస్ట్
అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అయోధ్య రథయాత్ర చేసిన లాల్‌కృష్ణ అడ్వాణీ సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. యథాప్రకారం ముస్లింలలోని ఒక వర్గం, గంపగుత్తగా వామపక్షం, వీళ్ల తైనాతీలైన మేధావులు మరొక ‘చీకటిరోజు’ను భారతదేశ చరిత్రకూ, పనిలో పనిగా భారత న్యాయ వ్యవస్థ చరిత్రకూ కూడా అంటగట్టారు. ఈ తీర్పు ఊహించినదేనంటూనే, న్యాయం ప్రహసనప్రాయమైందని పెద్ద పెద్ద మాటలు దేశం మీద రుద్దుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పునే కాదని, ఎప్పటికైనా అయోధ్యలో వివాదాస్పద స్థలం అల్లాదే అంటున్నా, ఆలయం కట్టినా, ముస్లిం ఆలోచనలలో అక్కడ ఉన్నది ‘కాబా’యేనని వీరంగం వేసినా పట్టించుకోని మేధావులు, హక్కుల కార్యకర్తలు, స్వయం ప్రకటిత సామాజిక కార్యకర్తలు సీబీఐ కోర్టు తీర్పును మాత్రం తూర్పార పడుతున్నారు. అప్పీలు చేయవలసిందేనని హడావుడి పడుతున్నారు. తప్పక పైకోర్టుకు వెళ్లవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ, నిజం చెప్పాలంటే, బాబ్రీ పతనం కేసులో ఉన్నవారిని ప్రజాకోర్టు ఏనాడూ నిందితులుగా భావించలేదు.
వివాదాస్పద కట్టడం కూల్చివేతకు ముందస్తు కుట్ర జరిగలేదని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. సీబీఐకి ఇది శరాఘాతమే. అంతకు మించి ఒక వర్గం ముస్లింలకు కూడా. అలాగే వీరిని అంటకాగే అర్బన్ నక్సల్స్‌కు కూడా చెంపపెట్టు. అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు జరగలేదని, పైగా ఉద్రేకపూరితులై ఉన్న కరసేవకులను నిలువరించే ప్రయత్నం జరిగిందని కూడా న్యాయమూర్తి నిర్ధారించారు. కానీ అయోధ్యకు సంబంధించి ఏ పరిణామం జరిగినా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బాహాటంగానే కుట్రలు జరుగుతున్నాయి. తీర్పులు చదవకుండానే ముందస్తు అభిప్రాయాలు ప్రకటిస్తూ న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతున్నది.
భారత రాజకీయ చిత్రపటాన్ని తారుమారు చేసినదే రామజన్మభూమి-బాబ్రీ వివాదం. ఈ అంశం గురించి ఎంత చిన్న వార్త అయినా, పరిణామమైనా పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నది. ఇది అనివార్యం. అయోధ్యను హిందువులకు అప్పగించాలంటూ బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అడ్వాణీ రథయాత్ర ఆరంభించి నప్పుడు, కరసేవల సమయంలో దేశంలో గగ్గోలు పుట్టించారు. దశాబ్దాల తరువాత అయోధ్యలో వివాదాస్పద స్థలంగా చెబుతున్న భూమి రామునిదేనని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు, ఆగస్టు ఐదున అక్కడ ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసినప్పుడు ఇలాగే అవాంఛనీయ వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు అయోధ్యలో బాబ్రీ కూల్చివేత తీర్పు గురించి కూడా అలాంటి వక్రభాష్యాలే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆ తీర్పుతో అయోధ్య ఉద్యమ వివాదంలో చివరి అంకం పూర్తయింది.
