భారత సినీ సంగీత చరిత్రలో శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యందో సువర్ణ అధ్యాయం. 1966 డిసెంబర్ 15వ తేదీ మిట్టమధ్యాహ్నం సైకిల్‌పై విజయా గార్డెన్‌లోని రికార్డింగ్ థియేటర్‌కు వెళ్లిన ఓ నవ యవ్వనుడు తదనంతర కాలంలో దేశం గర్వించే గాయకుడు అవుతాడని ఆ సమయంలో ఎవ్వరూ ఊహించి ఉండరు. బహుశా అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు సైతం ఉన్నత స్థాయికి చేరుకుంటాడని భావించి ఉంటారు తప్పితే… న భూతో న భవిష్యతి అన్న చందంగా విశ్వఖ్యాతిని గడిస్తాడని ఊహించి ఉండకపోవచ్చు.
గాయకుడిగా 54 సంవత్సరాల ప్రస్థానంలో 16 భాషలలో నలభై వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో బాలు చోటు దక్కించుకున్నారు. ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’తో మొదలైన వారి నేపథ్యగాన ప్రయాణం ఈ ఏడాది విడుదలైన ‘పలాస’ వరకూ సాగింది. 1976లో ‘కన్యాకుమారి’తో స్వరరచనకు శ్రీకారం చుట్టిన బాలు తెలుగు, కన్నడ, తమిళ భాషలలో దాదాపు 60 చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. చాలామందికి తెలియని విషయం ఏమంటే… ఆయన తొలిసారి నేపథ్య గానం చేసిన సినిమా ఎం.ఎస్. రెడ్డి డబ్బింగ్ చేసిన ‘కాలచక్రం’. అందులో అన్ని పాటలూ బాలునే పాడారు. కానీ ఇది డబ్బింగ్ సినిమా కావడంలో చరిత్రలో చోటు చేసుకోలేక పోయింది. అలానే ‘కన్యాకుమారి’ కంటే ముందు తన స్నేహితుడు యోగి కోసం ‘యువకుల్లారా లేవండి’ చిత్రానికి బాలు సంగీతం అందించారు. కానీ అది విడుదలకు నోచుకోలేదు.
బాలు 1972లో తొలిసారి ‘మహ్మద్‌బీన్ తుగ్లక్’ చిత్రంలో నటించారు. ఆ రోజు నుండి ఇటీవలి వరకూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు వంద చిత్రాలలో నటించారు. తెలుగు సినిమా ‘పవిత్ర బంధం’లో వెంకటేశ్ తండ్రిగా నటించిన బాలు అదే సినిమా కన్నడ, తమిళ రీమేక్స్‌లోనూ ఆ పాత్రలను పోషించడం విశేషం. ఆ మధ్య వచ్చిన నాగార్జున, నాని ‘దేవదాస్’ చిత్రంలో బాలు చివరిసారి వెండితెరపై కనిపించారు. ఇక 1976లో విడుదలైన ‘మన్మథలీల’ చిత్రంతో బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు. అప్పటి నుండి బాలు తన తుదిశ్వాస విడిచే వరకూ కమల్ హాసన్‌కు పలు చిత్రాలలో డబ్బింగ్ చెబుతూనే ఉన్నారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ‘దశావతారం’ సినిమా డబ్బింగ్ గురించి. ఆ సినిమాకు కమల్ పది రోజుల పాటు డబ్బింగ్ చెబితే బాలు మూడున్నర రోజుల్లో దానిని పూర్తి చేసేశారు. అనిల్ కపూర్ తొలి తెలుగు చిత్రం ‘వంశవృక్షం’కు, జంధ్యాల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ముద్దమందారం’లో కథానాయకుడు ప్రదీప్‌కు బాలు గాత్రదానం చేశారు. జంధ్యాల ‘ఆనందభైరవి’ చిత్ర విజయానికి ప్రధాన కారకులు అందులోని కీలక పాత్రధారి గిరీష్ కర్నాడ్. ఆయనకు గొంతు అరువిచ్చిందీ బాలునే! మహాత్మాగాంధీ బయోగ్రఫీ ‘గాంధీ’ చిత్రం తెలుగు అనువాదంలో గాంధీ పాత్రధారి బెన్ కింగ్ స్లేకు గొంతిచ్చారు బాలు. తాను పోషించిన పరభాషా చిత్రాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు తెలుగు నటుల చిత్రాలు పరభాషల్లో డబ్ అయినప్పుడూ ఆయన గాత్రదానం చేశారు. అలా నాగార్జునకు తమిళ ‘రక్షకన్’కు, బాలకృష్ణకు ‘శ్రీరామరాజ్యం’ తమిళ వర్షన్‌కు బాలు డబ్బింగ్ చెప్పారు. బాలులోని ఈ వైవిధ్యం అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తుంటుంది. అయితే… పై లక్షణాలన్నీ ఆయనకు బాల్యం నుండి అబ్బినవే. త్రడి సాంబమూర్తి రాసిన అనేకానేక పాటలకు ఆయన పిన్నవయసులోనే స్వరాలు సమకూర్చి భావయుక్తంగా గానం చేశారు. అలానే నాటకానుభవం ఉంది, ఇక స్టేజీ ఎక్కితే జనాలను అలరించడానికి అద్భుతంగా మిమిక్రీ చేసేవారు. ఈ సాధనే ఆ తర్వాత సినీ రంగంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరచడానికి కారణమైంది.
