జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి అధిక ఆశ్వయుజ బహుళ తదియ – 05 అక్టోబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


అమృతం తాగినందున దేవతలు నిత్య యవ్వనులు, అమరులు అయ్యారట. గానాముృతం తనివి తీరా తాగి, కోట్లాది జనులకు దాన్ని పంచిన యస్పీ బాలసుబ్రహ్మణ్యానికి దేవతల కన్నా ఎక్కువ ఫలితం దక్కడం న్యాయం! అందుకే గాయకుడుగా ఆయన అమరుడయ్యాడు. బాలు అనే ముద్దు పేరుతో నిత్య బాలుడు అయ్యాడు. అలా ఆయన అమరుడు, సదా పసివాడు. ఓ తెలుగు టీవీ చానల్‌ ‌నిర్వహించిన పాటల పోటీ కార్యక్రమాలను చూసే ప్రేక్షకులకు ఆయన పసితనం ఎరుకే. పాదాభివందనంతో పెద్దలను గౌరవించే ఈ లబ్ధ ప్రతిష్ఠుడు ఔత్సాహిక కళాకారులైన గాయనీ గాయకులను సరిదిద్దడానికి ఏమాత్రం సంకోచించకపోవడం ఆయనలోని పసితనాన్ని పట్టి చూపుతుంది. ఆయనకు అమరత్వం ఆషామాషీగా ప్రాప్తించ లేదు. మిట్టపల్లాలతో సుదీర్ఘ ప్రయాణమే సాగింది. తెలుగు వాడు హిందీలో ఏం పాడతాడు, జనం మెచ్చరు అని సందేహించిన వారు చూస్తుండగానే హిందీవారితో జేజేలు కొట్టించుకుని శభాష్‌ అనిపించుకున్నారు. శాస్త్రీయ సంగీతం రాకుండా శంకరాభరణం పాటలా అన్న వారితో ఔరా అనిపించుకున్నారు. మేఘగర్జన లాంటి గంభీర స్వరం కలిగిన యన్టీఆర్‌కు బాలు గొంతు చాలదని సందేహించిన వారు ‘పుణ్యభూమి నాదేశం నమో నమామి’ పాట విని బాలు ప్రతిభ అనితర సాధ్యం అన్నారు.