బాబ్రీ కట్టడం కూల్చివేతలో ఎలాంటి కుట్ర లేదనీ, నాటి ప్రభుత్వం మోపిన అభియోగాలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవనీ స్పష్టమైన తీర్పు వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని కోర్టు నిర్ధోషులుగా పేర్కొన్నది. మొత్తం 48 మందిపై అభియోగాలు మోపగా, ఇప్పటికే 17 మంది మృతి చెందారు. లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్‌జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతి, చంపత్‌రాయ్, నృత్యగోపాల్‌దాస్, సాధ్వి రితంబర, సాక్షి మహారాజ్, వినయ్ కటియార్, ధరమ్‌దాస్, పవన్‌పాండే, వేదాంతి, లల్లూసింగ్ తదితరులు ఈ కేసు నుంచి విముక్తులయ్యారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులను మోపిందని స్పష్టమైపోయింది.
తీర్పు సందర్భంగా సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌కె యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆ తీర్పును వ్యతిరేకిస్తున్నవారు గమనించారా? 2300 పేజీల తీర్పు అది. కానీ అది ఇంకా న్యాయమూర్తి బల్లమీద ఉండగానే దేశంలో వ్యాఖ్యానాల పరంపరం మొదలయింది. అయోధ్యలో కరసేవకులది ముందస్తు కుట్ర కాదని కోర్టు చెప్పింది. కానీ తీర్పు ప్రతి చదవకుండానే తప్పు పడుతున్న ఇలాంటి మేధావుల ముందస్తు మేధో కుట్ర గురించి ఎవరు తీర్పు చెప్పాలి? ‘ఒక వ్యక్తి చట్ట వ్యతిరేక గుంపు మధ్య ఉన్నంత మాత్రాన అతడు అందులో భాగమేనని భావించడానికి రుజువుగా తీసుకోవడానికి ఉపకరించేది కాదు. ఆ గుంపుతో కలసి ఆ వ్యక్తి ఏం చేశాడు అన్నది రుజువు కావలసి ఉంటుంది’ అని ఒక కేసు సందర్భంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులోని అంశాలను జస్టిస్ యాదవ్ ఉటంకించారు. ఇది కట్టడం కూల్చివేతలో ఎల్‌కె అడ్వాణీ ప్రమేయం గురించి చెప్పిన మాట. కూల్చివేతలో ఈ 32 మంది ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించిన తీరునే న్యాయమూర్తి తప్పు పట్టారు. ఇలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించకుండా సీబీఐ సమన్వయం పాటించి ఉండాల్సిందని న్యాయమూర్తి అభిప్రాయపడిన సంగతిని గమనించాలి. వీడియో క్యాసెట్లను తారుమారు చేసే అవకాశం ఉంది. అయినా ఆ క్యాసెట్లను సీలు వేసిన కవర్‌లో పెట్టి ఇచ్చే ప్రయత్నం కూడా సీబీఐ చేయలేదన్నారు న్యాయమూర్తి. సీలు వేయని ఆధారాలు అసలు సమర్పించడానికే తగవని కూడా అన్నారు. కట్టడం కూలుతుంటే ఒక సాధ్వి ‘ఏక్ ధక్కా దో ఔర్ బాబ్రి మస్జిద్ తోడ్ దో’ అంటూ అక్కడ ఆ సమయంలో నినాదాలు వినిపించాయనడానికి కూడా ఆధారాలు లేవని న్యాయమూర్తి తేల్చారు. ఈ దేశాన్ని నిజంగా ప్రేమించేవారు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారు గమనించవలసిన మరొక వ్యాఖ్య కూడా ఉంది. పియుసిఎల్ నేత ఈ మాట ముంబైలో అన్నారని వార్తలు వచ్చాయి.
