చరిత్ర రచనలో నాణేల పాత్ర అత్యంత కీలకమైనది. శిలాశాసనాలు, సాహిత్యాధారాలతో పాటు నాణేల సంపద కూడా చరిత్ర రచనను సుసంపన్నం చేసింది. నాణేల మీద జరిగిన పరిశోధనలో, అధ్యయనంలో వింత వింత అంశాలు బయట పడ్డాయి. ఎప్పుడు నాణేల గుట్టలు బయటపడ్డా, చరిత్రపుటలలో ఒక కొత్త వాక్యం చేరుతూనే ఉంటుంది. వాటి మీది గుర్తులు కూడా విశేషమైన సంగతులనే వెల్లడిస్తూ ఉంటాయి. మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదుడైన పాలకుడు. ఇతడి మతోన్మాదం, అసహనం చరిత్ర ప్రసిద్ధం. ఇస్లాంను తీవ్రంగా ఆచరించిన ఇలాంటి పాలకుడు కూడా మొగలుల నాణేల మీద మత గ్రంథం నుంచి స్వీకరించిన ఒక వాక్యాన్ని కనపడ కుండా నిషేధించాడు. ఆ పవిత్రవాక్యం అతడి ముందు పాలకుల కాలం నుంచి కూడా నాణేల మీద ఉండేది. వారు కూడా ఇస్లాంను ఆచరించినవారే. కానీ, గ్రేట్ మొగల్స్‌గా పేరొందిన తొలి ఆరుగురు పాలకులలో చివరివాడైన ఔరంగజేబ్ నాణేల మీద ఆ వాక్యాన్ని నిషేధించాడు. ఎందుకో తెలిస్తే సంభ్రమాశ్చర్యాలకు గురికావడం తథ్యం. ఇలాంటి వాస్తవాలను ఆ వంశీకులు భద్రపరిచిన చారిత్రక పత్రాల ద్వారానే తెలుసుకోవచ్చు.
మొగలుల పాలనా కాలంలో వారి దర్బారులో జరిగిన ఘటనలని ఒక పద్ధతి ప్రకారం, తేదీల వారీగా నమోదు చేసే విధానం ఉండేది. వీటిని నమోదు చేయడమే కాకుండా, దఫ్తర్ ఇ దివానీ అనే అధికార యంత్రాంగం పరిశీలించి, రాజముద్రను కూడా వేసి భద్రపరిచేది. షాజహాన్ (1628-1658), ఔరంగజేబ్ (1658-1707)ల చరిత్రలను నిర్మించడంలో ఆ ఆధారాలు కీలక పాత్ర వహించాయి. షాజహాన్ కాలానికి చెందిన కొన్ని పత్రాలు హైదరాబాద్‌లో ఉన్న ఆంధప్రదేశ్ అభిలేఖాగారంలో ఉన్నాయి. ఆ పత్రాలు కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడిస్తు న్నాయి. వాటిలో నవంబర్ 17, 1637 (రజబ్ 9, 1047, ఏహెచ్) నాటి పత్రం ఒకటి. ఇది నాణేల నిపుణులకు ఎంతో ముఖ్యమైనది కూడా.
ఆ రోజు యువరాజు ఔరంగజేబ్ 20వ జన్మదినం. ఆ సమయంలో అతడి బరువెంతో కూడా దాని ద్వారా తెలుస్తుంది. అతడి బరువుకీ, చరిత్ర పరిణామాలకీ సంబంధం ఏమిటి అని ప్రశ్నించడం తొందరపాటు. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కూడా నెహ్రూ కాలచక్రాన్ని వెనక్కి తిప్పేందుకు యత్నించి, అందులో విఫలమై దానిని విరగకొట్టాడని ఔరంగజేబ్ గురించి రాశారు. భారతదేశ చరిత్రలో ఎంతో భారంగా కనిపించే ఇతడి శరీరం బరువు నాణేలతో తూకం వేసే సందర్భంలో తెలిసింది. ఎలాగంటే, అతడి 20వ జన్మదిన వేడుకలు దౌలతా బాద్‌లో నిర్వహించారు. ఆ రోజున యువరాజుని నాణేలతో తూకం వేశారు. రెండువేల వెండి రూపాయలు, 866 రాగి నాణేలు, తులం వంతున ఉన్న 20 బంగారు నాణేలు తూకానికి అవసరమై నాయి. అంటే అతడి బరువు రెండు మాన్‌ల, పదిహేడు సీర్లు. ఔరంగజేబ్ బరువు, పనిలో పనిగా నాటి నాణేల బరువు కూడా ఈ విధంగా నమోదయింది.