1946 జూన్‌ 4‌న బాలు జన్మించారు. శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ ఆయన తల్లిదండ్రులు. ఆయన జననం తమిళనాట జరిగినా బాల్యం, ప్రాధమిక విద్యనుండి కళాశాల విద్యవరకు తెలుగునాటనే జరిగాయి. సినీ గాయకుడిగా ఆయన 16 భాషల్లో 40 వేల పాటలు పాడారు. ఇతర గాయకులు తెలుగులో పాడినప్పుడు యాస వల్ల పర భాషీయులని తెలిసి పోవడం కద్దు. తెలుగు ఉచ్ఛారణ, పలుకుబడి ఇతరులకు కష్టం కానీ తెలుగు మాతృభాషగా కలిగిన వారు ఏభాషనైనా ఆ భాషీయులతో సరిసమానంగా ఏమాత్రం తేడా లేకుండా పలక గలరని మహానటి సావిత్రి చెప్పిన మాటను బాలు తన పాటలతో నిరూపించారు. అన్ని భాషల వారితో బాలు తమస్వంతవాడే అనిపించుకున్నారు. అందుకే బాలు పాటలు పలు భాషల్లో హిట్టయ్యాయి. అవార్డులు అందుకున్నాయి. కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అన్ని భాషల వారి అభిమాన గాయకుడైన ఈ తెలుగు మణిని భారత ప్రభుత్వం వారి అవార్డులైన పద్మశ్రీ 2001లో, పద్మభూషణ్‌ 2011‌లో వరించాయి. ఆయన గాయకుడే కాక, రచయిత, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత కూడా. 17, 18 ఏళ్ల లేత వయసులో ఆయన నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన ఓ పాటల పోటీలో పాల్గొన్నారు. పోటీలకు జడ్జిగా వచ్చిన గాయని జానకి బాలు పాట విని అతని గొంతులో ఓ ప్రత్యేకత ఉందని సినిమాలకు పాడమని ఇచ్చిన సలహా కొంత ప్రభావం చూపింది. తరువాత 1963లో మద్రాసులో జరిగిన మరో పాటల పోటీలో ఓ మిత్రుడి ప్రోద్బలంతో పాల్గొన్న బాలు సినీ సంగీత దర్శకుడు యస్పీ కోదండపాణి దృష్టిలో పడ్డారు. సినిమాలా, చదువా అని బాలు సందిగ్ధంలో పడ్డా కోదండ పాణి బాలుని వొదిలి పెట్టలేదు. బాలుతో 1965 డిసెంబరు,15న తొలి సినిమా పాట రికార్డింగు జరిపించారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో బాలుకు లభించిన ఈ తొలి పాట పి.సుశీల, పిబి శ్రీనివాస్‌, ఈలపాట రఘురామయ్య వంటి ప్రముఖ గాయకులతో కలిసి పాడే అవకాశం వచ్చింది. కాని విడుదలైన తొలి సినిమా మాత్రం 1967లో యంయస్‌ ‌రెడ్డి తెలుగులోకి డబ్‌ ‌చేసిన యంజిఆర్‌ ‌నటిచిన కాల చక్రం అనే తమిళ చిత్రం. ఆ సినిమాలో అన్ని పాటలనూ బాలూయే పాడారు. బాలు రంగప్రవేశం చేసే నాటికి ఘంటసాల, పిబి శ్రీనివాస్‌, ‌మాధవపెద్ది, పిఠాపురం వంటి హేమా హేమీ గాయకులు సినీరంగంలో పాతుకుపోయున్నారు. ఇద్దరు ఘనాపాటీల పోటీని తట్టుకుని బాలు రాణిచడం వెనుక కఠోర దీక్ష, క్రమశిక్షణ, అంకిత భావం ఉన్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని జారవిడచుకోకుండా ఎంతటి కష్టానికైనా ఓర్చి రోజుకు పది, పాతిక పాటలను కూడా పాడారు. కన్నె వయసు చిత్రంలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాటతో తెలుగు సినీ పాటల వనాన్ని అలరించే క్రొత్త కోయిలగా ప్రశంసలు అందుకున్న బాలు గళం చెల్లెలి కాపురం చిత్రంలో చరణ కికిణిలు ఘల్లు ఘల్లు మన అనే పాటతో తెలుగు చిత్రసీమలో జేగంటలా మ్రోగింది.

సాధారణ డిగ్రీ చదువులకోసం నెల్లూరు విఆర్‌ ‌కళాశాలలో చేరిన మణి అటునుండి ఇజనీరింగ్‌ ‌చదువులకోసం వెళ్లి, బాలుపేర సినీ నేపథ్య గాయకుడుగా ప్రత్యక్షం కావడం నాటి సహాధ్యాయులకు మధురానుభవమైంది. పుట్టుకతో అబ్బిన గానకళ మీది మక్కువతో కష్ట నష్టాలకోర్చి సంగీత సాధన చేశారు. అద్వైత సిద్ధికి, అమరత్వం లబ్దికి సోపానమైన గాన కళను ఆరాధించి, అభ్యసించి, తన గానంతో ఆబాల గోపాలాన్ని అలరించడం ద్వారా ఆయనకు అమరత్వం లభించింది. తెలుగు భాష, పాట బ్రతికి ఉన్నంత కాలం బాలు బ్రతికే ఉంటారు. గానకళతో సంగీత సరస్వతిని ఉపాసించిన బాలసుబ్రహ్మణ్యం అనే బాలుకు అద్వైతం సిద్ధించి పరమాత్మ సాక్షాత్కారంతో జన్మ రాహిత్యం ప్రాప్తించాలని కోరుకుందా!

About Author

By editor

Twitter
YOUTUBE