కూల్చివేత సమయంలో కరసేవకుల పేరుతో పాక్ నిఘా వర్గాలు, సాంఘిక వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు అక్కడకు ప్రవేశించారన్న కోణం నుంచి కూడా ఈ ఘటనను చూడాలన్న అభిప్రాయం ఆ హక్కుల నేతకు న్యాయవ్యవస్థకు జరిగిన అపచారంగా అనిపిస్తున్నది. ఇలాంటి మాటలతో నిజమైన దోషులు తప్పించుకోవడానికి దారి ఏర్పడుతుందని ఆ నేత పత్రికల వారితోనే అన్నారు. ఇలా న్యాయాన్ని పక్కదారి పట్టిస్తే ప్రజలంతా లేచి నిలబడి, నిలదీయాలి అని పిలుపునిచ్చాడు షారుక్ మాప్‌కార్ అనే హక్కుల కార్యకర్త. ఇతడు ముంబై ముష్కర దాడుల నుంచి తప్పించుకుని బతికి బయటపడిన వాడు కూడా. ఇంకా దారుణం- అక్టోబర్ 5న, అంటే తీర్పు వెలవడని రెండు రోజులకే పోగ్రెసివ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మద్దతుదారుల సమావేశంలో వినిపించిన మాటలు ఇంకెంత ఘోరంగా ఉన్నాయి! అయోధ్య ఆలయంలోనూ విగ్రహాలను పెకలిస్తాం అన్నాడు ఫతేహుద్దీన్ రషీద్. ఇతడు ఇమామ్‌ల మండలి ఉపాధ్యక్షుడు. తిరువనంతపురంలో జరిగిన పీఎఫ్‌ఐ మద్దతుదారుల సమావేశంలో బాహాటంగానే కారుకూతలు కూశాడు. కాబాలో ఉన్న 3000 విగ్రహాలను తొలగించాం, రాత్రికి రాత్రి అది అల్లా నిలయమైంది. అయోధ్యలో కూడా అంతే అన్నాడు. అయోధ్యలో డిసెంబర్ 6, 1992న రెచ్చగొట్టే ప్రసంగాలు జరిగాయనడానికి ఆధారాలు లేవని న్యాయమూర్తి చెప్పారు. కానీ తాజా తీర్పు వెలువడిన తరువాత మీడియాలో, సామాజిక మాధ్యమాలలో సైతం దర్శనమిచ్చిన ఇలాంటి మాటలు రెచ్చగొట్టే ప్రసంగాలని దేశం ఎందుకు భావించడం లేదు? తీర్పులను ఇలా అవహేళన చేస్తున్న, న్యాయ వ్యవస్థ మీద మండిపడుతున్న వారికి ఈ దేశంలో కొదవ లేదు. న్యాయం జరిగే వరకు పోరాడి తీరతామని తీస్తా సెతల్వాడ్ అనే ‘సామాజిక కార్యకర్త’ ప్రతిజ్ఞ చేశారు. ఇది (తీర్పు వెలువడిన రోజు) చీకటిదినం అని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ వెంటనే వ్యాఖ్యానించాడు. ఇలాంటి ‘భారత పౌరుల’ వల్లనే కదా, భారత న్యాయస్థానం వెల్లడిస్తున్న తీర్పుల మీద వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్ సైతం ఉవ్విళ్లూరుతున్నది! దుస్సాహసం చేస్తున్నది! తాజా తీర్పు తరువాత పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఏమన్నాడు? న్యాయాన్ని అవహేళన చేస్తూ చరిత్రాత్మక మసీదును కూల్చిన వారిని నిర్దోషులుగా విడిచి పెట్టారని అతడు అన్నాడు.
హిందువుల ఆవేదనకు ముగింపు: వీహెచ్‌పీ
సత్యాన్ని, న్యాయాన్ని నిరూపించిన తీర్పు ఇది. సుమారు 472 ఏళ్లుగా హిందువుల మనసుల్లో ఆవేదన కలిగిస్తున్న అంశానికి ఈ తీర్పు ముగింపు పలికింది. రాజకీయాలను విడిచి, పక్షపాత ధోరణికి స్వస్తి పలకాల్సిన సమయమిది. గతాన్ని మరచి దేశ ఐక్యత కోసం ముందుకు నడవాలని విశ్వహిందూ పరిషత్ స్పందించింది.
6 డిసెంబర్, 1992..