ఇప్పుడు ఈ నాణేలను ఆ లెక్కలో ఎందుకు ఉపయోగించవలసి వచ్చిందో చూడాలి. తులం ఉన్న 20 నాణేలు ఎందుకు ఉపయోగించారంటే, అతడి వయసు ఇరవై సంవత్సరాలు కావడం వల్లనే. అయితే ఈ బంగారు నాణేలు వ్యవస్థలో చెలామణిలో ఉన్నాయా లేదా, నిసార్ అనే సందర్భం కోసం, నజరానాలుగా ఇవ్వడానికి ముద్రించారా అన్న సంగతి ఆ పత్రంలో పేర్కొనలేదు. కొన్ని నాణేలను అలాంటి సందర్భాల కోసం ఆ సమయంలో ముద్రించేవారు. సాధారణ చెలామణి కోసం వెండి నాణేలు ఉండేవి. వాటి బరువు ఒక్కొక్కటి 11.4 గ్రాములు. అదే జహంగీరీ రూపాయి బరువు తీసుకుంటే దాని బరువు 13.7 గ్రాములు ఉండేది. సవాయి అని పిలిచే మరొక రూపాయి కూడా చెలామణిలో ఉండేది. దీని బరువు 14.4 గ్రాములు. మొగలులు 200, 5, 2 రూపాయల విలువతో వెండి నాణేలను ముద్రించారు. వీటి బరువులు వేరువేరుగా ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. ఒక డాము లేదా రెండు డాములు విలువతో రాగి నాణేలు ముద్రించారు. రెండు డాముల విలువైన నాణెం బరువు 41.4 గ్రాములు. ఒక డాము నాణెం బరువు 20.5 గ్రాములు. రాగి నాణేలలో కూడా వివిధ విలువలు కలిగినవి ఉండేవి. వాటి బరువులు కూడా వేరేవేరుగా ఉండేవి. తొలా అనే రాగి నాణెం బరువు 11.56 గ్రాములు.
కాబట్టి వెండి, రాగి నాణేల బరువు ప్రకారం ఔరంగజేబ్ బరువు ఇలా చెప్పుకోవచ్చు.
ఎ. జహంగీరి వెండి నాణేలు, రెండు డాములు = 2000×13.7+866×41.4+20×11.56 ఈ మొత్తం 65.56 కిలోలు.
బి. ఆర్థివ వ్యవస్థలో రోజువారి చెలామణిలో ఉన్న రూపాయి తీసుకుంటే దాని బరువు 11.4 గ్రాములు. డాము బరువు 20.5 గ్రాములు. దీనిని బట్టి యువరాజు బరువు 2000×11.4+20× 11.56= 60.96 కిలోలు.
సి. ఒక డాము నాణేలతో, నిత్య వ్యవహారంలో ఉన్న రూపాయితో తూచినట్టయితే ఔరంగజేబ్ బరువు 2000× 11.4+66×20+20.5× 11.56= 42.86 కిలోలు.