ఇక స్వతస్సిద్ధంగా అబ్బిన వాక్‌చాతుర్యం ఆయన్ని గొప్ప వ్యాఖ్యాతగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, టీవీ మాధ్యమం ద్వారా ‘పాడాలని ఉంది, పాడుతా తీయగా, ఎందరో మహానుభావులు, స్వరాభిషేకం’ వంటి కార్యక్రమాలతో నూతన గాయనీ గాయకులను వెలుగులోకి తీసుకు రావడం, అనాటి గాయనీ గాయకులు, సంగీత దర్శకులను గౌరవించుకోవడం మరో ఎత్తు.
స్పర్థయా వర్థతే విద్య!
తనను చూసి నవ్విన వాళ్లే తలదించుకునేలా చేసిన ఘనత బాలుది. తెలుగులో పాటలు పాడటం మొదలు పెట్టినప్పుడు అగ్రకథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు బాలు గొంతు సరిపోదనే విమర్శలు అనేకం వచ్చాయి. ఘంటసాల మరణానంతరం కూడా ఆ ఇద్దరు పెద్దలూ బాలుకు వెంటనే అవకాశం ఇవ్వలేదు. ఎన్టీయార్ నటించిన ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రంలో బాలు అన్ని పాటలూ పాడారు. విశేషం ఏమంటే… అదే చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు అల్లు రామలింగయ్యకూ ఆయనే నేపథ్య గాయకులు. ఇక అక్కినేనికి బాలు ఇచ్చిన సూపర్‌హిట్ సాంగ్స్ గురించి చెప్పుకోనక్కర్లేదు. ఆయన గొంతు వీరికి సరిపడదు అన్న చోటనే ఆ విమర్శలో పసలేదని బాలు నిరూపించాడు. గతంలో ఒకే చిత్రంలో నటించిన ఇద్దరు హీరోలకు వేర్వేరు గాయకులు పాడితే, అలా కాకుండా ఒకే చిత్రంలో ఆ ఇద్దరు హీరోలకు బాలు ఒక్కడే పాటలు పాడిన సినిమాలు అనేకం ఉన్నాయి. ‘సత్యం శివం’లో ఇటు ఎన్టీఆర్, అటు ఏఎన్నార్‌లకు; ‘హేమాహేమీలు’ సినిమాలో ఏఎన్నార్‌కూ, కృష్ణకూ బాలునే పాడారు! ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. ఇక శాస్త్రీయ సంగీతం తెలియని బాలుతో ‘శంకరాభరణం’కు పాటలు పాడించడమా? అన్న నోళ్లనూ ఆయన మూయించారు. మహదేవన్ సహాయకులు పుహళేంది సహకారంతో నెల రోజుల పాటు కఠోర సాధన చేసి, శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి, తొలిసారి ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు పొందారు. ఇక తమిళంలో టీఎం. సౌందర్యరాజన్ అక్కడి అగ్ర కథానాయకులకు నేపథ్య గానం చేస్తున్న సమయంలో పట్టుదలతో తమిళ భాషను అభ్యసించి, అక్కడి ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీగణేశన్‌లకు పాటలు పాడారు. తన పాట కోసం వారంతా వేచి చూసే స్థాయికి ఎదిగారు. దర్శకులు భారతీరాజా, బాలచందర్, బాలు మహేంద్ర, మహేంద్రన్ వంటి వారి సహకారంతోనూ, సంగీత దర్శకుడు ఇళయరాజాతో ఉన్న అనుబంధంతోనూ బాలుకు అది సాధ్యమైంది. ఇక ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘మిన్సార కనువు’తో తన భాష కాని తమిళంలోనూ బాలు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
కన్నడ చిత్రసీమలోకి బాలు అడుగుపెట్టేసరికే నటులు రాజ్‌కుమార్, పి.బి.శ్రీనివాస్ వంటి ఉద్దండ గాయకులు అక్కడ రాజ్యమేలుతున్నారు. వారి సరసన చోటు దక్కించుకోవడానికి బాలుకు పెద్దంత సమయం పట్టలేదు. రాజన్ -నాగేంద్ర, విజయభాస్కర్, ఎం. రంగారావు వంటి సంగీత దర్శకుల ప్రోత్సాహంతో కన్నడ నాట పాగా వేశారు. అంథగాయకులు పంచాక్షరి గావై జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంగీత సాగర శ్రీగాన యోగి పంచాక్షరి గావై’ చిత్రానికి హంసలేఖ స్వరరచన చేయగా, బాలు ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక హిందీ చిత్రసీమలో బాలు గాన ప్రస్థానం ఆయన కీర్తికిరీటంలో కలికితురాయి. తొలి చిత్రం ‘ఏక్ దూజే కేలియే’తోనే ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. అయితే… ఆ చిత్రంలో పాత్రధారి కమల్ హాసన్ దక్షిణాదికి చెందిన యువకుడిగా నటించడం వల్ల బాలుతో పాడించారని, ఆయన హిందీ భాషలో స్పష్టతలేదని కొందరు విమర్శించారు. వారందరి నోళ్లకు బాలు తర్వాత పాడిన చిత్రాలే తాళాలు వేశాయి. ధర్మేంద్ర, జితేంద్ర, గోవింద, మిధున్ చక్రవర్తి, జాకీష్రాఫ్ మొదలుకొని అనేకమంది హిందీ హీరోలకు బాలు పాటలు పాడారు. ఇక సల్మాన్ ఖాన్ – బాలు కాంబినేషన్‌లో వచ్చిన హిందీ సూపర్‌హిట్ సాంగ్స్ అనేకానేకం. విశేషం ఏమంటే ‘మైనే ప్యార్ కియా, హమ్ ఆప్‌కే హై కౌన్’ వంటి హిందీ చిత్రాలు తెలుగునాట విశేష ఆదరణ పొందాయంటే కారణం బాలు అందులో పాడిన పాటలే! చిత్రం ఏమంటే ఆ చిత్రాలు ఆ తర్వాత తెలుగులోనూ డబ్ అయ్యి, అంతే ప్రజాదరణ పొందాయి. అలా మొదలైన బాలు హిందీ సినీ గాన ప్రస్థానం మొన్నటి ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ టైటిల్ సాంగ్ వరకూ సాగుతూనే ఉంది. శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించని ఓ గాయకుడు తన మాతృభాషలోనే కాకుండా మూడు పరభాషల్లోనూ ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డులు అందుకోవడం అనేది బాలుకు దక్కిన అరుదైన గౌరవం. స్పర్థయా వర్థతే విద్య అనేది ఆ రకంగా బాలుకు చక్కగా నరిపోతుంది.
విద్యనేర్వడంలో పోటీ పడ్డ బాలు… ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. సీనియర్ గాయనీ గాయకులకు ఎంతటి గౌరవాన్ని ఇచ్చారో, తన తర్వాతి తరం గాయనీ గాయకుల పట్ల అదే స్థాయి ఆత్మీయానురాగాలు పంచారు బాలు. వినయం, విధేయత, కృతజ్ఞతాభావం ఇవే తన ఎదుగుదలకు కారణమని బాలుకు తెలుసు. అదే మార్గంలో సాగమని ఈతరం గాయనీగాయకులకూ చెబుతుంటారు. పాటలంటే ప్రాణం పెట్టే బాలు కుటుంబ సభ్యులందరికీ పాటలు పాడే అలవాటు ఉండటం మరోవిశేషం. ఆయన సోదరి శైలజ గాయనిగా చక్కగా రాణించారు. మరో విశేషం ఏమంటే బాలు, తన ఇద్దరు చెల్లెళ్ళు వసంత, శైలజతోనూ, తన కొడుకు చరణ్, కూతురు పల్లవితోనూ కలిసి ‘డార్లింగ్ డార్లింగ్’ అనే తమిళ సినిమాలో పాట పాడారు. ఇక తెలుగు సినిమా ‘మా అల్లుడు వెరీ గుడ్’లో బాలు, చరణ్, పల్లవి కలిసి పాట పాడారు. ఆయన జీవితంలో ఇదో మరిచిపోలేని మధురానుభూతి.
బాలు సినీ ప్రస్థానంలో ఎవరితోనూ కఠినంగా మాట్లాడింది లేదు. పోట్లాడిందీ లేదు. అయితే నటుడు కృష్ణతోనూ, జీవిత చరమాంకంలో సహచర సంగీత దర్శకుడు ఇళయరాజాతోనూ ఆయనకు విభేదాలు వచ్చాయి. అవన్నీ టీ కప్పులో తుఫాను లాంటివి. ఆ తర్వాత కృష్ణకు బాలు అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇక బాలును ప్రాణంగా భావించే ఇళయరాజా ఆయన కోలుకోవాలంటూ కన్నీటితో ఆ భగవంతుడిని ప్రార్థించాడు. ఆయనలానే కోట్లాదిమంది చేసిన ప్రార్థనలూ ఫలించక బాలు తనువు చాలించారు. బాలు మరణానంతరం ఇళయరాజా తిరువణ్ణామలైలోనే విశ్వేరుడికి సమక్షంలో బాలుకోసం మోక్షదీపం స్వయంగా వెలిగించడంతోనే వారి మధ్య ఉన్న గాఢానుబంధం సంగీత ప్రపంచానికి అర్థమైంది.
దాదాపు ఐదున్నర దశాబ్ధాలపాటు భారతీయ సినీ సంగీతాన్ని తన పాటతో ఓలలాడించిన ఆ గాయకునికి, పుంభావ సరస్వతి తనయుడికి భారత రత్న అవార్డును ప్రకటించాలన్నది కోట్లాది మంది కోరిక. అనతికాలంలోనే అది నెరవేరుతుందని భావిద్దాం.
– వడ్డి ఓంప్రకాశ్ నారాయణ, వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్