ఇలాంటి కువ్యాఖ్యలు విన్న తరువాత ఆ రోజున అయోధ్యలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవడం అవసరం. కుట్ర అప్పుడు జరిగిందా, లేక ఇప్పుడు జరుగుతున్నదా అనే విషయం దానితో బోధపడు తుంది. కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. పైగా ఇవన్నీ నాడు మీడియాలో వచ్చినవే. భవ్య రామమందిర నిర్మాణం కోసం జరుగుతున్న మహోద్యమంలో కీలక ఘట్టం కోసం అయోధ్య సిద్ధమైంది. దేశం నలుమూలల నుంచి కరసేవకులు తరలివచ్చారు. కార్యక్రమ ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన నాయకులంతా పిడికెడు ఇసుకతో కరసేవ చేయాల్సి ఉంది. అంతకు ముందు రోజు లక్నోలో బీజేపీ మరో అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి ప్రసంగిస్తూ ఒక విషయం చెప్పారు. కరసేవను ఆపమని సుప్రీం కోర్టు చెప్పలేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన మాటలు కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయినాయి. అంటే శాంతియుత కరసేవకు సుప్రీం అనుమతి ఉంది. అందుకే ఆరో తేదీ ఉదయం 10 గంటలకు అగ్రనాయకుల ఉపన్యాసాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంతలో కలకలం మొదలైంది. అప్పటికి మసీదు వెనుక నుంచి ఒక వర్గం రాళ్లు రువ్వడం మొదలైన సంగతిని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. ఆ క్షణంలోనే వివాదాస్పద బాబ్రీ కట్టడం గుమ్మటాలపైకి కొందరు కరసేవకులు చేరుకున్నారు. తమ చేతిలోని పరికరాలతో బాదడం మొదలు పెట్టారు. అక్కడ ఏదో జరుగుతోందని అగ్రనాయకు లకు అర్థమైంది.
వేదికపై ఉన్న బీజేపీ నాయకుడు లాల్‌కృష్ణ అడ్వాణీ గుమ్మటాల మీద ఉన్నవారిని వెంటనే కిందకి దిగమని మైక్ ద్వారా అభ్యర్థించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. కానీ ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. ఆరెస్సెస్ సీనియర్ నాయకులు హెచ్.వి.శేషాద్రి వివిధ భాషల్లో వారిని కోరినా ఫలితం లేకపోయింది. రాజమాత విజయరాజే సింధియా ‘మీ తల్లిగా అభ్యర్థిస్తున్నా.. మీరు ఇలాంటి పని చేయకూడద’ని పదే పదే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. అడ్వాణీ సూచన మేరకు ఉమాభారతి, ప్రమోద్ మహాజన్ ఆ ప్రదేశానికి వెళ్లి గుమ్మటాల మీద ఉన్నవారిని కిందకు దిగమన్నారు. కొందరు వారి మాట మన్నించినా, మిగతా వారు వినే స్థితిలో లేరు.
అడ్వాణీ స్వయంగా వివాదాస్పద కట్టడం దగ్గరకు వెళ్లడానికి సిద్ధపడగా, ఆయనకు భద్రతగా వచ్చిన మహిళా పోలీస్ అధికారి వారించారు. ‘మీ భద్రతకు నేను బాధ్యురాలిని, మీరు అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదు’ అని స్పష్టం చేశారు. విశ్వహిందూ పరిషత్ అగ్రనాయకుడు అశోక్ సింఘాల్ స్వయంగా అక్కడకు వెళ్లి కరసేవకులను వారించారు. దాడులు ఆపాలని కోరడంతో ఆగ్రహించిన కొందరు ఆయనపై దాడికి దిగారు. ఈ గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగానే పెద్ద శబ్దం వినిపించింది.. వరుసగా కొద్ది నిమిషాల వ్యవధిలోనే మూడు గుమ్మటాలు కూలిపోయాయి.. ఉద్యమ లక్ష్యాలు, సూత్రాలకు భిన్నంగా అక్కడ జరిగిన ఘటనలను చూసి అడ్వాణీ సహా నాయకులంతా ఖిన్నులయ్యారు. (అడ్వాణీ జీవిత చరిత్ర ‘నా దేశం, నా జీవితం’ ఆధారంగా)
కల్యాణ్‌సింగ్ పాత్ర ఎంత?