తూకం వేసిన నాణేన్ని బట్టి యువరాజు బరువు మారిపోవడం గమనించాలి. పురాతన, మధ్య యుగాల నాటి కొలతలు తూనికల గురించి దక్కనులో దొరికిన పలు శిలా ఫలకాలు సమాచారం ఇస్తున్నాయి. బాబర్‌నామా (బాబర్ జీవిత చరిత్ర) కూడా అలనాటి కొలతలు, తూనికల గురించి పేర్కొన్నది. పురాతన భారతంలో మౌలిక ద్రవ్యరాశి పేరు రాటి. బాబర్‌నామా మాషా, టంగ్, మిషాల్, తొల, సీర్ అనే తూనికల గురించి కూడా పేర్కొన్నది. కానీ ఒక రాటి బరువు ఎంత ఉండేదో బాబర్‌నామా వెల్లడించ లేదు. అయితే ఎడ్వర్డ్ థామస్ వంటి చరిత్రకారులు ఇతర తూనికలతో పోల్చి రాటి బరువు లెక్క కట్టారు. రాటి విలువను గ్రెయిన్స్‌లో లెక్కకట్టారు. ఇంతకీ ఒక గ్రెయిన్ బరువు ఎంత? దాని బరువు 0.065 గ్రాములతో సమానం. కాబట్టి కొలతలు, తూనికల ప్రమాణాలు చరిత్రలో ఒకే విధంగా లేవు. ఇదెందుకు జరిగిందో పరిశోధించవలసి ఉంది. బాబర్‌నామా రాసిన కాలం తరువాత నాటి మాన్‌కీ, ముందు నాటి మాన్‌కీ తేడా ఉంది. కాబట్టి ఔరంగజేబ్ బరువు కూడా మారుతుంది. రాటి బరువు ఇవ్వకపోవడానికి• కారణం- నగదులో అది ప్రాధమిక ద్రవ్యరాశి. అంటే విలువ చాలా తక్కువ. ఎడ్వర్డ్ థామస్ పురాతన భారతంలో కొలతలు తూనికల గురించి 1874లోనే మంచి పుస్తకం వెలువరించాడు. పాశ్చాత్య కొలమానంలో గ్రాములు, గ్రెయిన్‌ల మాదిరిగా రాటి మొగలుల కాలంలో అతి చిన్న ద్రవ్యరాశి. మరొక విషయం కూడా ఉంది. ముస్లిం పాలకులు చాంద్రమానం ఆధారంగా ఉండే హిజ్రి యుగాన్ని అనుసరించారు. హిందూ, క్రైస్తవ కాలమానానికి ఇది భిన్నంగా ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే ఔరంగజేబ్ నవంబర్ 17, 1617న కాకుండా, నవంబర్ 3, 1618న జన్మించాడు. ఇతడు మాల్వాలోని దోధ్ అనే చోట పుట్టాడు. అలాగే మిగిలిన మొగల్ పాలకుల జన్మ సంవత్సరం కూడా తేడాగా ఉంటుంది.
పాలకులకు ప్రత్యేక సందర్భాలలో ఖరీదైన కానుకలు సమర్పించుకుని, వారి కరుణకు పాత్రులు కావడమనే విధానం అప్పుడు కూడా ఘనంగానే సాగింది. గట్టిగా పరికిస్తే కింది స్థాయి ఉద్యోగులకు ఇదొక బరువైన బాధ్యతలా కనిపిస్తుంది. షాజహాన్ కాలం నాటి పత్రాలు మనసబ్‌దారులు యువరాజుకు, అంటే ఔరంగజేబుకు ఎలాంటి కానుకలు సమర్పించుకున్నారో కూడా తెలియచేసింది. నగదు దగ్గర నుంచి ఎనామిల్ పూతతో ఉన్న ఖరీదైన ఛురిక, దాని ఒర, బంగారం, వజ్రాలు తాపడం చేసిన బల్ల, ఏనుగు, గుర్రాలు కూడా ఆ బహుమానాలలో ఉన్నాయి. ముస్లిం పాలకుల కాలంలో ఉన్న కానుకల రివాజు అసఫ్‌జాహి చివరి పాలకుడు (నిజాం) మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ (1911-1948) హయాంలో కూడా నిరాటంకంగా కొనసాగింది. ఇతడి కాలంలో ఒక మనసబ్‌దారు కనీసం ఒక అష్రాఫిని సమర్పించు కుంటే తప్ప నవాబును గౌరవించినట్టు కాదు. ఇది కూడా ఆనాడు ఉన్న ఒక నాణెమే. ఇలా పాదుషా లేదా నవాబు లేదా యువరాజు వంటి వారికి ఆయా సందర్భాలలో సమర్పించుకోవడానికి ఈ తరహా నాణేలను ప్రత్యేకంగా ముద్రించేవారు. పుట్టిన రోజు పేరుతో పెద్ద ఎత్తున కానుకలు స్వీకరించిన ఆధునిక కాలపు పాలకులలో నిజాం ఒకరు. ఒకవేళ ఎవరైనా జాగీర్దార్ పుట్టిన రోజు వేడుకకు ఏదో కారణం చేత హాజరు కాలేకపోతే, ఆ సంగతిని పదే పదే అతడికి గుర్తు చేసే కార్యక్రమం కూడా ఉండేది. కొంచెం ఆలస్యమైనా ఫరవాలేదు, అతడు ఆ అష్రాఫిని సమర్పించుకునే వరకు నవాబు నిద్ర పోనిచ్చేవాడు కాదన్నమాట. నిజాం నవాబు కూడా, హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైన తరువాత కేంద్ర ప్రభుత్వానికి 33 వేల బంగారు నాణేలు ఇచ్చాడు. 1965లో ఇది జరిగింది. అంటే పాక్‌తో యుద్ధం తరువాత.పైసా విదల్చడని నిజాంకు పేరుంది. అయినా ఎందుకు ఇచ్చాడంటే, యుద్ధం చేసిన దేశానికి నీవేమి ఇచ్చావంటూ సామాన్య ప్రజలు నిలదీయడం మొదలుపెట్టారు. అందుకే యుద్ధ నిధికి ఇచ్చాడు.