వాస్తవానికి 1992 డిసెంబర్ 5 నుంచే అయోధ్యలో కల్యాణ్ సింగ్ ప్రభుత్వం భారీగా పోలీసుల్ని మోహరించింది. 35 కంపెనీల ప్రావిన్షియల్ ఆర్మీడ్ కానిస్టేబ్యులరీ (పీఏసీ), 195 కంపెనీల పారామిలటరీ బలగాలు, నాలుగు కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు, 15 బాష్పవాయు ప్రయోగ బృందాలు, 15 మంది ఇన్‌స్పెక్టర్లు, 30 మంది ఎస్‌ఐలు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్ల్లు మోహరించారు. జిల్లా మెజిస్ట్రేట్ పారామిలటరీ బలగాల్ని మోహరించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. వాళ్లెవరూ కాల్పులకు దిగకూడదన్న షరతు మీద ఆనాటి సీఎం బలగాల మోహరింపునకు అనుమతించారు. అయితే కూల్చివేత సమయంలో వారు వివాదాస్పద కట్టడం దగ్గరకి వెళ్లడంలో విఫలమయ్యారు. మార్గం మధ్యలోనే వారిని కరసేవకులు అడ్డుకున్నారు. దీంతో రాష్ట పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా మిన్నకుండిపోయారు. డీజీపీ కాల్పులకు అనుమతి అడిగితే కల్యాణ్‌సింగ్ నిరాకరించారు.
డిసెంబర్ 6న జరిగిన కరసేవకు సుప్రీం కోర్టుకు ఇచ్చిన ప్రత్యేక హామీ మేరకు అనుమతి లభించింది. ఈ హామీని నిల్పుకోవడంలో నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ విఫలమయ్యారు. అడ్వాణీ సూచన మేరకు ఆయన రాజీనామా చేశారు.ఆ తర్వాత లోక్‌సభలో బీజేపీ పక్ష నాయకుని పదవికి అడ్వాణీ రాజీనామా చేశారు. వాస్తవానికి కల్యాణ్‌సింగ్ ముఖ్యమంత్రి పదవిలో ఎంతో సంయమనంతో వ్యవహరించారు. అంతకుముందు జరిగిన కరసేవ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ములాయంసింగ్ యాదవ్ రామజన్మభూమి ఉద్యమం విషయంలో దురుసుగా ప్రవర్తించారు. అయోధ్యకు కరసేవకులు రాకుండా రోడ్లను మూసివేయడంతో పాటు వేలాది మందిని అరెస్టు చేశారు. ఎంతో మంది కరసేవకులను హత్య చేయడంతో పాటు రామభక్తులను చిత్రహింసలకు గురిచేశారు.
తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హర్షం:
బాబ్రీ కట్టడం కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హర్షం వ్యక్తం చేసింది. వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్నవారందరినీ నిర్దోషులుగా గుర్తిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామని ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ భయ్యాజీ జోషి చేసిన ప్రకటనను సంఘ్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ చేసింది.
కుట్రకు తెర తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం
అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ కట్టడం కూల్చివేత పథకం ప్రకారం జరిగిందా? ఉద్యమ నాయకులకు ముందే ఈ విషయం తెలుసా? ఇది వాస్తవం కాదని ఆనాడు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న ఎస్.బి. చౌహాన్ స్పష్టంగా చెప్పారు. పథకం ప్రకారం ఈ ఘటన జరగలేదని.. ఇలా జరుగుతుందని ముందుగా నిఘా వర్గాలు కూడా సంకేతాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. ముందుగా సమాచారం ఉంటే దాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకునేవారమని 1993 జనవరి 3 నాటి పత్రికలలో ఈ వార్త వచ్చింది. కానీ ప్రధాని పీవీ నరసింహారావు మాత్రం ఉద్యమ నాయకులు కుట్ర, నేర ప్రవృత్తి, నమ్మక ద్రోహాన్ని ప్రదర్శించారని ఆరోపించారు.
డిసెంబర్ 6 నాటి ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కల్యాణ్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. మరో విచిత్రం ఏమిటంటే, బాబ్రీ కట్టడం కూలిన తర్వాత కరసేవకులు అక్కడ తాత్కాలిక రామ్‌లల్లా మందిరం నిర్మించారు. ఇదంతా రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాతే జరిగింది. ఆ తర్వాత తాత్కాలిక మందిరంలోని శ్రీరాముని దర్శనానికి 1993లో అలహాబాద్ హైకోర్టు భక్తులకు అనుమతినిచ్చింది.. ఈ లెక్కన అప్పుడే రామమంది రానికి చట్టబద్దత లభించిందని చెప్పవచ్చు.
అయోధ్యలో తాత్కాలిక రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత బాబ్రీ మసీదును తిరిగి నిర్మిస్తామని పీవీ నరసింహారావు హామీ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. 8 డిసెంబర్ 1992న అడ్వాణీ, మురళీమనోహర్ జోషి, అశోక్ సింఘాల్, విష్ణు హరిదాల్మియా, వినయ్ కటియార్, ఉమాభారతిలను అరెస్టు చేశారు. 10 జనవరి 1993 వరకు వారు నిర్బంధంలోనే ఉన్నారు. 1992 డిసెంబర్ 10న ఆరెస్సెస్, వీహెచ్‌పీ, బజ్‌రంగ్‌దళ్‌తో పాటు జమాతే ఇస్లామీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. జనవరి 15, 1993న అయోధ్యతో ఏమాత్రం సంబంధం లేని రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఈ చర్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ అంతర్గత అసమ్మతి కారణంగా చేపట్టినవేనని స్పష్టంగా తెలిసిపోయింది.
లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు
బాబ్రీ కట్టడం కూల్చివేత తర్వాత.. 1992 డిసెంబరు 16న అప్పటి పీవీ నరసింహారావు సర్కారు ఈ ఘటనపై విచారణకు జస్టిస్ లిబర్హాన్‌తో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. తొలి మూడు నెలల్లోనే జస్టిస్ లిబర్హాన్ నివేదికను అందజేసిప్పటికీ సమగ్ర విచారణ పేరుతో కమిషన్ గడువును 48 సార్లు పొడగించారు. 2005 ఆగస్టు దాకా ఆయన నిందితులందరినీ విచారించారు. చివరిసాక్షిగా.. బాబ్రీ కూల్చివేత సమయంలో యూపీ సీఎంగా ఉన్న కల్యాణ్‌సింగ్ వాంగ్మూలాన్ని సేకరించారు. 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2009 జూన్ 30న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర హోం మంత్రి పి.చిదంబరానికి ఆయన తుది నివేదికను అందజేశారు. మసీదు కూల్చివేత వెనుక కుట్ర ఉన్నట్లు కమిషన్ తన నివేదికలో తేల్చింది.
సీతారాముల దయ: నృత్యగోపాల్ దాస్, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నవారు దేశానికి, సమాజానికి హాని తలపెట్టేవారు కాదు. అయినా వారిని నిందితులుగా చేర్చడంతో మానసిక వేదన అనుభవించారు. సీతారాముల దయతోనే వారు నిర్దోషులుగా బయటపడ్డారు.
సీబీఐ దర్యాప్తు సాగిందిలా..
1993లో అయోధ్య కేసుల సత్వర విచారణకు లలిత్‌పూర్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. యూపీ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుతో సంప్రదించి కేసులన్నింటినీ లక్నోలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్ 197 విచారణ సీబీఐ చేపట్టగా మరో కేసు విచారణ రాయ్‌బరేలీలోని ప్రత్యేక కోర్టులో సీఐడీ ఆధ్వర్యంలో జరిగింది. సీబీఐ 1993 అక్టోబర్‌లో శివసేన అధ్యక్షుడు బాలాసాహెబ్ ఠాక్రే, బీజేపీ నేత కల్యాణ్‌సింగ్, చంపత్‌రాయ్ బన్సల్, ధరమ్‌దాస్, నృత్య గోపాల్‌దాస్ తదితరులపై అభియోగాలు నమోదు చేసింది. మసీదు కూల్చివేతకు ఒక్క రోజు ముందు బజ్‌రంగ్ దళ్ నేత వినయ్ కటియార్ ఇంట్లో ఒక రహస్య సమావేశం జరిగిందని, అందులోనే వివాదాస్పద కట్టడం పడగొట్టేందుకు కుట్ర పన్నారన్నది ఈ అభియోగపత్రంలోని ప్రధాన అంశం.