ఔరంగజేబ్ 49 ఏళ్లు రాజ్యమేలాడు. అప్పటి జనాభా 150 మిలియన్లు. మొగల్ వంశంలో అతడు ఆరో పాలకుడు. రాజ్యాన్ని ఎంతో విస్తరించాడు. షాజహాన్ మూడో కుమారుడు. తండ్రిని కారాగారం పాల్జేశాడు. దారాషికో, షా షుజా ఇతడి అన్నలు. ఆ ఇద్దరిని కూడా చంపి అతడు రాజ్యానికి వచ్చాడు. ఇతడికి ఒక తమ్ముడు కూడా ఉండేవాడు. అతడి పేరు మురాద్. అధికారం చేజిక్కించుకునే క్రమంలో ఔరంగజేబ్ సాగించిన అరాచకానికి భయపడి ఇతడు బర్మా పారిపోయాడు. దారాషికో మిగ్లింగ్ ఆఫ్ ఓషన్స్ అనే పుస్తకం రాశాడు. షాజహాన్‌కు అభిమాన సంతానం. కానీ ఇతడు హిందూ ముస్లిం ఐక్యతను ఆకాంక్షించాడు. అతడి గ్రంథం సారాంశం కూడా అదే. మొగల్ చక్రవర్తులలో అత్యంత వివాదాస్పదుడైన ఔరంగజేబ్ సున్నీ ముస్లిం. 1679లో ముస్లిమేతరుల మీద జిజియాపన్ను విధించాడు. దర్బారులో హిందూ ఆచారం మేరకు నమస్కరించే సంప్రదాయాన్ని రద్దు చేశాడు. చక్రవర్తి అయినప్పటికి చాలా నిరాండ బరంగా జీవించేవాడని పేరు. ఇతడి సమాధి కూడా మిగిలిన మొగలు వంశీయుల సమాధుల మాదిరిగా ఖరీదైనది కాదు.
ఔరంగజేబ్ భారత్‌ను సుదీర్ఘకాలమే పాలించాడు. ఇతడు నాణేల మీద ఉండే కలీమాను నిషేధించాడు. కలీమా అంటే, ‘లా ఇలాహ ఇల్లలాహ్ మహమ్మదుర్ రసుల్ అల్లా’ అన్న ప్రార్థనా వాక్యం.అంటే అల్లా తప్ప వేరు దైవం లేదు. ఆయన దూత మహమ్మద్. సాక్షాత్తు ఖురాన్ నుంచి తీసుకున్న వాక్యమిది. ఇస్లాంలో ఎంతో కీలకమైన ఈ వాక్యాన్ని నాణేల మీద ముద్రించకుండా ఎందుకు నిషేధించాడు? మత విశ్వాసులు కాని హిందువులు ముట్టుకుంటే అది అపవిత్రం అవుతుందని గట్టిగా నమ్మాడు.
– డా।। దేమె రాజారెడ్డి, న్యూరో సర్జన్, అపోలో