1996లో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్ ఆధారంగా ఎల్‌కే అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసేందుకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి కూల్చివేతకు అడ్వాణీ తదితరులు 1990 నుంచి కుట్ర పన్నారని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ పరంగా జరిగిన లోటుపాట్ల ప్రస్తావిస్తూ అడ్వాణీ కోర్టు తీర్పును సవాలు చేశారు. లోటుపాట్లను సరిచేస్తామన్న సీబీఐ అభ్యర్థనకు యూపీ ప్రభుత్వం నిరాకరించడంతో 2001లో నేరపూరిత కుట్ర అరోపణ వీగిపోయింది.
రాయ్‌బరేలీ ప్రత్యేక కోర్టులో సీబీఐ అభియోగ పత్రం నమోదు చేయగా.. తగినన్ని ఆధారాలు లేనందున అడ్వాణీని అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని 2003లో న్యాయమూర్తి ఆదేశించారు. అలహాబాద్ హైకోర్టులో నేరపూరిత కుట్ర ఆరోపణలు లేకుండా 2005లో మళ్లీ కేసు విచారణ మొదలుపెట్టింది. 2010లో అలహాబాద్ హైకోర్టు 2001లో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు కొట్టివేసింది. రాయ్‌బరేలీ ప్రత్యేక కోర్టులో మరోసారి కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది.
కాగా 2012లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో 2015లో బీజేపీ సీనియర్ నేతలకు సుప్రీం నోటీసులు అందాయి. 2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు అడ్వాణీతో పాటు మిగతా వారిపైనా నేరపూరిత కుట్ర కోణంలో విచారణ జరపాలని చెప్పింది. 2019లో అయోధ్యలో వివాదాస్పద ప్రాంతం మొత్తాన్ని రామమందిర నిర్మాణానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భవ్య రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో అడ్వాణీ తదితరులపై మోపిన కుట్ర కేసు తీర్పు ఎలా ఉండబోతోందనే అంశంపై అందరి దృష్టి నిలిచింది.
జై శ్రీరాం : అడ్వాణీ
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిర్దోషిగా విడుదలైన భాజపా సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును స్వాగతించారు. కేసు విచారణ వార్తలను టీవీలో ఉత్కంఠగా వీక్షించిన 92 ఏళ్ల ఆడ్వాణీ.. తీర్పు వెలువడగానే ఇంటి బయటకు వచ్చి మీడియాకు అభివాదం చేస్తూ ‘జై శ్రీరాం’ అని నినదించారు. రామజన్మభూమి ఉద్యమం పట్ల తనకు, భాజపాకు ఉన్న విశ్వాసాన్ని, నిబద్ధతను ఈ తీర్పు రుజువు చేసిందంటూ ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.
28 ఏళ్ల తర్వాత విముక్తి
అయోధ్య కేసుల్లో చివరిదిగా భావించే వివాదాస్పద నిర్మాణం బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఈ సెప్టెంబర్ 30లోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయమూర్తిని ఆదేశించింది. విచారణలో భాగంగా 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది. ప్రతీకార చర్యలో భాగంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో ఇరికించిందని, తాము నేరం చేశామనడానికి ఎలాంటి ఆధారం లేదని విచారణలో భాగంగా నిందితులు వాదించారు.
ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కోగా కేసు విచారణలో ఉండగానే 17మంది మరణించారు. ఈ మేరకు తీర్పు సమయంలో ప్రస్తుతం ఉన్న 32 మందిని కోర్టులో హాజరుకావాలని సెప్టెంబర్ 16న న్యాయమూర్తి ఆదేశించారు. అయితే వయోభారం, కరోనా కారణంగా అడ్వాణీ, మురళీమనోహర్ జోషి, మహంత్ కోర్టుకు హాజరు కాలేకపోయారు. ఉమాభారతి, కల్యాణ్ సింగ్‌లకు కరోనా సోకడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీర్పు సమయంలో వీరంతా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా, మిగతా వారంతా కోర్టులో హాజరయ్యారు.
బాబ్రీ కట్టడం కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి తదితరులను నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.
వివాదాస్పద నిర్మాణం కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగినది కాదని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని స్పెషల్ కోర్టు జడ్జి యాదవ్ తీర్పులో వెల్లడించారు. అడ్వాణీ, మురళీమనోహర్ జోషి తదితరులు వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చి వేయకుండా ఆపడానికి ప్రయత్నించారని కోర్టు గుర్తించింది. సరైన ఆధారాలు లేనందున వారందరిపై అభియోగాలు కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి ఎస్ కె యాదవ్ తీర్పులో వెల్లడించారు. ఆరెస్సెస్, వీహెచ్‌పీ కార్యకర్తలు ఏర్పాట్లన్నీ చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వచ్చారు. మహిళలు, వృద్ధులకు అక్కడ కుర్చీలు ఏర్పాటు చేశారు. పార్కింగ్‌కు చోటు కల్పించారు. వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయాలనే పథకం నిందితుల్లో లేదనే వాస్తవాన్ని ఇవన్నీ చెబుతున్నాయి అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూలిన తరువాత బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు గళ దిగ్బంధనం చేయడంలో కాంగ్రెస్, వామపక్షాలు విజయవంతమైనాయి. అయితే అది కొద్దికాలమే. వాస్తవాలు వెల్లడి కావడం మొదలయింది. వాజపేయి తరువాత మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో యుపీఏ పదేళ్లు దేశాన్ని ఏలింది. అప్పుడు ఈ కేసును వారు ఎందుకు తేల్చలేకపోయారు? ఇదొక ప్రశ్న. ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ములాయం సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరసేవకుల మీద పోలీసు యంత్రాంగం విచక్షణా రహితంగా సాగించిన దమనకాండ గురించి హక్కుల కార్యకర్తలు ఎందుకు ప్రశ్నించరు? అదేరోజు (డిసెంబర్ 6)న సరయూ నదిలో గోనె సంచులలో కట్టి విసిరేసిన కరసేవకుల పేర్లు వారి చేత ఇప్పుడయినా బయట పెట్టిస్తారా? అయోధ్య ఉదంతం పేరుతో భారత ఉపఖండంలో మొత్తం రెండువేల మంది చనిపోయారని గగ్గోలు పెడుతున్నారు సరే. అందులో వాస్తవాలు, హిందు సంస్థల వారు ఎందరు అన్న లెక్క కూడా తేల్చగలరా? అయోధ్యలో కట్టడం కూలితే బంగ్లాదేశ్‌లో డెబ్బయ్‌కి పైగా హిందూ ఆలయాలు ఎందుకు కూలాలి? ముంబైలో ఎందుకు అల్లర్లు జరగాలి? బంగ్లాలో హిందూ ఆలయాలు కూల్చివేత మీద, హిందువుల పై జరిగిన అత్యాచారాల గురించి ప్రశ్నించిన తస్లీమా నస్రీన్ ఈనాటికి ఎందుకు సొంత దేశం వెళ్లలేకపోతున్నారు? కూల్చివేతపై తీర్పు రావడానికి 28 ఏళ్లేమిటి అంటూ ఎద్దేవా చేస్తున్నవారు గమనించవలసింది, తస్లిమా కూడా 28 ఏళ్లుగా తన దేశానికీ, తన వారికీ కూడా దూరంగానే ఉండిపోయారు. ఈమెకు న్యాయం చేస్తారా? చివరిగా, ముస్లిం పాలనలో, నేటి ముస్లిం దేశాలలో ఎన్ని హిందూ ప్రార్థనా మందిరాలు, ఎన్ని ఇతర మతాల వారి ప్రార్థనా స్థలాలు ధ్వంసమైనాయో ఒక్కసారి ముస్లిం వర్గాలు, వామపక్షాలు గుర్తు చేసుకోగలవా? విగ్రహాలు పెకలిస్తామంటూ తాజాగా వినవస్తున్న గర్జనలు వింటున్నాయా?